మిత్రులారా

మీ అందరికీ పాలమూరు అధ్యయన వేదిక పక్షాన స్వాగతం ! భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశ స్థాయిని అందుకోబోతున్నది ఎంత నిజమో ప్రపంచంలో అత్యధిక నిరుద్యోగులున్న దేశం అనేది కూడా ఆ స్థాయి నిజం. అయితే నిరుద్యోగ సమస్య నివారణకు ప్రభుత్వాలు, విధానకర్తలు ఏమీ చేయటం లేదు అనేది అంతకన్నా కఠినమైన నిజం. గత యుపిఎ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను గాలికి వదిలేసిందని మేం అధికారంలోకి వస్తే దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన ఎన్‌.డి.ఎ పాలకులు ఆ విషయాన్ని వదిలేశారు.

అలాగే 1994 నుండి మొదలైన మలిదశ తెలంగాణ పోరాటం నియామకాల సమస్యను తీవ్రంగా చర్చకు తెచ్చింది. తనను తాను ఉద్యమ పార్టీగా ప్రకటించుకున్న తెరాస పార్టీ వారు ఇంటికో ఉద్యోగం అని ప్రకటించి యువతరానికి ఎన్నో ఆశలు కల్పించారు. అధికారం చేతికి వచ్చిన తరువాత తెరాస పార్టీ ఆ విషయాన్ని వదిలేసింది. తెలంగాణ అస్మితను వదిలేసింది. దేశంలో ప్రస్తుతం అమలవుతున్న రాజకీయార్థిక విధానాలు ఉద్యోగాల కల్పనకు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి. ఒక్క అధికార రాజకీయ పార్టీ కూడా సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ విధానాల వల్ల కార్పొరేట్‌ శక్తులే బలపడుతున్నాయని ఆలోచించటం లేదు. ఈ విధానాలు పేద, మధ్య తరగతి శ్రామిక ప్రజానీకానికి వ్యతిరేకంగా ఒక భావజాలాన్ని వ్యవస్థీకృతం చేశాయి. ఎవరు ఈ విధానాలకు భావజాలానికి ఎర అవుతున్నారో వారే ఈ విధానాలను వాస్తవం అని నమ్మే పరిస్థితి, గొప్పగా ప్రచారం చేసే పరిస్థితినీ కల్పించారు. సహజ హక్కులను, రాజ్యాంగం గ్యారంటీ చేసిన హక్కులను సైతం దెబ్బతీస్తూ మనుషులకి కేవలం బాధ్యతలే వుంటాయి అనే పాలకపక్ష చైతన్యాన్ని పెంచి పెద్ద చేశారు. ఎమర్జెన్సీ తరువాత ఈ విపరిణామాలు క్రమంగా పెరిగి పెద్దయినాయి. ఇవాళ యువత అంటే పని గంటలు, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత వంటివేవీ ఆలోచించకుండా ప్రయివేటు రంగానికి రెక్కలు ముక్కలు చేసుకునేవారు అని చెప్పకోవలసిన స్ధితి కల్పించారు.

ప్రభుత్వాలు తొలుత విద్యారంగం మీద తమ దాడిని ఎక్కుపెట్టారు. సమాజంలో చదువుకునే కాంక్ష పెరిగి అన్ని ప్రతిబంధకాలను తట్టుకుని ఎదిరించి పేద, అణగారిన కుటుంబాలనించి స్త్రీలు, ఆదివాసులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు బడి ముఖం చూసేందుకు వస్తున్న సమయానికి విద్యారంగంలో ప్రైవేటీకరణ ఊడలుదించారు. ప్రైవేటురంగం మెరుగైందని ప్రభుత్వరంగం దండుగ మారిదని ప్రభుత్వమే పనిగట్టుకొని ప్రచారం చేయటమే కాక పబ్లిక్‌ సెక్ట్రార్‌ను బలిచేస్తూ వచ్చింది. ఈ క్రమం ప్రాథమిక పాఠశాల నుండి విశ్వవిద్యాలయాల దాకా విస్తరించింది. పిల్లలు ఏ స్థాయిదాకా చదువుకుంటూ వస్తే ఆ స్థాయిదాకా పబ్లిక్‌ సెక్టార్‌లో అన్ని ఖాళీలే దర్శనమిచ్చే పరిస్థితి కల్పించింది. పబ్లిక్‌ సెక్టార్‌ ద్వారా ప్రజలకు అందవలసిన సేవలన్నింటినీ ప్రయివేట్  దళారీ వ్యాపారులకు అమ్ముకోవటానికి వేదిలేసింది. ప్రభుత్వం అనేది కేవలం ్రైవేటురంగ ఫెసిలిటేటర్‌గా మిగిలిపోయింది. ఎల్‌పిజి అమలులో కలుగుతున్న దుష్పరిణామాలన్నీ శ్రామిక ప్రజానీకం అనుభవిస్తున్నది.

ఈ విపరిణామాల మీద వచ్చిన ఆందోళనల ఫలితంగానే ప్రభుత్వాలు అందరికి నాణ్యమైన సమాన అవకాశాలు అని కాకుండా పేద పసిపిల్లలను సైతం విభజించి కొద్దిమందికి ప్రత్యేక సౌకర్యాలతో వసతులు కల్పించి మెజారిటీ పిల్లలకి, నాణ్యమైన విద్య పొందలేనిదుస్థితి కల్పించాయి. ఇది అన్ని స్థాయిలకు, అన్ని జీవనరంగాలకు విస్తరించింది. పబ్లిక్‌ సెక్టార్‌ ఎంత కాదన్నా హక్కులకు, భద్రతకు, భవిష్యత్తుకు బాధ్యత పడవలసి వస్తుంది కనుక, ఇది ప్రైవేటురంగానికి కుదురదని పబ్లిక్‌ సెక్టార్‌ను కుదించటమే కాక కాంట్రాక్ట్‌, బెట్‌ సోర్సింగ్‌ విధానాలు ముందుకు తెచ్చారు. ఇదేమిటని ప్రశ్నించే అవకాశం లేకుండా నిర్బంధ చట్టాలు తెచ్చారు.

ఎల్‌పిజి విస్తరణ కోసం అభివృద్ధి పేరిట అమలుపరుస్తూ వచ్చిన విధానాలు నిర్వాసిత సమస్యను తీవ్రం చేశాయి. ఒక వైపు సహజవనరుల దురాక్రమణ, ఇంకోవైపు అభివృద్ధి ప్రైవేటీకరణ విధానాలు యువతను స్వతంత్ర వలసకు ప్రేరేపించాయి .

సమాజం తీవ సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ సంక్షోభాన్ని ప్రభుత్వాలు సంక్షేమం పేరిట, ఆసరా పేరిట కొన్ని పథకాలతో నెట్టుకురాజూస్తున్నాయి. అరకొర చదువులతో అందని చదువులతో ఎదిగిన యువత బతకటం కోసం, కుటుంబాల్ని బతికించటం కోసం పన్నెండేసి గంటలు ఇంకా ఓవర్‌ సమయాలు కష్టపడవలసి వస్తున్నది. ఇంటా బయటా చాలా అవమానకరమైన పరిస్థితులలో బతుకునెట్టుకురావలసి వస్తున్నది.

 ఈ కాలంలో యువజనశక్తి తమ భవిష్యదాకాంక్షలతో నాయకత్వ శక్తిగా ఎదిగివచ్చే అవకాశాలను కూడా ప్రభుత్వాలు పనిగట్టుకొని దెబ్బతీశాయి. పాఠశాలలు, కళాశాలల నుండి విశ్వవిద్యాలయాల దాకా విద్యా సంస్థలలో ఎన్నికలు నిషేధించి, విద్యార్థి యువజన ఉద్యమాలు కేవలం అధికార రాజకీయ పార్టీల చెప్పు చేతలలో మసలుకోవలసిన పరిస్థితులు కల్పించారు. సమాజ భవిష్యత్తు కోసం గొప్ప స్వప్నాలు దర్శించే యువత తమ కోసం తాము నిలబడలేని దయనీయమైన పరిస్థితులు కల్పించారు. ఏ సందర్భం, ఏ ఉద్యమం ఏమంచిని సాధించగలదో అని ఎంతో ఉద్వేగంతో ఆందోళనతో ఉన్న యువతరాన్ని మనం చూస్తున్నాం.

వ్యవసాయంలో యువరైతులు, విద్యా సంస్థలలో విద్యార్థులు, నిరుద్యోగం, చిరుద్యోగం కారణంగా యువతరం చివరికి తెలంగాణ ఉద్యమంలో యువత బలిదానాలు మనం చూశాం. చూస్తున్నాం. ఇటు సమాజపు బాల్యానికి అటు సమాజపు వృద్దాప్యానికి తోడు నిలిచి దేశాన్ని ముందుకు నడిపించవలసిన యువతను ఇంతటి సంక్షోభంలోకి నెట్టటం ఆయా కుటుంబాలకు మాత్రమే కాదు. దేశ భవిష్యత్తుకు కూడా ఎంత మాత్రమూ మంచిది కాదు. ఈ సంక్షోభాన్ని అరకొర ఆసరా పథకాలతో అధిగమించలేము.

 ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేంద్రంగానీ తెలంగాణ ఉద్యమకాలమంతా ఇంటికో ఉద్యోగం అన్న రాష్ట్రం కానీ ఉద్యోగాలు ఇవ్వకపోవటం వల్ల సమస్య చాలా తీవ్రమైంది. అడుగుడునా పోటీ పరీక్షలు యువతను న్యూనతకు నెడుతున్నాయి.

ఇండ్లలో చదువుకునే వసతులు లేవు. స్థానికంగా గ్రంథాలయాలు, విద్యా కేంద్రాలు లేవు. నగరానికి చేరి ఆర్థిక భారం మోసి కష్టపడి అప్పుల పాలై చదువుకుంటే తీరా ప్రశ్నాపత్రాల లీకేజీల సమస్య చుట్టుకుంటున్నది. ప్రశ్నాపత్రాలు, ఉద్యోగాలు ఎవరికి అమ్ముకుంటారో, ఇచ్చుకుంటారో ఏలినవారి ఇష్టారాజ్యం నడుస్తున్నది. రిజర్వేషన్లతో ఉద్యోగావకాశాలు అని ఎంత ఊదరగొట్టినా ప్రయివే టీకరణ రిజర్వేషన్లను నిరాకరించింది. పబ్లిక్‌ సెక్టార్‌ను కుదించారు. దీనికి తోడు చదువులు ఉద్యోగాలకు కాదు అని పాలకవర్గాలు పాలకవర్గ మేధావులు, చివరికి చదువుకుని పై స్థాయి, మధ్య స్థాయి ఉద్యోగాలు చేసేవారు చేసిన ప్రచారం కూడా తక్కువేం కాదు. చదువుకుని సహజ వనరులు లేక ఉన్నవి కోల్పోయి, ఉద్యోగాలు కూడాలేక యువత ఏం చేయాలి?

 నిరుద్యోగం కేవలం నిరుద్యోగ యువత సమస్య కాదు. వారికి విద్య వుందా, నైపుణ్యం వుందా అనే చిన్నచూపు సమస్య కూడా కాదు. నేడు అమృతోత్సవం జరుపుకుంటున్న దేశంలో యువత విద్య లేకుండా నైపుణ్యం లేకుండా వుంటే ఆ బాధ్యత ప్రధానంగా ప్రభుత్వాలది కాదా? దేశాన్ని ప్రయివేట్  రంగానికి అర్చిస్తున్న ప్రభుత్వాలు యువత కోసం ఏం చేస్తున్నాయి? ఈ ప్రశ్న కేవలం నిరుద్యోగ యువకులు అడగవలసిన ప్రశ్న మాత్రమేనా? సమాజం నిస్తేజంగా వుండదవలసిందేనా? ఉద్యోగానికి ఉద్యోగ భద్రతకు, పనిగంటల పరిమితికి గౌరవప్రద జీవనానికి అవసరమైన వేతనాలకు వ్యతిరేకంగా తాము చేసే చర్చ ఎవరి ప్రయోజనాలు కాపాడుతుంది అనే ఎరుక లేకుండా ఒక ప్రతికూల భావజాల నిర్మాణ చర్చ చేసిన వారందరూ యువతను పనికి మాలిన వారుగా తిట్టుకుంటూ కూర్చుంటారా? ప్రభుత్వాలు ఉద్యోగానికి అర్హమైన వయోపరిమితి పెంచుతూ పోతుంటే సంబరపడిపోతారా? ఈ ప్రశ్నలు సమాజం వేసుకోవాలి కదా! తమ పిల్లలు స్థిరపడిన తల్లిదండ్రులకు కూడా సామాజిక బాధ్యత ఉంటుంది కదా!

గ్రామాలలో ప్రభుత్వ విధానాల వల్ల వృత్తులు, సేద్యం, ఉపాధి అవకాశాలు కూలిపోతుంటే ఒక ప్రత్యామ్నాయంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టం చేయాలని సమాజం పోరాడింది. చట్టం సాధించింది. ఇపుడు అమలులో ఈ ప్రభుత్వాలు ఆ చట్టాన్ని దెబ్బతీస్తున్నప్పటికీ ఆ చట్టం వల్ల కొంతలో కొంతైనా నిరుపేదలకు పని దొరుకుతున్నది. పట్టణాల సమీపంలోని కొన్ని పల్లెలను కలుపుతూ మేజర్‌ గ్రామ పంచాయితీలను మున్సిపాలిటీలుగా మార్చిన గ్రామాలలో పనులు దొరకటం లేదు. ఈ దృష్టా పట్టణ ఉపాధి హామీ చట్టం కోసం డిమాండ్‌ పెరుగుతున్నది. దీనికి సమాజపు సమర్ధన అవసరం.

యువత భవిష్యత్తు రీత్యా, ప్రభుత్వాల జవాబ్బారీ కోసం ఉద్యోగ హక్కు చట్టం అవసరమని మేం నమ్ముతున్నాం. ఈ విషయాన్ని అన్ని పార్టీలు సంఘాలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు చర్చించాలని తమ కార్యాచరణలో భాగం చేసుకోవాలని కోరుతున్నాం.

పై మూడు చట్టాలను రాజ్యాంగబద్దం చేయటం ద్వారా ప్రజలు ప్రభుత్వాల దయా ధర్మాలతో కాకుండా గౌరవప్రదంగా జీవించే హక్షును సాధించుకుందామని కోరుతున్నాం. అందుకు ఒక్క ముందుడుగు పడినా ఈ సమావేశం ఫలప్రదమైనట్టేనని అభిప్రాయపడుతూ మీ స్పందనను ఆహ్వానిస్తున్నాం.

 (25 ఏప్రిల్ న   హైదరాబాద్‌లో జరిగిన రౌన్డ్ టేబుల్ సమావేశానికి రాసిన కి నోట్ – వసంతమేఘం టీం )

Leave a Reply