ఎగరేద్దాం జెండాని
ఆగస్టు 15 ఆనవాయితీ గదా
ఎగరెయ్యాల్సిందే!
అయితే నాదో విన్నపం…
ఎవరెవరికి ఏయే సమస్యలున్నాయో
అన్నిటినీ దారంగా కట్టి
మరీ ఎగరేద్దాం!.
కష్టాల్నీ,కన్నీళ్ళనీ,
బాధల్నీ,దీనుల గాధల్నీ
జెండాకు కుట్టి మరీ ఎగరేద్దాం!
తస్మాత్ జాగ్రత్త!
జెండా ఎగరెయ్యకపోతే
NIA వాళ్ళు
మన ఇళ్ళ కొస్తారు
ఢిల్లీకి వచ్చి సంజాయిషీ ఇమ్మంటారు
ఎందుకొచ్చిన ఖర్మ?
ఎగరేద్దాం జెండాని!
75 ఏళ్ళుగా
పేదల నిట్టూర్పుల
ఉసురు పోసుకున్న
జెండాని ఎగరేద్దాం!
ఇంటింటిపై ఎగిరిన జెండాలు
ఆగస్టు 15 తర్వాత
వీథుల్లో,చెత్త కుప్పల్లో
పడి దొర్లాడుతుంటే
పాపం పింగళి వెంకయ్య
ఎక్కడున్నాడో!
ఆయన ఆత్మకు
శాంతి కలగాలని
లేని దేవుణ్ణి ప్రార్థిద్దాం!
47 లో డాలర్ కు
నాలుగు రూపాయలే
ఈనాటికి
80 రూపాయలయ్యాయని
చంక లెగరేసుకొని
ఎగరేద్దాం జెండాని!
దేశంలో ఎన్ని సవాళ్ళు!
ఎన్ని ఉరితాళ్ళు!
నోళ్ళు తెరుచుకొంటున్న
ఎన్నెన్ని జైళ్ళు!
అన్నిటినీ గానం చేస్తూ
ఎగరేద్దాం జెండాని!
ఎగిరే జెండాని చూసి
ప్రజా స్వామ్యం
విరగబడి నవ్వకముందే
మత్తు వదిలి
నిద్ర లేవకముందే
ఎగరేద్దాం జెండాని!