గత పది సంవత్సరాలుగా కథలు రాస్తున్న పావని తన కథల సంకలనానికి ముందు మాట రాసివ్వమని అడిగింది. పావని వయస్సు రీత్యా మా చిన్నమ్మాయి తోటిది. విరసం సభల్లో, కథల వర్క్‌ షాపుల్లో ఇప్పటి యువతరపు ప్రతినిధిగా పరిచయం. వాళ్ల తాతది మధ్యతరగతి పై కులపు వ్యవసాయ కుటుంబం. కడప జిల్లాలోని పులివెందుల. గిట్టుబాటు కాని వ్యవసాయ గ్రామాల్లో ఊపిరిసలపనివ్వని భూస్వామిక ముఠా తగాదాలు, 1947లో అధికారమార్పిడి జరిగిన తర్వాత పల్లెల్లోకి అందివచ్చిన పాఠశాలలు, పావని తండ్రి చదువుకుని ఉద్యోగస్తుడిగా ప్రొద్దుటూరుకు మారారు. అప్పటికే పల్లెలనొదిలి పట్నాలలో స్థిరపడ్డ కుటుంబానికి చెందిన పావని అమ్మగారు వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. అంటే పల్లెవాసనలు పోని కుటుంబం.

పావని ఈ నేపథ్యంలోంచి హైదరబాద్‌లో ఎంబీఏ నుండి సాక్షి, టీవీ 99 లో జర్నలిస్టుగా, ఇప్పుడు ఢిల్లీలో ఉద్యోగం. దాదాపు మా కుటుంబ నేపథó్యం ఇంచు మించు ఇదే. ఈ ప్రయాణంలో ప్రతి చోట, ముఖ్యంగా సజావుగా ఎదగని సామాజిక పరిణామ క్రమంలో ఎన్ని రకాల వైరుధ్యాలు, సంఘర్షణలు, భావావేశాలు ఉంటాయో. ఒక జీవన నేపథ్యంలో నుండి, మరో జీవితంలోకి మారడం ఎన్ని రకాల యుద్ధ్దాలమయమో?

పావని విరసంలోకి తన మిత్రులందరిలాగే చేరింది. జర్నలిస్టుగా తన ప్రయాణంలో వైయుక్తిక, సామాజిక అనుభవాల్లోంచి గతితార్కిక చారిత్రిక ఆలోచనల్లోకి మారుతూ వచ్చింది.

ఈ సామాజిక పరిణామ క్రమంలేని వాళ్లు తమ వ్యక్తి గత జీవితంలో సామాజిక జీవితంలో జరిగే ప్రతి దాని గురించి కారణ కార్య సంబంధాలు తెలియక, సంఘర్షణంతా అనుభవిస్తూనే ఇట్లాంటి సంక్షోభాలకు కారణం తెలియక చీకట్లో తడుముకుంటూ ఉంటారు. దేవునికో, అదృష్టానికో, గీతకో, రాతకో అన్వయించుకొని బ్రతుకు గడుపుతుంటారు. అట్లా అన్ని చోట్లా పోటీ, స్వంతాస్తి కేంద్రంగాగల సమాజంలో వైఫల్యాలకు గురౌతూ ఉంటారు. ఇట్లాంటి మధ్యతరగతి భౌతికంగా, బౌద్ధికంగా ఉన్నత మైన జీవితం కోసం పరితపిస్తూ…జీవితం పొడుగుతా అసంతృప్త సంశయాత్మక జీవులుగా తచ్చాడుతూ ఉంటారు. తమ జీవితం ఒకానొక కాలంలో ఒకానొక ప్రాంతంలోని సామాజిక జీవితంలోని భాగమనే శాస్త్రీయ వివేచన వారి దరి చేరకుండా అనేక అవరోధాలు పకడ్బందీగా అల్లిన ఉచ్చుల్లో ఉంటారు.

తాము జీవించే కాలంలో, స్థలంలో మన సమస్త జీవన గమనానికి ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాల మధ్య వైరుధ్యమే కారణమని, ఇట్లాంటి వైరుధ్యంలోని గతితార్కిక చరిత్రను అర్థంచేసుకున్న మార్క్సిజం పావని జీవితంలో భాగమయ్యింది.

మరింక అది ఉండకాడ ఉండనియ్యదు. పునాది, ఉపరితలాలను మార్చే వర్గపోరాటంలోకి లక్షలాది ప్రపంచ ప్రజలందరిలాగే పావని- నేను నడువక తప్పలేదు. అంటే నిరంతర యుద్ధాల్లోకి మనస్పూర్తిగా దిగడమన్నమాట. ఇప్పుడిక్కడ అన్నిరకాల కార్య కారక సంబంధాలు అర్థమవ్వడమే కాక కూలిపోవాల్సిన పాతసమాజపు విషాద నిష్క్రమణపు దుఃఖపు నిట్టూర్పులు, కొత్తగా నిర్మించవలసిన సమాజపు ఉద్వేగ, త్యాగాల నిర్మాణయుతమైన సమిష్టి జీవితపు అనుభవం ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.

అదేమిటో తెలుసుకోవడానికి మొదట తనను తాను, ఆ పిదప తనచుట్టూ ఉన్న సహచరులను, జీవితాన్ని అధ్యయనం చేయడమే కాదు, తాను మనస్పూర్తిగా అందులో లీనం కాకతప్పదు.

అయితే ఈ పరిణామ క్రమం సరళమైనదేమీ కాదు. తనలో తాను, తన చుట్టూ ఆవరించిన ప్రపంచంలో తాను ఘర్షణా, ఐక్యతతోపురోగమించాల్సి ఉంటుంది.

ఇది భారతీయ సాంప్రదాయక కుటుంబ జీవితంలో పూర్తిగా భిన్నమైన దారి. పులివెందుల, ప్రొద్దుటూరు, హైదరాబాద్‌ నుండి ఢిల్లీ దాకా విస్తరించిన దారి. తమ జీవితంలోని ఇరుకులలో వంటరితనంలో కూరుకుపోయిన పులివెందుల, ప్రొద్దుటూరు, హైదరాబాద్‌, ఢిల్లీ నుండి అమెరికా దాకా – అనగా అర్ధ భూస్వామిక , అర్ధ వలస, సామ్రాజ్యవాద సమాజాల దాకా విస్తరించి ఉన్న వాళ్లు పావని ఎట్లా అర్థం చేసుకుంటారు? పావని వాళ్లను ఎట్లా అర్థం చేసుకున్నది? ఈ పరస్పర సంఘర్షణాత్మక జీవనంలోని కొన్ని శకలాలే పావని రాసిన ఈ పదేళ్ల కథలు.

                                                          2

పావని కథలు మూడు వేరువేరు స్థలకాలాల్లో అభివృద్ధికాని ఉత్పత్తి వనరులు, అర్ధ వలస, అర్ధ భూస్వామిక ఉత్పత్తి సంబంధాల నిరంతర సంఘర్షణ, వాటి మూలాలు తెలియక, తెలిసినా వైరుధ్యాలు పరిష్కరించే మార్గం, నిర్మాణం కార్యకలాపాలు అందక, అర్థం కాక, పెనుగులాడే వ్యక్తుల, కుటుంబాల, గ్రామాల, పట్నాల సామాజిక, రాజకీ యార్థిక పెనుగులాట ఈ మొత్తం కథల లోపలి సారాంశం.

గోడలు, భక్తిమార్గం, ఆవు ఆత్మహత్య, సిక్స్‌ ప్యాక్‌ రాముడు, వీకెండ్‌ వ్యవసాయం ఈ ఐదు కథలు ఇటీవలి కాలంలో ముఖ్యంగా గత పది సంవత్సరాల కాలంలో రాయలసీమ గ్రామ సీమల్లో – ముఖ్యంగా వ్యవసాయ రంగంలో జరుగుతున్న మార్పుల నేపథ్యంలో రాసిన కథలు.

స్థూలంగా మానవుని ఉత్పత్తి కార్యకలాపాలు అత్యంత ప్రాథమికమైన ఆచరణాత్మకమైనవని, అవే ఇతరత్రా అన్ని కార్యకలాపాలను అంతిమంగా ప్రభావితం చేస్తాయని మార్క్సిజం అవగాహన. మన గ్రామీణ ప్రాంతాల్లో అంతగా బలపడని అవగాహన..

ఈ నేపథ్యంలో రాయలసీమ వెనకబడిన ఉత్పత్తి శక్తుల గురించి దాదాపుగా అందరు రాయలసీమ రచయితలు -రచయిత్రులు వందలాది కథలు పదుల సంఖ్యలో నవలలు రాశారు. విశ్లేషణ చేశారు. సంఘర్షణాత్మకమైన రాయలసీమ విస్పోటనం బండి నారాయణ స్వామి రాసిన సప్తభూమి నవల, రాజారాం ఎదురగ్గి, పాణి నిప్పులవాగు నవలలు చిత్రించాయి. అంతకముందు వేమన, పోతులూరి వీరబ్రహ్మం నుంచి మౌఖిక, ప్రజాసాహిత్యం ఎంతో వచ్చింది.

ఉత్పత్తి సాధనాలు – మానవ శ్రమ, ఉత్పత్తి సాధనాలు భూములు, గనులు, నీటివనరులు, అడవులు, ముడిపదార్థాలు, ఉత్పత్తి పరికరాలు.. ఇవి రాయలసీమలో ఏవిధంగా ఉన్నాయో? ఎవరి ఆధీనంలో ఉన్నాయో ఇదివరకటి సాహిత్యంలో రక రకాలుగా వర్ణించబడిరది.

ఇక ఉత్పత్తి ప్రక్రియ కోసం పెట్టుకునే మానవ సంబంధాలు ఏవిధంగా ఉన్నాయి? వాటి స్వభావమేమిటి? అనే చర్చలు చాలా జరుగుతున్నాయి. ఒకరు ప్రజాస్వామికం అనీ, మరొకరు పెట్టుబడిదారీ అనీ, మార్క్సిస్టు లెనినిస్టు ఉద్యమం అర్ధ వలస, అర్ధ భూస్వామ్యమనీ.. వారివారి లక్ష్యాల మేరకు, పోరాటాల మేరకు అర్థం చేసుకున్నారు, వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే ఉత్పత్తి సంబంధాలను నిర్ణయించడానికి మూడు ప్రాతిపదికలను 1966 తరువాత చైనా సాంస్కృతిక విప్లవ నేపథ్యంలో మార్క్సిస్టు- లెనినిస్టు – మావోయిస్టులు రూపొందించుకున్నారు. అవి ప్రధానంగా ఉత్పత్తి సాధనాల యాజమాన్య రూపం భూములు, గనులు, ఫ్యాక్టరీలు, సమస్త యంత్రపరికరాలు ఎవరి చేతిలో ఉన్నాయి? అనేది. గ్రామీణ ప్రాంతాల్లో కుల ప్రాతిపదికన వర్గప్రాతిపదికన భూముల యాజమాన్య స్థితి ఉంది. కుల- వర్గ వైరుధ్యాలు మానవుల నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి గానీ, భూములను అభివృద్ధి చేయడానికి గానీ అడ్డంకిగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవసాయోత్పత్తిలో కీలకమైన దళితులు, మహిళలు, రైతుకూలీలు, పేద రైతులు, ఆదివాసుల చేతుల్లో భూమి లేదు. భారత దేశంలో ఇంగ్లీషు వారి ప్రవేశం కన్నా ముందటి అనేక యుద్ధాలు-ప్రజా పోరాటాలు ఈ అసమ స్థితి మార్పు కోసం జరిగాయి.

యూరప్‌లో అభివృద్ధి చెందిన పెట్టుబడిదారులు నిర్దాక్షిణ్యంగా భూస్వామ్యాన్ని కూలదోసి ఉత్పత్తి శక్తులను విముక్తం చేసి మధ్యయుగాల హింసాత్మక భూస్వామిక ఉత్పత్తి సంబంధాల స్థానే మెరుగైన ఉత్పత్తి సంబంధాలను నెలకొల్పారు. కానీ ఉత్పత్తి సాంకేతిక పరిజ్ఞానం పెరిగి పెట్టుబడిదారీ విధానం సామ్రాజ్యవాదంగా మారి బలహీనమైన భారతదేశంలాంటి దేశాల్లోకి వలస రూపం వచ్చి పాలన కొనసాగించింది. భారత దేశంలో బాల్యావస్థలో ఉన్న పెట్టుబడిదారులను వలస పెట్టుబడిదారులుగా దెబ్బతీశారు. సమూలంగా నిర్మూలించాల్సిన జిత్తులమారి అగ్రకుల బ్రాహ్మణీయ భూస్వామ్యం వలస వాదులతో కలిసిపోయింది. ఫలితంగా అర్ధ వలస, అర్ధ భూస్వామిక సంకర స్థితి ఏర్పడి సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది.

గ్రామసీమల్లో కుల, వర్గ భూస్వామిక సంబంధాలను విచ్ఛిన్నం చేయకుండానే పారిశ్రామిక ఉత్పత్తులు ప్రవేశించాయి. ఫలితంగా గ్రామసీమలు భూస్వామిక నిర్మాణం పూర్తిగా విధ్వంసం కాకుండానే, పైనుంచి వచ్చిన సామ్రాజ్యవాదపు మిగులు సరుకులతో నిండిపోయింది. ఇదొక వికృత, విధ్వంసకర పరిణామం. ప్రపంచీకరణ తర్వాత ఈ దాడి ముమ్మరమైంది.

1978లో రాడికల్‌ విద్యార్థులు గ్రామాల్లోకి వెళ్లి సమగ్ర సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారంగా ఇంచుమించు 70 శాతం ప్రజలు దేశంలో ఉత్పత్తి రంగంలో వ్యవసా యం 65 శాతం వాటా ఉండేది. పరిశ్రమల రంగం 23 శాతంగా ఉండేది. సర్వీసు రంగం 11 శాతంగా ఉండేది. ఇప్పుడది వ్యవసాయం 17 శాతానికి, పరిశ్రమ లకు 21 శాతానికి పడిపోయింది. 62 శాతానికి పైగా సర్వీసు రంగం విస్తరించింది. ఆహార ఉత్పత్తి 56లక్షల టన్నుల నుంచి 150 లక్షల టన్నులకు పెరిగింది. ఇంచు మించు మూడు రెట్లు, కానీ గిట్టుబాటు ధరలు లేక దేశీయ ఉత్పత్తిలో 17 శాతం పడిపోయింది. ఈ మిగులంతా సర్వీసు రంగం పేర దేశ విదేశ సామ్రాజ్యవాదులు దోచుకోగా.. ప్రపంచంలో 132వ పేద దేశంగా భారత దేశం మిగిలి పోయింది.

ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దళారీ బూర్జువాలకు కట్టబెట్టడానికి మూడు వ్యవసాయ చట్టాలు తేవడం ద్వారా గ్రామాల్లో వ్యవసాయ రంగంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొంటాయి. భారతీయ దివాళాకోరు ఆర్థిక రంగం గురించి నాకన్నా పావని లాంటి వారికి ఎక్కువ తెలుసు.

ఇక రెండవ అంశం. ఉత్పత్తిలో మనుషుల స్థానం. వారి మధ్యగల పరస్పర సంబంధాలు, భారత దేశంలో కుల, వర్గ, లింగ, మత, ప్రాంతీయ అసమానతలతో పరస్పర వైరుధ్యాలతో భూస్వామిక భావవాద భావజాలంతో మెజారిటీ భారతీయ ప్రజల సంబంధాలు ఉన్నాయి. వీటన్నిటినీ యథాతథంగా కాపాడుతూ అవసరమైతే అంతర్గత వైరుధ్యాలను పెంచుతూ దళారీ ప్రభుత్వాలు మనుగడ సాగిస్తున్నాయి. మూడువేల సంవత్సరాలుగా సుదీర్ఘ రక్తసిక్త యుద్ధాలతో కూడా బ్రాహ్మణీయం ఎట్లా మనగలుగుతున్నదో తాత్విక పరిణామక్రమం వర్గపోరాటాల నేపథ్యంలో అధ్యయనం జరుగుతున్నది.

మూడవది.. ఉత్పాదిత వస్తువు పంపిణీ. ఇది భారత దేశంలో మరీ దారుణంగా ఉంది. వ్యవసాయ ఉత్పత్తులను చౌకగా కొల్లగొడుతూ వాళ్లను బిక్షగాళ్లను చేస్తూ- గ్రామాల్లో బతుకు గడవక పట్టణాలకు వలస పోతున్నారు. అక్కడ దారుణమైన దోపిడి. వార్నేకర్‌ రాసినట్లుగా ప్రపంచీకరణలో ఉత్పత్తి వికేంద్రీకరణ జరిగి దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా పరిశ్రమలు కార్మికశక్తి స్థితిగతులు అజ్ఞాతంగా, అనూహ్యంగా మారిపోయాయి. మనదేశంలో అనియత కార్మిక వర్గం కాంట్రాక్టు లేబర్‌ వ్యవస్థ వచ్చింది. లక్షలాది ఇలాంటి కార్మికుల గురించిన సమాచారం లేదు. కరోనా సమయంలో సుమారు 16 కోట్ల మంది మైళ్ల కొద్దీ నడిచి ఊళ్లు చేరుకోవడం ఈ మార్పుకు కొండ గుర్తు. సర్వీసు రంగాల్లోనైతే దోపిడీ పరమ దారుణంగా ఉంటుంది. ఎవరికి ఎంత ఇస్తారో మరొకరికి తెలియదు. పరమ దారుణమైన వస్తుపంపిణీ భారత దేశంలో నెలకొనిఉంది. అందుకే జీవన ప్రమాణాల రీత్యా 132వ దేశంగా జీడీపీలో మూడో దేశంగా ఉందంటే…ఎంత దారుణమైన దోపిడీ పీడనలలో ఉందో అర్థమౌతుంది. ఈ మూడు లక్షణాలు కూడా భారత దేశంలో ఉత్పత్తి సంబంధాలు అర్ధ వలస, అర్ధ భూస్వామిక స్థితిని ప్రతిబింబిస్తున్నాయి.

                                                          3

దేవీప్రసాద్‌ చటోపాధ్యాయ భారతీయ తత్వశాస్త్రం అనే తన పుస్తకం పీఠికలో శాస్త్రీయంగా, సంతృప్తికరమైన తత్వశాస్త్రాన్ని నిర్మించడానికి తగిన శాస్త్ర సాంకేతిక పురోగతి మన దేశంలో లేదన్నారు. రెండో విషయం భావవాదులు తమలో తమకెన్ని శాఖా భేదాలున్నా, ఏకీకృత తాత్విక సాంప్రదాయకతను సృష్టించగలిగారు. వీరి పట్ల వేర్వేరు చోట్ల, పరస్పర విరుద్ధ్ద కారణాల నుండి వ్యతిరేకత వ్యక్తమైంది.

ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచవ్యాపితంగా ఆయా సందర్భాలల్లో జరిగిన కార్మిక వర్గపోరాటాలు, ఉత్పత్తి శక్తులను ఉత్పత్తి సంబంధాలను మార్చడానికి గతితార్కిక చారిత్రిక అవగాహనతో దేశవ్యాపిత సంఘటిత ఉద్యమంగా రూపొందలేదు. గతయాభై సంవత్సరాలుగా మూడు తరాలుగా కొనసాగుతున్న విప్లవోద్యమాలు తాత్వికంగా భావవాదాన్ని నిర్మూలించే పోరాటంలో ఉన్నాయి. కనుకనే పావని లాంటి విప్లవ రచయితలు ఇలాంటి కథలు రాస్తూ చర్చిస్తున్నారు. ఈ అవగాహన నేపథ్యంలో ఈ కథలను చూడాలి.

గోడలు కథ రాయలసీమలోని గంగనూరు కేంద్రంగా నడుస్తుంది. పెద్దనాన్న గంగనూరులో ఐదెకరాల రైతు. రాయలసీమలో ఆస్తి, అధికారం నిలబెట్టుకోవడానికి భూస్వామ్యపు మొరటు వ్యక్తీకరణగా ముఠా తగాదాలుండేవి. ప్రపంచీకరణకు ముందే ముఠా తగాదాలు పట్టణాలకు పాకి రియల్‌ ఎస్టేట్‌ మాఫియాగా అవతరించాయి. క్రమంగా రాజకీయ శక్తిగా ప్రపంచీకరణ నేపథ్యంలో కాంట్రాక్టులు, గనుల్లో ఖనిజాలు అమ్ముకుని దళారీ పారిశ్రామికవేత్తలుగా మారారు. ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు భూస్వామ్యాన్ని, ఇటు వలస సామ్రాజ్యవాద పెట్టుబడి దారులతో మిలాఖతు అయిన వారు కొత్త ముఖ్యమంత్రులు అయ్యారు. దళారీ పెట్టుబడిదారులను, అర్ధ వలస భూస్వామ్యాన్ని దాని జిత్తుల మారి హంతక స్వభావాన్ని అర్థం చేసుకోని వారు, బలైపోవడమో కనుమరుగైపోవడమో జరిగింది. ఒకే రాజ్యస్వభావం, ఒకే లక్ష్యంగల వేరు వేరు పేర్లు గల బూర్జువా పార్టీలు ప్రజాపోరాటాలు, సంక్షోభం ముదిరినప్పుడల్లా జెండాలు మార్చి అదే అగ్రకుల నాయకులు అధికారంలోకి రావడం అందరికీ తెలిసిందే. అందులోని భాగమే ఇందాకటి భావవాద ఏకీకరణకు సంబంధించిన రామజన్మభూమి ఇటుకలు. నేపథ్యంలో శ్రీకృష్ణ భగవానుని భగవద్గీత, శంకరాచార్యుని అద్వైతం, వల్లభాచార్యుని విశిష్టాద్వైతం వగైరా ఉన్నాయి. ఈ కథలో అగ్రకులానికి చెందిన పెద్ద నాన్న ముఠా తగాదాలు కేసులు పోయి వ్యవసాయంలో ఇమడలేని స్థితిలో తీర్థయాత్రలకు దేశం అంతా తిరిగి రామజన్మభూమి ఇటుకల తయారీకి పూనుకున్నాడు. ఉత్పత్తి వనరుల్లో ఉన్న పైన చెప్పిన వైరుధ్యాలను కుల, వర్గ, మత వైరుధ్యాలను రెచ్చగొట్టి సంక్షోభాన్ని దాటవేయడం ఏదో ఒకరకంగా మిగతా జనసమూహాల కన్నా ఆధిపత్యంలో ఉండాలనుకొనే భూస్వామిక అధికార వ్యక్త రూపం. ఫలితంగా పెదనాన్న చిరకాల మిత్రుడైన హుస్సేన్‌ శత్రువయ్యాడు. ఈ భావజాలంలో కుటుంబం భాగమయ్యింది. ఇది తెలిసిన శేఖర్‌ గడ్డపార తీసుకుని జైశ్రీరాం ఇటుకలను పగలగొట్టాడు. ఇది ఒక అసంకల్పిత భావవాద సంస్కరణ చర్యే. నిర్మాణం కాని ఉద్వేగంగా వ్యక్తరూపమది.

భక్తిమార్గం కథ కూడా ఈ నేపథ్యంలోనిదే. పెద్దనాన్న స్థానంలో లోగడ ముఠా తగాదాల్లో తిరిగిన యువకులు మత కార్యకర్తలయ్యారు. పిల్లలు పుట్టకపోతే పుట్టి దక్కక పోతే పెట్టుకున్న సూఫీ పేరును బైకు మీద రాసుకున్న హిందూ యువకుడ్ని చిన్న తగాదాలో మతకార్యకర్తల గుంపు కొట్టి చంపింది. ఒకప్పుడు ముఠాలతో కొట్టుకు చచ్చిన వారే ఇప్పుడు మతం పేరుతో కొట్ట్టుకు చస్తున్నారు.

సిక్స్‌ ప్యాక్‌ రాముడు కథ కూడా ఈ నేపథ్యం లోనిదే. కరోనా సమయంలో పట్నంలో ఉద్యోగం చేసే కుటుంబం పిల్లలతో సహా ఊరికి వస్తే.. అక్కడ ఒకప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖ నిర్వహణలో పిల్లల్లోకి మతభావాలు చొప్పించాలని చూసిన వ్యక్తే రాజకీయ నాయకుడిగా ఎదిగి కనిపిస్తాడు. ఆ రోజుల్లో ముస్లిం మిత్రుడిని ఫుడ్‌బాల్‌ ఆడటానికి రావద్దని మతవాదులు ఆంక్ష పెడితే శాఖను బహిష్కరించిన చిన్న పిల్లవాడు, అతని కుటుంబం ఈ పరిణామాన్ని విమర్శనాత్మకంగా చూడటం ఈ కథ సారం.

ప్రతీకాత్మకంగా రాసిన కథ ఆవు ఆత్మహత్య. పిచ్చిపట్టిన ఆవు గ్రామస్థులను కకావికలం చేస్తుంది. ఎమ్మెల్యే గారికి ఈ వ్యవహారం సంకటంగా మారింది. గ్రామస్థులు పిచ్చి ఆవు హింసాత్మక చర్యలు భరించలేక అందరూ వెంటపడి తరిమి స్కూల్‌ ఆవరణలోకి తోలి ప్రహరీ గోడ తలుపులు మూస్తారు. పిచ్చి ఆవు గోడ దూకడానికి ప్రయత్నించి పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫారానికి తగిలి చనిపోయింది. గ్రామస్థులు, ఎమ్మెల్యే ఊపిరి పీల్చుకుంటారు.

అత్యంత క్రూరమైన హింసాత్మక అగ్రకుల బ్రాహ్మణీయ భూస్వామ్యం మూడువేల సంవత్సరాలుగా భారతదేశంలోని ఉత్పత్తి శక్తుల పురోగమనాన్ని అడ్డుకుంటోంది. అన్ని రకాలుగా పరిణామక్రమాల్లో కూడా అది రూపం మార్చుకుంటోంది. అది దానికదే పోయేది కాదు యాదృశ్ఛికంగా జరిగేది కాదు. ప్రజలే చరిత్ర నిర్మాతలుగా వర్గపోరాటం ద్వారానే సాధ్యమని ప్రపంచ చరిత్ర నిరూపించింది.

వీటన్నిటి పరాకాష్ట ‘వీకెండు వ్యవసాయం’. ఉత్పత్తి శక్తులు, ఉత్పతి సంబంధాల మధ్య వైరుధ్యం మారకుండా ఆర్గానిక్‌ వ్యవసాయం చేసి జీరో ఖర్చు, లక్షల్ల ఆదాయం సంపాదించగలమనేది భావవాద మోసం. నేను వ్యక్తిగతంగా తెలంగాణాలో ఉన్న చాలా వ్యవసాయ క్షేత్రాలు (ఆర్గానిక్‌) తిరిగాను. నిజాయితీగా పని చేసినా మునుపటికన్నా తీవ్రమైన నష్టాల్లో కూరుకపోయిన రైతులున్నారు. ఇప్పటికీ మారుమూల గ్రామాలలో ఆదివాసులు ఇలాంటి వ్యవసాయమే చేస్తున్నారు. వాళ్ల మీద దాడులు జరుగుతున్నాయి.

ఇలాంటి తక్కువ పెట్టుబడితో నాణ్యమైన వ్యవసాయం రైతులు చేస్తే.. విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు ట్రాక్టర్లు వగైరా బహుళ జాతి కంపెనీల గతేమిటి? ప్రపంచీకరణ తరవాత మొత్తం వ్యవసాయపు ఉత్పత్తి ప్రక్రియ మహిళల మీద పడ్డది. సాంకేతికంగా అభివృద్ధి కాని ఫ్యూడల్‌ కుల, వర్గ, మత వైరుధ్యాలు అంతకన్నా ఉత్పత్తి సాధనాలు భూమి, పరికరాలు, యాజమాన్యస్థితి మారకుండా సామ్రాజ్యవాద ఉత్పత్తి పరికరాలు, ట్రాక్టర్లు, పురుగుమందులు, వస్తువులు ప్రవేశించి గ్రామ సీమలల్లోని ఉత్పత్తిని పూర్తిగా కొల్లగొట్టాయి. పల్లెల నుండి పట్నాలకు వలసలు పెరిగినై. అందుకే ఒకప్పుడు 65 శాతంగా ఉన్న వ్యవసాయరంగం జీడీపీ 17 శాతానికి వచ్చింది. అదే సమయంలో ఉత్పత్తి మూడు రెట్లు పెరిగింది. 11 శాతంగా ఉన్న సేవారంగం 62 శాతానికి విస్తరించి దోపిడీ సాగుతోంది. ఇలాంటి దోపిడీ భరించలేక ప్రజా ఉద్యమాలు తీవ్రతరమయ్యాయి. ఈ సంక్షోభాన్ని పక్కదారి పట్టించడానికి పెట్టుబడిదారులకు, కట్టుకథలకు పూర్తిగా సేవచేస్తూ.. ఇలాంటి వీకెండు, ఆర్గానిక్‌ వ్యవసాయాలు, యోగా, తృణ ధాన్యాల లాంటి ప్రచారాలు ప్రసారాలు ముమ్మరమయ్యాయి. ఇది ఒక భావవాద ప్రచార ఎత్తుగడ. ఈ ప్రచారాలను శాస్త్రీయం గా అధ్యయనం చేస్తే దీని వెనుక ఎవరున్నారో? వారి లక్ష్యమేమిటో అర్థమైతుంది. అర్ధసత్యాలను సత్యాలుగా ప్రచారం చేయడం ఈ తరహా ప్రచారం.

                                                          4

ఇక పట్టణ నేపథ్యంలో అందులో ఇలాంటి సంక్షోభసమయంలో దీర్ఘకాలిక యుద్ధ బీభత్సాల మధ్య యువకులు, ముఖ్యంగా మహిళలు సాంప్రదాయక భూస్వామ్య భావజాలం నుండి బయట పడటానికి పెనుగులాడే కథలు మిగతావి.

‘కొన్ని రంగులు ఒక కల’ భారత దేశంలోని పరిస్థితులను ఎదుర్కోలేక వలసపోయిన యువకుల కథ. ఒకప్పుడు వ్యవసాయం పెద్ద ఎత్తున చేయడానికి ఆఫ్రికాదేశపు నల్ల బానిసలను కొనుక్కున్నట్లుగానే.. ఇప్పుడు ప్రపంచంలోని సంపద నంతా దోచిన అమెరికా ప్రపంచం మీద ఆధిపత్యం వహించడానికి వీళ్లకు మేధోపరమైన సేవలందించడానికి సాఫ్ట్‌వేర్‌ నిపుణులైన మేధోజీవులను తెచ్చుకుంటోంది. ప్రపంచంలోని శాస్త్ర సాంకేతిక నిష్ణాతులను దిగుమతి చేసుకుంటోంది. వారి ఎదుగుదలకు శిక్షణకు బాధ్యతపడకుండా భారతదేశపు అస్తవ్యస్త సామాజిక వ్యవస్థలో ఇమడజాలని యువత అమెరికా చేరుకుంటోంది. వేలాడే కత్తి కింద పనిచేస్తూ ఆ ఊబిలో ఎంతో మంది కూరుకుపోయారు. వీళ్లంతా పలాయితులు. ఎక్కువ మంది శాస్త్రీయ అవగాహన కొరవడిన వాళ్లు.

తమిళ మేఘం- కేరళ తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులు ఉరిమి మహిళా సంఘం ఏర్పాటు చేసుకుంటే అక్కడ కమ్యునిస్టులుగా చెప్పుకునే ప్రభుత్వం ఆ ఉద్యమ నాయకురాలి మీద దాడి చేస్తుంది. అంతకు ముందు అక్కడ భూ పోరాటం జరిగి టీ ప్లాంటేషన్‌ పంచారు. పావని అక్కడికి వెళ్లి రాసిన కథ ఇది.

అన్ని భావవాద విలువల్లాగే తెల్లరంగు, నల్లరంగు మనుషుల మధ్య విభేదాలు సృష్టించాయి. విచిత్రమైన ఈ కల్పిత ఊహాత్మకమైన అందం చుట్టూ భారతీయ సాహిత్యం కుప్పలు తెప్పలుగా ఇప్పటికీ ఇస్తోంది. అద్భుతమైన శ్రమైక జీవన సౌందర్యాన్ని మసిబూసి మాయజేయడానికి ప్రచార, ప్రసార మాధ్యమాలు, సినిమాలు లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నాయి. అనాకారులైన, దోపిడీదారులైన, హింసాత్మకమైన పిడికెడు మంది అష్టావక్రులైన పదిశాతం అగ్రకుల తెల్లతోలు భూస్వామిక దళారుల వికృత రూపాలను కప్పిపుచ్చడానికి, హెచ్చుచేయడానికి చేసే ప్రయత్నమే ఇది. ఒక తప్పుడు విలువ జన సామాన్యంలోకి ఇంకిపోయాక నల్ల రంగు ఆడపిల్లలకు హింసాత్మకంగా మారింది. ప్రపంచ సుందరి పోటీలు పెట్టి దీన్ని ప్రపంచమంతా ప్రచారం చేస్తున్నారు. మానవుల సహజసిద్ధమైన ప్రాకృతిక, భిన్న రంగుల, ఆలోచన, ఆచరణల భౌతిక, బౌద్ధిక శ్రమైక సౌందర్యాన్ని కించపరుస్తూ వ్యాపారం చేస్తున్నారు. అన్ని రకాల సౌందర్య సాధనాలు ఈ తప్పుడు విలువాధారిత ఉత్పత్తులే. ఈ స్థితుల నుంచి రాసిన కథ ‘నాపేరు శూర్పణఖ’.

భారత దేశంలో జరుగుతున్న విప్లవోద్యమ నేపథ్యంలో ఇప్పుడు థర్డ్‌ జెండర్‌ సమస్య తీవ్రమౌతున్నది. భారతదేశ భూస్వామ్యమంత పురాతనమైనదీ సమస్య. యుద్ధాల్లో పశుసంపద, మహిళలు, యుద్ధ ఖైదీలను బందీలుగా తీసుకుపోయిన దగ్గర నుండి కొంత మందిని తమ అంతఃపుర సేవలకు వినియోగించడానికి బలవంతపు లింగ మార్పిడులు జరిగాయి. పుట్టుకతో వచ్చిన వారితో పాటు రకరకాల సామాజిక నేపథ్యాలల్లో సమాజంలో వారి ఆర్థిక, సామాజిక స్థానం మారుతూ వచ్చింది. ఇప్పుడు అది మరింత హింసాత్మకంగా మారింది.

అయితే అన్నిరకాల వైరుధ్యాలతోపాటు తమ సమస్యను కూడా ప్రజాస్వామికంగా పరిష్కరించాలని, మిగతా మైనారిటీల్లానే తమకూ సామాజిక హోదా దక్కాలని ట్రాన్స్‌ జండర్‌ సమూహం ఉద్యమాలు చేస్తున్నది. మానబీ బందోపాధ్యాయ మొదటి ట్రాన్స్‌జెండర్‌ డాక్టరేట్‌, బెంగాల్‌లో ఒక ఉమెన్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌. షబ్నమ్‌ మౌసీ బానో, ఒకప్పటి మధ్యప్రదేశ్‌లోని శాసన సభ సభ్యురాలు, కవయిత్రి దిషా పింకీ షేక్‌ లాంటి వాళ్లు దేశవ్యాప్తంగా ఈ సమస్యపై ఉద్యమిస్తున్నారు. వంటరి సమూహంలో ఇలాంటి వాళ్ల భౌతిక, మానసిక ప్రపంచాల్ని పావని చిత్రించింది.

ఇంకొక కథ బ్రేకప్‌, స్వలింగ సంపర్కం నుండి పెళ్ళి చేసుకుని సాధారణ కుటుంబ జీవితంలోకి రావడం ఈ కథ.

ఈ మొత్తం సామాజిక పరిణామాల పరాకాష్ట మునెమ్మవ్వ కథ. విధ్వంసమైన పల్లెల్లో, పట్నాలలో సమస్త జీవిత రంగాలను సెల్‌ఫోన్లు, టీవీలు, వినిమయ సరుకులు ఆక్రమించిన ప్రపంచంలో ఈ కుట్రలు తెలియని భావవాద భారతీయ ప్రజల్లో ఒక భీతావహమైన ఒంటరితనం, మౌనం పెరిగింది. బహుశా వన్‌ హండ్రెడ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ సాలిట్యూడ్‌ మార్కోస్‌ నవలలో మూడువేల మంది అరటితోట కార్మికులను అందరూ చూస్తుండగా కాల్చి చంపినా నోరు మెదపని మౌనం. బద్దలు కాబోయే అగ్నిపర్వతపు మౌనం దారులు వెతుకుతున్నది. జీవనోపాధి కోసం తనను పల్లెలను వదలి పట్నాల దారి పట్టిన కొడుకులు, బిడ్డలు గల మునెమ్మవ్వ ఒకప్పుడు గలగలా ఒక కొడవాగులా మాట్లాడి- కథలు చెప్పే మునెమ్మవ్వ..మాట్లాడే వాళ్లు లేక మూగబోయింది.

ఆ విషయం మునెమ్మవ్వ మనవరాలి నోటి నుండి విని ఆమె స్నేహితురాలు ఒక ప్లే స్కూల్‌ పెట్టి మునెమ్మవ్వను తెచ్చి చిన్నపిల్లలకు కథలు చెప్పడానికి పురికొల్పింది. మనుమరాలు మునెమ్మవ్వ దగ్గరకు వెళుతుంది. ఇది ఒక ఆశావహమైన ముగింపు.

తన గురించి, తన చుట్టూ విస్తరించి ఉన్న సమాజం గురించి గతితార్కికంగా, చారిత్రికంగా చిత్రించడం తెలిసిన పావని బోల్షివిక్‌ స్పిరిట్‌తో ముందుకు సాగాలని కోరుకుంటూ..

అల్లం రాజయ్య
మంచిర్యాల

Leave a Reply