గదిలో ఒకచోట ఖాళీ నిండింది
ఆ వాలుకుర్చీని అల్లుకుని
పాలపండ్ల చెట్టొకటి వుండేది
కుర్చీ ముందువెనుకల
కొన్ని ఆలోచనలు గాలిలో పూసి
బహు నెమ్మది మాటలుగా వీచేవి
చెవియొగ్గి వినాలి మనం
జీవితాన్ని దున్నిన అనుభవాల పంట
సేద్యం నేర్చినవాడు చెప్పిన కథ
o0o
అతను గడుసరి, అతను మనసరి
నిత్య చదువరి
గంపెడు ప్రేమ, ఒకింత కోపం
మెండుగా మొండితనం
కూడికతో అతనొక పిల్లల కోడి
మొక్కల్ని, పక్షుల్ని, మనుషుల్ని చేరదీసాడు.
దొంగ ఏడుపుల్ని ఎండగట్టి
అసలు దుఃఖపడుతున్న వాళ్ల
చెక్కిళ్ళు తుడిచాడు
o0o
మక్కువతో చేరదీసిన అన్నిటిపైనా
దిగులుపడే తాతతనం నిండిన
మనిషొకడుండేవాడు యిక్కడ
ఎక్కడో సప్త సముద్రాల ఆవల వున్నవాళ్ళ
కుశలమూ ఆడిగేవాడు
పిల్లలమీద, పుస్తకాల మీద మోహమున్న
తొంభైయేడేళ్ల తాతడు మనతో ఇక్కడే వుండేవాడు
యీ గుండెలో ఒకచోట శూన్యం నిండింది.
o0o
కనిపించడుగానీ అన్నీ గమనించేవాడు
మన చేతి దుబారానేకాదు
నోటి దుబారా, రాత దుబారాను కూడా
మనుషుల్నీ, మనసుల్నీ లోతుగా చదివేలోతైన మనిషి
నువ్వు అడిగితేనో, తనకు నచ్చితేనో
లోకాన్ని విడదీసి చెప్పేవాడు
తమలపాకును సవరదీసినంత విశదంగా…
తీసివేతలు తెలిసిన నేర్పరి
అసరాకు గుంజను వెతుక్కుంటున్న కథకు
ఏకంగా పందిరినే అల్లిపెట్టినవాడు
అల్లిక మర్మాన్ని తెలిపిన మహానేతగాడు.
o0o
తాజా కబురు:
నాకు మాత్రమే తెలిసిన బహిరహస్యం
మా తాతయ్య చుట్ట కాల్చేవాడు
(లోపూడి విరసం కథల వర్క్ షాప్ లో ఆయన ఉన్న రెండు రోజులు బయటికి కాలు పెడితే నేను, రాప్తాడు గోపి తోడు వుండేవాళ్ళం . అప్పుడు యేవో కొన్ని మాటలు ఆయనతో పంచుకున్నాం.
సైడుకు జోబీ ఉన్న బట్ట బనియనుతో అచ్చు మా తాతయ్య లాగే వుండేవాడు. మాటలో, నడకలో కూడా.
ఆయన చుట్ట కాల్చే కొత్తసంగతీ మాకు అప్పుడే తెలిసింది.
మాటల సందర్భంలో *నాకు కవిత్వం అర్థం కాదండీ* అన్నారు మాస్టారు.
ఆ కథకుడిపై కవిత)