శిశిరం లో రాలిన ఆకులు
గలగలంటున్నాయ్
వాడి గుండెల్లో అలజడి
అడుగులెవరివని
కలంలో కాలాన్ని
ప్రశ్నించే అక్షరాలు తూటాల్లా
దూసుకొస్తుంటే
బుల్లెట్ ప్రూఫ్ అద్దాల మాటున
వాడు కాపురం
వసంతంలో చిగురిస్తున్న
మొక్కల మాటున
దాగే ప్రశ్న
విరుచుకుపడుతుందని
వాడి వెన్నులో వణుకు
నాటిన ప్రతి మొక్క
ఓ ఆయుధ భాండాగారమౌతుందేమోనని
కలవరింత
కాకులే కాపలాగా
అరిచే అరుపు
ఎరుపై మూకుమ్మడి దాడి చేస్తారేమోననే
భావి స్వప్నం
వాడ్ని నిదుర పోనీయట్లేదేమో
శరదృతువు లో
కాచే వెన్నెల్లో
పల్లె బతుకుల్లో వెలుగులు నింపే
దారులు వెతికే పనుల్లో సేద్యగాళ్ళు
వాడ్ని
నిలువెత్తు గొయ్యిలో
పాతరేసి హేమంతాన్ని ఆహ్వానిద్దామనే
ఆకాంక్ష నేడు కాక పోయినా రేపైనా
నెరవేరుతుంది లే