డిసెంబర్ మాసం, చలి కాలం రాత్రి 10 గంటల సమయం. సిల్‌గేర్ గ్రామం…. చింత చెట్టు కింద మండుతున్న నెగళ్ళ చుట్టూ దాదాపు 30 మంది యువతి, యువకుల బృందం కూచుని వుంది. మంటల నుంచి వచ్చే వెలుతురు చీకటిని చీలుస్తూ, చెట్ల నీడల్లో మెరుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ప్రాంతంలో ఈ సమయంలో ఇలా సమావేశం జరగడం చాలా అసాధారణమైన విషయం. భద్రతా బలగాలు, మావోయిస్టు తిరుగుబాటుదారుల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న దారుణ, సుదీర్ఘ పోరాటానికి కేంద్రంగా ఉన్న దక్షిణ బస్తర్‌లోని అడవికి నడిబొడ్డున వున్న సిల్‌గేర్ అనేక మంది అమాయకులు ఎదురుకాల్పుల్లో చిక్కుకున్న యుద్ధ భూమి.
సాధారణంగా రాత్రి పూట కారుచీకటిలో సిల్‌గేర్ నిశ్శబ్దంగా వుంటుంది. కానీ హఠాత్తుగా చీకటిని బద్దలుకొడుతూ యువత పాడటం ప్రారంభిస్తారు. కొత్త పాట. పేరు లేదు. కానీ కోరస్‌లో వున్న పదాలు- “ఓ ఆదివాసీలారా! మేల్కొనండి!” చరణాలు పాడటం మొదలుపెడతారు. “నీ ముందే నీ అన్నను తూటాలకు గురి చేశారు. నీ ముందరే నీ యిల్లు వాకిలి గుంజుకున్నారు…” అది ఒక నిరసన గీతం.
తాత్కాలిక టార్పాలిన్ గుడారాలలో కదలిక … ఆ గాయకుల చుట్టూ అనేక మంది నిరసనకారులు వచ్చి చేరారు. వేల కిలోమీటర్ల దూరంలో, ప్రభుత్వంతో చేసిన పోరాటంలో రైతు సంఘాలు విజయం సాధించి, ఆనందోత్సాహాలతో విజయ యాత్రలలో ఇంటికి బయలుదేరారు, కానీ ఛత్తీస్‌గఢ్ లోతట్టు ప్రాంతాలలో, బస్తర్ చరిత్రలో ఇప్పటివరకూ జరగని సుదీర్ఘమైన నిరసన, గత ఏడు నెలలుగా కొనసాగుతోంది. ఈ ప్రాంతపు భయంకర, సంక్లిష్ట చరిత్ర గుర్తులన్నింటిని కలిగి ఉన్న నిరసన – భద్రతా దళాల క్యాంపు నిర్మాణ వ్యతిరేక నిరసన… నాలుగు మరణాలు… మరణించిన వారిని, నిరసనకారులను మావోయిస్టులు లేదా సానుభూతిపరులు అని పిలవడంపై కేంద్రీకృతమైన ఒక సాధారణ ప్రభుత్వ ప్రతిస్పందన… ఎలాంటి నిర్మాణాత్మక జోక్యం లేకుండా శీతాకాలంలోకి సాగిన సుదీర్ఘ ప్రతిష్టంభన.
సిల్‌గేర్ నిరసన ప్రారంభం
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్న కొత్త క్యాంపుకి వ్యతిరేకంగా సిల్‌గేర్ ప్రాంత గ్రామస్తులు మే 12న నిరసనలు ప్రారంభించారు. నాలుగు రోజులకి ఆందోళనకారుల సంఖ్య పెరిగింది. శిబిరానికి అనుమతి లేదని, ఇది నివాసితులను మరింత వేధింపులకు గురి చేస్తుందని గ్రామస్తులు అనుభవంతో చేసే వాదన. ఈ క్యాంపు కావాలని గ్రామస్థులే అడిగారని, మావోయిస్టులను తరిమికొట్టి, ఏ విధమైన అభివృద్ధిని తీసుకురావాలన్నా ఇది కీలకమని, మావోయిస్టులు తమ కేడర్‌లతో ఈ నిరసనలు చేయిస్తున్నారని భద్రతా సంస్థల వాదన.
మరిన్ని గ్రామాల ప్రజలు చేరడంతో, నిరసనకారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఐదు రోజుల తరువాత అకస్మాత్తుగా కాల్పులు జరిగాయి. సమూహంలో ఉన్న మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయని ఛత్తీస్‌గఢ్ పోలీసులు అంటే, భద్రతా బలగాలు ఏకపక్షంగా కాల్పులు జరిపాయని గ్రామస్థులు చెబుతున్నారు. ముగ్గురి మృతదేహాలను ఆస్పత్రికి తరలించగా, కొన్ని రోజుల తర్వాత, నాల్గవ వ్యక్తి, ఒక మహిళ గాయాలతో మరణించింది.
“మే 16 రాత్రి, నిరసనకారులు తమ గ్రామాలకు తిరిగి వచ్చారు, కాని మరుసటి రోజు మధ్యాహ్నం, జాగర్గుండ ఏరియా కమిటీకి చెందిన కొంతమంది, మావోయిస్టులతో సహా క్యాంపు దగ్గరికి వచ్చి కాల్పులు జరిపి శిబిరంపై దాడి చేయడంతో, భద్రతా సిబ్బంది ప్రతీకారం తీర్చుకున్నారు”అని బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందరరాజ్ పి ఘటన జరిగిన వెంటనే యిచ్చిన వివరణ. ఆ మర్నాడు, సుందర్‌రాజ్ మీడియాతో మాట్లాడుతూ” ఘటన సమయంలో మరణించిన ముగ్గురూ మావోయిస్టుల ‘ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్‌కి’ చెందినవారని, మృతులను తిమ్మాపూర్ (సుక్మా) గ్రామస్థుడు, భుమ్‌కల్ కమాండర్ ఉస్కా పాండు; చుత్వాహి గ్రామస్థుడు, DAKMS (దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్) సభ్యుడు కొవాసి వాగా; గుండెం (బీజాపూర్) గ్రామస్థుడు, మిలీషియా సభ్యుడు కుర్సం భీమ గా గుర్తించాము”అని చెప్పారు.
కానీ, మే 17న సాయుధ ఆందోళనకారుల బృందం CRPF క్యాంపును తగులబెట్టాలనే ఉద్దేశ్యంతో నిరసన కార్యక్రమాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో, కాల్పులు జరపడం తప్ప బలగాలకు వేరే మార్గం లేకుండా పోయిందనే పోలీసుల వాదనకు మద్దతు ఇచ్చే ఆధారాలు ఏవీ కనబడలేదని రెండు వారాల తర్వాత సంఘటనా స్థలాన్ని సందర్శించిన, ప్రముఖ ఆర్థికవేత్త, మానవ హక్కుల కార్యకర్త జీన్ డ్రేజ్, న్యాయవాది, కార్యకర్త బేలా భాటియాతో కూడిన ఇద్దరు సభ్యుల నిజనిర్ధారణ బృందం తెలిపింది. మే 12వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు గ్రామస్థులకు సమాచారం ఇవ్వకుండా శిబిరాన్ని ఏర్పాటు చేశారని, మర్నాడు అందుకు నిరసన తెలిపిన 40-50 మందిని బలవంతంగా చెదరగొట్టారని నివేదిక పేర్కొంది.
మే 14న ఐదు గ్రామ పంచాయతీలకు చెందిన సుమారు వెయ్యి మంది ఆదివాసీలు పెద్దఎత్తున నిరసన చేపట్టారు… క్యాంప్ ను తొలగించాలంటూ నినాదాలు చేశారు. కొన్నిసార్లు లాఠీలతో, మరి కొన్నిసార్లు “మిర్చి పటాకా” లేదా భాష్పవాయు ప్రయోగాలతో, ప్రతిరోజూ పోలీసులు వారిని చెదరగొట్టడానికి ప్రయత్నించారు. డజన్లకొద్దీ నిరసనకారులకి గాయాలయ్యాయి….స్థానికంగా దొరికే చికిత్సకోసం తమ గ్రామాలకు తిరిగి వెళ్లారు… అని ఆ కార్యకర్తలు చెప్పారు.
మే 17 నాటికి, నిరసనకారుల సంఖ్య విపరీతంగా పెరిగి, బహుశా 10,000కి చేరుకుందని, లాఠీచార్జి జరిగిన తర్వాత వారిలో కొందరు రాళ్లు రువ్వడం మొదలుపెట్టారని, జనాలను నియంత్రించేందుకు భాష్ప వాయువు, బుల్లెట్లను గాలిలోకి ప్రయోగించారని సాక్షులు చెప్పారని డ్రేజ్, భాటియాలు వివరించారు.
“ఆ సమయానికి రోడ్డుకు ఇరువైపులా బలగాలు చేరుకోవడంతో, నిరసనకారులు మధ్యలో చిక్కుకుపోయారు. వెంటనే పోలీసు కాల్పులు ప్రారంభమయ్యాయి. ముగ్గురు నిరసనకారులు అక్కడికక్కడే చనిపోయారు (వారిలో ఒకరు, తిమ్మాపురం గ్రామానికి చెందిన మురళి అనే పేరు కూడా వున్న ఉయికా పాండు, అతని వయస్సు 16 లేదా 17 సంవత్సరాలు). కనీసం ముగ్గురికి బుల్లెట్ గాయాలు అవగా, దాదాపు 40 మందికి ఏదో ఒక రకమైన గాయాలయ్యాయి” అని వారు వివరించారు.
మావోయిస్టులకు ముఖ్యమైన కారిడార్ గానూ, మావోయిస్టు కమాండర్ హిడ్మా నేతృత్వంలోని పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నంబర్ 1కి ఒక బలమైన కోటగానూ వుండడం వల్ల, బాసగూడ-జాగర్‌గుండ యాక్సిస్ లో రహదారి నిర్మాణం కోసం CRPF క్యాంప్ ని స్థాపించారని ఛత్తీస్‌గఢ్ పోలీసులు అంటున్నారు.
నిజనిర్ధారణ నివేదికలో చేసిన వాదనలను ఖండించిన సుందర్ రాజ్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ద్వారా పోలీసులు మే 13న గ్రామస్థులకు శిబిర స్వభావం గురించి సరిగ్గా వివరిస్తే, వారు సానుకూల ప్రతిస్పందనతో తిరిగి వచ్చారు అని చెప్పారు.
“ఇదిలా వుండగా, మావోయిస్టులు తమ కారిడార్‌ను రక్షించుకోడానికి ఈ శిబిరాన్ని అస్థిరపరచాలని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి, నక్సల్స్ తమ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సభ్యులను, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మిలీషియా క్యాడర్‌లను సమీకరించి, హింసను ప్రేరేపించడానికి, సిల్‌గేర్ శిబిరంలో మోహరించిన భద్రతా బలగాలపై దాడి చేయాలనే కుట్రతో మే 17 న సిల్‌గేర్‌కు పంపారు” అని బస్తర్ పోలీసు చీఫ్ చెప్పారు.
ఏడు నెలల పాటు నిరసన ఎలా సాగింది.
సిల్‌గేర్ నిరసనను క్రమబద్ధీకరించాలనే లక్ష్యంతో నిరసనకారులు మే 20న మూల్-వాసి బచావో మంచ్ (స్థానిక ప్రజల రక్షణా వేదిక) కింద సమీకృతులయ్యారు. అప్పటి నుండి మంచ్ అధ్యక్షుడు రఘు మద్యమి (21 సం.), మరో 26 మంది కార్య నిర్వాహక సభ్యులు నిరసనకు నాయకత్వం వహిస్తున్నారు.
గత ఏడు నెలలుగా ప్రతిరోజూ….
ఆ తరువాత మంచ్ ఏర్పాటు చేసిన సాంస్కృతిక విభాగం, ‘మూల్ నివాసి సంస్కృతి కళా మంచ్’ పాటలు, నినాదాలు, నాటికలను తయారు చేస్తోంది. ఆ వేదిక గత ఏడు నెలలుగా సామూహిక నిరసన కోసం స్థిరమైన వ్యవస్థలను నిర్మించే ప్రయత్నం చేస్తోంది. డిసెంబరు మధ్యలో, హిందుస్థాన్ టైమ్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, నిరసనకారుల వేసుకున్న 20 చిన్న శిబిరాలు ఉన్నాయి. ఈ నిరసనలో పాల్గొనే ఒక్కో గ్రామానికి ఒక్కో శిబిరం వుంది. ప్రతి ఐదు రోజులకు, ఆయా గ్రామాల నుంచి వచ్చిన గ్రామస్తుల సమూహం తమ గ్రామ శిబిరంలో నివసిస్తుంది. తమతో పాటు తెచ్చిన ఆహార సామాగ్రితో వండుకుంటారు. “ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు 700 మీటర్ల దూరంలో ఉన్న మోకూర్ క్యాంపు బయట నిరసన తెలియజేస్తాం. మరుసటి రోజు, వారి స్థానంలో మరొక బృందం వస్తుంది”అని సిల్‌గేర్‌లోని తిమ్మాపురం గ్రామ శిబిరం బయట కూర్చున్న రఘు వివరించారు.
సుదూర ప్రాంతాల నుండి వచ్చే మంచ్ కార్యకర్తలు లేదా ఇతర నిరసనకారుల కోసం, గ్రామస్థులు తృణధాన్యాలు విరాళంగా ఇస్తారు. “మేము గత ఏడు నెలల్లో కూరగాయల కోసం రెండు ఎకరాల భూమిని కూడా అభివృద్ధి చేసాము. ఉదయం 7 గంటలకు మా దిన చర్య మొదలవుతుంది. 10 గంటలకల్లా వంట చేసుకుని తినేసి, తమ నిరసనను తెలియచేయడానికి పోలీసు క్యాంపు వైపు నిరసన ర్యాలీ చేసి మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి వస్తాం. ఆ తరువాత రాత్రిపూట మంట కోసం కట్టెలు జమ చేసుకొంటాము. రాత్రి 7 గంటలకు అన్నాలు తినేసి 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు, మంట చుట్టూ చలి కాసుకుంటూ పాటలు పాడుకొంటా”మని మూల్ నివాసి కళా మంచ్ అధ్యక్షుడు రాజు సోరి తమ గత ఏడు నెలల దిన చర్యని వివరించారు.
బస్తర్‌లో సిల్‌గేర్ ప్రభావం
సిల్‌గేర్ నిరసన బస్తర్‌లో మావోయిస్టులు-రాజ్య మధ్య వివాదంలో కొత్త మార్పును తీసుకువచ్చింది. ఇతర ప్రదేశాల్లో భద్రతా శిబిరాల ఏర్పాటుకు వ్యతిరేకంగా మరిన్ని నిరసనలను ప్రేరేపించింది. గత కొన్ని వారాలుగా, కంకేర్ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన సరిహద్దు భద్రతా దళ శిబిరానికి, సర్కేగూడ, గోంపాడ్ వంటి ప్రదేశాలలో జరిగిన పోలీసు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి.
కొత్త శిబిరాలను ఎలా ఏర్పాటు చేయాలనే విషయంపై సిల్‌గేర్‌లో జరిగిన కాల్పులు పోలీసు వ్యవస్థలో పునరాలోచనకు దారితీశాయని బస్తర్‌లో పనిచేస్తున్న పేరు చెప్ప నిరాకరించిన ఒక పోలీస్ అధికారి అన్నారు. మావోయిస్ట్‌ల ప్రధాన ప్రాంతాలలోకి భద్రతా బలగాలు చొచ్చుకుపోతూండడంతో, అక్కడ కొన్ని నిరసనలు ఉంటాయి. అయితే గ్రామస్తుల నిజమైన డిమాండ్లను పరిష్కారించి, వారి విశ్వాసాన్ని గెలుచుకోవడం ద్వారా ఈ సమస్యతో వ్యవహరించ వచ్చు అని అన్నారు.
“నిరసన సహజ మరణం చెందుతుందని నమ్మడంలో రాష్ట్ర ప్రభుత్వం పొరపాటు పడుతోంది, దీనికి రాజకీయ పర్యవసానాలుంటాయి. నాకు తెలిసినంత వరకు బస్తర్ చరిత్రలో ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకంగా జరిగిన ఆదివాసీల నిరసనలలో ఇది సుదీర్ఘమైనది. సల్వాజుడుంకు నిరసనగా జరిగిన ఆందోళనల తర్వాత, ప్రజల స్పందన పర్యవసానంగా కాంగ్రెస్ 15 సంవత్సరాలపాటు పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. వచ్చే ఎన్నికల్లోనూ అలాంటిది జరగబోతోంది. వారు మళ్లీ అధికారంలోకి వస్తారో లేదో చెప్పలేం ” అని ఆదివాసీ హక్కుల కార్యకర్త సోనీ సోరీ అన్నారు.
“ఆదివాసీలు ఉద్యమం ద్వారా లేవనెత్తడానికి ప్రయత్నించిన ఏ ప్రశ్నలకూ ప్రభుత్వం నుండి ఇంకా సమాధానం లేదు. గ్రామస్తులకు చెప్పకుండా, లేదా గ్రామ సభ (గ్రామ కౌన్సిల్ సమావేశం) ఏర్పాటు చేయకుండా, వారి గ్రామానికి చెందిన భూమిలో శిబిరాన్ని ఎందుకు స్థాపించారు? ముగ్గురు నిరసనకారుల హత్యలు, ఆ తర్వాత గాయాలతో మరణించిన మహిళ హత్యపై న్యాయ విచారణకు ఎందుకు ఆదేశించలేదు? సుక్మా డిప్యూటీ కలెక్టర్ జరిపిన విచారణ నివేదికను ఇంతవరకు ఎందుకు బహిర్గతం చేయలేదు? దోషులైన పోలీసులను ఎప్పుడు శిక్షిస్తారు?” అని భాటియా ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ ప్రతిస్పందన
పోలీసులూ, పరిపాలనా యంత్రాంగమూ మొదట్లో కాల్పుల సంఘటనను దృఢంగా సమర్థించినప్పటికీ, రోజులు గడిచే కొద్దీ కాంగ్రెస్ నేతృత్వంలోని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిరసనకారులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తూ, దిగివచ్చింది. జూలై 1న నిరసనకారులు, కార్యకర్తల ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌తో సమావేశమైనప్పుడు, బాధిత కుటుంబాలకు పరిహారం, ఉద్యోగాలు యిస్తామన్నారు.
“ముఖ్యమంత్రి మా డిమాండ్ల గురించి అడిగినప్పుడు, దళిత, ఆదివాసీ, ఆదివాసేతర వర్గాలకు చెందిన ముగ్గురు విశ్రాంత న్యాయమూర్తుల నేతృత్వంలో విచారణ జరగాలనేది మా డిమాండ్ అని చెప్పాం. నష్టపరిహారం, ఉద్యోగాలు కూడా ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పినా ప్రజలు అంగీకరించడంలేదు. ముందుగా విచారణ జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు’’ అని సమావేశంలో పాల్గొన్న సోనీ సోరీ అన్నారు.
గొంగూడ గ్రామానికి చెందిన అనేక మంది నిరసనకారులలో ఒకరైన తెలం రాందాస్ “పరిహారాన్ని అంగీకరించాలంటే ముందు పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవాలి. మా డిమాండ్లు చాలా సరళమైనవి – మా సోదరులను చంపడానికి కారణమైన అధికారిని తొలగించి, శిబిరాన్ని వెనక్కి తీసుకోవాలి అని మాత్రమే” అని అంటారు.
న్యాయ విచారణకు ఆదేశించనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 12న సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ స్థాయిలో విచారణకు ఆదేశించింది, ఇంకా నివేదిక రాలేదు. విచారణ కొనసాగుతోంది, చివరి దశలో ఉందని సుక్మా కలెక్టర్ వినీత్ నందన్‌వార్ అంటారు.
డిసెంబర్ 17న ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, ముఖ్యమంత్రి బఘెల్ తన ప్రభుత్వ వైఖరిని సమర్థించారు. చర్చల ప్రయత్నాల గురించి చెబుతూ “సంఘటన జరిగిన ప్రాంత ప్రజలను ఎక్కడైనా, ఏ ప్రభుత్వమైనా కలుసుకుని మాట్లాడిందా? పార్లమెంటు సభ్యుడు, శాసనసభ్యులు, వారి స్వంత సముదాయానికి చెందినవారినే చర్చలు జరపడానికి మేము పంపాము”అని అన్నారు. నిరసనలను అణచివేయడంలో అతని ప్రభుత్వం ఎందుకు విఫలమైందని అడిగిన ప్రశ్నకు బఘేల్ సమాధానం,“ఆ నిస్సహాయులను తుపాకీమొనల అంచున నిరసనకు కూర్చోబెట్టారు. కానీ అక్కడి జనాభా మాతో, మా వైపు ఉండటం ఇదే మొదటిసారి. వారి డిమాండ్‌పైనే క్యాంపులు ఏర్పాటయ్యాయి.”
రాయ్‌పూర్‌కు 497కిమీ దూరంలో ఉన్న సిల్‌గేర్‌లో, నిరసనకారుల బృందం ఇప్పటికీ పాడుతూనే ఉంది. అర్ధరాత్రి కాబోతోంది. 12 అవగానే ఇక ఆ రోజును ముగించడానికి నిరసనకారులు తమశిబిరాలకు తిరిగి వెళ్తారు. మర్నాడు తిరిగి వస్తారు. “ మా డిమాండ్లు నెరవేరే దాకా మేము ప్రతి రాత్రి పాడుతూనే వుంటాము అని ఒక యువ నిరసనకారుడి” ఆశ్వాసన.
అనువాదం : పద్మ కొండిపర్తి
సోర్స్ : https://www.hindustantimes.com/india-news/seven-months-and-counting-the-longest-silger-stir-retains-its-verve-101640541821991.html