అనంతపురం జిల్లా (రాయలసీమ) కరువు గురించి చాలా కథలే వచ్చుంటాయి.ప్రకృతి చేస్తున్న విధ్వంసాన్నో , ప్రకృతిని సాకుగా చూపిస్తూ రాజ్యపు, దాని యంత్రాంగపు వైఫల్యాలను ఎత్తిచూపుతూ, విషాదభరితమైన జీవితాలను చిత్రించిన కథలే అవన్నీ. ఒక  కథలో  సమాజంలోని ఒక స్తరాన్ని ( పొరను) చిత్రించడం ద్వారా సమాజాన్ని సాధారణీకరించడానికి  ఆకథలన్నీ ప్రయత్నించివుంటాయి. అయితే  ఒక నిర్ధిష్ట ప్రాంతంలో ‘ కరువు ‘ అనే అవ్యవస్థ ఎట్లా వుంటుంది.దాని ప్రభావానికి ఆ సమాజంలోని వివిధ సెక్షన్ల ప్రజలు ఎట్లా వున్నారు. ఎవరికి యేమేరకు కరువుశాకం తాకింది , లేదా ఆ వేడిని కూడా  చలికాచుకోవడానికి వాడుకునే వెసులుబాటు ఎవరికుందీ , ఇలాంటి సాపేక్షకాలతో కథ రాయడమూ , దాన్ని కథగా నిలబెట్టి పాఠకులను ఆకట్టుకోవడమూ అరుదుగా జరుగుతుంది. అలాంటి కథ కె.సుభాషిణి రాసిన ‘కరువెవరికి.’ 

   మాదిగోళ్ల ఈరమ్మ ( రాముడి భార్య) , వెంకటసుబ్బమ్మ ( అంకిరెడ్డి), బీసీ కులానికి చెందిన చంద్రమ్మ ( జయరాముడు) , యీ మూడు కుటుంబాల ఒక రోజు జీవితాన్ని చిత్రించి కరువనేది ఎవరికి ఎలా వుందో చెప్తుందీ కథ.

ఈరమ్మ కుటుంబం అంకిరెడ్డి యింట్లో జీతానికుండేది. కరువూ , వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయ పనులూ లేక ,   కొడుకూ కోడలూ కూలీపనులకోసం , పిల్లల్ని ముసలి తలిదండ్రుల వద్ద వదిలేసి వలస వెళ్లింటారు.ఈరమ్మ రెడ్డింటిలో పశులకొట్టం వూడ్చీ , ఇంటి పాచిపనులు చేసీ , రెడ్డమ్మ దయదలచి యిస్తే రాత్రి మిగిలిన సద్దిబువ్వ యింటికి తీసుకుపోయి పిల్లలకూ ,  ముసలాయనకూ తినబెట్టి ,  స్కూలు దగ్గరకు పిల్లల తినుబండారాల గంపతో పోతుంది. అవి అమ్మగా వచ్చే ఆదాయమే  వాళ్లకు  ఆధారం.

జయరాముడి కుటుంబం , పంటల ఆదాయం లేక , రెండో కూతురికి సంబంధం ఖాయమైనా  పెళ్లి చేయలేని  స్థితిలో వుంది. కట్నం కోసమూ, పెళ్లి ఖర్చుల కోసమూ , వున్న నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలు అమ్మడానికి , అంకిరెడ్డి ని కొనమంటే , ‘ నేనెక్కడ కొంటానూ , నేనే అమ్ముదామనుకుంటున్నా ‘ అని తప్పించుకుంటాడు.

వెంకటసుబ్బమ్మ , అంకిరెడ్డి యింటి ముందు పడసాలలో మూటల మూటల ధాన్యం వరుసలు పేర్చి వుంటుంది. కొడుకూ కూతురూ టౌన్లో  పెద్దచదువులు చదువుతూ  వుంటారు. కాలేజీ ఫీజుల విషయమై  ఈరమ్మతో  మీ మాదిగోళ్లకు  ఫీజులే  వుండవంటనే అని  ఏడుస్తూవుంటారు. జయరాముడి లాంటి వారికిచ్చిన చిన్న చిన్న చేబదుల్లను  ఎట్లా వసూలుచేసుకోవాలని  ఆలోచిస్తూవుంటారు.ఈ వివరాలను, కథ జరిగే నాటి వుదయం పూట కథకురాలు మనకు చెప్తుంది.

స్కూల్ దగ్గర తినుబండారాలు అమ్ముకుంటూ, ఈరమ్మ కొడుకూ కోడలి వలస అవస్థలు తలచుకుంటుంది. ఆ సాయంత్రం  యింటికి వస్తుంటే , జయరాముడి యింటి ముందర చంద్రమ్మ ఏడుపులు వినిపిస్తాయి. తీరా విచారిస్తే , చంద్రమ్మ కూతుర్ని చేసుకోవాల్సిన అబ్బాయి , వీళ్లు కట్నమూ యివ్వలేరు , ఖర్చుపెట్టి పెళ్లీ చేయలేరని వేరే సంబంధం చూసుకున్నాడట , ఆ అవమానంతో  తలిదండ్రులు ఒకవైపు ఏడుస్తుంటే , పెండ్లికావాల్సిన పాప పురుగుల మందు తాగి చనిపోయింది. గుడిసెకొస్తే , ముసలోడూ , పిల్లలూ ఆకలితో అల్లాడుతుంటారు. అన్నం వుండటానికి గింజల్లేవు. చంద్రమ్మ పెండ్లి చేయలేక బిడ్డను చంపుకుంటే , తను తిండి పెట్టలేక చంపుకుంటుందా అనుకుంటుంది. కొద్దిపాటి  నూకలతో  గంజి కాచుకుందామని పొయ్యి వెలిగిస్తుంది. ఆ వెలుగు  గుడిసె తడకల సందులోంచి అంకిరెడ్డి యింటి ముందు వరసలు పేర్చిన  ధాన్యం బస్తాల మీదవరకూ పడుతుంది.ఈ దృశ్యం దగ్గర కథ ముగుస్తుంది.

ఎక్కువ వ్యాఖ్యానం చేయకుండా  కథకురాలు,  పాత్రల సంభాషణల ద్వారా , దృశ్యాలను చిత్రించడం ద్వారా కథ చెబుతుంది.ఒకానొక రాయలసీమ గ్రామంలో , మరీ ముఖ్యంగా కర్నూలు , అనంతపురం, కడప మూడుజిల్లాల సరిహద్దు ప్రాంతంలో (తాడిపత్రి చుట్టు పక్కల) యీ కథ జరుగుతుంది. మూడు భిన్నమైన ఆర్థిక సామాజిక నేపథ్యాలను  కథలో చిత్రిస్తుంది. ఒక ప్రాంతమే , ఒకే వర్షాభావ పరిస్థితే , ముగ్గురిని మూడు రకాల అనుభవానికి గురిచేస్తుంది. అనంతపురం రోడ్లమీద  ప్రపంచంలోనే అత్యాధునికమైన  కార్లు తిరుగుతూ వుంటాయి. మారుమూల పల్లెలేమో కరువుతో , కనీస సదూపాయలు లేకుండా కునారిల్లుతుంటాయి.ఈ దుర్మార్గ వైవిధ్యతకు కారణమేమిటంటే , ఆదాయ వనరులను అందుకోవడంలో అంతరం. కరువు కాలంలో పల్లెల్లో కరువు పేరుతో  అభివృద్ధి పనులు జరుగుతుంటాయి , ఆ పనుల కాంట్రాక్టు అంకిరెడ్డి లాంటి వారికే సంపదగా మారతాయి. దాన్ని గుర్తించమని కథ సూచిస్తుంది. కరువు కాలంలో కూడా  వ్యవస్థీకృత దోపిడి వుండితీరుతుందని తేల్చుతుందీ కథ. పాఠకులను  ఆలోచనల్లో  పడేస్తుంది.

Leave a Reply