ప్రముఖ గాంధేయవాది, ఆదివాసీ మిత్రుడు హిమాంశు కుమార్ ఫేస్ బుక్ పేజీ నుండి…….
మన దేశంలో రానున్న కొద్ది సంవత్సరాలలో కోట్లాది ప్రజల భూములను తన్ని తన్ని వారి నుండి స్వాధీనం చేసుకుంటారు!
పోలీసులతో పేదలను తన్నించి మేం వారి భూములు గుంజుకుంటాం.
పేదల భూములు స్వాధీనం చేసుకొని మేం మా కోసం హైవే, షాపింగ్ మాల్, విమానాశ్రాయాలు, రిజర్వాయర్లు, కార్ఖానాలు నిర్మిస్తాం, అభివృద్ధి సాధిస్తాం.
మేం బలసంపన్నులం, అందుకే మేమేదైనా చేయగలం?
గ్రామీణులు బలహీనులు, వాళ్ల మాట వినే వాడెవడు?
వాళ్లు బలసంపన్నులనేది నిజమనుకుందామా? దీని కోసం తలబద్దలు కొట్టుకోవలసిన పనేం లేదు? వాద- సంవాదాల అవసరం అంతకన్నా లేదు.
మేమిపుడు చాలా సంస్కారవంతులమవుతున్నామని కూడ దబాయిస్తున్నాం.
మేమత్యంత ప్రజాస్వామికులం అవుతున్నాం. ఇపుడు మన సమాజం అత్యంత అహింసాయుతం అవుతోంది.
ఇలా అంటూ మనమెవరిని మోసగిస్తున్నాం? ఇది మనకు మనమే మోసగించుకోవడం కాదా?
కోట్లాది ప్రజల భూములను బలవంతంగా లాక్కోవడం, ప్రజలపై బర్బర దాడులకు దిగడం, కనీసం వాళ్లతో మాటైన మాట్లాడకపోవడం, వాళ్ల వైపు చూపైనా విసరడానికి సిద్దపడకపోవడం ఇలా ఇంకెంతకాలం మనం రాజ్యం చలాయిస్తాం?
మా ఈ కొల్లసొమ్ము పంపకాలు, క్రౌర్యం పేదల గుండెల్లో ఎప్పటికైనా ఆగ్రహాన్ని రగిలించకపోతుందా?
పేదలంతా ఇట్లనే తమ భూములను అప్పగించి మౌనంగా వుంటారనీ, వాళ్లు ఏ రిక్షా వాళ్లుగానో, కూలీలుగానో అయిపోతారనుకుంటున్నామా?
వాళ్లు బిచ్చమెత్తుకొని బతుకుతారు, వాళ్ల భార్యా, బిడ్డలు వేశ్యలుగా మారి కుటుంబాన్ని పోషించుకుంటారు?
వాళ్ల పేదరికం మూలంగా మనకు చౌక కూలీలు దొరుకుతుంటారు?
భూమ్మీద పుట్టిన ప్రతి మనిషికి భూమి, నీరు, గాలి, ఎండ, తిండి, బట్ట, గూడుపై అందరికి సమానమైన, పుట్టుకతోనే వచ్చిన హక్కులుంటాయి.
దేవుడిచ్చిన ఈ హక్కుల నుండి ఏ మనిషినీ వంచించలేం. ఎందుకంటే, ఇవి లేకుండా ఎవరూ జీవించలేరు.
అందుకే ఏ వ్యక్తిగానీ లేద ప్రభుత్వమే కానీ ఎవరి నుండైనా ఈ హక్కులను గుంజేసుకుంటే ఇది ప్రకృతికి విరుద్ధమవుతుంది, సమాజానికి విరుద్ధమవుతుంది, సంవిధానానికి వ్యతిరేకం అవుతుంది, సభ్యతకూ విరుద్ధమే.
మేం రోజూ కోట్లాది ప్రజల నుండి వాళ్ల భూములనూ, ఇళ్లనూ, తిండినీ, తాగేనీళ్లనూ గుంజుకుంటున్నాం. దీనినే మనం అభివృద్ధి అంటున్నాం. సంస్కారం అంటున్నాం, ప్రజాస్వామ్యం అంటున్నాం.
ఎవరిదగ్గరైనా ఆహారం, బట్టలు, ఇళ్లు, పాలు-పెరుగు సేకరించుకోగల శక్తి వచ్చిందంటే వాళ్లను మనం అభివృద్ధిని సాధించిన మనిషి అంటాం.
సరే, ఆ మనిషి ఒక్క తిండి గింజైనా పండించకపోయినా, ఇళ్లు కట్టలేకపోయినా, గనుల నుండి బంగారాన్ని తవ్వి తీయలేకపోయినా, గొడ్ల కాయకపోయినా…
అంటే సంపదను సృష్టించకపోయినప్పటికీ ఆయన దగ్గర సంపద పోగుచేసుకునే శక్తి వున్నందుకే అ వ్యక్తినా మాత్రం అభివృద్ధి చెందిన వాడని అంటాం
ఉత్పత్తిలో పాల్గొనకుండా ఉత్పత్తిని సొమ్ము చేసుకునే శక్తి సమకూరడం అంటే అదేదో ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ ద్వారానే సాధ్యమవుతుంది.
ఇలాంటి అన్యాయమైన ఆర్థిక వ్యవస్థ ఒనగూడడం అంటే ఆ సమాజంలో అందుకు తగిన ఏదో రాజకీయ వ్యవస్థ దానిని కాపాడకుండా అది సాధ్యమే కాదు.
ఇలాంటి అనుత్పాదక వ్యక్తులు లేద వ్యక్తులకు చెందిన వర్గం ఉత్పత్తుల మీద కబ్జా సాధించడం న్యాయమైందేనని అనుకునే రాజకీయ వ్యవస్థ శ్రమజీవులకు చెందిన వ్యవస్థ ససేమిరా కానే కాదు.
ఇలాంటి పొసగని, అశాస్త్రీయమైన, అసమంజసమైన, దోపిడీ ఆర్థిక రాజకీయ వ్యవస్థ కేవలం ఆయుధాల బలంపైనే నిలబడుతుంది, చలాయిస్తుంది.
అందుకే చాలా అభివృద్ధి చెందిన వర్గాలకు అధిక మొత్తంలో ఆయుధాలు, అధిక సంఖ్యలో సైనికులు, పెద్ద మొత్తంలో జైళ్లు అవసరమవుతాయి. ఎందుకంటే, ఈ కృత్రిమమైన రాజకీయ వ్యవస్థను ప్రశ్నించేవారిని, దీనిని మార్చాలనీ ప్రయత్నించే వారిని అణచిపడేయడానికి.
కష్టపడకుండా సర్వ సంపదలను కైవశం చేసుకున్న వర్గాలకు అసలు బండారం బయటపడుతుందనే భయం పీడిస్తుంది. అందుకే వాళ్లు ఈ ప్రపంచంలో ఇదే అత్యుత్తమమైన వ్యవస్థ అని నిరూపించడానికి పాట్లు పడుతుంటారు.
ఈ వ్యవస్థను ఈ దోపిడీ వర్గాలు ప్రజాతంత్రం అంటాయి. ఇది పవత్రమైనదని తెలుపడానికి ప్రయత్నిస్తుంటాయి. అందుకోసం మతం, మహాపురుషులు, సినీ తారలు, పేరుపోయిన ఆటగాళ్లు సహ అన్ని రకాల ప్రతీకలను తమవేననీ ప్రదర్శిస్తుంటాయి.
విశ్వ వ్యాపితంగా ఇపుడు ఈ దోపిడీ వ్యవస్థ సవాళ్లతో చుట్టుముట్టబడుతోంది. ఈ వ్యవస్థ మూలంగా సమాజంలో హింసా పెరిగిపోతోంది.
మనం అసలు దీని మూలాన్ని అర్థం చేసుకోవడం లేదు. హింసను పోలీసుల బలంతో అణచివేసే విఫల ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఆయుధాల బలంపై ఈ దోపిడీని ఇంకెంత కాలం నిలబెట్టుకుంటారో చూద్దాం?
అనుసృజన ప్రగతి