-మెట్టు రవీందర్

మనుషులు విడిపోవడం కంటే మించిన విషాదం లేదు

మనుషులు కలవడం కంటే మించిన ఆనందమూ లేదు

     
అరసవిల్లి కృష్ణ రాసిన ‘ఈ వేళప్పుడు’ కవిత్వం కవి రాసినప్పటి క్షణానికి మాత్రమే సంబంధించినదేనా?  కానేకాదు. అలా ఏ కవిత్వమైనా అది రాయబడిన క్షణానికే   సంబంధించినదయితే, అది పుస్తక పుటల మధ్యనే  నలిగిపోయి    నశిస్తుంది. కానీ ‘ఈ వేళప్పుడు’ కవిత్వం ఒక సజీవమైన కవిత్వం. అది జీవజలం వలె పుస్తక పుటల్ని దాటి పాఠకుల హృదయాల్లోకి  అలవోకగా ప్రవహిస్తుంది. అలా ప్రవహించే కవిత్వమే జీవిస్తుంది, జీవింపజేస్తుంది.

     
ఇందులో కవి చూసిన చూపులో  చాలా విశిష్టత ఉంది. అదే వర్తమానాన్ని చలనంలో  చూడడం. అలా చూడడం  మార్క్సిస్టు దృక్పథం లోని ప్రత్యేకతే కావచ్చు గాని, దానిని తనదిగా సొంతం చేసుకోవడం కవి ప్రత్యేకత కూడా అని గుర్తించాలి.

     
మామూలుగా విమర్శనాత్మకత  భావుకతకు చుక్కెదురు అని చాలామంది అంటుంటారు. ఒక రకంగా ఇది నిజమేనని అనిపించొచ్చు. ఎందుకంటే- విమర్శ తన గురిని  ఎప్పుడూ బైటి  టార్గెట్  పైన మాత్రమే ఎక్కుపెట్టినంతకాలం  అది భావుకతను కచ్చితంగా దెబ్బతీస్తూనే  ఉంటుంది. కానీ విమర్శ తన గురిని ఎంతమేరకు సృజనాత్మకంగా లోలోపలికి కూడా ఎక్కుపెడితే, అంతమేరకు అది వాస్తవికతా పునాదులపై  భావుకతను ప్రేరేపించి సజీవం చేస్తుంది. అటువంటి సృజనశీలమైన  విమర్శనాత్మకత, సున్నితమైన భావుకత, భవిష్యదాష  కలగలసి  ఏర్పరచుకున్న తనదైన  దృక్పథం వల్ల కవి కాల్పనికత  అత్యంత శక్తిని సంతరించుకుంటుంది.

     
ఇక్కడ కవి అరసవిల్లి  పై రెండో కోవకు చెందిన వాడు. కనుకనే సాధారణ పంచేంద్రియాల గ్రహింపుకు  అందని కొన్ని సత్యాలను  ఆయన తన కవిత్వంలో అద్భుతంగా ఆవిష్కరించగలిగాడు. ఆ క్రమంలోనే తనదయిన కవిత్వ శిల్పాన్ని, వస్తు నిర్వహణాధికారాన్ని సాధించాడు. అయితే ఈ రెండింటికీ మాతృక  తన చుట్టూ పరచుకొని  ఉండే ప్రజల సామాజిక జీవితం. ఆ  ప్రజల జీవితం పట్ల జీవజలం వంటి పసి(వాడని)  ప్రేమ, ప్రగతిశీల జీవిత పరివర్తన పట్ల నిరంతర పోరాటస్ఫూర్తి  రెండూ కలగలసి తన కవిత్వజననానికి  కారణమయ్యాయి.

      
పైగా, ఎటువంటి  హద్దులు  లేకుండా విశాల జీవితానుభవానికి  సకల మార్గాలను తెరిచి ఉంచుకొని, తన అనుభవపు లోతును, విస్తృతిని  పొందే అనంతమైన ఆర్తిని  నిరంతరం పదిలపరచుకోవడం వల్ల  కవి భావుకత తడి ఆరి పోలేదు. ఆర్ద్రతా  అణగారి పోలేదు. కాలప్రవాహంలోని  ప్రతి క్షణాన్ని పట్టుకొని తనదైన అభివ్యక్తీకరణను  వెలిబుచ్చడం  వల్లనే తన కవిత్వం  పదునుదేరింది. అనుక్షణం సకల సంఘర్షణల కూడలిగా విస్తరిస్తోన్న  జీవితం, జీవన ఉద్వేగాల మాధ్యమంగానే  సమస్త విషయాలతో పాటు రాజకీయాలనూ  కవి ఆకళింపు చేసుకుంటాడు. తిరిగి ఆ ఉద్వేగాలనే కవిత్వంగా అల్లి  బైటికి అభివ్యక్తీకరిస్తాడు. అంటే, అరసవిల్లికి  కవిత్వమే  ఏకసమయంలో సూక్ష్మదర్శిని, దూరదర్శినీ. కాబట్టే  జీవితంలో అలీనం కాని రాజకీయాలను కూడా ఆయన సహజంగానే కవిత్వంలోకి తీసుకొస్తాడు. మార్పు క్రమానికి బహిరంగ జీవితమే కాదు, ఆంతరంగిక జీవితం కూడా గురవుతుందని/ గురవ్వాలని భావిస్తాడు. ఆ మార్పు క్రమానికి  ఏకకాలంలో సాంస్కృతిక, రాజకీయ పార్శ్వాలు ఉంటాయని కూడా కవి అరసవిల్లి గుర్తిస్తాడు.

     
అరసవిల్లికి జీవితం పట్ల ఒక సాహసిక దృష్టి ఉంది. కనుకనే విశాల జీవితం అందించే సమస్త   అనుభవాలను పొందాలనే ఆర్తి,  సకల మానవ ఉద్వేగాలను  తన స్వీయ అనుభవంలోకి తెచ్చుకోవాలనే పట్టుదల వల్లనే  కవి అనుభవాలను మొత్తం విశాల ప్రజా సమూహానికి చెందినవిగా పాఠకులు అనుభూతి చెందుతారు.

మొట్టమొదట  పేర్కొన్నట్లుగా- కవి వర్తమానాన్ని దాని చలనంలో  చూడటం వల్లనే  ఒకానొక క్షణంలో చీకటి కమ్మే సినా  మరో క్షణానికి  దానిని చీల్చుకుంటూ ఉజ్వల కాంతి  ఉదయించడాన్ని కవి దర్శిస్తాడు.

‘’ముక్కలైన మనుషులు/ మళ్ళీ మళ్ళీ  అతుక్కుంటార’’ని (ఎటుపోతారు నాయనలారా), ‘’మాట పెగలని  ఏకాంతంలో/ బోర్లించిన అంధకారంలో’’ సైతం మనిషి చేతులే ‘’దివిటీలు వెలిగిస్తాయని’’ (నాగలి  నర్తనం) అంటాడు.

అరసవిల్లి దృష్టిలో జీవితం సరళరేఖ కాదు. అసలు ‘’జీవితం సూటిగా లేనప్పుడు/ సమాధానాలు సూటిగా ఎలా ఉంటాయి’’ అని ప్రశ్నిస్తాడు (నువ్వెప్పుడైనా), ‘’జీవన విధ్వంసం మనల్ని రెండు (భిన్న) తీరాలకు విసిరేసిందని’’, ‘’మనుషులింకా  స్వచ్ఛమైన  ప్రేమ ధారలో ముద్దగా తడవడం లేదని’’  వాపోతాడు (బిజిలీ!).

   
ఒక రకంగా అరసవిల్లి కవిత్వ రహస్యం అంతా ఆయనలో ఉబికే ప్రేమధార లోనే ఉంది. అసలు మనుషులు స్వచ్ఛమైన ప్రేమధారలో ముద్దగా తడవక పోతే, అది జీవితమే కాదని చెబుతాడు. కళ్ళలో నుంచి కారే కనబడే కన్నీరు మాత్రమే దుఖానికి కొలమానమయితే, కనబడని ‘గుండె కార్చే కన్నీరు’ సంగతేమిటని ప్రశ్నిస్తాడు. ‘ మనుషులందరిలో కనబడని శిలలు (ఏమైనా) దాగి ఉన్నాయా?’  అని ప్రశ్నించి, వర్గ సమాజం కారణంగా సృష్టించబడే  మానవ దుఃఖ ప్రవాహంలో  కరగకపోతే వాళ్లసలు మనుషులే కారని చెబుతాడు. అసలు మనుషుల మధ్య పరస్పరం  ప్రవహించాల్సిన నిత్య ప్రేమధారకు సకల అవరోధాలను సంక్లిష్టమైన ఈ వర్గ సమాజమే సృష్టిస్తోందా అన్న ప్రశ్నను కూడా  ఈ  కవి వేస్తున్నాడా అననిపించింది. 

      
అరసవిల్లి  కవిత్వంలోని  లాలిత్యానికి  మరో కారణం ఆయన శిశుదృష్టి. దుర్భర వర్తమానంలోని కరకుదనాన్ని, లేదా వర్గసమాజం సృష్టించిన లౌక్యపు దోపిడీ మాయతెరలను చీల్చివేయడానికి, యాభై ఏళ్ల ప్రాయంలోనూ పసితనపు మృదుత్వంతో తన అంతరంగాన్ని సున్నితంగా నిలుపుకోవడానికీ ఆయన కవిత్వాన్నే ఒక ఆలంబనగా, పదునైన ఆయుధంగా, నిత్య ప్రేరణగా మలచుకున్నాడు. అందుకే ‘ఇనుప డేగల ప్రపంచంలో/ ఈతరాని చేపలు/నవ్వడం తెలియని రబ్బర్ బొమ్మలు’ అని పిల్లలను సంబోధిస్తూ ‘పిల్లలు’ అనే కవిత రాశాడు.

     
అరసవిల్లి కవిత్వంలో ఉన్న మరో ముఖ్య లక్షణం మార్దవం. అందుకే కవి పూలపై, స్త్రీలపై, మత, కుల వివక్షతలచే పీడితులైన  ప్రజలపై, రాజ్యపు హింసాయుత విధానాలకు గురవుతున్న రైతులపై, ప్రాంతాలపై కూడా అనేక కవితలు రాశాడు.

    
ఉదాహరణకు, కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించివేసే ఆర్టికల్ 370 ను రద్దు చేసిన భారత ప్రభుత్వ చర్యపై ఒక కవిత రాస్తూ,                                                                                                                                            

 ‘నేను డిసెంబర్ 6 న, ఆగస్టు 5 న అనేకసార్లు మరణించాను’ అంటూ 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతను కూడా గుర్తుచేస్తాడు.(ఆగస్టు-5)                                                  

అలాగే మరో కవితలో                                                                                                         
‘కులం నా నుంచి వేరయి/మతం నా ముందర నిలబడింది’ / ‘నావైపు చూసే మతానికి హృదయం లేదు/బహుళ విశ్వాసాల పూలవనం నాది/ బొటనవేలిపై వోటు ముద్రనే కాదు/ నేనీ ప్రజాస్వామ్య వోట్ల రుతువునే వదిలేశాను/ నా చుట్టూ ముసిరినా హిందూమతం మురికిని /మా ఊరి  ఏటి నీటితో కడుక్కున్నాను/ శరీరంపై నీటి బిందువుల్లో నా దేశ ప్రజల ముఖాలున్నాయి /మతాన్ని విసర్జన చేయడానికి /ఇంతకాలం పట్టినందుకు సిగ్గుపడుతున్నాను’ అంటాడు.(అంటరాని వసంతాల పోలికేకని!)                                                                                                      
 ఇంకా,                                                                                                                                                 ‘అన్నిటికీ దూరంగా ఉన్నాం/ఆకాశం ఎంత దగ్గరో అంత దూరం /మనిషి కూడా అంతే/(అమ్మలానే) ఆకలి నిజం కదా/ దానికి భూమి కావాలి ‘ అనంటాడు. (‘ఆకలి’ ,’మా తడి స్వప్నాలపై’)                                                                 

అలాగే స్త్రీలపై రాస్తూ

    
‘వారే లేకపోతే/(ఈ) గాజు ప్రపంచం వేయి సార్లు ముక్కలవుతుంది/ (ఏనాటికైనా) సగం తెగిన ఆకాశం చిగురించకమానదు’ అనే గొప్ప ఆశాభావాన్ని కవి ప్రకటిస్తాడు.(‘సరళరేఖ’)

     
‘ఆమెలోకి వెళ్తున్నా’ అనే కవితలోనైతే యావత్ ‘ప్రపంచం స్త్రీగా మారాలి/ ప్రపంచం స్త్రీ  ముందు మోకరిల్లాలి/ ప్రపంచం స్త్రీ రూపంలా కనబడాలి/అంధమయ లోగిలిలో/ రెండు కాళ్ళ పురుష జంతువును వెతకడానికి/ వెళుతున్నాను ఆమెలోకి/ ఆమెలాంటి ప్రపంచంలోకి- అసమ ప్రపంచాన్ని ఖాళీ చేసి/ స్త్రీ  హృదయం పరిమళించే/స్త్రీ ప్రపంచం దగ్గరికి’  దారి చేసుకుంటూ వెళ్లాలని, పురుషులు పురుషాధిపత్యం వదిలి ‘ఆమె’లో పునరుద్దానం చెందాలని అంటాడు. అరసవిల్లిలో మనుషుల కలయికకు, ఎడబాటుకు సంబంధించిన ఎరుక చాలా సున్నితమైనది, అత్యంత మానవీయమైనది. తెలంగాణ విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు రాసిన కవితలో

    
‘నీ రక్తపు నగరం నీలో భాగమే/ (పూ)రేకులను తుంచకుండా/పువ్వును రెండు భాగాలు చేశారు (అంతే)/ పరిమళాన్ని ఆస్వాదిద్దాం’ రమ్మ నంటాడు.(‘ఏదీ నేర్పేది కాదు’)

     
కవి ఛాయారాజ్ పై రాసినట్లుగానే, అరసవిల్లి నిజంగానే ‘తడి,తడిగా జీవితాన్ని మోసుకు తిరిగే కవి’. ‘జీవన లాలస కంటే మనుషుల్ని  విడదీస్తున్న దాన్ని ధ్వంసం  చేయాలని బయలుదేరిన  కవి. ‘నాగలితో శిలువ వేయబడిన’ రైతు ‘చేతులకి పాదాలకి  మేకులను గుచ్చిన  ప్రజాస్వామ్యం బండారాన్ని బట్టబయలు చేయడానికి కవిత్వమనే ఆయుధంతో  బయలుదేరిన కవి.  తాను పుట్టి పెరిగిన ‘నేలకు పరాయిగా నిలబడి  ఆకలి బొమ్మను చిత్రిస్తున్న’  అక్షర చిత్రకారుడు. ఎప్పటికప్పుడు పునర్జన్మిస్తూ  పునర్ ధ్వంసిస్తున్న  రాజ్యాన్ని ఎదుర్కోవడంలో రాజకీయం ఎలా అలీనం   కాదో  కవిత్వం (సంస్కృతి) కూడా అలీనం  కాదని నాలుగు చెరగులా చాటి చెబుతున్న కవి  కూడా అరసవిల్లియే.

 
 
ఇంత  రాసీ, కవిత్వ రచన గురించి తనకేమీ తెలియదంటున్న అరసవిల్లి నిజంగానే  ప్రజాజీవితపు  సంఘర్షణల లోగిళ్ళ నుండి నేరుగా ఆవిర్భవించిన ఆర్గానిక్ వర్గపోరాట కవి అరసవిల్లి.

One thought on “కవిత్వమే సూక్ష్మదర్శిని, దూరదర్శిని

  1. ✊✊
    మా సత్యం
    అరుణతార
    ఫిబ్రవరి- మార్చి 2022 సంచిక ఆలస్యమైనప్పటికీ ముఖచిత్రం
    (కవర్)పేజీ ఎంతో ఆలోచనను కలిగిస్తూ సంపాదకీయం దగ్గరనుంచి,
    ప్రతి ఆర్టికల్ ఎంతో ఇంట్రెస్ట్ గా చదివిస్తోంది.
    వడ్డెబోయిన శ్రీనివాస్
    ‘అల్లాహు అక్బర్ ‘ కవితలో
    ” ఉన్మాద వీర్య ప్రవాహ వీరత్వ కాలములో
    మీ బానిస సీతనై
    జై శ్రీరామ్ బుల్లి బాయిలారా!
    మీ అగ్ని ప్రాజెక్టులో దూక లేను
    ఐనా
    అందానికి అలవాటుపడిన కళ్ళు కదా!
    అంధకారాన్ని జీర్ణించుకోలే
    వేమో!?” అంటూ
    హిందూ మతోన్మాద విష సంస్కృతి మూలాలను తవ్వి
    మైనార్టీ ప్రజల పట్ల జరుగుతున్న పాశవిక దాడులను
    ఆర్ద్రమైన హృదయముతో స్పందించి కవి
    తన పదబంధ (Phrase)
    నేర్పరితో పాలకవర్గకుట్రలను బహిర్గతం చేస్తూ
    ముస్లిం మహిళ దువాకు పరిమితము కాకుండా నైరాశ్యం ఊబిలో పడిపోకుండా, హక్కుల కోసం పోరాడే నిజమైన ముస్లిం మహిళగా పోరాట శక్తిని పెంపొందించు
    కుంటూ చైతన్య ధ్వనులతో
    భారత కాలకూట కాషాయ పాలకుల ఫాసిస్టు చర్యలను హెచ్చరిస్తున్న తీరును చక్కగా ఆవిష్కరించారు.
    కవిత్వం గురించి రావి శాస్త్రి గారు అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి.
    ” What is poetry
    is poetry and what is not poetry is not poetry”.
    శ్రీనివాస్ గారూ
    అవసరం రీత్యా ఆంగ్లము హిందీ పదాలు దొర్లినప్పటికీ భావస్ఫోరకంగా అర్ధ వ్యక్తీకరణ బాగుంది.

Leave a Reply