వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ జరుగుతున్న ఈ కాలంలో, మరిన్ని చెట్లను నాటాలని, అడవులను కాపాడాలని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతున్న సమయంలో   నగరం పక్కనే ఉన్న మరో అడవిని నాశనం చేయడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రణాళిక తయారుచేసింది. ఈసారి  దట్టమైన సాల్ చెట్ల  ఖలంగా కొండల అడవి వాళ్ళ  లక్ష్యం.

ఇక్కడ సౌంగ్ నది తాగునీటి పథకానికి సంబంధించిన నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఏటా రెండు వేల చెట్లను నరికివేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.  నరకబోయే చెట్లకు ఇటీవల గుర్తులు కూడా పెట్టారు. గుర్తు పెట్టడం అంటే నరకబోయే చెట్లకు గుర్తుగా గొడ్డలితో కొంత గాటు పెడతారు.

పర్యావరణ పరిరక్షణపై అవగాహన ఉన్న డెహ్రాడూన్లోని  పర్యావరణ  సంస్థల సభ్యులు, యువత   ఈ విషయం తెలియగానే నిరసనకు దిగారు. ఆదివారం భారీ సంఖ్యలో సామాజిక సంఘాల ప్రజలు, యువకులు, విద్యార్థులు ఖలంగా చేరుకుని చెట్ల నరికివేతను నిరసించారు. అయితే  హర్ హర్ మహాదేవ్, భారత్ మాతా కీ జై అని నినాదాలు చేస్తూ 25-30 మంది వున్న గుంపు అక్కడికి చేరుకుని చెట్లను కాపాడేందుకు వచ్చిన వారి  సమావేశాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నించింది.

డెహ్రాడూన్లో అభివృద్ధి పేరుతో అడవులను నరికివేయాలని పథకం వేసినప్పుడల్లా ఇక్కడి ప్రజలు ఏకమై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు, టీ గార్డెన్, సహస్రధార రోడ్, అషరోరి, థానో అడవులను రక్షించడానికి డెహ్రాడూన్ లో  పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినప్పటికీ ప్రజలు తేయాకు తోటను మాత్రమే రక్షించుకోవడంలో విజయం సాధించారు. తీవ్ర నిరసనలు ఎదురైనప్పటికీ ప్రభుత్వం ఆశారోడి, సహస్రధార రోడ్డులో వేలాది చెట్లను నరికేసింది.

ప్రస్తుతం ఇక్కడి సామాజిక సంఘాలు, యువత,  విద్యార్థులు ఖలంగా అడవులను కాపాడాలనే ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. నిరసనల వల్ల ప్రస్తుతానికి చెట్లను నరకడం ఆపేస్తామని, నీటి శుద్ధి ప్లాంట్ కోసం వేరే స్థలాన్ని చూస్తామని ప్రభుత్వం అన్నది కానీ ఈ పథకానికి సంబంధించి సామాజిక సంస్థలతో నిర్వహించిన సమావేశంలో తాగునీటి శాఖ అధికారులు “వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ కు ఖలంగా అడవికి మించిన స్థలం లేదని స్పష్టంగా చెప్పామని” అంటున్నారు.

ఖలంగా కొండ డెహ్రాడూన్లోని ఒక చారిత్రక ప్రదేశం.  గూర్ఖా కమాండర్ బలభద్ర థాపా,  బ్రిటిష్ సైన్యం మధ్య జరిగిన యుద్ధంలో బలభద్ర థాపా ధైర్యసాహసాలకు ప్రతీకగా ఈ కొండపైన బలభద్ర థాపా స్మారక చిహ్నంను కూడా నిర్మించారు. స్మారక చిహ్నం దిగువ ప్రాంతంలో నలపాని అనే ప్రదేశం వరకు దట్టమైన సాల్ అడవులు ఉన్నాయి. ఖలంగా స్మారక చిహ్నంకు ఒక కిలోమీటరు దిగువన ఈ అడవి మధ్యలో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రణాళికను అమలు చేసేందుకు చెట్ల నరికివేతకు ఏర్పాట్లను ప్రారంభించారు. రెండు వేల చెట్లను నరికివేస్తామని అధికారికంగా చెప్పారు. ఆ చెట్లను గుర్తించారు కూడా.

చెట్లను నరికివేయడాన్ని వ్యతిరేకిస్తూ అధికారుల వద్ద నిరసన తెలిపినప్పుడు, ప్రస్తుతం చెట్లను లెక్కించడం మాత్రమే జరుగుతోందని చెప్పినట్లు ఖలంగా అడవులను కాపాడే ఉద్యమంలో ముఖ్య పాత్ర వహిస్తున్న సిటిజన్ ఫర్ గ్రీన్ డూన్కు చెందిన హిమాంశు అరోరా చెప్పారు. అయితే, చెట్లను లెక్కించడానికి మాత్రమే గుర్తులు పెట్టలేదని, చెట్టును నరకాలని పూర్తిగా నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఇలా చేస్తారని, అంటే త్వరలోనే ఖలంగా చెట్లను నరికేస్తారని హిమాంశు అంటున్నారు.

డెహ్రాడూన్ చుట్టూ ఉన్న అడవులను నరికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పూర్తిగా నాశనం చేశారన్నారు ట్రేడ్ యూనియన్ నాయకుడు జగ్మోహన్ మెహందిరత్త . నీటి శుద్ధి ప్లాంట్ కు  సంబంధించి జరిగిన సమావేశంలో అధికారులు తమ అభిప్రాయాలను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేశారని, కానీ తాము వారి మాట వినలేదని అన్నారు. డెహ్రాడూన్ చుట్టూ ప్రవహించే పన్నెండు నదులు, దట్టమైన సాల్ అడవుల కారణంగా ఎండాకాలం కూడా చల్లగా ఉంటుందని భారత్ జ్ఞాన్ విజ్ఞాన్ సమితికి చెందిన విజయ్ భట్ తెలిపారు. అయితే అభివృద్ధి పేరుతో మొదట ఇక్కడి నదులను ఏ మాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా నాశనం చేసి ఇప్పుడు అడవులను ఒక్కొక్కటిగా నిర్మూలిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని, వ్యతిరేకిస్తామని చెప్పారు.

ఖలంగా అడవులు లేకపోతే తాను నేడు ఈ స్థితిలో ఉండగలిగేదానిని కాదని నిరసనలో పాల్గొన్న క్రీడాకారిణి,  పర్వతారోహకురాలు జ్యోత్స్నా రావత్ అన్నారు. నలపాణి నుంచి ఖలంగా స్మారకచిహ్నం వరకు  మండే వేసవి కాలంలో కూడా దట్టమైన సాల్ చెట్ల మధ్య పగటిపూట ఎక్కి దిగడం సాధ్యమైంది అని అన్నారు. హిమాలయాలకు సమీపంలో ఉన్నందున గ్లోబల్ వార్మింగ్ దృష్టి నుండి ఉత్తరాఖండ్ చాలా సున్నితంగా ఉంటుందని, అందువల్ల ఈ ప్రాంతంలో ప్రాణాలను రక్షించాలంటే అడవులను రక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు.

“డెహ్రాడూన్లో ఏటా వేడి ఎక్కువైపోతోంది.  గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ల దాకా నమోదైంది. ఇప్పుడు డెహ్రాడూన్,  ఢిల్లీల వాతావరణంలో పెద్దగా తేడా లేదు.  అభివృద్ధి పేరుతో డెహ్రాడూన్ను నాశనం చేయడం వల్ల ఇలా జరుగుతోంది. అడవులు నరికేస్తున్నారు, కాల్వలు పూడ్చేస్తున్నారు, నదులను కాలువలుగా మార్చేస్తున్నారు” అని డీఏవీ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ పూర్వ ఉపాధ్యక్షురాలు సోనాలి నేగి అన్నారు.

కొండప్రాంతాల నుంచి జరుగుతున్న నిరంతర వలసల కారణంగా డెహ్రాడూన్ మీద భారం పడుతుందని, అధికమవుతున్న  జనాభాకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు  వనరుల కొరత ఏర్పడుతోంది అని డూన్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి పియూష్ శర్మ తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి కొత్త మార్గాలను రూపొందించాల్సిన అవసరం ఉంది.  ఈ నిరసన ప్రదర్శనలో డజనుకు పైగా సంస్థలతో పాటు యువత, కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిటిజన్ ఫర్ గ్రీన్ డూన్, భారత్ జ్ఞాన్ విజ్ఞాన్ సమితి, ఎస్ఎఫ్ఐ, ఉత్తరాఖండ్ ఇన్సానియత్ మంచ్, ప్రౌడ్ పహారీ సొసైటీ, సిఎఫ్జిడి, డిపిపిసి, నేచర్స్ బడ్డీ తదితర ప్రముఖ సంస్థలు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాయి.

ఖలంగా అడవులను నరకకూడదు అని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే వరకు ప్రతి ఆదివారం ఉదయం ఖలంగాకు చేరుకుని తమ నిరసనను నమోదు చేయాలని  సమావేశంలో నిర్ణయించారు. అయితే, నేటి కార్యక్రమానికి నిరసనకు బదులుగా జ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమం అని పేరు పెట్టారు. ప్రతిసారీ గతంలో కంటే ఎక్కువ మంది ఖలంగా చేరేలా కృషి చేయాలని, తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు. ఆశారోడి, సహస్రధారలలో నిరసనలు కొనసాగుతున్నంత కాలం ప్రభుత్వం మౌనం వహించిందని, నిరసనల బలం తగ్గిన వెంటనే, చెట్లను నరికేసిందని,  ఖలంగా విషయంలో అలాంటి అవకాశం యివ్వకూడదని అన్నారు.

ఖలంగాలో నిర్వహించే ప్రదర్శనకు సంబంధించి సోషల్ మీడియాలో పలు పోస్టులు వచ్చిన ఫలితంగా ‘హర్ హర్ మహదేవ్, భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేస్తూ 25-30 మందితో కూడిన గుంపు అక్కడికి చేరుకుంది. చెట్ల నరికివేతను వ్యతిరేకించే వారి సమావేశం జరుగుతున్న ప్రదేశానికి ఆనుకుని వున్న చిన్న గుడి బయట కూర్చుని  భజన చేయడం ప్రారంభించింది. వారిలో కొందరు సమావేశానికి అంతరాయం కలిగించే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే వారితో ఎలాంటి చర్చకు దిగకుండా పర్యావరణ మద్దతుదారులు తమ సమావేశ స్థలాన్ని మార్చి అక్కడికి కొంత దూరంలో సభ నిర్వహించారు.

{గ్లోబల్ వార్మింగ్ – శిలాజ ఇంధనాలను కాల్చడం, అడవులన నరికివేత,  పశువుల పెంపకం మొదలైనవి వాతావరణాన్ని,  భూమి ఉష్ణోగ్రతను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి.  వాతావరణంలో సహజంగా సంభవించే వాటికి అపారమైన మొత్తంలో గ్రీన్‍హౌస్ వాయువులను జోడిస్తుంది. (ఒక గ్రహంపై ఉన్న వాతావరణం వెలువరచే రేడియేషన్ కారణంగా గ్రహ ఉపరితలంపై పెరిగే ఉష్ణోగ్రత, ఈ వాతావరణం లేనప్పుడు పెరిగే ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటే దాన్ని గ్రీన్‍హౌస్ ప్రభావం అంటారు. గ్రీన్‍హౌస్ వాయువు సూర్యకిరణాలు భూమి ఉపరితలాన్ని వేడెక్కేలా చేస్తాయి, ఆ వేడిని అంతరిక్షంలోకి వెళ్లకుండా చేస్తాయి. ప్రత్యేకించి, ఈ వాయువులు భూ వాతావరణంలో సూర్యుని నుండి  పరారుణ వికిరణాన్ని గ్రహించి విడుదల చేస్తాయి. వాతావరణంలోకి చొచ్చుకుపోయిన సూర్యుడి వేడితో పాటు విడుదలైన కొంత వేడి భూమికి చేరుతుంది.)  గ్రీన్‍హౌస్ ప్రభావం  గ్లోబల్ వార్మింగ్‍ను పెంచుతుంది}

19 మే  2024

‌https://janchowk.com/pahlapanna/dehradun-youth-again-came-down-to-save-the-forest-deshbhakt-tola-also-reached-khalanga-to-create-obstacles/

One thought on “ఉత్తరాఖండ్‌లో ఖలంగా అడవి కోసం యువత, అడ్డుకున్న “దేశ భక్త” గుంపు

Leave a Reply