( పాతికేళ్ళు నిండకుండానే విప్లవ కవి కా. ఎంఎస్ ఆర్ బూటకపు ఎన్ కౌంటర్లో సెప్టెంబర్ 3, 1992న అమరుడయ్యాడు. ఆయన రచనలు “కాగడాగా వెలిగిన క్షణం” పేరుతో నవంబర్ 1992 లో అచ్చయ్యాయి. ఇందులో ఆయన డైరీ కూడా భాగమైంది. చేగువేరా , భగత్ సింగ్ డైరీలతో పోల్చదగినది ఇది. చిన్నవయసులోనే ఎంఎస్ ఆర్ తన భావనాశక్తితో విప్లవ కవిత్వాన్ని అజరామరం చేశాడు. ఇప్పడు మీరు చదువబోయేది ఆయన పుస్తకానికి ముందు *క్షమాపణ కోరుతూ…* అని అచ్చయిన ఆయన డైరీ రచన. ఆయన వర్ధంతి సందర్భంగా పునర్ముద్రణ… వసంతమేఘం టీం)
క్షమాపణ కోరుతూ…
సూర్యునితోపాటు మేల్కొన్నాను. నా పాదం మట్టిని స్పృశించిందో లేదో ఆరు ద్ర పురుగులు పాత సాహితీమిత్రుల్లా నన్ను చుట్టుముట్టాయి. మేం మార్క్‌ట్వేయిన్లమయి కబుర్లాడుకున్నాం. వీడ్కోలు పలికేందుకు వాటిని దోసిళ్ళలోకి తీసుకునా ను. నా స్పర్శ వాటికి గరుగ్గా ఉంటుందేమోనని సంకోచిస్తూనే ముద్దాడాను. వాటి మృదుత్వం నాకు ఎప్పటికి అలవడుతుందో! డెన్ కొచ్చాను. ట్రిగ్గర్ ఎక్స్‌సర్‌సెజే ఎక్కువ చేసాను.
అభిరుచులూ ఇష్టాలూ సైతం ప్రజలు ఎంతగా మార్చేస్తారో! పూర్వపు బతుకులో అస్సలు ఇష్టం ఉండని ముదురురంగు కాటన్ షర్టు కార్మికుడు ఇచ్చాడు కాబట్టి తొడిగి తొడిగి మాపుతున్నాను. ఆంధ్రజ్యోతి విషపుత్రిక చూసాను. మళ్లీ ఎన్‌కౌంటర్! శత్రువు క్షణక్షణం వేటాడుతుంటే ఈ ప్రాణాలుప్రజలకెంత అవసరమో తెల్సివస్తోంది. ఇప్పుడు ఇక ప్రతిక్షణాన్ని చరిత్రలో భాగంచెయ్యాలన్న తపనే! సాహితీవేదికలో చలసాని ప్రసాద్‌గారి దళితవ్యాసం ఉంది. చరిత్రబడిలో విరసం ఎప్పుడూ వినయంగల విద్యార్థేనని ఛప్పన్
రుజువుల్లో మరొకటి.
ఈ పగలు ఫీల్డ్ పనులు పెట్టుకోలేదు. జనం హృదయస్పందన్ని కరపత్రం చేసేందుకు గంటలు గంటలు తన్నుకులాడాను. వంట మొదలెట్టాను. రేడియోలో *అన్నమాచార్య* బయట నేనూ హవహవా పాట పాడాం. ఒక సంఘటన న్మృతిపథంలో మెదిలింది. ఒక ఆఫీస్ బేరర్స్ సమావేశంలో మతం గురించి సుద్దీర్హంగా చర్చించాం. చివరకు దేవుడు పుట్టునే లేదనీ దోపిడీ మాత్రం పుట్టిందని తీర్మానం చేసాం. అప్పుడూ అంతే! రేడియోలో అన్నమాచార్య మొదలయితే, ఈ సంగీత ప్రేమికుడు లోలోన మెల్లిగ రాగం అందుకున్నందుకు ఒక అక్క
*ఏమన్నా ఇంతసేపు దేవుడులేడని చెప్పి, భక్తి పాట పాడబడ్తివి* అంది. బీటలు బారుతున్న వంటింటి గోడలు చూసి మార్క్సిజానికి జేజేలు పలికారు.
ఆకాశంలో తారలు ఆహ్వానించిన తరువాత పైకిల్ తీసాను. ప్రేమగా ఒళ్ళంతా స్నానం చేయించాను దానికి. ఏ పోలీసోడి వశమయితదో నేను ఎన్‌కౌంటర్ అయితే! దేనికీ గర్వించని నేను సెకిల్ మీద చమట చమట అవుతున్న శరీరాన్ని చూసి “అబ్బ, ఇదిరా దళిత విద్యార్థి శరీరం” అని మురిసిపోయాను. కార్మికుడు కలిసాడు. పెట్టుబడి గుండెల్లో డిటోనేటర్ ఎలా పెట్టాలో చర్చిస్తూనే ఉన్నాం. చాలా పొద్దుపోయిన తరువాత ఇల్లు చేరుకున్నాం. అందరికి పెట్టి మిగిలింది అక్క పళ్ళెంలో పెట్టుకుంటోంది. చాలాసార్లు అప్పుడే
పోయాను. లోలోన బాధతో బయటికి నవు తూ, “మల్ల నోటికాడి ముద్ద ఎగురగొట్టిన కదక్క” అన్నాను. *నువ్వు వేరెటోనివా అన్న* అని కళ్ళలో నీళ్ళు తీసింది. “రాగో” సీరియల్ సహాయంతో మరిపించాను. ఒకరి అన్నం ముగ్గురం పెట్టుకొని మొదటి ముద్ద కళ్ళకద్దుకుని ఐ.యం.యఫ్‌ని మనసార శపిస్తూ ముగించాం. చిన్నగాడు పన్నడు. కొద్దిసేపు బాల్ ఆటనన్న ఆడెటోళ్ళం.
నేలమీద చిరిగిన దుప్పట్లు సర్టి అలవాటు ప్రకారం అకౌంట్స్ రాద్దామని పాకెట్‌బుక్ తీసి తేది రాసాను. జూన్ ఇ..ర.వె. రె..0..డు అరే! ఈ రోజే నేను పుట్టానని అమ్మానాన్నా చెప్పారు. అమ్మగుండె ఈ రోజంతా కన్నీళ్ళతో కాగి కాగి ఉంటుంది. ఈ ప్రపచంలో నిజంగా *నేను లేని*తనాన్ని ప్రతి సెకెండు బాధామయంగా అనుభవిస్తున్నది అమ్మ ఒక్కర్తీ. పూర్వం అమ్మ నా కోసం ముక్కోటి దేవతలకు మొక్కేది. ఇప్పుడు నాకోసం చర్చీలు, మసీదులు కూడా తిరుగుతోంది. అమ్మ కోసమూ నేను ఇక్కడ ఉన్నానుకుంటా. సమూహంలో
ప్రతి ఒక్కరిలోనూ అమ్మను చూస్తు తృప్తిపడుతున్నాను. అమ్మమాత్రం ఏ సిద్దాంతాలూ విప్లవాలూ స్నేహాలూ బంధువులూ లేని ఏకాంతంలో నాకోసం నిరీక్షిస్తూ… రేపు నేను అమ్మను చేరుకోలేక పోయినా దేశమయితే అక్కున చేర్చుకొని ఓదారుస్తుంది.
నాన్న ఈ రోజు కనిపించిన ప్రతి ఒక్కరితో “మాపెద్దోడికి ఈ రోజుతో ఇరవై మూడు ఏళ్ళు వచ్చాయి. ఈ సంవత్సరంతో వాడి ఇంజనీరింగ్ పూర్తయ్యేది” అని భోరున విలపించి ఉంటాడు. నాన్నకు తెలియదు కదా! నేను ఎలక్ట్రానిక్ డివైసెస్ పరీక్షలోనూ ఇథియోపియా కరువు మీద కవితరాసి వచ్చిన ప్రబుద్ధున్నని. నిజంగానే నేను నేర్చుకున్న ప్రతి అక్షరానికి ఒక చెమటచుక్క వెచ్చించాడు. *వరంగల్* నాన్న అరుణపతాకం నుండి రాలుతున్న నెత్తుటి చుక్కల్ని కొద్దిగా దీక్షతో చూస్తే ఎంత బావుణ్ను!
ఈ రోజంతా తమ్ముడు సోక్రటీస్‌లా శూన్యంలోకి చూస్తూ గడిపి ఉంటాడు. ప్రపంచంతో స్నేహం చెయ్యగలడు.
అక్కను బావ మంచిగ చూస్తున్నాడో లేదో! అక్కకు స్నేహితుడే అయినా భర్త పోస్టులో ఉన్నవారిని ఎవ్వరినైనా నా మనసు పూర్తిగా నమ్మదు. ఇంటి నుండి వచ్చినప్పటి సంవత్సరం బర్త్‌డే అప్పుడు అక్క “విముక్తి నవల ఇచ్చి ఏప్రిల్ 22 లెనిన్ పుట్టినరోజు మరి జూన్ -22 అని రాసింది. ప్రజాయుద్ధంలో పర్ఫెక్షన్ పొందుతున్న లెనినిస్టు శైలిని అధ్యయనం చేస్తుందో. కలిసే పరిస్థితి
ఉంటే వెయ్యి కవితల పుస్తకాలు కొనిపించుకునేవాడ్ని . సుప్రభాతమోడు రెచ్చగొట్టిం తరువాత నిద్రనైనా మానుకొని రెగ్యులర్‌గా రాస్తున్నాను మరి!
ఎంత డొక్కు సినిమానయినా నాకోసం ఓపిగ్గాచూసే చెల్లై ఈ రోజు ఏ *నాగబాల* చూపించమని డిమాండ్ చేసేదేమో. ప్చ్! తనకి కాలేజి ఎన్ని రకాలుగా ఎగ్గొట్టొచ్చో క్లాసులు చెప్పకుండానే వచ్చేసా. పెద్దమ్మ ఆరోగ్యం ఎట్టుందో! బాగా కావల్సిన వాళ్ళకు వయసు మీద పడకుండా ఉంటే ఎంత బాగుంటుందో…
……………………….
…………………………
నూతన పారిశ్రామిక విధానం క్రషర్‌లో నజ్జునజ్జు అవుతున్న ఆ కార్మికు నన్ను కుదిపి *మా కంపెనీ సంగతి ఎట్లన్న*’ అన్నాడు. వినమ్రతతో, బాధ్యతగా మేల్కొన్నాను, క్షమాపణలు కోరుతూ…..
శ్రీను
జూన్ 22 1992