నీ మూలం యెక్కడ
నది నవ్వింది
కాగజ్ దిఖావో
నది నడక ఆపింది
వెనక్కి పో
నది అదృశ్యమైంది

మనిషి కూడా నదిలా ప్రవాహశీలే . పుట్టిన చోట మనుషులు యెవరూ పాతుకుపోయి వుండరు. పొట్ట చేతబట్టుకుని పక్షుల్లా పలుదెసలకు పయనిస్తారు.  వలసపోతారు (అందరం అమ్మ కడుపునుంచి భూమ్మీదకి వలస వచ్చినవాళ్ళమే. కాకుంటే సామ్రాజ్య విస్తరణవాదుల ఆధిపత్య వలసలు వేరు; శ్రమజీవుల పొట్టకూటి వలసలు వేరు). అలా బెంగాల్ నుంచి అస్సామ్ బ్రహ్మపుత్ర పరివాహ ప్రాంతాలకు బ్రిటిష్ పాలకులు రవాణా చేస్తే కూలీలుగా వలస వచ్చిన ముస్లింలు  మియాలు. మేం మియాలం కాదు అసోమియాలం అంటారు వాళ్ళు( నేను చారువా (ఇసక మేటవాసి) ని కాను, వలస వాసినీ కాను. మేము కూడా అస్సాం నేలా గాలీ భాషలతో అసోమియాలు అయాము). నదీ తీరాల్లో  లంకల్లో వందలాది వరదల్ని మోసి యిసుక మేటల్లో కూరుకుపోయిన మట్టి మనుషులు వాళ్ళు. ఎర్రటి  కొండల్ని చదును చేసారు. అడవుల్ని నరికి నగరాల్ని, మట్టిని దొర్లించి ఇటుకల్ని – ఇటుకలనుండి స్మారకభవనాల్ని కట్టారు. నేలమీద రాళ్లు పరిచారు,  శరీరాల్ని కుళ్ళిన మొక్కతో నల్లగా మాడ్చుకున్నారు .  నదుల్ని ఈదారు, తీరంలో నిల్చొని వరదల్ని యెదుర్కొన్నారు.  రక్తంతో చెమటతో పంటలు పండించారు . తాత  తండ్రుల నాగలితో “అస్సాం” అని భూమి మీద దున్నారు. (వినమ్రంగా నివేదించుకుంటున్నాను  ఇది – కబీర్ అహ్మద్)

అకస్మాత్తుగా వొక కోర్టు ఆర్డర్ తోనో పార్లమెంట్ చట్టంతోనో దేశ పౌరులు కాకుండాపోతారు. ఒకే కుటుంబంలో తల్లి పౌరురాలు కూతురు కాదు. భార్య వోటరు భర్త కాదు. కొడుకు స్వదేశీ తండ్రి బంగ్లాదేశీ. వందలాది సంవత్సరాలుగా  మా తాత ముత్తాతల కాలం నుంచీ మేం యిక్కడి వాళ్ళమే అంటారు వాళ్ళు. ఆధారాలు తే. కాగితం చూపించు అంటారు వీళ్ళు.   ఎక్కణ్ణుంచి తెస్తారు ఆధారాలు? ఏ వరదలో కొట్టుకుపోయాయో- ఏ కార్చిచ్చులో కాలిపోయాయో ? లక్షలాదిమందికి కాగితంతో సాన్నిహిత్యం లేదు. అక్షరమ్ముక్కతో పరిచయం లేదు. అయితే నిర్బంధ శిబిరానికి పద అంటారు. కాదంటే అక్కణ్ణుంచి సరిహద్దు అవతలికి ఫో.   నిర్బంధపు చావులు. బలవంతపు బహిష్కరణలు. రేపేంటో తెలీక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కొందరు.  దిక్కు తోచక పిచ్చెత్తిపోయేవాళ్లు మరి కొందరు. 

నాలుకపై పలికే మాట (అస్సామీ చారువా మాండలికం) వొంటి మీది  కట్టూ బట్టా  ( కట్టుకున్న ఆకుపచ్చ గళ్ళ  లుంగీ)  వారిని పరాయిగా గుర్తించడానికి గుర్తించి తరివేయయడానికి దాడి చేయడానికి కారణమయ్యాయి.

మా నాన్న చుబుకం మీద పిడికెడు గడ్డం
తలమీద టోపీ, చేతిమీద పూసలతాడు, భుజాలమీద జనపనార బ్యాగ్
దవడమీద వచ్చీరాని అస్సామీ ఉంటుంది కావున
పనినుండి పోలీసు స్టేషనుకు వెళ్తుంటాడు
ఒక్కోమారు బంగ్లాదేశీగా, ఒక్కోమారు మతవాదిగా
(సోదరా, నేను చార్ మనిషిని – అశ్రఫుల్ హుస్సైన్)

అలా వాళ్ళు ఊరు లేనివాళ్ళు. పేరు లేనివాళ్ళు. ఊరూ పేరూ వున్నా వాటికి దూరమౌతున్నవాళ్ళు. అయినవాళ్ళకి కాకుండా పోతున్నవాళ్ళు. వాళ్ళు తీసిన పంట వాళ్ళది కాదు. పెట్టిన మొక్క పెంచిన పశువు   కట్టిన యిళ్ళు పరిచిన రహదార్లు యేవీ తమవి కావు. పుట్టి పెరిగిన నేల తమది కాదు.

ఆ నేల నా తండ్రిని విదేశీయుడ్ని చేస్తుంది
నా సోదరుల్ని బుల్లెట్లతో చంపుతుంది
నా సోదరిని సామూహిక మానభంగం చేస్తుంది
ఆనేల, ఎక్కడ నా తల్లి తన హృదయంలో కాలుతున్న బొగ్గుల్ని రాజేస్తుందో
ఆ నేల నాది, ఆ నేల వాడిని కాదు నేను
ఎక్కడయితే నా సొంత ఇల్లు ధ్వంసం చేయబడుతుందో
ఎక్కడయితే వారసత్వం తిరస్కరించబడుతుందో
ఎక్కడయితే వాళ్లు నన్ను చీకటిలోనే మగ్గేందుకు కుట్రచేస్తారో
ఎక్కడయితే నా పళ్లెంలో గంజి బదులు, కంకర పోస్తారో
ఆ నేల నాది, ఆ నేల వాడిని కాదు నేను
(ఆ నేల నాది, ఆ నేల వాడిని కాదు నేను – కాజీ నీల్)

పరాయి – యెంత బాధాకరమైంది యీ  మాట! తాను పుట్టి పెరిగిన నేలకి తాను పరాయి. దేశ పౌరసత్వాన్ని నిరాకరించడానికి యివాళ యీ మాట పర్యాయపదమైంది. దాంతో మొదట వోటు అంటరానిదైంది. అనుమానాస్పదమైంది (డి వోటర్). ఉనికి సందేహాస్పదమైంది. బతుకు భయాస్పదమైంది. మాట నేరమైంది.  నీడ నిషేధమైంది.  కవిత్వం  దేశ విద్రోహమైంది. నేనీ నేలవాసినే అన్న వారి వేదన అభ్యంతరమైంది. నన్ను నా మాతృ  దేశం నుంచి వెలివేయకండి అన్న నివేదన అశ్లీలమైంది. మమ్మల్ని మీలో కలుపుకోండి అనే లక్షలాది ముస్లింలు అభ్యర్థిస్తున్నారు. ఇది ఇంక్లూసివ్ వాయిస్. దేశంతో వారిది తల్లీ బిడ్డల అనుబంధం.

‘అతను అంటున్నట్టు
నేను అతని సవతి సోదరుడ్ని కాదు
నేను జన్మించినపుడు
తల్లీ కొడుకూ
వేరు చేయబడలేదు’
(చారువా యువకుడూ జనం – హఫీజ్ )

కానీ పాలకులు అధికార దాహంతో వారిని ఎక్సక్లూసివ్ గా ప్రచారం చేస్తారు. అధికారం కోసం విద్వేషం పునాది మీద 80:20 రాజకీయాలు నడుపుతారు.  ఈ కవితలన్నిటా అస్తిత్వ వేదనే తొణికిసలాడుతోంది తప్ప పగా ప్రతీకారం ద్వేషం  వంటివి అణుమాత్రంగానైనా కనిపించవు.  ఈ రెహానా సుల్తానా రాసిన కవిత చూడండి.   

‘నాకు ఆనవాలు లేదు, భాష లేదు
నన్ను నేనే కోల్పోయాను, అన్నింటినీ కోల్పోయాను
అది నన్ను స్పష్టం చేస్తుంది
అయినా నిన్ను దగ్గరగా హత్తుకుంటాను
నీలోపలికి నేను కరిగి పోడానికి ప్రయత్నిస్తాను
నీ పాదాల దగ్గర చుక్కగా తప్ప
నాకు ఏమీ అవసరం లేదు తల్లీ
ఒక్కసారి కళ్లు తెరువు తల్లీ
నీ పెదాలు విప్పు
ఈ భూమి పుత్రులకు చెప్పు
మేమంతా సోదరులమని
అయినా నీకు మరోమారు చెబుతున్నాను
నేను కేవలం మరొక బిడ్దని
నేను మియా మర్మాంగాన్ని కాదు
బంగ్లాదేశీని కాదు
మియాని నేను (నా తల్లి – రెహనా సుల్తానా)

మియా కవిత్వం రాస్తున్నందుకు రెహానా  మీద యెన్నో కేసులున్నాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్  బెదిరింపులు అశ్లీల వ్యాఖ్యానాలు చెప్పక్కర్లేదు. కవిత్వం రాసినందుకు  పోలీసులు కేసులు పెట్టడం వేధించడం హఫీజ్ అహ్మద్ సోషల్ మీడియాలో నేను మియానని రాసుకో కవిత పోస్ట్ చేసినప్పుడు మొదలైంది.

నేను మియానని రాసుకో
బీడు భూముల్ని
పచ్చటి పైరు పొలాలుగా మారుస్తాను
మీకు తిండి కోసం
ఇటుకలు మోస్తాను
మీ మేడల కోసం
మీ కారు నడుపుతాను
మీ సుఖం కోసం
మీ మురుగును శుబ్రం చేస్తాను
మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి
మీ సేవ కోసమే సదా ఉన్నాను
అయినా మీకు సంతృప్తి లేదు
రాసుకో నేను మియానని
ప్రజాస్వామిక లౌకిక గణతంత్ర రాజ్యంలో
ఏ హక్కులూ లేని పౌరుడిని
నా తల్లి ఒక సందేహాస్పద వోటరు
ఆమె తల్లిదండ్రులు హిందువులు ఐనా సరే
(రాసుకో ; నేను మియానని రాసుకో – హఫీజ్ అహ్మద్ )

ఈ ప్రకటన  మియా కవిత్వంలో బలమైన  మలుపు. అక్కడి నుంచి మియా కవిత్వం పదునెక్కింది. ఆత్మగౌరవ స్వరంగా రాటు తేలింది. అస్తిత్వ వేదన సామూహిక చేతనగా పరిణమించింది. వ్యక్తీకరణలో తీక్ష్ణత చోటుచేసుకుంది.

మియాలందర్నీ దేశంలోకి వచ్చిన  చొరబాటుదార్లని ముద్రవేసే దుర్మార్గం సరిగ్గా యెప్పుడు మొదలైందో చెప్పలేం. కానీ  అస్సామ్ రాష్ట్రం యేర్పడకముందు నుంచి స్వాతంత్య్రం రాకముందు   దేశ విభజన జరగక ముందు నుంచి గట్టిగా చెప్పాలంటే బెంగాలు విభజన కంటే ముందు నుంచే  జీవగంజి  కోసం ప్రకృతితో పోరాడుతూ యిసుక మేటల్లో మియాలు పీకల్లోతు పాతుకుపోయి వున్నారు. చరిత్రలో తారీఖులు మిగిల్చిన గాయాలు మోసుకుంటూ జీవచ్ఛవాల్లా తిరుగుతూ వున్నారు. వాళ్ళ క్యాలెండర్లో పుటలు రక్తసిక్తమై వున్నాయి. మరువలేని మారణకాండలు నమోదై వున్నాయి. వాటినన్నిటినీ  మియా కవిత్వం  నెత్తుటి అక్షరాల్లో నమోదు చేసింది.

ఎండకు కాలిన నా వీపుని ఇంక చూడకండి
ముళ్లకంచల గీకుళ్ల కోసమూనూ
కానీ దయచేసి,
దయచేసి ’83, ’94, ’12, ’14 లను మరచిపోకండి
దయచేసి నా కాలిన గాయాల్ని
ముళ్లకంచెల గీకుళ్ల గుర్తుల్ని కెలకకండి
నన్ను మియాగా
ఎంతమాత్రమూ ఇంక అవమానించకండి
నా రక్తాన్ని పిండి దానితో
దయచేసి జాతీయవాదం గీతాల్ని రాయకండి
(ఎంతమాత్రమూ ఇక మియాగా నన్ను అవమానించొద్దు – అబ్దుర్ రహీం)

మియా కవిత్వంలో పరాయీకరణ అనేకరూపాల్లో కనిపిస్తుంది. సామాజిక పరాయీకరణ వల్ల యెదుర్కొన్న దుర్భరమైన అవమానాల పట్ల అమానవీయమైన హింస  పట్ల తీవ్ర దు:ఖం యెక్కువ మంది కవితల్లో ప్రధానంగా వ్యక్తమౌతోంది.

కొద్దిమంది కవితల్లోనైనా శ్రమ పరాయీకరణ ఆర్ధిక దోపిడీ బలంగా ప్రస్తావనకు వచ్చాయి.  తాము సృజించిన సంపద తమది కాకుండా పోతుందనీ  అది తమని ద్వేషించేవారి దగ్గరే పోగుపడుతోందనీ  తెలిసిన నిర్వేదం కవిత్వ పంక్తుల్లో అప్పుడప్పుడూ  తొంగిచూస్తోంది.  

మమ్మల్ని తిట్టండి
తన్నాలనుకుంటే తన్నండి
సహనంతో మీ భవనాలను, రోడ్లను, వంతెనల్ని కడుతూనే ఉంటాం
మీ అలసి బలిసిన చెమట శరీరాల్ని
సైకిల్ రిక్షాలో సహనంతో లాగుతూనే ఉంటాం
మీ చలవరాయి నేలలు
తళతళమెరిసే వరకూ రుద్దుతూ మెరుగు పెడుతూనే ఉంటాం
మీ బట్టలు తెల్లబడేవరకూ బాదుతూనే ఉంటాం
తాజా పండ్లు కూరగాయలతో మిమ్మల్ని పుష్టిగా ఉంచుతాం
(మా విప్లవం – రెజ్వాన్ హుస్సైన్)

మనుషుల్ని మతస్తులుగా రాజ్యమే విడదీస్తున్నప్పుడు సాంస్కృతిక పరాయీకరణకి వ్యతిరేకంగా వారి గొంతు దృఢ పడింది. చివరికి  జీవన భద్రతకి గురిచేసిన  రాజకీయ పరాయీకరణ వాళ్ళని అన్నింటికంటే యెక్కువ బాధించింది. యన్నార్సీ లో ఒక సంఖ్యగా మారిన దరిమిలా వారి  వునికే  భరించరానిదై పౌరసత్వం ప్రశ్నార్థకమైనప్పుడు సహనం బద్దలైంది. దుఃఖంతో పూడుకుపోయిన గొంతుల్లో  ధిక్కారం వెల్లువెత్తింది. నెల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక స్థల కాలాల్లో అనుభవించిన గాయాలు మళ్ళీ రేగాయి.

నెల్లీలో నన్ను చంపావు
నేను మియానని
ఖాగ్రాబరిలో నన్ను చంపావు
నేను మియానని
నన్ను అవమానించావు బంగ్లాదేశీ అని
నేను మియానని
నాకు హక్కులు నిరాకరించావు
నేను మియానని
నాకు ఇవ్వదగిన మర్యాద నిరాకరించావు
నేను మియానని
ఇక్కడ ఎప్పటికంటే నేను గర్వంగా ఉన్నాను
నేను మియాని
ధిక్కారం నీ ద్వేషానికి
ధిక్కారం నీ పక్షపాతానికి
ధిక్కారం నీ ప్రచారానికి
ధిక్కారం నీ దుర్బుద్ధికి
ఇక్కడ ఎప్పటికంటే నేను గర్వంగా ఉన్నాను
(నేను మియాని – అమన్ వాదూద్)

మియా కవిత్వం నిండా యిటువంటి ఆత్మగౌరవ ప్రకటనలు ధిక్కారాలు యెన్నో వున్నాయి. నిజమే కానీ అవి రాజ్యాంగ బద్ధంగానే వున్నాయి.  వారి వైపు నుంచి యిప్పటి వరకూ అవి హింసాత్మకం కాలేదు.

ఫుల్బానూ వాళ్ల నాన్న మూడేళ్లు నిర్బంధ కేంద్రంలో ఉన్నాడు
చీకటిలో కూడా అతను నిద్రపోలేడు
రాత్రి పెరుగుతున్నకొద్దీ నెల్సన్ మండేలా నడిచొచ్చి
నిద్రపొమ్మని అతనికి జోకొడుతూ అంటాడు –
“ఈ దారిలోనే, స్వాతంత్య్రం వస్తుందని”
(స్వాతంత్ర్య దినం – బేగం అస్మా ఖతూన్)

శాంతియుత  సహజీవనమే తాము కోరుకుంటున్నామని వారు తమ కవిత్వంలో పదే పదే ప్రస్తావిస్తున్నారు. అయితే వారి గొంతులో కేవలం దు:ఖమే కాదు ఆగ్రహం కూడా వుంది. ఏదో వొక రోజు అది విముక్తి వాదం వైపు పయనించే అవకాశం లేకుండా పోదు. ఈ హెచ్చెరిక వొకరిద్దరి కవిత్వం లోనైనా దాగి వుంది.

ఇసక తిన్నెల్లో, మరుగుతున్న నదిలో
కార్చిచ్చు ఉంది
దాని ఉనికిని చూపించుకుందుకది
కార్చిచ్చుతో సిద్ధంగా ఉంది
మీరు ఎన్నటికీ దానిని ఆర్పలేరు (ఒక విప్లవం – అమీనా అహ్మద్)

మియా కవుల్లో డాక్టర్లున్నారు. లాయర్లున్నారు. కళాకారులున్నారు. విశ్వవిద్యాలయాల్లో సాహిత్య సామాజిక శాస్త్రాల్లో పరిశోధకులున్నారు. ఆచార్యులున్నారు. పౌరహక్కుల కార్యకర్తలున్నారు.  ఒకరిద్దరు చట్ట సభల్లో సభ్యులు కూడా వున్నారు. వారి అస్తిత్వ వేదన  అస్సామ్ కి  పరిమితం కాదు.  అది దేశవ్యాప్తంగా పోరాట రూపం ధరించింది. ఇవ్వాళ మియా కవిత్వం అంతర్జాతీయ వేదిక నెక్కింది.

ముకుంద రామారావు మియా కవిత్వంలో తనని తాను  చూసుకున్నట్టున్నారు. తాత తండ్రుల దగ్గర్నుంచీ ఆయన కూడా వలసజీవే. ఆయన తాతని కూడా బ్రిటిష్ వాళ్ళు అచ్చం మియాల్లాగానే వ్యవసాయం పనులకోసం ఆఫ్రికాకి  తీసుకుపోయారు. తండ్రి దర్బన్ లోనే పుట్టి అనకాపల్లి మీదుగా బతుకు తెరువు వెతుక్కుంటూ పరిచిన రైలు పట్టాల వెంట ఖరగ్ పూర్ (పశ్చిమ బెంగాల్) వెళ్లారు. బెంగాల్లో పుట్టి పెరిగిన రామారావు  జీవితమంతా ఉద్యోగ రీత్యా  దేశంలో పలు ప్రాంతాలు  తిరిగి హైదరాబాదులో స్థిరపడ్డారు. కానీ వలస వేదన ఆయన్ని దశాబ్దాలుగా వెంటాడుతూనే వున్నట్టుంది. అదే ఈ కవిత్వంతో ఆయన్ని మమేకమయ్యేలా చేసింది. మియా కవిత్వ నేపథ్యాన్ని వివరిస్తూ ఆయన రాసిన విపులమైన ఉపోద్ఘాతంలో అది ప్రస్ఫుటమవుతుంది.  వర్ణ దురహంకారానికి గురైన ఆఫ్రో అమెరికన్  కవుల కవిత్వంతోనూ రాజ్యాధికారం కోరుతూ ఆత్మగౌరవ స్వరంతో వెలువడుతోన్న దళిత కవిత్వంతోనూ ఆయన మియా కవిత్వాన్ని   పోల్చడం గమనించాలి.

దేశం మొత్తమ్మీద వస్తున్న తొలి మియా కవిత్వ సంకలనం యిది. ఇంతవరకూ  యే  భాషలోనూ జరగని పని యిది.  అక్కడక్కడా చెదురుమదురుగా వున్న కవితల్ని కవుల సమాచారాన్నీ  సేకరించి అనువదించి కూర్చి పుస్తకరూపంలో అందుబాటులోకి తెస్తున్నందుకు అనువాదకుడు ముకుందరామారావు ప్రచురణకర్త ‘ఛాయా’ మోహన్ బాబులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వారి సాహసానికి అభినందనలు.

చరిత్ర యిసుకపర్రల్లో చెరిగిపోతున్న పాదముద్రలివి. వాటిలో తమ ఆనవాళ్లు వెతుక్కుంటున్న లక్షలాది అభాగ్య  ప్రజల గుండె గోస  యిది. చావు బతుకుల మధ్య సంచరిస్తూ అనిశ్చితితో కొట్టుమిట్టాడుతున్న పౌరుల నెత్తుటి శ్వాస యిది. హృదయాలకు దగ్గరగా వుండే ‘భూమి భాష’ యిది. ఎదకు హత్తుకొని గొంతు కలుపుదాం.  వెంట నడిచి మద్దతుగా నిలుద్దాం.  వసుధైక కుటుంబం మనది. కవిత్వం చావు లేనిది.

నా మరణం తరువాత నేను చెట్టులా జీవిస్తాను
నా మరణం తరువాత నేను దేశమవుతాను
వారసత్వ హక్కు కోసం పోరాడేవారిలో
దేశం లేకపోయినా ఇళ్లున్న వారిలో
నేను మరణించినా జీవిస్తూనే ఉంటాను
పోరాటంగా నేను జీవిస్తూనే ఉంటాను వంశం లేని తెగకోసం
(నేను మరణించిన తరువాత చెట్టులా జీవిస్తాను – హీనా అల్ హయ )

హైదరాబాద్                                                                               ఎ. కె. ప్రభాకర్

26. 11. 2022

Leave a Reply