అమెరికా అధ్యక్ష పీఠంపై  ఎవరున్నా దాని సామ్రాజ్యవాద విధానాల్లో మార్పు ఉండదన్న విషయాన్ని డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ తన భౌగోళిక రాజకీయ విధానాల ద్వారా రుజువు చేస్తున్నారు. ట్రంప్‌ విధానాల వల్ల దూరం జరిగిన మిత్రులను ఒకటి చేసే పనిలో బైడెన్‌ నిమగ్నమై ఉన్నారు. కొంత కాలంగా జి-20 దేశాల ప్రాధాన్యత పెరుగుతున్న దృష్ట్యా అమెరికా నాయకత్వంలోని పాత సామ్రాజ్యవాద కూటమి అయిన జి-7 దేశాల ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. బైడెన్‌ అమెరికా అధ్యక్షుడు అయ్యాక తిరిగి అమెరికా ప్రపంచ ఆధిపత్యం కోసం పాత మిత్రులందరిని సమన్వయం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు.. అమెరికా ప్రపంచ ఆధిపత్య స్థానంలో ఉండాలనే లక్ష్యంతో బైడెన్‌కు స్పష్టత ఉంది. అంటే ప్రపంచ ఆర్థిక, రాజకీయ, సాంకేతిక, సైనిక పరిణామాలకు అమెరికా ఏకైకా నాయకత్వ కేంద్రం (యూని పోలార్‌)గా ఉండాలనే సంకల్పాన్ని బైడెన్‌ తన పాలన తొలినాళ్ల నుంచే కొనసాగిస్తున్నారు. అది సాధించడమే అమెరికా విదేశాంగ విధానానికి చోదకశక్తిగా ఉంటుంది.

బైడెన్‌ అధికారం చేపట్టిన (జనవరి 20) వెంటనే పారిస్‌ వాతావరణ ఒప్పందంలో చేరుతున్నట్లు ప్రకటించడం ఒక సానుకూల పరిణామం. ఇతర దేశాల నుంచి నైపుణ్యం గల వారికి అమెరికా రావడానికి వీసాలు ఇస్తామనడం మరో సానుకూలాంశం అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థలోనూ తిరిగి చేరడం వంటి కొన్ని సానుకూల చర్యలు మినహా మిగతా చర్యలన్ని చేజారిపోతున్న అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి యుద్ధోన్మాదం వైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతున్నది. నిజానికి అమెరికా సంపదను సృష్టంచింది విదేశీ శ్రామికులు. బుద్ధిజీవులు అన్నది అక్షర సత్యం. అమెరికా కార్పొరేట్లది పెట్టుబడి కాగా విదేశీ శ్రామికుల చెమటనే అమెరికా పారిశ్రామికంగా అగ్ర దేశంగా ఎదిగిందన్నది వాస్తవం. బైడెన్‌ సంపద పెరగాలంటే విదేశీ శ్రామికులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు అవసరమని గుర్తించాడు. అందువల్లనే ‘వీసా’ నియంత్రణలు సరళతరం చేశాడు. ఇది ఇతర దేశస్తులపై ప్రేమ కాదు.. అది వారి అవసరాల నిమిత్తమే ఈ నిర్ణయం జరిగిందని అర్థం చేసుకోవాలి. అమెరికా ఆధిపత్యానికి సవాలు విసురుతున్న ఉత్తరకొరియా, చైనా, ఇరాన్‌, రష్యా, వెనిజులా వంటి దేశాల పురోగమనాన్ని అడ్డుకోవడానికి ప్రణాళికల రూపకల్పన మొదలైంది.

సామ్రాజ్యవాద యుగంలో అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులంటూ ఎవరూ ఉండరు. ఉండేవి శాశ్వత  ప్రయోజనాలు మాత్రమే, ఇప్పుడు అమెరికా-చైనాల ఆధిపత్యం కింద భిన్న ధృవ ప్రపంచం ఏర్పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికైతే చైనా, రష్యా, ఇరాన్‌, ఉత్తర కొరియా బహిరంగంగా తమ మధ్య దగ్గరి సంబంధాలను కొనసాగిస్తున్నాయి. చైనా రోడ్‌ అండ్‌ బెల్ట్‌ ఇనిషివెటివ్‌ పతకం క్రింద ఆసియా, ఆఫ్రికా యూరప్‌లోని పలు దేశాల్లో తన పెట్టుబడుల ప్రకారం కొనసాగిస్తోంది. దీన్ని అడ్డుకోవడం అమెరికాకు తక్షణ సవాలుగా నిలిచింది. ఫలితంగా ప్రపంచంలో అస్థిరత, కలహాలు పెరుగవచ్చు. దీన్ని నివారించే సామర్థ్యం ఐరాస, భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలు కోల్పోయాయి. అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, చైనాలు వీటో అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం వల్ల ఐ.రా.సలో సమిష్టి నిర్ణయాలు జరుగడం లేదు. పర్యావసానంగా ఐ.రా.స ఉత్సవ విగ్రహంగా మారింది.

బైడెన్‌ అధికారం చేపట్టి నాలుగు మాసాలు తిరుగక ముందే వరుసగా జరిగిన ఐదు అంతర్జాతీయ వ్యూహాత్మక సమావేశాల్లో అమెరికా వైఖరి కయ్యానికి కాలు దువ్వే విధంగానే ఉంది. మొదటి సమావేశం ఫిబ్రవరి 17, 18 తేదీల్లో బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ‘నాటో’ రక్షణ మంత్రుల ఆన్‌లైన్‌ సమావేశం జరిగింది. లాయిడ్‌ జె ఆస్టిన్‌ అమెరికా రక్షణ కార్యదర్శిగా పాల్గన్నారు. నాటో కూటమిలో అమెరికా సంబంధాన్ని పునరుజ్జీవింపజేయడమే లక్ష్యమన్నారు. 2024 నాటికి జిడిపిలో 2 శాతం రక్షణకు కేటాయించడాన్ని అన్ని దేశాలు అంగీకరించాయి. ట్రాన్స్‌ అట్లాంటిక్‌ భద్రతకు నాటో అవసరమన్నారు. నాటో ప్రధాన కార్యదర్శి స్టోలెన్‌ బెర్గ్‌ 2010లో రూపొందించిన నాటో వ్యూహాన్ని ప్రస్తుతం చైనా, రష్యాల నుండి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనే విధంగా మార్పు చేయాల్సిన అవసరము ఉందన్నాడు. నాటో దేశాలు రష్యా, చైనా నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నాయని, వాటి దూకుడును అస్థిరపరచాలని పిలుపునిచ్చాడు. అమెరికా అధికారులు చైనా, రష్యాలను నిలువరించే అంశాన్ని చర్చకు పెట్టారు. రష్యా వల్ల అమెరికాతో సహా నాటో కూటమిలోని 30 దేశాలకు ముప్పు పొంచి ఉందనీ అమెరికా భావన. నియమాల ఆధారంగా నిర్మితమైన అంతర్జాతీయ వ్యవస్థను ధ్వంసం చేయడానికి రష్యా పూనుకుందని అమెరికా ఆరోపణ చేస్తోంది.
    
రెండవ సమావేశం ఫిబ్రవరి 19న ఆన్‌లైన్‌లో జరిగిన మ్యూనిచ్‌ (జర్మనీ) భద్రతా వార్షిక సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా ‘రోడ్‌ టూ మ్యూనిచ్‌’. దీని నేపథ్యం అట్లాంటిక్‌ సంబంధాల పునరుద్ధరణ మరియు కీలకమైన భద్రతా విధాన సవాళ్లపై చర్చించడం జరిగింది. ఈ ఆన్‌లైన్‌ సమావేశంలో జో బైడెన్‌, ఏంజెలా మెర్కెల్‌, ఇమ్మాన్యుయేల్‌ మాడ్రాన్‌, బోరిస్‌ జాన్సన్‌, ఆంటోనియా గుటెర్రెస్‌, జెన్స్‌ స్టోలెన్‌బర్గ్‌, ఉర్సులా వాన్‌ డెర్‌ లేయస్‌, చార్లెస్‌ మిచెల్‌, టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసఫ్‌, జాన్‌ ఎఫ్‌, కెర్రి మరియు బిల్‌గేట్స్‌ పాల్గోన్నారు. ఈ సమావేశంలో బైడెన్‌ మాట్లాడుతూ ‘అమెరికా తిరిగి వచ్చింది’ అని ప్రకటించాడు. మరియు అట్లాంటిక్‌ సంబంధాన్ని పునరుద్ధరించడమే తన ప్రాధాన్యత అని పేర్కొన్నాడు. జర్మనీ నుండి 12 వేల మంది అమెరికా సైనికులను ఉపసంహరించుకోవాలని ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని తాను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించాడు. ఇది రష్యా కట్టడికి అని అర్థం చేసుకోవాలి.
    
మూడవది జి-7 దేశాల ఆన్‌లైన్‌ సమావేశం ఫిబ్రవరి 19న యూకే అధ్యక్షుడు బోరిస్‌ జాన్సన్‌ నేతృత్వంలో జరిగింది. కొవిడ్‌-19 ఎదుర్కోవడంలో ఐక్యంగా కృషి చేయాలని నిర్ణయించారు. జూన్‌ 11-13న లండన్‌లో జరిగే జి-7 విదేశాంగ మంత్రుల సమావేశానికి ముందుగా జరిగిన ఈ సమావేశంలో కొవిడ్‌ అనంతర సంక్షోభాన్ని నివారించడం ఎలా అన్నది ప్రధాన ఎజెండా. ట్రంప్‌ విధానాల వల్ల దూరమైన మిత్రులను ఒకటి చేసి చైనాకు వ్యతిరేకంగా నిలుపడం అమెరికా ఎజెండా. ఆర్థికంగా, సాంకేతికంగా దూసుకెళ్తున్న చైనాను కట్టడి చేయడం అమెరికాకు పెద్ద సవాలుగా మారింది. అందుకు జి-7 కూటమిని చైనాకు వ్యతిరేకంగా నిలబెట్టడం కోసం బైడెన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోన్నాడు.
    
నాల్గవది మార్చి 12న అమెరికా, ఆస్ట్రేలియా, భారత్‌, జపాన్‌ దేశాల మధ్య జరిగిన చతుర్ముఖ కూటమి(క్వాడ్‌) సమావేశం, దీన్ని చారిత్రకమైనదిగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేవ్‌ సులివాన్‌ పేర్కొన్నారు. ప్రధానంగా అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్న చైనాను చుట్టిముట్టి నిలువరించేందుకు దశాబ్దం క్రితమే అమెరికా ఈ వ్యూహాత్మక కూటమిని రూపొందించింది. ఆసియాలో మినీ నాటోగా పిలువబడుతున్న ఈ నాలుగు దేశాల కూటమి ప్రధాన లక్ష్యం. తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో నియమాల ఆధార సముద్రయానానికి ఎదురవుతున్న సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కొనడం, నౌకాయాన భద్రతను కాపాడడం లక్ష్యాలుగా పైకి చెబుతున్నప్పటికీ చైనాను అడ్డుకోవడమే దాని లక్ష్యం. ఇండో పసిఫిక్‌ ప్రాంత సైనికీకరణకు ప్రాధాన్యత పెంచుతున్నట్లు బైడెన్‌ తెలిపాడు. అలాగే ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహిత దేశంగా మార్చడం కూడా అమెరికా ప్రాధాన్యతలలో ఒకటిగా ఉంది. ఈ నాలుగు దేశాల కూటమి అమెరికాతో ‘నిసార్‌’ ప్రయోగం, జపాన్‌తో ‘టాపెన్స్‌ మిషన్‌’, ఆస్ట్రేలియాతో ట్రాకింగ్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌  ఫర్‌ ‘గగన్‌ యాన్‌’ వంటి ప్రాజెక్టులను నిర్వహిస్తారు.

అలస్కా సమావేశం :
    
ఐదవది అమెరికా- చైనా విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం మార్చి 19న అలస్కాలోని ఆంఖోరేజ్‌లో జరిగింది. దీనికి అమెరికా విదేశాంగ మంత్రి అంటోని  బ్లింకెన్‌, జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులివాన్‌, చైనా తరపున ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్‌ యి, విదేశీ విధాన నిర్ణయ అధికారి యాంగ్‌ జీచి పాల్గన్నారు. ఉమ్మడి పత్రికా గోష్టిలో అమెరికా ప్రతినిధులు దౌత్య మర్యాదలను విస్మరించి చైనాపై తీవ్రంగా ఆరోపణలు చేశారు. చైనాకు వ్యతిరేకంగా సైనిక కూటములు, వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేయనున్నట్లు బహిరంగంగా ప్రకటించాడు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకోవడం కాకుండా వాటిని మరింత విషతుల్యం చేసేందుకు అలస్కా సమావేశాన్ని అమెరికా వినియోగించుకుంటుందని గుర్తించిన చైనా ప్రతినిధులు అదే విలేకర్ల సమావేశంలో అమెరికా ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ అమెరికా ఆధిపత్య ధోరణిని దుయ్య బట్టారు. ఐరాస నిర్ణయాలను చైనా కట్టుబడి ఉంది. కండబలంతో ఇతర దేశాల మీద ఎక్కడ మేం దురాక్రమణ చేయలేదు. దేశాధినేతలను హత్య చేయలేదు. కుట్రలతో ఏ దేశ ప్రభుత్వాలను కూల్చలేదు మీలాగా అంటూ అమెరికా పద్ధతిని చైనా ప్రతినిధులు నిర్మోహమాటగా ఎండగట్టారు. చైనా సైబర్‌ దాడులు చేస్తుందని చేసిన ఆరోపణను తిప్పి కొడుతూ ‘సైబర్‌ దాడులు చేయడంలోనూ అమెరికా ప్రపంచ చాంపియన్‌’ అని ఎగతాళి చేశారు.

జి-7 విదేశాంగ మంత్రుల సమావేశం :
    
లండన్‌లో జి-7 విదేశాంగ మంత్రుల సమావేశం మే 3-5 తేదీలలో జరిగింది. జి-7 దేశాల యుకె, యుఎస్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ విదేశాంగ మంత్రుల, యూరోపియన్‌ యూనియన్‌ అధికార ప్రతినిధి, ఆస్ట్రేలియా, ఇండియా, దక్షిణకొరియా, దక్షిణాఫ్రికా మరియు ఆగ్నేయాసియా దేశాల ప్రతినిధులు పాల్గన్నారు. ఈ సమావేశంలో జూన్‌ 11-13 తేదీల్లో జరుగనున్న జి-7 సమ్మిట్‌కు ముసాయిదా తయారు చేసింది. ఆ ముసాయిదా ఇలా పేర్కొంది. కొవిడ్‌ వాతావరణం, భద్రతా, భవిష్యత్‌ శ్రేయస్సు కోసం క్లిష్టమైన దశలో మనం ఒక వేదిక పైకి వచ్చాం. ‘వాణిజ్యం, పెట్టుబడులు, డేటా జ్ఞానం, ఆలోచనలు మరియు ప్రతిభ ప్రవాహం మన శ్రేయస్సుకు అవసరం. మనం ఎక్కడ నివసిస్తున్నా జెండర్‌, వైకల్యం, జాతితో సంబంధం లేకుండా అందరి మానవ హక్కుల పట్ల గౌరవం, రక్షణను ప్రోత్సహిస్తామని అత్యంత తీవ్రమైన విదేశీ సవాళ్లపై  సమిష్టి చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని మేం ధృవీకరిస్తున్నాం’ అని సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
    
మొత్తంగా జి-7 సమావేశం ద్వారా చైనా, రష్యాలను పక్కన పెట్టి, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలను మరింత సన్నిహితంగా ఉంటూ, అమెరికా ఆధిపత్యానికి ఎదురు లేకుండా చూడలన్నది బైడెన్‌ ఎజెండా. బైడెన్‌ అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా తిరిగి జోక్యం చేసుకుంటుందని, అన్ని వ్యవహారాలను ఇక తానే శాసిస్తుందని ఆయన అన్నారు. అలాగే నాటో బలగాలకు అయ్యే ఖర్చును భరిస్తామని తెలిపాడు. ప్రచ్ఛన్న యుద్ధంలో ఓడిపోయిన రష్యా ఇక ప్రపంచ రాజకీయ యవనికపై దాని పాత్రను పరిమితం చేస్తామన్నారు. సోవియట్‌ యూనియన్‌కు గతంలో ఇచ్చిన హామీకి భిన్నంగా నాటో తూర్పు దేశాలకు విస్తరించాలని చూస్తోంది. బాల్టిక్‌ దేశాలలోనూ, పోలాండ్‌లోనూ నాటో తన క్షిపణి బ్యాటరీ కేంద్రాలను నెలకొల్పింది.  రష్యా సరిహద్దు సమీపంలో తన సైనిక విన్యాసాలు తరచూ నిర్వహిస్తోంది.

పుంజుకున్న రష్యా :
    
నిజానికి ప్రస్తుతం రష్యా యూరప్‌, మధ్య ఆసియా, పశ్చిమాసియా ప్రాంతాల్లో ఒక బలమైన సైనిక శక్తిగా ఉంది. అదే అమెరికా పెద్ద సవాలుగా నిలిచింది. రష్యా మిలిటరీ బలాలు, అణ్వాయుధ సంపత్తి అమెరికాకు వ్యూహాత్మక ముప్పుగా పరిణమిస్తుందని పశ్చిమ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు రష్యా సరఫరా చేసే గ్యాసు, చమురు యూరప్‌ దేశాలకు అవసరం. హైడ్రో, కార్బన్‌ వనరులు అతి దగ్గరలో లభ్యమయ్యేది రష్యా నుంచే. రష్యాను ఆర్థికంగా బహిష్కరించాలని బైడెన్‌ యూరోపియన్‌ యూనియన్‌ దేశాలపై ఒత్తిడి తెస్తున్నాడు. సముద్రం గుండా వేసిన నార్త్‌ స్ట్రీమ్‌ పైపు లైన్‌పై ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదిరిస్తుంది. దీనికి జర్మనీ ససేమిరా అంటుంది. మొత్తంగా రష్యాతో కయ్యానికి ఇయు దేశాలను ఒక పావుగా ఉపయోగించుకునేందుకు జి-7ని అమెరికా ఒక వ్యూహాత్మక ఎత్తుగడగా ఎంచుకున్నట్లు విధితమవుతోంది. అమెరికా అంచనాలకు భిన్నంగా రష్యా అటు ఆర్థికంగానూ, ఇటు మిలిటరీ పరంగాను పటిష్ట పరచుకునేందుకు యత్నిస్తోంది.

దూసుకెళ్తున్న చైనా :
    
జి-7 కూటమి రెండో దాడిని చైనా పైకి ఎక్కు పెట్టింది. చైనాను కట్టడి చేసేందుకు సముద్రాలపై తన అజమాయిషీని పెంచుకోవాలని అమెరికా చూస్తున్నది. ఒబామా కాలంలోనే  ‘పైవోట్‌ ఆసియా’ పేరుతో వ్యూహరచన చేశాడు. దాన్నే ఇప్పుడు ఇండో-పసిఫిక్‌ వ్యూహం అంటున్నారు. 2028 నాటికి చైనా అమెరికాను దాటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నది. ఇప్పటికే చైనాకు చెందిన పలు హైటెక్‌ కంపెనీలపై అమెరికా పలు ఆంక్షలు విధించింది. స్వేచ్ఛా నావికాయానం పేరుతో దక్షిణ చైనా సముద్రంలో తన నావికా శక్తిని ప్రదర్శిస్తున్నది. అలాగే చతుర్ముఖి పేరుతో అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్‌లతో ఒక కూటమిని ఏర్పాటు చేసింది. చైనా ఇవాళ ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా ఉంది. సాంకేతికంగా అమెరికా కంటే ముందున్నది. చైనాలోని అత్యధిక పెట్టుబడులు అమెరికా, యూరప్‌ దేశాలకు సంబంధించినవే కావడం గమనించవల్సిన అంశం. తన పారిశ్రామిక, సాంకేతిక పునాదిని బాగా పటిష్ట పరచుకున్నది. 5-జి, అరుదైన ఎర్త్‌ ప్రోడక్షన్‌ బ్యాటరీల తయారీలో అమెరికా కన్న ముందున్నది. విదేశీ మారక నిల్వలు కూడ అమెరికా కంటే ఎక్కువగా ఉన్నాయి. చైనా వాణిజ్య రంగంలో చేపట్టిన ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషీయేటివ్‌’ (బిఆర్‌ఐ) మధ్య ఆసియా, ఆఫ్రికా, తూర్పు యూరోపియన్‌ దేశాలలో భారీ పెట్టుబడులు పెట్టింది. జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలు చైనాతో కలిసి ముందుకు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇయూ దేశాలను తనకు అనుకూలంగా మార్చుకోవడం, వాటిని చైనా, రష్యాలకు వ్యతిరేకంగా నిలబెట్టడం అమెరికాకు అంత సులభమైన దేమికాదు.

బైడెన్‌ నిధుల సమీకరణ బిల్లు :
    
బైడెన్‌ మే 2021-22 బడ్జెట్లో నిధుల సమీకరణకు సెనెట్‌లో ప్రవేశపెట్టిన ‘అమెరికా నవీకరణ బిల్లు’కు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుతో పాటు బైడెన్‌ సర్కారు ప్రతిపాదిస్తున్న ఉపాధి కల్పన, మౌలిక వసతుల నిర్మాణ పథకాలకూ భూరి నిధులు కావాలి. గత నెలలో బైడెన్‌ చేసిన బడ్జెట్‌ ప్రతిపాదనలు కొత్త పథకాలపై రానున్న పదేళ్లలో అయిదు లక్షల కోట్ల డాలర్లు వ్యయీకరించాలని ఉద్దేశిస్తున్నాయి. బైడెన్‌ రక్షణ బడ్జెట్‌ గతం కంటే పెరిగింది. సాంకేతిక రంగానికి ప్రాధాన్యత పెరిగింది. నవీకరణ బిల్లులో కేటాయించిన 10,000 కోట్ల డాలర్లతో ఏఐ, రోబోటిక్స్‌, సెమీకండక్టర్లు, హైపవర్‌ కంప్యూటింగ్‌లలో ముందంజ వేసే బాధ్యతను ఒక కొత్త విభాగానికి అప్పగించారు. జాతీయ సైన్స్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఎస్‌ఎఫ్‌) పరిశోధనలకు 2022-2026 మధ్యకాలంలో 8,100 కోట్ల డాలర్లు కేటాయించాలని బిల్లు ప్రతిపాదించింది. దీంతో పాటు సాంకేతిక విద్యాభివృద్ధికి హెచ్చు నిధులు కేటాయించింది. ప్రస్తుతం దాదాపు సున్నా వడ్డీకి రుణాలు తీసుకునే వెసులుబాటు అమెరికాకు ఉంది. దీంతో పాటు కంపెనీలు, అధికాదాయ వర్గాలపై పన్నులు పెంచడం ద్వారా అదనపు నిధులు సమీకరించాలని బైడెన్‌ సర్కారు ప్రతిపాదిస్తోంది.

ముగింపు :
    
బైడెన్‌ విదేశాంగ విధానంలో ఆసియా అత్యంత కీలకాంశంగా ఉంది. చైనాపై ముప్పెట దాడిని తీవ్రతరం చేసే సూచనలు కన్పిస్తున్నాయి. ‘ఆసియా జార్‌’గా పిలువబడే కుర్తు కాంప్‌బెల్‌ను బైడెన్‌ తిరిగి తీసుకున్నాడు. ముగ్గురు సీనియర్‌ డైరెక్టర్లను (ఒబామా వెటరన్స్‌గా పేరొందిన వారిని) తీసుకున్నాడు. వారు ఆండ్రియా కెండాలి టేలర్‌ (రష్యా, మధ్య ఆసియా వ్యవహారాలు) సుయోనా గుహ (దక్షిణాసియా వ్యవహారాలు) లారా రొజెన్‌బర్గర్‌ (చైనా వ్యవహారాలు). బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజున వివిధ దేశాల నేతలతో పోన్‌లో మాట్లాడారు. ఆ సంబాషణల్లో ఆయన ఆసియాలో అమెరికా అనుసరించబోయే విధానం గురించి నొక్కి చెప్పారు. జపాన్‌ ప్రధాని సుగాకు అవసరమైన మిలిటరీ సహాయం అందించేందుకు అమెరికా కట్టుబడి ఉందని చెప్పారు. అమెరికా-జపాన్‌ మధ్య అరమరికలు లేని స్వేచ్చా,Û ఇండో పసిఫిక్‌ ఒప్పందాలు ఈ ప్రాంతంలో శాంతి సౌభాగ్యాలు నెలకొనడానికి మూలమలుపు అని కొనియాడారు. భారత్‌కు కూడ ఇదేవిధమైన సంకేతాలు ఇచ్చారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేన్‌ సులిమాన్‌ భారత జాతీయ సలహదారైనా అజిత్‌ దోవల్‌తో స్వయంగా మాట్లాడారు.
    
అమెరికా సామ్రాజ్యవాదం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మించి ఒక అగ్రరాజ్యంగా అత్యంత క్రూరమైన  నేరపూరితమైన, అమానవీయ, అత్యంత నీచ సాంస్కృతిక విలువల మీద మనుగడ సాగిస్తోంది. ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షకునిగా చెప్పుకోవడం ఐచ్చిబూటకం. అది చేపట్టిన యుద్ధాలలో లక్షలాది మంది మరణించారు. కోట్లాది మంది శరణార్థులుగా మారారు. అనేక దేశాల వస్తు సంపద ధ్వంసమైనంది. దానికి పెట్టుబడి లాభాల వేట తప్ప మరొకటి దానికి తెలియదు. అమెరికా చెబుతున్న సూత్రాలు, విలువలు నిజంగా ఐరాసలో అన్ని దేశాలు కలిసి ఉమ్మడిగా నిర్ణయించిన సూత్రాలు కావు. అన్ని దేశాలకు సార్వత్రికంగా వర్తించే విలువలు కాదు. ఎందుకంటే ఐరాస చేసిన తీర్మాణాలను ఉల్లంఘించిన చరిత్ర అమెరికాకు ఉంది. ఇటీవల గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు నిలిపివేయాలని చేసిన భద్రత మండలి తీర్మాణాన్ని వ్యతిరేకించింది.
    
అంతర్జాతీయ సంస్థ ఐన ఐ.రా.స తీర్మాణాలను అమెరికా ఏనాడు పాటించలేదు. ఆ సంస్థ తీర్మాణం లేకుండానే ఇరాన్‌, ఆఫ్ఘాన్‌, లిబియా దేశాలపైన దురాక్రమణ  యుద్ధాలు చేసింది. లాటిన్‌ అమెరికాలో పలు దేశాలల్లో పాలక వర్గాలను దించడానికి కుట్రలు చేసింది. ఎంతోమంది నేతలను హత్య చేసింది. అనేక దేశాలలో తన మాట విననందుకు తీవ్రవాదులను సృష్టించి అంతర్యుద్ధాలను ప్రోత్సహించింది. నెత్తుర్లు పారించింది. ఇంతగా యుద్ధోన్మాదాన్ని తలకెక్కించుకున్న అమెరికా ప్రపంచ దేశాలకు నీతులు వల్లించడం ఆశ్చర్యకరం. మానవ హక్కుల గురించి అమెరికా వల్లించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది. అమెరికా నిత్యం చెప్పుకునే ప్రజాస్వామ్యం ఫాసిజమే. అది ప్రబోధించే స్వేచ్ఛా ప్రపంచం అంటే  వర్ధమాన దేశాల వనరులను కొల్లగొట్టే స్వేచ్ఛ మాత్రమే.  

Leave a Reply