ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2018 జనవరి నుండి 30 పోలీసు చట్టంను అమలుచేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల గొంతు నొక్కుతున్నది. 30 పోలీసు ఆక్ట్ అనేది ఎమర్జెన్సీ పరిస్థితులను పోలిన చట్టం. జిల్లా సూపరింటెండెంట్ లేదా అసిస్టెంట్ డిస్ట్రిక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ద్వారా ప్రతి నెల 1 నుంచి నెలాఖరు వరకు నెలరోజుల పాటు పోలీస్ యాక్ట్ నిబంధనలను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. ప్రజా సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, ప్రజలు గుమికూడే కార్యక్రమాలను చేపట్టాలంటే ముందస్తుగా డీఎస్పీ లేదా ఆపై అధికారుల నుంచి అనుమతి పొందాల్సిదే. నెల రోజుల పాటు నిషేధిత ఆయుధాలు, కత్తులు, కర్రలు, జెండా కర్రలు, దుడ్డు కర్రలు, తుపాకులు, పేలుడు పదార్ధాలు, దురుద్ధేశంతో నేరాలకు ఉసిగొల్పే ఎటువంటి ఆయుధాలు, సామగ్రీ కలిగి ఉండొద్దని ఆ ఆర్డర్ లో పేర్కొంటారు. అందుకు వారు చెప్పే సాకు జనజీవాననికి ఇబ్బంది చిరాకు కలిగించేందుకు దారితీసే ఇబ్బందికర ప్రజా సమావేశాలు, జనసమూహం లాంటివి పూర్తిగా నిషేదం. ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం శిక్షకు అర్హులవుతారని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. శాంతి పూర్వకంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తుగా అన్ని వివరాలు వెల్లడిరచి అనుమతులు కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటనలు విడుదలచేస్తున్నారు.సాధారణ ప్రజలు నివసించే ఈ ప్రాంతంలో ఇంత కఠినమైన చట్టాలు అమలు చేయడం ఎందుకోసం?
అనేక సమస్యలకు నిలయమైన ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిపాబాద్ జిల్లాలలోని మెజారిటీ ఆదివాసీ ప్రజలు,దళిత బహుజనులు వారి సమస్యలు బయట ప్రపంచానికి తెలుపలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు నిత్యం తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాల కూంబింగ్ కార్యక్రమంతో ఉమ్మడి జిల్లాల ప్రజలు నిత్య నిర్బంధంలో మగ్గుతున్నారు.
ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలలో పోలీసుల జోక్యం మితిమీరిన సందర్భాలు అనేకం. సాయుధ గ్రేహౌండ్స్ బలగాలు గ్రామాలలో చొరబడకూడదు అని చట్టాలు చెప్తున్నప్పటికీ ఆ నిబంధనలను పోలీసు శాఖ తుంగలో తొక్కుతున్నది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్ నగర్ పట్టణంలో మార్చి 5 వ తేదీన అటవి సంరక్షణ నియమాలు ఉపసంహరించుకోవాలని, ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించినట్లు పోడు భూముల పట్టాలు మంజూరు,పంటలకు గిట్టు బాటు ధరల డిమాండ్లతో నిర్వహించతలపెట్టిన రైతుల జిల్లా సదస్సును 30 పోలీసు ఆక్ట్ అమలవుతున్నందున సభలు, సమావేశాలకు అనుమతి లేదని సదస్సును భగ్నం చేశారు. అంతటితో ఆగకుండా కాగజ్ నగర్లో రైతు సంఘాల నాయకులు సోయం చిన్నన్న, చాంద్ పాషా లను, బెజ్జూర్, కౌటాల మండలాలలో బిఎస్పి నాయకులు అర్షద్ హుస్సేన్ ,సిడం గణపతి లను, పెంచికల్‌పేట మండలంలో మొర్లిగూడ-జిల్లేడలో కొమురంభీం అంబేద్కర్ యువజన సంఘం అద్యక్షులు కోట సతీష్ లను ముందస్తు అరెస్ట్ చేసారు. జిల్లా వ్వాప్తంగా పదుల సంఖ్యలో ప్రజా సంఘాల, యువజన సంఘాల నాయకులకు ముందస్తు అరెస్టులు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. మరో సంఘటనలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా, పెంచికల్‌పేట మండలం మొర్లిగూడ-జిల్లేడ గ్రామాలకు శాశ్వత రోడ్డు నిర్మాణం చేయాలని,గ్రామాలలో నెలకొన్న ఇతర సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా పోరాడుతున్న కొమురంభీం అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కోట సతీష్, కామెర తిరుపతి,బద్ధి శంకర్,తలండి సతీష్ లపై కాగజ్ నగర్ డిఎస్పీ సూచనలతో సి.ఐ నాగరాజు, ఎస్ఐలు 2022,డిసెంబర్ 13 వ తేదీ నాడు కాగజ్ నగర్ సీఐ మిమ్మల్ని పిలుస్తున్నారని పెంచికల్‌పేట ఎస్సై పిలిపించారు. అక్కడ నుంచి దహేగాం పోలీస్ స్టేషన్‌కు వెళ్ళమన్నారు. అక్కడ వెళ్లి సిఐ నాగరాజుకి కలవగా మీరు విప్లవకారులా? మీతో ఈ పని ఎవరు చేయిస్తున్నారని పలు విధాలుగా విచారించి తిరిగి మేం పిలిచినప్పుడు రావాలని తెలిపారు. మళ్లీ డిసెంబర్ 18వ తేదీన కానిస్టేబుళ్లను కోట సతీష్ ఇంటికి పంపించి సర్కిల్ ఇన్స్పెక్టర్ రమ్మంటున్నారని బెదిరింపులకు గురి చేశారు. అదే రోజు మీకు నక్సల్స్‌తో సంబంధాలు ఉన్నాయని మీ మీద కేసులు వేస్తామని గ్రామంలోని ఆదివాసీ కోయ తెగకు చెందిన యువకులైన తలండి సతీష్ తదితరులను పెంచికల్పేట్ ఎస్సై విజయ్ బెదిరించారు. యువకులపై ఇంతకు ముందు ఎలాంటి కేసులు లేకపోయినా అనాధికారికంగా పోలీస్ ఠానాలకు పిలిచి ఈ విధంగా వేధింపులు చేశారు. ఈ విషయంలో మానవ హక్కుల వేదిక రెండు రాష్ట్రాల సమన్వయకర్త జీవన్ కుమార్ గారు పోలీసులతో మాట్లాడటంతో అప్పుడు వెనక్కి తగ్గారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌లో నివసిస్తున్న ఆదివాసీలు తరచూ ఎదో ఒక అన్యాయానికి గురౌతూ వారి సమస్యలపై పోరాడాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. పాలకులు పులుల సంరక్షణ పేరుతో టైగర్ జోన్,టైగర్ కారిడార్ లను నెలకొల్పి ఆదివాసీలను నిర్వాసితులు చేస్తున్నారు.అనేక సందర్బాలలో పులుల దాడులలో ప్రజలు మరణిస్తున్నారు. ఆదివాసీలు నివసిస్తున్న ఐదవ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఓపెన్ కాస్ట్ గణులు తవ్వకాలు చేపడుతున్నారు.మరో వైపు పారెస్టు అధికారులు, సిబ్బంది ఆదివాసీలపై తరచూ దాడులకు పాల్పడుతున్నారు.2023,జనవరి 25 వ తేదీన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో పొయ్యి కట్టెలు (వంట చెరుకు) కోసం అడవికి వెళ్ళిన ఆదివాసీ కోవ లింబరావు పై అటవీశాఖ సిబ్బంది తీవ్రంగా దాడి చేయడంతో అతని కాళ్ళు చేతులు పనిచేయడం లేదు.అంతకు ముందు మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలన కోయపోచగూడలో ఆదివాసీ మహిళలపై దాడి చేశారు. కేసులు నమోదు చేసి జైల్లో నిర్బంధించారు.కోయ తెగకు చెందిన ఆదివాసీలు మెజరిటీగా నివసిస్తున్నప్పటికీ ఆసిపాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ పదుల గ్రామాలను ఏజెన్సీ ప్రాంతాలుగా నోటిపై చేయలేదు.గిరిజన సంక్షేమ శాఖ,రాష్ట్ర ప్రభుత్వం ఆ గ్రామాలో నివసిస్తున్న ఆదివాసుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.కనీసం ఉండటానికి పక్కా ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టడం లేదు.ఐదవ షెడ్యూల్ రాజ్యాంగ హక్కులను, పెసా, 1/70, అటవీ హక్కుల చట్టాలను అమలు చేయడం లేదు. ఈ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక శాపంగా మారింది.ప్రతి ఏడాది కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో వందల ఎకరాల పంటలు ముంపుకు గురవుతున్నాయి. మరో వైపు గత ఏడాది వర్షకాలంలో ఆసిఫాబాద్ జిల్లాలోని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు సంక్షేమ వసతిగృహాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు విషజ్వరాల బారిన పడి,అధికారులు సకాలంలో ఆసుపత్రిలో చేర్పించలేకపోవడంతో మరణించారు.
ఈ విధమైన సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పోరాటంలోకి వస్తున్న సందర్బంలో వారిని 30 పోలీసు ఆక్ట్ పేరుతో అణచివేస్తున్నారు. రాజ్యాంగపరమైన ప్రాథమిక హక్కులు నిరాకరిస్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కార మార్గాలు చూపడం లేదు,అందుకు నిరసన తెలిపితే కేసులు నమోదు చేస్తున్నారు. మరో కాశ్మీర్ లోయ లాగా ఉమ్మడి జిల్లాలను మార్చి వేశారు. ఈ సందర్భంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ప్రజల రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు అండగా నిలుస్తూ,వారి భావ ప్రకటన స్వేచ్ఛను,ఆదివాసీల స్వయం పాలన డిమాండ్లను ఎత్తిపడుదాం.