ఆమె నవ్విందట… ‘భలే నవ్వారే’ ఆంకర్‌ చిన్నగా నవ్వుతూ అంటోంది. ఆమె నిజంగా నవ్వితే ఇలాగే ఉంటుందా? బిల్కిస్‌ నిజమైన నవ్వు మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వితే ఆమె నవ్వెలా ఉంటుంది ఏమో ఊహించలేం… ఇరవై రెండేళ్ల నుంచే ఎన్ని ఊర్లు… ఎన్ని ఇళ్లు… ఎన్ని బళ్లు… ఎన్ని దేశాలు…. ఎన్నెన్ని కన్నీటి సముద్రాలు ఇంకెన్ని ఎడారులు మార్చి మార్చి పరిగెడ్తూ పారిపోతూ… పరిగెత్తి పరిగెత్తి గసబోస్తూ ఆయాస పడ్తూ… చమటలు

కన్నీళ్లు… రక్తం కక్కుతూ కక్కుతూ… ఊపిరాడక ఎగబోస్తూ ఆగి… ఆగి కూలబడ్తూ… విరిగిపోతూ కరిగిపోతూ శ్వాస ఆడట్లేదు… ఓప్హ్‌ా ఊపిరాడట్లేదు… కాస్త గాలివ్వండి… ఏంటి… ఏంటి ఈ తీర్పేంటి… ఆ పదకొండు మంది దుర్మార్గులు నా మూడేళ్ల పిల్లని రాయికేసి బాది… బాది చంపిన వాళ్లు… నా గర్భంలో నాలుగో నెల పిండం భయంతో నొప్పితో ముడుక్కుని గుక్కపట్టి ఏడ్చేలా ఆత్యాచారం చేసిన… ఆ పదకొండు మంది రాక్షసుల్ని రిహా చేసారట… ఎంత అన్యాయం నా బిడ్డతో సహా నా పధ్నాలుగు మంది బంధువులను చంపారే ఎంత భయానకం… నేరమే న్యాయమైన దేశంలో మమ్మల్నేనా? మా ముసల్మానులను ఎంత మందినో వేలల్లో చంపేసారు?

‘మీ దేశం పాకిస్తాన్‌ పొండి ఇక్కడికెళ్లి’ అని తరిమి తరిమి అత్యాచారం చేసి ఒంటి మీద నూలుపోగు లేకుండా చేస్తే… అడవుల్లోకి తుప్పల్లోకి… దాక్కుంటూ పాక్కూంటూ ఒంటి నిండా గాయాలతో స్పృహ తప్పితే… ఓప్‌ా అల్లా ఈ రోజు వాళ్లందర్ని రిహా చేయడం ఏంటి? ఏంటసలు? అల్లా య్యా ఖుదా నీకు ఇంత తరస్‌ లేదా… పోనీ మీ రాముడి కన్నా లేదా… ఆ సీతమ్మకైనా…? ఎట్లా ఎట్లా ఎట్లెట్లా వచ్చారు బయటకు ఎవరు తెచ్చారు…. అంత ఘోరంగా రేప్‌ చేసిన వాళ్లని? ఎవరు… మమ్మల్ని చంపించిన… రేప్‌ చేయించిన వాళ్లా? నేను తల్లడిల్లాను… దుఃఖంలో అవమానంతో తాయిమాయి అయ్యాను… నేను వెంఠనే హైకోర్టులో కేసు వేసాను. వాళ్ల రిహాయీ చెల్లదని ఇన్ని రోజుల నా ఇంతెజార్‌ తర్వాత హైకోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. హమ్మయ్యా…

‘‘మా ముసల్మాన్‌ గోస వినే దిల్‌ ఉన్న లాయర్లు ఉన్నారు. వాళ్లకు నా సలామ్‌! తోడా సుకూన్‌ మిలా… థోడా దిల్‌కో అచ్చా లగా మేడం ఈ ఇరవై రెండేళ్లల్లో ఎన్నడూ నవ్వలేదు మేడం. ఈ రోజు కదా నవ్వగలిగాను’’ అంటూ మళ్లీ బిల్కిస్‌ నవ్వింది… ఆమె నవ్వెలా ఉందంటే సప్త సముద్రాలూ ఈదీ ఈదీ ఒడ్డు చేరబోతుంటే తిమింగలం ఒకటి కాలు పట్టి మళ్లీ సముద్రంలోకి లాగేస్తే తప్పించుకుని మళ్లీ పైకీ ఈది… సూర్యోదయాన్ని చూస్తూ నవ్వినట్లు… లేదూ… అవును… ఇన్నేళ్లకి ఖుషీతో కళ్ళారా కన్నీరు కార్చాను. నా బిడ్డను కౌగలించుకున్నా… మనసారా… హాఁ నా గుండెల మీద నుంచి ఆ టన్నుల బరువు దిగిపోయింది… ఇదే కదా న్యాయం అంటే…

టీవీలో బిల్కిస్‌ ఇంటర్వూ ఇస్తున్నది… బిల్కిస్‌ మొఖంలో ఏదో ప్రశాంతత… కళ్ల చుట్టూ నల్లటి వలయాలలో ఏదో విషాదం… అయినా నవ్వింది బిల్కిస్‌ బానో… పాత ఇంటర్‌ వ్యూ.

కళ్లలో బలహీనమైన మెరుపు… తుఫాన్లను ఎదుర్కొని నిలిచిన నీరసపు ఆశ… దుఃఖమో ఆనందమో తెలీని ఒక సందిగ్ధావస్త… అయోమయం… వైశాలి భారమైన మనసుతో ఛానల్‌ మార్చింది. పాలస్తీనాలో జాతిహత్యాకాండ చేస్తున్న ఇజ్రాయిల్‌కి సంఫీుభావం ప్రకటించిన మోడీపై చర్చా కార్యక్రమం నడుస్తున్నది. వేలకొద్దీ పసి పిల్లల్ని చంపేస్తుంటే… పిల్లల శవాల కుప్పల్లో తమ పిల్లల్ని తల్లులు… తల్లుల్ని పిల్లలూ గుండెలు పగిలేలా ఏడుస్తూ వెతుక్కుంటూ ఉంటే… ఆకలితో అలమటిస్తూ ఉంటే ఇక్కడ.. ఇజ్రాయిల్ని సమర్థిస్తున్న మోడీ…

——

మోడీ రామాలయం కట్టేసాడు… గడువు కంటే ముందే… అసలైన రాముడు కాదు… బాల రాముడి విగ్రహంతో… ఒక స్వామీజీ మొత్తుకుంటున్నాడు. ఆయకు ఏం అర్హత ఉందీ… అంటూ ఎన్నికలు… ఎన్నికలొస్తున్నాయిగా

ఎవరో జోకేస్తున్నారు హాల్లో….

ఇంతలో ఫోను మోగింది.

‘‘ఆఁ వదినా… వచ్చేసాం. ఆసుపత్రిలో చాలా ఆలశ్యం అయ్యింది. ఆయనేమో గొప్ప డాక్టరాయె… ఓ… బోల్డెంత రష్షు… బాగా చూస్తాడొదినా ఆ మాటా తీరూ పద్దతీ అదీ… సరే చూపించుకుని ఇంటికి చేరామా… ఇక మా మరదలు తమ్ముడూ ఒహటే నస… ఒహ పట్టాన లోనకి రానీరు… వెళ్లింది ఆసుపత్రట ఆ కడా జాతి మనుషుల్ని అంటుకునీ ముట్టుకుని ఆళ్లు కూర్చున్న కుర్చీల్లో మేం కూర్చునేసి… మైల పడిపోయాంట ఇక కిందే బాత్రూంలో స్నానం చేస్తే కానీ పైకి రానీ లేదు. వాళ్ల ఛాదస్తం రోజు రోజుకీ ఎక్కువైపోతున్నది… వాళ్లింటికే పోబుద్ధి కాదు… హోటలే మేలు… మైల, మడీ నాకూ ఉన్నాయి… కానీ ఇంత పిచ్చైతే లేదు సుమీ. మీ అన్నయ్యకి బీపీ కూడా మొదలైంది ఉప్పు తగ్గించమన్నాడు. బీపీ టాబ్లెట్టు మొదలెట్టాడు. ఇక తమ్ముడికేమో, కాలు నొప్పి ఇంకా తగ్గలేదు. హెర్నియా ఆపరేషన్‌ వికటించింది తెలుసు కదా రక్తపు గడ్డ నరాల్లో ఇరుక్కుందిట… డాక్టర్ని మార్చాలి వదినా… ఆపరేషను చేసిన డాక్టరు గుండె డాక్టరుకు సిఫారసు చేసాడు చాలా గొప్ప డాక్టరుట రేపెళతాను అన్నాడు వాడు. సరే… వదినా ఉంటాను. చలికాలం కనీసం వేణ్ణీళ్లైనా పెట్టలేదు స్నానానికి… అదీ తలారా చేస్తే కానీ ఊర్కొదు. చాలా చలిగా ఉంది. ఇంత వేడి కాఫీ పుచ్చుకుంటాను. ఆ లోకల్‌ బిజేపి నాయకుడేం చెవితే అదే చేస్తాడు. ఇంత అనారోగ్యంలోనూ ఆ కాలు కుంటుకుంటూ అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవాలకు కాలనీలో ఒహటే పనులు పెట్టుకున్నాడు. ఆ కాలింకా వాచిపోయింది వింటాడా వద్దంటే, సుశీల వదిన మాటల ధార సాగుతూనే ఉంది.

సుశీల వదిన తమ్ముడు సుందరం, మరదలు రాజశ్రీ వైదిక బ్రాహ్మలు…. విపరీతంగా ఆచార వ్యవహారాలు పాటిస్తారు.

ఉప్పు గళ్లలు నీళ్లలో కడిగి ఆరబోస్తుంది ఆ రాజశ్రీ…. ఎవరింటికి వెళ్లరు, ఏమీ పుచ్చుకోరు ఈ రోజు ఉపవాసం… మంచి నీళ్లు కూడా తాగం అంటారు. వైశాలి ఇంటికొచ్చినా నీళ్ల సీసాలతో వస్తారు. కనీసం టీ కూడా పుచ్చుకోరు.

సుశీల వదిన కొడుకు నిశ్చల్‌ వైశాలి కూతురు నీహారిక ప్రేమ వివాహం చేసుకున్నారు ఈ ఏడాదే. వీళ్లు కూడా చాలా ఆచార సంప్రదాయాలు మడీ అన్నీ ఉన్నవాళ్లే వైశాలి ఏదీ చేయనని చెప్పేసింది. కొన్నైనా చేయాలి అని వైశాలి ఆడబిడ్డ బాధ్యత తీస్కుని తనే చేస్కుంది. ‘‘మళ్లా మన పిల్లనే ఆడిపోస్కుంటారు జీవితమంతా. వెధవది ఏదో బొమ్మలాట అనుకుని చేస్తే పోలా వైశాలీ? నువ్వూ నీ నాస్తిక వాదం కాసేపు పక్కనపెట్టు నేను చేస్తాను అన్నీ’’ అంటూ.

——

ఒక రోజు వైశాలి బడికెళ్లింది… అయోధ్యలో రామ మందిర స్థాపనకు సంబంధించి దేశమంతా గగ్గోలుగా ఉంది. ఎక్కడ చూడూ జై శ్రీరాం నినాదాలు. కాషాయ తోరణాలు కొత్త రాముడు… సిక్స్‌పాక్‌ ఛాతీ… చేతిలో మహా కోసుగా ఉన్న… ఖడ్గాన్ని పట్టుకొని క్రోధంగా ఎరుపెక్కిన కళ్లతో… ఎవర్నో చంపడానికి బయలుదేరినట్లే ఉన్నాడు. చిన్నప్పుడు తమకు తెలిసిన ప్రశాంత రాముడు కాదు ఈ అయోధ్య రాముడు. సినిమాల్లోని విలన్‌ లుక్‌ తెచ్చేసారు ఈ కాషాయధారుడైన రాముడికి. ఇంకా చెప్పాలంటే రావణుడి ముఖమే శాంతంగా కనపడుతోంది. వైశాలి నిట్టూర్చింది. వీధి వీధినా మతం గోల… బళ్లో కూడా టీచర్లు నుదుటున కాషాయ రంగు బొట్టుతో కొత్త వేషంలో ఉన్నారు….

కాస్త ఆలస్యంగా బళ్లో అడుగుపెట్టింది వైశాలి. ప్రిన్సిపాల్‌, షర్ఫుద్దీన్‌ పిల్లలకు భగవద్గీత వినిపిస్తూ పద్యాలు వాటి భావాలు చెప్తున్నారు. వైశాలి నిర్ఘాంత పోయింది.

శ్లోకం:    తస్మాన్నార్హా వయంహతుం

                ధార్తరాష్ట్రాన్స్వ బాంధవాన్‌

                స్వజనం హికధం హత్వా సుఖినః స్వామ్య మాధవా!

భావం : బంధువులైన దుర్యోధనాదులను చంపడం వల్ల మనకు మంచిది కాదు మాధవా! స్వజనాన్ని వధించి ఎలా సుఖపడగలం? భావం చెప్పడం పూర్తి చేసి, వైశాలిని చూస్తూ…

‘గలత్‌ క్యాహై టీచర్‌… దూస్రా ధరమ్‌కో మాన్‌నా, ఇజ్జత్‌ దేనా కోయీ గునా నహీఁ హై…. (తప్పేం ఉంది టీచర్‌ మరొక మతాన్ని అంగీకరించడం ` గౌరవించడం నేరం కాదు) పైగా మన స్కూల్లో మా ముస్లిం పిల్లలే ఎక్కువ  మీకు తెలుసు కదా. ఎందుకైనా మంచిదని… నిన్న ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు వచ్చి పిల్లలు రామకోటి రాస్తున్నారా లేదా అని నోట్‌బుక్స్‌ చెక్‌ చేసిపోయారు… భగవత్‌ గీత కూడా ఇచ్చిపోయారు… అయినా భగవత్‌గీత మత గ్రంథం కాదు కదా టీచర్‌? యుద్ధంలో దయ, కరుణ, జాలి, బంధు ప్రీతి లేకుండా బంధువులైన కౌరవుల్ని చంపేసి రాజ్యాధికారాన్నెలా పొందాలో చెప్తాడుగా కృష్ణుడు? అయినా భారత దేశంలో జరుగుతున్నదే ఇది! మొన్న ఆ టెంత్‌ క్లాస్‌ నరేంద్ర క్రికెట్‌ ఆటలో ఓడిపోయి తొమ్మిదో క్లాసు హమ్జాని చితక్కొట్టి ‘ఇది మీ దేశం కాదు… పాకిస్థాన్‌కి వెళ్లిపోండ్రా’ అన్నాడంట… మరి ఇక మా బధ్రత మేం చూస్కోవాలిగా టీచర్‌… మేం మా దేశంలోనే పౌరులుగా గుర్తించబడాలంటే ఇదంతా తప్పదు టీచర్‌… ప్రిన్సిపాల్‌ షర్ఫుద్దీన్‌ గాజు కళ్లతో క్లాసులో కూర్చుని పుస్తకంలో ఏదో రాస్తున్న రాషిద్‌ను ఆలాపనగా చూస్తూ అంటూ… మరో పద్యం అందుకున్నాడు.

శ్లోకం:    దోషైరేతైః కులఘ్నానాం

                వర్ణ సంకర కారకైః

                ఉత్సాద్యంతే జాతిధర్మాః

                కుల ధర్మాశ్చ శాశ్వతాః

భావం : కులాన్ని నాశనం చేసే వాళ్ల మూలంగా కలిగే వర్ణ సాంకర్యం కారణంగా శాశ్వతాలైన జాతి ధర్మాలు కులధర్మాలు అడుగంటి పోతాయి.

ప్రిన్సిపాల్‌ షర్ఫుద్దీన్‌ నిర్వికారంగా ఉదయపు ప్రార్థన సారే జహాఁసే అచ్చా హిందూస్తాన్‌ హమారా… బదులుగా గీతా పాఠం బోధిస్తున్నాడు.

——

 ‘‘అంతా బాగే కదా… నువ్వేమీ ఆ అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ట గొడవల్లో ఇరుక్కోకు నీలాంటి వాళ్లు లక్షల మంది ప్రయత్నించినా ఇది ఆగదు. వింటున్నావా… ఇక్కడ కాలిఫోర్నియా ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్‌ దిగిన వాళ్లందరి చేతుల్లో ‘భగవద్గీత’ పుస్తకాన్ని పెడుతున్నారు, హిందూత్వ ప్రచారంలో భాగంగా. ఇంకా ఇండియా సంగతి ఏం చెప్తాం చెప్పు?’’ వేణు ఫోన్‌లో అంటున్నాడు. కాలిఫోర్నియాలో జాబ్‌ చేస్తున్నాడు వేణు. ఆ తరువాత నెల రోజుల్లో అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన పూర్తయ్యింది. దేశమంతా కోలాహలం గల్లీల్లో ఊరేగింపులు ఈసారి రామభక్తుల కార్యకర్తల ఊరేగింపులో ముస్లింలు కూడా చాలా మంది పాల్గొన్నారు. ఒక రకమైన లొంగుబాటు కనిపిస్తోంది వాళ్ల మొఖాల్లో. వీధుల్లో దీపాల తోరణాలు… పూల దారుల మీదుగా రాముడి విగ్రహాలు ఊరేగాయి. జై శ్రీరాం నినాదాలలో… రాముడి పాటలలో స్త్రీ పురుషులు, పిల్లలు ముసలి వాళ్లు పూనకాలొచ్చినట్లే ఊరేగారు… బస్తీల్లో ముస్లింల మొఖాల్లో ఏదో చెప్పరాని భావం… భయమా… ఆందోళనా… వైశాలికి అర్థం కాలేదు. ఏంటీ బలవంతం? భక్తిలా లేదు కాషాయ రంగులో ఆధిపత్యాన్ని, కృారత్వాన్ని ప్రదర్శిస్తున్నట్లుంది. రాముడి  మొహాన్ని అడ్డుపెట్టుకుని. ఎవరో అన్నట్లు శ్రీరాముడు తన కుటుంబానికి, భార్య సీతకి, తన పిల్లలకి, రాజ్యానికి కొంచెమైనా ఉపయోగపడ్డాడో లేదో తెలీదు కానీ ఈ బీజేపీ వాళ్లకి మాత్రం బాగా ఉపయోగపడుతున్నాడు. ఇంట్లో అత్తగారు కూడా ఆ పూనకాల్లో కల్సిపోయింది. పదహారేళ్ల మనవడికి కాషాయపు తలపాగా కట్టి మరీ గుంపులోకి ఈడ్చుకుపోయింది. ‘‘వీడు నా మనమడు తరతరాల నించీ రాముడి భక్తులం మేం కుటుంబమంతా… నువ్వెలా దొరికావో నాస్తికురాలివి… నా కొడుకుని కూడా మార్చి పడేశావు.’’ అత్తగారి మాటలు మామూలే. అయోధ్యకు వాళ్ల బంధువులతో ట్రెయిన్లో పోయెచ్చింది ఆవిడ! ‘‘ఏం కాశీకి పోఁమా… ఇపుడు అయోధ్యకి పోతే ఏంటట… ఆఁ షుగరుంటే ఏవిట్ట… మందులూ అవీ వేస్కుంటాగా అయినా ఒంటరిగా పోతున్నానా యావన్నా… ఇంతమంది బంధువులు వస్తుంటే… ఇదుగో వైశాలీ, నన్నాపకు… కాశీ కంటే పవిత్రమైందిప్పుడు అయోధ్య…’’ అంటూ సంబరంగా వెళ్లిపోయింది అయోధ్యకి… ట్రెయిన్‌ నిండా రామభక్తులేనట.

——

 ‘‘తురకోళ్ళకి ఎందుకు ఇస్తాం అని కూర్చున్నాడు మా సుందరం. మంచి అద్దె ఇస్తామన్నారు వాళ్లు… మా ఇంటి పక్కనే ఉండేవాళ్లు ఎంత సాయంగానో ఉండే వారు వదినా మాకు. ఎన్ని సార్లు మీ అన్నయ్యని నన్నూ ఆసుపత్రికి వాళ్ల ఆటోలో తీస్కెళ్లాడో… అయినా నన్నే కాళ్లు కడుక్కోకండా లోనికి రానీడు… ఆ ఇబ్రహీం రషీదాలనేం రానిస్తాడు? పాపం ఇబ్రహీం కొడుక్కి ఇక్కడ హైద్రాబాద్‌లో ఉద్యోగం వచ్చిందని అక్కడికి షిప్ట్‌ అవుదామని వచ్చారు… నా వెర్రికానీ అన్నీ తెలిసీ వాడిని అడిగాను కింద పోర్షనేవన్నా ఇస్తావా ఇబ్రహీంకి అని… పోనీలే వదినా హైద్రాబాదులో బోల్డెన్ని ఇళ్లున్నాయి… ఏదో ఒక ఇల్లు దొరక్కపోదా మరీ హీనంగా గేటు బయటనించే మీకివ్వం ఫో అని తరిమేసారట భార్యాభర్తలు’’ సుశీల వదిన మాట్లాడుతూనే ఉంది.

సరిగ్గా వారం తర్వాత వదిన వచ్చింది ఉన్నట్లుండి… ఫోన్‌లో వాళ్ల తమ్ముడికి బాగా లేదనీ హాస్పిటల్లో అడ్మిట్‌ అయ్యాడనీ… ‘‘అసలు నాకు చెప్పలేదు వదినా ఖంగారు పడతాననీ… ఇప్పుడు కుదురుకున్నాట్ట ఈ రోజే డిశ్చార్జిట. రేపు పోదాం ఇద్దరం’’ అన్నది సుశీల వదిన. ‘‘ఇంతకీ వేణన్నయ్య కాలిఫోర్నియా నుంచి వస్తున్నారా ఈ నెలైనా’’ అడిగింది. ‘‘వస్తున్నారు వదినా’’ వైశాలి అంది.

——

ఇంటి కింద నల్లా నీళ్ళతో కాళ్లూ చేతులూ కడుక్కుని పైకెళ్లారు వైశాలీ, సుశీల. ‘రండి అక్కయ్యా బాగున్నారా కూర్చోండి’ అంది సుందరం భార్య రాజశ్రీ… సుందరం మెల్లగా వాకర్‌లో నడుచుకుంటూ వచ్చి కూర్చున్నాడు. కుడికాలు వాపు తగ్గిపోయింది. ‘‘ఇక పూర్తిగా తగ్గుతుందన్నాడులే వదినా… ఆపరేషన్‌ చేసిన డాక్టర్‌ కార్డియాలజిస్ట్‌ను పిలిపించి నా కేసు అతనికి అప్పజెప్పాడు. వదినా… రాష్ట్రంలోనే పెద్ద పేరున్న కార్డియాలజిస్ట్‌. చాలా మంచి చెయ్యి… ఆయన దగ్గరికెళ్లితే ప్రాణాలతో తిరిగి రాని వాళ్లుండరట వదినా… నాకూ చాలా మంచి ట్రీట్‌మెంట్‌ ఇచ్చాడు.’’

సుందరం మొఖం వెలిగిపోతున్నది. ‘‘అవునా ఎవరండీ ఆ కార్డియాలజిస్ట్‌…’’ ఆసక్తిగా అడిగింది వైశాలి. ‘డాక్టర్‌ జహంగీర్‌ వదినా’ అంటూ… కాస్త ముందుకు వంగుతూ… ‘చెప్పద్దు కానీ ఈ తురకల్లో ఇంత తెలివీ గ్నానం ఉన్నవాళ్లుంటారా అని ఆశ్చర్యం వేసిందనుకోండి. అసలు

వాళ్లు చదువుకోడమే గొప్ప కానీ ఏం డాక్టరండీ… మాట వింటే చాలు… ఏం వినయం… ఏం గ్నానం… తన తోటి డాక్టర్లంతా ఆయన చుట్టూ చేతులు కట్టుకుని నిల్చున్నారంటే నమ్ముతారా… అందులో మన బ్రాహ్మణ రెడ్డి డాక్టర్లు కూడా ఉన్నారు సుమండీ’ సుందరం డా॥ జహంగీర్‌ అంటే ఉన్న ఇష్టాన్ని, అయిష్టాన్ని కలబోసి వింత గొంతుతో అంటుంటే వైశాలి ఆశ్చర్యపోయింది. ఇబ్రహీం అడిగితే ఇల్లు అద్దెకే ఇవ్వలేదు గేటు అవతల నించే గెంటేసిన మనిషి డాక్టర్‌ జహంగీర్‌ను అంతలా మైకం కమ్మినట్లు ఎట్లా పొగుడుతున్నాడు?

రోగం నయం అయ్యిందనా… ప్రాణాలు కాపాడాడనా?

‘‘మరి… డా॥ జహంగీర్‌ గారి దగ్గర వైద్యం తీసుకున్న మీరు ఇబ్రహీం నెట్లా వెళ్లగొట్టారు ఇల్లెందుకు అద్దెకివ్వలేదు? మీ అక్కయ్యకున్న పరమత సహనం మీకెందుకు లేదండీ. మీ అవసరాలకు తగ్గట్లుగా మారిపోతారన్నమాట.’’

వైశాలి ప్రశ్నకు సుందరం దగ్గర సమాధానం లేదు. తెల్ల మొఖం వేస్కున్నాడు.

‘‘ఆఁ తురక డాక్టరంటే అసలు ఒప్పుకోలేదు. ఆయనా… నేనున్నూ. ఆయన ఆఫీసులో పని చేసే రామారావూ… జేమ్స్‌ ఇద్దరికీ ఆయనే నయం చేసాట్ట వాళ్లిద్దరూ వచ్చి చెబితేను వెళ్లాల్సి వచ్చింది ఆయన దగ్గరికి… ఆబోటి వైద్యం ఎవరన్నా చేస్తారు దేశం యావన్నా గొడ్డుపోయిందా… మన మతంలో డాక్టర్లే కరువైనారా… అయినా ఇంటికొచ్చాక పసుపు నీళ్లతో స్నానాలు చేసాంలెండి’’ రాజశ్రీ ఉక్రోషంగా అంటోంది. వైశాలి… సుశీల ఇద్దరూ ఒకరి ముఖాలు మరొకరు చూస్కున్నారు. ఎంత లౌక్యం… వైశాలి హృదయం కోపంతో భగ్గుమంది. అవసరానికి తగ్గట్లుగా సంప్రదాయాలు మారిపోతాయి. కనీసం వారు నమ్ముకున్న విశ్వాసాల పట్ల కూడా గౌరవం లేని మనుషులు. తన అత్తగారి అతిలౌక్యం గ్నాపకానికి వచ్చింది. ‘‘ఏం కులమో… ఏం మతమో ఎట్లా తింటావే అమ్మా హోటల్లో’’ వేణు కొంటెగా అడుగుతుందే… ఊరుకెళుతూ దార్లో ఆకలికి ఆగలేకపోయింది అత్తగారు పైగా షుగరుతో శోషొచ్చేస్తోంది ఆవిడకి. హోటళ్లలో అస్సలు తినదు. ‘‘ఏ దిక్కుమాలిన కులం తక్కువ వెధవలు చేస్తారో ఏమో… స్నానాలు కూడా చెయ్యరు దరిద్రులు’’ అంటుంది చిరాగ్గా ‘‘మరేం చెయ్యమంటావురా చావమంటావా ఏవిటి షుగరు డౌను అవుతుంటేను తినక చస్తానా… ప్రాణాలు ముఖ్యం… ఎవరు చేస్తారో ఎవరు చూడొచ్చారూ? మన బ్రాహ్మడే చేసాడేమో… ఇక్కడ’’ దీర్ఘాలు పోతూ చెమటలు కారిపోతుంటే ఆ కంచంలో ఉన్న బిరియానీ తినేసింది…

అదే లౌక్యం… రాజశ్రీ, సుందరంలో కనపడ్డది. టీ తాగి వెళ్లండి అన్నా వైశాలి ఆగలేదు…

పైగా ప్రాణం పోసిన డాక్టర్‌ జహంగీర్‌ని ఎట్లా ఈసడిస్తోంది? పసుపేసి స్నానం చేయించిందిట భర్తకి. ఆయన పోసిన ప్రాణానికి శుద్ధెలా చేస్తుంది.

క్షణం కూడా వైశాలికి అక్కడ ఉండబుద్ధి కాలేదు. గాజుకళ్లతో, బలహీనమైన గొంతుతో నిస్సహాయంగా భగవద్గీత నేర్పిస్తున్న స్కూలు ప్రిన్సిపాల్‌ షర్ఫుద్దీన్‌… అయిష్టంగా పుస్తకంలో రామకోటి రాస్తున్న పిల్లలు పదో తరగతి ఉమర్‌, వాహిద్‌లు, తన రేపిస్టులను విడుదల చేసిన రోజు వెక్కి వెక్కి ఏడ్చిన బిల్కిస్‌ కళ్లముందు కదలాడి గుండెల్లో ఏదో నొప్పి సుళ్లు తిరిగింది వైశాలికి.

‘ఇంటింటికి అయోధ్య నించి రాముల వారి తలంబ్రాలు వస్తున్నాయి అక్కాయ్‌’ అంటున్నాడు సుందరం. ‘నువ్వు తిరగబాకు రెస్టు తీస్కోరా సుందరం  రాజశ్రీ చూస్కుంటుందిలే తలంబ్రాలు.. ఆ పూజలున్నూ.. ఇక మేం వెళ్ళొస్తాం పద వైశాలి వదినా అన్నట్లు ఇట్నించే రైల్వే స్టేషనుకు పోతున్నారా సుందరం అర్జంటు పనులున్నాయి. తగ్గింది కదా అని ఓ… ఎడాపెడా తిరిగేసి మళ్లీ ప్రాణం మీదకి తెచ్చుకోబాకు’’ అంది సుశీల. ఇంటికొచ్చేటప్పటికి సాయంత్రం ఏడైంది వైశాలి వంట మొదలెట్టింది.

వైశాలి అత్తగారు సరస్వతమ్మ. ముప్పై ఏళ్ల క్రితం మళ్లీ టీవీలో ప్రసారం చేస్తున్న రామాయణం సీరియల్‌ భక్తిగా చేతిలో బాటరీతో నడిచే రుద్రాక్షమాల తిప్పుతూ చూస్తోంది. వైశాలి కొడుకు చైతన్య తన లాప్‌టాప్‌లో బీసీగా ఉన్నాడు.

కూతురు నీహారికతో ఫోన్‌లో మాట్లాడాక వంటకుపక్రమించిన వైశాలికి ఎదుటి ప్లాట్‌లో ఏదో గందరగోళంగా మాట్లాడుతూన్న మాటలు, జై శ్రీరాం అంటూ అరుపులు వినిపించాయి. ఇంతలో కాలింగ్‌ బెల్‌ మోగింది.

వైశాలి తలుపు తీసింది.

ఎదురింట్లో కాషాయధారులైన రామభక్తులు… అయోధ్య రాముల ఆహ్వాన పత్రిక తలంబ్రాలు పంచుతున్నారు. తలుపు తెరవగానే వైశాలితో జై శ్రీరామ్‌ అన్నారు వాళ్లు. సరస్వతమ్మ పరుగులు పెట్టుకుంటూ వచ్చింది… ‘‘శ్రీ రామ శ్రీ రామ ప్రభు’’ అనుకుంటూ. వాళ్లు అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్ట కోసం అచ్చేసిన ఆహ్వాన పత్రికలు, అక్షింతలు ఇవ్వబోయారు. వైశాలికి భగ్గుమంది అక్షింతలు పురుగుల్లా కదలాడుతున్నట్లు అనిపించింది… వెన్నులోంచి ఒణుకు వచ్చింది. ‘‘వద్దు… వెళ్లండి, మా ఇంట్లో ఉన్నాయి’’ అంటూ తలుపేయబోయింది.

‘‘ఆగు, ఇవి పవిత్రమైన అయోధ్య నుంచి వచ్చాయి కాదనకూడదు’’ అంటూ సరస్వతమ్మ వైశాలి మీద అరిచి అక్షింతలు తీస్కొని భక్తిగా కళ్ల కద్దుకుని పూజ గదిలో పెట్టింది. వచ్చిన వాళ్లలో రామభక్తుడొకడు అక్షింతల్ని ఎలా పవిత్రంగా పూజ గదిలో పెట్టాలో… ఏం చెయ్యాలో చెబుతుంటే వైశాలికి కోపం నషాళానికి అంటుంది. ‘‘మా ఇంట్లోకొచ్చి రాముడికి పూజ చేయమని చెప్పడానికి మీరెవరు వెళ్లండి బయటకు’’ అంటూ అర్చింది తలుపు వైపు వేలు చూపిస్తూ!

‘‘అమ్మాఁ పోనీ ఒదిలెయ్‌… నానమ్మను తీస్కోనీ…’’ అన్నాడు చైతన్య.

‘‘ఏమ్మా ఎందుకు వద్దమ్మా అంత పవిత్రమైన అక్షింతలు? ఏం తల్లీ నువ్వు హిందువ్వి కాదా… పక్క గల్లీలో ముసల్మానులే తీస్కున్నారు అక్షింతలు. హిందువై ఉండి నీకేమైందమ్మా’’ వచ్చిన రామ భక్తులలో ఒకాయన పెద్ద గొంతేస్కుని గద్దిస్తూ ప్రశ్నిస్తున్నాడు. ముస్లిములు ఎందుకు తీస్కున్నారో… తనెందుకు వద్దందో వీళ్లకెప్పటికైనా అర్థం అవుతుందా… ఇంట్లోకి వచ్చినవి అంక్షింతలా… లేక మతపు విత్తనాలా? అక్షింతల్ని భక్తిగా ‘‘రామ శ్రీ రామ అయోధ్య రామ ఏమనుకోబాకు స్వామీ మా కోడలుకి ఏమీ తెలీదు’’ అని పలవరిస్తూ అక్షింతల్ని కళ్లకద్దుకుంటున్న అత్తగార్ని నిస్సహాయంగా చూస్తూ మళ్లీ వీధి రౌడీల్లా దబాయించబోయిన ఆ రామభక్తులకి వీధి తలుపు చూపిస్తూ తలుపేసేసింది వైశాలి.

——

శ్రీ సాయి రామ్‌ హాస్పిటల్‌… ‘త్వరగా పోనీ’ సుందరం రొప్పుతున్నాడు. ఆటో వేగంగా దూసుకుపోతున్నది ‘‘సాబ్‌ టెన్షన్‌ కావద్దు టైంకి దవాఖానాకు తీస్కెళతా మీకేం కాదు… పరేషాన్‌ నై హోనే కా అల్లాఁసే దుఁవా మాంగే హమ్‌ ఆప్‌ కే లియే’’ అంటూ ఇబ్రహీం ఆటో వేగం పెంచాడు.

‘‘డా॥ జహంగీర్‌ గారూ హాస్పిటల్లో ఉన్నారుగా… మీ పేషంటు సుందరానికి  ఆయాసం వస్తోంది ఛాతీలో నొప్పంటున్నారు. మేం ఐదు నిమిషాల్లో వస్తున్నాం.’’

రాజశ్రీ ఏడుపు ఆపుకుంటూ ఫోన్లో చెబుతున్నది… ఆటో వెళుతున్న వేగానికి ఆటోకి కట్టిన కాషాయ జెండా రెపరెపలాడుతున్నది.

One thought on “ఆమె నవ్వింది…

  1. TEMPLE WASTE —LOT OF FAMILIES ARE HOMELESS —BUILT HOUSES
    ELECTION YEAR —ALL POLITICAL PARTIES DO SAME THING
    DEVUDU — MATHAM — KULAM -ALL ARE VOTE BANKS

Leave a Reply