చరిత్ర వికాసక్రమంలోని ప్రజల అనంతమైన ధిక్కారాలను, సాహసోపేతమైన పోరాట ఆచరణల సారాన్ని విప్లవ రచయితల సంఘం తనలో అంతరంగీకరించుకున్నది. చారిత్రక చోదకశీలమైన మానవ కర్తృత్వమనే సారభూతశక్తిని అపూర్వరీతిలో ప్రేరేపించింది. దీని వల్ల ఆధునిక కాల్పనికత విప్లవ కాల్పనికతగా రూపాంతరం చెందింది. ఈ కోణంలో చూస్తే మిత్రుడు పాణి రాసిన ‘సృజనాత్మక ధిక్కారం’ అనే పుస్తకానికి నిస్సందేహంగా అత్యంత చారిత్రక ప్రాసంగికత ఉన్నదని చెప్పవచ్చు. విరసం యాభై ఏళ్ల సందర్భంలో తను ఈ పుస్తకం రాశాడు.
మామూలుగా కల్పన అనగానే అది వాస్తవంతో ప్రమేయం లేని ఊహాజనితమని చాలా మంది అనుకుంటారు. కాని కల్పనెప్పుడూ మనిషి భౌతిక అస్తిత్వ మూలాలతో సంబంధం లేకుండా లేనే లేదు. అయితే ఆ మనిషి అస్తిత్వం సమాజంతో ఎటువంటి సంబంధంలో ఉందో దాన్ని బట్టే అతని/ఆమె కల్పనలోని వాస్తవ అవాస్తవాల పాళ్ళు ఏమేరకు ఉన్నాయనేది ఆధారపడుతుంది.
ప్రకృతితో పాటు పలు సామాజిక రంగాల్లో ఆవిష్కృతమైన శాస్త్రవిజ్ఞానాల వల్ల, ముఖ్యంగా మార్క్సిజం ఆవిర్భావం వల్ల మానవ కల్పనా ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు ప్రారంభమయ్యాయి. ఫలితంగా సామాజిక వాస్తవికత పట్ల హేతుబద్దమైన విమర్శనాత్మకత పెరిగి, దాన్ని మార్చడానికి మనిషి చైతన్యపూర్వకంగా కన్న కలే ఆధునిక (సమాజపు) కాల్పనికతకు కారణభూతమైంది. ఈ కాల్పనికతలో మనిషి ఊహలు, భావనలు అన్నీ వాస్తవిక సమాజ మూలాల నుంచి ఉద్భవించి, తిరిగి అవి సమాజాన్ని ప్రభావితపరిచేవిగా ఉంటాయి.
భారత సమాజాన్ని సమూలంగా మార్చాలనే లక్ష్యంతో మొదలైన నక్సల్బరీ, శ్రీకాకుళ విప్లవోద్యమాల్లో భాగంగా ఆవిర్భవించిన విరసానికి సాహిత్య సాంస్కృతిక రంగాల్లో వర్గపోరాటం చేయడమే లక్ష్యం. లక్ష్యం అదే అయినప్పటికీ ఆనాటి చారిత్రక పరిస్థితులు నిర్దేశించిన కర్తవ్యం వల్ల విరసం రాజకీయ పాత్రనే ఎక్కువగా నిర్వహించింది. దానివల్ల పొందిన ఫలితాల విశ్లేషణలు ఎలా ఉన్నప్పటికీ, విరసం ప్రధాన ఆచరణ విప్లవ రచనే గనుక, అందుకు స్పష్టమైన, శాస్త్రీయ దృక్పథాన్నిబలోపేతం చేసుకోవడం కీలకమయ్యింది. కనుకనే మార్క్సిస్టు దృక్పథాన్ని అన్వయిస్తూ, నిరంతరం చారిత్రక చోదకశీలమైన మానవకర్తృత్వం అనే సాంస్కృతికాచరణను, తదనుగుణమైన భావనీకరణల క్రమాన్ని కొనసాగించింది. తద్వారా విరసం తెలుగు సాహిత్య కళా రంగంలో మరింత బలంగా వర్గపోరాటం నిర్వహించడానికి దృక్పథ స్పష్టతను తీసుకొచ్చి నూతన చరిత్ర నిర్మాణానికి సరికొత్త పునాదుల్ని వేసింది.
అయితే స్పష్టమైన, శాస్త్రీయమైన దృక్పథమనేది ఏ స్థలకాలాల్లోనైనా సరళంగా, సూటిగా ఏర్పడేది కాదు. పైగా ఏర్పడిన దృక్పథం ఒకసారి స్పష్టతను పొందిందనుకున్నతర్వాత ఇక అది ఎంతమాత్రం విస్తరించకుండా మారని జడప్రాయమైన స్థిరాంశం కాదు. దృక్పథమెప్పుడూ మారుతున్న కాలమాన పరిస్థితులకనుగుణంగా నిరంతరం చలిస్తున్న భౌతిక వాస్తవికతతో ముడిపడి ప్రభావితమయ్యే గతిశీలాంశం. కనుకనే ప్రజల అవగాహనా చైతన్యాలు తదనుగుణంగా అప్ డేట్ అవుతూ దృక్పథం అత్యంత సంక్లిష్టంగా రూపొంది విస్తరించే ప్రక్రియగానే ఉంటుంది.
ఆదిమదశ మినహా ప్రపంచ చరిత్రంతా వర్గపోరాటాల చరిత్రేనన్న మార్క్స్ సూత్రీకరణ భూమి తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందన్నంత తిరుగులేని సత్యం. ఈ సూత్రీకరణను మార్క్స్ కేవలం ఆర్థిక (నియతివాద) దృష్టికోణం నుంచే చేసాడని చెప్పగలమా? అలా ఎన్నటికీ చెప్పలేం. ఎందుకనంటే- చరిత్ర నిర్మాణంలో ఆయన మానవ ఏజెన్సీకి (కర్తృత్వానికి) అత్యంత ప్రాధాన్యతనిచ్చి సకల ఆర్థికేతర (సాంఘిక తదితర) రంగాల పోరాటాలనూ ప్రజల వర్గ పోరాటాల్లో అంతర్భాగమైనవిగా భావించాడు. అయితే రాజకీయార్థిక దోపిడీ పునాదిని మార్చడానికి రాజ్యంతో చేసే సాయుధ వర్గపోరాటాలే కీలకమైనవని చెప్పాడు.
అలా నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాట విస్ఫోటనాలనంతర తొలిదశలో దోపిడీ రాజ్యంతో చేసే సాయుధ వర్గపోరాటాలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ఇతరేతర పోరాటాలను అప్రధానమైనవిగా, వాటిని కార్మికవర్గ రాజ్యస్థాపన తరువాత చేపట్టవలసిన పోరాటాలుగా చూసిన ధోరణి కొంతకాలం పాటు ఆనాటి కమ్యూనిస్టు శిబిరంలో ఉండింది. ఫలితంగా ప్రజల వర్గపోరాటాల్లో వివిధ సాంఘిక, సాంస్కృతిక అస్తిత్వాల పోరాటాలన్నీ సహజ అంతర్భాగంగా కొనసాగాయి. ఆ కారణం వల్లనే ప్రజా వర్గపోరాటాల బహుముఖీనత, అనంతమైన వైవిధ్యతలు ప్రత్యేకంగా చర్చనీయాంశం కాలేదు. వర్గపోరాటంలో భాగంగా సాగాయి. . తొలినాళ్లలో విరసంతో సహా కమ్యూనిస్టు శిబిరంలో ఈ ధోరణి ఉండింది. ఇది ఆరంభ దశపు పరిమితిగానే చూడాలి.
ఎందుకనంటే- చరిత్రలో శతాబ్దాల ఆధిపత్యాలపై దశాబ్దాల రాజీలేని ప్రజాపోరాటాల క్రమంలో పొందిన విస్తారమైన అనుభవాల నుండి వివిధ పోరాటశక్తులు ఎంతో నేర్చుకున్నాయి. అగ్రగామి మార్క్సిస్టు వర్గపోరాట శక్తులు కూడా ఎప్పటికప్పుడు మారిన పరిస్థితులపై ఆధారపడి సరికొత్త అవగాహనలను ఏర్పరచుకుంటూ తగిన ఎత్తుగడలను రూపొందించుకొని ప్రజల వర్గపోరాటాలను తీవ్రతరం చేసాయి. ఫలితంగా సమాజంలో ప్రజాస్వామికీకరణ క్రమం ఆరంభమై వివిధ సాంఘిక అస్తిత్వ సమూహాల్లో నూతన భావచలనాలు సృష్టించబడ్డాయి. అవి 1980లలో,1990లలో స్త్రీ, దళిత, మైనారిటీ అస్తిత్వవాదాల రూపంలో ముందుకొచ్చి ఆనాటి సామాజిక ఆవరణనంతా సరికొత్త ప్రజాస్వామిక భావనలతో ముంచెత్తాయి.
క్రమేణా విభిన్న అస్తిత్వాల సంఘర్షణా సమాహారమే సామాజిక వాస్తవికత అని, ఒక నిర్దిష్ట అస్తిత్వ సమూహపు సమస్యలు ఇతర అస్తిత్వ సమూహాల సమస్యలతో ముడిపడి ఉన్నాయని, కనుక ఏ అస్తిత్వమూ విడి ద్వీపం లాంటిది కాదన్న ఎరుక కలిగింది. ఈ పుస్తకంలో మిత్రుడు పాణి అన్నట్టుగా- మార్క్సిస్టు దృక్పథం వెలుగులో వర్గపోరాటం చేసే శక్తులు కాస్త ఆలస్యంగానైనా సరే విభిన్న అస్తిత్వాల మధ్య గల పరస్పర గతితార్కిక సంబంధాల చారిత్రక సంఘర్షణా ప్రభావాలను శాస్త్రీయంగా విశ్లేషించి, అస్తిత్వవాదుల కంటే భిన్నంగా తమ అవగాహనాచరణలను సమకాలీనంగా తీర్చిదిద్దుకున్నాయి. అయితే ప్రజాపోరాటాల క్రమంలో నేర్చుకోవడం అనే ప్రక్రియ ముందు వెనుకలుగా జరగడం అత్యంత సహజం. ఎవరైనా దానిని ప్రతిష్టా త్మకంగానో లేదా తద్విరుద్ధంగానో తీసుకోవడం వైయక్తికవాద ధోరణే అవుతుంది. ఎవరయినా ప్రజల సమిష్టి వర్గపోరాటాల నుండి శాస్త్రీయంగా నేర్చుకోవడమనేదే సరైనదవుతుంది.
తెలుగు సామాజిక రంగంలో తొలి ఏకైక ప్రజల బహిరంగ సంఘంగా ఆవిర్భవించిన విరసానికి క్రమంగా ప్రజా రాజకీయ కార్యాచరణకు, కళా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ప్రజాకార్యాచరణకు మధ్య ఉండాల్సిన సామ్యాలు, తేడాలు తెలిసివచ్చాయి. వేర్వేరు తలాల్లో జరిగే సంక్లిష్ట వర్గపోరాటంలో పాటించాల్సిన మెళకువల విషయంలోనూ క్రమంగా తగిన పరిణతి సమకూరింది. పైగా ఆ తర్వాత కాలంలో అనేక ఇతర ప్రజాసంఘాలు రంగం మీదికి రావడంతో తన స్వీయ కార్యక్షేత్రానికి సంబంధించిన ఆచరణ విషయంలోనూ విరసానికి స్పష్టత రాసాగింది.
తొలుత విప్లవోద్యమ ప్రచార బాధ్యతను మాత్రమే నెరవేర్చే రాజకీయ కర్తవ్యాన్ని చేపట్టిన విరసం కాలక్రమంలో తన స్వీయానుభవాల నుండి, సిద్ధాంత అధ్యయనం, అన్వయాల నుండి తానుగా నక్సల్బరీ ప్రజాపంథాను అర్థం చేసుకుంటూ ముందుకు సాగింది. ఆ క్రమంలోనే సాహిత్య సాంస్కృతిక రంగాల్లో తన స్వీయకార్యాచరణను పదునుబెట్టుకుంటూ తనదైన వ్యక్తిత్వాన్ని రూపొందించుకుంది. అంతేకాదు, తన దృక్పథ నిబద్ధత వల్ల, నిరంతరం ప్రజలతో, ప్రజల ఆరాట పోరాటాలతో ఆత్మీయ సంబంధాలు పెట్టుకోవడం వల్ల, ముఖ్యంగా రాతకు, చేతకు, మాటకు మధ్య అంతరాలను చెరిపివేసి వాటి మధ్య అభేదాన్ని సాధించే నిత్య సంఘర్షణ వల్ల విరసం ఇతర ప్రజాసంఘాల కంటే భిన్నంగా తనదైన ప్రత్యేక ప్రతిపత్తిని సంతరించుకున్నది. ఎప్పటికప్పుడు రాజకీయార్థిక రంగంలోని కీలక సాయుధ వర్గపోరాటాలే గాకుండా, ఇతరేతర సామాజిక రంగాల్లో జరిగే అనేక పీడిత ప్రజాసమూహాల పోరాటాల ఫలితంగా ఉద్భవించిన నూతన భావచైతన్యాల ప్రజాస్వామిక సారాన్ని తన దృక్పథం ద్వారా, విప్లవ ప్రజాస్వామిక సాంస్కృతికాచరణ ద్వారా తనలో జీర్ణించుకుంటూ విరసం నేర్చుకున్నది, నేర్చుకుంటున్నది. విరసానికి నేర్చుకోవడమంటే సమస్త ప్రజాచరణల అనుభవాల సారాన్ని భావనీకరించడమే లేదా సిద్ధాంతీకరించడమే. అలా విస్తరించిన దృక్పథం వెలుగులోనే అనేక స్ఫూర్తిదాయకమైన విప్లవాత్మకమైన వాక్రచనాది సృజనాత్మక ప్రక్రియలను సృష్టించగలుగుతోంది. తద్వారా సమిష్టి నిర్మాణాత్మకాచరణలను ప్రేరేపించగలుగుతోంది.
ఇలా గత 50 ఏళ్లుగా నిరంతర వర్గపోరాటాల వల్ల ఉత్పన్నమవుతున్న విభిన్న సామాజిక చలనాలను, వాటి ప్రతిఫలనాలైన భావజాల సంఘర్షణలను విరసం తనలో సంలీనం చేసుకుంటూ, వాటిని సాహిత్యీకరించడం వల్ల తెలుగు సాహిత్యరంగం అనూహ్యంగా గతిశీలమయ్యింది. విరసం సృష్టించిన, సృష్టిస్తున్న కళాసాహిత్యాలు సామాజిక పరివర్తనా సాధనాలుగా, ప్రజాఉద్యమ సాధనాలుగా మారిపోయాయి. రచయితలకు, పాఠకులకు మధ్యగల పాతకాలపు ఏకముఖ సంబంధం పరస్పరం ప్రభావితం చేసుకునే ద్విముఖ సంబంధంగా మారిపోయింది. పర్యవసానంగా సాధారణ పాఠకుల్లో కొందరైనా రచయితలను, కళాకారులను ప్రభావితం చేసే స్థాయికి ఎదగడం వల్ల సాహిత్యరంగమే కాకుండా ప్రత్యేకించి విమర్శనారంగం అత్యంత చలనశీలమై గుణాత్మక మార్పులకు లోనయ్యింది. మొత్తంగా సాహిత్యవిమర్శే ప్రభావశీలమైన వర్గపోరాట సాధనంగా పరిణామం చెందింది.
పైగా గతంలో వలె శిష్ట, ఎగువ మధ్యతరగతి వర్గాలనుండి కాకుండా దిగువ, అట్టడుగు వర్గాలనుండి పాఠకులు తయారయ్యే క్రమాన్ని విరసం వేగవంతం చేసింది, చేస్తోంది. ప్రజా రాజకీయాలకు, కళా సాహిత్యాలకు మధ్య గల సంబంధాన్ని పటిష్టమైన మార్క్సిస్టు సిద్ధాంతాల పునాదులపై నిర్మించడం వల్ల కళాకారుల, రచయితల, బుద్ధిజీవుల ఆలోచనా ప్రపంచంలో సమసమాజపు కల విడదీయలేని అపూర్వ రీతిలో అంతర్భాగమైంది. తరతరాల తెలుగు సాహిత్యసాంస్కృతిక చరిత్రలోని ధిక్కార సంప్రదాయాల మూలాలను వెతికి పట్టుకొని, విరసం వాటిని క్రోడీకరించి గుణాత్మకంగా అభివృద్ధిపరచడమే కాకుండా, సృజనాత్మకంగా కళీకరిస్తుండడం వల్ల సాహిత్య రూపసారాలు విప్లవాత్మకంగా తీర్చిదిద్దబడ్డాయి, తీర్చిదిద్దబడుతున్నాయి. భాష విషయంలోనూ సాంప్రదాయిక భాషా ఛాయలు తొలగి, వ్యవహారిక, మాండలిక భాషా వినియోగాలు పెరిగాయి. సాహిత్య సాంస్కృతిక రంగాల్లో విరసం ప్రేరేపిస్తున్న నిరంతర వర్గపోరాటస్ఫూర్తి వల్ల రచయితలు, కళాకారులు, బుద్ధిజీవులు విస్తృతస్థాయిలో నిర్మాణాత్మకమవుతూ సామాజిక, రాజకీయ కర్తృత్వాన్ని నెరపగలుగుతున్నారు. ఈ విషయాలను ఈ పుస్తకం చరిత్రలోంచి, విరసం సాహిత్య సాంస్కృతిక ఆచరణలోంచి నమోదు చేసింది
ఇంకా ఈ పుస్తకంలో సమాజ సాహిత్య సంబంధాల గురించి, సాహిత్య సాంస్కృతికరంగాల్లో కొనసాగుతున్న వర్గ పోరాటాల గురించి మౌలిక విశ్లేషణలనేకం ఉన్నాయి. కవిత్వం, కథ, నవల వంటి సాహిత్య ప్రక్రియల సృష్టిలో విరసం సాధించిన గుణాత్మకమార్పుల గురించి అద్భుతమైన నిర్ధారణలున్నాయి. ప్రత్యేకించి సాహిత్యవిమర్శను మున్నెన్నడూ లేనివిధంగా విప్లవీకరించి, దానిని కీలకమైన చోదకశక్తిగా అత్యున్నతమైన వర్గపోరాట సాధనంగా తీర్చిదిద్దిన తీరు ఎంతో శక్తివంతంగా వివరించబడింది. శాస్త్రీయమైన మార్క్సిస్టు దృక్పథ బలంతో చేసిన విశ్లేషణాత్మకమైన విమర్శను కేవలం సాహిత్య ప్రక్రియలకే పరిమితం చేయకుండా సాహిత్యేతర రంగాలకూ విస్తరింపజేసి సామాజికరంగాలన్నింటా విరసం తన వర్గపోరాట విమర్శనా ప్రభావాన్ని అపూర్వంగా ప్రసరింపజేసింది.
ఇలా ఒక్కొక్క అంశంపై మిరుమిట్లుగొలిపే లోతైన భావస్ఫోరక విశ్లేషణలున్న ఈ విలువైన పుస్తకం పై ఎంతో విస్తృతంగా రాసి విశ్లేషించడానికి అవకాశం ఉంది. అయితే నేనిక్కడ అలాంటి పనేమీ చేయకుండా ఆర్టిక రీత్యానే కాకుండా బహుళ విభజిత వర్గ సమాజంలో మనుషులు ఉద్దేశించిన భావానికి, వ్యక్తీకరించే భాషకు మధ్య తలెత్తే అవకాశముండే ఒకటి, రెండు వైరుధ్యపూరిత అంశాల గురించి ప్రస్తావించి ముగిస్తాను.
పాణి 1985లో జరిగిన కారంచేడు ఘటన గూర్చి రాస్తూ- ఆనాడు విరసం కులాన్ని వర్గంలో భాగంగా చూసిందని, ఆ ఘటనను రాజకీయార్థిక సాంఘిక కోణంలో విశ్లేషించి, భూమిలేని నిరుపేదలైనందు వల్లనే కాకుండా అంటరాని కులాలకు చెందిన దళితులు కావడంవల్ల ఆ దాడి జరిగిందనే వివరణ ఇచ్చిందని రాసాడు. ఆనాటికి కులం పునాదా? ఉపరితలమా? అనే చర్చే లేదని చెబుతూనే, ‘కులాన్ని వర్గంలో భాగంగా చూడడమంటే అప్పటికి పునాదిగా గుర్తించినట్లే కదా’ అనన్నాడు. (సృజనాత్మక ధిక్కారం-పే 50, 3వ పేరా)
మార్క్సిస్టులు కులాన్ని కేవలం ఉపరితలాంశంగా మాత్రమే చూస్తారనే అప్పటి విమర్శకు జవాబుగానే రచయిత ఇలా అన్నాడని మనకర్థమవుతుంది.
కాని ఆ తర్వాత వెల్లువెత్తిన అస్తిత్వవాదాల ప్రభావం కారణంగా ‘కులాన్ని వర్గంలో భాగంగా చూసే దృక్పధాన్ని సవరించుకుని, సాంఘిక సంబంధాల్లో భాగంగా చూసి, వర్గంతో కలిపి ఆలోచించే దృష్టికోణం పెరిగింద’ని రాశాడు. (అదే పుస్తకం- పే 46, చివరి పేరా)
అంటే, అస్తిత్వవాదాల ప్రభావం కారణంగా రాజకీయార్థిక దోపిడీ పునాది గల ఉత్పత్తి సంబంధాలలో భాగంగానే కాదు, కులాన్ని సాంఘిక సంబంధాల్లో భాగంగా కూడా చూసే దృష్టికోణం పెరిగిందని చెప్పడమే ఇక్కడ రచయిత ఉద్దేశ్యమని మనకర్థమవుతుంది.
నిజానికి ఈ అవగాహనే 1980ల చివరినాటికల్లా పునాది, ఉపరితలాలు వేర్వేరుగా గాకుండా అవి కలగలిసి పరస్పర సంబంధాల్లో ఒక అవిభాజ్యమైన మొత్తంగా ఉంటాయని, పైగా ఏకముఖంగా కాకుండా అవి ద్విముఖంగా పరస్పరం ప్రభావితం చేసుకునే అంశాలుగా ఉంటాయన్న స్థూల సైద్ధాంతిక అవగాహన విరసానికి ఏర్పడింది.
ఏదేమైనప్పటికీ, కులం వంటి అత్యంత సంక్లిష్ట వ్యవస్థను వివరించే/విశ్లేషించే విషయంలో వాడే భాష పట్ల మరింత అప్రమత్తత అవసరమని నాకనిపిస్తోంది. నిర్దిష్టంగా 46,50వ పేజీల్లో పైన పేర్కొన్న రెండు పేరాలను చదివితే వర్గం, సాంఘిక అస్తిత్వాల (మధ్య గల పరస్పర సంబంధాల)ను (గతంలో పునాది, ఉపరితలం అనే అంశాల వలె) పాఠకులు పొరబాటుగా అర్థం చేసుకునే ప్రమాదముంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి.
ఇంతకూ అస్తిత్వ వాదాల ప్రభావం వల్ల జరిగిందేమిటి? నిజానికి వాటి ప్రభావాల వల్ల మనం సవరించుకున్నదేమిటి? వర్గ సమాజంలోని వివిధ పీడిత అస్తిత్వాల పట్ల, వర్గపోరాటాల పట్ల మన పాత అవగాహనను సవరించుకున్నాం, లేదా అప్ డేట్ చేసుకుని విస్తరించుకున్నాం. అనేక పీడిత అస్తిత్వ ప్రజా సమూహాలు తమ విముక్తికై పోరాడుతున్న సందర్భంలో వర్గపోరాటం ఎంత సంక్లిష్టంగా ఉండగలదో, అది ఎంత బహుముఖంగా, ఎంత వైవిధ్యంగా కొనసాగగలదో కూడా మనం అర్థంచేసుకున్నాం.
మరిప్పుడు గతంలో కంటే భిన్నంగా మనం కులాన్నిగాని, ఇతర ఏ పీడిత అస్తిత్వాన్నయినా ఎలా అర్థం చేసుకుంటున్నామని చెప్పాలి? మన అవగాహనను ఎలా విశ్లేషించుకోవాలి?
కులం లాగే మిగతా ఇతర పీడిత సాంఘిక అస్తిత్వాలకూ తమవైన సోషల్ డైనమిక్స్ ఉంటాయి.అయితే అవి పరస్పరం సంబంధం లేని విడి విడి అస్తిత్వాలు కావు.అలాగే అవి రాజకీయార్థిక దోపిడీ పునాది గల ఉత్పత్తి వ్యవస్థతో కూడా సంబంధం లేనివీ కావు. పరస్పరం ప్రభావితం చేసుకునే సంక్లిష్ట సమాహారాలుగా వివిధ సాంఘిక అస్తిత్వాలు ఉనికిలో ఉండి కొనసాగుతూ ఉంటాయి. అందువల్ల పీడిత అస్తిత్వ సమూహాల పోరాటాలు వర్గ ప్రయోజనాలతో సంబంధం లేని వర్గవ్యతిరేక పోరాటాలు కావు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, పీడిత సాంఘిక అస్తిత్వాల పోరాటాల రూపంలోనే సాధారణ వర్గ పోరాటాలు కొనసాగుతుంటాయి.
అయితే రాజ్యంతో చేసే రాజీలేని సిద్ధాంతపరమైన,దీర్ఘకాలికమైన విప్లవకర సాయుధ పోరాటాలకే (ఎవరి ఇష్టాయిష్టాలతో, సమర్థన, సమర్థనారాహిత్యాలతో నిమిత్తం లేకుండా) చారిత్రకంగా గతితార్కిక ప్రభావం వేసే గుణం ఉంటుంది. కనుకనే అవి విస్తృతమైన సామాజిక చలనాలకు, వైవిధ్యమైన ప్రజాస్వామిక భావజాలవ్యాప్తికీ దారితీ(స్తా)శాయి. తత్పర్యవసానంగా సామాజిక ప్రజాస్వామికీకరణ క్రమం ఆరంభమై క్రమేణా ప్రజాస్వామికశక్తుల, మిత్రశక్తుల అభివృద్ధికీ కారణమవుతాయి. వివిధ పీడిత ప్రజాఅస్తిత్వ సమూహాలలో తమ తమ పీడనల నుండి, బంధనాల నుండి విముక్తికై పోరాడే చైతన్యం నానాటికీ పెరుగుతూ వస్తోంది. అందువల్ల చారిత్రక ప్రభావాన్ని వేసే వర్గ పోరాటాల క్రమంలో ఎప్పటికప్పుడు మారుతున్న సాంఘిక అస్తిత్వాలను,వాటి పరస్పర సంబంధాలను,తద్వారా మారుతున్న సామాజిక వర్గపొందికలను/అమరికలను లోతుగా పరిశీలించి శాస్త్రీయంగా అర్థం చేసుకోవడమే అసలైన కీలకాంశం.
అర్ధవలస-అర్ధభూస్వామ్య వ్యవస్థగా వున్న మన భారతదేశంలోని వర్గ సమాజానికి అస్థిరత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అది అనేక సంక్లిష్టతలతో, వైరుధ్యాలతో కొనసాగుతుంది. కారణమేమంటే- వర్గసమాజం అనేక ఇతర విభిన్నఅస్తిత్వాలతో కలగలిసి పరస్పర వైరుధ్యాలతో తీవ్ర సంఘర్షణాయుతంగా కొనసాగే సమాహారం. ఇందులోని అస్తిత్వాలకు సంబంధించిన సకల ఆధిపత్య అంతర్ వ్యవస్ధలన్నింటినీ యథాతథంగా పట్టి ఉంచేది రాజకీయంగా దళారీ పెట్టుబడిదారీ రాజ్యవ్యవస్థ, దానికి అనుబంధంగా ఉన్న భూస్వామిక, కులమతపర పెత్తందారీశక్తులే.
ఇటువంటి వ్యవస్థలో నిర్దిష్ట స్థలకాలాల గమనానుసారంగా సామాజికవర్గ పొందికలు మారుతూ కొత్తగా రూపొందుతాయి. వాటినిబట్టే ఒక్కోచోట ఒక్కో అస్తిత్వంపై బలీయమైన ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ ఆధిపత్యంపై మన పోరాటాన్ని కేంద్రీకరిస్తూనే, సదరు ఆధిపత్యాన్ని బలోపేతం చేసే రాజ్యాధిపత్యంపై కూడా పోరాటాన్ని ఎక్కుపెట్టాలి. అంటే, వర్గపోరాటమెప్పుడూ సూటిగా, సరళంగా, ఏకముఖంగా ఉండదని, అది అత్యంత సంక్లిష్టంగా, బహుముఖంగా, వైవిధ్యంతో కొనసాగుతుందని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు మన దేశంలోని కుల వ్యవస్థనే తీసుకుంటే- అది వేల ఏళ్లుగా బహుళంతరాల ఆధిపత్య వ్యవస్థగా ఉనికిలో ఉన్నది. కులాల మధ్య పీడక, పీడిత కుల సంబంధాలున్నాయి. ఈ అసమాన కులాంతర్ వ్యవస్థలను కాపాడుతూనే ప్రజల శ్రమ దోపిడీని నిరాటంకంగా కొనసాగిస్తోందీ రాజ్యవ్యవస్థ. ఈ వ్యవస్థలో కులనిర్మూలనా పోరాటం అంటే నిర్దిష్టంగా (అగ్ర)కులాధిపత్య దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడుతూనే, ఆ పీడక కుల వ్యవస్థను యథాతథంగా పట్టి ఉంచుతున్న ఇతర ఆధిపత్యాలపై, ముఖ్యంగా రాజ్యంపై కూడా పోరాటం ఎక్కు పెట్టాలి. లేకపోతే కుల రక్కసి అంతం కాదు.
ఇలా వర్గసమాజం ఉన్నంతవరకు వర్గపోరాటాలుంటాయి. వర్గపోరాటాలు కొనసాగినంత వరకు పాలకుల చేతుల్లో మానవ జీవితం విధ్వంసం అవుతుంటే, ప్రజల చేతుల్లో మానవ జీవిత పునర్నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. నక్సల్బరీ, శ్రీకాకుళాల నుంచి నేటి దండకారణ్యం దాకా ఈ క్రమాన్ని మనం చూడవచ్చు. ఆ నిరంతర ప్రజాజీవిత పునర్నిర్మాణాన్ని రికార్డు చేసేదే విప్లవ సాహిత్యం. వేరే మాటల్లో చెప్పాలంటే- వర్గపోరాటం అంటే ఒక రకంగా నిరంతర ప్రజాస్వామికీకరణ యుద్ధమే. వర్గాలను అంతరింపజేసే నిజమైన సంపూర్ణ ప్రజాస్వామికీకరణను సాధించడమే విప్లవోద్యమ ఏకైక లక్ష్యం. చారిత్రకంగా ఆ విప్లవోద్యమంతో తనకున్న పేగుబంధం కారణంగా ప్రజల విప్లవ బహిర్యుద్ధమే కాదు, ఆ యుద్ధం సృష్టించే అనేక భావ ప్రకంపనాలు, వాటి తాలూకు సంఘర్షణా ప్రతిఫలనాలూ విరసానికి జీవ ధాతువులు. అలా నిత్యం పీడిత ప్రజల బహిరంతర యుద్ధారావాలను అత్యంత సన్నిహితంగా, విశ్వసనీయంగా, సత్యవిధేయతతో, దృక్పథ నిబద్ధతతో అక్షరీకరిస్తున్నందువల్లనే విరసం సమస్త ప్రజాపోరాటశక్తుల కార్యాచరణకు నిరంతర ప్రేరణ నందించే ఒక ఆత్మిక మూలవనరుగా వ్యవహరించగలుగుతోంది. నిరంతరం ప్రజాసంఘర్షణల్లో పాల్గొంటూ విప్లవాత్మక భావాలన్నింటినీ తన మాధ్యమంగా ప్రాసెసింగ్ చేసి సృజనాత్మక ప్రక్రియల ద్వారా వాటిని తిరిగి మళ్లీ సమాజంలోకి ప్రసారం చేస్తోంది. దీనినే పాణి మాధ్యమీకరణ అన్నాడు.
నిజానికి ఈ మాధ్యమీకరణ కూడా విప్లవోద్యమానికి, ప్రజలకు మధ్య మధ్యవర్తిత్వం లాంటి ఒక యాంత్రిక ప్రక్రియ కాదు. అదొక చారిత్రకమైన గతితార్కిక సజీవ రసాయనిక భౌతిక ప్రక్రియ. దీని ద్వారా విప్లవ రచయితలు నిత్య చలనశీలురుగా జీవించడం మాత్రమే కాదు, సృజనాత్మక రచనల సృష్టి రూపంలో నవ(విప్లవ)కాల్పనిక శిశువులను కంటారు. ఆ రకంగా తమ సమసమాజపు కలలను కళాత్మక వాస్తవంగా మార్చుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే- ప్రజల సమసమాజపు కలల వాస్తవీకరణ కోసం అనంతమైన ప్రజా ధిక్కారాల, దీర్ఘకాలిక వర్గపోరాటాల కళీకరణ క్రమమే ఈ ఐదు పదుల విరసం చారిత్రక ప్రస్థానం. అదే విరసం భవిష్యత్ ప్రస్థానం కూడా.
ససృజనాత్మక ధిక్కారం పుస్తక సమీక్షలో,
ఎమ్.రవీందర్ గారు రాసిన వాక్యం”…కాని, కల్పనెప్పుడూ మనిషి భౌతిక అస్తిత్వ మూలాలతో సంబంధం లేకుండా లేనేలేదు”👌🏾✋🏽