1. ఆశ‌

ఎవరో ఒకరు 

నీ తలపై గురిపెడుతూనే వుంటారు

ప్రతి క్షణం 

నీ చుట్టూ నిఘా పెడుతూనే వుంటారు

నీ ఆలోచనలు 

సీతాకోకచిలుకలుగా మారి 

ఎగరక ముందే 

నీ రెప్పలపై ఇనుప తెర వేస్తారు

నీ గొంతుపై ఉక్కుపాదం మోపుతారు

నీ కాళ్ళకు సంకెళ్లు చుట్టుకుంటాయి

ఎవరూ నీ వెంట రాని కాలంలో

నువ్వే ఒక‌ ఆకాశం కావాలి

నువ్వే ఒక సంద్రం కావాలి

నువ్వే ఒక సమూహం కావాలి

2. ఆకాశం వర్షించే వరకూ

అతడు లేచి వస్తాడు 

ఆమె తోడుగా 

రక్తం చిందించిన‌ వారెప్పుడూ తిరిగి వస్తారు

అదో భరోసా నీకూ నాకూ

అతడు తిరిగి వస్తాడు

ఆమెతో పాటుగా 

అమ్మను తీసుకొని 

లేచి వస్తాడు

కల ఎప్పుడూ 

ముందుకే నడిపిస్తుంది 

నీ పాదంతో పాటుగా 

అడుగు వేస్తూ చివరి వరకూ

అతడు ఆమె మరల వస్తున్నారు

అడవి నుండి అవని నుండి

దాగిన‌ మట్టి పొరల నుండి

పారుతున్న ఏటి అలల మీదుగా 

వెదురు వనాల గానంలో 

పదం కలుపుతూ 

అతడు ఆమె వస్తున్నారు

నీ నా దుఃఖాన్ని తుడిచి వేయడానికి

వేచి చూడు పిడికిలెత్తి

ఆకాశం వర్షించే వరకూ 

సాగరం తీరం దాటే వరకూ!! 

2 thoughts on “ క‌వితా ప‌రాగం

Leave a Reply