ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌(ఎఫ్‌ఇ) నివేదిక ప్రకారం దేశంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమౌతోంది. రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం, రూపాయి విలువ జీవనకాల కనిష్టానికి క్షీణత, విదేశీ మారక నిల్వలు కరిగిపోతున్నాయి, స్టాక్‌ మార్కెట్ల నష్టాల్లోకి జారుకుంటున్నాయి. గ్యాస్‌, డిజిల్‌, పెట్రోల్‌ రేట్లు ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తున్నాయి. నిరుద్యోగం పెరిగిపోతోంది, ఆహార పదార్థాల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. భారత జనాభాలో యువత 50 శాతం వరకు ఉంది. వారి నైపుణ్యానికి తగిన ఉపాధి లేకపోవడంతో ఉత్పాదక శక్తి పుంజుకోవడం లేదని, పర్యవసానంగా  పారిశ్రామిక వృద్ధి కుంటుపడుతుందని, ఇందుకు పాలకుల అనుచిత విధానాలే కారణమని ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ స్పష్టం చేసింది. గత సంవత్సర కాలంలో మార్కెట్‌లో శ్రామిక శక్తి రేట్‌ 32.3 శాతానికి పడిపోయింది. అర్హతలకు తగిన ఉద్యోగం కావల్సిన వారు 22 కోట్ల మంది వరకు ఉంటారని ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక పేర్కొంది. ఏ రంగం చూసినా ప్రతికూల సంకేతాలే కనిపిస్తున్నాయి. సామాన్యుని బతుకు మరింత భారంగా మారుతోంది.

ఈ ఏడాది అక్టోబర్‌ మాసానికి గాను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ)  విడుదల చేసిన బులిటెన్‌లోని అంశాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అందులోని అంశాలను పరిశీలిస్తే బిజెపి నేతృత్వంలోని కేంద్రం ఆర్థిక వ్యవస్థను సమర్థంగా నడిపించలేకపోతున్నదని స్పష్టమవుతుంది. ఫలితంగా లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్‌ మాసంలో పొదుపు వృద్ధి రేటు 47 సంవత్సరాల కనిష్ఠ స్థాయికి పతనమైందని ఆర్‌బిఐ నివేదిక వెల్లడిస్తున్నది. ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో దాదాపు ఐదు దశాబ్దాల కనిష్ట స్థాయి 5.1 శాతానికి పొదుపు వృద్ధిరేట్‌ పడిపోయింది. ఈ గణనీయమైన క్షీణత గత ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం నుండి తగ్గింది. ప్రైవేటు రంగానికి దేశీయ రుణాల స్తబ్దత, లేబర్‌ఫోర్స్‌లో చెప్పుకోదగిన కదలికలు లేకపోవడం వంటి అంశాలు ప్రతికూల సూచీలకు కారణమవుతున్నాయి. ఈ పోకడలు రోజురోజుకూ మరింత అధ్వాన్నంగా మారి, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో మోడీ సర్కారు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వాస్తవానికి, గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా, ఏడాది కాలంగా గృహేతర వ్యక్తిగత రుణాలు 20 శాతానికి పైగా పెరిగాయి.

ఆర్థికాభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, పారిశ్రామిక రంగానికి  రుణ లభ్యత తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 50శాతం తక్కువ. పరిశ్రమలకు బ్యాంకు రుణాల వాటాను మోడీ ప్రభుత్వం సగానికి తగ్గించడం కూడా దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నది. ద్రవ్యోల్బణం 6.8 శాతం కంటే తగ్గడం లేదు. ‘తృణధాన్యాలు, పప్పులు, సుగంధ ద్రవ్యాలు స్థిరమైన ద్రవ్యోల్బణ ఒత్తిడికి లోనవుతున్నాయి. ఆహారం, విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలు కూడా తీరడం లేదు. ఆర్థిక వృద్ధిపై తరచు అంతర్జాతీయ వేదికలపై ఉపన్యాసాలు ఇస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ, తమ పాలనలో ఆర్థిక లోటు ఎంత ప్రమాదకరంగా పెరుగుతున్నదో గమనించడం లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటు 24 శాతం పెరిగి రూ.6.4 లక్షల కోట్లకు చేరింది. దేశంపై మరింతగా భారం పడే రీతిలో మోడీ సర్కారు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నది. తక్కువ లోటును చూపాలన్న ఉద్దేశంతో దేశాన్ని ‘రుణ భారత్‌’గా మార్చేస్తున్నది.

ప్రజల వాస్తవిక ఆదాయాలు కృశించి పోతున్నాయి. దీంతో ప్రజల జీవనం మరింత దుర్భరంగా మారుతోంది. దీంతో  దేశ ఆర్థికారోగ్యం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో దేశీయ మార్కెట్‌ డిమాండ్‌ తక్కువవుతోంది. పెట్టుబడులు దెబ్బతింటున్నాయి. చేసిన ఉత్పత్తులకు మార్కెట్‌ ఉండడం లేదు. ఉత్పతి చేసింది వెంటనే అమ్ముడయ్యి లాభాలు వచ్చి, అభివృద్ధి నమోదైతేనే పెట్టుబడులు పెరుగుతాయి. డిమాండ్‌, పెట్టుబడులు లేనప్పుడు ఆర్థిక వృద్ధి కూడా జరుగదు. ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థను పట్టి పీడిస్తున్న ప్రాథమిక సమస్య ఇది. మోడీ ప్రభుత్వ హయాంలో మతం-కార్పొరేట్‌ బంధం మరింత బలపడుతుండడంతో, దేశంలో ఉత్పత్తి అయ్యే సంపదలో ప్రధాన భాగం ఆశ్రితుల చేతుల్లోకి వెళ్తుంది. అదానీ వ్యవహారం ఇందుకు మంచి ఉదాహరణగా ఉంది. మెజారిటీ ప్రజలను పణంగా పెట్టి కొద్ది మంది ఆశ్రితులను మరింత సుసంపన్నులను చేయడానికి దేశ సంపద మళ్లించబడుతోంది. మోడీ ప్రభుత్వం అనుసరించే ఆర్థిక విధానాలు రెండు భారత దేశాలను-సంపన్నులకు ప్రకాశవంతమైన భారత దేశాన్ని, నిరుపేదలకు బాధలు పడుతున్న భారతాన్ని-సృష్టించే క్రమానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

భారతదేశం పుంజుకుంటోందని, జిడిపి దృష్ట్యా చూసినట్లైతే ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా పయనిస్తోందంటూ మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై అవిశ్రాంతంగా చేస్తున్న ప్రచారం పేర్కొంటోంది. కానీ, తలసరి జిడిపి దృష్ట్యా భారత్‌ ఎక్కడ ఉంటుందనేదే వాస్తవం. తలసరి జిడిపి దృష్ట్యా చూసినట్లైతే, ఈనాడు ప్రపంచంలో భారత్‌ ర్యాంక్‌ 142. కొత్తగా ఆవిర్భవిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను చూపెట్టేందుకు ఇటీవల జరిగిన జి-20 సదస్సును ఉపయోగించుకున్నారు. జి-20 దేశాలన్నింటిలోకి అత్యంత తక్కువ తలసరి జిడిపి భారత్‌దే. అలాగే మానవ వనరుల అభివృద్ధిలో కూడా దిగువ స్థానంలోనే ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత తక్కువ కార్మిక ప్రాతినిధ్యం రేటు ఉన్న రికార్డు కూడా మనదే. అంటే అత్యంత ఎక్కువగా నిరుద్యోగ సమస్య నెలకొందన్నమాట.

దుస్తులు, సముద్ర ఉత్పత్తులు, ప్లాస్టిక్‌లు, రత్నాలు, అభరణాలు వంటి కార్మిక శ్రమ ఎక్కువ ఉండే ఎగుమతులు క్షీణించడంలో ఇది కనిపిస్తోంది. ఆర్థిక కార్యకలాపాలు క్షీణించాయన్నది వీటన్నింటి ఫలితంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో భారత్‌ వాటా బాగా తగ్గుతోంది. అంటే ఈ రంగాల్లో దేశీయ ఉపాధి కూడా బాగా తగ్గుతోందనే అర్థం. ఫలితంగా ఆగస్టులో నిరుద్యోగం రేటు 8.1 శాతంగా ఉంది. పట్టభద్రుల్లో ఇది ఏకంగా 42 శాతంగా ఉంది. ఉపాధి తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయి. గత కొన్నేళ్ళుగా ఆర్‌బిఐ పెట్టిన పరిమితి 6 శాతాన్ని ద్రవ్యోల్బణం అధిగమిస్తూనే ఉంది. అంతకన్నా అధ్వాన్నమేంటంటే, ఆహార పదార్థాలు, నిత్యావసరాల ధరలు పెరుగుతుండడంతో ఈ ద్రవ్యోల్భణం ఇంకా పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు కీలకాంశాలుగా పెట్టుబడులు స్థూల ఉత్పత్తి, ద్రవ్యోల్బణం, ఉపాధి, ఆరోగ్యం, విదేశీ మారక నిల్వలు ఉంటాయి. అయితే భారత్‌లో ఏ ఒక్క అంశం ఆర్థిక వృద్ధికి సానుకూలంగా లేవు.

మోడీ పాలనలో దేశ యువత ఉద్యోగాలు లేక విలవిలలాడుతున్నది. ఇందుకు పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలే నిదర్శనం. ఇప్పుడు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సిఎంఐఇ) సమాచారం సైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నది. దీని ప్రకారం… భారతదేశ నిరుద్యోగిత రేటు సెప్టెంబర్‌లో 7.09 శాతం నుంచి అక్టోబర్‌లో 10.05 శాతానికి పెరిగింది. అక్టోబర్‌లో గ్రామీణ నిరుద్యోగం 6.2 శాతం నుంచి 10.82 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 8.44 శాతంగా నమోదైంది. ఇటు వ్యవసాయం రంగంలోనూ భారత్‌ తిరోగమన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. గత ఐదేళ్లలో అత్యంత బలహీనమైన రుతుపవనాలను నమోదు చేయడంతో వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడిన గ్రామీణ ఉపాధి దెబ్బతిన్నది. కేంద్రంలోని మోడీ సర్కారు చెప్తున్న ఆర్థిక వ్యవస్థ గణాంకాలన్నీ మేడిపండు చందమేనని ఆర్థిక విశ్లేషకులు, నిపుణులు అంటున్నారు.

దేశంలో ఉద్యోగ కల్పన ఎండమావులను తలపిస్తున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ యువత తీవ్రంగా నష్టపోయే ప్రమాదమున్నదని హెచ్చరిస్తున్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోడీ… నిరుద్యోగ యువతతో చెడుగుడు ఆడుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా… ఆ ఖాళీలను అలాగే ఉన్నాయంటూ పార్లమెంట్‌లో కేంద్రం చెప్పుకుంటోంది. నియామకాల వైపు దృష్టిపెట్టడం లేదు. పకోడీలు వేసుకోమనో, మరోకటో అనేసి నిరుత్సాహపరుస్తోంది. నిరుద్యోగ రేటు మన పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో 11.3 శాతం, బంగ్లాదేశ్‌లో 12.9 శాతం, భూటాన్‌లో 14.4 శాతం, చైనాలో 13.2 శాతం, సిరియాలో 22.1 శాతం, ఇండొనేషియాలో 13 శాతం, మలేషియాలో 11.7 శాతం, వియత్నాంలో 7.4 శాతం, దక్షిణ కొరియాలో 6.4 శాతం, సింగపూర్‌లో 6.1 శాతంగా నిరుద్యోగ రేటు నమోదైంది. మన దేశంలో 23.22 శాతంగా ఉంది.

‘‘ప్రపంచంలోకెల్లా మనదే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ’’ అని ఎంత గొంతు చించుకున్నా, వివిధ రంగాలు కుంగిపోతున్న  చేదు నిజాన్ని పాలకులు కప్పిపుచ్చలేరు. జిడిపి వృద్ధిరేటు పెరుగుతున్నప్పుడు, అందునా, జనాభా పెరుగుతున్న వేగం కన్నా జిడిపి వేగంగా పెరుగుతున్నప్పుడు నిరుద్యోగం రేటు తగ్గాలే తప్ప పెరగకూడదు కదా. మరి ఎందుకు నిరుద్యోగం వేగంగా పెరుగుతోంది. నిజానికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంలో అత్యధిక స్థాయిలో ఉపాధికి అవకాశాలు ఉంటాయి. అటువంటి రంగం కోలుకోవడానికి దోహదం చేయని ఆర్థిక వృద్ధి స్వభావం వలన ఒకపక్క ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నా, ఉపాధి అవకాశాలు మాత్రం ఏ మాత్రమూ పెరగలేదు.

నిరుద్యోగ సమస్యకి సరైన పరిష్కార మార్గాలు చూపలేకపోతున్నారు. పర్యవసానంగా దేశంలో ప్రతి యేటా నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో డేటా ప్రకారం 2014లో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో  నిరుద్యోగుల ఆత్మహత్యలు 7.5 శాతం ఉంది. 2015లో ఆత్మహత్య చేసుకున్న వారిలో నిరుద్యోగుల శాతం 8.2  శాతం ఉంది. 2016లో 1,31,008 మంది ఆత్మహత్యలు రికార్డ్‌ కాగా, అందులో 11,173 మంది (8.5 శాతం) నిరుద్యోగులు. 2017లో 1,29,788 మంది ఆత్మహత్య చేసుకోగా, అందులో 12,241 (9.4 శాతం) మంది నిరుద్యోగులు. 2018లో 1,34,516 మంది ఆత్మహత్య చేసుకోగా, అందులో 12,936 (9.6 శాతం) నిరుద్యోగులు. 2019లో దేశవ్యాప్తంగా 1,39,123 మంది ఆత్మహత్యలు చేసుకోగా, అందులో 14,019 మంది నిరుద్యోగులే. మరోవైపు గత నాలుగేళ్లలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు 5 లక్షలు మూతపడ్డాయి. దీంతో లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.

ఆరోగ్య రంగానికి ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపులు అధమంగా ఉంటున్నాయి. ఇటీవల కాలంలో ప్రజలకు చికిత్సలు, రోగగ్రస్థులకు అవసరమైన ఆస్పత్రులు, వైద్యులు, సేవలకు నర్సులు తగినంతమంది ఉండటం లేదు. ప్రభుత్వం ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడంలోనూ పూర్తిగా విఫలమవుతోంది. అత్యంత ఖరీదైన ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలవడం సర్వసాధారణమవుతుంది.  ఆరోగ్య రంగానికి, ప్రకృతి విధ్వంసానికి అవినావభావ సంబంధం ఉంది. సర్వరంగాలు కలుషితం కావడం వల్ల వివిధ మార్గాల ద్వారా ప్రజల ఆరోగ్యాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. గాలి, ఆహారం, నీరు కలుషితం అవుతున్నాయి. ఇవి ప్రధానంగా ప్లాస్టిక్‌, కృత్రిమ ఎరువులు, రసాయనాలు మూలంగా పండే పంటలు వీటిని సేవిస్తున్న ప్రజలు వివిధ రోగాలబారిన పడుతున్నారు. ప్లాస్టిక్‌ రేణువులు మనిషి ఊపిరితిత్తులలోకి చేరి అనేక రోగాలకు లోనవుతున్నారని తాజా పరిశోధనలు వెల్లడిరచాయి. సాధారణంగా వర్షపునీరు స్వచ్ఛంగా ఉంటుందని భావిస్తాము. ఇప్పుడు మనం పీల్చే గాలిలో 96 శాతం మంది కలుషిత గాలిని పీలుస్తున్నారని ఐక్యరాజ్యసమితి, ఆరోగ్య సంస్థ పరిధిలో పనిచేసే శాస్త్రవేత్తలు ప్రకటించారు. వైద్య చికిత్స అందించడంలో సమత్వం పాటించడం, డిజిటల్‌ ఆరోగ్యభద్రత కార్యక్రమాలు అమలుపై తీర్మానం చేసినా పెద్ద ఫలితం లేదు. ముందుగా కాలుష్యం తగ్గాలి. అందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి. నేడు ఆరోగ్య పరిరక్షణకు అత్యంత కీలక  సమస్య కాలుష్య నిర్మూలనే.

వైద్యం అత్యంత ఖరీదైన సరుకుగా మారింది. దేశంలో ప్రతి సంవత్సరం 30 లక్షల కోట్ల రూపాయలు వైద్య వ్యాపారం జరుగుతోంది. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు వైద్యం ప్రైవేటీకరణకే తోడ్పడుతున్నాయి. వైద్య ఖర్చుల కోసం సంవత్సరంలో సగటున నెలకు రూ.5 వేల లోపు ఖర్చు పెడుతున్నవారు 19 శాతం మంది ఉండగా, 5-10 వేల లోపు ఖర్చు చేసినవారు 41 శాతం మంది ఉన్నారు. 30-50 వేల వరకు  ఖర్చు చేసినవారు 14 శాతం మంది ఉన్నారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ కోసం మొత్తం హెల్త్‌కేర్‌లో ప్రజలు పెట్టే ఖర్చు (ఔటాఫ్‌ పాకెట్‌’) వాటా 73 శాతం ఉందని 2022లో నేషనల్‌ హెల్త్‌ అకౌంట్స్‌ అంచనా వేసింది. ఇదే సమయంలో ప్రభుత్వం వైద్యం మీద దేశ స్థూల జాతీయాదాయంలో కేవలం 1.1 శాతం మాత్రమే ఖర్చు పెడుతుంది. రాజ్యాంగంలోని 47వ ఆర్టికల్‌లోని ఆదేశిక సూత్రాల్లో ప్రజారోగ్యం గురించి చెప్పబడిరది. ‘పోషకాహార వినియోగాన్ని,  ప్రజల జీవన ప్రమాణాల పెంపుదల, ప్రజారోగ్య అభివృద్ధి రాజ్యం యొక్క ప్రాథమిక విధి’ అని రాజ్యాంగ పేర్కొంటుంది.

దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే ఫారెక్స్‌ నిల్వలు క్రమేణా కరిగిపోతున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ లెక్కల ప్రకారం గత నెల 1 నుంచి నవంబర్‌ 6 వరకు ఏకంగా 14 బిలియన్‌ డాలర్లకు పైగా హరించుకుపోయాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) వివరాల ప్రకారం సెప్టెంబర్‌ 1న 598 బిలియన్‌ డాలర్లుగా ఉన్న భారతీయ ఫారెక్స్‌ నిల్వలు అక్టోబర్‌ 6 నాటికీ 584 బిలియన్‌ డాలర్లకు దిగజారాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భారతీయ ఎకానమీకి పెద్ద ప్రమాదమే వాటిల్లుతుందన్న అభిప్రాయాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆర్‌బిఐ సమాచారం మేరకు వారం వారం డాలర్‌ నిల్వలు క్షీణిస్తున్న పరిస్థితే కనిపిస్తున్నది. ఈ నిల్వలు బలంగా ఉంటే ఎకానమీకి ఎంత లాభమో.. బలహీనపడితే కూడా అంతే నష్టమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం(82.33) విలువ దారుణంగా పడిపోతున్నదని, ఇటువంటి సమయంలో దేశంలో డాలర్‌ నిల్వలు క్షీణించడం ఎంతమాత్రం మంచిది కాదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. బంగారం నిల్వలు సైతం తగ్గి మొత్తం ఫారెక్స్‌ రిజర్వుల్లో క్షీణత కన్పిస్తోంది.

దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్‌పోలియో పెట్టుబడుల (ఎఫ్‌పిఐ) రాక మందగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో మే-జూలై వరకు పెద్ద ఎత్తున వచ్చిన ఎఫ్‌పిఐలు, ఆగస్టులో మాత్రం 4 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఏప్రిల్‌ నుంచి గమనిస్తే ఆగస్టులోనే అతి తక్కువగా నమోదయ్యాయి. ఏప్రిల్‌లో రూ.11.631 కోట్ల విదేశీ పోర్ట్‌పోలియో పెట్టుబడులు రాగా మే నెలలో రూ.43,838 కోట్లు, జూన్‌లో రూ.47,148 కోట్లు, జూలైలో రూ.46,618 కోట్ల విదేశీ పోర్ట్‌పోలియో పెట్టుబడులు భారతీయ స్టాక్‌ మార్కెట్లలోకి వచ్చాయి. ఆగస్టులో మాత్రం రూ.12,262 కోట్లకే పరిమితమయ్యాయి. ‘డాలర్‌తో పోల్చితే అంతకంతకూ పడిపోతున్న రూపాయి మారకం విలువ.. దేశీయ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్‌పోలియో పెట్టుబడులకు ప్రతిబంధకంగా మారుతున్నది. ‘కరెన్సీ మార్కెట్లో బలహీనపడుతున్న రూపాయి మారకం విలువ.. భారత్‌లోకి వచ్చే విదేశీ పోర్ట్‌పోలియో పెట్టుబడులను అడ్డుకుంటున్నది. చైనాకు ఆ పెట్టుబడులు వెళ్లేందుకు దారితీస్తున్నది. దేశంలో అధిక ఇంధన ధరలు, ద్రవ్యోల్భణం కూడా విదేశీ పోర్ట్‌పోలియో మదుపరులను భయపెడుతున్నాయి.

గత మూడేండ్లలో ఎన్నడూ లేనంతగా ఎగుమతులు దారుణంగా పడిపోయాయి. జూన్‌ నెలలో మొత్తం 30 కీలక రంగాల్లో 21 రంగాల ఎగుమతుల వృద్ధి మైనస్‌లోకి పడిపోయింది. తగ్గినవాటిలో పెట్రోలియం ఉత్పత్తులు, ప్లాస్టిక్‌, రెడీమేడ్‌ దుస్తులు, ఇంజనీరింగ్‌, కెమికల్స్‌, జెమ్స్‌ జ్యూవెల్లరీ, లెదర్‌, సముద్ర ఉత్పత్తులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్‌ గూడ్స్‌ ఎగుమతులు మాత్రం 45.36 శాతం పెరిగి 2.43 బిలియన్‌ డాలర్లకు చేరాయి. తాజాగా వెల్లడైన బలహీన గణాంకాలపై కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్‌ బర్త్వాల్‌ మాట్లాడుతూ వాణిజ్య రంగం వృద్ధి అంతా అంతర్జాతీయ అంశాలపైనే ఆధారపడి ఉందని చెప్పారు. ప్రపంచ వాణిజ్యం మందగిస్తుందంటూ వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (డబ్య్లూటీవో) గత జూన్‌లో అంచనాల్ని వెల్లడిరచిందని, ‘ఆ భయాలు నిజమయ్యాయి’ అని వ్యాఖ్యానించారు. వాణిజ్య వృద్ధి పతనానికి కారణాలు వివరిస్తూ అధిక ద్రవ్యోల్భణంతో యూఎస్‌, యూరప్‌ తదితర ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నీ మందగమనంలో ఉన్నాయన్నారు. ధనిక దేశాల ఫెడరల్‌ బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతూ లిక్విడిటిని అదుపు చేస్తూ  ద్రవ్య విధానాల్ని కఠినతరం చేయడంతో తయారీ, వ్యాపార రంగాలు తెబ్బతిన్నాయన్నారు.

భారత ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటంతో వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో ఎగిసిపడిరది. ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో 65.03 బిలియన్‌ డాలర్ల వాణిజ్య దిగుమతులు చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో సరుకుల ఎగుమతులు 33.57 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయని కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడిరచాయి. దిగుమతులు అధికంగా ఉండటం, ఎగుమతులు తక్కువగా ఉండటంతో రికార్డు స్థాయిలో 31.46 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటు చోటు చేసుకుంది. ఇది ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచడంతో పాటు అనేక ఉత్పత్తుల ధరలు పెరగడానికి దారి తీసింది. ప్రపంచ దేశాల ఉత్పత్తులతో పోటీ పడలేకపోవడం, గ్లోబల్‌ డిమాండ్‌లోనూ స్తబ్దత నేపథ్యంలో భారత ఎగుమతులు తగ్గిపోతున్నాయని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ భారత్‌ను ప్రపంచానికి ‘విశ్వగురు’గా మార్చారని, భారత్‌ ‘సూపర్‌ పవర్‌’గా మారుతున్నదని కార్పొరేట్‌ మీడియా, బిజెపి పరివారం హోరెత్తిస్తున్న ప్రచారమంతా ఉత్తదేనని తేలింది. ఉపాధి తగ్గడం, గత కొన్నేళ్ళుగా ఆర్‌బిఐ పెట్టిన పరిమితి 6 శాతాన్ని ద్రవ్యోల్భణం అధిగమిస్తూనే ఉంది. ఆహార పదార్థాలు, నిత్యావసరాల ధరలు పెరుగుతుండడంతో ఈ ద్రవ్యోల్భణం ఇంకా పెరుగుతోంది. జిడిపి శాతంగా కుటుంబాల ఆర్థిక ఆస్తులు క్షీణించడమే ఈ మొత్తం సంక్షోభానికి ప్రధాన కారణంగా ఉంది. 2020-21లో 15.4 శాతంగా ఉన్న ఈ ఆస్తులు 2022-23లో 10.9 శాతానికి పడిపోయాయి. కుటుంబాల నికర ఆర్థిక ఆస్తులు 11.5 శాతం నుండి 5.1 శాతానికి పడిపోయాయి.  దేశ ఆర్థిక రంగానికి కీలకమైన 6 అంశాలు (ద్రవ్యోల్భణం, శ్రామిక శక్తి, ఎగుమతులు, విదేశీ మారక నిల్వలు, వాణిజ్య లోటు, విక్రయాలు) విశ్లేషిస్తే భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తుందని అర్థమవుతుంది.

దేశంలో యువ శ్రామిక శక్తి ఉపాధిరహితంగా 22 కోట్ల వరకు ఉంది. వీరికి  నైపుణ్యానికి తగిన ఉపాధి దొరక్కపోవడంతో ఉత్పాదకశక్తి నిరూపయోగమవుతుంది. ఫలితంగా ఉత్పత్తి, ఉపాధి, వినియోగం తగ్గి ఆర్థిక వ్యవస్థ కుంగిపోవడానికి కారణమవుతున్నాయి. భారతదేశం ఆర్థిక వృద్ధి, మానవాభివృద్ధి సాధించడానికి అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఆ సవాళ్లను అధిగమించడానికి ప్రజల ఆదాయాలను పెంచే, ఉపాధిని పెంచే, జిడిపికి దోహదపడే కీలకమైన సూక్ష్మ చిన్న మధ్యతరహా (ఎంఎస్‌ఎంఇ) పరిశ్రమల ద్వారా డిమాండును పెంచాలి. ఇవి ముఖ్యంగా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పనను, వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తుంది. అలాగే వ్యవసాయ అనుబంధ గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహించినట్లయితే గ్రామీణ ప్రజల ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. 

మోడీ పాలనలో ప్రజల ఆదాయాలు తగ్గుతుంటే, ధరలు కొండెక్కుతున్నాయి. ఎగుమతులు క్షీణిస్తుంటే ఫారెక్స్‌ నిల్వలు పడిపోతున్నాయి, విక్రయాలు మందగించాయి, వాణిజ్య లోటు అంతకంతకూ పెరిగిపోతున్నది, తగిన ఉపాధి లేక శ్రామిక శక్తి వృధా అవుతుంది, యువతకు ఉపాధి లేమి, తయారీ రంగ వృద్ధిలో క్షీణత… ఇవన్నీ కలిసి మోడీ పాలనలో దేశ ఆర్థికం అధోగతి పాలయ్యిందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఈ స్థితిలో ఆశ్రితుల ఆస్తుల వృద్ధికి ఆశ్రయం కల్పించడం ఆపి, దానికి బదులుగా ప్రభుత్వ వనరులను ప్రజా పెట్టుబడులకు ఉపయోగించి, ఎంతగానో అవసరమైన మౌలిక వసతులను నిర్మించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఉద్యోగాలు కల్పించబడతాయి. ఆర్థిక వ్యవస్థలో దేశీయ డిమాండ్‌ పెరుగుతుంది. అయితే, దేశ జాతీయ ఆస్తులను దోపిడీ చేయడం ద్వారా తమ లాభాలను గరిష్టంగా పెంచుకునేందుకు విదేశీ, దేశీయ పెట్టుబడులకు మోడీ ప్రభుత్వం విధేయత కనబరుస్తున్నందున, ఈ సంక్షోభం రానున్న రోజుల్లో మరింత అధ్వాన్నంగా మారుతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply