బ్రిటీష్ వలసవాదుల నుంచి భారత పాలక వర్గాలకు అధికార బదిలీ జరిగి వచ్చే ఏడాది ఆగష్టు 15 నాటికి 75 ఏళ్లు పూర్తి అవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారీ స్థాయిలో అమృతోత్సవం నిర్వహించాలని మోడీ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. స్వాతంత్య్రం వచ్చింది దేశ భూభాగానికే కాదు ప్రజలకు సామాజిక, ఆర్థిక స్వాతంత్య్రం అని గమనిస్తే జనాభాలో సగం మంది పేదరికంతో ఆకలితో అలమటిస్తుంటే, ప్రజలు ఉత్సవాలలో ఎలా పాల్గొంటారు? ఏడున్నర దశాబ్దాలలో ప్రజల మౌలిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డ, వైద్యం, విద్య ఇప్పటికీ ప్రజలందరికి అందుబాటులోకి రాలేదు. బయట పల్లకీ మోత ఇంట్లో ఈగల మోత అన్నట్లు దేశం ఆహార పదార్ధాలలో స్వయం సమృద్ధి సాధించినా, ఇతర దేశాలకు ఆహార పదార్థాల ఎగుమతి జరుగుతున్నా ప్రజలందరి ఆకలి తీర్చలేకపోవడం సిగ్గుచేటు. గ్లోబల్ హంగర్ నివేదికలోని తీవ్రతను గ్రహించి ప్రతి మనిషి తగినంత సురక్షితమైన పౌష్టికాహారాన్ని కొనగలిగే ఆర్థిక స్థోమతను కల్పించాలి.
భారత ప్రజలమైన మేము ‘‘సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం, ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండే స్వేచ్ఛ, సమైక్యత, సౌభ్రాతృత్వం, వక్తి గౌరవం పెంపొందించేందుకు ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకున్నాం’’. ఇది భారత రాజ్యాంగ పీఠిక సారాంశం. పాలకుల ఆచరణ రాజ్యాంగ ఆదర్శాలకు భిన్నంగా ఉందని మన అనుభవం తెలుపుతోంది. ఏడున్నర దశాబ్దాల పాలన ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో, దైనందిక అవసరాలు తీర్చడంలో విఫలమైందని ప్రజల సామాజికార్థిక స్థితిని చూస్తే విదితమవుతోంది. మన పాలకులు రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించి పెట్టుబడి సేవలో, సామ్రాజ్యవాద సేవలో తరించి పోతున్నారు. ప్రభుత్వం చెప్పే అభివృద్ధి మానవాభివృద్ధి కాదు, అది సంపన్నుల అభివృద్ధి అని పెరుగుతున్న ఆర్థిక, సామాజిక అంతరాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రజల రాజ్యం కాదు, బడా బూర్జువా, భూస్వామ్య రాజ్యమని చెప్పడానికి ఇంకేమి రుజువులు కావాలి. ప్రజాస్వామ్యం, జెండర్ ఈక్విటీ, మానవాభివృద్ధి, ఆకలి, ఉపాధి, విద్య, వైద్యం వంటి పలు అంశాల్లో బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, భూటాన్‌ల కంటే భారత్ వెనుకబడి ఉందని పలు నివేదికలు ఘోషిస్తున్నాయి.
ఐరిష్ సహాయ సంస్థ కన్సర్డ్ వరల్డ్‌వైడ్, జర్మనీ సంస్థ వెల్త్‌హంగర్ హిల్పే సంయుక్తంగా తయారుచేసిన ‘ప్రపంచ ఆకలి సూచిక’ను అక్టోబర్ 16న విడుదల చేసింది. అందులో భారత దేశంలో ఆకలి స్థాయిని ఆందోళనకరంగా పేర్కొంది. మోడీ అధికారంలోకి వచ్చేనాటికి ప్రపంచ ఆకలి సూచీలో భారత్ స్థానం 55గా ఉంది. 2021లో 116 దేశాల్లో భారత్ స్థానం 101వ ర్యాంక్‌కు పడిపోయింది. సుస్థిర అభివృద్ధి అంటే రెండు రోడ్లు, రెండు భవనాలు, రెండు ఆనకట్టలు నిర్మించడం మాత్రమే కాదు. ప్రజల ఆకలి సమస్యను పరిష్కరించడమే సుస్థిరాభివృద్ధికి ప్రధాన సూచిక. ఏ దేశ సుస్థిరాభివృద్ధికైనా ప్రజల ఆరోగ్యమే గీటురాయి. ప్రజారోగ్యం పౌష్టికాహారంపైనా ఆధారపడి ఉంటుంది. పౌష్టికాహారంతో రోగ నిరోధక శక్తి జీవన ప్రమాణాలు పెరిగి మేధా వికాసానికి దారి తీస్తుంది. తద్వారా దేశాభివృద్ధికి వేగంగా అడుగులు పడుతాయి. అందువల్లనే ఈ విషయాన్ని ఐ.రా.స నొక్కి వక్కానించింది. 2030 నాటికి ఆకలిలేని సమాజాన్ని (జీరో హంగర్) నిర్మించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించింది. అప్పటికీి భారత్ ఆకలి సమస్యను పరిష్కరించలేదన్న అంచనాలు వెలుబడుతున్నాయి.
ఏ దేశమైనా సమగ్ర అభివృద్ధి చెందాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనేది అక్షర సత్యం. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పోషకాహారం ప్రధానపాత్ర పోషిస్తుంది. ఇది మానవ శరీరం తమ విధులు నిర్వహించేందుకు కావలసిన శక్తిని అందిస్తుంది. ఆహారాన్ని బట్టి మానసిక, భౌతిక వికాసం ఆధారపడి ఉంటుంది. అయితే మనదేశం ఆహార పదార్థాల మిగులు దేశంగా ఉన్నప్పటికీ అధిక పోషకాహార లోపం కొనసాగుతోందని నివేదిక పేర్కొంది. ప్రధానంగా ఐదేళ్లలోపు పిల్లలు, బాలింతలు, గర్భిణీ మహిళలు పోషకాహారలోపం వల్ల అనారోగ్యంతో జీవితాలు వెల్లదీస్తున్నారు. విద్యార్థులు అభ్యాస సామర్థ్యం కోల్పోతున్నారని నివేదిక తెలిపింది. మనదేశంలో వివిధ సామాజిక వర్గాల మధ్య అంతరాలు, అసమానతలు ఇందుకు ప్రధాన కారణమని, సామాజిక వివక్ష… ముఖ్యంగా అంటరానితనం తీవ్ర ప్రభావం చూపుతోందని పరిశోధకులు నిర్థారించారు. ఇండియా హ్యుమన్ డెవలప్‌మెంట్ సర్వే గణాంకాల్ని విశ్లేషించగా, ఏఏ జిల్లాల్లో అంటరానితనం ఉందని బాధితులు చెప్పారో.. అక్కడ పోషకాహార సమస్య ఎక్కువగా నమోదైందని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రాణాలు నిలుపుకోవడానికి ఏదో ఒకటి తిని కడుపు నింపుకునే అవకాశం అందరికీ ఉండొచ్చు. కాని పోషకాహార లభ్యత లోపించినా కొద్దీ దేశ జన సామర్థ్యం నిర్వీర్యమైపోయి, జాతి జవసత్వాలు అడుగంటి పోతాయి. ఆహారం పరిమాణం కాదు. ఆహారం సమతులంగా ఉండాలి. అంటే శరీరానికి కావల్సిన విటమిన్స్, మినరల్, మాంసకృత్తులు తగినంతగా ఉండాలి. యువతరం అత్యధికంగా ఉన్న భారత దేశంలో ఆకలి అపూర్వ స్థాయిలో తాండవిస్తున్నదన్న చేదు వార్త ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది. తాజాగా అక్టోబర్ 16న విడుదలైన ప్రపంచ ఆకలి సూచీ నివేదికలో భారతదేశం ఏడు మెట్లు కిందికి పడిపోయి గత ఏడాది 94వ స్థానం నుంచి 101వ స్థానానికి దిగజారిందన్న సమాచారం దిగ్భ్రాంతకరమైంది. దేశంలో ఆకలి ఘోష తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రజలపై విపరీతంగా భారాలు మోపుతూ, లక్షల కోట్లు కార్పొరేట్లకు కట్టబెట్టే మోడీ ఫ్రభుత్వ హయాంలో ఆకలి సూచీలో మనదేశ స్థానం దిగజారుతోంది. మన దేశంలో కుబేరుల సంఖ్య మాత్రం శరవేగంతో 237కి చేరింది. ఈ సంఖ్య గత సంవత్సరం కంటే 56 అధికం. 1990కి ముందు మన దేశంలో కుబేరులు లేరు. ఇవాళ 100 మంది సంపన్నుల వద్ద నాల్గింట మూడొంతుల సంపద ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్య తీవ్రంగా ఉన్న 31 దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. ఆకలి ఘోష విషయంలో పావువా న్యూ గినియా, ఆఫ్ఘానిస్తాన్, నైజీరియా వంటి దేశాల సరసన భారత్ నిలిచింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021 జాబితాలో మొత్తం 116 దేశాలకు గానునూ భారత్ 101వ స్థానంలో నిలిచింది. మన దేశం తరువాతి స్థానాల్లో పావువా న్యూ గినియా (102), ఆఫ్ఘానిస్తాన్, నైజీరియా (103), కాంగో (105), మోజాంబిక్, సియార్రా లియోన్ (106), తిమోర్ లెస్తే (108), హైతీ (109), లిబియా (110), మడగాస్కర్ (111), డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (112), చాద్ (113), సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (114), యెమన్ (115), సోమాలియా (116) దేశాలు ఉన్నాయి. ఆకలిలేని (జీరో హంగర్) దేశానికి 100 మార్కులు ఇస్తారు. మనదేశం 2000లలో 38.8 స్కోర్ నుంచి 2021కి 27.5 స్కోర్‌కి పడిపోయింది.
ఈ ఏడాది గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో అట్టడుగున సోమాలియా ఉంది. భారత్ కన్నా పాకిస్తాన్ (92), నేపాల్ (76), బంగ్లాదేశ్ (76)లకు ఉత్తమ ర్యాంక్‌లు లభించాయి. ఈ జాబితాలో గత ఏడాది కంటే ఈ ఏడాది భారత్ మరింత దిగజారి పోవడం ఆందోళనకరం. మనదేశంలో ఆహార భద్రత పలు అంశాలలో దాడికి గురవుతుంది. ప్రధానంగా కుల, మత, ఘర్షణలు, ప్రపంచ వాతావరణ మార్పులతో ముడిపడి ఉన్న వాతావరణ తీవ్రతలు, కొవిడ్-19 తీవ్రతకు సంబంధించిన ఆర్థిక, ఆరోగ్య సవాళ్లు అన్నీ ఆకలి మంటలు రేపుతున్నాయి. ‘ప్రాంతాలు, దేశాలు, జిల్లాలు, వర్గాల మధ్య అసమానత వ్యాప్తి చెందుతుంది. ఒకవేళ వీటిని నియంత్రించకుండా ఇలాగే వదిలేస్తే, ప్రపంచాన్ని సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యం సాధించకుండా చేస్తుందని, అది ఎవరినీ వదిలిపెట్టదు’ అని నివేదిక పేర్కొంది.
జాతీయ, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో 2030 నాటికి ఆకలి బాధలు లేని సమాజం (జీరో హంగర్) దిశగా పురోగతిని కొలవడానికి కీలక అంశాలను గుర్తించడానికి ఈ జాబితాను తయారు చేస్తారు. ఈ పరిశీలనలో ఆహార భద్రత స్వరూపాన్ని అధ్యయనం చేసింది. ఆదాయ అసమానతలు, ఆహార లభ్యత, సహజవనరులు, ఉపాధి అవకాశాలు వంటి 58 అంశాలను పరిగణలోనికి తీసుకోవడం జరిగింది. ప్రస్తుత సూచీలను బట్టి 2030 నాటికి ఈ జాబితాలోని 47 దేశాలు ఆకలి లేని సమాజాన్ని సాధించడంలో వెనుకబడతాయని అంచనా వేశారు. జిహెచ్‌ఐ స్కోరు నాలుగు సూచికలపై లెక్కించబడుతుంది. ఒకటి, పోషకాహార లోపం, రెండు, చైల్డ్ వేస్టింగ్ (తీవ్రమైన పోషకాహార లోపాన్ని ప్రతిబింబిస్తూ, వారి ఎత్తుకంటే తక్కువ బరువు ఉన్న ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల వాటా), మూడు, చైల్డ్ స్టంటింగ్ (ఐదేళ్ల లోపు పిల్లలు వారి వయస్సులో తక్కువ ఎత్తు, దీర్ఘకాలిక పోషకాహార లోపం ప్రతిబింబిస్తుంది), నాలుగు, ఐదేళ్ల లోపు పిల్లల మరణాలు రేటు.
‘ఆకలి రక్కసి కబంధ హస్తాల్లోంచి స్వేచ్ఛ సాధించడమే ఇప్పుడు మన ప్రధాన కర్తవ్యం’ అని భారత తొలి ఆహార, వ్యవసాయ శాఖామాత్యులు బాబూ రాజేంద్రప్రసాద్ 1947 ఆగస్టు 15న జాతికి ఇచ్చిన పిలుపు ఇది! ఏడున్నర దశాబ్దాల తరువాత ఆ భూతం బారి నుంచి ఇండియా విముక్తి పొందలేకపోయింది. ఇప్పటికీ పిల్లల్లో క్షీణత వాటా 1998-2002 మధ్య 17.1 శాతం నుండి 2016-2020 మధ్య 17.3 శాతానికి పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ‘కొవిడ్-19 విపత్తుల కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చైల్డ్ వేస్టింగ్ రేటు ఉన్న దేశం భారత్’ అని వివరించింది. సమతుల ఆహారం లేకుంటే రోగ నిరోధక శక్తి క్షీణించి వ్యాధులు సంక్రమిస్తాయి. ఫలితంగా మరణాలు కూడ సంభవిస్తాయి. పొరుగు దేశాలు నేపాల్(76), బంగ్లాదేశ్(76), మైన్నార్ (71), పాకిస్తాన్(92)లు కూడా ‘ఆందోళనకర ఆకలి’ విభాగంలో ఉన్నాయి. కాని భారత్ కంటే తమ పౌరులకు ఆహారాన్ని అందించడంలో కొంత మెరుగ్గా ఉన్నాయి.
ఆకలి అనేది పేదరికానికి సూచిక మాత్రమే కాదు. పేదరికాన్ని తీసుకువస్తుంది. జనావళి ఆకలిదప్పులను తీర్చడంలో నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ల కన్నా వెనకబడి తరగని దుష్కీర్తిని మూటగట్టుకుంది. హక్కుల సంఘాలు, సామాజిక ఉద్యమ మేధావులు ఆహార భద్రత జీవించే హక్కులో భాగమేనని సుప్రీంకోర్టులో ప్రజావ్యాజ్యం వేశారు. సుప్రీంకోర్టు ఆహారభద్రత ప్రభుత్వ బాధ్యతేనని తేల్చి చెప్పింది. ఫలితంగా ప్రభుత్వం 2013లో జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ)ను రూపొందించింది. ఈ చట్టం అమలులో అనేక లోపాలతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సురక్షితమైన పౌష్ఠికాహారాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉంచడమే ఆహార భద్రతకు సార్థకత.
ప్రజల్లో పోషకాహార లోపం, పిల్లల్లో దుర్బలత్వం, ఎదుగుదల లోపాలు, శిశుమరణాల ప్రాతిపదికగా జిహెచ్‌ఐ నివేదిక వెలుగుచూసింది. ప్రపంచ ఆకలి సూచిని ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి శక్తులు తెగనాడి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం సిగ్గుమాలిన పని. మన ప్రధాని, ఆయన వంది మాగదులు మాత్రం అశాస్త్రీయ విధానాల్లో అధ్యయనం సాగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి వాస్తవాలకు ఆ నివేదిక అద్దంపట్టడం లేదని దబాయిస్తున్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ర్యాంకులపై తలదించుకుని, ఆకలి సమస్య పరిష్కారానికి పటిష్టమైన కార్యాచరణను చేపట్టాల్సిన మోడీ ప్రభుత్వం అది వదిలేసి నివేదికలో శాస్త్రీయత లోపించిందని ఎదురు దాడి చేయడం మోడీ దివాళకోరు తనానికి పరాకాష్ట. ప్రపంచ ఆకలి సూచీ ప్రపంచబ్యాంక్, మనదేశం నిర్వహించే శాంపిల్ సర్వే, ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలను అధ్యయనం చేసి ఆకలి సూచీలను నిర్ణయిస్తారు.
దేశవ్యాప్తంగా అయిదేళ్ల లోపు చిన్నారుల్లో వయసుకు తగిన ఎత్తు లేని వారు దాదాపు 38 శాతమని, ఎత్తుకు తగిన బరువుకు నోచుకోని వారు 17.3 శాతమని కేంద్ర శిశు సంక్షేమ శాఖా మంత్రి గత జులైలో లోక్‌సభలో వెల్లడిరచారు. పోషకాహార లోపంతో దేశవ్యాప్తంగా పసిప్రాణాలెన్నో కడతేరిపోతున్నట్లు లోగడ ఎన్నో పరిశోధనలు నిగ్గుతేల్చాయి. కొవిడ్ కారణంగా తెగ్గోసుకుపోయిన కుటుంబాదాయలతో పేదరికం పడగనీడ విస్తరిస్తోంది. తత్ఫలితంగా క్షుద్బాథా పీడితుల సంఖ్య సైతం ఇంతలంతలవుతోంది. ప్రజల్లో పోషక విలువలను ఇనుమడిరపజేస్తూ వారి జీవన ప్రమాణాల వృద్ధికి బాటలు పరవడం పాలకుల నైతిక విధి. ఆ మేరకు దిశానిర్దేశం చేస్తున్న 47వ రాజ్యాంగ అధికరణ స్ఫూర్తికి మన్నన దక్కితేనే ‘అన్నమో రామచంద్రా’ అంటూ అలమటిస్తున్న అభాగ్యులకు సాంత్వన లభించి, ప్రజారోగ్యం మెరుగుపడుతుంది.
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆ సేతుహిమాచలం 70 కోట్ల మందికి పైగా క్రమం తప్పకుండా ఆహారధాన్యాలు చేరుతున్నట్లు సర్కారీ లెక్కలు సాక్ష్యమిస్తున్నాయి. అన్నార్తులకు అంతచక్కగా తోడ్పాటు, మానవీయ సహాయం లభిస్తుంటే దేశంలో ఇంకా ఆకలిచావులు ఎందుకు సంభవిస్తున్నాయి? ప్రజాపంపిణీ వ్యవస్థలోని లోపాలతో లబ్ధిదారులకు చేరాల్సిన ఆహారధాన్యాలు పక్కదారి పడుతున్నాయని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవల ఆక్షేపించింది. ఎఫ్‌సిఐ గోదాముల్లో గడచిన మూడేళ్లలో 10వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యపురాశులు పాడైపోవడాన్నీ అది ఎత్తిచూపింది. పస్తులతో జనం అల్లాడుతున్న దేశంలో తిండిగింజల వృథాను అరికట్టడానికి ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదని సుప్రీంకోర్టు విమర్శించింది. మోడీ పాలనలో రోజు రోజుకు అసమానతలు పెరిగిపోతున్నాయి. పేదరికాన్ని తగ్గించే బదులు పెంచేస్తోంది. మరోవైపు ఆహార భద్రతా చట్టానికి తూట్లు పొడుస్తోంది.
ప్రపంచ అగ్రగామి ఆర్థిక శక్తిగా భారత్ ఆవిర్భవిస్తోందని బాకాలూదుతున్నా భారత్‌లో చిన్నారులు ఆకలితో నకనకలాడుతున్నారనేది ఒక కఠోరసత్యం. పేదరికం, అనారోగ్యానికి తోడుగా అవగాహనారాహిత్యం, సామాజిక, ఆర్థిక పరిస్థితులే ఈ దైన్యస్థితికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. దీర్ఘకాలంగా పౌష్టికాహార లేమి కారణాన చిన్నారులలో అనారోగ్య దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి. భారత్‌లో ఐదేళ్ల వయస్సు లోపు మరణిస్తున్న చిన్నారులలో 69 శాతం మంది పౌష్టికాహార లోపంతో మరణిస్తున్నారనే విషయాన్ని మనం మరిచిపోకూడదు. ఆకలి, పౌష్టికాహార లేమి సమస్య ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. ఈ సమస్య పరిష్కారంలో ప్రభుత్వాలు తమకు తోచిన విధంగా కృషి చేస్తున్నప్పటికీ ఆ కృషిలో చిత్తశుద్ధి లోపించిందని చెప్పవచ్చు. 1975లో ప్రారంభించిన ‘సమీకృత శిశు అభివృద్ధి సేవల పథకం’ (ఐసిడిఎస్) మొదలు 2018లో ప్రారంభమైన ‘ప్రధానమంత్రి పోషణ్ అభియాన్’ వరకు అనేక కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నప్పటికీ దేశ ప్రజలకు సంపూర్ణ పౌష్టికాహార లభ్యత ఇప్పట్లో సాధ్యమేనా అన్న అనుమానం కలుగుతోంది.
2000 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్య పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. సమస్య పెరుగుదలలో వేగం కనిపిస్తోందని తెలిపింది. సామాజిక భద్రతా కార్యక్రమాలు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాలపై 2030 వరకు ఏడాదికి రూ.5.5 లక్షల కోట్ల చొప్పున భారతదేశం వెచ్చిస్తేనే ఆకలి కోరల్లోంచి బయట పడగలుగుతుందని ఐరాస గతంలో సూచించింది. మోడీ ఏడున్నరేళ్ల పాలనలో 2030 కల్లా ఆకలిని పారదోలాలన్న ఐరాస లక్ష్యం మరింత దూరమైన పోయింది. రోజుకు 2,100 కేలరీల కంటే తక్కువ ఆహారం తీసుకుంటే పోషకాహార లోపం, ఆహార అభద్రత కింద మగ్గుతున్నట్లే. దేశంలో 70 శాతానికి పైన ప్రజలు ఆహార అభద్రతలో బతుకుతున్నారు. మహిళలు, అట్టడుగు వర్గాలు, వెనకబడ్డ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువ. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాల్లో భాగమైన నగదు బదిలీ, ఒకే జాతి – ఒకే రేషన్ కార్డు, మోనిటైజేషన్ వంటివి ప్రజలకు ఆహారాన్ని మరింత దూరం చేస్తున్నాయి. బిజెపి ప్రభుత్వ విధానాలను తిప్పికొడితేనే ఆకలి సమస్య తీరుతుంది. హంగర్ ర్యాంకులతోనైనా మోడీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుంటుందా? అంటే, సందేహమే.
తీవ్రంగా పెరుగుతున్న ఆహార అభద్రత భారతదేశంలోని పిల్లల ఆరోగ్య ఫలితాలపై హానికరమైన దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి ఉంది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రకారం పోషకాహార లోపం తరతరాలపై ప్రభావం చూపుతుంది. దీంతో తల్లులు బరువు తగ్గడం లేదా బరువు తక్కువగా ఉన్న పిల్లలకు జన్మనిచ్చే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు పుట్టిన మొదటి 1,000 రోజుల్లో తీసుకునే పోషకాహారమే పిల్లల ఆరోగ్యానికి కీలకమైంది. ఎందుకంటే వారి మొత్తం జీవితకాలాన్ని ఈ పీరియడే నిర్ణయిస్తుంది. గత 20 ఏళ్లలో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 198 మిలియన్ టన్నుల నుంచి 269 మిలియన్ టన్నులకు పెరిగింది. ఇది అందరికీ ఆహారం లభిస్తుందనే విషయాన్ని నిర్ధారిస్తుండగా… దేశంలోని మూడిరట రెండొంతుల మందికి సబ్సిడీ రేట్లపై ఆహారం, పోషకాహార భద్రతను అందించడమే జాతీయ భద్రతా చట్టం 2013 లక్ష్యం. ఇది ప్రజా పంపిణీ వ్యవస్థ కింద 75 శాతం గ్రామీణ జనాభా, 50 శాతం పట్టణ జనాభాను కవర్ చేస్తుంది. అది కూడ కుటుంబంలో ఒక్కొక్కరికి 5 కిలోలు ఇస్తున్నారు. మొత్తంగా మనదేశంలో ఆహారభద్రత చట్టం అమల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ పథకం ఇంకా 20 కోట్ల మందికి విస్తరించవలసి ఉంది.
సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలు ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేస్తోన్నాయి దేశ సంపదను కార్పొరేట్లు దోచుకుంటున్నాయి. శ్రమ దోపిడీ పెరిగింది. వ్యవసాయ భూములు కార్పొరేట్ల వశమవుతున్నాయి. ఫలితంగా సాగుభూములు తరిగిపోతూ, అన్నదాతలు అంతకంతకూ సమస్యల ఊబిలో మునిగిపోతూ దేశీయంగా వ్యవసాయం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రైతుల కడగండ్లు తీర్చి ప్రభుత్వం వారికి అండగా నిలిస్తేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను జోరెత్తిస్తూ, అర్హతలకు తగిన ఉపాధి అవకాశాలను కల్పిస్తూ జనావళి సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించినట్లుగా ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్ఠీకరించడమూ కీలకమే! సంక్షేమం, ఉపాధి కల్పనలను జోడుగుర్రాలుగా పరుగుతీయిస్తేనే జాతి జవజీవాలను తోడేస్తున్న ఆకలి సమస్యకు పరిష్కారం లభిస్తుంది! ఆర్థికాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసుకొని సాగించే కృషి మాత్రమే అకలిని సమూలంగా అంతమొందించి దేశ సంపదను విశేషంగా పెంచి భారత్‌ను ప్రపంచ దేశాల మధ్య సగర్వంగా నిలుచోబెడుతుంది. ఈ సూక్ష్మాన్ని మన పాలకులు గ్రహించనంత వరకు ఆకలి నుంచి మనకు మోక్షం లభించదు.