చిరకాల మిత్రుడు రమేష్ పట్నాయక్ తాను రాసిన ఐదు వ్యాసాలను ఒక సంపుటంగా ప్రచురిస్తూ దానికి ముందుమాట రాయమని నన్ను అడగడం ఒక ఆశ్చర్యం. ఈ ఐదు వ్యాసాలలో రెండు నా సంపాదకత్వంలోని ‘వీక్షణం’ లోనే వెలువడినప్పటికీ, ఆ రచనల్లో వ్యక్తమైన రాజకీయావగాహనలతో నాకు ఏకీభావం లేదని కొత్తగా చెప్పనవసరం లేదు. అలా ఏకీభావం లేకపోయినా ప్రగతిశీల శిబిరంలోని అన్ని భావాలనూ, భావఛాయలనూ ఆహ్వానించే ఒక వేదిక సంపాదకుడుగా ఆ వ్యాసాలను ప్రచురించడం వేరు, నేరుగా ఆ రచనల సంపుటానికే ముందుమాట రాయడం వేరు. అయితే ఎంత ఏకీభావం లేని విషయంతోనైనా చర్చ, సంభాషణ, సంవాదం జరపాలని, స్థూలంగా ఒకే శిబిరంలో ఉన్న భిన్నాభిప్రాయాల మధ్య, అభిప్రాయాల ఛాయాభేదాల మధ్య ఆరోగ్యకరమైన ఆదానప్రదానాల చర్చ నిరంతరం జరుగుతుండాలని నేననుకుంటాను. బహుశా నా రాజకీయాభిప్రాయాలు, తన అభిప్రాయాలతో నా విభేదాలు తెలిసి కూడ నా నుంచి ఈ నాలుగు మాటలు కోరుతున్నందువల్ల రమేష్ కూడ అట్లాగే ఆలోచిస్తున్నారనుకుంటాను. ఏమైనా నా నుంచి ఈ నాలుగు మాటలు కోరడం రమేష్ సౌహార్దానికి, అత్యవసరమైన ప్రజాస్వామిక చర్చా సంప్రదాయానికి గౌరవనీయమైన నిదర్శనం.
రమేష్ తో నా పరిచయం ముప్పై ఏళ్లకు పైనే కావచ్చు, పేరు వినడమైతే నలబై ఏళ్లుగా. డిగ్రీలో నా క్లాస్ మేట్, నాకు చాల ఇష్టమైన ఆలోచనాచరణవేత్త కె లక్ష్మినారాయణ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎ చేయడానికి వెళ్లి, అక్కడ సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎన్ యు సి ఐ) ప్రభావంలోకి వచ్చాక, ఆ ప్రభావంలోనే ఉండిన సహ విద్యార్థి, నిశితమైన చదువరి, ఆలోచనాపరుడు, అప్పటికే ఆ భావధారలో నాయకుడు రమేష్ గురించి వినడం మొదలయింది. ఆ తర్వాత లక్ష్మీనారాయణ రమేష్ కుటుంబసభ్యుడు కూడ అయినందువల్ల సన్నిహితమయ్యాడు. తర్వాత విద్యా పరిరక్షణ ఉద్యమంలో, అనేక ప్రజా ఉద్యమాల కార్యక్రమాలలో ఇద్దరమూ తరచుగానే కలుసుకుంటున్నాం, వేదికలు పంచుకుంటున్నాం. అభిప్రాయాలలో తేడాలు, కచ్చితమైన నిబద్ధతలు ఉన్నప్పటికీ మానవ సంబంధాలలో స్నేహం, ఆర్ద్రత కొనసాగవచ్చు. అలాగే, ఎంత తీవ్రమైన అభిప్రాయ భేదం ఉన్నప్పటికీ, అవతలివాళ్లు ఆ అభిప్రాయాన్ని గాడమైన అభినివేశంతో, లోతైన అధ్యయనంతో, ఆచరణతో ఏర్పరచుకుని ఉన్నప్పుడు, తప్పనిసరిగా వారిని గౌరవించవలసి ఉంటుంది. రమేష్ పట్ల ఆ స్నేహ సంబంధంతోనూ, గౌరవంతోనూ ఈ పుస్తకం మీద నా అభిప్రాయం రాయడం గౌరవంగా భావిస్తున్నాను.
ఇక్కడ సంపుటీకరిస్తున్న ఐదు వ్యాసాలు (‘భారతదేశంలో భూస్వామ్యవిధానం ఉందా?’, ‘పెట్టుబడిదారీ ఉత్పత్తి – శ్రమ దోపిడీ – మార్కెట్ సంక్షోభం’, ‘కులం – కుటుంబం – తెగ (కులం రాజకీయార్థశాస్త్రం)’, ‘డేవిడ్ హార్వే పెట్టుబడి – ఏడు ప్రాథమిక వైరుధ్యాలు’, ‘గిట్టుబాటు ఇస్తే వినియోగ ధరలు పెరుగుతాయా?’) ఐదు భిన్నమైన సందర్భాలలో రాసినవి. అంటే బహుశా భిన్నమైన పాఠకులను ఉద్దేశించి, భిన్నమైన చర్చలలో భాగంగా రాసినవి. మూడు లోతైన సైద్ధాంతిక చర్చ కోసం రాసినవి, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక రాజకీయార్థిక సంవాదంలో భాగంగా చూడవలసినవి. ఒకటి ఒక ప్రజా ఉద్యమ సందర్భంగా వెలికి వస్తున్న ఒక వాదనకు జవాబుగా ఉద్దేశించినది. ఒకటి ఒక అంతర్జాతీయ మార్క్సిస్టు రాజకీయార్థికవేత్త రాసిన పుస్తకంలోని కొన్ని భావాలను వివరిస్తూ, విశ్లేషిస్తూ, చర్చిస్తూ రాసినది. సహజంగానే ఈ ఇతివృత్తాల, సందర్భాల, పాఠకుల వైవిధ్యం వల్ల అవి వేరు వేరు అభివ్యక్తితో, వేరువేరు వాదనలుగా రాకతప్పదు. అయినప్పటికీ, వాటికి అవన్నీ ఒకే రచయిత రాశారనే ఏకసూత్రత మాత్రమే కాక, ఒకే రాజకీయార్థిక దృక్పథం నుంచి వెలువడినవనే ఏకసూత్రతా ఉంది.
అన్ని వ్యాసాలలోను ఉమ్మడి అంశం ఇవి యథాలాపంగా, పైపై పరిశీలనలతో రాసినవి కావు. రచయితకు లోతైన అధ్యయనం, సునిశితమైన దృష్టి, సమాజచలనం నుంచి తగిన ఉదాహరణలు ఎంచుకోగల సామర్థ్యం, మంచి వాదనా పటిమ ఉన్నాయని ప్రతి వ్యాసమూ చూపుతుంది. దాదాపు ప్రతి వ్యాసం లోనూ ఎన్నో కళ్లు మిరుమిట్లు గొలిపే వాదనలు, ఉదాహరణలు, సూత్రీకరణలు ఉన్నాయి. సాధారణంగా పాఠకులకు తెలిసిన విషయాన్నే ఇలా మరొక కోణం నుంచి చూడవచ్చునా అని ఆశ్చర్యం గొలిపే చర్చ ఉంది. తెలుగునాట మార్క్సిస్టు ఆలోచనా ధారలో ఒకప్పుడు విరివిగా ఉండినప్పటికీ, ఇటీవల బాగా తరిగిపోతున్న ఒక నిశితమైన సైద్ధాంతిక చర్చా, సంవాద సంప్రదాయానికి విలువైన చేర్పులు ఇవి.
ఈ వ్యాసాలలో అక్కడక్కడ చేసిన వ్యాఖ్యల పట్ల, నిర్ధారణల పట్ల నాకు భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ, మొత్తంగా వ్యాసాల దిశ తప్పనిసరిగా ఆహ్వానించవలసిందనడంలో సందేహం లేదు. చేయదలచుకున్న వాదనకు అవసరమైన, తగిన ఉపపత్తులను చూపడం, అవతలి వాదనలను పూర్వపక్షం చేయడం, ప్రణాళికాబద్ధమైన వాదనా నిర్మాణానికి పూనుకోవడం, తాను విశ్వసించే రాజకీయావగాహన నుంచి వెలువరించే నిర్ధారణల దిశగా వాదనలను నడపడం వంటి ఎన్నో అవసరమైన మంచి లక్షణాలు ఈ వ్యాసాల్లో ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ గురించి, రాజకీయార్థశాస్త్ర ప్రాతిపదికల గురించి, భారత సమాజ నిర్మాణం గురించి, భారత సమాజంలో జరగవలసిన విప్లవం గురించి ఈ వ్యాసాలు చాల అవసరమైన, కీలకమైన ప్రతిపాదనలు చేస్తాయి.
పాఠకులను మొట్టమొదట ఆకర్షించేది ఆ కీలక ప్రతిపాదనల విశిష్టత. ఒక సమాజ చలన క్రమంలో, భౌతిక పరిస్థితుల వేగవంతమైన మార్పులలో, స్వీయమానసిక శక్తులు మధ్యంతర దశ అనుకుని ప్రారంభించిన ఆచరణ దీర్ఘకాలిక దశగా మారవచ్చుననే విలువైన ఆలోచనను విస్తరించకపోయినా, సూచనప్రాయంగానైనా రమేష్ ఒక వ్యాసంలో ప్రతిపాదించారు. ఇది మన సామాజికాచరణలో సాగుతున్న ఒడిదుడుకులను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే సూత్రీకరణ. అలాగే, “శ్రమ కాసారాలైన సరుకులు ఎటువంటి శ్రమలేని నోట్లతో మారకం జరగడం” అనే ద్రవ్యం గురించిన రాజకీయార్థశాస్త్ర భావనను చాల ఆలోచనాస్ఫోరకంగా వివరించారు. వ్యవసాయాన్ని కూడ ఒక వృత్తిగా గుర్తించాలనీ, వ్యవసాయం ఇతర వృత్తుల వలె ఒక సంప్రదాయ వృత్తి అనీ, కులం గురించిన చర్చను అటు రాజకీయార్థ శాస్త్రం లోకీ, ఇటు కుటుంబం లోకీ విస్తరించడానికి ప్రయత్నం చేశారు. కుటుంబం ఉత్పత్తి యూనిట్ అని మార్క్సిస్టు రాజకీయార్థ శాస్త్రంలో శతాబ్దానికి పైగా ఉన్న భావనకే మరెన్ని కోణాలు, స్థాయిలు, పొరలు ఉండగల అవకాశం ఉందో సృజనాత్మకంగా విస్తరించారు.
మార్క్స్ కాపిటల్ మీద అపారమైన, అద్భుతమైన కృషి చేసిన డేవిడ్ హార్వేను సగౌరవంగా విశ్లేషిస్తూనే, ఆయన భావనలలో, వాదనలలో కూడ ఎటువంటి లోపాలు ఉన్నాయో, ఉండే అవకాశం ఉందో వివరించారు. డేవిడ్ హార్వే వివరించిన పదిహేడు వైరుధ్యాలలో ఏడు వైరుధ్యాలను తీసుకుని, భారత ఆర్థిక వ్యవస్థ ఉదాహరణల నుంచి మంచి మేధాచర్చ చేశారు. రెంటియర్ క్లాస్ (కౌలు వసూలుదారీ వర్గం) అనేది న్యాయాన్యాయాల చర్చ కాదు అని రాజకీయార్థశాస్త్ర చర్చలో అవసరమైన సైద్ధాంతిక పటుత్వం మీదికి దృష్టి మళ్లించారు. హార్వే సూచించిన రాజకీయ పరిష్కారాలను ఆమోదించడం కష్టం అని నిష్కర్షగా ప్రకటించారు. రాజ్యం పట్ల హార్వే వైఖరిలోని సందిగ్ధాలను విమర్శించారు.
రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తే వినియోగదారుకు ధరలు పెరుగుతాయనే అపోహను ఖండించడానికి జరిపిన అద్భుతమైన, విస్తారమైన చర్చలో వేరు వేరు ధరలను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం గురించీ, వాల్యూ చైన్ (విలువ గొలుసు) ను ఇంకా లోతుగా అర్థం చేసుకోవలసిన అవసరం గురించీ ఎన్నో ఆలోచనాస్ఫోరకమైన వాదనలు చేశారు.
ఎట్లాగూ మీరీ వ్యాసాలను లోతుగా చదవాలని కోరుకుంటున్నాను గనుక ఆ విశిష్టతల గురించి ఇంకా ఎక్కువ చెప్పను. కాని ఈ వ్యాసాల పరిధిలోనే రమేష్ కొన్ని వాదనలను, చర్చలను ఇంకా విస్తరిస్తే, మరికొన్ని కోణాలు కూడ కలిపి చర్చిస్తే బాగుండునని నాకనిపించింది. ఉదాహరణకు కౌలు వసూలుదార్ల గురించి చర్చ వచ్చినప్పుడు వారికి కౌలు వసూలు మీద, జూదం మీద ఉన్న దృష్టి, ఉత్పత్తి మీద, ఉత్పాదకత పెరుగుదల మీద ఉండదని, లేదా ఉండడం లేదని చాల చర్చ జరిగింది. ఆ చర్చను ఇక్కడ విస్తరించి ఉండవలసింది. అలాగే సోషలిజంలో కూడ ‘పనిని బట్టి ప్రతిఫలం’ అనే స్థితి ఉండక తప్పదని, కమ్యూనిస్టు దశలో మాత్రమే ‘శక్తి కొద్దీ పని, అవసరం కొద్దీ ప్రతిఫలం’ అనే స్థితి వస్తుందని జరిగిన విస్తారమైన చర్చను కూడ విలువ చర్చలో భాగం చేయవలసింది. కులానికి పాదార్థిక (భౌతిక) మూలాల గురించి చేసిన అద్భుతమైన చర్చలో సాంస్కృతిక, భావజాల ప్రోద్బలాల గురించి, చరిత్ర వారసత్వ భారం గురించి కూడ చర్చించవలసింది. వాల్యూ చైన్ చర్చ సందర్భంలో ఉదాహరణగా ఇచ్చిన లెక్కను ఇంకా విస్తరించి మొత్తం వ్యాపారం, మొత్తం లాభాల గురించి కూడ వివరించవలసింది. సరుకులు అమ్మకం కాకపోవడం వల్ల వచ్చే సంక్షోభం (రియలైజేషన్ క్రైసిస్) గురించి మాట్లాడుతున్నప్పుడే, అధికోత్పత్తి సంక్షోభం గురించి మరి కొన్ని కోణాలు చర్చించవలసింది. అది కేవలం అమ్మకం కాకుండా మిగిలిపోయే సరుకుల వ్యవహారం మాత్రమే కాదు, అసలు అధికోత్పత్తి అనేదే చరిత్రలో మొదటిసారి పెట్టుబడిదారీ విధానపు సృష్టి అని మార్క్స్, ఎంగెల్స్ లు చేసిన విశ్లేషణలను వినియోగించుకోవలసింది.
మొత్తంగా ఈ పుస్తకాన్ని, ఈ పుస్తకం ద్వారా రమేష్ సాగించిన, సాగించదలచిన అన్వేషణను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూనే నా భిన్నాభిప్రాయాల్ని ప్రకటించవలసి ఉంది. అది సాధారణ ముందుమాటల ఆనవాయితీ కాదు గాని, ఈ వ్యాసాలు చదువుతున్న పాఠకులకు మరొక కోణాన్ని చూపడం అవసరమని అనిపిస్తున్నది. ఎన్నో ఆహ్వానించవలసిన, ప్రశంసించవలసిన వాదనలూ విశ్లేషణలూ సూత్రీకరణలూ ఉన్న ఈ వ్యాసాలలో నిర్ధారణల దగ్గరికి వచ్చేసరికి మాత్రం కొన్నిచోట్ల రమేష్ తన వాదనల నుంచి తానే పక్కకు జరిగారని నాకనిపించింది. ఖండిస్తున్న వాదనను సంపూర్ణంగా, యథాతథంగా ఉటంకించి ఖండించడం కాకుండా, దాన్ని పొరపాటుగా, పలుచబరచి ఉటంకించి, ఒకరకంగా గడ్డిబొమ్మను తయారుచేసి, దాన్ని ఖండించామనుకునే అలవాటు ఒకటి మామూలుగా తెలుగు మేధా సంప్రదాయంలో ఉంది. కొన్ని సందర్భాలలో రమేష్ కూడ దానికి లోనయ్యారా అని విచారం కలిగింది. ఇతరుల వాదనలను విమర్శించేటప్పుడు రమేష్ చాల సందర్భాలలో అవసరమైన సమన్వయం పాటించారు గాని, ఆ సమన్వయం కోల్పోయిన సందర్భాలు కూడ ఉన్నాయి.
“అర్ధవలసగా ఉండడం వలననే వ్యవసాయక పారిశ్రామిక రంగాలలో తక్కువ వృద్ధి రేటు ఉంది” అనీ, “ప్రజాస్వామిక హక్కులు లేవు గనుక ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ కాదు” అనీ ఎవరో వాదిస్తున్నారనీ, వారు పునరాలోచించుకోవాలనీ అంటున్నప్పుడు రమేష్ ఆ అవతలి వాదనలను పూర్తిగా చిత్రించకుండా వ్యాఖ్యానించారనిపించింది. ఆ అవతలి వారు ఈ నిర్ధారణలను విడిగా ఏకైకం అన్నట్టుగా మాట్లాడడం లేదనీ, ఇటువంటి మరెన్నో నిదర్శనాలను కలిపి వాదిస్తున్నారనీ చూడకుండా, విడదీసి ఒక అంశానికి, ఒక కోణానికి జవాబు చెప్పినా, ఖండించినా, ఆ ఒక్క అంశాన్ని విడదీసినప్పుడు గెలుపు సాధించినా తానే ఇతరంగా చూపుతున్న తన మేధా సంప్రదాయానికి గౌరవం కాదు.
యూరపియన్ భూస్వామ్యానికి, భారతీయ భూస్వామ్యానికి సామ్యాలు, భేదాలు పరిగణనలోకి తీసుకుని, సమ్యగ్ దృక్పథం పాటించాలని రమేష్ చేసిన సూచన అత్యవసరమైనది. ఆ నేపథ్యంలో యూరపియన్ కౌలు రూపాలకూ, భారతీయ కౌలు రూపాలకూ పూర్తి సామ్యమూ లేదు, పూర్తి భేదమూ లేదు అని గుర్తించి స్వతంత్ర, సృజనాత్మక విశ్లేషణ చేయవలసి ఉంది. అలాగే భారత సమాజంలో “పెట్టుబడి అభివృద్ధి క్రమం అపభ్రంశం అయింది” అని కూడ రమేష్ సరిగ్గానే గుర్తించారు. కాని అదే నిర్ధారణను మరొక రూపంలో చేసినవారి మీద, “యూరప్ తరహా పెట్టుబడిదారుల కోసం వెతికి, వారు కనిపించకపోవడంతో పెట్టుబడిదారీ వ్యవస్థ వృద్ధి చెందలేదని” అంటున్నారనీ, వారు “పెట్టుబడిదారీ దోపిడీ దాని ఇతర రూపాలలో జరిగే అవకాశాలను పరిశీలించలేదు” అనీ, “ముందుగా నిర్ణయించుకున్న రాజకీయ పంథాను బలపరచుకోవడం అనే సంకుచిత లక్ష్యంతోనే”, “భూమి సమస్య విప్లవ సమస్య కాదంటే… అవకాశవాదులమై పోతామేమోననే భయం” తోనే వారాపని చేస్తున్నారనీ అన్నారు. “భూమిపై ఉత్పత్తిదారుడికి ఏ విధమైన హక్కు లేని, అదనపు ఉత్పత్తి విలువ ఏదో ఒక రూపంలో పెట్టుబడిగా మారే ఈ ఉత్పత్తి విధానాన్ని భూస్వామ్య విధానంగా చెప్పడం కష్టం” అనీ, “వ్యవసాయ కూలీల శాతం పెరుగుతుండడం పెట్టుబడిదారీ విధానాన్ని సూచిస్తుంది” అనీ వాదించారు. “విస్తృతంగా సాగుతున్న సరుకుల ఉత్పత్తి” పెట్టుబడిదారీ విధానానికి ఏకైక సూచిక అన్నట్టు వాదించారు. ధనిక రైతులకూ, వ్యవసాయ కూలీలకూ మధ్య “స్వతంత్రమైన కాంట్రాక్టు” ఉందని కాస్త చిత్రమైన వాదన చేశారు. కౌలు చెల్లించినవాడు అస్వతంత్ర రైతు కానప్పుడు, కౌలు స్వీకరించినవాడు భూస్వామి కానప్పుడు, వారి మధ్య సంబంధాన్ని భూస్వామ్య సంబంధం అనగలమా అనీ, వసూలు చేస్తున్న కౌలును “ఏదో ఒక రూపంలో పెట్టుబడిగా మారుస్తున్నప్పుడు” పెట్టుబడిదారుడు అని ఎందుకు అనగూడదు అనీ ప్రశ్నించారు. ఈ మొత్తం వాదనల నుంచి ఒక రాజకీయ నిర్ధారణగా “దున్నేవారికి భూమి నినాదానికి చారిత్రక సందర్భం ఉందా” అని ప్రశ్నించారు. “గణాంకాలు భూస్వామ్యాన్ని రుజువు చేయడం లేదు” అనీ, “విముక్తి ప్రాంతాల భావన నుంచి విముక్తి చెందనిదే ఈ పార్టీలు విస్తరించలేవు” అనీ అంతిమ నిర్ధారణలు చేశారు.
ఈ వాదనలూ చర్చలూ నిర్ధారణలూ దశాబ్దాలుగా భారత సామాజిక శాస్త్రాలలో, సామాజికాచరణలో సాగుతున్న విస్తారమైన చర్చలో భాగం. దాని మీద అంతిమ నిర్ధారణ ఏమీ లేదు. ఏ ఒక్క నిర్ధారణకూ ఇదే నూటికి నూరుపాళ్లు సక్రమమైన, సమగ్రమైన నిర్ధారణ అని చెప్పగల అవకాశాన్ని భారత సమాజం ఇవ్వడం లేదు. అయితే స్థూలంగా గుర్తించదగిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒక ఉత్పత్తి విధానం నుంచి మరొక ఉత్పత్తి విధానానికి పరివర్తన మౌలిక విచ్ఛిత్తి (రాడికల్ రప్చర్) అనే మార్క్సిస్టు సూత్రీకరణను అంగీకరిస్తే, భారత సమాజంలో ఆ మౌలిక విచ్ఛిత్తి జరిగిందా? ఎప్పుడు? ఆ మౌలిక విచ్ఛిత్తికి యూరప్ చరిత్రలో నైతే బూర్జువా ప్రజాస్వామిక విప్లవం అనే వ్యక్తీకరణ ఉండింది. భారత సమాజంలో దానితో సరిపోల్చగలిగిన చారిత్రక పరిణామం ఏదైనా ఉందా? బూర్జువా ప్రజాస్వామిక విప్లవాల క్రమంలో యూరప్ లో ఆవిర్భవించిన వ్యవస్థలను అటువంటి విప్లవమేదీ లేకుండానే భారత సమాజంలో అంటు కట్టడం వల్లనే అవి వక్రీకృత రూపాల్లో పని చేస్తున్నాయనే వాదనలో వాస్తవం లేదా? అసలు పెట్టుబడిదారీ విధానమే దాని తొలిరోజుల ప్రగతిశీల స్వభావాన్ని, భూస్వామ్య వ్యతిరేకతను, కాలక్రమంలో అది ద్రవ్య పెట్టుబడిగా, సామ్రాజ్యవాదంగా మారిన తర్వాత పోగొట్టుకుందని, అది భూస్వామ్యంతో, పెట్టుబడి పూర్వ సంబంధాలతో మిలాఖత్తును సాధించిందని చరిత్ర చూపుతున్నప్పుడు (పెట్టుబడి అభివృద్ధి క్రమం అపభ్రంశం అయిందని కూడ ఒప్పుకుంటున్నప్పుడు) ఇవి పెట్టుబడిదారీ సంబంధాలే అనాలనే పట్టుదల ఎందుకు? పెట్టుబడి రానే లేదనీ, సరుకీకరణ జరగనే లేదనీ ఎవరూ వాదించడంలేదు. వచ్చిన పెట్టుబడి స్వభావం ఏమిటి, సరుకు స్వభావం ఏమిటి అనేవే చర్చనీయాంశాలు. అలాగే, ఉత్పత్తి సంబంధాలు అనే మాటలు మార్క్స్ కేవలం ఆర్థిక, పాదార్థిక ఉత్పత్తికి మాత్రమే పరిమితం చేసినట్టుగా అర్థం చేసుకోవడం సరైనదేనా? సామాజిక-ఆర్థిక నిర్మితిలో సామాజిక, సాంస్కృతిక అంశాలను వేరు చేసి ఉత్పత్తి గణాంకాల, సరుకుల గణాంకాల ఆధారంగా మాత్రమే ఉత్పత్తి సంబంధాలను అర్థం చేసుకోవడంలో అసమగ్రత లేదా?
ఇటువంటి అంశాల చర్చకు ఒక ముందుమాట వేదిక కాదు గాని, రమేష్ చర్చించిన అంశాలకు, ముఖ్యంగా నిర్ధారణలకు ఇతర కోణాలున్నాయని చూపడమే నా ఉద్దేశం. అసలు ఇలా భిన్నాభిప్రాయాలు తలెత్తడానికి కారణమేమిటో నా ఆలోచన చెప్పి ఈ చర్చ ముగిస్తాను. రూప సారాల మధ్య ఏకీభావం ఉంటే శాస్త్రమే అవసరం ఉండదన్నాడు మార్క్స్. నిజానికి మార్క్స్ మాటను ఇంకా విస్తరించడానికి అవకాశం ఉంది. రూపం అని ఆయన ఏకవచనంలో చెప్పినట్టున్నాడు గాని, అది ఎప్పుడూ ఏకవచనం కాదు. ఒకే సారం అనేకానేక రూపాల్లో వ్యక్తమవుతుంది. పరిశీలకులు నిలబడిన స్థానం, చూసే కోణం వల్ల రూపాలు భిన్నంగా కనబడే అవకాశం కూడ ఉంది. సారం కూడ కచ్చితంగా ఒకటే అనడానికి వీలు లేదు. తాత్విక అర్థంలో సారానికి ఏకసూత్రత ఆపాదించవచ్చు గాని, సారం అనేది అనేక అంశాల సమ్మేళనం అయినప్పుడు, ఆయా అంశాలలో దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనేది స్వీయాత్మక నిర్ణయమే అవుతుంది. అంటే ఒక వస్తువు గురించి విశ్లేషించేటప్పుడు అది అనేక రూపాల్లో కనబడుతున్నందువల్ల, దాని సారంలోని భిన్నాంశాలకు పరిశీలకులు ఇచ్చే ప్రాధాన్యత వల్ల రూప సారాల గురించి భిన్నమైన, సాపేక్షికమైన అంచనాలు, విశ్లేషణలు, నిర్ధారణలు వెలువడే అవకాశం ఉంది. ఇటువంటి సాపేక్షిక వైఖరి, నిరంతర అధ్యయనం, నిరంతర విశ్లేషణ, అంతిమ పరిశీలనలో ఆచరణ మాత్రమే స్వీయాత్మక ఆలోచనల గీటురాయి అనే తులనాత్మక అవగాహన ఇవాళ్టి స్థితిలో ఉచితమనుకుంటాను.
‘వ్యక్తిస్వామ్య ఆస్తి’ అనే కొత్త మాటనూ, స్థిర, అస్థిర అనే మాటలకు వృద్ధిహీన, వృద్ధిశీల అనే మంచి ప్రత్యామ్నాయాలనూ సూచించిన రమేష్ వాడిన కొన్ని పదాల గురించీ, వ్యక్తీకరణల గురించీ కూడ ఒక మాట చెప్పాలి. ఒకటి, పదాల వాడకంలో పొరపాట్లు (ఆస్థి కాదు, ఆస్తి) సవరించుకోవాలి. అద్దె, కౌలు, కిరాయి లాంటి సులభమైన మాటలు వాడవలసిన చోట తెలుగు అకాడమీ సృష్టించిన భాటకం లాంటి గొట్టు సంస్కృత మాటలు వాడనక్కరలేదు. కన్సూమర్ (వినియోగదారు). కన్సూమరిజం (వినియోగ వస్తు వ్యామోహం) వంటి మాటలకు ఎవరు ఎప్పుడు పొరపాటు అనువాదం చేశారో గాని ‘వినిమయదారు’, ‘వినిమయవాద సంస్కృతి’, ‘వినిమయ సరుకులు’ వంటి మాటలు చలామణీలోకి వచ్చాయి. రాజకీయార్థశాస్త్రం తెలిసినవారు కూడ ఈ పొరపాటు మాటలు వాడుతున్నారు. వినిమయం అంటే ఎక్స్ చేంజ్. వినియోగం అంటే కన్సంప్షన్. ఆర్థిక వ్యవస్థలో నాలుగు ప్రక్రియలలో అవి రెండూ అవసరమైన ప్రక్రియలు. వినియోగ వస్తువుల (సరుకుల) మితిమీరిన వినియోగాన్ని, వస్తు వ్యామోహాన్ని కన్సూమరిజం అని ప్రతికూల అర్థంలో పిలుస్తున్నాం. అలాగే పెట్టుబడిదారీ విధానపు తొలిదశ (స్వేచ్ఛావాణిజ్యం) ఉదారవాదం అనీ, రాజ్య జోక్యాన్ని వ్యతిరేకిస్తున్న ప్రస్తుత దశ నయా ఉదారవాదం అనీ ఒక తటస్థ పదజాలం పాశ్చాత్య మేధా ప్రపంచంలో పుట్టి ఇక్కడికి యథాతథంగా వచ్చింది. కాని పెట్టుబడి అప్పుడు ప్రదర్శించిన ఔదార్యమూ లేదు, ఇప్పుడు ప్రదర్శిస్తున్న నయా ఔదార్యమూ లేదు. ఆ మాట చదువరులకు తప్పుడు అర్థాన్ని ఇచ్చే అవకాశం ఉంది గనుక వాడకుండా ఉండడం మంచిది. అన్ని వ్యాసాలలోనూ నాకు ప్రత్యేకంగా పంటి కింద రాళ్లలా తగిలినవి మరియు, పుంలింగ ప్రయోగాలు. మరియు అనేది తెలుగులో ప్రాచీన కావ్యభాషలో ఉండేది గాని వాడుక భాషలో లేదు. ఇంగ్లిష్ చదువుకున్నవాళ్లు అండ్ కు సమానార్థకంగా దాన్ని వాడుతున్నారు గాని, ఇంగ్లిష్ లో అండ్ వాడడానికి ఉన్న నియమాలు మనకు లేవు, అవసరం లేదు. ఆమాట తెలుగులో చాల కృతకంగా వినిపిస్తుంది. అది లేకుండా సరళమైన, హాయి అయిన వాక్యం రాయవచ్చు. అలాగే, కొనుగోలుదారుడు, ఉత్పత్తిదారుడు వంటి మాటలు గతంలో రాసేవారేమో గాని, స్త్రీవాద స్పృహ పెరిగిన తర్వాత ఈ స్పష్టమైన పుంలింగ ప్రయోగాల్ని తప్పించుకోవడానికి బహువచనం వాడవచ్చు. వాక్య నిర్మాణంలో క్లిష్టతను ఇంకా కొంత తగ్గించవచ్చుననీ, సరళమైన వాక్యాలు రాయవచ్చుననీ స్నేహపూర్వకమైన సలహా.
అవన్నీ ఎట్లా ఉన్నప్పటికీ, ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా చదివి చర్చించవలసిన పుస్తకంగా సాదరంగా, సగౌరవంగా, స్నేహపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.
“తాత్కాలికంగా కార్మికవర్గ విప్లవాలు వెనుకపట్టు పట్టినా, పెట్టుబడి వ్యవస్థ సృష్టిస్తున్న మార్కెట్ సంక్షోభం, ఉత్పత్తి అయిన సరకులు అమ్ముకోలేకపోవడమనే సంక్షోభం, మరింత విస్తృతంగా, మరింత బలంగా, మరింత విధ్వంసకరంగా ముందుకు వస్తూంది. అది వివిధ దేశాలలోనూ, ప్రపంచస్థాయిలోనూ విప్లవానికి కావలసిన పరిస్థితులను కల్పిస్తూ ఉంది…. విప్లవ యుగంలో విప్లవాలు ప్రతిక్షణం రావు. విప్లవ యుగంలో విప్లవ సంక్షోభాలు అనేకమార్లు వస్తాయి. కాని ప్రతి విప్లవ సంక్షోభం వెంటనే విప్లవం కాజాలదు. ఆపైన విప్లవం సద్యోజనితమైనది కాదు. అది మానవజాతి అత్యున్నత చైతన్యవంతమైన చర్య. అందుకు విప్లవ పార్టీ అవసరం… కార్మికవర్గ విప్లవం ప్రస్తుతమున్న ఉత్పత్తి సంబంధాల స్థానంలో చారిత్రకంగా అవసరమైన, సాధ్యమైన కొత్త ఉత్పత్తి సంబంధాలను ఏర్పరుస్తుంది. ఆ కొత్త ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి శక్తులను, వాటితో పాటు ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, నైతిక, సాహిత్య కళా రంగాలలో, పర్యావరణ రంగంలో సమాజాన్ని ప్రస్తుత సంక్షోభం నుంచి విముక్తి చేయడానికి ప్రాతిపదికలు కల్పిస్తాయి. ముందుకు తీసుకువెళతాయి. కార్మికవర్గం కుల, మత, లింగ, ప్రాంత, భాషా పరమైన అణచివేతలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను తన పోరాటంలో అంతర్భాగంగా చూడాలి. అట్టి పోరాటాల నిర్వహణకు చొరవ చూపాలి. మధ్యతరగతి వర్గం కార్మిక వర్గం తరఫుననే నిలబడాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టిస్తున్న ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, నైతిక, పర్యావరణ విధ్వంసానికి కార్మికవర్గ విప్లవమే పరిష్కారం” అని రమేష్ చేసిన నిర్ధారణతో, ప్రకటించిన ఆకాంక్షతో, ఆశావాదంతో సంపూర్ణంగా ఏకీభవిస్తూ, ఈ వ్యాసాలలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
హైదరాబాద్, జూన్ 2, 2023