( నవంబర్ 24 న కృష్ణా జిల్లా కోడూరు మండలం నారేవారి పాలెంలో జరిగిన కామ్రేడ్ గౌతమ్ సంస్మరణ సభలో ఆవిష్కరించిన *సమాజ శిల్పి* పుస్తకానికి రాసిన ముందు మాట)
కామ్రేడ్ గౌతమ్ ను 2006 నవంబర్ 23న పోలీసులు దొంగ ఎదురు కాల్పుల్లో హత్యచేశారు. 24న తెల్లారికల్లా పత్రికల్లో ఈ విషాద వార్త వచ్చింది. మేము కొద్దిమందిమి రాత్రికి బయల్దేరాలి అనుకున్నాము. అప్పటికే గౌతం కుటుంబ సభ్యులు విజయవాడలో పౌరహక్కుల సంఘం నాయకులను కలిశారు. మృత దేహాన్ని స్వాధీనం చేసుకోడానికి గౌతమ్ కుటుంబ సభ్యులతోపాటు మీరెవరైనా వెళతారా? అని లాయర్ ఆంజనేయులుగారు అడిగారు. మేము రావడానికి లేటు అయితే లోకల్ మిత్రులతో కుటుంబాన్ని పంపించండి అన్నాము.
ప్రయాణం ఏర్పాట్లు జరిగిపోయాయి. హైదరాబాద్ నుండి నర్సన్నతో పాటు మరొకరు వెళ్లాలని, గుంటూరు, విజయవాడలో అక్కడి మా సంఘ సభ్యులు కల్సి ఒక టీమ్ ఏర్పడి అంత్యక్రియల్లో పాల్గొని రావాలని అనుకున్నాము. ఈ సమాచారాన్ని మిగతా సభ్యులకు తెలిపి బయలుదేరనికి సిద్ధంగా ఉండమని చెప్పాము.
ఈలోగా కరీంనగర్ నుంచి గౌతమ్ సహచరి అయిన జయ తల్లి, చెల్లెలు ఫోన్ చేశారు. ‘‘విజయవాడ దగ్గర గౌతమ్ ను పోలీసులు అరెస్టు చేసి హింసించి చంపారు. జయను అరెస్టు చేసి పోలీసుల అదుపులో ఉంచుకున్నారు…జైలుకు పంపుతరట’’ అని చెప్పారు. అనారోగ్యంతో తను రాలేనని.. తన కూతుర్లు చివరి చూపుకోసం వస్తారని, వాళ్ళు భయపడుతున్నరు కనుక..హైదరబాదు వచ్చి మీతో రావచ్చ అని జయతల్లి అడిగింది. వెంటనే పంపండి అమ్మా టైం లేదు అన్నాము. మూడు గంటలకల్లా జయ చెల్లెండ్లు ఇద్దరు వచ్చారు. రాత్రి నర్సన్న నాయకత్వాన చిన్నపద్మ, జయ చెల్లెండ్లు విజయవాడ వెళ్లారు. అక్కడ అంజమ్మ, పుష్ప అలాగే అమరుల కుటుంబాలు, వందలాది విప్లవాభిమానులు ఊరేగింపులో పాల్గొన్నారు.
గౌతమ్ అంత్యక్రియలు అయ్యాక నర్సన్నవాళ్ళు హైద్రాబాద్ వెళ్లిపోయారు. అప్పటికి పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. అందుకని అంజమ్మతో పాటు జయ కుటుంబం మొదట శ్రీకాకుళంలో లాయర్ ఈశ్వరరావు గారిని కల్సి ఆ రాత్రి అక్కడే ఉండి ఉదయాన్నే అసిస్టెంట్ లాయర్ని తోడు తీసుకొని వెళ్లారు. జైలు దగ్గరికి వెళ్లి కలసినప్పుడు ఎన్కౌంటర్ ఎట్లా జరిగింది తెలిసింది. గౌతమ్, జయ ఇద్దరూ పని మీద అడవి నుండి బయటకు వచ్చారు. మిత్రులను కలవడానికి వెళ్లిన గౌతమ్ తిరిగి సకాలంలో రాలేదు. అనుమానం రావడంతో జయ వేరే దగ్గరకు వెళ్లి విచారించడం మొదలు పెట్టిందట. అయితే పోలీసు నిఘాలోనే ఇద్దరం ఉన్నమేమో ఆ తర్వాత పోలీసులు అదుపులోకి నన్నుకూడా తీసుకున్నారు. గౌతమ్‌ను చంపేశామని పోలీసులు చెప్పారని జయ కండ్లనీళ్లు పెట్టుకుంది. వేలాది బూటకపు ఎన్కౌంటర్లలాగే గౌతమ్ ఘటన చుట్టూ కాకమ్మ కథ పోలీసులు అల్లారు. జయను అరెస్టు చేసి, ప్రాణంతో ఉంచడం వల్ల అసలు ఏం జరిగింది తెలిసింది.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కృష్ణా జిల్లా పాత్ర అందరికీ తెలిసిందే. వీరోచిత పోరాటంలో అద్బుతమైన నాయకత్వాన్ని, మడమతిప్పని విప్లవ కార్యకర్తల్ని ఇచ్చినగడ్డ అది. ఎంతమంది నిరసన తెలిపినా సాయుధ పోరాటాన్ని నాయకత్వం ఆపేసింది. సాయుధ పోరాటాని కి మద్దతు తెలిపే అనేకమంది అక్కడ వున్నారు. తిరిగి శ్రీకాకుళ పోరాటం మొదలైంది. ఈ ఉద్యమానికి కృష్ణా జిల్లాతోపాటు కోస్తా ప్రాంతమంతా కదిలింది. ముఖ్యంగా రాడికల్ విద్యార్థి యువజన ఉద్యమ ప్రభావం కోస్తాలో కూడా బాగా ఉంది. కా. గౌతమ్ కుటుంబం విప్లవం పట్ల ప్రేమ, గౌరవం కలిగినది. జయ జైలు నుండి బయటకు వచ్చాక, గౌతమ్ వాళ్ళ ఇంటికే వెళ్ళింది. గౌతమ్ అన్నయ్య, వదినె గారు జయను ఆదరించి.. ఆమె కోరుకున్నట్టుగానే ఆ ఇంటికోడలిగా అన్ని హక్కులూ ఇచ్చారు. సహనంగా వుండేవారు. స్థూప నిర్మాణ పనుల్లో భాగంగా అక్కడి మిత్రులను కలిసినప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ సహాయ సహకారాలు అందించారు. కా. చలసాని, కా.చల్లపల్లి శ్రీనివాసరావు అలాగే అక్కడి స్థానిక కమ్యూనిస్టు పార్టీల నాయకులు అంతా కుటుంబంతో కల్సి నిలబడ్డారు. స్థూపావిష్కరణ సభ విజయవంతంగా జరిపారు.
గౌతమ్ అక్కయ్య హైదరాబాదులో వుండేవారు. అక్కదగ్గరే చదువుకుంటూ అక్కడి విద్యార్థి ఉద్యమంలో భాగమయ్యాడు. ఆయన ఇరవైఏళ్ల వయసులో 1980ల్లో విప్లవోద్యమ పరిచయాల్లోకి వచ్చాడు. ఆర్.ఎస్.యు లో, ఆర్.వై.ఎల్ లో పనిచేసి ఆ తర్వాత అజ్ఞాత ఉద్యమంలోకి పూర్తికాలం వెళ్లాడు. ఇరవై ఐదేళ్లపాటు ఉద్యమానికి సేవలు అందించాడు. ఆయన అమరత్వం తర్వాత వచ్చిన పుస్తకంలో విప్లవోద్యమం చెబుతున్న వివరాల ప్రకారం ఆయన కొద్ది కాలం రాజకీయ రంగంలో పని చేశాడు. ఆ తర్వాత ప్రధానంగా టెక్ ఫీల్డ్‌లో పని చేశాడని తెలుస్తోంది. 2000-2006 నాటికి విప్లవోద్యమం తీవ్ర నిర్బంధానికి గురైంది. ప్రభుత్వంతో విప్లవ పార్టీల చర్చలు జరిగిన ఆరు నెలల కాలం తప్పితే నిర్బంధం పెరుగుతూ వచ్చింది. అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన అణచివేతను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ముందుకు తీసుకుపోయింది. చర్చలు ఆగిపోయాక మొదలైన అణచివేతలో అనేక ఎన్కౌంటర్లతో పాటు గౌతమ్ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాలమంతా నిర్బంధం పెరిగినట్లే ప్రజా పోరాటాలు కూడా పెరిగాయి. ప్రజలు అన్ని రకాలుగా ప్రతిఘటించి ఉద్యమాన్ని కాపాడుకొనే ప్రయత్నం చేశారు. ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. సాయుధంగా కూడా విప్లవోద్యమం ముందడుగు వేసింది. లేకపోతే ఉద్యమం నిలదొక్కుకొని ఉండేది కాదు. ఒకవైపు పార్టీ పైన, రెండో వైపు విప్లవ ప్రజానీకం పైన తీవ్రమైన హింస కొనసాగింది. దీనిని విప్లవ శ్రేణులు ప్రతిఘటించి, ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్నాయి. దీని వెనుక టెక్ వర్క్ లో గౌతమ్ లాంటి వాళ్లు చేసిన కృషి ఉంది అని విప్లవోద్యమమే సగౌరవంగా ప్రకటించు కుంటుంది.
ఆయన అమరుడై పదిహేనేళ్లు దాటిపోయింది. విప్లవోద్యమంలోకి ఇంకో తరం కూడా ప్రవేశించి పోరాడుతుంది. రాజకీయ ఉద్యమ పరిస్థితులు మారిపోయాయి. నిర్బంధం తీవ్రమైంది. ఒకప్పుడు పోరాడే ప్రజల మీదే నిర్బంధం ఉండేది. ఇప్పుడు సమాజమంతా నిర్బంధాన్ని అనుభవిస్తోంది. ప్రజల గురించి ఆలోచించేవాళ్లందరినీ కేసులు, విచారణలు, జైలు శిక్షల పేరుతో ప్రభుత్వం భయపెడుతున్నది. జైలులో పడితే ఎప్పటికి బైటికి వచ్చేదీ తెలియని యావజ్జీవ శిక్షలు కూడా అమలవుతున్నాయి. సమాజం ఇంతగా భయపడుతున్నప్పుడు మనం గౌతమ్ జ్ఞాపకాలతో ఈ పుస్తకం తీసుకొని వస్తున్నాం. గౌతమ్ ను తలచుకోవడం అంటే ధైర్యాన్ని కూడగట్టుకోవడం కావాలి. ప్రజా పోరాటాల నుంచి వెనుతిరగని చైతన్యం పొందాలి. ఆయన అన్నేళ్లపాటు ఎన్ని ఇబ్బందులు వచ్చినా విప్లవోద్యమంలో ముందుకే వెళ్లాడు. ఉద్యమంలో, బైట చాలా సంక్షోభాలు తలెత్తాయి. అవన్నీ పరిష్కారం కావాలంటే విప్లవోద్యమం ముందుకు వెళ్లాల్సిందే. గౌతమ్ ఈ ఎరుక కలిగిన ఆదర్శప్రాయమైన కామ్రేడ్. అన్నిటిని తన చైతన్యంలో భాగం చేసుకొని ఉంటాడు. వర్గపోరులోనే అన్నిటికి పరిష్కారాన్ని వెతుకున్నాడు. అందుకే దాన్ని వదిలిపెట్టలేదు. చివరికి శత్రువు చేతిలో చిక్కి అమరుడయ్యాడు.
విప్లవోద్యమంలో పని చేయడానికి వెళ్లే ముందు ఆయన ప్రాణత్యాగానికి సిద్ధమైయ్యే వెళ్ళాడు. విప్లవకారులందరూ అంతే. అన్ని వదులుకొని వచ్చినవాళ్ళు కదా.. ప్రజల కోసం ఇవ్వడానికి వాళ్ల దగ్గర ప్రాణం తప్ప మరేమీ ఉండదు. దాన్ని అర్పించడానికి సిద్ధమైనందు వల్లే చివరి క్షణం దాకా గౌతమ్ ఉద్యమంలో కొనసాగాడు. విప్లవోద్యమంలో ఎక్కడ ఏ పని పడితే ఆ పని చేయడానికి సిద్ధమై వెళ్లిపోయాడు. నవయవ్వనంలో విప్లవ జీవితాన్ని ప్రారంభించి మధ్య వయసు దాకా తన శక్తినంతా ప్రజా పోరాటానికి ధారపోశాడు.
మన కళ్ల ఎదుటే గౌతమ్ లాంటి వేలాది మంది విప్లవకారులు తమ విలువైన జీవితాన్ని, ప్రాణాన్ని సమాజం కోసం అర్పిస్తున్నారు. స్వార్థం, వంచన, దోపిడీ తప్ప ఈ సమాజంలో ఇంకేమీ లేవని కొందరు అనుకుంటారు. అట్లాంటి చెడు ధోరణులు ఉన్న ఈ సమాజంలోనే త్యాగం అవసరమని, కుటుంబాన్ని వదిలి, పీడిత ప్రజల్ని ప్రేమించాడు. ప్రాణాలు ఇచ్చాడేతప్ప మరేమీ బదులుగా అడగలేదు. స్వార్థం లేని జీవితాన్ని జీవించాడు. ఈ సమాజాన్ని బాగు చేయడానికి తన తెలివిని, ఆలోచనలను, శక్తి సామర్థ్యాలను పూర్తిగా అర్పించాడు. తన తెలివి, నైపుణ్యం ఏవీ తనవి కాదని, అవి కూడా సమాజానివే అనే నమ్రత ఉన్నందు వల్లనే గౌతమ్ నవీన మానవుడిగా జీవించగలిగాడు. శత్రువుకు లొంగిపోకుండా నిలబడి ప్రాణత్యాగం చేశాడు. ఆయన మరణంలాగే ఆయన జ్ఞాత, అజ్ఞాతంలో గడిపిన కఠోర జీవితం కూడా మహోన్నత మైనది. విప్లవోద్యమమే లక్ష్యంగా, నిరంతర శ్వాసగా గడిపిన జీవితం కూడా చాలా ఉన్నతమైనది. తడబాటు లేకుండా ప్రజలతో నడిచినందు వల్లనే ఇవాళ మనం ఆయన్ను స్మరించుకుంటూ మాట్లాడుకుంటున్నాం. వ్యక్తులు చరిత్రలో భాగం కావడం అంటే ఇదే. విప్లవోద్యమ చరిత్రలో గౌతమ్ జీవితం, త్యాగం శాశ్వతంగా నిలిచి
ఉంటాయి. మనము ఈ త్యాగాల పరంపరను మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాలి. అప్పుడే విప్లవోద్యమం కోసం జీవించి, మరణించిన అమరుడు గౌతమ్ జ్ఞాపకాలను పదిలపరుచుకున్నట్లవుతుంది. ఈ పుస్తకం ఆయన జ్ఞాపకాల రచనలుగానే మిగిలిపోదు. మనలో ఏ మూలో మిగిలిపోయిన తడిని తడిమి మనలోని మనిషిని మేల్కొల్పి పనిలోకి నడిపిస్తుంది. మన ఆలోచన, ఆచరణలోనే అమరుల ఆశయాలు కొనసాగుతాయి. మన తలపుల్లో అమరుడు గౌతమ్ సదా స్మరణీయుడుగా ఉంటాడు.
నవంబర్ 18, 2023
జోహార్లు కామ్రేడ్ గౌతం