తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాము అని చెప్పుకుంటున్న గురుకులాలు, కస్తూర్బాగాంధీ పాఠశాలలు, తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బిసి సంక్షేమ హాస్టళ్లు పేద విద్యార్థుల పట్ల శాపంగ మారాయి. గత రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కేసులు వందలలో నమోదు కాగా వేల మంది విద్యార్థులు అస్వస్థతకు గురై అనారోగ్యం బారిన పడినారు. ఈ పరిస్థితి కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో అత్యంత తీవ్రంగా ఉంది. ఫుడ్ ఫాయిజన్ ఘటనలతో పాటు ఈ జిల్లాలలో ఆగస్టు నెలలో ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, గురుకులాలలో జ్వరంబారిన పడి నలుగురు విద్యార్థులు చనిపోవడం ఆదివాసీ జిల్లాలలోని వసతిగృహలలో తీవ్ర నీర్లక్ష్య పరిస్థితికి అద్దం పడుతున్నాయి. రాష్ట్రంలో వసతి గృహ విద్యార్థుల పరిస్థితి నానాటికీ దిగజారుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా హాస్టళ్ల సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించకపోవడం బాధాకరం.
పేదరికంతో పిల్లలను ఇంటి వద్ద ఉంచి చదివించలేక ప్రైవేటు కార్పొరేటు విద్యాసంస్థలలో చేర్చే ఆర్థిక స్థోమతలేక, భోజన వసతి మరియు విద్యాబోధన ఉచితంగా లభిస్తుందని ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థులను చేరిస్తే విద్యార్థులు ఇంటికి శవమై తిరిగివస్తున్నారు. ఆగస్టు 9వ తేదీ నాడు ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న ఆదివాసీ ‘కొలాం’’ తెగకు చెందిన కవిత అనే విద్యార్థిని తీవ్ర అనారోగ్యంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది (కొలాం తెగ ప్రపంచ వ్యాప్తంగా అంతరించిపోతున్న తెగల జాబితా (Particularly Vulnerable Tribal Group PVTG) లో ఉంది. విద్యార్థిని తండ్రి మాట్లాడుతూ తన బిడ్డను పాఠశాల యాజమాన్యం సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లకపోగా తమకు కూడా తెలపడంలో ఆలస్యం చేశారని ఆరోపించారు. ఆగస్టు 20వ తేదీన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాల, ఎల్లూరులో పదవ తరగతి చదివే ఆలం రాజేష్ అనే ఆదివాసీ విద్యార్థి తీవ్ర జ్వరం బారిన పడినారు. పాఠశాల యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వహించి ఆస్పత్రికి తరలించగా పోగా మూడు రోజుల అనంతరం తల్లిదండ్రులకు తెలపడంతో వారు 24వ తేదీ నాడు కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ పరిస్థితి విషమించి, జిల్లా ఆస్పత్రికి తరలించే మార్గమధ్యలోనే చనిపోయాడు. ఇదే జిల్లాలోని సిర్పూర్(టి) నియోజకవర్గం కేంద్రంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న అశ్విని ఆగస్టు 24వ తేదీన జ్వరం బారిన పడగా యాజమాన్యం నిర్లక్ష్యం చేసి చివరికి నాలుగు రోజుల తర్వాత తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించడంలో నాలుగు రోజులు ఆలస్యం కావడంతో ఆ విద్యార్థిని ఆగస్టు 28న మరణించింది. ఆసిఫాబాద్ జిల్లాలోని బూరుగూడ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో లౌడ్య సంగీత అనే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న గిరిజన విద్యార్థిని వారం రోజులుగా తీవ్ర అనారోగ్యంతో కళాశాల హాస్టల్‌లో ఉండగా చివరికి తల్లిదండ్రులు కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తే చికిత్స పొందుతూ ఆగస్టు 31వ తేదీనాడు చికిత్స పొందుతూ మరణించింది. పాఠశాలల, కళాశాలల యాజమాన్యం నిర్లక్ష్యం, పర్యవేక్షణలోపంతో సకాలంలో వైద్య సదుపాయం అందక అనారోగ్యం బారిన పడిన ఈ నలుగురు విద్యార్థులు చనిపోయారు.వీరు విద్యాభ్యాసిస్తున్న ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ పాఠశాలలు, గురుకులాలలో కనీసం తాగడానికి క్లోరినేషన్ చేసిన మంచినీరు లేకపోగా బోర్ నీళ్ళే తాగుతున్నారు. ఈ హాస్టళ్లలో అందిస్తున్న ఆహార నాణ్యతపై పర్యవేక్షణ కొరవడిరది. సంక్షేమ హాస్టళ్లలో భోజన మెనూ పౌష్టిక ఆహారాన్ని అందించేదిగలేదు.
కస్తూర్బా గాంధీ విద్యాలయాలను ఇంటర్మీడియట్ కళాశాలగా అప్గ్రేడ్ చేసిన ప్రభుత్వ పాలకులు అదనపు తరగతి గదుల నిర్మాణం, అదనపు వసతి గదులు, శౌచలయాలు నిర్మాణం చేయటం మర్చిపోయారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మరియు రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లలో అపరిశుభ్ర వాతావరణం రాజ్యమేలుతూ, వసతి గృహాలు సమస్యల నిలయాలుగా మారినాయి.
తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలను గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఐటీడీఏలు నిర్వహిస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా బాలబాలికల 44 ఆశ్రమ పాఠశాలలు ఉండగా ఇక్కడ విద్యార్థుల అనారోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఒక్క పాఠశాలలో కూడా వైద్యాధికారి లేదా స్టాఫ్ నర్స్ లేరు. అసలు ఈ పాఠశాలలో వైద్య అధికారిని నియమించే విధానాన్ని ఐటీడీఏ చేపట్టడమే లేదు.కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, అదేవిధంగా నూతనంగా ప్రారంభించిన గురుకులాలలో ఇదే పరిస్థితి నెలకొన్నది. విద్యార్థులు అనారోగ్యం బారిన పడితే మండల కేంద్రంలోని పి.హెచ్.సి లేదా నియోజకవర్గం కేంద్రంలోని సి.హెచ్.సి ఆసుపత్రులకే వెళ్ళాలి. అత్యంత మారుమూల జిల్లాలు అయినా ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో పి.హెచ్.సిలలో వైద్య అధికారులు అందుబాటులో ఉండకపోగా అక్కడ రోగనిర్ధారణ పరీక్షలు చేయడం లేదు. ఒకవైపు ఆదివాసి గూడేలలో విద్యార్థుల తల్లిదండ్రులు అనారోగ్యం బారిన పడి వైద్యం అందక మరణిస్తూ ఉంటే మరోవైపు ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు మరణించడం ఆదివాసీల రక్షణ పట్ల ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, కపటత్వం అర్థమవుతున్నది. ఆశ్రమ పాఠశాల విద్యార్థులు చనిపోయినప్పుడు స్థానిక ఐటిడిఎ పిఓ మరియు అధికారులు రావటం విద్యార్థుల తల్లిదండ్రులకు అంత్యక్రియల నిమిత్తం పదివేల రూపాయలు సాయం ప్రకటించడంతోనే సరిపెడుతున్నారు. విద్యార్థుల సంక్షేమానికి శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఆశ్రమ పాఠశాలలను గురుకులాలను సందర్శించిన అక్కడ పరిస్థితులను సౌకర్యాల కల్పనను తెలుసుకోవడం లేదు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలలో మెజారిటీగా ఉండేది ఆదివాసి విద్యార్థులు, దళిత విద్యార్థులు, మిగతా ఉత్పత్తి కులాలకు చెందినటువంటి విద్యార్థులు. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల విద్యా అభివృద్ధి పట్ల పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడంతోనే ఈ యొక్క వసతులు కల్పించలేని పరిస్థితిని కొనసాగిస్తున్నారు.
పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో దళిత బహుజన విద్యార్థులు సామాజిక అభివృద్ధికి దూరంగా నెట్టివేసే పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల మరణాలు పెరిగే అవకాశం ఉన్నది. వెంటనే తెలంగాణ గిరిజన మంత్రిత్వ శాఖ, ఐ.టి.డి.ఎల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలలో ఆదివాసి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. అనారోగ్యం బారిన పడ్డ విద్యార్థులకు సకాలంలో వైద్య సదుపాయం అందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆయా పాఠశాలల కళాశాలల యాజమాన్యం,అధికారులపై కేసు నమోదు చేసి వారిని విధుల నుండి తొలగించాలి. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో, సంక్షేమ హాస్టళ్లలో హెల్త్‌క్లినిక్‌లను ఏర్పాటుచేసి వైద్య అధికారి, స్టాఫ్ నర్సులను నియమించాలి. విద్యార్థుల మెస్‌చార్జీలు పెంచి నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలి. అదేవిధంగా నెలకు సరిపడా డిటర్జెంట్ సబ్బులు, శానిటైజర్ కొనుగోలు, ఇతర వ్యక్తిగత అవసరాలను తీర్చేందుకు కాస్మోటిక్ ఛార్జీలను 500 రూపాయలకు పెంచాలని, ప్రతి మండలంలోని హాస్టళ్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని పెద్దఎత్తున విద్యార్థులు ఉద్యమించాల్సిన అవసరం నేడు ఉంది.
కోట ఆనంద్,
కుల నిర్మూలన వేదిక (కె.ఎన్.వి), రాష్ట్ర కార్యదర్శి