సైనిక క్యాంపులు ఎత్తేయాలని దండకారణ్యంలో ఆదివాసులు చేస్తున్న పోరాటానికి ఎనిమిది నెలలు నిండాయి. ఇప్పటికీ వాళ్ల సమస్య పరిష్కారం కాలేదు. మామూలుగా ఇలాంటి పోరాటాలు నడుస్తున్నప్పుడు లోకం కోసమైనా ప్రభుత్వం ఉద్యమకారులతో సంపద్రింపులు జరుపుతుంది. కానీ ఈ పోరాటం విషయంలో అలాంటివేమీ లేదు.
2021 మే 17వ తేదీ చత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లాలో మొదలైన ఈ పోరాటం మొదటి రెండు మూడు రోజుల్లోనే నెత్తుటి మడుగులో తడిసింది. ఐదుగురు ఆదివాసులను భారత ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నది. అయినా ఆదివాసులు వెనకడుగు వేయలేదు. క్రమంగా ఈ ఉద్యమం జార్ఖండ్ ప్రాంతానికి కూడా విస్తరించింది.
ఈ ఎనిమిది నెలలుగా ఆదివాసులు అనేక పోరాట రూపాలను చేపట్టారు. ప్రభుత్వ అణచివేతను ధిక్కరిస్తూ ఎక్కడికక్కడ వేలాది మంది ఆందోళనల్లో పాల్గొన్నారు. రోడ్ల మీదనే మకాం వేసి ఉద్యమం బలహీనపడకుండా ఎప్పటికప్పుడు కొత్త ఆందోళనలు చేపడుతున్నారు. తమ డిమాండ్ వెనుక ఉన్న న్యాయబద్ధతను వివరిస్తున్నారు. దీనిపై అక్కడి నుంచి ‘మూలవాసీ రచయితల వేదిక’ ఎన్నో ప్రకటనలు చేసింది. విశ్లేషణలు అందించింది. ఎప్పటికప్పుడు సమాచారం బైటికి చేరవేస్తూ ఉన్నది. బస్తర్ టాకీస్ అనే మీడియా సంస్థ కూడా ఇందులో తనవంతు పాత్ర పోషించింది. అందువల్ల పలు భాషల్లో జాతీయ స్థాయి గుర్తింపును ఈ పోరాటం పొందింది.
తెలుగులో కూడా విప్లవోద్యమ సమర్థకులు, అభిమానులు మొదటి నుంచీ ఈ పోరాటానికి గట్టి మద్దతు ఇస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ఆపరేషన్ ప్రహార్`3ని వ్యతిరేకిస్తూ భారత విప్లవోద్యమానికి మద్దతుగా అంతర్జాతీయ సంఫీుభావ దినం సందర్భంగా ప్రపంచమంతా ఈ పోరాటం ప్రాచుర్యం పొందింది.
ఇంత జరిగినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ పోరాటంపై నిర్బంధం ప్రయోగించడం తప్ప సమస్యను పరిష్కరించడానికి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజానికి చట్ట పరిధిలో ఆలోచిస్తే ఆదివాసుల డిమాండ్ చాలా చిన్నది. కానీ చట్టానికి బైట దీనికి చాలా విస్తృతి ఉన్నది. అనేక రాజకీయ ఆర్థిక పోరాట వ్యూహాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా అభివృద్థి అంటే ఏమిటి? స్వావలంబన అంటే ఏమిటి? అనే విషయాల్లో పూర్తి భిన్న పంథాల సంఘర్షణ ఇందులో ఉన్నది.
అందుకే మిగతా పోరాటాల్లాగా అందరూ దీనికి మద్దతు ఇవ్వడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్నిటికీ మద్దతు ఇచ్చే(తప్పక ఇవ్వాల్సిందే) వాళ్లలో కొందరు ఈ విషయంలో మాత్రం ముందుకు రాలేదు. ఈ పోరాటానికి మద్దతు ఇస్తే అది అక్కడే ఆగదని వాళ్లకు తెలుసు. ఈ మాట అంటే .. ఈ పోరాటం ఆదివాసులకు జీవన్మరణ సమస్యే కావచ్చుగాని సమాజంలో దానికి అంత ప్రాధాన్యత లేదని కూడా సిద్ధాంతీకరించవచ్చు.
కానీ భారత పాలకులు మధ్య భారత దేశంలో సాగిస్తున్న యుద్ధంలో దానికి వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్నది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిరావడం లేదు. సైనిక క్యాంపులను ఎత్తివేయాలనే ఆదివాసీ డిమాండ్‌కు తలొగ్గడమంటే విప్లవోద్యమ నిర్మూలనకు తాను చేపట్టిన సంపూర్ణ యుద్ధంలో వెనకడుగు వేయడమే. దేశవ్యాప్తంగా విప్లవోద్యమ స్థావరాలను దెబ్బతీయాలంటే తన సైనిక స్థావరాలను నెలకొల్పుకోవడం భారత రాజ్యానికి అవసరం. కాబట్టి ఎలాంటి చర్చలకు, సంప్రదింపులకు పాలకులు సిద్ధం కావడం లేదు.
గత ముప్పై ఏళ్ల మధ్య భారత దేశ ఆదివాసీ పోరాటాల్లో సైనిక క్యాంపులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఉద్యమం చాలా ప్రత్యేకమైనది. అనేక పోరాటాల ఫలితంగా రాజ్యాంగంలో ఆదివాసుల రక్షణగా పొందుపర్చబడిన పెసా చట్టం స్ఫూర్తిని కాపాడాలని ఆదివాసులు కోరుతున్నారు. తమ ప్రాంతాల్లో సైనిక క్యాంపులు పెట్టడం అంటే ఆదివాసీ జీవితాన్ని కాలరాయడమే అంటున్నారు. ఈ డిమాండ్ అనేక ప్రాంతాలకు విస్తరించిందంటే దాని వెనుక ఉన్న న్యాయబద్ధతను అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు అణచివేత, దాడులు, హత్యాకాండ కొనసాగిస్తున్నా ఆదివాసులు అత్యంత ప్రజాస్వామికంగా తమ ఆందోళనలను నిర్వహిస్తున్నారు. రాజ్యాంగయంత్రంపై నిరంకుశ పెత్తనం సంపాదించుకున్న పాలకులు భారత ప్రజలు నిర్మించుకున్న రాజ్యాంగం ప్రకారమే వాళ్లపై యుద్ధం ప్రకటించాక ఇక అందులోని ఏ చట్టానికీ దిక్కులేదని తేలిపోయింది. అయినా ఆదివాసులు నిరాశ చెందడం లేదు. దేనికంటే వాళ్లకు తమ పోరాటం ఎంత విస్తృతమైనదో తెలుసు.
కొందరు పండితులు, పత్రికలు, మీడియా దీన్ని కేవలం సైనిక కోణంలోనే చూడవచ్చు. సైనిక సంఘర్షణగానే కుదించవచ్చు. కానీ పాలకులు చాలా స్పష్టంగా రాజకీయార్థిక సాంస్కృతిక యుద్ధ వ్యూహంగా దీన్ని నడుపుతున్నారు. ఆ రకంగా మేధావులకన్నా, పత్రికలకన్నా భారత పాలకులు తమ వైపు నుంచి విప్లవోద్యమాన్ని దెబ్బతీయడానికి సక్రమంగా అర్థం చేసుకున్నట్లే. ఇంకో పోలికతో చెప్పాలంటే… మూడు వ్యవసాయ చట్టాల వ్యతిరేక పోరాటానికి భారత ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యత ఉన్నట్లే విప్లవోద్యమ ప్రాంతాల్లో సైనిక క్యాంపులు ఎత్తివేయాలనే ఆదివాసీ పోరాటానికి కూడా అలాంటి ప్రాధాన్యత ఉన్నది. మౌలిక రంగమైన వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించే దోపిడీ వ్యూహం ఆ చట్టాల వెనుక ఉన్నది. సరిగ్గా అంతక ముందు రెండున్నర దశాబ్దాల నుంచే సువిశాల భారత భూభాగంలోని సహజ వనరులన్నిటినీ కార్పొరేట్లకు అప్పగించే వ్యూహం భారత పాలకులకు ఉన్నది. కార్పొరేట్ దోపిడీని అన్ని స్థాయిల్లో, అన్ని రూపాల్లో గుర్తించాలి. ఇందులో ఒకటి ప్రధానం, మరొకటి అప్రధానం అనుకోడానికి లేదు. ఆదివాసీ ప్రాంతాల సహజ వనరుల దోపిడీ ఆదివాసుల కష్ట నష్టాలకు సంబంధించిందే కాదు. వాళ్ల అస్తిత్వ సమస్య మాత్రమే కాదు. భారత ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్లకు అప్పగించే ప్రక్రియలో సహజ వనరుల దోపిడీ అతి ముఖ్యమైనది. దాన్ని మరింత ముందుకు తీసికెళ్లడానికి పాలకులు తాజాగా ఆపరేషన్ ప్రహార్ -3 చేపట్టారు. దీని ప్రకారం మరిన్ని లక్షల సైనికులను ఉద్యమ ప్రాంతంలో దించాలనకుంటున్నారు. దీనికి అవసరమైన బేస్ ఏరియాలను నిర్మించే ముమ్మర పనిలో ఉన్నారు.
దీనికి వ్యతిరేకంగా ఆదివాసులు ఒక ప్రజాస్వామిక పోరాటం కొనసాగిస్తున్నారు. ఆదివాసులు కనీసం రెండున్నర దశాబ్దాలుగా ఒక పక్క యుద్ధాన్ని, మరో పక్క ప్రత్యామ్నాయ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వాళ్లే సైనిక క్యాంపులకు వ్యతిరేకంగా చట్టబద్ధ పోరాటాలనూ అందుకున్నారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని మనం రైతుల పోరాటమనే అనుకోలేదు. మరీ ముఖ్యంగా ‘ఢల్లీ రైతుల’ పోరాటంగా ప్రచారమైనా అది దేశ వ్యాప్త రైతాంగ పోరాటం అనుకున్నాం. మనందరి పోరాటమని అందులో భాగమయ్యాం. అట్లా మధ్య భారత దేశంలో సైనిక క్యాంపులు ఎత్తివేయాలని ఆదివాసులు చేస్తున్న పోరాటాన్ని సొంతం చేసుకోలేమా?
✊✊
మా సత్యం
దండకారణ్యం లో జరుగుతున్న పోరాటం ఉద్యమాలను పాణిగారు తనదైన శైలిలో తార్కిక తాత్విక కోణంలో విశ్లేషిస్తూ దేశీ దేశ దేశాల ప్రజలకి ఇక్కడ జరుగుతున్న పోరాటాలను,
ఆ పోరాటాన్ని అణచి వేయడానికి భారత ప్రభుత్వం బహుముఖ రూపాలలో దాడులు చేస్తూ సరికొత్త యుద్ధ తంత్రంతో ఆపరేషన్ ప్రహార్ 3ని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్న ఆదివాసుల గురించి విశ్లేషణాత్మకంగా తెలియజేశారు.
Long live Indian Revolution