మనుషుల స్పందనలు బహు విచిత్రం.  ఎప్పుడు దేన్ని పట్టించుకుంటారో.  ఏ విషయంలో  మౌనంగా ఉంటారో. దేన్ని తప్పించుకొని జాగ్రత్తగా తిరుగుతారో. చెప్పడం అంత సులభం కాదు. ఆరోపించీ లాభం లేదు. దీన్నంతా ఇష్టా ఇష్టాలుగా తేల్చవచ్చా? ఉద్దేశాలకు, రాజకీయాలకు మాత్రమే ఆపాదించవచ్చా? చైతన్యం గీటురాయి మీద పరీక్షించవచ్చా? సాంస్కృతిక స్థాయిగా కూడా చూడవచ్చా?

ఇట్లా ఎన్ని చెప్పుకున్నా ఎంతో కొంత  మిగిలే ఉంటుంది. దీనికి చాలా కారణాలే ఉంటాయి. సమాజం యావత్తూ స్పందించడం సరే. అక్కడ చాలా సంక్లిష్టతలు పని చేస్తుంటాయి. స్పందనకూ మౌనానికీ  జటిలమైన కారణాలు ఉంటాయి. కానీ సమాజ కంఠస్వరంగా వినిపించే వాళ్ల మాటలనూ, మౌనాన్నీ చర్చించడానికి కాస్త స్పేస్‌ ఉంటుంది. లేకుంటే సిద్ధం చేసుకోవచ్చు. తప్పేమీ కాదు. ఏదో ఒక విషయమనే కాదు.  దేని మీదైనా సరే. మన స్పందనా గుణం ఏమవుతున్నది? మనలోని  ప్రేరణలు ఏమవుతున్నాయి? మనలోని స్తబ్దతకు ఎక్కడ మూలాలు ఉన్నాయి? అనే స్వయం పరిశీలన ఎందుకైనా మంచిదే. 

ఫలానా దాని మీద మీరెందుకు స్పందించలేదని ఎవరినైనా అడిగామనుకోండి. అవతలి వాళ్లు ఊరుకుంటారా? మీరెందుకు   ఇంకోదాని మీద స్పందించలేదు? అని ఎదురు ప్రశ్న వేయవచ్చు.  కొందరికి తమ అవగాహన వల్లనే కొన్ని ఇతరం అవుతాయి. మరి కొందరికి అవగాహనలో ఉన్నా నిర్లక్ష్యానికి గురవుతాయి. ఈ రెంటి మధ్య ఒక అర్థవంతమైన చర్చ చేయడానికైతే ఆస్కారం ఉంది. ఎందుకు ఇలా జరుగుతున్నదో పరిశీలించవచ్చు. దానికి మనం సిద్ధం కాగలమా? అనేదే ప్రశ్న.

మామూలుగా లోకంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఇది తగదని చెప్పడానికి ప్రతి సమాజంలో కొందరు ఉంటారు. ఆ అన్యాయం ఏమిటో తెలుసుకోగల అవకాశాల్లో తేడా ఉండొచ్చు. స్పందనకైతే లోటు ఉండదు. అంత మాత్రాన అన్యాయానికి గురైన వాళ్లకు ఓదార్పు దక్కకపోవచ్చు. దానికి మూలమైన సమస్యను మనం రద్దు చేయలేకపోవచ్చు. కనీసం మళ్లీ అలాంటిది జరగకుండా నివారించలేకపోవచ్చు. అయినా మనం ఊరుకోం. మన మాట మనం చెబుతాం. మన నిరసన మనం తెలియజేస్తాం. మన పద్ధతిలో మనం ఆందోళనపడతాం. వాళ్ల కోసమే కాదు. ఒక్కోసారి కేవలం మన కోసమే. మేం ఉన్నాం.. అని చెప్పుకోడానికి ఆ పని చేస్తాం. వ్యక్తిగతంగా అయినా. సామూహికంగా అయినా. కొంచెం ఎక్కువగానో, తక్కువగానో మనల్ని మనం వ్యక్తీకరించుకోవడం అత్యవసరం అనుకుంటాం. బహుశా చాలాసార్లు అన్యాయానికి గురైన వాళ్లు మనల్నేమీ  ప్రత్యేకంగా అడగకపోవచ్చు కూడా. ఆ అన్యాయం  మనకే జరిగినట్లు ఫీలవుతాం. మన అంతరాంతరాల్లో వాళ్లూ మనమూ ఒకటే అనుకుంటాం. ఇక్కడ మన ఊళ్లో మనం వినిపించే, ప్రదర్శించే నిరసన అక్కడ వాళ్ల ధిక్కారానికి నైతికబలాన్ని ఇస్తుందని అనుకుంటాం. మనస్పూర్తిగా ఆ మాట అనుకోకపోతే మణిపూర్‌ గురించో, పాలస్తీనా గురించో మనకెందుకు ఇంత ఆరాటం?

వాళ్లకూ, మనకూ ఉండే మానవత అనే ఉమ్మడి కుదురు గురించిన ఎరుక అది. ఇది చాలా లోతైన భావన! మన వ్యక్తిత్వపు పొరల నుంచి అట్లా బైటికి ఉబికి వచ్చేస్తుంది. అంతే. దు:ఖంగా. క్రోథంగా. ఆగ్రహంగా. ప్రేమగా. నిజంగా అప్పుడు కదా! మనం మానవులమని మనల్ని మనం రుజువు చేసుకొని న్యాయాన్యాయాల ద్వంద్వంలో ఏ వైపో తేల్చుకొనేది! అప్పటికీ వాళ్లు మనల్ని అడగకపోవచ్చు. మీరు మా వైపు రమ్మని పిలవకపోవచ్చు. కానీ మనమే ఎంచుకుంటాం.

ఒక్కోసారి బాధితులు మనల్ని అడగవచ్చు. ‘మా గురించి మాట్లాడండి’ అని. ఆ మాట మన దాకా చేరడానికి ఎన్ని అడ్డుగోడలైనా ఉండొచ్చు. అవి ఈ వ్యవస్థ కల్పించినవి కావచ్చు. మనంతకు మనం కల్పించుకున్న దృక్కోణాల వల్ల కావచ్చు. ఈ లోకం వల్ల మనకు కలిగిన దురభిప్రాయాల వల్ల కూడా కావచ్చు.  వాళ్ల  మీద రాజ్యం కొనసాగిస్తున్న అణచివేతలోని తీవ్రత వల్ల కూడా కావచ్చు. మన చుట్టూ బాధితుల కంఠఘోష గింగిర్లు కొడుతూనే ఉంటుంది. కానీ మనకు వినిపించదు. మన కళ్ల ముందే శవాల గుట్టలు పడుతుంటాయి. కానీ ఆ దృశ్యం మన మనసుల్లో ముద్రించుకోదు. మన కాళ్ల కింది నుంచే వాళ్ల నెత్తురు ప్రవహిస్తూ ఉంటుంది.  కానీ   ఆ చెమ్మ మన స్పర్శజ్ఞానానికి అందదు.  

ఇది అన్నిటి కన్నా విషాదం. ఇదీ ఫాసిస్టు పని విధానం.

ఫాసిజం మనల్ని లోబరుచుకోవడమంటే ఇదే. మన మౌనంతో సమ్మతి పొందడమంటే ఇదే. హింస సాధారణం కావడమంటే ఇదే. మన స్పందనల్ని కొల్లగొట్టడమంటే సరిగ్గా ఇదే.

వాళ్లు బాధితులు కావడం కన్నా వాళ్లకు మనం పరాయి వాళ్లం కావడం బాధాకరం.  ఇది మనకు నొప్పి కలిగించాలి కదా. 

గత వారం దండకారణ్యం నుంచి  ఇద్దరు ఆదివాసీ యువకులు హైదరాబాదుకు వచ్చారు. ఎక్కడో కారడవి నుంచి. కాలిబాటన ఎంత నడిచారో. అడుగడుగునా ఉండే భారత సైనిక క్యాంపులను ఎట్లా దాటి వచ్చారో. లక్షలాది తుపాకుల పహారాను ఎట్లా కన్నుగప్పి వచ్చారో? ఒక సుదీర్ఘ ప్రయాణమే  చేశారు.  ఇంత ప్రయాస దేని కోసం? ఇంత ప్రమాదభరితమైన ప్రయాణం ఎందు కోసం? ఇక్కడ ఏమున్నదని? ఏ అశ ఉన్నదని? ఏ ఆక్కర తీర్చే వాళ్లు ఉన్నారని? ఎన్నడూ చూడని ఈ జనారణ్యానికి సాహసికంగా వచ్చారు. బహుశా దశాబ్దాలుగా వాళ్లు  నిర్మించుకుంటున్న పోరాట చరిత్రలో మనల్ని కనుగొని ఉంటారు.  అందుకే  ‘మా గురించి మాట్లాడండి’ అని కోరుకున్నారు.  ఈ నాలుగు నెలల్లో 130 మంది ఆదివాసులను చంపేశారని, ఈ దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన సైనిక బలగాలు తమ గూడేల ముంగిట్లో తిష్టవేశాయని, అడవిని, అడవి జీవితాన్ని ధ్వంసం చేస్తున్నాయని, అందరినీ చంపేస్తానని ప్రభుత్వం అంటోందని, వరుసగా చంపుకపోతోందని చెప్పడానికి వచ్చారు.

వాళ్లు వచ్చి చెప్పక ముందు మనకు ఇదేమీ తెలియదా? తెలియదని అనగలమా? ఒక వేళ అట్లా అనేటట్లయితే అప్పుడు మనం గుండెల మీద చేయి వేసుకోగలమా? యావత్‌ ప్రపంచంలో ఏం జరుగుతోందో  క్షణాల్లో మనం తెలుసుకొనేవాళ్లం. పొరుగున ఏం జరుగుతోందో మనకు తెలియకపోవడం ఏమిటి? అనుమానం లేదు. ఆదివాసులు ఇక్కడికి వచ్చి చెప్పక ముందే మనకు అంతా తెలుసు. కొద్ది మందికైనా ఎందుకు జరుగుతోందో స్పష్టంగా తెలుసు.

అయినా చెప్పడానికి వాళ్లు వచ్చారు. ఆదివాసులకు ఒక విషయం తెలియడమంటే కేవలం సమాచారంగా తెలియడం కాదు. వాళ్లకు తెలియడమంటేనే  తమ నైసర్గిక, సాంస్కృతిక జీవితంలో భాగం కావడం. ఇక అది ఆలోచనగా మారుతుంది.  పనిగా రూపాంతరం చెందుతుంది. మన గురించి కూడా అట్లాగే అనుకున్నారేమో. వాళ్ల బాధలు చెబితే అది మన ఎరుకగా మారుతుందని. తమ పోరాటాన్ని వివరిస్తే అది మన సంఫీుభావంగా మారుతుందని.

నాలుగు నెలలుగా మన మధ్య ఒక చిన్న పాలస్తీనా తయారవుతున్నది. అక్కడా ఇక్కడా దురాక్రమణే. అక్కడా ఇజ్రాయిల్‌ ఆయుధాలే. ఇక్కడా ఇజ్రాయిల్‌ అయుధాలే. ఒకే యుద్ధతంత్రం. తేడా అల్లా అక్కడ  వేల మంది హత్యాకాండ.  ఇక్కడ వందలు దాటుతున్న మారణకాండ. మనుషులు కేంద్రంగా ఆలోచించే మనం ఈ అంకెల తేడాను లెక్కిస్తామా? పోటీ పెడతామా? ఎక్కువ తక్కువలనుబట్టి  స్పందిస్తామా? ఎక్కడైనా మనుషులు కదా మనకు ముఖ్యం. ఆ నేల ఎట్లా అక్కడి పాలస్తీనా ప్రజలదో. ఈ నేల ఇక్కడి దండకారణ్య ఆదివాసులది. తనదికాని దేశాన్ని చేజిక్కించుకోడానికి అక్కడొక దురామ్రణ యుద్ధం.  రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యం సహా ఆదివాసులది తప్ప మరెవరిదీ కాని అడవిని కైవసం చేసుకోడానికి ఇక్కడొక కార్పొరేట్‌ యుద్ధం. తనదికాని, తనకే అధికారం లేని నేలను కార్పొరేట్లకు అప్పగించడానికి భారత రాజ్యం ఆదివాసుల మీద చేస్తున్న యుద్ధం ఇది.   

సాహిత్యమంటే మానవ దు:ఖం కదా. వ్యథ కదా. గుండెలను చించుకొని బైటికొచ్చే ఆగ్రహం కదా. తెలుగు రచయితల కంట కన్నీరు ఒలికిందా? ఒక మాటో,  వాక్యమో, రచనో దు:ఖభరితమైందా? మానవ జీవితం చుట్టూ  తిరిగే సాహిత్యంలోకి ఈ మానవ విషాదం ప్రసరించిందా? ఈ నాలుగు నెలలుగా ఎన్ని వందల సందర్భాల్లో తెలుగు రచయితలు కలిసి ఉంటారు? సాహిత్య విశ్లేషణలు, సమాజ సాహిత్య పరిశీలనలు, అస్తిత్వ చైతన్యాలు, కళా సాహిత్య సిద్ధాంత అధ్యయనాలు, ఆయా కవుల, రచయితల జీవిత సాఫల్య అంచనాలు, వాళ్ల రచనల్లోని తాత్విక చింతనలు, సాహిత్యవాద వివాదాలు, ఫాసిస్టు వ్యతరేక వ్యక్తీకరణలు, రచయితల ప్రతిభా పాటవాలకు అవార్డుల ప్రదానాలు, స్వీకారాలు.. ఒకటేమిటి? లెక్కలేనన్ని కవి సమయాలు. కథా సందర్భాలు. ఎక్కడైనా దేశం సాగుతున్న ఈ అంతర్గత యుద్ధం ప్రస్తావన వచ్చిందా? వాళ్ల కోసం కాదు. అచ్చంగా మన కోసమే. మన ప్రకటిత ఆదర్శాల కోసమే. వాటిని బలపరుచుకోడానికే. రుజువు చేసుకోడానికే.

ఇప్పుడు దండకారణ్యం ఒక ‘శతృ’దేశం. అక్కడ ఆకాశంలోంచి బాంబులు కురుస్తున్నాయి. సెల్లింగ్‌ దాడులు జరుగుతున్నాయి.    పొలాలకు వెళ్లిన ఆదివాసులను పట్టుకొని కాల్చిపారేస్తున్నారు. పదుల సంఖ్యలో శవాల కుప్పలు.  పిల్లలు. స్త్రీలు. రైతులు. విప్లవకారులు. నేలవాలుతున్నారు.  దండకారణ్యం అదివాసీ రహిత భూభాగమైపోతుందా? అనిపిస్తోంది. అక్కడి  వాగుల్లో, వంకల్లో, ఉప నదుల్లో  నెత్తురుపారుతోంది. గోదావరి రక్త గోదావరిగా మారుతోంది.

దీనికి కవితా వస్తువయ్యే యోగ్యత లేదా? కథా ఇతివృత్తమయ్యే అర్హత లేదా? ఇందులో జీవితం లేదా? జీవితాంశ లేనేలేదా? మనం నిత్యం చెప్పుకొనే శిల్ప వైవిధ్యాల్లోకి, ప్రయోగాల్లోకి, కళాత్మక విలువల్లోకి ఈ దు:ఖం ఒదిగేది కాదా? పత్రికా సంపాదకీయాల్లోకి  చేరగల స్థాయి దీనికి బొత్తిగా లేదా? రాజ్యాంగ పరిరక్షణలో ఇది భాగం కాదా? ఆదివాసులు ఈ దేశ పౌరులు కాదా? దేశ ప్రజల మీద ప్రభుత్వం యుద్ధం చేయడం రాజ్యాంగ వ్యతిరేకం కాదా? రాజ్యాంగ ఆదర్శాల్లో ఇదీ ఒకటి కాదా?

ఎప్పుడో వందేళ్ల కింద, వందాయాభై ఏళ్లకింద జీవించి మరణించిన వాళ్లు ఫలానా రాయలేదని ఇప్పుడు మనం ప్రశ్నిస్తున్నాం కదా.  ప్రభుత్వమే ప్రజల మీద యుద్ధం చేస్తున్న ఈ దుర్భర కాలంలో జీవించి ఉన్న మనల్ని రేపటి చరిత్ర అట్లాగే బోనెక్కించదా?

Leave a Reply