“పదహారు ప్రజా సంఘాలను యెందుకు నిషేధించారు?”

“మొదటిది… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను యెత్తి చూపుతున్నాయి…”

“ఔను, ప్రజాస్వామ్యంలో యెవరు పడితే వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించడం తప్పే”

“అంటే విమర్శించి రెచ్చగొట్టి తమ సంఘాల వైపు ఆకర్షిస్తున్నాయి…”

“నిజమే, ప్రభుత్వాలు ఆకర్షణ శక్తిని కోల్పోయినట్టవదూ?, యింకా నేరం”

“రెండోది… అన్నల ఆదేశంతో బీడు భూములు ఆక్రమించేసుకుంటున్నారు…”

“ఔన్లే, లీడర్స్ ఆక్యుపై చెయ్యొచ్చు… బడా బడా కంపెనీలకు వేల ఎకరాలు అప్పనంగా రాసివ్వొచ్చు కానీ బీదా బిక్కీ బీడు భూములు దున్నుకోవడం తప్పే”

“అంతేకాదు, రాజ్య నిర్బంధం మీద నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు”

“ఊ… నిరసన కార్యక్రమాలకు అవకాశం యిస్తే, రేపు రాజ్యాన్ని నిర్బంధించరూ?, ఘోరం”

“పైగా వరవరరావు, జిఎన్ సాయిబాబా, రోనా విల్సన్ విడుదల కోరుతున్నారు”

“ఇవాళ విడుదల కోరుతారు, రేపు చెయ్యని నేరానికి శిక్షా- రద్దు చెయ్యమంటారు, తప్పే”

“ఉపా, వ్యవసాయ చట్టాలు, సియ్యేయే, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు”

“ప్రజలకు లేని అవగాహన కల్పించి అలజడికి కారణం అవుతున్నారు, అన్ని వర్గాలు కలిసి కొట్లాడడానికి ప్రేరేపిస్తున్నారు, ఇలా అయితే యెలా పాలించాలి?, తప్పే”

“అందుకే ప్రభుత్వం నిషేధించింది. అయినా మావోయిస్టుల ఎజెండాని స్వయానా ముఖ్యమంత్రే అమలు చేస్తామని చెప్పారు కదా?”

“ఔన్లే, అప్పుడు యీ సంఘాల వాళ్ళకి యింక పనేముంటుంది?, అందుకే అన్నిటినీ నిషేధించారు!”

“అంతేగా! అంతేగా!”

Leave a Reply