నా కథ చెబుతా వినండి…

‘‘నా పేరు మమత. ప్రతిసారీ మీరు చెప్పే సమస్యలు వింటున్నాను. వింటున్నకొద్దీ బాధ మరింత ఎక్కువ అవుతూ

ఉన్నది. నా కలల ప్రపంచాన్ని ఛిద్రం చేసిన నా జీవితం గుర్తుకు వచ్చి మరింతగా నొప్పి అనిపిస్తున్నది. ఈ స్నేహిత సంస్థలో ప్రతి ఒక్కరూ తమ జీవితం గురించి చెప్పేటప్పుడు మీ అందరి జీవితాలకంటే నా జీవితం, కథా దుర్భరమైనవి, భిన్నమైనవి అంటూ ఉన్నారు. నేనూ అదే చెప్పబోతున్నాను. నిజానికి నా జీవితం మీ అందరికంటే భిన్నమైనది. చాలా మంది భర్తల అత్యాచారాల రూపాలు మన అందరికీ.. కొన్నిసార్లు ఒకే రకంగా మరికొన్ని సార్లు భిన్నంగా ఉంటాయి అంతే. అయితే ఇక్కడ నేనే భిన్నమైన దాన్ని. అవును నేను మీలాగా భర్త వలన బాధలకు, గురైన భార్యనే. కానీ నేను పురుషుణ్ణి కూడా… ప్రకృతి నియమాలను బట్టి ఇంకో స్త్రీకి భర్త కావల్సిన పురుషుణ్ణి. కానీ నేను స్త్రీగా మారిన పురుషుణ్ని. నేను ట్రాన్స్‌ 

ఉమెన్‌న్ని సెక్స్‌ మార్పిడి చేసుకుని స్త్రీగా మారాను. నన్ను చూస్తే మొదట్నించీ మీకు అర్థమవుతూనే ఉంది కదా. మీరంతా నన్ను ఎంతో ప్రేమగా, గౌరవంగా సాటి స్త్రీగా, చెల్లిగా, అక్కగా స్వీకరించారు. అర్థం చేస్కున్నారు. మీ సౌజన్యానికి, సంస్కారానికి ఎంతో కృతజ్ఞురాలిని. మీరంతా నేను ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ నుంచి మీ బాధలు వినడానికి వచ్చానని అనుకుంటున్నారు కానీ కాదు ఫ్రెండ్స్‌… నేను కూడా మీలాగా ఒక బాధిత స్త్రీగా.. భార్యగా వచ్చాను. నా భర్త నుంచి నేను అనుభవించిన హింస గురించి మీలాగా అందరితో పంచుకోవాలని వచ్చాను.’’ ఒక క్షణం మాట్లాడ్డం ఆపి అందరివైపూ చూసింది మమత. అందరూ తనవైపు చాలా ఆసక్తిగా చూస్తుండడం గమనించింది. చిన్నగా నిట్టూర్చి తన కథ రాస్తున్న విద్య వైపు చూసి ‘‘విద్యా శ్రద్ధగా రాయి… నేనూ నా జీవితం మీ అందరి స్త్రీల కంటే పూర్తిగా భిన్నం’’ అంది మమత… విద్య చిన్నగా నవ్వింది. కానీ అక్కడున్న ప్రతీ ఒక్కరికీ తెలుసు మమత జీవితం తమ జీవితాల కంటే ఎక్కువ దుర్భరంగా ఉండి ఉంటుందని.

‘నా భర్త పేరు అరుణ్‌ మా పెళ్ళై నాలుగేళ్ళు. మీ అందరికీ తెలుసు నా పేరు మమత అని. కానీ మమతగా మారకముందు నా పేరు సాత్విక్‌. మా అమ్మకు ఇద్దరు ఆడపిల్లలు. నేను, తమ్ముడు. మాది చాలా సాంప్రదాయమైన కుటుంబం మా నాన్నకి పెద్ద సూపర్‌ బజార్‌ ఉండేది. టవున్‌లో చాలా మంది నాన్న షాపులో సరుకులు కొనుక్కొనేవారు. అమ్మ సంప్రదాయ గృహిణి దివారాత్రుళ్ళూ నాన్న, నానమ్మ, అత్తయ్యలు, బాబాయ్‌లు మా నలుగురు పిల్లలకు చాకిరీ చేస్తుండేది. మాపట్ల ఎంతో ఓర్పుతో ఉండేది. ఇల్లంతా బంధువులతో కళకళ్ళాడ్తూ ఉండేది. ఇద్దరు నౌఖర్లుండేవారు అమ్మకు తోడుగా. అక్కలిద్దర్కీ సంగీతం, నృత్యం రెంటిలోనూ ప్రవేశం ఉంది. మాష్టారు ఇంటికొచ్చి చెప్తుండేవారు. సాయంత్రం అయ్యిందంటే ఇంట్లోని చావిడీ పక్క గది సంగీత నృత్య సవ్వడులతో గలగలలాడేది. మాష్టారు అక్కలిద్దరూ ఎత్తుకునే రాగాలు గది దాటి.. ఇల్లూ వాకిలీ వీధుల గుండా ప్రవహించేవి. ‘అదిగో అయ్యవారింట సంగీత సాధన మొదలైనట్లుంది’ అనుకునేవారు జనం.

నేనూ సంగీతం, నృత్యం నేర్చుకుంటా అంటే నాన్న ఒప్పుకోలేదు. అవి ఆడవాళ్ళే నేర్చుకోవాలి. ‘పోయి అన్నలాగా క్రికెట్‌ ఆడుకో ఫో’ అని కసిరేవారు. ‘మరి నృత్యం మాష్టారు మగ కదా… ఫలానా డాన్స్‌ మాష్టారు మగ కదా… అద్భుతంగా డ్యాన్స్‌ చేసే ప్రభుదేవా చిరంజీవి మగ కాదా…’ ఇట్లా ఎంత వాదించినా బ్రతిమిలాడినా వినేవారు కాదు. నాకు పెద్ద అక్క అదితి, చిన్నక్క దాక్షిణ్యలాగా నృత్యం నేర్చుకోవాలని ఉండేది. నృత్యం చేసేటప్పుడు వాళ్ళ వేళ్ళ చేతుల కదలికలు… మెడ వంపులు… పెదవుల విరుపులు… చేపల్లా చురుక్కుమని చెవుల వైపుకి కదిలే కళ్ళు… పాదాల వేళ్ళ చివర్లు నేల కాన్చి పైకి లేపుతూ బేలెన్స్‌ చేసే ప్రయత్నంలో ఒళ్ళంతా మెరుపు తీగలా అటూ ఇటూ వంగడాలు… అన్నిటికీ మించి నడుము రెండు వైపులా రెండు చేతుల మునివేళ్ళు పెట్టి నడుముని గడియారపు ముల్లులా రెండు వైపులా గుండ్రంగా తిప్పడం, ఆ నడుము చుట్టూ ‘దోపుకునే పరికిణీ’ శరీరాన్ని విల్లులా వంచడం అలా వంచినప్పుడల్లా వాళ్ళు తల్లో పెట్టుకునే మల్లెదండలు చెంపల మీదకు విసిరినట్లు కొట్టటం, కళ్ళకి పెట్టుకునే కాటుక, పొడవాటి బొట్టు.. కాళ్ళకీ పాదాలకీ మధ్యలో నిండి ఇమిడిపోయే మువ్వలు… చేతి గాజులు… ఛక్‌మనే కాంతితో మిలమిలా మెరిసిపోయే తెలుపు, ఎరుపు రాళ్ళతో ఉండే ముక్కుపుడక నన్నెంతో ఆకర్షించేవి. నాన్న ఉన్నంత సేపు బయటే ఉంటూ నాన్న వెళ్ళిపోయాక ఆ గదిలోనే

ఉండేవాణ్ణి… దూరంగా నిలబడి వాళ్ళను అనుసరిస్తూ గెంతేవాణ్ణి. నన్ను చూస్తూ మాష్టారు ‘‘ఏమ్మా ఆనందినీ అబ్బాయి అంతగా ఇష్టపడుతున్నాడుగా నృత్యం నేర్పిస్తే ఏమవుతుందీ’’ అనేవారు. అమ్మ ‘వారు ఒప్పుకోరండీ… ఇప్పటికీ చదువులో వెనకబడి ఉన్నాడు ఇక దీన్లో చేర్పిస్తే ఇంకా వెనకబడతాడేమో అని వారి భయం… నేనూ అడిగి చూసాను. అయినా ఒప్పుకోలేదు మాష్టారూ… అద్వైత్‌ లాగా వీడూ చక్కగా చదువుకోవాలని మా ఆశ’ అనేది అమ్మ. ఒకసారి బయటినుంచి ఇంటికి అనుకోకుండా తొందరగా వచ్చిన నాన్న అక్కలిద్దరి గదిలో ఒక మూల నృత్యం చేస్తున్న నన్ను చూసి, ఈడ్చుకు తన గదిలోకి తీస్కెళ్ళి చెంపలు వాయించేసారు. ‘ఇంకోసారి ఆ గది దరిదాపుల్లో కన్పిస్తే చంపేస్తా’ అని అన్నారు. మెల్లగా నాలో అలజడి మొదలైంది. అక్కయ్యల గదుల్లో ఎక్కువ సేపు గడపడం… అక్కలు వెళ్ళిపోయాక తలుపులు వేస్కుని వాళ్ళ గౌన్లు, పరికిణీలు… కాటుక బొట్టు, గాజులు, గజ్జెలు వేస్కుని మురిసిపోయేవాణ్ణి. నేను ఆడవేషంలో చాలా అందంగా ఉన్నాననిపించేది. అసలు నేను అబ్బాయిని కానే కాదన్న భావన కలిగేది. అక్కల్లాగా నడవడం, నవ్వడం చేసేవాణ్ణి. ఇంట్లో అంట్లు తోమడం, గదులు ఊడ్వడం, బట్టలు ఆరెయ్యడం లాంటివి చేస్తూ అమ్మకి సాయం చేసే వాణ్ణి. ‘ఫో సాత్విక్‌ చదువుకో పో… బయటకెళ్ళి ఫ్రెండ్స్‌తో అన్నయ్యతో ఆడుకో ఫో’ అని అమ్మ విసుక్కునేది.

అక్కలు, వాళ్ళ స్నేహితురాళ్ళు నన్ను వాళ్ళ ఆటల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. అన్నయ్య స్నేహితులు నేను చిన్నవాణ్ణని రానిచ్చేవారు కాదు. నాకు వాళ్ళతో ఆడటం కూడా ఇష్టం ఉండేది కాదు. ‘‘మగాళ్ళతో ఆటలేంటి నాకూ’’… అని అనిపించేది అక్కల వైపు మనసు గుంజేది.

ఒకసారి అక్కవాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళారు. మేం వెళ్ళలేదు. అక్కల గదిలోకి దూరి చక్కగా అక్కల బట్టలు వేస్కొని కాటుక లిప్‌స్టిక్‌ బొట్టు, పూలు, గాజులు, మువ్వలు అన్నీ వేస్కుని టేప్‌రికార్డర్‌లో చిన్నగా సంగీతం పెట్టుకుని నృత్యం చేయసాగాను. ఆ తొందరపాటులో లోపలినుంచి తలుపు గొళ్ళం సరిగా పెట్టుకోలేదు. నాన్న తోసిన తోపుకు తలుపు భళ్ళుమని తెరుచుకుంది. అమ్మా నాన్న… అద్వైత్‌ నన్ను చూసి కొయ్యబారిపోయారు. ఆ రోజు నా ఒంటిమీద దెబ్బపడని స్థలం లేదు. పెదవి చిట్లి రక్తం కారింది. వారం రోజులు బడికే వెళ్లలేదు. అప్పటికే నాకు పదకొండేళ్ళు… నాన్న నా మీద నిఘా ఉంచారు. అంతా నన్ను కాపలా కాసేవాళ్ళు. నాకు దుఃఖం వచ్చేది. నా ఇష్టం వచ్చినట్లు నన్నెందుకు ఉండనివ్వరు? రాత్రిళ్ళు అక్కల పక్కన పడుకునే వాణ్ణి. అమ్మ లేపి తీస్కెళ్ళి అన్న పక్కన పడుకోబెట్టేది. స్కూల్లో అమ్మాయిలతో ఎక్కువ స్నేహం చేసేవాణ్ణి… వాళ్ళతో ఉండడానికి ప్రయత్నం చేసేవాణ్ణి. అబ్బాయిలంతా ఆట పట్టించేవారు. నా స్నేహితుడు శంకరం మాత్రం నన్ను బాగా అర్థం చేస్కునేవాడు. చూస్తు చూస్తుండగానే నాకు పధ్నాలుగేళ్ళు వచ్చేసాయి. మీసాలు, చిరుగడ్డం… గొంతు బొంగురుపోవడం మొదలయ్యే కొద్దీ నాకు చిరాగ్గా ఉండేది. అన్న అద్వైత్‌ నాకంటే మూడేళ్ళు పెద్ద. ఇంటర్‌లో చేరాడు. జూనియర్‌ క్రికెట్‌ టీంలో స్కూలు కాలేజీలో పేరు తెచ్చుకున్నాడు. అద్వైత్‌కి కూడా గడ్డం మీసం వచ్చేసాయి. లలితమైన గొంతుపోయింది. బొంగురు గొంతుతో… ముఖం మీద మొటిమలతో రఫ్‌గా కనపడేవాడు. ‘వాణ్ణి చూసి బుద్ధి తెచ్చుకో’ అనేవాడు నాన్న. నేను నా ముఖం మీద వెంట్రుకలను భరించలేకపోయేవాణ్ణి నున్నగా షేవ్‌ చేస్కునేవాణ్ణి.. చంకల్లో… గజ్జ్జల్లో కూడా… నాన్న తిట్టేవాడు. ఆ యేడాది స్కూల్లో జరిగిన ఏన్యువల్‌ ఫంక్షన్‌కి కాళికామాతకి సంబంధించి నృత్యం చేయాలని నిర్ణయం జరిగింది. అమ్మాయిలు ఎవరూ ఇష్టపడలేదు. కాళికామాతలాగా నాలుక బయటపెట్టటం వాళ్ళకి ఇష్టం కాలేదు. చివరి నిముషంలో నేను ఒప్పుకున్నా. కాళీమాత నన్ను కరుణించిందా… నేనే కాళీమాతనా అనిపించింది. నాకు నేను ఒక అద్భుతంలాగా కనిపించాను. టవునులో బంధువుల్లో అంతా ‘‘సాత్వికుడు ఆడవేషం వేసాట్ట. ఏంటో ఇట్లా తయారయ్యాడేమోయ్‌ సాంబమూర్తి మీవాడు జాగ్రత్త’’ అని నాన్నకి చెప్పడం. పైగా అత్తయ్య ఒకసారి మా ఇంటికొచ్చిన రోజు రాత్రి. ‘సాత్విక్‌ నా గాజులు వేసుకుని పండుకున్నాడురా, కొంచెం జాగ్రత్త’ అని చెప్పింది నాన్నకి. నాన్న నన్ను బాగా కొట్టి ఒక సెక్స్‌ డాక్టర్‌ దగ్గరికి తీస్కెళ్ళారు. ఆయన నన్ను ఏవో ప్రశ్నలు వేసి… ఒక ఫాం నింపమని చెప్పి… రాసాక కొన్ని మాత్రలు ఇచ్చి ఒక ఆర్నెల్లపాటు వాడాలని చెప్పారు. నేను వేస్కునేవాణ్ణి కాదు. నేను నార్మల్‌ అని చెప్పేవాణ్ణి.. ‘నాది మగ దేహం… నా మనసు మాత్రం ఆడదానిదని నన్ను ఎందుకు అర్థం చేస్కోరు నాన్నా’ అని నన్ను చావబాదుతున్న నాన్న చేతుల్ని ఆపుతూ ఏడ్చేవాణ్ణి, అరిచేవాణ్ణి. కొట్టి కొట్టి నాన్న అలిసిపోయి వెళ్ళిపోయాక గాయాలతో ముడ్చుకు పడుకునేవాణ్ణి. అమ్మ, అక్కలు ఏడ్చేవారు. అమ్మ నన్ను అర్థం చేస్కునే ప్రయత్నం చేసేది. నన్ను మామూలుగా మార్చమని పూజలు చేసేది. గుళ్ళకి వెళ్ళేది. ఉపవాసాలు చేసేది. నాతో పూజలు చేయించేది. ‘‘నా పరువు పోతుంది. వీడివల్ల… నా ఫ్రెండ్స్‌ మీ తమ్ముడు కొజ్జావాడు అంటుంటే’’ అన్నయ్య అసహ్యించుకునేవాడు. నన్ను తనను ముట్టనిచ్చేవాడు కాదు. ‘ఛీ… ఫో’ అని చేతులు విసిరి కొట్టేవాడు. అక్కలిద్దరూ కూడా నన్ను వింత జీవిని చూసినట్లు చూసేవాళ్ళు. తమ బట్టల అలమారా… తమ డ్రెస్సింగ్‌ టేబుల్‌కి తాళాలు వేస్కుని గదికి కూడా తాళం వేస్కుని వెళ్ళిపోయేవారు. అమ్మ గదిలోకి వెళ్ళే ధైర్యం లేదు.. ఎందుకంటే అది నాన్నది కూడా. ఒక రోజు నా దగ్గర ఉన్న డబ్బులతోటి గాజులు కొనుక్కొని, అమ్మ చీర ఒకటి దొంగలించి, నా గదిలో పుస్తకాల కింద రహస్యంగా ఈ మేకప్‌ సామానులతో సహా దాచుకుని రాత్రిళ్ళు ఆడవేషం వేస్కుని మురిసిపోయేదాన్ని. అద్దం మీద పెదాలతో ముద్రలు వేసి నా పేరు ‘మమత’ అని రాసేదాన్ని. లిప్‌స్టిక్‌తో ‘సాత్విక్‌’ అని రాసి దాని మీద ఇంటూ మార్కు వేసేదాన్ని. ఎన్నిసార్లు పట్టుబడ్డానో అన్ని సార్లు భయంకరంగా దెబ్బలు తినేదాన్ని. నన్ను కొట్టి, నాన్న కూడా ఏడ్చేవాడు అమ్మతో పాటు. నాన్న కొట్టాక రాత్రిళ్ళు… దాదాపు రోజూ ఎందుకు నేనిలా ఉన్నా… నన్ను నేను ఏ మాత్రమూ పురుషుడిలా ఎందుకు అంగీకరించలేకపోతున్నా… నా దేహం పురుషుడి దేహంలా ఎదుగుతున్నది. అయినా నన్ను నేను స్త్రీలాగా ఎందుకు భావిస్తున్నా… నన్నెందుకు వీళ్ళు అర్థం చేస్కోరు? డాక్టర్లు కూడా మత్తు మందులు ఇచ్చి నిద్రపుచ్చుతున్నారు. ఎందుకు అంటూ నాకు నాకు నేను ప్రశ్నలు వేసుకుని మౌనంగా దుఃఖించే దాన్ని.

పదో తరగతిలో ఎనిమిదో తరగతి నించీ నేను ఆరాధిస్తున్న, ప్రేమిస్తున్న అమిత్‌కి ప్రేమలేఖ రాసా… అంతే స్కూలంతా గగ్గోలు… నవ్వులు హేళనలు అమిత్‌ వాళ్ళ నాన్న వచ్చి గొడవ గొడవ చేసి నన్ను కొట్టటానికి వచ్చారు. ‘నా కొడుకు ఎట్లా కనిపిస్తున్నాడు నీకూ’ అంటూ. ప్రిన్సిపాల్‌ పేరెంట్స్‌ మీటింగ్‌ పెట్టి సైకియాట్రిస్ట్‌కి చూపించమని నాన్నకి చెప్పారు.

నాన్న ఆ రోజు మంచుగడ్డలా ఘనీభవించినట్లు అన్పించింది. బాంబేలో నన్నొక మెంటల్‌ హాస్పిటల్‌కి తీస్కెళ్ళారు. డాక్టర్‌ వద్దన్నా అవసరం లేదన్నా వినకుండా షాక్‌ ట్రీట్మెంట్‌ ఇప్పించారు. షాకులు తగిలిన నా మెదడు స్థంభించింది. నా ఇష్టాలకి, కోరికలకు నా అస్థిత్వానికి తగిలిన షాక్‌తో నేను వెర్రివాణ్ణి అయిపోయాను. రోజూ రాత్రీ పగలూ కలిపి ఒక ఆరు మందులు మింగించేవాడు నాన్న బలవంతంగా… తిని నిద్రపోవడమే. మెలకువ వస్తే నాలోని మమత నాతో మాట్లాడేది. నాలోపల ఉన్న సాత్విక్‌ని ద్వేషించేవాణ్ణి… నాన్న, అన్న స్కూలు ప్రిన్సిపాల్‌, అమిత్‌ వాళ్ళ నాన్న… వీళ్ళందరినీ కూడా.

అమిత్‌ను మర్చిపోలేకపోయాను. అమిత్‌ను చూసినా, తల్చుకున్నా, తగిలినా మనసూ దేహం పులకించిపోయేది. నాలోపల మమత నిద్రలేస్తుంది. అమిత్‌ నా పురుషుడు. నా కోసమే పుట్టాడు. నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. కానీ నాకు దక్కడం లేదు అని అన్పిస్తుంది. ఏడుపు వస్తుంది. రాత్రింబగళ్ళు అమిత్‌ నా కళ్ళ ముందు కనిపిస్తాడు. కలల్లో నన్ను ముద్దు పెట్టుకుంటాడు. కౌగలించుకుంటాడు. డాక్టరు చెప్పినట్లు నేను ప్రయత్నించాను. స్కూల్లో నన్ను చాలా ఇష్టంగా చూసే వినీతను తల్చుకున్నా… నాకే స్పందనలు కలగలేదు. ఒకసారి వినీత ప్లేగ్రౌండ్‌లో పడిపోతే నేను లేపాను. వినీత నా చేతులు వదలలేదు. ఆమె చెంపలు కందిపోయి ఉన్నాయి సిగ్గుతో… కానీ నాకు ఏ అనుభూతులూ కలగలేదు. అదే అమిత్‌ చెయ్యి నా భుజం మీద పడిరదా దేహం అంతా కోరికల నాగుపాములాగా పడగలేస్తుంది. నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. నేను పురుషుణ్ణి కాదు స్త్రీని అని. అమిత్‌కు నేను రాసిన ప్రేమలేఖ కారణంగా.. స్కూల్లో నన్ను రెండు నెలలు రస్టికేట్‌ చేసారు. అమిత్‌ వేరే స్కూల్లో చేరాడు. అమిత్‌ దూరమై నేను తల్లడిల్లిపోయాను. స్కూల్లో ఎవరెవరినో అడిగాను అమిత్‌ జాడ చెప్పమని. నన్నో పిచ్చివాణ్ణి చూసినట్లు చూసారు. అమిత్‌ ఇంటి ముందు దారికాచి చూసేవాణ్ణి. వాళ్ళ నాన్న తరిమికొట్టి నాన్నకు ఫోన్‌ చేసేవాడు. నాన్న చేతుల్లో నా దేహం చిత్రహింసల కొలిమి అయ్యేది. నన్నందరూ అసహ్యించు కుంటున్నారు.

నన్ను ఎవరూ అర్థం చేస్కోరు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇలా బతకడం నాకు సాధ్యం కాదు. ఈ నిత్య నరకంలో వేగలేను. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన చాలాసార్లు వచ్చింది. కానీ అమ్మ ఏమైపోతుంది నేను పోయిన మరుక్షణం అనిపించేది. నిద్రపట్టని రాత్రిళ్ళు అమ్మ పాదాల మీదపడి వల వల ఏడ్చేదాన్ని. ఏడ్చీ ఏడ్చీ అమ్మకి కూడా కన్నీళ్ళింకిపోయి నన్ను అలా ఏడ్వనిచ్చేది. ఒకరోజు స్కూల్‌ బయట క్లాసులైపోయాక ఒక ‘గే’ అబ్బాయి నా మీద దాడి చేసాడు.

ఒక రోజు రాత్రి నాన్న అమ్మకిచ్చిన డబ్బు దాదాపు ఇరవై వేలు తీసుకుని, ఎప్పటినుంచో సర్దిపెట్టుకున్న ఎయిర్‌ బాగ్‌ తీస్కుని అమ్మగదిలోకి వెళ్ళి, దూరం నుంచే అమ్మ మొఖం వైపు తదేకంగా కన్నీళ్ళు ఆపుకుంటూ చూసి, అమ్మ పాదాలవైపు దూరాన్నించే శిరసు వంచి నమస్కరించి, క్షమించమని వేడుకుని ఇంటి గడప దాటాను. అంటే పారిపోయాను. హైద్రాబాద్‌ చేరుకుని బస్టాపుల్లో రైల్వే స్టేషన్లలో పడుకున్నా. తిండీ నిద్రా సరిగ్గా ఉండేవికావు. రోజులు గడిచి పోతున్నాయి. పైసలు అయిపోయాయి. ఒక రోజు రైల్వే స్టేషన్లో పాట పాడుతూ… డాన్స్‌ చేస్తే డబ్బులు వచ్చాయి. అదే కొనసాగించాను. మెల్లగా హోటల్స్‌లో గే బార్‌ డాన్సర్‌గా మారాను. రాత్రిళ్ళు గే డాన్స్‌ చేసేదాన్ని. రోజింత అని ఇచ్చేవారు. అక్కడ గేలు పరిచయం అయ్యారు. ఒకసారి నా మీద సెక్స్‌ కోసం దాడి చేసారు. నాకది నచ్చలేదు. నా మనసులోంచి అమిత్‌ ఇంకా పోలేదు. అక్కడ్నించి పారిపోయాను. ఒకసారి నన్ను చూసిన తెలుగు సీరియల్‌ డైరెక్టర్‌ నాకు తన సినిమాలో గే పాత్ర ఇచ్చారు. ఇక అప్పట్నించీ టీవీ సీరియల్స్‌లో, ఐటం షోలలో నటించడం మొదలెట్టాను. ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీతో పరిచయాలు పెరిగాయి. నా సెక్స్‌ ఛేంజ్‌ చేస్కోవాలన్న ఆరాటం పెరిగిపోయింది. పూర్తి స్త్రీగా మారిపోవాలి. డాక్టర్‌ని కలిసాను. ముందు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. నా మొండితనం చూసి చాలా ఖర్చు అవుతుంది అన్నాడు. ఆ ఫీజుకి నాకు కళ్ళు తిరిగాయి. ఇక నా వైద్య ఖర్చుల కోసం చాలా మంది డైరెక్టర్లను కలవడం, బార్లలో డాన్సులు ఎక్కువగా చేయడం మొదలుపెట్టాను. డబ్బు సంపాదనే నా ప్రధాన ధ్యేయం అయిపోయింది. కానీ ఎప్పుడూ గీత దాటలేదు. మిగతా ట్రాన్స్‌జెండర్లు వ్యభిచారం చేసేవారు. అది వాళ్ళ నిస్సహాయత. బస్టాపుల్లో, రైల్వేస్టేషన్లలో, షాపుల్లో అడుక్కునేవారు, చాలా కష్టాలు అనుభవించేవారు. కానీ నాకు అలా చేయాలన్పించలేదు. నా మీద… నా దేహం మీద నాకు గౌరవం ఉంది. కొందరు ట్రాన్స్‌ వుమెన్‌న్ని కొంత మంది మగవాళ్ళు ఎత్తుకుపోయో… మాయ మాటలు చెప్పో సిటీ అవుట్‌ స్కర్ట్స్‌కి తీస్కెళ్ళి రేప్‌ చేసేవాళ్ళు… స్పృహ కోల్పోయిన వాళ్ళని అక్కడే అర్థరాత్రి నిర్ధాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. అలా ఎంత మందిని చూసానో. స్త్రీలనే అనుకున్నాను.. మా ట్రన్స్‌ వుమెన్‌న్ని కూడా రేప్‌ చేస్తారా అని నాకు ఆశ్చర్యం, భయమూ కలిగేవి. కానీ ఆ భయం స్త్రీని కావాలన్న నా లక్ష్యాన్ని చెప్పలేకపోయింది. నా స్నేహితుడు పారిపోయి వచ్చి ట్రాన్స్‌జెండర్‌గా మారాడు. అతను నాకు సాయం జేసాడు. ట్రీట్‌మెంట్‌తో మెల్లగా నాలో మార్పు వచ్చింది. కానీ భయంకరమైన నొప్పులు అనుభవించాను, డాక్టర్లు ఇచ్చిన హార్మోన్‌ ఇంజెక్షన్స్‌ వలన. సెక్స్‌ ఛేంజీ ఆపరేషన్‌ చేయించు కున్నాను. స్త్రీగా మారిపోయిన నన్ను ఒకప్పుడు నేను పురుషుణ్ణి అంటే ఎవరూ నమ్మరు. ఇదంతా జరగడానికి నాకు ఏడేళ్ళు పట్టింది.

ఈ క్రమంలోనే నాకు ఫేస్‌ బుక్‌ ద్వారా అరుణ్‌ పరిచయం అయ్యాడు. అతనే వెంటబడి, వెంటబడి పరిచయం చేస్కున్నాడు. ఆరు నెల్లకు కానీ అతనికి  నన్ను కలిసే అవకాశాన్ని ఇవ్వలేదు. నేను తొలిసారి అతన్ని కలిసాక ఫరవాలేదు అనిపించాడు. పరిచయం, స్నేహం పెరిగింది. పెళ్ళి చేస్కుందాం అన్నాడు. ఇంటినించి పారిపోయాక ఏడేళ్ళ కాలం దాటింది. ఇరవై ఐదేళ్ళ ఏళ్ళ యువతిగా మారాను. అరుణ్‌ యూనివర్సిటీలో పీజీ చేస్తాడు. నెలకో పదివేలు పార్ట్‌ టైం సంపాదిస్తాడు. నాకు నా టీవీ షూట్స్‌ ద్వారా నెలకో నలభై వేల దాకా వస్తాయి. అయినా ఆలోచించాను. అతనికి తెలుసు నేను చిల్లరగా రోడ్ల మీద తిరగనని పూర్తిగా ఏక్టింగ్‌ చేస్కుని ఇంట్లో ఉంటానని. బార్‌లలో డాన్స్‌ ఎప్పుడో మానేసాను. స్వేచ్ఛగా తిరగడం, ఫ్రీ సెక్స్‌ నాతో కాదు అని ముందే చెప్పాను. నాకు మంచి భార్యగా… తల్లిగా ఉండాలని ఉంది.. అమ్మలా ఓపిగ్గా సహనంతో అందర్కి సేవలు చేస్తూ పూజలు, నోములూ, వ్రతాలూ చేస్తూ.. మా అమ్మలాగా మడి కట్టుకుని వంట చేస్తూ… రంగు రంగుల చీరలు కట్టుకుని పూజలు చేస్తూ, రకరకాల వంటలు చేస్తూ ఓపిగ్గా వండి వడ్డిస్తూ… పిల్లల్ని ముద్దుగా కసుర్తూ ఉండాలని… అంతెందుకు… మామయ్య కూతురు రామలక్ష్మిలాగా కొంగు కప్పుకుని, నెలనెలా బహిష్టైన అక్కల్లా, ఇంటి లోపల అరుగు మీద చాపా చెంబూ వేస్కొని కూర్చోవాలని, అలకరించుకుని పెళ్ళిళ్ళకు వెళ్ళాలనీ, పసుపూ కుంకుమా కళ్ళకద్దుకుని తాళిబొట్టుకు రాస్కోవాలని… ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం అంటూ ముత్తైయిదువులా కొంగు నింపుకోవాలనీ… గోరింటాకు పెట్టుకోవాలనీ ఎంతో ఆశ. ఎందుకిట్లా… అన్న అద్వైత్‌కీ, నాన్నకీ స్కూల్లో తన స్నేహితులకీ నేను చూస్తున్న చాలా మంది మగాళ్ళకి ఇలా ఉండదే… ఎన్ని రాత్రిళ్ళు నాలో పెరుగుతున్న ఈ ఆలోచనలతో ఘర్షణ పడుతూ కన్నీళ్ళు కార్చానో. నా కలలన్నీ చెప్పాను అరుణ్‌కి. మంచి భార్యగా ఉండాలని ఉందని చెప్పాను. అన్నీ తనకి సమ్మతమే అన్నాడు. ‘ఇంట్లో ఒప్పించావా…’ అంటే ‘మెల్లగా చెబుతాను మా ఇంట్లో నాదే చెల్లుతుంది వాళ్ళకి జీర్ణం కావాలి కదా.. పైగా నా మేనకోడల్ని చేస్కోమని అత్తయ్య పోరుతున్నది. వాళ్ళ అందర్కీ మెల్లగా చెబుతాను. మనకి ఫ్రెండ్స్‌, బంధువులు ఉన్నారు చాలు గుళ్ళో పెళ్ళి చేసుకుందాం’ అన్నాడు. ‘మేరేజీ సర్టిఫికేట్‌ కూడా తీస్కుందాం’ అన్నాను నేను. ‘సరేలే చూద్దాం’ అన్నాడు. ‘సరేలే కాదు అరుణ్‌ మేరేజీ సర్టిఫికేట్‌ చాలా ముఖ్యం మన పెళ్ళి లీగలైజ్‌ కావాలి కదా’’ అన్నా ఆందోళనతో కలవరపడిపోతూ. ‘అబ్బ ఇన్ని అనుమానాలు ఎందుకు మమతా నీకు నా మీద నమ్మకం ఉండాలి, ఉందా లేదా?’ అన్నాడు నన్ను దగ్గరకు తీస్కుని… ‘ఉంది. అయినా…’ అన్నాను తడబడుతూ… ‘సరే తీస్కుందాం మేరేజీ సర్టిఫికేట్‌’ అన్నాడు కొద్దిగా చిరాగ్గా కనుబొమ్మలు ముడుస్తూ… మనసులో ఏదో దిగులు ఉన్నా నాకూ పెళ్ళవుతున్నది అన్న సంతోషం నిండిపోయింది. ఎన్నో కలలు కన్నాను, పెళ్ళి గురించి, కాబోయే భర్త గురించి.. పెళ్ళి కూతురుగా అలంకరణకు సంబంధించి నా స్నేహితులు చాలా శ్రద్ధ తీసుకున్నారు. బ్యూటీ పార్లర్‌ నుంచి బ్యూటీషియన్‌ వచ్చింది. అంతా సాంప్రదాయబద్ధంగా జరిగింది. నా పెళ్ళికి మా ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ పెద్ద ‘గురు’ కూడా వచ్చాడు. అమ్మా, నాన్న, అక్కలు, అన్న, బంధువులు లేని లోటు గుండెను మెలి తిప్పింది. నిశ్శబ్దంగా ఏడ్చుకున్నాను. హైద్రాబాద్‌ వచ్చినప్పటి నుంచీ నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్న షెప్‌ానాజ్‌ బేగం నాకు అమ్మ అయింది పెళ్ళి పందిరిలో. ఆమె ఇరవై ఏళ్ళ క్రితమే కర్నాటక నుంచి పారిపోయి వచ్చి సెక్స్‌ ఛేంజ్‌ చేసుకుని అమ్మాయిగా మారింది. పెళ్ళి చేస్కుందామని మొగవాళ్ళని నమ్మి మోసపోయి వ్యభిచారం చేస్కుంటూ.. అడుక్కుంటూ బతుకుతున్నది. నా పెళ్ళి గుళ్ళో అయినా ఘనంగా జరిగింది. అరుణ్‌ వీడియో వద్దన్నాడు. పెళ్ళి అయ్యాక అరుణ్‌ నా రూంకి మారిపోయాడు. రెండు గదుల చిన్న ఇల్లు నాది. ‘వేరే ఇల్లు తీస్కుందాం’ అన్నా ఎందుకు ఇది బాగానే ఉందిగా అయినా నేను స్టడీ పర్పస్‌ యూనివర్సిటీలో, హాస్టల్‌ల్లోనే ఎక్కువగా ఉంటాను కదా’’ అన్నాడు. కొన్ని రోజులు దాదాపు రెండు నెలలు అరుణ్‌ నాతోనే ఉన్నాడు. ఇల్లంతా కొత్తగా అలంకరించాను. మా ఇద్దరి పెళ్ళిఫోటో ప్రేమ్‌ కట్టి పెట్టాను గోడమీద. నా వంటిల్లు ఎప్పుడో నా అభిరుచికి తగ్గట్లుగా సర్దుకున్నా… పక్కనే పూజకి ఒక ప్రత్యేకమైన చెక్క మందిర్‌ ఉంటుంది. పెరట్లో పూల మొక్కలు… వాకిట్లో తులసీ కోట పెట్టుకున్నాను. అచ్చం నా పుట్టింట్లో అమ్మ వంటిల్లులా ఉంది నా వంటిల్లు. నా స్నేహితురాళ్ళను ఎవర్నీ ఎక్కువ రావద్దన్నాను. అరుణ్‌కి ఇబ్బంది అవుతుందని. చుట్టుపక్కల వాళ్ళతో పెద్ద సంబంధాలు లేవు. వాళ్ళకి నేనొక వింత జీవిని.. నన్ను చూసి దూరంగా పారిపోయేవారు. కొంత మంది నన్ను టీవీ నటిగా గుర్తుపట్టి పలకరించేవారు. ఇంటి పెరట్లో, బయట మొక్కలు పెంచుతూ, ఇంటి పని, వంట చేస్కుంటూ షూటింగ్‌ ఉన్నప్పుడు ఆటోలో స్టూడియోకి వెళ్ళేదాన్ని. నా వంట చాలా ఇష్టంగా తినేవాడు అరుణ్‌. మా మధ్య శారీరక సంబంధం కూడా బాగానే ఉండేది. రెణ్ణెల్లు బాగున్న అరుణ్‌లో మెల్లగా మార్పు మొదలయ్యింది. అతను చేసే పార్ట్‌ టైం ఉద్యోగం మానేసాడు. నా దగ్గర డబ్బు తీస్కుని ఇంటికి పంపేవాడు. చెల్లెలు, తమ్ముడి చదువు… పొలం పనుల కోసం, వాళ్ళ అమ్మ హెల్త్‌ చెకప్స్‌ కోసం అని వేలకు వేలు అతనికి ధారపోసాను పిచ్చి ప్రేమతో.

కానీ చాలా తొందరగా అతని నిజ స్వరూపం అర్థం కాసాగింది. డబ్బు కోసం, సెక్స్‌ కోసం చేస్కున్నాడా? ఎంత సేపూ డబ్బు డబ్బు తప్ప ఇంకేమీ లేదు. సెక్స్‌లో కూడా చాలా అసహజ ధోరణులలో ఉండేవాడు. అసభ్యంగా ప్రవర్తించేవాడు. ‘‘మీరు ఇవన్నీ చేయడానికి సిగ్గుపడరంట కదా… నీకు నేనే మొదటి వాడినా… నీ ఫ్రెండ్స్‌లాగా నువ్వు కూడా వ్యభిచారం చేయలేదా?’’ అని వెక్కిరించేవాడు. అట్లా మాట్లాడొద్దని ఏడ్చేదాన్ని. నేను అలా ఎప్పుడూ చేయలేదంటే నమ్మేవాడు కాదు. సీరియల్స్‌లో అవకాశాలు వూరికే వస్తున్నాయా అని అడిగేవాడు.

‘నిన్ను నేను కాబట్టి భరిస్తున్నా’ అనేవాడు. క్రమంగా నేను డిప్రెషన్‌లోకి వెళ్ళసాగాను. డబ్బులు ఇవ్వకపోతే కొట్టటం మొదలుపెట్టాడు. నా డబ్బులతో తాగడం కాస్ట్‌లీ రెస్టారెంట్స్‌, పబ్‌లు, క్లబ్‌లు… గర్ల్‌ఫ్రెండ్స్‌ ఎక్కువైంది. ఎందుకు అమ్మాయిలుతో తిరుగుతున్నావు అంటే ‘నీతో పూర్తి ఆడదానితో పడుకున్న తృప్తి రావట్లేదు ఏం చెయ్యమంటావు నిన్ను పెళ్ళి చేస్కున్నాకే కదా ఈ విషయం తెలిసిందీ?’’ అనేవాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరకు తీస్కెళ్లమంటే ‘‘అమ్మ వాళ్ళు నిన్ను నన్ను చంపేస్తారు’’ అనేవాడు. అరుణ్‌కి నేనేంటో నాకు బాగా అర్థం అయింది. నేనొక డబ్బు సంపాదించే యంత్రాన్ని అతని కోర్కెలు తీర్చే లైంగిక వస్తువుని.. అంతే… ప్రేమ ఒక ముసుగు. ‘‘ఎప్పుడైనా జ్వరంతో నీరసంగా పడుకుంటే… డబ్బులెట్లా వస్తాయి.. లే పనికి వెళ్ళు..’’ అంటూ నిర్దాక్ష్యిణ్యంగా లేపేసేవాడు. ‘‘నీతో సెక్స్‌ చేస్తుంటే కొజ్జాతో చేస్తున్నట్లే ఉంది. ఒరిజినల్‌ ఫీల్‌ రావటం లేదు’’ అనేవాడు ప్రతీసారి. సెక్స్‌ తిరస్కరిస్తే బాగా కొట్టేవాడు. సెక్స్‌ ఛేంజ్‌ ఆపరేషన్‌ తర్వాత నాకు చాలా సమస్యలు వచ్చాయి. మూత్రనాళం సన్నబడి మూసుకుపోతే మళ్ళీ సర్జరీ చేసారు. సెక్స్‌ చేసేటప్పుడు మోటుగా ఉండద్దు.. నాకు సర్జరీ అవడం వలన మామూలుగా ఉండలేను.. అన్నా వినేవాడు కాదు. నన్నొక జంతువులా ట్రీట్‌ చేసేవాడు. నన్ను రేప్‌ చేసేవాడు. తాగి కొట్టడం ఎక్కువైంది. మేరేజ్‌ సర్టిఫికేట్‌ కోసం వెళ్దామని ఎన్నిసార్లు అడిగినా తప్పించుకునేవాడు.

‘నీ వల్ల యూనివర్సిటీలో నన్ను చూసి అంతా నవ్వుతున్నారు. నా ఫ్రెండ్స్‌, బంధువులు అంతా’ అనేవాడు. ఆ బాధ మర్చిపోవడానికి తాగుతున్నా అనేవాడు. ‘నీ వల్ల నాకు పిల్లలు పుట్టరు. ఎలా కంటావేంటి నీకు గర్భాశయమే లేదు’ అని వెటకారం చేసేవాడు పెళ్లికి ముందు పిల్లల్ని పెంచుకుందామన్న అరుణ్‌. ఒక రోజు అరుణ్‌ అమ్మ, నాన్న, తమ్ముడు, బాబాయి, మామయ్య వచ్చి ఇంటి మీద దాడి చేసి నన్ను చచ్చేలా కొట్టి ‘మావాణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపో’ అని బెదిరించారు. అరుణ్‌, ఇది తెలిసినా ఏమీ అనలేదు. నాకు చాలా బాధ కలిగింది. నాకు సెక్స్‌ ఇష్టం లేకున్నా ఒత్తిడి చేస్తాడు. ఈ బలవంతంగా రేప్‌ చేయడం ఏంటసలు? స్త్రీ అవుతే ఇలా ఉంటుందా? నిజమైన స్త్రీలా సింగారాలు, అలంకరణలు, వంటిల్లు, ఇంటి పని, పూజలు, పిల్లల్ని కనిపెంచడం, భర్త పక్కన గర్వంగా భార్యగా నిలబడ్డం ఏమీ లేదు., భార్య, అమ్మ, చెల్లి, అత్తలాగా కాకుండా… ఒక రేప్‌ విక్టిమ్‌లాగా కూడా ఉంటుందా.. భార్య ప్రతి ఇంట్లో…? ఇదే నా ఫ్రెండ్‌ టీవీ ఏంకర్‌ శైలజని అడిగాను. ఎందుకు ఉండదు? సర్వే చేస్తే ప్రతి పది మంది భార్యలలో ఏడుగురు భర్తలతో రేప్‌కి గురి అవుతూంటారు అంది. అలాంటి ‘రేప్‌ విక్టిమ్‌ వైఫ్‌’గా ఉండడానికా నేను ఇలా స్త్రీగా మారింది? ఆ సున్నితమైన, అందమైన కలలు ఆలోచనలు ఏమైనాయి? స్త్రీగా, భార్యగా కాదు కదా… మనిషిలాగా కూడా చూడ్డం లేదు. పేరుతో కూడా పిలవడు. ‘రేయ్‌, కొజ్జా… కొజ్జా దానా’ అని పిలవడం మొదలెట్టాడు. చాలాసార్లు అలా పిలవద్దని కొట్లాడేదాన్ని… పలికేదాన్ని కాదు. నా స్నేహితురాళ్ళు ఈ సంబంధంలోంచి బయటపడమన్నారు. అయినా మారకపోతాడా ఏదో ప్రేమ.. స్త్రీ కావాలన్న కల ఇల్లాలిగా అందమైన కుటుంబం జీవనం… ఇల్లు పిల్లల్ని దత్తత చేస్కొని అమ్మగా కావాలని కల. అన్నీ కాలిపోసాగాయి. అదే సమయంలో ‘మీ టు’ ఉద్యమం నడిచింది. దాంట్లో నేను పాల్గొన్నాను. నా మీద అరుణ్‌ చేసిన అత్యాచారం ఫేస్‌బుక్‌లో షేర్‌ చేస్కున్నా. బాగా కొట్టాడు. ‘నీకు అవసరమా’ అంటూ. ఒక రాత్రి అరుణ్‌ ఇంటికి రాలేదు. ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసాడు. రాత్రి పదకొండు గంటలకు తలుపు చప్పుడైతే తీసాను అరుణ్‌ అనుకొని. కాదు.. ఎవరో మగవాడు లోపలికి తోసుకు వచ్చాడు. ‘అరుణ్‌ లేడు మీరు ఎవరు ఈ వేళప్పుడెందుకు వచ్చారు వెళ్ళండి’ అన్నాను. అతనికి తలుపు వైపు చూపిస్తూ. అతను తలుపు వైపు వెళ్తూ… ‘‘అరుణ్‌ కోసం కాదు నీ కోసమే వచ్చాను. అరుణే పంపాడు. నీ రేటు ఈ రాత్రి ఐదు వేలు’’ అన్నాడు. నాకు భయంతో శరీరం అంతా ఒణికింది. ‘అరుణ్‌ ఎవడు నన్ను అమ్మడానికి… వెళ్ళిక్కడ్నించి’ అని అరిచాను. నన్ను పట్టించుకోకుండా రాక్షసుడిలా నా మీద పడ్డాడు. ‘‘ఆడదానివిగా ఎందుకు మారావు మరి… ఇందుకు కాకపోతే?’’ అంటూ నన్ను దారుణంగా రేప్‌ చేసాడు. రాత్రంతా ఆగ్రహంతో వణికిపోతూ అరుణ్‌ కోసం ఎదురు చూసాను.

మరునాడు వచ్చిన అరుణ్‌ మీద శివంగిలా పడ్డాను. కొట్టాను, రక్కాను. ‘నాకే పాపమూ తెలీదు వాడెవడో నాకు తెలీదు’ అన్నాడు. అలా వర్సగా అనేక రేప్‌లు జరిగాయి నా మీద. వాళ్ళతో సెక్స్‌కి ఒప్పుకోకపోతే దారుణంగా కొట్టేవాడు. తనూ బలవంతంగా నన్ను రేప్‌ చేసేవాడు, నేను ప్రతిఘటించేకొద్ది. ఒకరోజు వాళ్ళమ్మతో మాట్లాడుతుంటే విన్నా ‘పది లక్షల కట్నం అయితేనే చేస్కుంటా ఆ అమ్మాయిని’ అంటున్నాడు. మరి నేను? అడిగా. ‘నువ్విస్తావా పది లక్షల కట్నం. అయినా నీకేమైనా బుద్ధి ఉందా నువ్వు భార్యగా ఒక కుటుంబంలో ఉండలేవు. వారసుల్ని కనలేవు. నిన్ను ఎవరూ అంగీకరించరు. పైగా ఇంత మందితో పడుకున్న దానివి’’ అన్నాడు నన్ను అసహ్యంగా చూస్తూ. ‘ఇంత మోసం చేస్తావా’ అని అతన్ని కొట్టబోయాను ఏడుస్తూ… తిరిగి అతని చేతుల్లో దెబ్బలు తిని రక్తపు ముద్దనై కిందపడిపోయాను. భయంతో పరిగెత్తుకుంటూ పోలీస్‌ స్టేషన్‌కెళ్ళా ‘నా భర్త నన్ను దారుణంగా కొట్టాడు. రేప్‌ చేస్తున్నాడు. బయట మగవాళ్ళతో సెక్స్‌ చేయమని బలవంతం చేస్తున్నాడు. నన్ను డబ్బుకోసం వాళ్ళకు బలి చేస్తున్నాడు. కట్నం కోసం వేధిస్తున్నాడు’ అని కేస్‌ పెట్టా. ఏడుస్తూ వంటి మీద గాయాలు చూపించా. ‘‘కొజ్జా లంజా… మీరు చేసేదే వ్యభిచారం కదే… కేస్‌ పెట్టాలా.. ఎక్కడా… నిన్ను ఎక్కడ్నించి రేప్‌ చేసాడు నీ మొగుడు… ఆ మిండెగాళ్ళు చూపించు’’ అని నా చీర పైకెత్తే ప్రయత్నం చేసాడు అక్కడి ఎస్సై వెకిలిగా నవ్వుతూ. నా రెండు కాళ్ళ మధ్య లాఠీ గుచ్చాడు. నన్ను దారుణంగా కొట్టాడు. నా కంప్లైంట్‌ కూడా చింపేసారు. నా భర్తపై గృహహింస కేసు నడవదంట. నేను స్త్రీని కాదంట. అలా ఆ చిత్రహింసల కొలిమిలో రెండేళ్ళు గడిపాక ఇంక నా వల్ల కాలేదు. ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులు తీస్కుని రాత్రికి రాత్రి మా ఎల్జీబీటీ కమ్యూనిటీ నడుపుతున్న స్వచ్ఛంద సంస్థకి వెళ్ళిపోయాను. అరుణ్‌తో నా పెళ్ళి ఫోటో ఒక్కటే సాక్ష్యం అతని పైన మంచి లాయర్‌తో కలిసి డివి కేసు వేసా… అరుణ్‌ ఎక్కడికో పారిపోయాడు పత్తాలేడు. కేసు బలహీనంగా సాగుతున్నది. ‘అసలైన స్త్రీలకే రక్షణ లేని సమాజంలో స్త్రీగా మారిన పురుషుణ్ణి నాలాంటి వారికి ఏదీ రక్షణ… సెక్స్‌ మార్చుకున్న ఒక స్త్రీగా నాపై నా భర్త అత్యాచారం చేస్తే, దాన్ని ఒక స్త్రీగా బాధిత భార్యగా నేను కంప్లైంట్‌ చేస్తే ఈ పోలీసులు నువ్వు నిజమైన ఆడదానివి కాదు నీ కంప్లైంట్‌ చెల్లదు అని ఎగతాళి చేస్తూ కొట్టి పడేస్తే నాలాంటి ట్రాన్స్‌ వుమెన్‌ ఎటు పోవాలి అనుపమ గారూ’ చెప్తూ చెప్తునే మమత తన కన్నీళ్ళు తుడుచుకున్నది.

‘‘మేరేజీ సర్టిఫికెట్‌లో ట్రాన్స్‌ వుమెన్‌ని స్త్రీగా గుర్తించే చట్టం వచ్చింది. ఇది కర్నాటకలో సాధ్యం అయ్యింది. నువ్వు డీలా పడకు న్యాయం మనవైపే ఉంది. అరుణ్‌కి తప్పకుండా శిక్షపడుతుంది’ అంది లాయర్‌ అనుపమ మమత చేతుల్ని గట్టిగా ఒత్తుతూ. మమత నీరసంగా నవ్వింది. స్నేహిత సంస్థ బయటకు వచ్చిన మమత ఫోన్‌ మోగింది. అటువైపు నుంచి గురూమా.. ‘‘తెల్లారు రaామున మన సంజనని అబ్దుల్లాపూర్‌ మెట్‌ దగ్గర్లో  గ్యాంగ్‌  రేప్‌ చేసి చంపేశారు… మేమంతా ఇక్కడ ఉస్మానియా మార్చురీ దగ్గర ఉన్నాము నువ్వూ వచ్చేయి’’ రుద్ధమైన గొంతుతో ఖంగారు.. ఖంగారుగా చెబుతోంది.. మమత వెంటనే పక్కనే ఉన్న ఆటో ఆపి ఉస్మానియా హాస్పిటల్‌ అంటూ ఎక్కింది. తన తోటి ట్రాన్స్‌ వుమెన్‌, స్నేహితురాలు సంజన కళ్ళ ముందు కదలాడిరది. గౌతమ్‌తో ప్రేమలో పడి.. పెళ్లి కలలు కంటున్న సంజన… ఆమె చాలా ఇష్టంగా గౌతమ్‌ని తలుచుకుంటూ పాడుకునే ‘‘ఆధా హై చంద్రమా రాత్‌ ఆధీ… రహనా జాయే తెరీ మేరీ బాత్‌ ఆధీ.. ములాఖాత్‌ ఆధీ’’ పాట గుర్తుకు వచ్చింది. అవునా తాము కనేవి కూడా సగం కలలే కదా.. ఎప్పటికీ పూర్తి కాని.. కాలేని కలలు… మమత కళ్ళు కన్నీటితో తడిసి పోయాయి.

–  –  –

Leave a Reply