రాజ్యంగ వ్యతిరేక ఫాసిస్టు దాడులపై ప్రజాస్వామిక శక్తులను ఐక్యం చేద్దాం

ఏప్రిల్‌ 7వ తేదీ శుక్రవారం దండకారణ్యంలో మరోసారి భారత ప్రభుత్వం వైమానిక దాడులు చేసింది. ఈ ఏడాది జనవరి 11న  గగన తల దాడులు జరిగిన మూడు నెలలకల్లా మరోసారి డ్రోన్ల నుంచి  బాంబులు విసిరారు. పామేడు ప్రాంతంలోని బట్టిగూడ, కవరగట్ట, మీనగట్ట,  జబ్బగట్ట గ్రామాల పరిధిలో తెల్లవారు జామున  ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఆదివాసులు ఆ సమయంలో విప్ప పూలు ఏరుకోడానికి అడవిలోకి వెళ్లారు. కొందరు పొలాల్లో పనులు చేసుకుంటున్నారు. ఉదయం 6 గంటలకు మొదలైన బాంబు దాడులు ఐదు నిమిషాల వ్యవధిలో వేర్వేరు ప్రాంతాల్లో  జరిగాయి. ఆ తర్వాత సైనికులు హెలికాప్టర్లలో అక్కడికి వచ్చి కాల్పులు జరిపారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, చత్తీస్‌ఘడ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సంయుక్తంగా ఈ దాడులకు పాల్పడుతున్నాయి. దేశ ప్రజలయిన ఆదివాసుల మీద వైమానిక దాడులు చేయడం రాజ్యాంగ విరుద్ధం. దేశాల మధ్య యుద్ధాలకు కూడా అంతర్జాతీయ నిబంధనలు ఉన్నాయి. అలాంటిది దేశ పౌరుల మీద ఇట్లా దాడులు చేయడం ద్వారా పాలకులు ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదని, తాము రాజ్యాంగాన్ని పాటించదల్చుకోవడం లేదని బాహాటంగా ప్రకటిస్తున్నారు.

మధ్య భారత దేశంలోని విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి, దండకారణ్య ప్రాంతం నుంచి సహజ వనరులను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడానికి ప్రభుత్వం చేపట్టిన సమాధాన్‌లో భాగమే ఈ వైమానిక దాడులు. దేశ ప్రజలందరికీ చెందవలసిన సహజ సంపదను కార్పొరేట్లకు ధారాదత్తం చేయడాన్ని ఆదివాసులు ఒప్పుకోవడం లేదు.  స్వావలంబన, సమిష్టీకరణ ప్రాతిపదికలపై దేశ ఆర్థిక వ్యవస్థ దళారీ పెట్టుబడిదారుల పట్టు నుంచి, సామ్రాజ్యవాద దోపిడీ నుంచి బైటపడుతుందనే విప్లవాత్మక ప్రయోగాన్ని దండకారణ్య ఆదివాసులు చేస్తున్నారు. దాన్ని దెబ్బతీయడానికి కేంద్రంలోని ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వం ఇంత క్రూరమైన దాడులు చేస్తున్నది.

ఇది భారత రాజ్యం ప్రకటించుకున్న రాజ్యంగబద్ధత, చట్టబద్ధ పాలన వంటి విలువలకు, విధానాలకు వ్యతిరేకం. గత కొద్ది కాలంగా ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న సైనిక చర్యలకు వ్యతిరేకంగా దేశమంతా నిరసన వ్యక్తమవుతున్నది. ఆదివాసులు కూడా ఈ దేశ పౌరులే.. రాజ్యాంగం   వారికి ప్రత్యేక రక్షణను కల్పించింది..ముఖ్యంగా పెసా చట్టం వంటివాటిని ప్రభుత్వాలు కాలరాస్తూ అడవిలోకి చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నాయి.. అని ప్రజాస్వామిక వాదులు ఆందోళన చేస్తున్నారు.

ఇప్పుడు నేల మీది సైనిక చర్యలను దాటి ప్రభుత్వం  ఏకంగా డ్రోన్ల, వైమానిక దాడులకు పాల్పడుతున్నది. ఈ దుర్మార్గాన్ని, రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఖండిరచాలని విరసం ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు విజ్ఞప్తి చేస్తోంది. ఇది కేవలం ఆదివాసుల రక్షణ ఉద్యమంగానే కాక కార్పొరేకటీకరణకు, సైనికీకరణకు వ్యతిరేకంగా సాగవలసిన విశాల ప్రజాతంత్ర ఉద్యమంలో భాగం కావాలి. దాని కోసం భిన్న ప్రజాస్వామిక భావజాలాలు ఉన్న వ్యక్తులు, సంస్థలు, పార్టీలు కనీస కార్యక్రమం మీద ఐక్యం కావాలని విరసం కోరుకుంటున్నది. ప్రజాస్వామిక విలువల ప్రాతిపదికగా ఐక్యమై ఆదివాసులపై సైనిక చర్యలను, డ్రోన్‌ దాడులను, వైమానిక యుద్ధాన్ని అడ్డుకోడానికి చేయి చేయి కలపాలని పిలుపు ఇస్తోంది.        

10.4.2023

Leave a Reply