ఏమంది సునయన?

‘యూ హావ్‌ టు వర్క్‌ హార్డ్‌… రేపట్నించీ ఇంకో రెండు ఎక్సర్‌సైజెస్‌ ఆడ్‌  చేస్తాను, అండ్‌ డైట్‌లో కార్బ్స్‌ ఇంకా తగ్గించేయాలి. ప్రొటీన్స్‌ ఆడ్‌ చేయండి.. ఓకే, రేపు హిప్‌ లిఫ్ట్స్‌? ఫ్లిట్టర్‌ కిక్స్‌, సిసర్‌ కిక్స్‌, వి`సిట్స్‌, అప్స్‌ ఆడ్‌ చేస్తాను. డోంట్‌ వర్రీ… మీ పొట్ట తగ్గి బాడీ మంచి షేప్‌లోకి వచ్చేస్తుంది. యువర్‌ హస్బెండ్‌ స్టార్ట్స్‌ లవింగ్‌ యూ మోర్‌… శారదగారూ, జిమ్‌ కోచ్‌ సునయన కన్ను కొడ్తూ చిలిపిగా నవ్వింది. శారదా నవ్వింది. కానీ నీరసంగా, ఇబ్బందిగా. దేహ కొలతలు సంతృప్తిగా ఉంటేనే ఎక్కువ ప్రేమించే భర్త ఎందుకు? తన పొట్టను తడిమి చూస్కుంది. ఎంత ప్రయత్నం చేసినా ఈ పొట్ట తగ్గట్లేదు. ఎన్ని జిమ్‌ సెంటర్‌లు మారిందో… వాకింగ్‌ సమయాలు ఉపవాస దినాలు పెంచుతూ పోయిందో… లెక్కే లేదు. ఎన్ని న్యూట్రీఫిట్‌లు తాగి ఉంటుందో. ప్రతీ నెలా ఒక వారం రోజులు ప్రకృతి వైద్యం చేయించుకుంటోంది ఫుల్‌ బాడీ మసాజ్‌లు ముఖ్యం పొట్టకి ఆవిరి స్నానాలు… కేరళ ఆయుర్వేదాన్నీ వదలలేదు. రకరకాల భస్మాలు, పొడులు, కషాయాలు మింగలేక ఎన్ని సార్లు వాంతులు, విరోచనాలు చేస్కోలేదు. తనవల్ల కావటం లేదు అదీ ఈ నలభై రెండేళ్ళ వయసులో… ‘ఏంటి శారదా పొట్ట ఉంటే ఏం? కుంటి, గుడ్డి, మూగలాగా అవిటి తనమా? నీ రోజు వారి వ్యాపకాలకు ఏమన్నా అడ్డం వస్తున్నదా… జాబ్‌ చేయలేక పోతున్నావా నడవలేకపోతున్నావా… ఏంటిది… బుద్ధి లేకుండా అనుక్షణం అదే ఆలోచన. నీకు వేరే జీవితం లేదా… శరీరం నీదా… అతనిదా… ఏంటిది అసలు కొంచం కూడా ఆత్మగౌరవం లేకుండా… ఇంకా అన్నీ మానేసి  నీ నర్సరీ బిజినెస్‌… ఉద్యోగం చేసుకో, హేమ తన స్నేహితురాలు తిడుతూనే ఉంటుంది. కానీ… కానీ తన బాధ… తాను పడుతున్న నరకం హేమకెట్లా అర్థం అవుతుంది? అంత మంచి భర్త ఉండగా. నిజంగా హేమ భర్త మాధవ్‌ చాలా మంచివాడు హేమ అదే చెప్తూంటుంది. తనూ చాలా సార్లు చూసింది. ఎంత గౌరవమో హేమ అంటే. అదే తన భర్త గౌతమ్‌ తల్చుకుంటేనే వెగటు తనం నిండిపోతున్నది. ‘నాకు నువ్వలా ఇంత పొట్టేసుకుని ఉంటే పరమ అసహ్యం నీకెంత చెప్పినా… నువ్వెంత కష్టపడ్డా నీ పొట్ట తగ్గదు. నాకు నీ మీద కోరికా పుట్టదు. ఐ లైక్‌ థిన్‌ బాడీ. పూలరేకుల్లా పల్చగా ఉండాలి దేహం ఆడదానికి నన్ను చూడు… ఎంత ఫిట్నస్‌ ఉందో నా సిక్స్‌పాక్‌ పొట్ట చూడు. అంటుంటాడు. ఎంత సేపూ తన పొట్ట మీద జోకులు, సెటైర్లు. మాంసం కొట్లో పక్కకి పెట్టిన కొవ్వు ముద్దల కుప్పలకి చర్మం నిలువుగా చారలు గీస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందట తన పొట్ట… ‘పొట్ట కొవ్వు ఎంత తగ్గిందేమిటి… వృథా చాలాసార్లు చెప్పాను లిపోసక్షన్‌ సర్జరీతో కొవ్వు తగ్గించుకో… డబ్బులు మాత్రం నేనివ్వను నీదే పూచీ. చూడూ ఇలా ఎందుకుండవు నువ్వు’’ అంటూ టీవీలో కొలతల ప్రదర్శన చేస్తున్న మోడల్స్‌ను చూస్తూ చూపిస్తూ చొల్లు కార్చుకుంటూ అంటుంటాడు. ‘‘సిగ్గు లేదా నీకు పదిహేనేళ్ళ కూతురు ఉంది’’ తను అరుస్తుంది. ‘‘ఉంటే ఏం శారదా? ఐ యామ్‌ ఏ మాన్‌ విత్‌ ఫుల్‌ టెస్టోస్టిరాన్‌ సెక్స్‌ హార్మోన్స్‌ ముసలోణ్ణి కాదు కదా… నలభై ఐదేళ్ళే నాకు’’ అంటాడు సిగ్గులేకుండా. ‘‘పెళ్ళైనప్పట్నించే ఈ ఫిట్నెస్‌ గోలనే… సన్నగా ఉండాలి. అలా ఉంటేనే నాకు ఇష్టం. ఎక్కడికక్కడ కొవ్వు పెంచకు… ఆ చారలు జీబ్రాలా గీతలు పోవాలి ఐ హేట్‌ ఇట్‌’’ అంటూ ఇంటినే జిమ్‌గా మార్చేసావు. సిసేరియన్‌ ఆపరేషన్లలో పాప బాబు పుట్టాక తనకు ఇక ఆ పొట్ట తగ్గలేదు. పైగా పొట్ట మీద ప్రెగ్నెన్సీ చారలు… చాలా దారుణంగా వచ్చాయి. ముడుచుకుపోయి సాగిపోయిన పొట్ట చర్మంపై తీగలు తీగలుగా మెరుస్తూ తెల్లటి చారలు… నిలువుగా బొడ్డుకి రెండు వైపులా తొడల మీద రెండు సార్లు అయిన సిసేరియన్‌ ఆపరేషన్‌లో పొట్ట మీద అడ్డుకోతలు. ఎంత మంది గైనకాలజిస్టులని, కాస్మోటాలజిస్టులనీ కలిసిందో… ఎన్ని క్రీములు రాసిందో… తన పొట్ట అలా అందవికారంగా అయిపోయిందని తనెప్పుడూ బాధపడలేదు. పొట్ట మీది స్ట్రెచ్‌మార్క్స్‌ తన బిడ్డల్ని గుర్తుకు తెస్తాయి. గౌతమ్‌ అసహ్యించుకుంటేనే బాధా, అసహనం కలుగుతాయి. యోగా… జిమ్‌ చేస్తే కొవ్వు కొంచం తగ్గినా చర్మం బాగా ముడుతలు పడిపోయి పొట్ట పై భాగం అంతా నీటిలో నానిపోయి, ముదురు గోధుమ రంగుతో చీలిపోయి ఈతాకులాగా మారిపోయింది. చూడగానే ఏవగింపుతో మొఖం తిప్పేసుకుని పక్కమీద నించి లేచిపోతాడు గౌతమ్‌.

నిజానికి తను రోజూ జిమ్‌కి ఏమీ వెళ్ళదు. ఎంత యాతనో అది.. ఇద్దరు పిల్లలు స్కూలు, ట్యూషన్లు తన నర్సరీ… ఆఫీసూ ఇదంతా చేస్కుంటూ అసలు సమయం ఏదీ… గౌతం కంటే అంతా ఖాళీ టైమ్‌. బాంక్‌ ఉద్యోగి ఇంటి పని, వంట, పిల్లల బాధ్యతలు ఏవీ పట్టించుకోడు.

తన కోసం ప్రత్యేకమైన వంట కూడా తనే చేయాలి. బయట ఫుడ్‌ తినడు. జొన్న రొట్టెలు, డ్రై ఫ్రూట్స్‌ పచ్చి కూరల సలాడ్‌, పెసలు, పల్లీ మొలకెత్తిన విత్తనాలు, నిమ్మకాయ తేనె కలిపిన నీరు ఎన్నని… ఏదీ తక్కువ కాకుడదు. అన్నీ టైంకి చేయాలి. ఈ పనుల్లో జిమ్‌, యోగాకి వెళ్ళడం కుదరట్లేదు కానీ అతని లెక్క ప్రకారం వెళ్ళి తీరాల్సిందే. శరీరాన్ని, మనసుని కష్టపెట్టకుండా హాయిగా బతికేయాలన్పిస్తుంది. ఈ గౌతమ్‌ కోసం తన శరీరాన్ని ఇంత హింస పెట్టుకోవడం ఏంటి? ఇంతేనా తనను స్వీట్లు తిననివ్వడు… లాక్కుని పడేస్తాడు. రెండోసారి వడ్డించుకోనివ్వడు. ఆకలికి మాడిపోయేది. తమ బాగానే ఉంది. ఆరోగ్యంగా ఉంది ఒక్క పొట్ట తప్ప. పొట్ట మీద గౌతమ్‌ వెక్కిరించినట్లు జీబ్రా గీతాలు తప్ప. ఈ గీతలేమిటి… వీటితో తనని గౌతమ్‌ ఎటు పోకుండా బంధించడం ఏమిటీ… అచ్చం ఇంటి ముందు బెల్ట్‌తో బంధించబడ్డ తమ టామీలాగా. టామీ మొరుగుతూ స్వేచ్ఛకోసం గింజుకుంటూనే ఉంటుంది బెల్టు విప్పమని తన పరిస్థితీ అలానే ఉంది. విసుగొచ్చి జిమ్‌లు… డైట్‌లు మానేసింది. కోరికే కలగట్లేదని తనను ఏవగించుకుంటూ వేరే గదిలోనే పడుకుంటున్నాడు. పైగా అతగాడికి కోరిక కలగడానికి తను ఇవన్నీ చేయడం ఏంటీ… ఎంత ఆత్మగౌరవం లేని పని అది… హేమ అన్నట్లే తాను మానేసింది. మానేసినప్పుడల్లా మళ్ళీ పొట్ట రావడం మామూలే. కానీ ఈ మధ్య గౌతమ్‌ చేసిన పని తన ప్రపంచాన్ని మరింత అల్లకల్లోలం చేసింది. గౌతమ్‌ మరో అమ్మాయితో సన్నిహితంగా ఉన్నట్లు తనకు మెస్సేజీలు వచ్చాయి. ఒకమ్మాయితో కాదు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో.. తన సన్నిహిత బంధువులు… స్నేహితులు కూడా చెప్పారు. ఒక రోజు చాలా స్పష్టంగా ఒక షాపింగ్‌ మాల్‌ల్లో చూసింది. ఎవరో ఒకమ్మాయితో కనపడ్డాడు. దగ్గరికెళ్ళే లోపల మాయం అయిపోయారు. మరోసారి మూవీ థియేటర్‌లో చూసింది. తనను చూసి గతుక్కుమని ఏం చెప్పాడో ఆ అమ్మాయి తప్పుకుంది. ఎంత స్లిమ్‌గా ఉందో… కానీ చాలా చిన్న వయస్సు ఒక ఇరవై ఏడేళ్ళు ఉండచ్చు.

ఇంటికొచ్చాక నిలదీసి అడిగితే ‘‘నీ భ్రమ నా పక్కన ఎవరూ లేరు. ఆమెవరో నా పక్కన నుల్చుంటే నా గర్ల్‌ఫ్రెండై పోతుందా… నాన్సెన్స్‌’’ అంటూ కొట్టిపడేశాడు గౌతమ్‌. ఇదిక చిలికి చిలికి గాలి వానగా మారింది. ఒక రోజు హేమ కూడా చెప్పింది మాధవ్‌ ఒక పార్టీలో ఒకమ్మాయితో చూసాడని. ఇద్దరూ చాలా సన్నిహితంగా భార్యాభర్తల్లా ఉన్నారనీను… తనని చూసి గతుక్కుమని బ్యాంక్‌లో కొలీగ్‌ అని చెప్పాడని హేమ చెప్పింది. అడిగిన ఆ రోజూ గొడవే. హేమనీ… ఆమె భర్తనీ ఒకటే బండబూతులు తిట్టాడు.

కాదు నేనూ చూసాను దాని మాటేంటి అంటే ‘నాకెవరితో సంబంధాలు లేవు. నీవన్నీ భ్రమలు అనుమానాలు… నీకు మానసిక జబ్బు సోకింది సైకియాట్రిస్ట్‌కు చూపించుకో పద నాకు తెలిసిన డాక్టరున్నాడు’ అంటూ తనని కొట్టాడు. కొట్టాక ఇంట్లోంచి పోతూ ‘అదంతా కాదు… నువ్వు లైపో సెక్షన్‌ చేయించుకో… లేకపోతే’ అంటూ చూపుడు వేలితో బెదిరిస్తూ వెళ్ళిపోయాడు. లేకపోతే అంటే… ఆ సంబంధాల్లోకి వెళ్ళిపోతాననా… లేక వదిలేస్తాననా తనకర్థం కాలేదు. ఆ రాత్రి ఇంటికి రాలేదు గౌతమ్‌… అలా చాలా రాత్రిళ్ళు రాలేదు. ఎక్కడో గడుపుతున్నాడని అర్థం అవుతున్నది.

ఒక రోజు తన చేతిలో ఒక పుస్తకం పెట్టాడు. ‘ష్కీజో ఫ్రీనియా’ అనే మానసిక రోగానికి సంబంధించిన లక్షణాలు, చికిత్సకు సంబంధించిన పుస్తకం. ‘చూడు… భర్తలను ఒఠ్ఠిగా అనుమానించే భార్యల లక్షణాలు అన్నీ దీన్లో 

ఉన్నాయి. అన్నీ నీ లక్షణాలే. అనుమానించడమే కాదు ఈ మధ్య ఫాలో కూడా అవుతున్నావు… మొన్న నా బాంకుకి ఎందుకు వచ్చావు ముందు ఈ పుస్తకం చదివి చావు’’ అంటూ పుస్తకాన్ని తన మీదకి విసిరికొట్టాడు. చదివి ఒణికిపోయింది. ఇంత భయంకరమైన జబ్బు తనకు అంటగడ్తున్నాడు. అతని పక్కన అమ్మాయిని చూడడం కూడా జబ్బు లక్షణం అంటున్నాడు.

హేమ భర్తకీ… చూసిన తన స్నేహితులూ, బంధువులకీ ఇదే జబ్బుందంటాడా? అంటున్నాడు. ఏం ఆలోచన చేస్తున్నాడితను? తనకంత అవసరం లేకపోయినా గొడవలు అసంతృప్తులూ ఎందుకని ఒక మెట్టు తగ్గిపోయి, ఆత్మగౌరవాన్ని చంపుకుంటూ ఇంత కష్టపడుతుంటే దానికే విలువా లేదు. పైగా చులకన అయిపోతున్నది. గర్వంగా కూడా ఫీల్‌ అవుతున్నాడు తన కోసం ఇన్ని అవస్థలు పడుతున్న తనని చూసి, తనకి ఇదంతా అవమానంగా ఉంది. నిత్యం తన శరీరాన్ని.. అస్థిత్వాన్ని అవమానించే ఒక నీచుడి కోసం తను అహర్నిసలు పొట్ట, కొవ్వు… డైట్‌ జిమ్‌ అంటూ వెధవ్వేషాలు వేస్తుంటే… తనంటే తనకే చీదరగా ఉంది. తను ఆరోగ్యంగా ఉండడం కోసం కాదు… ఇతని కోసం తను ఇదంతా చేయడం… దుర్భరంగా ఉంది. అలంకరించుకుని భర్తని ఆకర్షించాలనే ఆలోచనకే తను విరుద్ధం. పైగా తను అతని సంబంధాల గురించి ప్రశ్నించినప్పుడల్లా లైపోసెక్షన్‌ చేయించుకో అంటాడేంటి… ఎందుకు చేయించు కోవాలి… కొవ్వు తగ్గించుకోవడానికి లైపోసెక్షన్‌ చేయించుకుని హార్ట్‌ ఎటాక్‌ వచ్చి చనిపోయిన వాళ్ళు తనకు తెలుసు. తనెందుకు అంత రిస్క్‌ తీస్కోవాలి? అదీ తననింత టార్చర్‌ చేస్తున్న వీడికోసం…? తను చేయించుకోదు గాక చేయించుకోదు. ఏం చెయ్యడం అసలు? ఇదంతా పదేళ్ళ నించీ నడుస్తున్నది. తనకి ఓపిక నశిస్తున్నది.

` ` ` 

అర్థరాత్రి గౌతమ్‌ గదిలోంచి మాటలు విన్పిస్తున్నాయి… నీళ్ళు తాగడానికి లేచిన శారద చటుక్కున తలుపు తోసింది. సెల్‌ఫోన్లో ఒకమ్మాయితో వీడియోకాల్‌ చేస్తూ ఫోన్‌కి ముద్దులు పెడుతున్నాడు ‘రేపొస్తాగా’ అంటున్నాడు. శారద ఆగ్రహంతో ముందుకు వెళ్ళి ‘ఏంటిది’ అని అరుస్తూ గౌతమ్‌ చేతుల్లోంచి ఫోన్‌ గుంజుకో ప్రయత్నించింది. గౌతమ్‌ వెంఠన్‌ జాగ్రత్తపడ్డాడు. లేచి శారదని తోసేసి, గదిలోంచి వెళ్ళిపోయి మరో గదిలోకెళ్ళి తలుపేసుకున్నాడు.

` ` `

‘‘నో… నాకేం భ్రమలూ అనుమానాలు లేవు పైగా మొన్న రాత్రి అమ్మాయితో అతను వీడియో కాల్‌ చేస్తున్నపుడు కూడా చూసాను. సినిమా హాల్లో, షాపింగ్‌ మాల్లో చూసాను. అతని పక్కనే అమ్మాయిని… ఇతను కావాలని నన్నో అనుమానపు లక్షణం ఉన్న మానసిక రోగిలాగా ప్రొజెక్ట్‌ చేస్తున్నాడు డాక్టర్‌ నమ్మకండి…’’ శారద హిస్టీరిక్‌గ్గా అరిచినట్లే అంది. ‘‘మీరు బయట చూసిన ప్రతి చోటా మీ వారు అమ్మాయితో కన్పిస్తున్నారా…’’ అడిగాడు సైకియాట్రిస్ట్‌ సురేందర్‌ ముఖం కొంచెం ముందుకు ఒంచి… కనుబొమ్మలు పైకెత్తి చేతిలో పెన్నుని బొటన వేలుకీ… చూపుడు వేలుకీ మధ్యలో వేగంగా ఆడిస్తూ… ఏదో నిర్ధారణకు వచ్చినట్లు తల పంకిస్తూ. ‘‘అవును…’’ శారద స్థిరంగా అంది ‘‘మొన్న మీవారి బాంక్‌కి ఎందుకు వెళ్ళారు’’ డాక్టర్‌ సురేందర్‌ అడిగాడు. ‘‘కొత్త అకౌంట్‌ తెరుద్దామని వెళ్ళాను’’ శారద అంది.

‘ప్రతీసారి మీకు మీ ఆయన పక్కన అమ్మాయి కన్పిస్తుందా… మరి ఆమె దగ్గరికి వెళ్ళి ఎందుకని పట్టుకోలేదు? పోనీ నిలదీయలేదు’ డాక్టర్‌ ఒకింత ఆశక్తిగానూ వెక్కిరింతతోనూ అడిగాడు… ‘నేను వెళ్ళే లోపల ఆమె వెళ్ళిపోయింది. అయినా నా ఫ్రెండ్స్‌ బంధువులు కూడా ఈనని అమ్మాయిలతో తిరగడం చూసారు అది నిజం కాదా?’ శారద అయోమయంగా సమాధానం చెప్పగానే డాక్టర్‌ వెక్కిరింతగా నవ్వాడు. అక్కడే ఉన్న గౌతమ్‌ తానేదో గెలిచినట్లు ఊగిపోతూ పెదాలను వేళ్ళతో కప్పెట్టుకుంటూ నవ్వాడు.

డాక్టర్‌ కళ్ళు, గౌతం నవ్వుతున్న కళ్ళతో పెనవేసుకుని ఏదో సైగ చేయడం, కనుబొమ్మలు ఎగరేయడం. ఇద్దరి మధ్య వెక్కిరింతల నవ్వులు, ఏదో రహస్య ఒప్పందం సైగల రూపంలో దొర్లడం గమనిస్తూనే ఉంది. శారదకి అవమానంగా, చిరాగ్గా ఉంది. ఏంటిది? ఇంతలో డాక్టర్‌ గబాగబా ఏవో మందులు రాసి ప్రిస్క్రిప్షన్‌ గౌతమ్‌కి ఇస్తూ ‘ఈ మందులు రోజూ ఉదయం, రాత్రి వాడాలి మూడు నెలలు వాడాక రండి’ అంటూ ‘‘చూడండి మేడం.. మీ వారు జెంటిల్‌మెన్‌.  అనవసరంగా అనుమానించకండి. అనుమానంతో స్ట్రెస్‌ పెరిగి మీకు భ్రాంతులూ, భ్రమలూ కలుగుతున్నాయి. మీరు ముందు ఆయనతో బాగుండండి. కొంచెం ఫిట్నెస్‌ అదీ మెయిన్‌ చెయిన్‌ చెయ్యండి చాలు’’ ఆగ్రహం తన్నుకొచ్చింది శారదకి. ‘మీ జబ్బు లక్షణమే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు ఊహించుకోవడం, చూడడం’ అంటున్న డాక్టర్‌ని ఆపుతూ.. ‘నేను కౌన్సిలింగ్‌ అంటే ఈయనతో నేను పడే బాధలు మీతో చెప్పుకుందామని వచ్చాను. మీరేంటి నా మాటలు మాత్రమే విన్నారు. ఆయనతో ఏమీ మాట్లాడలేదు… ప్రశ్నించలేదు? నాకు మాత్రమే మందులు రాసారు అనుమానం, భ్రమలు, భ్రాంతులూ అంటున్నారు… ఇదేం పద్ధతి? మీరసలు సైకియాట్రిస్టేనా… మేరేజీ కౌన్సిలరేనా’?… డాక్టర్‌ మొఖం మ్లానమైపోయింది శారద ప్రశ్నలకి.

‘‘ఆయనకి కూడా రాసాను. మీకంటే ముందు నిన్ననే కౌన్సిలింగ్‌ ఇచ్చాను’’ అన్నాడు కోపంగా. ‘‘ఏంటీ నన్ను వినకుండానే… ఆయనకు ఏం కౌన్సిలింగ్‌ ఇచ్చారో చెప్తారా కాస్త?’’ కోపంగా అడుగుతున్న శారదను ఇక తీస్కెళ్ళి పొమ్మన్నట్లుగా తలుపువైపు వేళ్ళు చూపించి సైగ చేసాడు గౌతమ్‌కి. డాక్టర్‌ తనని బయటకు తీస్కెళ్ళడానికి చెయ్యి పట్టుకోబోతున్న గౌతమ్‌ చేతిని విదిలించుకుని బయటకొచ్చింది శారద.

` ` `

‘‘అనుమానం కాదులే కొంచం డిప్రెషన్‌ తగ్గుతుంది వేస్కో’’ అధికారం నిండిన గొంతుతో డిన్నర్‌ అయ్యాక మూడు రకాల మందులు టేబుల్‌ మీద పెట్టాడు గౌతమ్‌. ‘‘నాకు అనుమానాలు, డిప్రెషన్‌, భ్రాంతులు లాంటివేమీ లేవు. నాకు ఏ మానసిక రోగం లేదు వెళ్ళు నేను వేసుకోను’’ శారద ఖచ్చితంగా అంది. ‘‘నాకు కోపం తెప్పించకు వేస్కో’’ మందులు కుడి చేతిలో పట్టుకొని, ఎడమ చేతిలో నీళ్ళ గ్లాసుతో బెదిరిస్తున్నట్లే నిలబడ్డాడు గౌతమ్‌. ‘నేను వేస్కోను నువ్వే వేసుకో’ అంటూ లేవబోయిన శారదను ఒడిసిపట్టి తన వేళ్ళతో ఆమె నోటిని బలవంతంగా తెరిచి టాబెట్లు వేసి నీళ్ళు పోసేసాడు శారద తేరుకునే లోపలే.

శారద వెంఠనే అతన్ని తోసేసి ఉమ్మేసింది కానీ గొంతులో దిగిపోయాయి రెండు టాబ్లెట్లు. ఒకటి మాత్రమే బయటకు వచ్చింది. తుపుక్కుమని తన మొఖం మీద పడ్డ మాత్రని, నీళ్ళని తుడుచుకుంటూ నవ్వాడు గౌతమ్‌. శారద ఆగ్రహంతో ఎడాపెడా కొడుతున్న శారదని తోసేసాడు గౌతమ్‌. ఇదంతా వాళ్ళిద్దరి పిల్లలు నిధి, నిఖిల్‌ ముందే జరిగింది. ఇద్దరూ తేరుకుని పరుగున వచ్చి శారదను పట్టుకొన్నారు. ‘బలవంతంగా ఎందుకు అమ్మకి మందులు ఇస్తున్నావు నాన్నా’ నిధి కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ కోపంగా అడిగింది. కోపంతో ఒణికిపోతున్న శారదను గుండెలకు అదుముకుంటూ… 

‘అమ్మ నార్మల్‌గా ఉంది… ఇప్పుడేంటి సడన్‌గా మందులు వాడుతున్నావు?’’ నిఖిల్‌ కూడా గౌతమ్‌ను కోపంగా అడిగాడు.

‘మీ అమ్మ నన్ను అనుమానిస్తున్నది. ఆమెకు ‘పారానాయిడ్‌ ష్కీజోఫ్రీనియా’ అనే అనుమానించే జబ్బుని డాక్టర్‌ నిర్ధారించి మందులు మొదలుపెట్టాడు. మీ అమ్మ అనుమానాలతో నా జీవితం నరకం అవుతున్నది. మందులు వేస్కోవాల్సిందే రోజూ’’ అంటూ పిల్లలిద్దర్నీ చూపుడు వేలితో బెదిరిస్తూ నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు  గౌతమ్‌.

‘‘లేదు… మీ నాన్న ఎవరితోనో తిరుగుతున్నాడు. నేను చూసాను. పోనీ నాది అనుమానం అయితే హేమాంటీ, మాధవ్‌ అంకుల్‌… మురళి మామయ్యలు కూడా చూసారు. ఈ మెస్సేజెస్‌ చూడండి’’ అంటూ పిల్లలిద్దర్కీ తన ఫోన్‌లోని మెసేజీలను చూపించింది శారద.

గౌతమ్‌తో రోజూ శారదకి ఇదో నరకం అయిపోయింది. మందులతో రాక్షసుడిలా వెంటబడుతున్నాడు. చాలాసార్లు విడిపించుకుని బెడ్రూంలోకి వెళ్ళి తలుపేసుకునేది శారద. అతను బలవంతంగా వేసిన రోజు గంటలు గంటలు నిద్రపోయేది. నిద్ర వల్ల ఆఫీస్‌కి శెలవు పెట్టాల్సి వచ్చేది. శారదను చూసి పిల్లలిద్దరూ బెంగటిల్లిపోయారు. ఇద్దరూ మాట్లాడుకున్నారు. తండ్రితో పోట్లాడారు. ఒక రోజు తనకు బలవంతాన మందులు వేయబోయిన గౌతమ్‌ని ఆగ్రహంతో తోసేసింది. శారదను కొట్టరాబోయిన గౌతమ్‌ని పిల్లలిద్దరూ రెక్కలు పట్టుకొని ఆపేసారు. ‘‘అమ్మకేం ప్రాబ్లమ్‌ లేదు’’ అంటూ గౌతమ్‌ చేతుల్లో మందులు లాక్కున్నారు. గౌతమ్‌ ఖంగు తిని బయటకు వెళ్ళిపోయాడు. శారద వెంఠనే హేమకి ఫోన్‌ చేసింది.

ష్కీజోఫ్రీనియా లక్షణాలు, చికిత్స పుస్తకం, డా॥ సురేందర్‌ ప్రిస్క్రిప్షన్‌ హేమ చేతుల్లో పెట్టింది శారద. హేమ షాక్‌ తగిలినట్లే ఉండిపోయింది. ‘‘ముందు డాక్టర్‌ని పట్టుకోవాలి. అసలు నాకు ఈ మానసిక రోగాన్ని ఎలా నిర్థారించాడో నిలదీయాలి’’ అంది శారద కోపంగా. ‘‘నువ్వు ప్రశాంతంగా ఉండు నేను ఈ పని మాధవ్‌కి అప్పజెప్తాను. పిల్లలూ నాన్న గదిలో మందులు అన్ని పడేద్దాం ముందు రండి’’ అంటూ గౌతమ్‌ గదిలోకి తీస్కెళ్ళింది అందర్నీ. గదిలో రాక్‌లో కుప్పలు కుప్పలు ష్కీజోఫ్రీనియా తగ్గించే మందులు దొరికాయి. వాటితో పాటు వయాగ్ర టాబ్లెట్‌లు, కండోమ్‌లు, ప్లేబాయ్‌ లాంటి ఫోర్న్‌ పత్రికలూ దొరికాయి. శారద అన్నీ కలెక్ట్‌ చేస్కుని ఒక కవర్‌లో పెట్టి తన బీరువాలోని లాకర్‌లో పెట్టింది.

‘‘ఇదంతా గౌతమ్‌ తన అక్రమ సంబంధాలను దాచుకోడానికి ఆడుతున్న భయంకరమైన మైండ్‌ గేమ్‌. భర్తను అనుమానించే పారానాయిడ్‌ ష్కీజోఫ్రీనియా జబ్బు నాకుందని సృష్టిస్తే… మందులు వేసి పిచ్చిదాన్ని చేసేస్తే తనకు ఇక అడ్డుండదు అని ప్లాన్‌ చేసాడు. మొదటి మూడు రోజులు నేను తేరుకునే లోపల చాలా బలంతో నా నోట్లో మందులు వేసేసాడు. తర్వాతి రోజులు నేను మందుల వలన మత్తుగా, బలహీనంగా ఉన్నప్పుడు వేసాడు. తర్వాత నేనూ పిల్లలూ వేయనీయలేదు. నా మీద ఒక కృారమైన కుట్ర చేసాడు. మొదట నా శరీరాన్ని అవమానించాడు. నన్ను అభద్రతకు గురిచేసి నా దేహాన్ని నేనే శిక్షించుకునేలా, అవమానించుకునేలా చేస్తూనే మరో పక్క అమ్మాయిలతో తిరుగుతూ నన్ను మోసం చేసే ప్రయత్నం చేసాడు. నా మీద ఇంత భయంకరమైన మందులు ప్రయోగించడం చాలా అమానవీయం, నేరం. నేను ఊర్కోను ఆ మందులు వాడాక అంతకు ముందు లేని భయం, ఆందోళన, కోపం, ఉద్రేకం, పీడ కలలు, అయోమయం, వణుకుతో నరక బాధ అనుభవించాను. వీడ్ని జైలుకి పంపుతాను’’ శారద హిస్టీరిక్‌గ్గా ఏడ్చింది.

పిల్లలు తల్లడిల్లిపోతూ తల్లిని ఓదారుస్తున్నారు. ‘ఆ మందుల వలన అమ్మకి ఆకలి తగ్గిపోయింది. ఏం తిన్నా వాంతులు, విరోచనాలు అయిపోయేవి. 

రాత్రిళ్ళు నిద్రే పోయేది కాదాంటీ’ నిధి బాధగా అంటోంది. ‘ముందు ఆ డాక్టర్‌ సంగతేంటో చూద్దాం తర్వాత అన్నీ అవే బయటపడతాయి. నువ్వు పిల్లలు జాగ్రత్త. నువ్వు వాడు నీకు మందులేసిన మొదటి రోజే చెప్పాల్సింది నాకు. ‘నేను లాయర్‌తో మాట్లాడతాను. ముందు సాక్ష్యాలు సేకరించాలి మనం’ అంది హేమ.

` ` `

‘‘అరే… ఏం చెప్పాల భాయ్‌! ఒఠ్ఠి అనుమానపు గొడ్డు ఎవరితో మాట్లాడినా సంబంధాలు అంటగడుతుంది. ఆమె అనుమానంతో జీవితం నరకం అయిపోయింది. ఆఁ అవునోయ్‌ సైకియాట్రిస్ట్‌ కూడా కంఫర్మ్‌ చేసాడు. ‘పారానాయిడ్‌ ష్కీజోఫ్రీనియా’ అంట శారదకు. మందులు రాసాడు. వేస్కోదు. మొండితనం చేస్తున్నది. బలవంతాన వేస్తే ఉమ్మేస్తుంది మొన్న తోసేసింది కింద పడ్డాను. ఆఁ ఏం కాలేదులే. పిల్లలు కూడా ఆమెనే సపోర్ట్‌ చేస్తున్నారు. మా అక్కకీ, అమ్మకీ అందర్కీ ఫోన్లు చేసి మీ అబ్బాయి ఎవరితోనే తిరుగుతున్నాడు నేను కళ్ళారా చూసాను. ఆయన బెడ్రూమ్‌లో కండోమ్‌లు, వయాగ్రాలు బయట పడ్డాయి అని చెప్పిందిట. నేను ఆమెను స్లిమ్‌గా లేవని పొట్టతో అసహ్యంగా 

ఉన్నావని, తనని ముట్టుకోబుద్దే వేయడం లేదని తాను తింటున్న కంచంలో నీళ్ళు పోసేసి తినకుండా చేస్తున్నాననీ… రకరకాలుగా వేధిస్తున్నానని కూడా చెప్తున్నది. ఇప్పట్నించీ కాదునుకో కొన్నేళ్ళ నించీ ఇదే తంతు. అయినా ఒరెయ్‌ విజయ్‌ నీకో సంగతి చెప్పనా ఐ హేట్‌ ఫాట్‌ ఉమెన్‌. శారదకి ఎక్కడ బడితే అక్కడ ఫాట్‌ పేరుకుపోయింది. ఆమెను చూస్తేనే వెగటుగా అనిపిస్తుంది. ఇక కోరికెక్కడిది ఉన్న మాట చెబుతున్నా… ఐ లైక్‌ థిన్‌ వుమెన్‌. ఆడది సన్న జాజి తీగలాగా ఉండాలిరా కొవ్వెక్కిన పందిలా ఉండకూడదు శారదకిది అర్థం కాదు. డెలివరీలు అయ్యాక అట్లా తగలడిరది. ఆమే… ఆమె చారల పొట్ట… నా సెక్స్‌ లైఫ్‌ స్పాయిల్‌ అయ్యింది. ఆఖర్కి ఆ వినయ్‌ గాడు లేడూ మన బీటెక్‌ దోస్త్‌… లాస్ట్‌ బెంచీగాడు వాడిచ్చాడు ఈ ఆరెంపీ సురేందర్‌ నంబరు. ముందే కల్సి ప్లాన్‌ చెప్పినా. ఫేక్‌ ప్రిస్క్రిప్షన్‌ రాసినందుకు యాభై వేలు తీస్కున్నాడనుకో. కానీ బాగా వర్కౌట్‌ అవుతున్నది ఈ ప్లాన్‌. మందులు ఉమ్మేస్తే ఇంజెక్షన్స్‌ కూడా ఇవ్వచ్చన్నాడు అదే ప్లాన్‌లో ఉన్నా… ఆమెకి తెలీకుండా ఫుడ్‌లో… టీలో కూడా కలపచ్చన్నాడు. ఆ వినయ్‌గాడి దగ్గర నువ్వు కూడా ఆ డాక్టర్‌ నంబర్‌ తీస్కున్నావని చెప్పాడు ఎవరి కోసమోయ్‌.. అవునూ నీ సెకండ్‌ సెటప్‌ ఎట్లా ఉందోయ్‌. ఎక్కడో ఇల్లు తీస్కుని పెట్టావంట కదా. లక్కీఫెలోవిరా నీ దగ్గర ఎంత తీస్కున్నాడు ఆ డాక్టర్‌… చెప్పవేంటోయ్‌ రవీ?’’ తెరలు తెరలుగా నవ్వుతున్నాడు గౌతమ్‌. బాల్కనీలో తన వెనకే శారద నుల్చుని అంతా రికార్డ్‌ చేస్తుందని తెలీక. వింటున్న శారద ఆగ్రహంతో రగిలిపోయింది. మాధవ్‌ ఆ డాక్టర్‌ గురించి సమాచారం సేకరించి అసలు అలాంటి పేరుతో ఆ క్లినిక్‌ లేదనీ అతనో ఫేక్‌ ఆరెంపీ డాక్టరనీ చెప్పినప్పట్నించీ శారదకి పిచ్చెక్కిపోతున్నది. సాక్ష్యాలు సేకరించాలి ఇంకా. అందుకే మాధవ్‌ తన ఫ్రెండ్‌ని గౌతమ్‌ వివరాలు సేకరించమని పెట్టాడు. అతను ఒక మనిషిని ఏర్పాటు చేసాడు. వారం లోపలే గౌతమ్‌ రెండేళ్ళ నుంచీ రెగ్యులర్‌గా వెళ్తున్న అమీర్‌పేటలో ఒక అద్దె ఇంట్లో సుమ అనే ఇరవై ఏడేళ్ళ అమ్మాయితో పట్టుబడ్డాడు. ఫోటోలు అడ్రెస్‌లతో సహా సేకరించి శారదకి ఇచ్చాడు మాధవ్‌. శారద, హేమ ఏర్పాటు చేసిన లాయర్‌కి ఇచ్చింది అన్ని సాక్ష్యాలు.

గౌతమ్‌ రెడ్‌ హాండెడ్‌గా పట్టుబడ్డాడు. చాలా రకాలుగా బొంకే ప్రయత్నాలు చేసాడు కానీ ఏదీ నిలవలేదు. తన ఫ్రెండ్‌ రవితో చేసిన ఫోన్‌ సంభాషణలో తనే దొంగ జబ్బు శారదకు అంటగట్టినట్లు బయటపడిరది. పోలీస్‌ స్టేషన్‌లో గౌతమ్‌ మీద, ఫేక్‌ డాక్టరు సురేందర్‌ మీద కేసు నమోదు చేసారు. అలాగే గౌతమ్‌ ఫ్రెండ్‌ వినయ్‌, రవి ఇద్దరి పేర్లూ అదనంగా చేర్చారు. గౌతమ్‌, సురేందర్‌ వెంఠనే అరెస్ట్‌ అయ్యారు. గౌతమ్‌ తేరుకునేంత లోపే ఇదంతా జరిగిపోయింది. 

పోలీస్‌ స్టేషన్‌లో శారద ‘నాకు మానసిక జబ్బూ, భ్రమా, భ్రాంతులూ అంట గడతావురా… నువ్వే పెద్ద మానసిక రోగివి, నీకే ట్రీట్మెంట్‌ అవసరం. ఇప్పటికైనా వదిలిందారా నీ భ్రమా, భ్రాంతీ, నా తప్పెంటో తెలుసా ఇన్నేళ్ళూ నువ్వేదో మనిషివన్న భ్రాంతిలో కాపురం చేసా కదా… ఆ భ్రమలన్నీ పోయాయిరా’ అంటూ గౌతమ్‌ చెంపల మీద ఈడ్చికొట్టింది. 

ఇప్పుడు కూడా శారద రోజూ యోగా, వాకింగ్‌ చేస్తున్నది. కానీ ఒక్క పొట్ట తగ్గడం కోసం కాదు… గతంలో లాగా గౌతమ్‌తో తన కాపురం నిలబెట్టుకోవడం కోసమూ కాదు… కేవలం తన ఆరోగ్యం కోసం.

Leave a Reply