1 ఏనాడైనా చూసావా

ఎర్రగా మారుతున్న
అడవిని ఏనాడైనా చూసావా !
ఏరులై పారుతున్న
నెత్తుటి కాల్వల్లో ఏనాడైనా తడిసావా!
గుండెల్లోకి దూసుకు వచ్చిన
తుపాకీ గుండును ఏనాడైనా తాకావా!

నిన్ను నీవు ప్రేమించుకున్నంత స్వచ్ఛంగా
ఈ భూమిని ఎప్పుడైనా ప్రేమించావా!
ఆదివాసీ పల్లెల్లో కాలుతున్న
మానవత్వాన్ని ఒక్కసారైనా కావలించావా!
మట్టిని మనసుగా పరుచుకున్నోళ్ళ
గుండెదడను ఎక్కడైనా ఆలకించావా!
స్వదేశంలో యుద్దానికై వెనుకాడని
విప్లవ వీరుల్ని ఏనాడైనా కలిశావా!

అయితే నడువు...
నేలకు ఒరిగిన
నెత్తుటి ముద్దలను ముద్దాడడానికి!
అమరత్వం ఎంత గొప్పదో
చాటి చెప్పడానికి!
వాళ్లు నడిచిన బాటలలో
ధైర్యాన్ని వెలిగిస్తూ నడువు
మరో ఉదయాన్ని వెతుక్కుంటూ.




2 అమరత్వం

దేశం నీదైతేనేం నాదైతేనేం
అది గాజాయితేనేం
భారతదేశమైతేనేం
ఫాసిజం ఎంత క్రూరమైందో
చెప్పటానికి నువ్వైతేనేం నేనైతేనేం

ఏ రాజకీయమైతేనేం
ఏ ఇల్లయితేనేం ఏ దేశమైతేనేం
బట్టబయలు చేయడానికి
నువ్వైతేనేం నేనైతేనేం

కాషాయమైతేనేం
గోవు పాలుయితేనేం
గొడ్డు మాంసమయితేనేం
చావు ఎంత ఘోరమైందో
తెలిపే ఆకలి కేక నీదైతేనేం నాదైతేనేం

పెన్నులయితేనేం గన్నులయితేనేం
లోపలయితేనేం బయటయితేనేం
అమరత్వం ఎంత రమణీయమైందో
వర్ణించడానికి నువ్వైతేనేం నేనైతేనేం

కావ్యమైతేనేం గేయమైతేనేం
బందిఖానైతేనేం పోరాట రంగమైతేనేం
ప్రశ్న ఎంత ధిక్కారమైనదో
నినాదించడానికి నువ్వైతేనేం నేనైతేనేం

అంతిమ యుద్ధం నీదైతేనేం నాదైతేనేం
అమరత్వం నీదైతేనేం నాదైతేనేం
శాంతి ఎంత స్వచ్ఛమైందో
ఆ నవ్వులు పంచడానికి
నువ్వైతేనేం నేనైతేనేం.

Leave a Reply