ఆఫ్ఘనిస్తాన్ రాజకీయ వ్యవస్థను, సామాజిక సంబంధాలను అమెరికన్ సామ్రాజ్యవాదపు కనుసన్నలలో నడిపేందుకు అక్కడ ఒక బ్యూరాక్రటిక్ బూర్జువా నమూనా ప్రభుత్వాన్ని ఏర్పరిచే ప్రయత్నం జరుగుతోంది.
నిజానికి బ్రిటన్ సామ్రాజ్యవాదం సైతం ఎన్నో సార్లు అఫ్ఘనిస్తాన్ ని దాని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించింది. బ్రిటన్ను అనుసరించే రాజుని లేదా పరిపాలనను స్థాపించాలనే ప్రయత్నం జరిగింది. అయితే అవన్నీ విఫలమయ్యాయయి. చరిత్ర దీన్ని రుజువు చేస్తుంది.
అయితే ఈ రోజు మత ప్రాతిపదికగా ఆఫ్ఘనిస్తాన్ ని సామ్రాజ్యవాద కబంధ హస్తాల నుండి *విముక్తం* చేయడం అనే ప్రక్రియను విమర్శనాత్మకంగా పరిశీలించాలి. ఈ పరిశీలన ఆఫ్ఘనిస్తాన్ సామాజిక సంబంధాల నుంచి, ఉత్పత్తి సంబంధాల నేపథ్యం నుండి చేయాలి. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల్లో అనేక తెగులు ఉన్నాయి. వాళ్లు వ్యవసాయం, పశు పోషణ మీద జీవించేవారు. ఈ తెగల నాయకులు ఒక విధమైన భూస్వామ్య ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. భిన్న తెగల సంస్కృతి-సాంప్రదాయాల కలయికతో ఆఫ్ఘాన్ ప్రజలు జీవిస్తున్నారు. ప్రతి తెగకు ఉండే ప్రత్యేకమైన విధివిధానాల వల్ల అనివార్యంగా ఏకపాలనా విధానాన్ని ఆమోదించేవారు కాదు. స్వాతంత్య్ర జీవనాన్ని అవలంబించేవారు.
అందువల్ల సామ్రాజ్యవాదుల లక్ష్యమైన ఏకపాలన మీద, అదీ వారి చెప్పుచేతలలో సాగే పాలన మీద ఆఫ్టన్లకు ప్రతికూల స్పందన ఉంది. అయితే ఈ భిన్నత్వాన్ని సంపూర్ణంగా ఏకత్వ రూపంలోకి మార్చే మార్గంగా ఇస్లామ్ మతం ఆఫ్ఘనిస్తాన్ లోకి ప్రవేశించింది. ఇస్లామ్ మతం ఆఫ్ఘన్ తెగల సాంప్రదాయ-సంస్కృతులను ఇముడ్చుకుని కొనసాగుతూ ఆధునికతకు, కమ్యూనిజానికి వ్యతిరేకంగా తయారైంది.మరొక పక్క జాతీయత అనే భావనని ఏర్పరచాలనుకుంది.
ఈ జాతీయత ఇస్లామ్ మత భావజాల నేపథ్యం వల్ల తెగల సంస్కృతుల మేలు కలయికగా భూస్వామ్య వ్యవస్థని స్థిరమైన రూపంలో ప్రతిష్టించసాగింది. అయితే ఈ క్రమం అనివార్యంగా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంగా సాగడంతో విస్తృత ప్రజల ఐక్యతగా అభివృద్ధి చెందింది. సామ్రాజ్యవాదం స్థానంలో ఏర్పడిన ఈ *జాతీయ* ప్రభుత్వపు మత భావజాలం అనివార్యంగా అదే తెగల ప్రజల పాలిట అణచివేత రూపంగా మారింది. దీని మీద పెట్టుబడి ఫలితంగా మారుతున్న సామాజిక సంబంధాల వల్ల ఆఫ్గన్లో ఏర్పడుతున్న భిన్న వర్గాలకు వ్యతిరేకత మొదలైంది.
అయితే ఈ నేపథ్యాన్ని ఆసరా చేసుకుని అమెరికన్ ప్రభుత్వ కనుసన్నలలో సాగే బ్యూరాక్రటిక్ బూర్జువా వ్యవస్థను ప్రతిష్టించే ప్రయత్నం జరిగింది. దీన్ని నేటి వరకూ చూశాము. అయితే అమెరికా సైతం ఆఫ్ఘనిస్తాన్ ప్రజల స్వాంతంత్ర్యాన్ని హరించలేక పలాయనమైందనే భ్రమలో చాలా మంది ఉన్నారు.
కానీ తాలీబాన్లు ఇస్లామ్ మత భావజాల జాతీయతను, తెగల సంస్కృతుల మేలు కలయికతో కూడిన భూస్వామ్య వ్యవస్థని ప్రతిష్టిస్తూనే అనివార్యంగా సామ్రాజ్యవాద అనుకూల పాలన అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ దిశగా ఆఫ్ఘనిస్తాన్ ను నడపడానికి సిద్ధమవుతున్నారు.
కాబట్టి సామ్రాజ్యవాదం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆఫ్ఘనిస్తాన్ పై విజయం సాధించిందని మనం గ్రహించాలి. నేడు ఆఫ్ఘనిస్తాన్ భూస్వామ్య-సామ్రజ్యవాద అనుకూల ప్రభుత్వాన్ని ఇస్లామ్ మత జాతీయత భావజాల ఐక్యతతో ఏర్పరిచే దిశగా పరిణామాలు సాగుతున్నాయి. ఈ రోజు సామ్రాజ్యవాదం ప్రగతిశీల – అభ్యుదయ మార్గాన్ని ఆఫ్ఘనిస్తాన్ లో కనుమరుగు చేయడంలో తాత్కాలికంగా సఫలమవ్వవచ్చు, కానీ స్వేచ్ఛా జీవులైన ఆఫ్ఘాన్ ప్రజలు బ్యూరోక్రటిక్ బూర్జువా-భూస్వామ్య ప్రభుత్వాన్ని నిర్మూలించకుండా సామ్రాజ్యవాదాన్ని కూలదోయకుండా నిద్రించరని గమనించాలి.