“ఈ వేళప్పుడు” గురించి ఏడాదిగా ఆలోచిస్తున్నాను. ‘ఇది చదివి తోచింది రాయిమని అరసవిల్లి కృష్ణ ఇచ్చారు. సుమారు దశాబ్ద కాలపు కవిత్వం. చదువుతోంటే ప్రతిసారీ ‘ఈ వేళనే కవిత్వం చేస్తున్నారా? అనిపించేది. ఇందులో వర్తమానం గురించే లేదు. వర్తమానం రూపొందుతున్న తీరు మన పఠన అనుభవంలోకి వస్తుంది. ఇదీ ఈ కవిత్వంలోని ప్రత్యేకత.

..  ఇలాంటివేవో రాద్దామని నవంబర్‌ 18 ఉదయం ఐదున్నరకే నిద్రలేచి మొదలు పెట్టాను. కాసేటికల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు మొదలయ్యాయని ఫోన్లు. అ సంగతి అరసవిల్లి కృష్ణకు చెప్పాలను కాల్‌ చేస్తే కలవలేదు. మళ్లీ ప్రయత్నించాను. కలవలేదు.  *ఈ వేళప్పుడు” ఆయన కూడా ఛత్తీస్‌ఘడ్‌ నుంచి వచ్చిన పోలీసు సోదాల్లో చిక్కుకపోయారని తెలియదు. ఈ ఒత్తిడి మధ్యనే ఈ వేళప్పటి గురించి రాస్తూపోయాను.

అంతక ముందు నవంబర్‌ 3న ఆయన్ను ఎన్‌ఐఏ అధికారులు విచారణకు పిలిచారు. ఆ సంగతి తెలిసి ఒకందుకు కంగారుపడ్డాను. అరసవిల్లి కవిత్వ భాషణం వాళ్లకు అర్ధమవుతుందా? అని. కానీ వాళ్లు వేరే ఇంకో విషయం అర్ధం కాక కంగారుపడ్డారట. తొమ్మిదో తరగతి మాత్రమే ‘చదివి’ టైలర్‌ పని చేసుకొనే కార్మికుడు విప్లవ రచయితల సంఘానికి ఎలా అధ్యక్షుడయ్యాడని. ఆ రకంగా వాళ్లకు ఆయన “ప్రమాదకరమైన కవి’గా తోచాడు.

నిజమే. చరిత్ర పొడవునా కవి ప్రమాదకరమని రాజ్యం అనుకుంటూనే వచ్చింది. కవి ఊహాశక్తి వల్ల వాస్తవికత అనేకరెట్లు శక్తివంతంగా కవిత్వంలోకి వస్తుంది. అది పైకి లలితంగానే ఉండవచ్చు. కానీ మృదువైన కత్తిగా మారుతుంది. ఆలోచనలకు ఉండే బలాన్ని రాజ్యం ఇప్పటిలా ఎన్నడూ గుర్తించి ఉండవు. అలోచనలకు, భావనలకు, వాటికి అ ర్థాలనిచ్చే అక్షరాలకు తాళాలు వేయాలనే ప్రయత్నం గతం కంటే తీవ్రమైన కాలం ఇది. ఇది మనం అనుభవిస్తున్న సంక్షోభపు లోతుకు నిదర్శనం. దీని అనుపానులు తెలిసి, అచ్చంగా వ్యవస్థను, రాజ్యాన్ని పాలకవర్గాన్ని వాటి నీతి నియమాలను, అవి నిరంతరం పునర్జన్మించే తీరును ఎదుర్కోవాలని సాహస కవి ప్రయత్నిస్తే ఇలాగే ఉంటుంది.

సరిగ్గా ఈ వేళప్పుడు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు సంకెళ్ల సవ్వడి మాత్రమే వినిపించడం లేదు. కవిత్వం మాత్రమే పసిగట్టల హింసా విధ్వంస రూపాలు సాగుతున్నాయి. కవిత్వం మాత్రమే చూపగల సత్యాలున్నాయి. కవిత్వం మాత్రమే అర్థాలు చెప్పగల ధిక్మారాలు ఉన్నాయి. కవిత్వమే చిత్రికపట్టే మానవ అంతరంగ కథనాలు, మానవ ఆచరణలోంచి పెల్లుబికే అద్భుత మానవ నిర్మాణ క్రమాలు కూడా ఉన్నాయి.

ఈవేళప్పుడు వీటన్నిటినీ మన కవిత్వానుభవంగా మార్చగల సంపుటి.

0 0 0

అరసవిల్లి కృష్ణ ఆర్దృమైన కవి. కవిత్వం పుట్టుగడి తెలిసిన కవి. ఆయన ఈ ప్రపంచాన్ని కవిత్వంలోంచే చూస్తారు. కవిత్వంతోనే అర్థం చేసుకుంటారు. కవిత్వాన్ని వెంటేసుకొని ఈ సంక్షుభిత సమాజమంతటా తిరుగుతుంటారు. కవిత్వపు కంఠస్వరంతోనే మాట్లాడుతుంటారు. స్వప్నాలను, విలువలను, ఆశయాలను, విప్లవాలను ఆయన కవిత్వీకరించి సొంతం చేసుకుంటారు. సకల దుర్మార్గాలను, ప్రజా వ్యతిరేకతలను, దాస్టీకాలను, రాజ్యపు దౌర్జన్యాలను, సాంస్కృతిక హింసలను కవిత్వంలోంచి నిలేస్తుంటారు. కవిత్వపు అండతోనే నిత్యం వేదికలు ఎక్కీ దిగుతుంటారు. దేనికైనా ఆయనకు కవిత్వమే మాధ్యమం. కవిత్వమే ఆయన భాష. కవిత్వమే అభివ్యక్తి.

అయన రాజకీయాలను మానవ జీవిత ఉద్వేగాలన్నిటిలోంచి చూసి కవిత్వం చేస్తారు. రాజకీయాల్లోకి వెళ్లగల మార్గాలన్నిటినీ తెలుసుకుంటారు. అట్లా తెలుసుకుంటూ విప్లవ సాహిత్యోద్యమంలోకి చేరుకున్నారు. కవిత్వ రచనలో కనిపించే ఆయన నిశిత దృష్టి జీవితానికి సంబంధించింది. అంటే రాజకీయాలకు చెందినది. కవిత్వం రాయడం అరంభించినప్పటి నుంచి విప్లవ రాజకీయాలను గమనిస్తూ వచ్చారు. తన కవితా యానంలోంచే రాజకీయాలను అర్ధం చేసుకున్నట్లు కనిపిస్తుందిగాని నిజానికి ఆయన ప్రజా రాజకీయాలను పసిగట్టే క్రమంలోనే తన కవిత్వాన్ని తీర్చిదిద్దుకుంటూ వచ్చారు. తనలోని కవి వ్యక్తిత్వానికి ఒక బలమైన రాజకీయ పునాది అవసరం అని గుర్తించి దాన్ని నిర్మించుకుంటూ వచ్చారు.

అ రకంగా రెండు దశాబ్దాల విప్లవ కవిత్వంపై ఆయనది ఒక ప్రత్యేకమైన సంతకం.

విప్లవ రచయితల సంఘంలో ఆయన 2008లో చేరారు. అప్పటికే ఆయన ప్రముఖ కవి. మిగతా ప్రక్రియల్లో ప్రవేశమున్నప్పటికీ కవిత్వమే ప్రధానం. పాలపిట్ట ప్రచురణగా ‘తడి ఆరని నేల’ తొలి కవిత్వ సంపుటి 2011లో వెలుబడింది. 2012 నుంచి ఇప్పటి దాకా రాసిన కవిత్వం ‘ఈ వేళప్పుడు ప్రచురణకు సిద్ధమవుతున్నది.

తడి ఆరని ఆయన వ్యక్తిత్వమే ఈ కవిత్వానికి మాతృభూమి. విరసంలో చేరేనాటికే ఆయన సాహిత్య కార్యకర్తృత్వం కూడా కొనసాగించేవారు. ఆ తర్వాత కొద్ది కాలానికే విరసం కార్యవర్గంలోకి వచ్చారు. 2020లో అధ్యక్షుడయ్యారు. ఈ క్రమంలో ఆయన కవి గొంతుక పదునెక్కింది. విప్లవ సాహిత్యోద్యమంలోకి రావడం వల్ల మానవ జీవితంలో కవిత్వమే చేయగల పనులన్నీ తెలుసుకున్నారు. ఈ తెలివిడితో అయన కవిత్వం మారుతూ వచ్చింది. ఈ రెండు కవితా సంపుటాల నుంచి దాన్ని వివరించవచ్చు.

0 0 0

అరసవిల్లి కవిత్వ పరిణామం చాలా అసక్తికరం. ఏ కవిలో అయినా ఐదేళ్లలో, పదేళ్లలో ఒక రకమైన మార్పు కనిపిస్తుంది. అలాగే అరసవిల్లి కవిత్వం కూడా చాలా అంతర్లీనంగా, సుతిమెత్తగా ఒక ముఖ్యమైన మార్పుకు లోనైంది.

ఈ పదీ పన్నెండేళ్లలో ఆయన కవిత్వం మీద మిత్రులు కొన్ని పరిశీలనలు చేశారు. విరసంలో చేరాక అరసవిల్లి కవిత్వం క్వాంటిటీ తగ్గిందని వాటి సారాంశం. ఇది కేవలం కవితల సంఖ్యకు సంబంధించిందే కాదు. ఆయన తన కవిత్వ సమయాన్ని కోల్పోతున్నాడనో, వేరే పనులకు వెచ్చిస్తున్నాడనో, ఆ మేరకు సృజన శక్తి బలహీనపడుతున్నదనో కూడా కావచ్చు. అట్లాగే వస్తు వైవిధ్యం తగ్గిందా? అని సందేహించినవాళ్లూ ఉన్నారు.

నిజంగానే ఇవి ఆసక్తికరమైన పరిశీలనలు.

“ఈ వేళప్పుడు” సంపుటాన్ని ఈ వైపు నుంచి కూడా చూడవచ్చు. అ మాటకొస్తే తొలి సంపుటంలో కూడా ఆయన విరసంలో చేరిన తర్వాతి నాలుగేళ్ల కవిత్వం ఉన్నది. ‘ఈ వేళప్పుడు’లో 62 కవితలు ఉన్నాయి. ఇవన్నీ చదివితే… జీవితాన్ని అపారంగా అనుభవిస్తూ, సమాజాన్ని అనుక్షణం పరిశీలిస్తూ కవిత్వంకాగల సమయాలన్నిటినీ ఒడిసిపట్టుకున్నట్లు తెలుస్తోంది. కవి ప్రత్యేక జీవి కాదుగాని కవిత్వంగా మారే అనుభవ కోణం ప్రత్యేకమైనదే. కవిగా అరసవిల్లికి ఈ కోణం మొదటి నుంచీ ఉన్నదే. కానీ విప్లవ సాహిత్యోద్యమంలోకి వచ్చినందు వల్ల, నిర్మాణ బాధ్యతలు చేపట్టడం వల్ల ఆరసవిల్లికి ప్రజా జీవితం పెరిగింది. పాఠకులు పెరిగారు. శ్రోతులు పెరిగారు. వాళ్లంతా ఒక తరహా సమూహం కాదు. భిన్న స్థాయిలకు, భిన్న నేపథ్యాలకు చెందినవారు. ఒక మామూలు కవికి ఉండనంత వైవిధ్యభరిత సమూహాలవి.

ఆ రకంగా ఆయనకు మానవ సంపర్క సందర్భాలు పెరిగాయి. జీవితానుభవ కోణాలు పెరిగాయి. అనుభవ సారాన్ని ముట్టుకొనే అవకాశాలు పెరిగాయి. జీవన స్పందనలు పెరిగాయి. తన జీవితంలోనే లోతు, విస్తృతి, గాఢత పెరిగాయి. ఆయనలోని కవి అంతర్‌ దృష్టి విశాలమైంది. అందువల్ల కవిత్వ సమయాలను అందుకొనే ఒడుపు పెరిగింది. దు;ఖమూ, కన్నీరూ, ఉత్సాహమూ, ఆగ్రహమూ, ధిక్మారమూ కలగలసిన కవితా ఇతివృత్తంగా ఆయన జీవితమే మారిపోయింది. కాల్పనికత, భావుకత, విమర్శనాత్మకత, ఆశా దృక్పథం వంటివి శిల్పాన్నేగాక వస్తువునూ మార్చేశాయి. అంతిమంగా ఆయన కాల్పనిక శక్తి ఇనుమడించింది. విప్లవాన్ని ఎన్నెన్ని చెరగుల కళాత్మకం చేయవచ్చునో ఆయన కవిత్వం రుజువు చేస్తున్నది. మామూలుగా కంటికి కనిపించని దృశ్యాలు సహితం ఆయన కవిత్వంలో భాగమవుతున్నాయి. చేతి వేళ్ల సందుల నుంచి జారిపోతున్న వాస్తవికతా కోణాలు కవిత్వమవుతున్నాయి. ‘తడి అరని నేల” నుంచి ‘ఈ వేళప్ప’టికి ఆయన కవి ప్రయాణమిది. కవిత్వ రచన ప్రారంభించినప్పటి నుంచి అరసవిల్లి సాగించిన అన్వేషణ చేరవలసిన చోటికి చేరుకున్నది. ఈ కాలపు సంక్షోభ తీవ్రతను ఎత్తి చూపగల ఊహాశక్తి, సున్నితత్వమే కవిత్వ శిల్పంగా మారాయి.

ఇదంతా ‘తడి ఆరని నేల’లోంచి ఒక జీవజల వలె మొదలైంది. అ రోజుల్లోనే కవిగా అరసవిల్లి పరిణతిని చెప్పడానికి “కన్నీళ్లు అనే కవిత మంచి ఉదాహరణ.

శరీరమంతా ప్రవహించి

కనుల-వెనుక వేచి ఉంటాయి

ఎండ ఎంత కాచినా

సెలయేరు ఎండదు..

అంటూ ఈ కవిత ఆరంభమవుతుంది. 2011 నవంబర్‌లో ఇది రాశారు. అరసవిల్లి కృష్ణ కవి చూపు ఏమిటని ఆలోచింపజేసే కవిత ఇది.

ఏడ్వగలిగినంత ఏడ్చాను కదా

నవ్వుదామన్నా కన్నీటి తడి

అకలి రుచి కంటే

కన్నీటి రుచి బావుంటుంది

నా లోపలి సెలయేటితో

నా సంభాషణ ముగియలేదు.

కవిగా ఆయనకు ఈ లోకంతో ఎక్కడ పేచీ ఉన్నదో మనం సులభంగానే గుర్తించవచ్చు. ఆయన విమర్శనాత్మక చింతన ఏమిటోతెలుసుకోవచ్చు. అది బైటికి కనిపించేదే కాదు. లోపలిది కూడా.

అరసవిల్లి కృష్ణ మానవ అనుభూతులను, అనుభవాలను వ్యక్తి దగ్గరి నుంచి సమూహం దాకా గరిష్టస్థాయికి తీసికెళతారు. చాలా కర్కశమైన, హింసాత్మకమైన విషయాన్నయినా ఆయన తనలోని భావుకతను చెదరగొట్టుకోకుండా చూస్తారు. చాలా జటిలమైన అనుభవాన్నయినా తన సుతిమెత్తటి భాషతోనే చెప్పడం ఆరంభిస్తారు. తాను కల్లోలానికి గురికాకుండా తనకు అలివి అయిన చోట కవిత్వం మొదలు పెడతారు. ఎలాంటి సంక్షిష్ట విషయాన్నయినా తన ఉద్వేగభరిత మనఃస్థితితోనే నింపాదిగా స్వీకరిస్తారు. అందువల్ల కవిత్వ నిర్మాణం ఆయన చేతిలోనే ఉంటుంది. అనేక భావోద్వేగ స్థితుల్లోంచి కూడా రాజకీయాల తెరచాప ఆయన కవిత్వానికి దిక్కును, చలనాన్ని అందిస్తుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఏది ఎక్కడ కవిత్వమవుతుందో సరిగ్గా తెలుసుకొని అక్కదే దాన్ని పట్టుకుంటారు.అందుకే పరిపక్వ రాజకీయ కవిత్వంగా మారుతుంది.

కవిత్వమంటే భాష కాదు. కానీ భాషను వాడటం తెలిసి ఉండాలి. కవిత్వమంటే ఊహలను పేర్చడం కాదు. కానీ ఊహాశక్తి ఉ౦డాలి. ఒక ఉద్వేగ అనుభవంలోంచి మనమున్న చారిత్రక ప్రపంచం గురించి, దాని తర్మం గురించి రక్తమాంసాల స్పర్శతో ఎరుక కలిగించేదే కవిత్వం. మరే రకంగానూ సాధ్యం కాని మానవుల గురించిన అన్వేషణకు పురికొల్చేదే కవిత్వం. బహుశా మరే రకంగానూ జీవితంపట్ల కలగని సంతృప్తికి దారితీసే అశాంతి, అసంతృప్తి, అలజడుల వ్యక్తీకరణే కవిత్వం.

కవిత్వానికి ఒక తాత్విక పాఠ్యం కూడా ఉంటుంది. కానీ కవిత్వమంతా తాత్విక విచారం కానే కాదు. అందువల్లేనే కవిత్వానికి జీవితంలో, సమాజంలో, _విప్లవంలో తనదైన పాత్ర ఉంటుంది. దీని గురించి మరెవ్వరికంటే ఉద్యమ కవులకే ఎక్కువగా తెలుసు. అందునా విప్లవ కవులకే తెలుసు. సవ్యంగా తెలుసు. భిన్న తలాల్లో సాగుతున్న దీర్హకాలిక పరివర్తనా క్రమాలకు అనేక రూపాల్లో దోహదపడే స్వభావం కవిత్వానికి ఉంటుందని తెలుసు.

ఈ అవగాహన అరసవిల్లిలో ఎలా రూపొందిందో ఆయన కవిత్వంలో చూడవచ్చు. మానవులకు సహజమైన సున్నితత్వాన్ని గుర్తు చేసి, ప్రేరేపించి, పదిలం చేసి, అదే అనంతమైన సంపద అనే ఎరుక కలిగించడం కవిత్వం నిర్వహించే మొట్టమొదటి పని. బహుశా దేన్నయినా కవిత్వం అనడానికి ఇదే తొలి షరతు. విప్లవ కవిత్వం యాఖై ఏళ్ల కింద సరిగ్గా ఇక్కడ అడుగు మొదలు పెట్టింది. విప్లవమనే భావన మానవ సహజాతాలను తట్టి లేపి అద్భుత వాస్తవ, కల్పనా ప్రపంచాలను చుట్టి వచ్చేలా చేస్తుంది. దాన్ని అనేక ఉద్వేగ రూపాలతో, స్థితులతో విప్లవ కవిత్వం చిత్రిస్తూ వచ్చింది. అందుకే విప్లవ కవిత్వం అనేక పాయలుగా విస్తరిస్తున్నది. పాఠకులు తమలోని సున్నితత్వానికి తామే చలించిపోయే రీతిలో కవిత్వం చెప్పడం అరసవిల్లిలోని ప్రాథమిక గుణం. దాన్నాయన విప్లవంలోకి చాలా మామూలుగా, సహజంగా తీసుకొచ్చారు.

2011లో రాసిన ఓ కవిత ఇలా ప్రారంభమవుతుంది.

భుజానికి వేలాడే

సంచిలో ఏముంటాయి

మధ్యాహ్న భోజనం, కరపత్రాలు, పుస్తకాలు

నగరంలో

ఏ దారిలో నడుస్తున్నా

నా కాళ్ల కింద పంట పొలం ఉంటుంది

నా లోపల

కవో, చిత్రకారుడో, శ్రమజీవో

సజీవంగా కదులుతుంటారు..

ఇలా మొదలై … ‘నా భుజానికి వేలాడే సంచి ఓ సముద్రాన్ని జీవ నదిని నా కోసం దాచి ఉంచింది..” అని ముగిస్తారు. “నడుస్తున్నప్పుడు…” అరసవిల్లి కవిత్వ నిర్మాణానికి కూడా మంచి ఉదాహరణ. ఆయన ఎంత పెద్ద వస్తువును ఎన్నుకున్నా అనూహ్యమైన అంచుల్లోకి వెళ్లి కవిత్వాన్ని ఆరంభిస్తారు. అక్కడి నుంచి వస్తు కేంద్రంలోకి వస్తారు. ఆయన కవిత్వాన్ని రూపొందించే తీరులో కవిగా ఆయన రూపొందిన తీరు కూడా ఉంటుంది. ఆయన అలవోకగా కవిత్వాన్ని అల్లినట్లనిపించదు. దేన్నయినా కవిత్వం చేస్తారనే భ్రాంతి మనకు కలగదు. అ రకంగా ఆయన ప్రతిభ మనకు తెలియదు. దానికంటే భిన్నంగా ఆయన మనఃస్థితులు, ఉద్వేగాలు, స్థిరమైన విశ్వాసాలు, తార్మిక వైఖరులు కవిత్వమవుతున్నట్లు మనకు తెలుస్తుంటుంది.

అతని చేతిలో ఏమున్నది

అప్పుడే పుట్టిన పసిపాప

మృదువైన చల్లని శరీరమున్నది

భూమి కూడా పసిపాపే

భూమిని ఎత్తుకొని

ముద్దాడిన వారంతా

అనాథలయినారు

మరణం అంచున నిలబడినారు..

“ఉద్దానం పసిపాప” అనే కవితలో అతి పెద్ద సామాజిక విషాదం ఉన్నది. ఒక అంచు దగ్గర ఆరంభించి చెప్పే కవితా వ్యూహం ఉంది. ఇది చాలా కవితల్లో కనిపిస్తుంది. ‘తడి అరని నేల” నుంచి ‘ఈ వేళప్పుడు” ఒక కొనసాగింపు మాత్రమే కాదు. ఒక గుణాత్మక పరిణతి.

0 0 0

గతాన్ని నింపాదిగా సంయమనంతో చూడగలం. రేపటిని ఎన్ని కీకారణ్యాల మధ్య నుంచయినా ఆశా దృష్టితో చూడగలం. అది మానవ నైజం. కానీ ఇవ్వాల్టిని తరచి చూడటం అంత సులభం కాదు. పట్టుదల ఒక్కటే సరిపోదు. జీవితంలో అప్పటికప్పుడు జరుగుతున్న మార్పులపట్ల ఎరుక అవసరం. దీర్ఘకాలిక, విస్తృత, స్థూల తలాల్లో సాగే చలనాలకు తక్షణ, నిర్దిష్ట స్వభావం కూడా ఉ టుంది. కవి సృజనాత్మకత వెనుక ఇదొక బలీయమైన ప్రేరణగా పని చేస్తూ ఉంటుంది. దాన్ని సమగ్రంగా చూడాలి. ఈ దృక్పథమే భవిష్యత్తుకు భరోసా. అదే ప్రగతికి గీటురాయి.

“ఈ వేళప్పుడు” అని అంటున్నారంటే… ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నదో చెప్పడమే కాదు. రేపు ఏం జరగనున్నదో ఊహించడం, దాన్నీ కాల్పనీకరించడం. ఇదీ అరసవిల్లి కవిత్వ సారం. రూపొందుతున్న స్థితి మీద దృష్టి నిలపడమంటే పరివర్తనా క్రమంలోని రేపటి మీద కూడా చూపు సారించడం.

అధైర్యపడవద్దు

మనుషులే కాదు

మౌనంగా ఉన్న

ఏరాడ కొండ

ఉవ్వెత్తున లేచే సముద్ర కెరటం

ఈ నేలపై అప్పుడే పుట్టిన శిశువు కేక

ప్రతిధ్వనిస్తోంది

ఇదీ అరసవిల్లి వర్తమానాన్ని చూసే తీరు. ఇది. ఈ సంపుటి శీర్తికే కాదు. కవిత్వమంతా ఇవ్వాల్టిని నిశితంగా చూడటం. ఈ వేళ ఏమున్నదో, ఎట్ల ఉన్నదో, ఎందుకు ఇలా ఉన్నదో, ఇదెలా రూపాంతరం చెందుతున్నదో చెప్పడం. ‘మృత్యువు అన్నిటినీ ధ్వంసం చేస్తుంది, మృత్యువు పునర్జన్మిస్తుంది’ (ప్రియమైన అమ్మ) అనవలసిన స్థితి ఇది.

ఈ గతితర్మం వర్తమానంలోని అంతస్సూత్రం. బహుశా ఎప్పటికైనా. ఈ వేళప్పుడు “చావును నిరాకరిస్తున్నాన’ని ప్రకటించిన కొడుకు జెయిలులో ఉంటాడు. తాను జీవించి ఉన్నంత వరకు అతను అలా మృత్యువును ప్రతిఘటిస్తూనే ఉండాలని కోరుకొనే తల్లి వైట్‌ ఉంటుంది. కానీ మృత్యువు ఆమెనే కబళిస్తుంది. కానీ తల్లి మృత్యు శీతల స్పర్శకు కూడా అతను పరాయివాడవుతాడు.

సాయిబాబా తల్లి మరణం సందర్భంగా అరసవిల్లి ఈ కవిత రాశారు. మనకు బాగా తెలిసిన మనుషులు కాబట్టి ఇంతగాఅనుకుంటున్నాం. ఈ పరమ నికృష్ణపు వర్తమానమే ఇట్లా ఉన్నది. ఇందులోనే వైభవోజ్వల కాంతీ ఉన్నది. దాన్నీ చూడాలి. బహుశా సాహిత్యానికి మాత్రమే సాధ్యమయ్యే విద్య ఇది. అందుకే అరసవిల్లి కవిత్వంలో రవ్వంత వగపాటు కూడా కనిపించదు. ఆయన ఎక్కడా చేతులు ఎత్తేయరు. ఈ స్థితికి తాను బైటి వాడ్ని అని అనుకోరు. ఎవరినో అడిపోసుకొని సంతృప్తి చెందరు. ఇక్కడే ఒక దారి ఉందని కలగంటారు. అది నిజమైనదనే చారిత్రక అవగాహనను పదిలంగా ప్రకటిస్తుంటారు. ‘మాట పెగలని ఏకాంతంలో, బోర్లించిన అంధకారంలో, దివిటీలు వెలిగించిన చేతులు..” అని అంటారు. ఆ చేతుల మీద ఆయనకు నమ్మకం ఉంది. ‘ఇంత నెత్తురు చిందాక, అనేక పాదముద్రలు చెరిగాక, దేశాలు కలవడమంటే, మనుషులు కలవడమే…” అనే అంతర్జాతీయ భవితవ్యం మీద కడజూశాఅ ఆయనకు గురి ఉన్నది.

ఈ వర్తమానాన్ని పిల్లలు, స్రీలు, ముస్లింలు, దళితులు, రైతుల వైపు నుంచి ఆయన చూశారు. కరకు నిర్బంధంలో నిలబడి ఇవాళ ఎలా ఉన్నదో చూశారు. దగా పడుతున్న ద్వంసమైపోతున్నా సమూహ జీవితాల వైపు నుంచి ఈ కాలాన్ని పసిగట్టారు. దీని కోసం బాల్యం, శిశు స్వభావంలోకి వెళ్లారు. తద్వారా కవిత్వంలోకి మరింత మెత్తనిదనాన్ని తీసుకొచ్చారు. విధ్వంసాన్ని హింసను అర్థం చేసుకోడానికి ఆయనకు ఇదొక చూపు. పిల్లల్లోంచి మానవ భవిష్యత్తు తొంగి చూస్తుంటుంది. పిల్లలను అనుకోవడమంటేనే ఒక సౌందర్య దృశ్యాన్ని నిర్మించుకోవడం కదా.

పిల్లల నుంచి ప్రపంచం రూపు దిద్దుకుంటుంది

 పిల్లలు ప్రపంచానికి ఎల్ల వేస్తారు (పిల్లలు)

అంటారు. ఇంకో చోట “కుంకుమ పూల వంటి పిల్లలు..’ (సంరూతం) అని కూడా అంటారు. భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల గురించి కశ్మీర్‌ వైపు నుంచి ఆయన ఇట్లా మాట్లాడదల్పుకున్నారు.

దుర్భరంగా, కర్కశంగా ఉన్న వర్తమానాన్ని ఎదుర్మోడానికి మానవులు చేసే అనేక ప్రయత్నాల్లో కవిత్వాన్నీ ఆలంబన చేసుకుంటారు. మనుషులు తమ అంతరంగాలను సున్నితంగా నిలుపుకోడానికి ప్రేరేపించే కళలన్నీ రేపటికి మేలు చేసేవే. అరసవిల్లి కవిత్వ లక్ష్యం ప్రధానంగా అదే. ఆయన దృక్పథం వల్ల దీనికి విప్లవ స్వభావం సమకూరింది.

ఆధునిక వచన కవిత్వానికి ఒక అత్మిక పార్య్వం కూడా ఉంటుంది. మానవ అంతరంగాన్ని ముట్టుకొనే సునిశిత గుణం ఉంటుంది. బహుశా కళా సాహిత్యాల స్వభావమే అది. కవిత్వ చర్చలో, విమర్శలో అత్మాశయం అనే భావన ఉన్నది. దాన్ని సామాజికానికి పోటీగా తెచ్చారు. సామాజికం కాని సొంత గొడవగా ప్రచారం చేసి పెట్టారు. ఇలాంటి కవుల మీద అధారపడ్డ కొందరు విమర్శకులు అత్మాశయమైతేనే కవిత్వం అవుతుందన్నారు. సామాజికమైతే పేలవమవుతుందనే వాదన చేశారు. ఈ అత్మాశయ కూట వాదాన్ని ఓడించే క్రమంలో ఒక్కోసారి యాంత్రికంగా మాట్లాడిన మార్చిస్టులు కూడా ఉన్నారు. నిజానికి వ్యక్తి-సమాజం మధ్య సంబంధం ఎంత సహజమో, సంక్షిష్టమో తెలిస్తే ఈ గొడవ ఉండేది కాదు.

గత యాభై ఏళ్ల విప్లవ కవిత్వాన్ని పరిశీలిస్తే సామాజిక, రాజకీయార్థిక దృక్పథంతో రాసినప్పటికీ అనివార్యమైన అత్మాశయ పార్శ్వం కూడా కనిపిస్తుంది. విప్లవ కవిత్వానికి సామాజిక రాజకీయ దృష్టి వల్లనే అందులో లోతైన అంతర్‌ దృష్టి ఉంటూ వచ్చింది. బహుశా అందువల్లనే నిత్య పురోగామి స్వభావాన్ని సంతరించుకున్నది. బైటి-లోపలి, భౌతిక-అత్మిక కోణాలు విడి విడిగా కాక ఒక సమగ్ర దృక్పథంగా మారేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. చుట్టూ ఉన్న కల్లోలభరిత భౌతిక ప్రపంచాన్ని సృజనకారులు కవిత్వ రచనా క్రమంలో తమలోని అంతర్‌ దృష్టి నుంచి గ్రహిస్తారు. లేదా తమ అంతర్‌ దృష్టిలోకి బైటి ప్రపంచాన్ని ప్రతిఫలింపజేసుకుంటారు.

ఇక్కడే పాఠకుల కోసం ఒక కవిత్వ అవరణ సిద్ధమవుతుంది.

రాజకీయ కవిత్వం ఎవరు రాసినా అది జీవితమంతా విస్తరించేది ఇందువల్లే. కవితో, కవిత్వ విశ్లేషణతో నిమిత్తం లేకుండా రాజకీయాలు మానవ జీవితాన్నంతా అవరించి ఉంటాయి. అంటిపెట్టుకొని ఉంటాయి. అందువల్ల మానవ స్పందనలు ఎంత సహజమో, ఎంత నైసర్గికమో అంత రాజకీయం. ఇది. విప్లవ కవిత్వంలో పెరుగుతూ వస్తోంది.

అరసవిల్లి కృష్ణ అన్నిటినీ తన సామాజిక, రాజకీయ దృష్టిలోకి అనువదించుకుంటారు. ఈ వేళప్పటి కన్నీటిలోకి, దు:ఖంలోకి, గెలుపు ఓటముల పోరాటాల్లోకి, ఆశ నిరాశల దేదీప్యమాన ప్రపంచంలోకి మనల్ని తీసికెళ్లడానికి ఆయన ప్రతి చోట తనదైన అంతర్‌ దృష్టితో మనల్ని కనెక్ట్‌ చేసుకుంటారు. ఆ రకంగా తన చుట్టూ ఉన్న సామాజిక, రాజకీయ, ఉద్యమ పరిస్థితులతోపాటు వాటితో తన్లాడుతున్న మానవులను, మన వంటి పాఠకులను తన ఉద్వేగ ప్రపంచంలోకి తీసుకుంటారు. సరిగ్గా ఆయన కవిత్వమయ్యే తావు అదే. కవిలోనే సృజనాత్మకమయ్యే గుణం ఉండాలి. అది లేకుండా కవిత్వం రాయడం సాధ్యం కాదు.

ఈ సంపుటిలో ‘ఊయలోని పసిపాప అనే కవిత ఉంది. అందులోని కాటన్‌ గౌను పాప గురించిన అరాటం పూర్తి అత్మాశయం అనిపిస్తుంది. అలా అనిపించడం వల్లే అ కవితలోని సామాజికత పదునుగా పాఠకులకు తాకుతుంది. అ కవితలోనిదంతా ఒక సామాజిక స్థితి. ‘ఈ వేళప్పుడు” అనే కవితలో, ‘నీవెప్పుడైనా’ అనే కవితలో రాజకీయ పరిపక్వతను ప్రదర్శించే అత్మాశయత ఉన్నది. ఈ రెండూ ఆయన కవితా శైలిలో కూడా భిన్నమైనవి. మంచి ప్రోజ్‌ పోయిట్రీ అని చెప్పవచ్చు. అలాగే ‘నీకెవరూ చెప్పలేదా”, “మధ్యాహ్నం ఎండ’ వంటి కవితలు చూడండి. మానవ అనుభవంలోని సామాజిక, ఆత్మాశ్రయ తలాల అవిభాజ్య సమ్మేళనం కనిపిస్తుంది.

విప్లవ కవిత్వంలోకి ఈ ధోరణి గత ముప్పై నలభై ఏళ్లుగా బలంగా వస్తున్నది. వైయుక్తిక వాద ఛాయల్ని దరి చేరనీయకుండా, లోపలా-బైలా ఒక విప్లవ సంస్పందనా ఆవరణను నిర్మించే కవితా శైలి విసృతమవుతున్నది. విప్లవమనేది స్ఫూర్తి, దృక్పథం, అనంత కల్లోలాలకు ఎదురేగే మానవాచరణ. ఇవన్నీ ఉన్నాయా? లేదా, దాని వెనుక వర్గపోరాట ప్రజ్బలన కాంతి ఉన్నదా? లేదా అనేదే గీటురాయి. ఈ వరవడిని అరసవిల్లి కృష్ణ చాల ముందుకు తీసికెళ్లారు. ఇది కవిగా ఆయన ప్రత్యేకత. ఆయనలోని కవి ప్రయాణం కూడ కవిత్వంపై ఆయన వైఖరులను ప్రభావితం చేసినట్లుంది. వ్యక్తిగా, చదువరిగా, కవిగా, కార్యకర్తగా అరసవిల్లి ప్రయాణమే భిన్నం. విప్లవ కవులందరి మధ్యా ఇలాంటి ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. అందునా అరసవిల్లి తీరిన పద్ధతి మరింత భిన్నమైనది. విప్లవ కవుల దృక్పథం స్థూలంగా ఒకటే. అయినా ఒక్కొక్మరు ఒక్కోరకంగా కవిత్వ సహచర్యంలోకి వెళ్లి ఉంటారు. అక్కడి నుంచి కార్యకరృత్వంలోకి విస్తరించి ఉటారు. ఏది ముందో చెప్పలేం. ఏది దేనిపై నిర్షాయకమో చెప్పలేం. ప్రతి కవినీ, కవనాన్నీ విడిగా చూడాల్సిందే. అరసవిల్లికి తనదైన ఒరవడి ఉన్నది. అదే ఆయన కవిత్వ నిర్మాణ మూలం. ఈ సంపుటిలో ‘వాన పక్షులు, ‘నీలి పావురం” అనే కవితలు ఉన్నాయి.

అరసవిల్లి కృష్ణ కవిత్వ నిర్మాణానికి మంచి ఉదాహరణలివి. గొప్ప ఊహాశక్తికి ప్రతిభ కూడా తోడైంది. కానీ ఆ సంగతి పాఠకులకు తెలియదు. అలాంటి శిల్పం అందులో ఉంది.

ఈ సంపుటిలో హిందుత్వ వ్యతిరేకత ఒక అంతర్లీన స్రవంతి. ముస్లిం అస్తిత్వ ఆకాంక్షలను విప్లవ దృక్పథంతో బలంగా వినిపించారు. దీనికి ఆకాశపు నీడ కింద, ఆగస్టు-5, అన్నీ నీ ప్రతిబింబాలే, గాలి ఉరితీయబడిందని, ఆకాశం నుంచి ఊడిపడిన సరళరేఖ… వంటి కవితలు ఈ సంపుటికే ఒక వ్యక్తిత్వాన్ని అందించాయి. ఎన్‌ఆర్‌సీ సందర్భంలో చాల తాత్వికంగా…

మానవ నిర్మింత ప్రపంచం

కాగితాలపై తేలియాడదు.. అని చాలా స్పష్టంగా ప్రకటించారు.

అలాగే ఇందులో ‘“అమెలోకి వెళుతున్నా’ అనే కవిత ఉంది. ఇది అరసవిల్లి కవిత్వంలో తిరుగులేనిది.

సంభోగ సమయాలు

నీవు మాత్రమే కాదు

నీ రూప లావణ్యంతో పని లేదు

తెల్లవారుజామున వికసిస్తున్న పూలను

మునివేళ్లతో కోస్తున్న

ఆమె దగ్గర నిలబడి

నేనొక పూలరెమ్మనయినాను.. ఇలా సాగుతుంది. దీనికంతా ఒక లీడ్‌ ఉంది. ‘స్తీ రూపం ధరిస్తున్నాను, ఆమెలోకి వెళ్లిపోతున్నాను, ఏఖై ఏళ్ల పురుషత్వాన్ని వదిలి, ఆమెలోకి దారి చూసుకుంటూ…”

వెళుతున్నాను

అమెలోకి

ఆమెలాంటి ప్రపంచంలోకి

ఈ అసమ ప్రపంచాన్ని ఖాళీ చేసి.. అని ముగిస్తారు.

అరసవిల్లి కవిత్వంలో వర్తమానం రూపొందుతున్న తీరు మాత్రమే ఉండదు. చూసినదాన్ని చూసినట్లు, అనుభవంలోకి వచ్చినదాన్ని వచ్చినట్లు చెబితే కవిత్వం కాదు. దాన్నాయన తన దృక్పథంతో పునర్నిర్మిస్తారు. నిజానికి ఇది ఆయన కవిత్వ శిల్పం కూడా.

దీనికి అద్భుతమైన ఉదాహరణలు ‘నా మిత్రుని ఇల్లు ఎక్కడ, ‘కవి ఇల్లు. మొదటిది సాయిబాబా కోసం రాశారు. రెండోది వివి కోసం రాశారు. ఇవి రాసిన కాలం మధ్య ఎడం ఉంది. కానీ ఇవి ఒక ప్రవాహంలోని రెండు అలలు. ఇంటికి దూరమై జెయిలులో ఉన్న సృజనకారుల ఇంటిని ఊహించడం, కవి లేని ఇంటిని కనుగొనడటం, కవిని జెయిలులో, కవిత్వ రచనలో ఊహించడం, మనుషులకు దూరంగా ఉన్న కవి ఊహా ప్రపంచాన్ని అవిష్కారం చేయడం.. ఇలా ఎన్నో తలాలలో ఈ కవితలు సాగుతాయి.

కవి నిర్బంధానికి గురయ్యాడని రాయడం మామూలే. అదీ వర్తమాన స్థితిని సూచించేదే. కానీ అరసవిల్లి అలా రాయలేదు. ఏది కవిత్వమవుతుందో తెలియడమంటే ఇదే.

కవిత్వం చేయడం తెలిసి ఉండటం సరే. అంతకంటే ముఖ్యమైనది కవిత్వమంటే ఏమిటో తెలియడం. అరసవిల్లి కృష్ణకు ఇది బాగా తెలుసు. కవిత్వం ఎందుకు? అనే విషయంలో అయితే సందేహమే లేదు. కవిత్వ స్వభావం తెలిసినందు వల్లనే భిన్న తలాల్లో, రూపాల్లో ప్రయోజనకారి అయిన కవిత్వం రాయగలుగుతున్నారు. దానికి ఆయన కవితా వ్యక్తిత్వమే సాక్షం. తాజాగా ఈ సంపుటి కూడా.

అమరత్వం

నీటి బొట్టుకాదు

జనం కనుల నుంచి

ఉరికే జలపాతం

జ్బలించే నీ నేత్రంలో

చిగురిస్తున్న మేఘం

తొలి వర్షం-

అకాశం నీపై తడిగా వాలుతుంది.

ఈ కవిత్వం చదివితే మీకూ సరిగ్గా ఇలాంటి అనుభూతే కలుగుతుంది. విప్లవాన్ని అనేక భావోద్వేగాల, స్థితిగతుల అనుభవంగా మార్చిన కవిత్వం ఇది. విప్లవానికి కావాల్సిన కవిత్వం ఇది. మనందరికీ ఈ వేళప్పుడు కావాల్సిన కవిత్వం కూడా.

24 11.2021

(‘ఈ వేళప్పుడు’ అరసవిల్లి కృష్ణ కవిత్వ సంపుటి త్వరలో రాబోతుంది. ఆ సంపుటి ముందుమాట పాఠకుల కోసం..)


One thought on “ఇవ్వాల్టి రేపటి కవిత్వం

  1. అరసవిల్లి కృష్ణ గారి పరిచయం, ఆయన కవితా విశ్లేషణ వివరంగా బాగా చేశారు పాణి గారు, ఆయన ముందు మాటకి చివర ఉదహరించిన కవిత ఆయన్ని సరిగ్గా చెపుతుంది . “అమరత్వం

    నీటి బొట్టుకాదు

    జనం కనుల నుంచి

    ఉరికే జలపాతం

    జ్బలించే నీ నేత్రంలో

    చిగురిస్తున్న మేఘం

    తొలి వర్షం-

    అకాశం నీపై తడిగా వాలుతుంది.

    ఈ కవిత్వం చదివితే మీకూ సరిగ్గా ఇలాంటి అనుభూతే కలుగుతుంది. విప్లవాన్ని అనేక భావోద్వేగాల, స్థితిగతుల అనుభవంగా మార్చిన కవిత్వం ఇది. విప్లవానికి కావాల్సిన కవిత్వం ఇది. మనందరికీ ఈ వేళప్పుడు కావాల్సిన కవిత్వం కూడా.”

Leave a Reply