చిత్తనూర్‍, ఎక్లాస్పూర్‍, జిన్నారం గ్రామాలకి చాలాదగ్గరలో ఇథనాల్‍ కంపెనీకి దగ్గర్లో ఎక్లాస్పూర్‍ గేటు దగ్గర రిలే ధర్నాలు జరుగుతున్న శిబిరం ముందు 22.10.2023న ఉదయం పూట రైతాంగంపై పోలీసులు దాడిచేశారు. అధికారులు, రాజకీయ నాయకత్వం మరియు కంపెనీ పక్షాన పోలీసులు చాలా ఆగ్రహంతో దాడిచేశారు. ఇది రైతులు ఊహించని ఘటన. ఎందుకు ఇలా దాడిచేస్తున్నారో రైతులకు అర్థంకాలేదు. అర్థమై ప్రతిఘటనకు దిగక తప్పని పరిస్థితుల్లో రైతులు కదిలే లోపే రైతులకు చాలా మందికి గాయాలయ్యాయి. ఇథనాల్‍ కంపెనీ వ్యతిరేకపోరాటం మొదలైన రెండు సంవత్సరాల తర్వాత ఆ ఉద్యమాన్ని నిలువరించడానికే ఈ దాడి జరిగినట్లుగా మేం అభిప్రాయపడుతున్నాం. 22.10.23న మొదలైన ఈ దాడి ఇంకా కొనసాగుతున్నదనే చెప్పాలి. చాలామంది రైతులని, ఉద్యమ నాయకత్వాన్ని నిర్బంధించి, అరెస్టు చేసి జైలుకు పంపారు. కఠినమైన క్రిమినల్‍ సెక్షన్లతో అక్రమకేసులు బనాయించారు. 30 మంది దాకా బెయిల్తో బయటకు రాగా, ఇతరులు మహబూబ్‍నగర్‍ జైల్లో ఉన్నారు. అనేకమందిని మరికల్‍ పోలీస్‍ స్టేషన్కు తెచ్చి స్టేషన్‍ బెయిల్తో బెదిరించి పంపారని, మరికొందరు ముందస్తు బెయిల్‍ ఆర్డర్‍ తెచ్చుకొని పోలీస్టేషన్లో ఇస్తుంటే తీసుకోవటం లేదని తెలుస్తున్నది.

ఒక ప్రణాళికతో ఈ దాడిచేశారు. ఎంత ప్రణాళికతో ఈ దాడిజరిగిందంటే? ఘటన తర్వాత సోషల్‍ మీడియాలో కొన్ని వీడియోలు తిరుగుతున్నాయి. వాటిలో రైతుల ప్రతిఘటన కనిపిస్తున్నది కానీ రైతులపై జరిగిన దాడి కనిపించటంలేదు. అక్కడ దహించుకపోయిన వాహనాలు ఎవరివల్ల అలా కాలిపోయాయో కూడా కనిపించడం లేదు. అయినా నెపం రైతుల మీద మోపి చిత్తనూర్‍, ఎక్లాస్పూర్‍, జిన్నారం తదితర గ్రామాలను పోలీసులు భయకంపితం చేశారు. గ్రామాల నుండి మగవాళ్ళను వెతికివెతికి పట్టుకుపోయారు. మహిళలను సైతం అర్ధరాత్రి దాకా పోలీస్‍ స్టేషన్లో ఉంచారు. అసభ్యంగా మాట్లాడారు. చేయిచేసుకున్నారు. చిత్తనూర్‍ ఇథనాల్‍ వ్యతిరేకపోరాట కమిటీలో క్రియాశీల భాగస్వాములు అఖిలభారత కుల అసమానతల నిర్మూలన కమిటీ  జాతీయ అధ్యక్షుడు బండారి లక్ష్మయ్యను, కులనిర్మూలనా పోరాట సమితి ఉమ్మడి మహబూబ్‍ నగర్‍ అధ్యక్షుడు డి.చంద్రశేఖర్ను హైదరాబాదులో నిర్బంధంలోకి తీసుకుని భయపెట్టారు. లక్ష్మయ్య గారిని అక్కసుతో పోలీస్‍ స్టేషన్లు మార్చి తీవ్రంగా కొట్టారు. వారి కుటుంబసభ్యులందరూ ఎక్లాస్పూర్‍ గ్రామానికి చెందిన వాళ్లు కావడంతో ఆ కుటుంబం గమ్మునుంటే ఉద్యమం ఆగిపోతుందని భ్రమతో, కసితోదాడి చేశారు. చాలామంది మీద లాఠీలు ప్రయోగించారు. కొందరు రైతులు, మహిళా రైతులు ఆసుపత్రిపాలయ్యారు ఈఘటన, ఘటన తర్వాత జరిగిన పరిణామాలను సమాజం సీరియస్‍ గా పరిగణించాలని కోరుతున్నాం.

జూరాల ఆర్గానిక్‍ ఫార్మస్ అండ్‍ ఇండస్ట్రీస్‍ వారు చిత్తనూరులో తేరగా చేతికి చిక్కించుకున్న దాదాపు 500 ఎకరాల భూమిలో పండ్లతోటలు పెంచుతామన్నారు. రైతులు ఇది వ్యవసాయమే కదా అనుకున్నారు. పండ్లరసాల కంపెనీ పెడతామన్నారు, కానీ వాళ్ళు ఏకంగా ఇథనాల్‍ ఉత్పత్తి కోసం పనులు ప్రారంభించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అందుకు అనువైన విధానాలు రూపొందించింది. ఇక కంపెనీ యజమాన్యం ఫార్మా రంగం ద్వారా పోలేపల్లి సెజ్‍ ప్రాంతంలో స్థానిక ప్రజల ఉసురు తీసుకున్న హెటిరో డ్రగ్స్ బండి పార్థసారధి రెడ్డి ప్రస్తుత భారతరాష్ట్రసమితి రాజ్యసభ సభ్యుడు, అలాగే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్‍ పార్టీ అభ్యర్థి అనేక ఎత్తులు జిత్తులతో చిత్తనూరు పరిసర గ్రామాల స్థానిక రాజకీయ నాయకత్వాన్ని కూడా లోబరుచుకుని నిర్మాణపనులు ప్రారంభించారు. ఆ నియోజకవర్గ శాసనసభ్యులు ఈ కంపెనీ తానే తెచ్చానని అనేక సభలలో ప్రకటించాడు.

తొలుత వాళ్ళు అసైన్డు భూములు ఆక్రమించారు. నక్షాబాటలు ఆక్రమించారు. మన్నెవాగును, వాగువ్యాలీని ఆక్రమించి ఇష్టం వచ్చిన మలుపులు తిప్పారు. అక్కడ వన్య ప్రాణులను చెదరగొట్టారు. వాటి ఉసురు తీశారు. ఆప్రదేశంలోకి ఎవరూ ప్రవేశించకుండా కంచెవేశారు. ఎవరికీ కనిపించకుండా గోడలు కట్టారు. కోయిల్సాగర్‍ కాలువ నీటిని నిలుపుకోవడానికి, నీళ్లుమలుపుకున్న కాలవ నిర్మాణమే కాక, అనేకబావులు, చెరువులు తవ్వారు. లోపల యుద్ధశకటాల్లాగా అనేక వాహనాలు నిరంతరం పనిచేశాయి. పనిలో పాల్గొన్న కూలీలు ప్రమాదాలకు కూడా గురయ్యారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గానీ, అన్నిశాఖల అధికారులు కానీ లోపాయికారిగా సహకరించారు తప్పితే కంపెనీ ఆగడాలను నిలువరించలేదు. పట్టించుకోలేదు.

చిత్తనూరు యువక మండలి జరుగుతున్న విపరీతాలను అర్థం చేసుకొని ప్రొ. పురుషోత్తంరెడ్డి వంటి పర్యావరణవేత్తతో ఇధనాల్‍ పరిశ్రమ ఉత్పత్తి క్రమంలో జరిగే నష్టాలు తెలుసుకొని గ్రామంలో ఉద్యమం ప్రారంభించారు. ఈ ఉద్యమ క్రమంలో వివిధ ప్రజాసంఘాలు పరిశీలన జరిపాయి. సైంటిస్టు డా. బాబురావు గారు కంపెనీవల్ల సంభవించే పరిణామాలను వివిధ దేశాల అనుభవాలను వివరించారు. ఈక్రమంలో వివిధ సంఘాలతో చిత్తనూరు ఇథనాల్‍ వ్యతిరేక పోరాటకమిటీ ఏర్పడింది. అప్పటినుండి ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యార్థులు, యువజనుల భాగస్వామ్యంతో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళనలు ప్రారంభించాం. అనేక ప్రజాఆందోళనలు జరిగాయి. చిత్తనూరు యువకమండలి లాగే ఎక్లాస్పూర్‍ యువకమండలి, రైతుమండలులు కూడా ఏర్పడి ఈ ఉద్యమాన్ని నిలకడగా ముందుకు నడిపించాయి. వివిధస్థాయిల్లో రౌండ్‍ టేబుల్‍ సమావేశాలు, సదస్సులు, ధర్నాలు, ప్రచారయాత్రలు, పాదయాత్రలు జరిగాయి. ‘‘చిత్తనూరు వార్తా బులెటిన్‍’’ కూడా రావడం మొదలైంది. చిత్తనూరు పరిసరాల 54 గ్రామాల ప్రజలు ఇథనాల్‍ వల్ల వచ్చే అనర్థాలు చెబుతున్నారు. ఆ కంపెనీవద్దంటున్నారు, ఎత్తేయాలంటున్నారు.

ఇధనాల్‍ పాలసీ రూపొందించి దానిచుట్టూ ఒకభావజాలం అల్లుతూ, చకచకా అనుమతులు ఇస్తూ భారతీయజనతాపార్టీ, కేందప్రభుత్వం అలాగే ఏ చట్టాన్ని అతిక్రమించి కంపెనీ పనులు చేసుకుంటున్నా పట్టించుకోకుండా ఏకంగా యాజమాన్య ప్రతినిధికి ఆ పనులు చక్కబెట్టుకోవడానికి రాజ్యసభ పదవి కట్టబెట్టి భారతరాష్ట్రసమితి రాష్టప్రభుత్వం సహకరిస్తుండగా, ఇప్పుడు ఆ కంపెనీ మరొక భాగస్వామికి కాంగ్రెస్‍ పార్టీ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిత్వం ఇచ్చింది. దిగువన ఏ రాజకీయపార్టీ నాయకత్వం కూడాగట్టిగా ప్రజలకు సహకరించలేని పరిస్థితికల్పించారు. తమతమ కార్యకలాపాలలో భాగంగా ఇతర రాజకీయపార్టీలు కంపెనీ వ్యతిరేకపోరాటానికి సహకరిస్తున్నాయి.

ప్రభుత్వం వైపు నుంచి సానుకూల స్పందన సాధించడానికి దీర్ఘకాలిక ఆందోళన అవసరమని మేము ఎక్లాస్పూర్‍ గేట్‍ దగ్గర నిరవధిక రిలేధర్నాలు ప్రారంభం చేశాము. 114 రోజులు జరిగాయి. ఆరోజుల్లోని ముఖ్యమైన దినాల్లో ప్రత్యేకంగా నిపుణులు మేధావులను ఆహ్వానించాం. 100 రోజులు అయినప్పుడు 8 అక్టోబర్‍ 2023న మహాధర్నా నిర్వహించాం. కుటుంబాలు కుటుంబాలుగా దాదాపు 6000 మంది స్త్రీపురుషులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. అంతగా తరలి రావడానికి కంపెనీ వదిలిన విష రసాయనాల అనుభవం కలిసి వచ్చింది.

ఇథనాల్‍ కంపెనీ వాళ్ళు సెప్టెంబర్‍ నెలలో కంపెనీ ట్రయల్‍ రన్‍ ను జరిపారు. విషరసాయనాలు మన్నెవాగులోకి వదిలారు. అవి రామనాడు దాకా మాత్రమే కాక క•ష్ణానదిలోకి కూడాపోతాయి. మన్నెవాగులో ఆ దారిలో చేపలు, జింకలు, బట్టెలు, కుక్కలు చనిపోయాయి. పారేనీరు, భూగర్భనీరు రంగుమారాయి. వాగులో స్నానంచేసిన ఒక బాలుడి శరీరం దద్దుర్లతో నిండిపోయింది. నిమ్స్ చేర్పించవలసివచ్చింది. ఇది ప్రతిమనిషిని కలవరపరిచింది. కంపెనీవారు కూడా భయపడిపోయి అప్పటినుండి ట్యాంకర్లతో కాలుష్య ద్రవం తరలిస్తూ ఊరి పొలిమేరలో, పొలాల్లో దుర్గంధం పోస్తున్నారు. రైతులు అలాంటి విషపదార్థం ఉన్న ట్యాంకర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారు అదేపనిగా ఏ కేసు నమోదు చేయకుండా వాటిని కంపెనీవారికే అప్పగించారు.

కంపెనీవారు కాలుష్యం పొలాల్లో, రోడ్లవెంట పోయాటం ఆపాలని చిత్తనూరు ఇథనాల్‍ వ్యతిరేక పోరాటకమిటీ ప్రతినిధి బ•ందం 21.10.23న నారాయణపేట జిల్లా కలెక్టర్‍ గారికి ఒకలేఖ అందజేశాము. ఆ రోజుసాయంత్రం కూడా యధావిధిగా కంపెనీ నుండి ఒక ట్యాంకర్‍ రావడంతో రైతులు ఆపేశారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా రోడ్డుమీద ట్యాంకరును ముందుకు పోనీయలేదు. ఆ రాత్రంతా రోడ్డుపక్కన వందలాదిమంది పడుకున్నారు. రైతులు ఈ కంపెనీ తమ భవిష్యత్తును, తమ బిడ్డల భవిష్యత్తును బలి తీసుకుంటుందని నమ్ముతున్నారు తమ కోసం తమ పొలాల బాగు కోసం కంపెనీ ఎత్తేయాలని అడుగుతున్నారు. అందుకే రాత్రి అక్కడపడుకున్నారు. అధికారులు వచ్చి వాహనాలు స్వాధీనం చేసుకోవాలని కోరారు. కిందిస్థాయి పోలీస్‍ అధికారులు ఏ కారణం చేతనో వాహనాలను కంపెనీ వారికే తిరిగి అప్పగిస్తున్నారు, కనుక కలక్టర్‍ రావాలని కోరారు.

22-10-2023న ఉదయం తాసీల్దారు గారు రాగా వారికి చాలా ప్రశాంతంగా పరిస్థితి వివరించారు. ట్యాంకర్లో అసలు ఏమి ఉందో చూడమని కోరారు. రైతులు, ఉద్యమ ప్రతినిధుల విజ్ఞప్తిని ఎమ్మార్వో గారితో పాటు మరికల్‍ ఎస్‍ఐ, సిఐ కూడా విన్నారు ఒక పరిష్కారం వచ్చే దశలో అక్కడకు చేరుకున్న నారాయణపేట డిఎస్పీ తనకు అధికారం లేకపోయినా సిఐ, ఎస్‍ఐ లను పిలిచి లాఠీచార్జికి ఆదేశించారు. ఈ ఊహించని ఘటనకు రైతులు షాక్‍ తిన్నారు. జరిగిన సంఘటన అనంతర పరిణామంతో ఇది ప్రణాళికబద్ధంగా మా మీద చేసినదాడి అని రైతులకు అర్థమైంది. కంపెనీకి మద్దతుగా ఉండే స్థానిక నాయకులు కొందరు రైతులను లొంగదీసుకోవడానికి తనచుట్టూ తిరిగితే కేసులు తీయించేస్తాం అంటున్నారు. వీళ్ళు, పోలీసులు కలిసి ఉద్యమ ప్రతినిధుల్ని తిట్టించి అవమానించే ప్రయత్నం చేశారు. ఇంకా చాలామంది జైలునుంచి రావాల్సి ఉంది. ఈ 15 రోజులు కాలంలో వ్యవసాయపనులు దెబ్బతిని పంటలు దెబ్బతిని రైతులు చాలా నష్టపోయారు.

పోలీసుల చేతిలో దెబ్బలకు, చిత్రహింసలకు, గాయాలకు గురైన రైతుల కుటుంబాలు ఉద్యమ ప్రతినిధుల కుటుంబాలు చాలా కష్టనష్టాలకు గురయ్యారు. ‘‘పోలీసులతో మాకు ఎన్నడూ వైరుధ్యం లేదు. మా గ్రామాలకు ఎప్పుడు వచ్చినా మా చేతి అన్నంతిని పోయిన పోలీసులు మమ్మల్ని పగబెట్టిన వారి లాగా ఎందుకు కొట్టినట్టు’’ అని రైతులు వాపోతున్నారు. నిజానికి ఈ రెండు సంవత్సరాలుగా మేము నడిపిన జనాందోళనలలో అన్ని సందర్భాల్లో పోలీసులు పాల్గొన్నారు. మాతో కలిసి భోజనాలు చేశారు. కంపెనీ పోవాల్సిందేనని చాలాగట్టిగా మాట్లాడారు. ముందస్తు ప్రణాళిక లేకపోతే ఆ ప్రణాళికలో అధికారులు, పోలీసులు భాగం కాకపోతే రైతుల్ని పోలీసులు ఇంతగా హింసించే అవకాశం లేదు. ఈ దాడికి వెనుక రాజకీయ విధానకర్తలు ఉన్నారని ప్రజలు నమ్ముతున్నారు.

చిత్తనూరు ఇథనాల్‍ వ్యతిరేక పోరాట కమిటీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది. 8 అక్టోబర్‍ 2023న ధర్నాలో పాల్గొన్న పెద్దలు అంతకు మునుపు నడిచిన ఉద్యమాల్లో పాల్గొన్న మేధావులు అందరూ ఇథనాల్‍ పరిశ్రమ ఏర్పాటును ఆ పాలసీని తీవ్రంగా వ్యతిరేకించారు.

రాజకీయనాయకులకు అందునా సేవపేరుతో ముందుకువచ్చే వారికి ప్రజలను బలితీసుకునే వ్యాపారాలు ఎందుకు అని ప్రశ్నించారు. 8 అక్టోబర్‍ మహా ధర్నా కంపెనీ యాజమాన్య బ•ందంలో ఒక ప్రధాన వ్యక్తి పిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి గానీ కాంగ్రెస్‍ పార్టీ టికెట్‍ ఇస్తే అతనిని ఓడిస్తామని ప్రకటించింది. తమకంపెనీ భవిష్యత్తు మాత్రమేకాక రాజకీయ భవిష్యత్తు కూడా అంటే అధికారం కూడా కూలిపోతుందనే అక్కసుతో కంపెనీ యాజమాన్యం ఈ దాడికి పాల్పడింది. ఈ మొత్తం ఘటనపై మేము హైకోర్టు జడ్జితో విచారణ కోరాం. దోషులను చట్టప్రకారం శిక్షించాలని కోరుతున్నాం.

22 అక్టోబరు 2023 నుండి పౌరహక్కుల సంఘం, మానవహక్కుల వేదిక, స్వతంత్ర అధ్యయన పరిశోధన బ•ందం నిజానిజాలు పరిశీలించి దమనకాండను ఖండించారు. అనేక వామపక్షపార్టీలు, వివిధపార్టీల స్థానిక ప్రతినిధులు గ్రామాలకు వెళ్లి పరిశీలించి అధికారులకు ప్రాతినిధ్యాలు చేశారు. అయినా పోలీసువైఖరిలో మార్పురాలేదు. వారి బెదిరింపు ధోరణి మారలేదు. పోలీస్టేషన్లకు పిలిచి మందలించటం, రౌడీషీట్లు తెరుస్తామని బెదిరించడం ఆపలేదు. ఎన్నికల కోడ్‍ సమయాన్ని ప్రజల హక్కులను హరించే సమయంగా చేసుకున్నారు. అవాంఛనీయమైన 22 అక్టోబర్‍ ఘటనను మేము కేవలం దుర్ఘటనగా మాత్రమే చూడటం లేదు. వెనకకు నెట్టిన ప్రజల నాగరికత మీద, వికాసం మీద దాడిగా చూస్తున్నాం. ఎందుకంటే దాదాపు రైతులందరూ అంతో కొంతో చదువుకున్న వారు. స్వీయగౌరవాన్ని డిమాండ్‍ చేస్తున్న వారు. అలా జీవిస్తున్న వారు. వ్యవసాయంలో, స్వతంత్ర జీవనంలో తమగౌరవాన్ని కాపాడుకుంటున్న వారు. పోలీసులు, అధికారులు, ప్రభుత్వం రైతులని హింనకు కేసులకు మాత్రమేకాదు, తీవ్రమైన అవమానానికి గురిచేశారు. ఈ దుర్మార్గాన్ని మేము ఖండిస్తున్నాం. ఈ సమావేశం కూడా ఖండించాలని కోరుతున్నాం.

చిత్తనూరు, ఎక్లాస్పూర్‍, జిన్నారం తదితర గ్రామాలమీద పోలీసులు కొనసాగించిన వేట ఈనాటికీ ఆ గ్రామాల ప్రజలకు కంటికి కునుకు లేకుండా చేసింది. ఈ గ్రామాలను ప్రజాస్వామిక వాదులందరూ సందర్శించాలని, ఒక విశ్వాసం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

జిల్లాల విభజన పేరున తెలంగాణ అద్దాన్ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టినప్పుడు మహబూబ్నగర్‍ జిల్లా ఏడుముక్కలైంది. నాగర్‍ కర్నూల్‍ పార్లమెంట్‍ నియోజకవర్గాన్ని మూడుజిల్లాలు చేసి, పాత ఆమనగల్‍ ప్రాంతాన్ని రంగారెడ్డి జిల్లాలో కలిపారు. మహబూబ్‍ నగర్‍ పార్లమెంట్‍ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తూ, షాద్నగర్‍ నియోజకవర్గాన్ని రంగారెడ్డి జిల్లాలోకి, కొడంగల్‍ నియోజకవర్గంలో సగభాగం వికారాబాద్‍ లోకిమార్చారు. మరికొంత కాలానికి మహబూబ్‍ నగర్‍ జిల్లా నుంచి నారాయణపేట జిల్లా ఏర్పరిచారు. ఇవాళ పాతమహబూబ్‍ నగర్‍ జిల్లా ఏడు జిల్లాలుగా ముక్కలై ఉంది. ఈ జిల్లాలను తెలంగాణ ప్రభుత్వం ప్రయోగశాలగా మార్చుకోంది. షాద్‍ నగర్‍ ప్రాంతం రియల్‍ఎస్టేటుకు, ఆమనగల్‍ ఎగువ ప్రాంతం ఫార్మాకు, నాగర్‍ కర్నూల్‍ జిల్లా యురేనియంకు, గద్వాల జిల్లా సీడ్‍ పత్తికి, నారాయణపేట, వనపర్తి, మహబూబ్నగర్‍ జిల్లాలు పామాయిల్‍ పొలాలకు, కాలుష్య కంపెనీలకు ప్రత్యేకించి క•ష్ణాతీర నియోజకవర్గాలు ఇధనాల్‍, లిక్కర్‍ ఉత్పత్తికి నిలయాలుగా మారిపోతున్నాయి. తెలంగాణ ఏర్పడక ముందుకన్నా ఈ పదేళ్లలో విధ్వంసం తీవ్రమైంది. ఈ విధ్వంసంమే అభివ•ద్ధిగా తెగప్రచారం అవుతుంది. ఈ ప్రచార హెరీరులో మేము వినిపించే నిజాలు దెబ్బతింటున్నాయి.

ఇథనాల్‍ పరిశ్రమ వ్యతిరేక ఉద్యమం మీద జరిగిన దాడిని మహబూబ్‍ నగర్‍ రైతాంగ చైతన్య మీద జరిగిన దాడిగా, భవిష్యత్తు మీదదాడిగా, ఒక తీవ్ర ప్రమాదంగా మేము భావిస్తున్నాము. తమ జీవన భవిష్యత్తు కోసం నిస్వార్ధంగా రెండు సంవత్సరాలుగా శాంతియుతంగా ఆందోళనచేస్తూ తమ ఆకాంక్షకు, ఆకలి సమస్య పరిష్కారానికి విస్త•త ప్రజామోదం కూడగడుతున్న ప్రజలపై ముఖ్యంగా అన్నం పెడుతున్న రైతులపై జరిగిన దాడిని తెలంగాణ సమాజం తీవ్రమైన విషయంగా పరిగణించాలని, అక్రమకేసులు ఎత్తివేసి అందరినీ విడుదలచేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఎంత ఉద్యమమైనా నిర్మించి కంపెనీని ఎత్తివేయిద్దామని మీ అందరికీ మనవి చేస్తున్నాము.

ఈ దాడి రైతాంగం చైతన్యంపై, నాగరికతపై జరిగిన దాడి..  అక్రమకేసులు ఎత్తివేయాలి, జైల్లో ఉన్న వారిని విడుదలచేయాలి.. ఇథనాల్‍ కంపెనీని వెంటనే ఎత్తివేయాలని పోరాడదాం .

Leave a Reply