పొగమంచు కౌగిలిలో ఈ రోజు తెలవారింది.
నేల తన దేహాన్ని చలిపూలతో సింగారించుకుంది. నెగళ్ళ వేడిలో లోకం సెదదీరుతోంది

మనసుని మంచుగడ్డలా మార్చేసిన
ఈ శీతాకాల వేళ
నా రెప్పల మీద వెచ్చటి పెదవుల బరువుని
మోపిపోయావు
దేహం పులకరింతల పూల తపనల పలవరింతలలో
చలించిపోయింది

రేపన్నదొకటి నా ఆయుష్షులోకి దిగిఉంటే
నేనేం కోరుకోవాలి?

తల్లి ఒడిలాంటి వెచ్చదనం తెలిసిన
నీ ముద్దూ
నీ ఆలింగనం తప్ప
నీతో ఏకాంతంలో నడిచే కొన్ని అడుగులు తప్ప

భయపడకు ప్రియా
మన అడుగులు పడే  దారిలో నీకై పూలూ
నాకై ముళ్ళూ ఉంచబడ్డాయి
గాయాలనే పూలని నమ్మే నాకు
పూలు కూడా గాయం చేయగల సున్నితమైన ప్రియురాలుండడం గొప్ప బహుమానం కదూ?

కాదనే అనుకుందాం కాసేపు

ఎడారి లాంటి నా మేను మీద
క్రితం సారి నువ్వొదిలి వెళ్ళిన
కౌగిలి కుసుమం ఇంకా సుగంధాల్ని
వెదజల్లుతూనే ఉంది

ఎడారి పుష్పించందంటే
ఆ గొప్పదనం వసంతానిదే కదూ!?

బీడు మొలకెత్తిందంటే ఆ నమ్మకం
నైరుతీ తొలకరిదే కదూ!?

ఇంకేం కోరుకోవాలి నేనూ
నువ్వున్నావనే
నమ్మకం ప్రాణవాయువై
నిండుదనంతో జివజివలాడుతుంటే!?

Leave a Reply