ఎనిమిదేళ్ల క్రితం జాజ్‌పూర్ జిల్లాలో పోషకాహార లోపంతో 19 మంది చిన్నారులు చనిపోయారు. ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పేమీ లేదు.
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలోని ఘటిసాహి గ్రామంలో ఆదివాసీ కుటుంబానికి చెందిన 11 ఏళ్ల బాలుడు అర్జున్ మార్చి ప్రారంభంలో మరణించాడు. రెండు రోజుల క్రితం చివరిసారిగా అన్నం తిన్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. పోస్ట్ మార్టం చేయలేదు, కానీ మీడియా అర్జున్ మరణాన్ని పోషకాహార లోపం కేసుగా ప్రచురించడంతో స్థానిక అధికారులు రంగంలోకి దిగారు.
పరిస్థితి విషమంగా వున్న అర్జున్ తోబుట్టువులు ఇద్దరు, తొమ్మిది నెలల రైసింగ్, 10 ఏళ్ల కునిలను మార్చి 23 నాటికి, జిల్లా ఆరోగ్య సంరక్షణ అధికారులు, స్థానిక కార్యకర్తలు కటక్‌లోని SCB హాస్పిటల్‌లోని పిల్లల విభాగం, శిషు భవన్‌లో చేర్చారు.
రైసింగ్, శ్వాసకోశ వ్యాధితోనూ, తీవ్రమైన పోషకాహార లోపంతోనూ బాధపడుతున్నారు. ఆరోగ్యవంతమైన 10 ఏళ్ల వయస్సు ఉన్నవారి సగటు బరువు (ఎత్తుని బట్టి వుండాల్సిన బరువు) దాదాపు 32 కిలోలు కాగా – కేవలం 6.2 కిలోల బరువున్న కుని అతి తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నాడని అక్కడి వైద్యులు తెలిపారు.
పోషకాహార లోపంతో మరణాలు ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాకు కొత్త కాదు. ఎనిమిదేళ్ల క్రితం, జాజ్‌పూర్ జిల్లాలోని మారుమూల కుగ్రామమైన నగాడాలో, ఆగస్టు 2016లో మూడు నుంచి నాలుగు నెలల వ్యవధిలో పోషకాహార లోపం కారణంగా కనీసం 19 మంది పిల్లలు మరణించారు.
ఆ ప్రాంతంలో ఆహార భద్రత, ఆరోగ్య సేవలు, సరైన రవాణా సేవలను చూస్తామని హామీ ఇస్తూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆనాడు ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశాడు.
కానీ నగాడాకు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘటిసాహిలో, అర్జున్ తల్లిదండ్రులు తులసి, బంకు హెంబ్రామ్, అతని తోబుట్టువులకు కొంతకాలంగా భోజనం లేదు. తరచుగా అన్నం పులియబెట్టి తయారుచేసే మత్తు పానీయం “హాండియా” మాత్రమే తాగి నిద్రపోతున్నారు.
పిల్లలు ఆసుపత్రిలో చేరిన కొన్ని రోజుల తర్వాత మార్చి 28న, ఆహార హక్కుల, ప్రజారోగ్య కార్యకర్తలు, పాత్రికేయులతో కూడిన ఏడుగురు సభ్యుల నిజనిర్ధారణ బృందం కటక్‌లోని ఆసుపత్రిని, వారి గ్రామాన్ని సందర్శించింది. కుటుంబం ఆహార, వేతన అభద్రత కాలక్రమేణా మరింత తీవ్రమవుతోందని బృందం కనుగొంది. ఈ వ్యాస రచయితలలో ఒకరు ఆ నిజనిర్ధారణ బృందంలో సభ్యుడు.
నిరుపేద కుటుంబం
హెంబ్రామ్ కుటుంబానికి, ఆ ప్రాంతంలోని ముండా సమాజానికి చెందిన చాలామందికి వ్యవసాయ భూమి లేదా పశువులు లేవు. బంకు హెంబ్రామ్ తండ్రి పేరు మీద నమోదు చేయబడిన ఒకే గది వున్న ఇంట్లో వారు నివసిస్తున్నారు.
అర్జున్‌కి కళ్ళు కనబడవు, కుని, మరో ఐదు సంవత్సరాల తోబుట్టువు వికలాంగులు. అయినప్పటికీ, ఒడిశా ప్రభుత్వం హామీ ఇచ్చిన ‘ప్రతి వ్యక్తికి నెలకు రూ. 500 వికలాంగుల పింఛను’ ఆ కుటుంబానికి అందలేదు.
కుటుంబంలోని ఇతర పిల్లల స్థితిని అంచనా వేయడం కోసం జాజ్‌పూర్‌లోని సుకిందా పట్టణంలోని పోషకాహార పునరావాస కేంద్రానికి తీసుకువెళ్ళి, ఆ తర్వాత వారిని పునరావాసం కోసం శిశు సంరక్షణా కేంద్రానికి పంపారు.
ఈ దంపతులకు తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. తులసి హేంబ్రామ్ కాన్పులన్నీ ఇంట్లోనే జరిగాయి. తులసి హేంబ్రామ్ గర్భం దాల్చడానికి ముందు, ఆ తర్వాత సరైన ప్రసూతి సంరక్షణ అందలేదు, పిల్లలకు టీకాలు వేయలేదు.
తక్కువ-ఆదాయ స్థాయి వుండడం అనేది కుటుంబ నియంత్రణను పరిమితంగా అమలుచేయడంతో ముడిపడి వుంది. పేద కుటుంబాలకు కుటుంబ నియంత్రణ సలహా, సంస్థాగత ప్రసూతి, రోగనిరోధకత ఏర్పాట్ల అవసరం ఎంతైనా వుంది.
ఆహార అభద్రత
కుటుంబానికి రేషన్ కార్డు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ పోర్టల్ నుండి వచ్చిన డేటాను బట్టి కార్డు కొంతకాలంగా నిష్క్రియంగా వుంది. 2021 జూలైలో చివరిసారిగా కుటుంబానికి రేషన్ అర్హత లభించినట్లు రేషన్ బుక్ కాపీ చూపింది.
కుటుంబంలో పెద్ద కుమార్తె అయిన బుదునికి తాము ఎప్పుడు రేషన్ తీసుకున్నారో గుర్తులేదు, వెళ్ళిన ప్రతి సారి మీ కార్డు “రద్దు అయింది” అని వెళ్లగొట్టేవాడని చెప్పింది.
తమ ఇంట్లో తిండి గింజల కొరత ఎక్కువగా ఉండేదని, తరచుగా భోజనం చేయడం మానేసామని, ఎప్పుడైనా పొరుగింటి నుంచి పిడికెడు బియ్యం అప్పు తీసుకొనేవారిమని కుటుంబీకులు తెలిపారు. “బియ్యం మా ప్రధాన ఆహారం, కానీ ఏది దొరికితే అదే తింటాము” అని బుదుని హెంబ్రామ్ చెప్పారు.
నీలకంఠపూర్ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు పిల్లలను చేర్చారు, ఇందులో మొత్తం 105 మంది విద్యార్థులు – 51 మంది బాలురు, 54 మంది బాలికలు- ముగ్గురు ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయుడు ఉన్నారు. విద్యార్థులకు సక్రమంగా మధ్యాహ్న భోజనం అందుతున్నదని గ్రామస్తులు, ఉపాధ్యాయులు తెలిపారు. ఫిబ్రవరి 25 వరకు, మధ్యాహ్న భోజన స్టాక్ రిజిస్టర్ నుండి వచ్చిన డేటా పాఠశాలలో బియ్యం నిల్వలు 0.47 క్వింటాళ్లు తక్కువగా ఉన్నట్లు తేలింది. అర్జున్ హెంబ్రామ్ మరణానంతరం మాత్రమే పాఠశాలలో బియ్యం నిల్వలు ఎక్కువగా వున్నాయి.
రెండు గ్రామాలకు కలిపి వున్న సమీపంలోని మినీ అంగన్‌వాడీ కేంద్రంలో రైసింగ్, మూడు సంవత్సరాల బిడ్డల పేర్లను నమోదు చేశారు. చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యం, పౌష్టికాహార అవసరాన్ని అంగన్‌వాడీలు చూస్తాయి.
ఈ అంగన్‌వాడీ కేంద్రంలో 37 మంది నమోదిత లబ్ధిదారులు ఉన్నారు: 19 మంది మూడు నుండి ఆరు సంవత్సరాల వయస్సు గల పిల్లలు, 16 మంది ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల వయస్సు గల పిల్లలు, ఇద్దరు గర్భిణీ స్త్రీలు. ఇద్దరు పిల్లలు అతి తీవ్రమైన పోషకాహారలోపం, ఐదుగురు మితమైన తీవ్రమైన పోషకాహార లోపంతో వున్నారు.
తక్కువ వేతనాలు
తులసి, బంకులు తోట, వ్యవసాయ కూలీలుగా పనిచేస్తారు, వారికి పని దొరికినప్పుడు రోజుకు రూ.250-రూ.500 సంపాదిస్తారు. తులసినే ఇంటి ప్రధాన సంపాదనాపరుడు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేదా నరేగాలో తల్లిదండ్రులిద్దరి పేరు మీద జాబ్ కార్డ్‌లు లేవు. పని అడిగే ఏ గ్రామీణ కుటుంబానికైనా సంవత్సరానికి 100 రోజుల వరకు పని కల్పించడం దీని ఉద్దేశ్యం. బంకు తండ్రికి ఉన్న జాబ్ కార్డ్‌లో కుటుంబ సభ్యులుగా వీరిద్దరి పేరు మాత్రమే వుంది. అయితే ఈ కార్డును కూడా 2017 జనవరిలో తొలగించినట్లు గ్రామీణ ఉపాధి హామీ పథకం పోర్టల్ నుండి వచ్చిన డేటా చూపింది.
ఘటిసాహి గ్రామం పరిధిలోకి వచ్చే రణగుండి గ్రామ పంచాయతీలో జారీ చేసిన జాబ్ కార్డ్‌లలో దాదాపు సగం మాత్రమే (747లో 378) ఏప్రిల్ 18 నాటికి సక్రియంగా ఉన్నాయని అధికారిక డేటా చూపించింది.
అంటే దీనర్థం అధికారిక నిర్వచనాల ప్రకారం, గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో 378 కుటుంబాలు మాత్రమే తాము పని చేసినట్లుగా కనీసం ఒకరోజు నమోదు చేసుకున్నాయి. ఒక కుటుంబానికి అందించబడిన సగటు ఉపాధి దినాలు 35.42 మాత్రమే. ఏడు కుటుంబాలు మాత్రమే పథకం కింద 100 రోజుల వేతన ఉపాధిని పూర్తి చేశాయి.
ఈ ఏడాది నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అప్లికేషన్ వల్ల పంచాయతీలో చాలా పనులు దెబ్బతిన్నాయని గ్రామ సర్పంచ్ తెలిపారు. జనవరి నుంచి ఉపాధి హామీ పథకంలో కూలీల హాజరును మొబైల్ అప్లికేషన్ ద్వారా తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. సూపర్‌వైజర్లు ఉదయం, సాయంత్రం పనికి వచ్చిన వారి రెండు ఫోటోగ్రాఫ్‌లను అప్‌లోడ్ చేయాలి. అయితే అనేక గ్రామీణ ప్రాంతాల్లో నెట్ కనెక్షన్ సరిగా లేకపోవడంతో కొత్త నిబంధన వల్ల పెద్దఎత్తున అంతరాయం ఏర్పడిందని కార్మికులు, కార్యకర్తలు చెబుతున్నారు.
గమ్యం సుదూరం
ప్రస్తుత లెక్కల ప్రకారం, గ్రామ పంచాయతీ మార్చి 29 న కుటుంబానికి 50 కిలోల బియ్యం అందించింది. వారి ఇంటి సభ్యులందరి పేర్లతో కూడిన కొత్త రేషన్ కార్డును కూడా వారికి అందించారు. ఇటువంటి పరిష్కార చర్యలు ముఖ్యమైనవే, కానీ అవి తాత్కాలిక పరిష్కారాలే తప్ప విశాలమైన వ్యవస్థీకృత సమస్యలను పరిష్కరించలేవు.
పోషకాహార లోపం కేసులను తనిఖీ చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లల తూకం, పోషకాహార లోపం కొలతలను ప్రారంభించే నిబద్ధతను కలిగి ఉండాలి.
ఆహార భద్రతను నిర్ధారించడంలో వున్న అనేక అంతరాలను తక్షణమే పరిష్కరించాలి. ఇంట్లోని సభ్యులందరి పేర్లు రేషన్ కార్డులో వున్నాయో లేదో తనిఖీ చేయడానికి సరైన యంత్రాంగాలతో నిరంతరాయ ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్ధారించడానికి కృషి చేయాలి.
ఇంకా, చెల్లుబాటు అయ్యే రేషన్ కార్డుల తొలగింపును నివారించడానికి లేదా గుర్తింపు ప్రమాణాలు లేకపోతే సేవలను నిలిపివేయకుండా ఉండటానికి చర్యలు అమలు చేయాలి. ఆహార రేషన్‌లను ఇంటికి పంపిణీ చేయడానికి, సరసమైన-ధర దుకాణ డీలర్‌ల కోసం పటిష్టమైన ఆడిట్ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం వుంది.
అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలకు అవసరమైనవాటికంటే ఆహారధాన్యాలను అందించాలి, అయితే లబ్ధిదారులకు వారి అర్హులైన మధ్యాహ్న భోజనం, ఇంటికే రేషన్‌లు సమయానికి అందేలా ఆడిట్ వ్యవస్థలను బలోపేతం చేయాలి.
బ్యాంకు ఖాతాలు తెరవడం, వివిధ రకాల కార్డులను అనుసంధానం చేయడం వంటి అవాంతరాలు లేకుండా, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ కుటుంబాలన్నింటికీ పని కల్పించి ఉద్యోగ భద్రత చర్యలను వేగవంతం చేయాలి.
2016 వంటి దుస్థితిని నివారించడానికి రాజ్యానికి అర్జున్ హేంబ్రామ్ మరణం ఒక స్పష్టమైన పిలుపు. ఎనిమిదేళ్ల తర్వాత, ఇంకా గమ్యం సుదూరమే.
(శ్వేత, సమీత్‌లు ఒడిశాలోని ఆహార హక్కు ప్రచారోద్యమ కార్యకర్తలు)
తెలుగు: పద్మ కొండిపర్తి