‘మన ప్రజాస్వామ్యం మేడిపండు… మన దరిద్రం రాచపుండు’ అన్నాడోక కవి. ఆయన మాటలు అక్షర సత్యాలు. ఎందువల్లనంటే ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం తరువాత కూడ భారతదేశంలో పేదరిక నిర్మూలన సాధ్యం కాలేదు. ప్రభుత్వాలు ఎన్ని మారినా శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడి అభివృద్ధిలో పరుగులు పెడుతున్నా  సామాన్యుల బతుకులు మారడం లేదు. దేశాన్ని దశాబ్దాలు పరిపాలించిన పార్టీలు దేశ సంపదను దోచుకుని విదేశాలకు తరలించడం, స్విస్‌ బ్యాంకుల్లో వేల కోట్ల నల్లధనాన్ని దాచిన జాతీయ నాయకులు మళ్లీ ప్రజలలోకి వచ్చి దేశానికి సేవ చేశామని ప్రగల్భాలు పలుకుతున్నారు. గత పాలకుల శాపమే నేటికీ పేదరికం వేధిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. నిజానికి కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో అసమానతలు పెరిగిపోతోన్నాయి.

ప్రపంచీకరణ సామ్రాజ్యవాద ఆర్థిక విధానాలకు తోడు కరోనా వల్ల ఏర్పడి విపత్కర పరిస్థితుల వల్ల మన దేశంలో 16 నుంచి 20 శాతం వరకు పేదరికం పెరుగుతుందని ఒక అంచనా. అంటే దేశంలో సగానికి సగం ప్రజలు పేదరికంలో కూరుకుపోతున్నదన్నమాట. ఇదిలా ఉంటే దేశంలో కోటీశ్వరుల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. మన దేశంలో నాలుగు లక్షల మంది పైబడి కోటీశ్వరులు ఉన్నారంటే నమ్మక తప్పదు. వీరి ఒక్కొక్కరి ఆదాయం సగటున ఏడు కోట్లు. వెయ్యి కోట్లకు పైగా ఆదాయం ఉన్నవారు మనదేశంలో సుమారు 3000 మంది ఉన్నారు. ఇక ఎగువ మధ్య తరగతి వాళ్ల విషయానికొస్తే వీరి ఆదాయం సంవత్సరానికి 20 లక్షల పైమాటే. రోజురోజుకూ ధనవంతులైన వారు మరింత ధనవంతులుగా, పేదరికంలో మగ్గుతున్న వారు మరింత పేదలుగా దిగజారిపోతున్నారు. దేశంలోని 77 శాతం సంపద కేవలం 10 శాతం జనాభా చేతుల్లోనే ఉంది. పేదరిక నిర్మూలకై ఏ విధంగా ముందుకు పోవాలని కేంద్రానికి ఇప్పటికీ ఒక స్పష్టత లేదు.

బహుమితీయ పేదరిక సూచిక (ఎండిపిఐ) ను యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రామ్‌ (యుఎన్‌డిపి) సెప్టెంబర్‌ 28న విడుదల చేసింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డిపి) మరియు ఆక్స్‌ఫర్డ్‌ పావర్టీ & హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇనిషియేటివ్‌ (ఓపిహెచ్‌ఐ) ద్వారా గ్లోబల్‌ మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ సూచీ 2022 విడుదల చేయబడింది. ఇందులో 109 దేశాలు, 590 కోట్ల ప్రజల డేటాను పరిగణనలోకి తీసుకుంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూఎన్‌డిపి 1990 నుంచి ఏటా ప్రపంచ దేశాల ప్రగతి కొలమానంగా మానవ అభివృద్ధి సూచీని ఉపయోగిస్తుంది. మానవ అభివృద్ధి సూచిక రూపకల్పనలో స్థూలంగా జీవన ప్రమాణాలు, ఆరోగ్యం, విద్య అనబడే అంశాలున్నాయి. ఇందులో ప్రధానంగా పోషకాహారం, నవజాత శిశు మరణాల రేటు, మాతా శిశు రక్షణ, పాఠశాల విద్యా సంవత్సరాలు, పాఠశాల హాజరు , వంట ఇంధనం, పారిశుధ్యం, తాగునీరు, గృహ విద్యుత్తు వసతి, ఆస్తులు, బ్యాంక్‌ ఖాతాలు అనబడే 12 సూచికల డేటా ఆధారంగా మానవాభివృద్ధి నివేదికను రూపొందిస్తారు. ఈ ర్యాంక్‌ ఆధారంగా వివిధ దేశాలు నేషనల్‌ మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌ను ప్రకటిస్తాయి. 109 దేశాల్లో భారత్‌ ర్యాంక్‌ 66గా ఉంది. భారత్‌కు సంబంధించి ఆక్స్‌ఫామ్‌, హురూన్‌ ప్రపంచ అసమానతల నివేదికలు-2021 చేదు నిజాల్ని వెల్లడించాయి. అది పాలకులు కళ్లు తెరువాల్సిన అగత్వాన్ని గణాంకాలతో చాటి చెప్పాయి.

తాజాగా భారతదేశంలో ‘ఆక్స్‌ఫర్డ్‌ పావర్టీ అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇనిష్యేటివ్‌’తో పాటు యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌’ రూపొందించిన మార్గనిర్దేశకాల ప్రకారం నీతి ఆయోగ్‌ ‘నేషనల్‌ మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌ను నవంబర్‌ 30న  విడుదల చేసింది. ఈ బహుమితీయ పేదరిక సూచిక దేశంలోని పేదరికం యొక్క మొత్తం చిత్రాన్ని ప్రదర్శిస్తుంది.  2015-2016 సంవత్సరాల మధ్య నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 నివేదికను ఆధారం చేసుకొని 12 కేంద్ర మంత్రిత్వ శాఖలతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ సూచీని తయారు చేసినట్టు నీతి ఆయోగ్‌ తెలియజేసింది. అంతేకాదు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ దారిద్య్రం, మానవాభివృద్ధి కొలతలు, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ప్రమాణాల ఆధారంగా ఈ సూచీని అత్యంత పకడ్బందీగా రూపొందించినట్టు కూడా అది చెప్పుకున్నది.

 విస్తృతమవుతున్న పేదరికం  :

బ్రిటిష్‌ వలస పాలనలో మహారాజుల, ముష్టివాళ్ల గడ్డగా ప్రపంచం పిలుచుకొన్న భారత్‌, 75 ఏళ్ల స్వపాలనలో ఒకవైపు అతి సంపన్నులు, మరోవైపు అతిపేదలున్న దేశంగానే మిగిలిందని వరల్డ్‌ ఇన్‌ఇక్వాలిటీ ల్యాబ్‌ నివేదిక కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పింది. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించంలోనే కాదు, స్వాతంత్య్రానికి ముందు నుంచి ఉన్న అసమాతలను తొలగించడంలోనూ పాలకులు విఫలమయ్యారని పేర్కొనడం విషాదం. అసమానతలను కొలవడానికి అంతటా అంగీకరించే ‘గిని కో-ఎఫిషియంట్‌’ లెక్క సైతం మనదేశంలో 2000లో 74.7 ఉండేది. ఇరవై ఏళ్ళలో అది 82.3కి పెరగడం గమనార్హం. ఒక్క ముక్కలో, మునుపెన్నడూ లేని ప్రమాదకర స్థాయిలో దేశంలో ఇప్పుడు పేద, గొప్ప తేడాలున్నాయి. డబ్బున్నవాళ్ల మరింత ధనవంతులుగా మారుతున్నారు. గరీబ్‌ ఆద్మీ మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నారు. భారత్‌లో ఆదాయ అసమానతలు పెరిగిపోతున్నాయి. అందువల్లనే ‘అత్యంత సంపన్నులతో కూడిన పేద దేశం భారత్‌’ అని పేర్కొంది. 2021 జాతీయ ఆదాయంలో ఐదో వంతు కేవలం ఒక్క శాతం మంది దగ్గరే ఉండటాన్ని చూస్తే ఈ అసమానతలు ఏ స్థాయిలోకి వెళ్లాయో అర్థం చేసుకోవచ్చు. 

వరల్డ్‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌ నివేదిక ప్రకారం అత్యధికంగా బీహార్‌లోనే 51.91 శాతం పేద ప్రజలు ఉన్నారు. దీని తర్వాత 42.16 శాతం జార్ఖండ్‌, 32.67 శాతం ఉత్తరప్రదేశ్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో 36.65 శాతం, మేఘాలయ 32.67 శాతం పేదలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 13.74 శాతం పేదలున్నారు. ఈ జాబితాలో తెలంగాణ 18వ స్థానంలో నిలిచింది. ఏపీ 20వ స్థానంతో కొంత మెరుగ్గా ఉంది. ఏపీలో పేదలు 12.31 శాతం ఉన్నారు. పోషకాహారంతో బాధపడుతున్న వారు తెలంగాణలో 31.10 శాతం ఉండగా, ఏపీలో 26.38 శాతం ఉన్నారు. శిశువులు యవ్వనథలో మరణాలు ఏపీలో 1.82 శాతం కాగా, తెలంగాణలో 1.38 శాతం సంభవిస్తున్నాయి. అత్యంత పేదరికం తక్కువ ఉన్న రాష్ట్రం కేరళ. అక్కడి జనాభాలో 0.71 శాతం మాత్రమే పేదరికంలో ఉన్నారు. తర్వాత సిక్కిం 3.62 శాతం, తమిళనాడు 4.83 శాతం, పంజాబ్‌ 5.59 శాతంతో ఉత్తమంగా నిలిచాయి. కేంద్ర పాలిత ప్రాంతాలలో అత్యధిక పేదరికం ఉన్న ప్రాంతం దాద్రా నగర్‌ హవేలీ 27.36 శాతం కాగా, అతి తక్కువ పేదరికం ఉన్న ప్రాంతం పుదుచ్చేరి 1.72 శాతం. ఢిల్లీలో 4.79 శాతం పేదలున్నారు. బీహార్‌ తర్వాత జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు అత్యధిక పోషకాహార లోపంతో బాధపడుతున్నాయి.

పెరుగుతున్న వివక్ష – అసమానతలు :

ఏడాదిన్నర కాలంగా కరోనా ప్రభావం దేశంలో అసమానతలు పెంచిందని వ్యూ రీసర్చ్‌ సెంటర్‌ (మార్చి 2021) కూడా తెలిపింది. అదనంగా మరో 7.5 కోట్ల మంది పేదరికంలో కూరుకుపోయారని, మధ్య తరగతి ప్రజల్లో 3.2 కోట్ల మంది ఉన్నారని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 130 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారు. అందులో 22.7 కోట్ల మంది భారతీయులే ఉన్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ జాతీయ సంపదను కొంతమందికి పరిమితం చేస్తుంది. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో కూడా పేదరికాన్ని నిర్మూలించలేకపోతుంది. దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉందో మనం లాక్‌డౌన్‌ సమయంలో చూశాం. ఉపాధి కోసం వివిధ రాష్ట్రాలకు, గల్ఫ్‌ దేశాలకు వలసపోయిన వారు కరోనా సమయంలో పడిన ఇబ్బందులు చూశాం. పేదల్లో అత్యధికుల ఎస్సీ, ఎస్టీ, ఓబిసి సామాజిక  వర్గాలకు చెందిన వారే ఉన్నారని భారతదేశంలో వీరంతా కనీస అవసరాలు తీర్చుకోవడానికి జీవన పోరాటం చేస్తున్నారని నివేదిక తెలిపింది.

వరల్డ్‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌ ‘ప్రపంచ అసమానత నివేదిక-2021’లో వెల్లడించిన వివరాల ప్రకారం ఆదాయం, లింగ, సామాజిక అసమానతలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉన్నదని, పేదరికం పెరుగడంతో పాటు ఉన్నతవర్గాలు మరింత సంపదను అర్జిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ప్రపంచ అసమానతల సమాచార నిధి లెక్కల ప్రకారం 1951 నాటికి మన దేశం జాతీయ ఆదాయంలో అగ్రశ్రేణి 1 శాతం మంది వాటా, దిగువ శ్రేణి 40 శాతం మంది వాటాతో సమానం. అదే ఇవాళ చూస్తే దిగువన ఏకంగా 67 శాతం మంది వాటా అంతా కలిస్తే కానీ, అగ్రశ్రేణి 1 శాతం మంది వాటాకు సరిపోదు. పోనీ, 1961 నుంచి అందుబాటులో ఉన్న జాతీయ సంపద లెక్కల్ని బట్టి చూసినా, ఎంతో అసమానత స్పష్టమవుతుంది. అప్పట్లో దేశ జాతీయ సంపదలో 1 శాతం సంపన్నులదీ, 50 శాతం నిరుపేదలదీ సమాన వాటా, అరవై ఏళ్ళ దేశపురోగతి తర్వాత ఇప్పుడు దిగువన ఉన్న 90 శాతం మంది భాగం కలిస్తే కానీ, పైనున్న ఒక్క శాతం సంపన్నుల వాటాకు సరితూగడం లేదు. స్వతంత్ర భారతంలో ఆర్థిక అసమానతకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి?

వరల్డ్‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆర్థిక అసమానతలు  అత్యంత ఎక్కువగా ఉండే దేశాల జాబితాలో భారతదేశం ఒకటని స్పష్టం చేసింది. గత మూడున్నర దశాబ్దాలుగా దేశ ఆర్థిక పరిస్థితిని చూస్తే, ఉన్నత వర్గం, పేద వర్గం మాత్రమే కనిపిస్తున్నాయి. సంస్కరణల పుణ్యమాని ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలు అధోగతి పాలై పేదరికంతో పాతాళం దిశగా జారిపోయాయి. ఫ్రెంచ్‌ ఆర్థికవేత్త థామస్‌ పికెట్టీతో పాటు పలువురు సమన్వయం చేయగా, ‘వరల్డ్‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌’ కో-డైరెక్టర్‌ లూకాస్‌ ఛాన్సెల్‌ ఈ ‘ప్రపంచ అసమానతల నివేదిక’కు అక్షరరూపం ఇచ్చారు. 2021కి గాను నవీకరించిన డేటా ప్రకారం ప్రపంచంలో 76 శాతం సంపద, సంపన్నులైన 10 శాతం మంది చేతిలోనే ఉంది. ప్రపంచ ధోరణికి తగ్గట్టె మన దేశమూ ఉంది. మన జాతీయ ఆదాయంలో 57 శాతం అగ్రశ్రేణిలో ఉన్న 10 శాతం మంది అతి సంపన్నులదే. అందులోనూ అందరి కన్నా పైయెత్తున ఉన్న ఒకే ఒక్క శాతం మందికి 22 శాతం ఆదాయం సొంతం. సంపద నిచ్చెనలో దిగువన ఉన్న 50 శాతం మంది వాటా కేవలం 13 శాతమే. ఇంకా చెప్పాలంటే, పైనెక్కడో ఉన్న 10 శాతం మందికీ, దిగువనెక్కడో ఉన్న 50 శాతం మందికి మధ్య మన దేశంలో ఆదాయ వ్యత్యాసం 1 :22 ఉందని లెక్క . భారతదేశంలోని వయోజనుల సగటు జాతీయ ఆదాయం రూ.2,04,200గా ఉందని, అయితే వీరిలో కింద ఉన్న 50 శాతం మంది సగటు ఆదాయం రూ.53.610 మాత్రమేనని అధ్యయనం వెల్లడించింది. ఇది చాలా దిగ్భ్రాంతి గొలిపే విషయం.

సమాచార నిధిలో లెక్కల ప్రకారం ఇతర దేశాలతో పోలిస్తే, మనమింకా ఎక్కడున్నామో తెలుస్తోంది. 1930ల నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసిన తర్వాత అమెరికన్‌ నిరుపేదలు ఎక్కడున్నారో, 90 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అక్కడే మనం ఉన్నామన్న మాట. నెహ్రూవాద సామ్యవాదం మొదలు ఇందిరా గాంధీ మార్కెట్‌ సంస్కరణల ‘ప్రగతి పథం’, రాజీవ్‌ గాంధీ ప్రైవేటీకరణ జోరు, పివి నరసింహారావు మన్మోహన్‌ల ప్రపంచీకరణ ఆర్థిక సంస్కరణల మీదుగా చాలా దూరం వచ్చాం. కానీ, దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో గణనీయ వృద్ధి వచ్చినా, దిగువనున్న 50 శాతం బీదవర్గాల భారతీయులకు ఒరిగిందేమీ లేదు. భారత ప్రస్థానంలో అత్యంత కీలకమైన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాల వల్ల అగ్రశ్రేణిలోని 10 శాతం సంపన్నులే అనూహ్య లబ్ధి పొందారు. మిగిలిన 90 శాతానికి దక్కింది శూన్యం. దేశంలో అసమానతలు, అంతరాలు ఇంతగా పెరగడానికి అదే మూలకారణమని నిపుణుల విశ్లేషణ. ఇప్పుడు కరోనాతో అసమానతలు మరింత పెరిగాయి. అసమానత ఒక ముప్పు అయితే, అభివృద్ధి రేటు కుంటుబడడం మరిన్ని కష్టాలు తెచ్చింది. మధ్యతరగతిలో 3.2 కోట్ల మంది కొత్తగా దారిద్య్రంలోకి జారిపోయినట్టు ‘వ్యూ రిసెర్చ్‌’ మాట. కానీ, కోటీశ్వరుల సంపద మాత్రం నిరుడు లాక్‌డౌన్‌లో 35 శాతం పెరిగిందట.

జెండర్‌ వివక్ష :

ప్రపంచవ్యాప్తంగా గడిచిన 30 ఏండ్లలో  వచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల ఆదాయం, సంపద విషయంలో అసమానతలు మరింత పెరిగాయని నివేదిక తెలిపింది. అందులో భాగంగానే  ఆర్థిక సంస్కరణలు భారత్‌లో అసమానతల్ని పెంచాయని నివేదిక పేర్కొన్నది. అలాగే దేశంలో లింగ అసమానతలు కూడా అధికంగా పెరిగాయని వెల్లడించింది. ఆసియాలో (చైనా మినహా) మహిళా కార్మికుల ఆదాయం వాటా 21 శాతం ఉండగా, భారత్‌లో ఇది 18 శాతమేనని తెలిపింది. ప్రపంచంలో మహిళల కూలీల వాట అతితక్కువ భారత్‌లోనే ఉందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా పైన ఉన్న ఒక శాతం మంది భారీగా లబ్ది పొందినట్టు వెల్లడించింది. అదే స్థాయిలో పేదరికం కూడా పెరిగినట్టు తెలిపింది.

ముగింపు :

భారత్‌, చైనా వంటి దేశాల్లో ప్రైవేటు రంగం దినదినాభివృద్ధి చెందుతూ, సంపదను ఆర్జిస్తుండగా.. ప్రభుత్వరంగం క్రమంగా పడకేస్తున్నట్టు వివరించింది. 1980లో భారత్‌లో ప్రైవేటురంగం దగ్గర 29 శాతం సంపద ఉంటే, 2020 నాటికి అది 56 శాతానికి పెరిగినట్టు తెలిపింది. ఆర్థిక అసమానతలు పెరిగిన దేశాల్లో భారత్‌తో పాటు అమెరికా, రష్యాలు కూడా ఉన్నాయి. యూరోపియన్‌ దేశాలతో పాటు, చైనాలో కూడా అసమానతలు పెరిగినప్పటికీ ఆ తేడా స్వల్ప స్థాయిలోనే ఉందని వరల్డ్‌ ఇన్వీక్వాలిటీ ల్యాబ్‌ వెల్లడించింది. దీనిని బట్టి చూస్తే భారత్‌లో ఉన్న వాడికే సంపద, ఉన్నవాడికే ఆదాయం ఉన్నవాడికే వసతులు, సదుపాయాలు లేని వారు ఎపుడూ  లేకుండానే పోతున్నాడు. గత మూడు దశాబ్దాలుగా దేశ ఆర్థిక పరిస్థితిని చూసుకున్నప్పుడు మధ్యతరగతి వర్గాలు అన్నవి మెల్లగా పేదరికంలోకి జారిపోతున్నాయి. ఒకప్పుడు దేశ ఆర్థిక ముఖ చిత్రంలో ఉన్నత వర్గం, ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి, పేదలు, నిరుపేదలు ఉన్న వర్గాలు ఉండేవి. కానీ ఇప్పుడు రెండే వర్గాలుగా ఆర్థిక చిత్రపటం కనిపిస్తోంది. ఉన్నత వర్గం, పేద వర్గం. ఈ పేదలలో కటిక పేదలు అనే వర్గం అలాగే ఉండడం విశేషం.

‘అత్యంత సంపన్నులతో కూడిన పేద దేశం భారత్‌’ అని ‘వరల్డ్‌ ఇనీక్వాలిటీ రిపోర్ట్‌ 2021’లో స్పష్టం చేసింది. దేశంలో అసమానతలు అంచనాలకు మించి పెరిగిపోయాయని, అయితే వాస్తవ గణాంకాలను దాచేస్తూ గత మూడేండ్లుగా మోడీ సర్కారు తప్పుడు లెక్కలను చూపిస్తున్నట్టు నివేదిక కుండబద్దలు కొట్టింది. ఈ కారణంగానే వివిధ వర్గాల సమాచారంతో పై గణాంకాలను వెల్లడించామని, నిజానికి దేశంలో ప్రస్తుత పరిస్థితులు మరింత అధ్వానంగా ఉండొచ్చని అభిప్రాయపడింది. మన పాలకులు అనుసరిస్తున్న కార్పొరేట్‌ అనుకూల విధానాల వల్ల పెరుగుతున్న అసమానతలు సమాజాన్ని మరింత ఆగాధంలోకి నెట్టబోతున్నాయి. ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం సమానంగా జరిగితేనే అసమానతలు తగ్గుముఖం పడతాయని గమనించాలి. పేదరిక నిర్మూలన, ఆకలి చావుల్ని అదుపు చేయడం, విద్య/వైద్య/సామాజిక భద్రతలు కల్పించడంతో అసమానతలు తగ్గుముఖం పడతాయి. అందుకు ప్రజా ఉద్యమాలు తప్ప మరో మార్గం లేదు.  

Leave a Reply