మోడీ ప్రభుత్వం పార్లమెంటుతో, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండానే నిస్సిగ్గుగా తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కొరకే చట్టాలు చేస్తోంది. సమకాలీన రాజకీయాలు ప్రజలను, పార్లమెంటును విస్మరిస్తున్నాయి. నవంబర్ 26 నుంచి శీతకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నప్పటికీ, ఆ సమావేశాల ప్రారంభానికి పది రోజుల ముందే సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ చట్టం 2003, ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎష్టాబ్లిష్మెంట్ చట్టం 1941ల సవరణలతో నవంబర్ 15న ఇడి, సిబిఐ డైరెక్టర్ల గరిష్ట పదవి కాలాన్ని ఐదేళ్లకు పెంచుతూ రెండు ఆర్డినెన్సులు జారీ చేయించవలసిన అవసరం ఏమొచ్చింది? ఏ అత్యవసర ప్రజా సమస్య పరిష్కారం కోసమమని లేదా ఏ రాజ్యాంగ ధర్మపాలన కోసమని? ఈ ఆర్డినెన్స్‌లు ఎందుకనే ప్రశ్నలిప్పుడు జాతినంతటినీ వేధిస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి)ల అధినేతల పదవీ కాలాన్ని రెండేళ్ల నుంచి ఐదేళ్లకు పొడిగిస్తూ హడావిడిగా ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేశారు. ప్రజాప్రాతినిధ్య మందిరానికి ముఖం చాటేసి, రాష్ట్రపతి భవన్‌ను ఎందుకు ఆశ్రయించారు? అనేది సమాధానం దొరకని ప్రశ్న.
సిబిఐ, ఇడిల అధిపతుల పదవీ కాలాన్ని పొడిగించవలసిన అవసరం ఎందుకు కలిగిందో దేశ ప్రజలకు పార్లమెంటు ముఖంగా వివరించవలసిన బాధ్యత పాలకులపై ఉంది. ఈ రెండూ దేశ అత్యున్నత నేర పరిశోధక సంస్థలు… హత్యలు, అధికార దుర్వినియోగాలు, కుట్రలు, ఘాతుకాలు, ఆర్థిక ఆకృత్యాలు వంటి అమిత ప్రాధాన్యం గల నేరాలపై నిష్పాక్షికంగా, రాజ్యాంగ చట్టబద్ధంగా పరిశోధన జరిపి నేర నిర్ధారణ చేసి అసలు నేరస్థులను చట్టానికి అప్పగించే గురుతర బాధ్యతను కలిగి ఉన్నాయి. పార్లమెంటులో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిచ్చుకోలేక ఆ పరిస్థితి ప్రజల దృష్టిలో పడి పలచనైపోతామనే భయం వల్లనే దొడ్డిదారిలో ఈ కీలక సంస్థల అధిపతుల పదవీ కాలాన్ని నేరుగా తమ ఇష్టానుసారం పెంచుకొనిపోయే అధికారాన్ని పాలకులు ఈ ఆర్డినెన్స్‌ల ద్వారా చేజిక్కించుకున్నారు. ఆర్డినెన్సులను నవంబర్ 14 నాడు జారీ చేయించిన కేంద్ర ప్రభుత్వం అవి నిరాటంకంగా వెంటనే అమల్లోకి వచ్చేలా చేయడానికి వీలుగా మరునాడే అందుకు సంబంధించిన సర్వీసు నిబంధనలను కూడా సవరింపజేసింది.
మోడీ ప్రభుత్వం నవంబర్ 16న 1922 నాటి ఫండమెంటల్ రూల్స్‌లో తగిన మార్పులు తీసుకొచ్చింది. (ఇడి) సేవా నిబంధనలను నిర్దేశించే సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ చట్టాన్ని, సిబిఐకి సంబంధించిన ఢల్లీి పోలీస్ స్పెషల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని ఆదరాబాదరాగా సవరింపజేసింది. ఇడి, సిబిఐ డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్లకు పెంచుతూ చేసిన అత్యవసర ఉత్తర్వులను (ఆర్డినెన్స్‌లు) ప్రతిపక్షాలు, పౌర సమాజం తప్పు పడుతోంది. విపక్షాలను వేటాడటానికి, వేదించడానికి మోడీ ప్రభుత్వం ఇడి, సిబిఐ అధిపతులకు స్వపక్ష హోదా ఇచ్చిందని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. అందువల్ల ప్రతిపక్షాలు న్యాయస్థానాల్లో దీనిని సవాలు చేయనిదే మోడీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణులకు అడ్డుకట్టవేయలేమని భావిస్తున్నాయి. ఏడాదికొకసారి చొప్పున మూడుసార్లు గడువు పొడిగించుకొనేందుకు ఈ ఆర్డినెన్సుల ద్వారా పాలకులకు అవకాశం ఏర్పడిరది. ఈ సంస్థలకు అధిపతులుగా ఉంటున్నవారిని తమ నియంత్రణలో పెట్టుకోవడానికి ప్రభుత్వం దీనిని తాయిలంలాగా వాడబోతున్నదనీ, ప్రతిపక్ష నాయకులను ఎంతగా వేధిస్తే అన్ని ఎక్స్ టెన్షన్లు పొందవచ్చునని కేంద్రం ఊరిస్తున్నదని విపక్షాల విమర్శ.
ఈ సంస్థల అధిపతుల ఉద్యోగ కాలాన్ని పెంచడం దేశ ప్రయోజనాల రీత్యా అవసరమన్న బిజెపి నాయకుల వాదనే నిజమనుకుంటే పార్లమెంటులో చర్చించి ఆచట్ట సవరణలేవో చేస్తే సరిపోయేది. కానీ, శీతాకాల సమావేశాలు మరో పది రోజుల్లో మొదలుకాబోతున్న తరుణంలో ఈ ఆర్డినెన్సు దారి ఎంచుకోవడానికి కారణం నవంబర్ 17తో పదవి ముగియనున్న ఇడి డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రాను కాపాడుకురావడంతో పాటు ఇంకా ఎన్నెన్నో దురుద్దేశాలున్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆర్డినెన్సులు చేయాల్సింది అసాధారణ పరిస్థితుల్లోనే అని సుప్రీంకోర్టు చెబితే, దాని శాసనాలను, ఆదేశాలను తిరగదోడడానికి కూడా పాలకులు అదే మార్గాన్ని ఎంచుకొని న్యాయ వ్యవస్థను అవమానిస్తున్నారు.
కేంద్ర నేర పరిశోధన సంస్థలు, దేశ అత్యున్నత దర్యాప్తు వ్యవస్థలైన (సిబిఐ) ఆదాయ పన్నుశాఖ (ఐటి), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి)లను కీలక సమయాల్లో స్వప్రయోజనాల కోసం రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించిన చరిత్ర కేంద్రంలోని బిజెపి పాలకులకు విశేషంగా ఉంది. ఇటీవలి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ఏప్రిల్ 2వ తేదీన ఆ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ కుమార్తె సెంతమరాయ్ నివాసంలో ఆదాయ పన్ను శాఖ దాడులు జరిపింది. ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారన్న ఫిర్యాదులను పురస్కరించుకొని దాడులు జరిపినట్టు చెప్పారు. అలాగే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు నెల రోజుల్లో జరుగనున్నాయనగా గత ఫిబ్రవరి 1న తృణమూల్ కాంగ్రెస్ ఎంపి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సన్నిహిత బంధువు అభిషేక్ బెనర్జీ ఇంటిపై సిబిఐ దాడి జరిగింది. అంతకు ఏడాది ముందరి బగ్గు దొంగతనం కేసులో బెనర్జీ భార్యను, వదినను ప్రశ్నించడానికి సిబిఐ తమ కస్టడీకి తీసుకు వెళ్లింది.
2019 సెప్టెంబర్ మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నెలరోజుల ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, ఆయన బంధువు అజిత్ పవార్లపై మహారాష్ట్ర రాష్ట్ర సహకార బ్యాంకు కేసుకు సంబంధించి ఇడి మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఎన్నికలకు ముందు ప్రతిసారి రాజకీయ ప్రత్యర్థులను అప్రతిష్ఠ పాలు చేయడానికి, లంగదీసుకోడానికి ఇడి, ఐటి, సిబిఐలను వారిపై ఉసిగొల్పడం, గిట్టనివారిని రాచిరంపాన పెట్టడానికి దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తున్న నేపథ్యం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవలసి ఉంది. సిబిఐల, ఇడిల అధిపతులు ఈ విధంగా కేంద్ర పాలకుల స్వప్రయోజనాలను సాధించి పెట్టే ఏజెన్సీలుగా మారిన తర్వాత వారి పదవీ కాలాన్ని దొడ్డిదారిలో పొడిగిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్సులు ఎంత అపవిత్రమైనవో, అప్రజాస్వామికమైనవో వివరించనక్కరలేదు.
ఇడి డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా ఈ పదవిలో కొనసాగినంత వరకు కొనసాగిన చరిత్ర నిర్మలమైనదైతే కాదు. ఇండియన్ రెవెన్యూ(ఐఆర్ఎస్) సర్వీసుకు చెందిన సంజయ్ కుమార్ మిశ్రా 2018 నవ్బర్ 19న రెండేళ్ల పదవీ కాలానికి ఇడి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ పదవీ కాలం ముగిసిన తర్వాత నియామక పత్రంలో మార్పులు చేసి మరో ఏడాది పాటు ఆయనకు అందులో కొనసాగే అవకాశం కల్పించారు. ఆ మార్పులను సుప్రీంకోర్టులో సవాలు చేయగా మూడేళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత అంటే నవంబర్ 17వ తేదీ తర్వాత ఆయనను ఇడి డైరెక్టర్‌గా కొనసాగనివ్వరాదని సుప్రీమ్ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అందుకు విరుద్ధంగా ఇప్పటికే వయసు మీరిపోయిన ఆయనకు మరికొంత కాలం పొడిగింపును ఇవ్వాలని ఈ ఆర్డినెన్స్‌లు తీసుకు వచ్చినట్టు స్పష్టమవుతున్నది.
నిజానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో శక్తివంతమైన స్వతంత్ర దర్యాప్తు సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్ను దన్నుగా నిలువాలి. గావి కింది పంది కొక్కులను బయటకు లాక్కు రావాలి. వలస పాలన కాలంలో ప్రత్యేక పోలీసు వ్యవస్థగా (1941) పురుడు పోసుకున్న ఇరవై రెండేళ్లకు (1963) సిబిఐగా పేరు మార్చుకుంది. శ్రద్ధ, నిష్పక్షపాతం, న్యాయవర్తన అనే మూడు నినాదాల పునాదులపై దేశ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యతను రాజ్యాంగపరంగా వీటికి అప్పగించారు. దేశీయంగానో, అంతర్జాతీయంగానో దేశప్రయోజనాలకు విరుద్ధంగా జరిగే కుట్రలను, కుహనాలను విచారించి దోషులను గుర్తించి శిక్షలు వేయించాలి. ఇక ఇడి సహితం దేశంలో జరిగే అవినీతిని, అక్రమార్జనను తుదముట్టించే ప్రధాన లక్ష్యంతో విధులు నిర్వహించాలి.
రాజకీయ ప్రముఖులతో, పాకిస్తాన్ జిహాదీ తీవ్రవాదులతో, ఉన్నత అధికారులతో సంబంధమున్న(మనీలాండరింగ్) జైన్ హవాలా కేసులో ఉద్దేశపూర్వక జాప్యం జరుగుతన్న నేపథ్యంలో భారత రాజ్యాంగంలోని అర్టికల్ 32 ప్రకారం హవాలా కుంభకోణంపై సరైనా విచారణ జరిగేలా కోరుతూ అవినీతి వ్యతిరేక కార్యకర్త(విజిల్ బ్లోయర్), ప్రముఖ జర్నలిస్టు వినీత్ నరైన్ సుప్రీంకోర్టులో దాఖల్ చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) సందర్భంగానే సిబిఐ పనితీరు బండారం బయటపడి తీవ్ర విమర్శలకు గురైంది. హవాలా కుంభకోణం కేసు(1991)లో జైన్ డైరీలో దొరికిన సమాచారం ద్వారా రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు, నేరస్థులకు మధ్య ఉన్న చీకటి సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమాలను వెలికి తీయకుండా ఉన్నతస్థాయి వ్యవస్థల గొంతులను ఎలా నొక్కుతున్నారో, వాటిని స్వప్రయోజనాల కోసం ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఆనాడే బయటపడిరది. నేరస్థులను విచారించడంతో విఫలమైన సిబిఐ, ఇతర దర్యాప్తు సంస్థల స్వయం ప్రతిపత్తిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
వినీత్ నరైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (జైన్ హవాల కేసు)గా ప్రసిద్ధి చెందిన కేసు విచారణ సమయంలో విచారణ సంస్థల రక్షణ కోసం, అధికార దుర్వినియోగాన్ని నిరోధించడానికి చట్టబద్ధపాలనపై విశ్వాసాన్ని పెంచడానికి కొన్ని మార్గదర్శకాలను 1997 డిసెంబర్లో విడుదల చేసింది. ఈ సంస్థల అధిపతులకు రెండేళ్ళ కనీస కాలపరిమితిని విధించింది. 2002లో హవాలా నియంత్రణ చట్టం వచ్చింది. వీటిలో భాగంగానే సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ (సివిసి) యాక్ట్-2003 వచ్చింది. అవినీతి దర్యాప్తు సంస్థలైన ఇడి, సిబిఐ వంటి సంస్థలను సివిసి పర్యవేక్షిస్తుంది. అలాగే ఇడి, సిబిఐ డైరెక్టర్ల నియామకానికి ముగ్గురితో కూడిన (ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి) ఒక కమిటీని నిర్దేశించింది. మోడీ కమిటీని పక్కన పెట్టి నియామకాలు సాగిస్తోన్నాడు.
ప్రలోభాలు, ప్రభావాలు, ఆకర్షణలకు అతీతంగా ఉండాలన్న సుప్రీంకోర్టు సదాశయాన్ని ఈ ఆర్డినెన్సులు వమ్ముచేస్తున్నాయి. ఆర్థిక చట్టాలను రక్షించడం, ఆర్థిక నేరాలను అరికట్టడం ఈ రెండు సంస్థల(సిబిఐ, ఇడి) విద్యుక్త ధర్మం. దేశ సంపదను అక్రమ మార్గాల ద్వారా లెక్క పత్రం లేకుండా విదేశాలకు తరలించుకుపోయే స్వదేశీ, విదేశీ బడా బాబులపై కొరడ ఘుళిపించడం ఇడి బాధ్యత. అయితే మన దేశంలో ఈ రెండూ సంస్థలు పాలకుల కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయి. కీలక స్థానాల్లో ఉన్న ఈ అధికారులను తమ ఆధీనంలోకి తెచ్చుకొనేందుకు ఈ చర్య పాలకులకు ఉపకరిస్తుందన్న విమర్శ కాదనలేనిది. మోడీ ్ధఅధికారంలోకి వచ్చాక సిబిఐ, ఇడిలు గతంలో కంటే ఎక్కువగా పాలకుల చేతిలో ఆయుధాలుగా మారిన విషయం తెలిసిందే. అధికారపక్ష నేతలను కాపాడుకురావడం, విపక్ష నాయకులను వేటాడటమే కర్తవ్యంగా వాటి వ్యవహారం సాగుతోన్నది.
గుట్టుచప్పుడు కాకుండా జరిగే ఆర్థిక నేరాలకు, దేశంపై జరిగే కుట్రలను కనిపెట్టి శిక్షించాల్సిన ఇడి, సిబిఐ దర్యాప్తు సంస్థలు మోడీ హయాంలో దారితప్పి రాజకీయ దుమారంలో చిక్కుకున్నాయి. తెల్లారిలేస్తే ఈ సంస్థల రోజువారి కార్యకలాపాలు మోడీ రాజకీయ ప్రయోజనాల సంరక్షనే పరమావధిగా మారి పోవడంతో అత్యున్నత విచారణ వ్యవస్థలపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. వీటి పట్ల చులకన భావం ఏర్పడిరది. జనసామాన్యంలో ఈసడిరపు భావం రేకెత్తడానికి కారణం పాలకుల మాటల్లో చేతల్లో చట్టాల పట్ల గౌరవం లేకపోవడమేనని చెప్పవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థకు రక్షణ కవచంగా పని చేయాల్సిన విచారణ సంస్థలను మోడీ తన జేబు సంస్థలుగా మార్చుకొని ఎన్నికల ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నిర్హేతుకమైన అత్యాశ, దగాకోరు ఆలోచనల వల్ల రాజ్యాంగపరమైన స్వతంత్ర వ్యవస్థలు భ్రష్టు పట్టిపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థ పతనానికి దారితీసింది. ఇది మోడీ పాసిస్టు హిందూత్వ పాలనకు పరాకాష్ట.
సిగ్గు, బిడియాలకు అతీతమైన అపరిపక్వ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్ని నీతులు వల్లెవేసినా చైతన్యం విస్తరించే సమాజంలో చెల్లుబాటు కాదని మోడీ ప్రభుత్వం ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. స్వీయానుభవాలు, ఎదురు దెబ్బలు తింటేనే పాలకులు, పార్టీలు కళ్లు తెరుస్తారు. బుద్ధి తెచ్చుకుంటారు. ఇప్పుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వ తీరు కూడ అలాగే ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరాజయాన్ని చూసి, రానున్న ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న భయంతోనే ఎట్టకేలకు సాగు చట్టాలను రద్దు చేశారు. పెట్రో ధరలను కొద్దిగా తగ్గించారు. పార్టీ ప్రతిష్ట, పరువు, ఓట్లు సహా సర్వం కోల్పోయిన తర్వాత ప్రాప్తకాలజ్ఞత పొందారు. మరి పెగాసస్ పెను భూతం, ఆర్డినెన్స్‌ల మాటేమిటి? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్న మోడీ ప్రభుత్వం విజ్ఞతతో తాను చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవాలి, లేకుంటే ప్రజల నిర్ద్వందంగా ఎన్నికల్లో తిరస్కరిస్తారు. అలా ప్రజాగ్రహనికి గురికాక తప్పదు.