ప్రతి కవీ తనదైన సొంత వాక్యాం ఒకటి ఇచ్చిపోతారు. సొంత వ్యక్తీకరణ అప్పగించి పోతారు. ఆ కవి చాలానే రాసి ఉండవచ్చు. చాలానే అచ్చేసి ఉండవచ్చు. కానీ కోర్‌ ఉంటుంది.  దాన్నే పాఠకులు తలచుకుంటారు. విమర్శకులు అంచనా వేస్తారు. మిగతావన్నీ వివరాలే. అవన్నీ చెప్పుకొనేది కోర్‌ను చేరుకోడానికే.

అట్లా చూస్తే  కవిగా ఎండ్లూరి సుధాకర్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దళిత కవుల్లో కూడా ఆయనకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.  సుధాకర్‌ తొలి సంపుటం ‘వర్తమానం’ 1992లో వచ్చింది. సరిగ్గా 30 ఏళ్ల కింద. ఒకసారి ఆ సంపుటాన్ని పరిశీలిస్తే కవిగా ఎండ్లూరి సుధాకర్‌ రూపొందిన తీరు కనిపిస్తుంది. ఆయనలోని స్పందనా గుణం, అది  కవిత్వంగా మారడం, అదొక నిర్మాణ రూపాన్ని పొందడం మొదలైన వాటిలో సుధాకర్‌ ఫార్మేషన్‌ కనిపిస్తుంది. అది తొలి సంపుటమేగాని,  అప్పటికే ఆయనకు కవిగా  గుర్తింపు ఉంది. ఆ పుస్తకంలో చాలా పరిణతి కనిపిస్తుంది. కవిగా ఆయనలోని ప్రత్యేకతలూ అందులో కనిపిస్తాయి. గ్రీష్మ గోదావరి, దొంగ నాన్న,  ఇందిరా పార్క్‌, పుట్టిన రోజు రాత్రి, నాన్నా.. యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది వంటి కవితలు ఉన్నాయి. ఇందులోనే ‘నేనింకా నిషిద్ధమానవుణ్నే..’ అని మొదలయ్యే ‘నెత్తుటి ప్రశ్న’, ‘పాదముద్రలు’ అనే కవితలు ఉన్నాయి.

సుధాకర్‌ తొలి దశలో ఈ సమ్మేళనం ఉంది.  ఆయన కవిత్వంలో బలంగా వ్యక్తమైన స్వీయ అస్తిత్వం ఉన్నట్లే, కవిత్వంతో ఆయనకు బలమైన సొంత అనుబంధం కూడా ఉంది. రెండోది అధ్యయనం నుంచి, ప్రభావాల నుంచి, పరిచయాల నుంచి కలిగి ఉండవచ్చు. ఎండ్లూరి సుధాకర్‌ కవి కావడంలో దేని పాత్ర ఎంత అని తేల్చడం కష్టమే. అయితే సంప్రదాయ సాహిత్యాన్ని బాగా చదువుకున్న దళితకవిగా ఎండ్లూరి సుధాకర్‌ను గుర్తించవచ్చు. 

ఆ తర్వాత ఆయన కవిత్వంలో ఒక ముఖ్యమైన మార్పు వచ్చింది. కొత్త గబ్బిలం, వర్గీకరణీయం, గోసంగి కావ్యాలే దీనికి ఉదాహరణ. బహుశా కవిత్వ చరిత్రలో సుధాకర్‌ స్థానాన్ని నిర్వచించడానికి ఈ కావ్యత్రయం ఉపయోగపడుతుంది. ‘మల్లెమొగ్గల గొడుగు’ మాదిగ కథలు దీనికి గొప్ప ఉదాహరణ.

దళిత కవిత్వంలో కూడా ఎండ్లూరి సుధాకర్‌ మాదిగ కవిత్వానికి సగర్వ ప్రతినిధి. భారతదేశంలో ఆగ్రకులాలు, దళిత అంటరాని కులాలు అనేవి   ఉన్నాయనే వాదనా పునాది  మీద తెలుగు దళిత కవిత్వం  ఆరంభమైంది. చిక్కనవుతున్న పాట సంకలం(1995) విడుదలయ్యేనాటికి దళిత్‌ అనే మాటకు ఒక విస్తృత అర్థం ప్రవేశపెట్టారు.  పార్లమెంటరీ రాజకీయాల్లో బహుజన అనే మాట బాగా ప్రాచుర్యంలో ఉన్నది. ఇవన్నీ   దేశంలో అనేక కులాలు ఉన్నాయని చెప్పడానికి ప్రయత్నించాయి. కానీ ప్రతి రెండు కులాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయని గుర్తించలేదు. బహుజన ఎన్నికల రాజకీయాల ద్వారా వాటిని అధిగమించవచ్చనే ఊహ ఉండొచ్చు.

కానీ ఆ వైరుధ్యం మాల, మాదిగల మధ్యే, వాటి ఉప కులాల మధ్యే ఉన్నదని మాదిగ దండోరా ఎత్తి చూపింది. 2004లో ఎండ్లూరి సుధాకర్‌ వర్గీకరణీయం అనే దీర్ఘ కావ్యం రాశారు. దళిత కవిత్వం అంత దాకా సింబాలిక్‌గా మాదిగ డప్పు మోగిస్తూ ఉండేది. అందులోని ఆర్తి, వ్యక్తీకరణలు గొప్పవే. కానీ అచ్చంగా మాదిగల వర్గీకరణ ఉద్యమంలోకి కవిత్వాన్ని ఎండ్లూరి సుధాకర్‌ తీసికెళ్లారు. బహుశా దళిత,  బహుజన కవులందరూ కొందరు మినహా అంతా మౌనం పాటించిన చోట సుధాకర్‌ కవిత్వమై విస్తరించారు. మొత్తంగానే దళిత కవిత్వానికి అదొక ఎక్స్‌టెన్షన్‌. ఈ మార్గంలో సుధాకర్‌తో పాటు ఇంకొంత మంది మాదిగ కవులు ఉన్నారు.

వర్గీకరణీయం కావ్యంలో ఆయన ఒక విలువను ప్రతిపాదించారు. ఒక సామాజిక న్యాయ భావనను ప్రవేశపెట్టారు. ఒక దృక్పథాన్ని ముందుకు తెచ్చారు. మల్లెముగ్గల గొడుగులోని మాదిగ జీవిత సౌందర్యం అందిరికీ నచ్చే ఉంటుంది. కానీ తక్షణ జీవితావసరంలో, ఒక భౌతిక ప్రయోజనంలో న్యాయ వైఖరి తీసుకోవడం అంత సులభం కాదు.  దళిత శిబిరంలోని ‘కులతత్వాన్ని’ సుధాకర్‌ వర్గీకరణీయం బైట పెట్టింది కావచ్చు.

బహుశా ఆధునిక తెలుగు కవిత్వానికి, ప్రగతిశీల, దళిత కవిత్వానికి  సుధాకర్‌ తానుగా చేర్చిన వాక్యం ‘వర్గీకరణీయం’లో ఉంది.  దాని మీద ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు ఏమైనా కావచ్చు. ఏ విశ్లేషణలైనా ఇవ్వవచ్చు. అది కవిగా ఆయన ఒకానొక ముఖ్యమైన ప్రత్యేకత.  దీనితోపాటు మొత్తంగా దళిత కవిత్వానికి ఆయన చేర్పు గణనీయం. అగ్రకుల వ్యవస్థ మీద ఆయన ధిక్కారం కొత్త చూపును అందించింది.  దళిత కవిత్వం ఒక ధోరణిగా ఉన్న కాలంలో దాన్ని ముందుకు తీసికెళ్లడంలో ఆయన కవిగా, ఆలోచనాపరుడిగా గొప్ప కృషి చేశారు.  ముఖ్యంగా మన సాంస్కృతిక చరిత్రను అర్థం చేసుకోడానికి ఉపయోగపడే అద్భుత కవితా పాదాలు ఆయన రాశారు.

నాది హిందూ నాగరికత కాదు

నాది చిందు నాగరికత.. లాంటి వాక్యాలు ఈ దేశ మూలవాసుల చరిత్రను విప్పి చూపించాయి. తెలుగు సమాజ సాహిత్య మేధో రంగాలు అగ్రకులతత్వం నుంచి బయటపడి, అచ్చమైన దళిత శ్రామిక తత్వాన్ని సంతరించుకోడానికి చేస్తున్న ప్రయాణంలో ఎండ్లూరి సుధాకర్‌ ‘పాదముద్రలు’ మనకు ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. అవి తెలుగు సాంస్కృతిక చరిత్రలో పదిలంగా ఉంటాయి.

One thought on “కవిత్వంలో మాదిగత్వం

Leave a Reply