ఆహ్వానం
దండకారణ్యం శతృదేశమా?
ఆదివాసుల మీద వైమానిక దాడులు ఎందుకు చేస్తున్నారు?
చర్చా కార్యక్రమం
21 మే, 2023 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5.30 దాకా

మిత్రులారా

చత్తీస్‌ఘడ్‌లోని ఆదివాసీ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా డ్రోన్లు, హెలికాప్టర్లతో దాడులు చేస్తున్న సంగతి మీకు తెలిసిందే.  ఈ దాడులు మొదట 2021 జూన్‌ 19న బీజాపూర్‌ జిల్లాలో బొట్టలంక, పాలగూడెం గ్రామాల మీద మానవ రహిత డ్రోన్లతో  12 బాంబులు వేయడంతో మొదలయ్యాయి. ఆ తర్వాత 2022 ఏప్రిల్‌ 14, 15 తేదీల మధ్య రాత్రి బీజాపూర్‌, సుక్మా జిల్లాల మధ్య ఉన్న బొట్టెంతోగె, మెట్టగూడెం, దులోడ్‌, సక్లెట్‌, పొట్టెమంగి గ్రామాల  మీద డ్రోన్లతో బాంబులు వేశారు. మళ్లీ 2023 జనవరి 11న తెల్లవారుజామున అదే  ప్రాంతంలో  భారత ప్రభుత్వ హెలికాప్టర్లలో  కోబ్రా కమాండోస్‌, సిఆర్‌పిఎఫ్‌ సైనికులు వెళ్లి బాంబులు వేశారు. ఆ తర్వాత కాల్పులు జరిపారు. మరోసారి ఏప్రిల్‌ 7వ తేదీ ఇలాగే  బాంబు దాడులు చేశారు. మూడోసారి జరిగిన దాడుల్లో ఉన్గి అనే ఆదివాసీ యువతి చనిపోయింది. అనేక మంది గాయపడ్డారు.

ఈ ఘటనల మీద ఎప్పటికప్పుడు నందినీ సుందర్‌, భేలాబాటియా, సోనీసోరీ వంటి హక్కుల కార్యకర్తలు, మేధావులు స్పందించి తమ నిరసన తెలియజేస్తున్నారు. ఇటీవల సీడీఆర్‌వో అఖిల భారత బృందం నిజ నిర్ధారణ నివేదికను వెల్లడి చేసింది. బైటి దేశాల్లోని ప్రజాస్వామిక సంస్థల నాయకులు, మేధావులు ఈ దాడులను ఖండిరచారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రజల మీద చేస్తున్న యుద్ధంగా దీన్ని అనేక మంది భావిస్తున్నారు.

రాజ్యాంగంలో ఆదివాసులకు ఉన్న ప్రత్యేక రక్షణ చట్టాలకు భిన్నంగా ఆ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా పెసా చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయడం లేదు. గ్రామసభల నిర్ణాయకతను పరిగణలోకి తీసుకోకుండా ఆ ప్రాంతాల్లో గనుల తవ్వకం, పర్యాటకం, సైనిక క్యాంపుల ఏర్పాటుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇది ఆదివాసుల జీవితాన్ని, సంస్కృతిని దెబ్బతీస్తున్నది. అందుకే ఆదివాసులు గత మూడేళ్లుగా సిలింగేర్‌లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున శాంతియుత ఆందోళనలు చేస్తున్నారు. గ్రామ సభల తీర్మానాలు లేకుండా కార్పొరేట్‌ సంస్థలకు, సైనిక క్యాంపులకు అడవిలోకి అనుమతి ఇవ్వమని ధర్నాలు, ఊరేగింపులు, ప్రదర్శనలు చేస్తున్నారు. ఇది వాళ్ల హక్కుల పోరాటమే కాదు. ఇందులో  పర్యావరణ పరిరక్షణ కోణం కూడా ఉన్నది. ముఖ్యంగా హస్‌దేవ్‌ అడవులను కార్పొరేట్ల నుంచి కాపాడుకోడానికి ఏడాదికిపైగా అక్కడి ఆదివాసులు పోరాడుతున్నారు. దాన్ని లెక్క చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 20న  హస్‌దేవ్‌ అభయారణ్యాల్లో మూడు వేల ఎకరాలను అదానికి ఇచ్చేసినట్లు వార్తలు వచ్చాయి. అదానిలాంటి కార్పొరేట్‌ సంస్థలను అడవిలోకి అనుమతించమని దండకారణ్యంలోని వేర్వేరు ప్రాంతాల్లో పోరాడుతున్న ఆదివాసులతో   ప్రభుత్వం చర్చించి పెసా చట్టం అమలు విషయంలో హామీ ఇవ్వకపోగా డ్రోన్‌ దాడులను ఆరంభించింది.

ఈ మొత్తంలో ఆదివాసుల అస్తిత్వ సమస్య ఉన్నది. ప్రభుత్వ అభివృద్ధి నమూనా వల్ల ఈ ఘర్షణ జరుగుతున్నది. రాజ్యాంగ మార్గదర్శకత్వంలో సాగవలసిన చట్టబద్ధ పాలన లోపించింది. ఆదివాసీ ప్రాంతాల్లోకి గ్రామ సభల అనుమతి లేనిదే ప్రభుత్వం కూడా అభివృద్ధి పేరుతో ఎలాంటి పనులు చేపట్టడానికి లేదని రాజ్యాంగం చెబుతోంది. కానీ ప్రభుత్వం తన అభివృద్ధి నమూనాను ఆదివాసుల మీద బలవంతంగా రుద్దుతోంది. దాని వాళ్లు వ్యతిరేకిస్తున్నారు. దీని పర్యవసానమే ఈ వైమానిక దాడులు.

ఈ సమస్యపై విరసం ఒక చర్చా కార్యక్రమం ఈ నెల 21న ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5.30 దాకా    హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం(బాగ్‌లింగంపల్లి) షోయబ్‌ హాల్‌లో తలపెట్టింది. రాజ్యాంగంలోని వైరుధ్యాలు`ఆదివాసులు, కార్పొరేటీకరణ`అణచివేత రూపాలు, ఫాసిజం`వైమానిక దాడులు అనే అంశాలు కేంద్రంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఈ ప్రణాళిక రూపొందించాం. ఇందులో మీరు తప్పక పాల్గొని మాట్లాడాలని కోరుతున్నాం.

అరసవిల్లి కృష్ణ(అధ్యక్షుడు)

రివేరా (కార్యదర్శి)

Leave a Reply