మేధావులందరూ వొక్క చోట చేరారు. ‘జై శ్రీరామ్’ చెప్పుకున్నారు. వాళ్ళ మెదళ్ళ కుదుళ్ళలో దేశ భవిత దాగుందని వాళ్ళకే తెలిసిపోవడంతో మదముతో మేధో మదనమునకు సిద్ధపడ్డారు.
గోడకు వేళ్ళాడదీయబడ్డ దేశ యేలికుని చిత్రపటం చూస్తూ ‘ఆ తెల్లని గడ్డంలో యేమి కనిపిస్తోంది?’ అని అడిగి, అంతలోనే ‘ఆ తెల్లని గడ్డంలో దాగిన మర్మమేమి?’ అని దిద్దుకున్నారు వృద్ధ పెద్దమనిషి.
‘స్వచ్ఛత’ అన్నారు కొందరు. ‘పాలవంటి తెల్లని స్వచ్ఛత’ అన్నారు యింకొందరు. ‘మాకు దేశ శిఖరాయమాన హిమాలయాలు కనిపిస్తున్నాయి’ అన్నారు మరికొందరు. ‘మాకయితే పాల సముద్రం కనిపిస్తోంది’ అన్నారు మిగిలిన అందరూ.
‘నాకయితే తెల్లని ఆవు కనిపిస్తున్నది’ యెంతో సౌమ్యంగా అన్నాడు ప్రశ్నించిన పెద్దమనిషి.
మాకందరికీ మొదట ఆవే కనిపించిందని, తెల్లవి కాకుండా నల్లని మీసాలు వుండి వుంటే- అవి పైకి తిరిగి వుండి వుంటే- ఆవు కొమ్ములుగా యిట్టే గుర్తుపట్టేవారమని వారంతా వాపోయారు. తీవ్రంగా చింతించారు కూడా.
‘సత్యమేవ జయతే’ నవ్వుతూ అన్నాడు పెద్దమనిషి. సత్యము జయిస్తుందన్నాడు. సత్యాన్ని సాధించాలన్నాడు. సత్యాన్ని శోధించాలన్నాడు. చివరకు- మనం చెప్పేదే సత్యం అయితీరాలని కూడా అన్నాడు.
‘మనం యేది చెప్తే అదే సత్యం’ అర్థం చేసుకున్నట్టు అంతా వొకే గొంతుకగా అన్నారు. ‘అసత్యాన్ని అస్సలు బతకనీయగూడదు’ అని వుమ్మడిగా తీర్మానించారు.
నవ్వుతూ ఆ వృద్ధ పెద్దమనిషి ‘ఆవు ఆవు కాదు, మన పాలిట కామధేనువు!’ అన్నాడు.
అంతా తమ కళ్ళెదుట కామధేనువుని చూసినట్టే చూశారు.
‘కోరిన వస్తువులిచ్చెడి వేల్పుటావు’ అని వృద్ధ పెద్దమనిషి విప్పి చెపితే, ఆ కోరికలను మాత్రం వొక్కొక్కరూ వొక్కో రకంగా అర్థం చేసుకున్నారు.
‘కామధేనువు కూడా పాలసముద్రం నుండి పుట్టింది’ అని యువ మేధావి చిత్రంలోని గడ్డంవంక తన్మయంగా చూశాడు.
‘సత్యమేవ జయతే- అని ఆవు కథ చెప్పింది. ఆవు కూడా సత్యనిష్ఠతో ధర్మనిష్ఠని నెరవేర్చుకోగలిగింది. బిడ్డదూడకు పాలిచ్చి తిరిగి అడవికి ఆహారంగా వచ్చింది’ కథని గుర్తు చేసుకున్నారు అంతా.
పులిగారి దయాదాక్షిణ్యాల మీద ఆవు ప్రాణం మిగలడం అవమానంగా తోచింది అక్కడున్న మేధావులందరికీ. పైగా ఆవు ఆహారంగా ఆనాటి కాలం నుంచే వుందని మూర్ఖులు వాదనలు తీ(చే)స్తారని భయం కూడా వేసింది.
అందరూ ఆలోచనల్లో పడ్డట్టు మౌనముద్రలోకి వెళ్ళిపోయారు.
‘తప్పు లేదు, పులి మన దేశ జాతీయ జంతువు… సో’ చెప్పకముందే చెప్పినావిడిని అంతా తప్పు పట్టారు.
‘ఉంటే గింటే జాతీయ జంతువుగా ఆవు వుండాలి గాని, పులి వుండడం వెనకటి ఆవుకే కాదు, యిప్పటి మనకీ అవమానం’ యెక్కువ సమయం పట్టలేదు మేధావులందరూ వొకే తాటి మీదకు రావడానికి.
‘ఆవుని మన దేశ జాతీయ జంతువుగా ప్రకటించడం హిందూధర్మ నైతిక విజయం’ తీర్మానానికి వో అనుమానం అడ్డం పడింది.
‘మన దేశ జాతీయ జంతువుగా పులిని యెందుకని కాదంటున్నామో కూడా చెప్పాలి కదా?’
‘ఔను, పులి జాతి అంతరిస్తున్నది, వేళ్ళ మీద లెక్కపెట్టే పులులు రేపటికో మాపటికో యెలాగూ అంతరిస్తాయి. అంతరించిన జాతిని జాతీయ జంతువుగా చెప్పుకోవడం కంటే, ఆ జాతీయ జంతువైన పులిని ఆఖరి పులిగా నివాళులు అర్పించడం మంచిది’ అని మేధావులంతా సమాధాన పరచుకున్నారు.
ఇది ప్రజా అభీష్టం అని కూడా అన్నారు.
అంతా కలిసి దేశ యేలికని కలుసుకున్నారు. విన్నవించుకున్నారు.
‘బెంగాల్’ టైగర్‌ని జాతీయ హోదా నుండి తప్పించడం యెంతో ముదావహంగా వున్నట్టు ఆయన నిమురుతున్న గడ్డం మెరిసి పడి ప్రతిఫలించింది.
‘ఆవుకే జాతీయ జంతువు హోదా యెందుకు?’ యేలిక తన నిజాయితీని నిరూపించుకొనేందుకు అంత కంటే అవకాశం లేదన్నట్టుగా ప్రశ్నించారు.
అప్పుడే విడిది భవనం గుమ్మంలోకి వచ్చిన ఆవులు ఆ ప్రశ్న విని అరిచాయి.
“అంబా… అంబా…”
ఆ అరుపును యేలిక కళ్ళు మూసుకొని విన్నారు. ధ్యానంలోకి వెళ్ళినట్టుగా విన్నారు. ఒక ఓంకారం విన్నట్టుగా విన్నారు.
“అంబా… అంబా…”
దిక్కులు ప్రతిధ్వనించాయి!
ఏలిక చెవొగ్గి విన్నారు. ఆయన పెదాలమీద చిరునవ్వు పూసింది.
‘నేనిలాంటి మరొక జంతువుని నా కళ్ళతో చూళ్ళేదు’ కళ్ళు మూసుకొని తలాడిస్తూ తన్మయంగా విన్నారు యేలిక.
“అంబా… అంబా…”
“ఆవు వొక్కటే అంబా’ని అంటోంది…”
మంత్రముగ్దుడైన యేలిక గడ్డం నిమురుకుంటూ ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించేశారు.
దేశభక్త ప్రజలు పారవశ్యంతో జై కొడుతూ నినాదాలిచ్చారు.
ఆవు *అంబా అంది*
అదిరింది..