పోతులూరి వీరబ్రహ్మం పేరెత్తగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆయన చెప్పిన కాలజ్ఞానం. ఏదైనా వింతలు, అద్భుతాలు జరిగితే ఇలా జరుగుతుందని ఏనాడో బ్రహ్మంగారు చెప్పారని అనుకోవడం పరిపాటి. బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పడమే కాదు, కవితా విమర్శ కూడా చేశారు. ఏది కవిత్వం? కవి ఎలా వుండాలి? కవితా లక్ష్యమేది అన్న విషయాల్ని కూడా చర్చించారు.
ఆయన ఈ చర్చ చేయడానికి కారణాలనేకం. ముఖ్యంగా ఈయన ప్రబంధకాలం తరువాతవాడు. ప్రబంధకాలం నాటి కాలక్షేప రచనలు, మితిమీరిన శృంగార ప్రకృతి వర్ణనల్ని బ్రహ్మంగారు వ్యతిరేకించారు. అందుకై ఆయన సంఘ సంస్కరణాభిలాషతో కలం పట్టారు. వీరి రచనల్లో ప్రధానంగా కనిపించేది కాలజ్ఞానం కాగా మిగతా రచనలు చాలా వున్నాయి. సంస్కర్తలకు గుళ్ళు కడితే వీళ్ళ సంస్కరణ దృక్పథం మూలబడిపోతుంది. తాను స్వయంగా కవి కనుక ఏది కవితకాదు, ఎవరు కవి? వంటి కవితా లక్షణాల్ని వివరించారు. కాలజ్ఞానం పూర్వకాండ ఉత్తరకాండ. ద్విపదలలోనూ కాలజ్ఞానం రచించారు. కాలజ్ఞాన సౌజన్య పత్రికల పేరిట వచనం కొంత రాశారు. బ్రహ్మంగారి ఇంట్లోనే 1912లో ఒక సౌజన్య పత్రిక లభించింది. 1961లో బ్రహ్మంగారి సమాధి ప్రాంతంలో ప్రస్తుత మఠాధ్యక్షులైన వేంకటేశ్వరస్వాములకు మరో సౌజన్య పత్రిక లభించింది. ఇవిగాక దాదాపు వేయి పద్యాలకు పైగా “కాళికాంబ హంసకాళికాంబ” అనే మకుటంలో ఆధ్యాత్మిక విషయాల్ని రచించారు. గానయోగ్యమైన గోవిందవాక్యాలు దాదాపు మూడు వందలకు పైగా వున్నాయి. సిద్ధార్థ శతకం లేదా సిద్ధగురుబోధ పేరిట “సిద్దా” అనే మకుటంతో దాదాపు యాభై ఐదు పద్యాలు వున్నాయి. ఇవన్నీ మనకు తాళపత్ర రూపంలో కందిమల్లాయ పల్లె బ్రహ్మంగారి మఠంలో లభిస్తాయి. మఠంవారు వీటన్నిటిని కలిపి ఒక పుస్తకంగా ప్రచురించారు. ఈ సిద్ధార్థ శతకం లేదా సిద్ధగురుబోధ గ్రంథంలోనే బ్రహ్మంగారు కవిత్వ స్వరూప స్వభావ చర్చ చేశారు.
బ్రహ్మంగారి పుట్టుపూర్వోత్తరాల గురించి చాలా కథలున్నాయి. కర్ణాటక ప్రాంతం నుంచి ఇక్కడికొచ్చినారని ప్రతీతి. ఎవరెన్ని చెప్పినా ఈయన క్రీ.శ. 1608లో జన్మించారు. 1693 సంవత్సరంలో జీవసమాధి పొందారని చరిత్రకారులు నిర్ణయించారు. అంటే దాదాపు ఎనభై ఐదు సంవత్సరాల కాలంలో జ్ఞానబోధ చేస్తూ కర్నూలు, కడప జిల్లాల్లో సంచరించినట్లు చరిత్ర చెబుతూ ఉంది.
ఈయన జీవితకాలంలో దేశంలో రాజకీయంగా సుస్థిరంగా లేదు. రాజకీయ స్థిరత్వం లేకపోతే సంఘం ప్రశాంతంగా వుండదు. విజయనగర సామ్రాజ్యం అంతరించిన తరువాత దేశం అల్లకల్లోలమైంది. ముఖ్యంగా శైవ వైష్ణవ మత సంఘర్షణలు అధికమైనాయి. జ్ఞానబోధ పేరిట మోసకారులు ఎక్కువైనారు. ఈయనకు సమకాలికుడైన వేమన పద్యాల్లో కూడా బ్రహ్మంగారి భావనలే కనిపిస్తాయి.
16వ శతాబ్దంలో మధుర, తంజావూరు, చెంజిలు రాజధానిగా సామంతరాజ్యాలు పాలన సాగించాయి. తంజావూరును పాలించిన పిన చెవ్వప్ప నాయకుడు అచ్యుత రాయలకు తోడల్లుడు. వీరి తరువాత రాజ్యాధికారంలోకి వచ్చిన రఘునాథ నాయకుడు విజయరాఘవ నాయకుడు సుస్థిరపాలన అందించకపోగా శృంగార సాహిత్యాన్ని రాసి పెంచి
పోషించారు. వీరి తరువాత రాజ్యం మహారాష్ట్ర వంశస్తులైన శహజీతుక్కాజి వంటివారు పాలించారు. వీరికాలంలో పాలెగాళ్ళు బాగా అభివృద్ధి చెందినారు. విజయనగర పాలకులకు సైన్యాన్నందించే సైనిక శిబిరాలు, పాలెగాళ్ళ ఈతిబాధలు, కరవు కాటకాలు అనావృష్టి విలయతాండవం చేసింది. ఈ స్థితిగతుల్ని కల్నల్ మెకంజీ సేకరించిన కైఫీయత్ లో చూడవచ్చు. ఇటీవల కడప బ్రౌన్ లైబ్రరీ వారు కైఫియత్ లను సంపుటాలుగా ముద్రిస్తున్నారు. ఈ కల్లోల సమాజం వేమన వీరబ్రహ్మాల్ని సృష్టించింది.
సమాజస్థితి ఇలా వుంటే సాహిత్య స్థితి మరీ దిగజారిపోయింది. రాజాస్థానాలు నిరంతర యుద్ధాల్లో మునిగిపోయాయి. సాహిత్యపోషణకు తీరికలేకపోయింది. కవితనేర్చిన కవులు విలాసజీవితంలో మునిగిపోయారు. శృంగార పద కవితలు, తారాశశంకము, రాధికా స్వాంతనము, రాధామాధవం చిత్ర, బంధ, గర్భ కవితా ప్రయోగాల్లో మునిగిపోయారు కవులు పాలకులు శ్రేయస్సును, బాధ్యతల్ని మరచిన కాలంలో ఈ యిద్దరు సంస్కర్తలు ముందుకొచ్చారు. వీరిద్దరికి ప్రేరణ యిచ్చిన సామాజికాంశాలేవో తెలియాలంటే ఈ సామాజిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. వేమన బోధకుడు, బ్రహ్మంగారిలో సంస్కరణాభిలాష ఎక్కువ. ఇద్దరూ తాము వ్యతిరేకించే సామాజిక విలువల్ని పూర్వపక్షం చేయడానికి రచనల్ని మార్గంగా ఎంచుకున్నారు. వేమన ఆటవెలదులకే పరిమితమైతే బ్రహ్మంగారు తేటగీతి ఆటవెలది పాటలు వంటివాటిని, శిష్యపరంపరను ఏర్పాటు చేసుకొని సంఘంలో సంచరించాడు.
ఈ క్రమంలోనే కవిత ఏదవుతుంది? కవితా లక్షణమేది? లక్ష్యమేది వంటి లక్షణాలను వివరిస్తూ సిధగురుబోధలో కొంత వివరించారు. ఈ పద్యాల్ని బట్టి ఆనాటికి లక్ష్య లక్షణం లేని కవులు వుండివుండాలి. మొత్తంమీద కాలజ్ఞానమే కాదు జీవన సరళికి సంబంధించిన విషయాలను చెబుతూ బ్రహ్మంగారు కవితా విమర్శ చేశారు.
కలం పట్టిన వారంతా కవులు కాదని సిద్ధ గురుబోధ ప్రారంభంలోనే బ్రహ్మంగారు రచయితల్ని హెచ్చరించారు.
కవితాకన్యక నెరుగక కవియగునా?
గురులకన్న కవితానౌనా?
కవితను కానని వారలు కవులే?
కవి నేర్పుల కెల్ల కాళికె సిద్దా!
అని అంటారు. గురువులే కవులంటే కవిత్వం చెప్పగలవారు గురుస్థానంలో వుండాలి. ఎదుటివారిని ఒప్పించి శాసించే స్థాయిలో ఉ పదేశించగలిగి వుండాలి. అట్టివారు చెప్పేదే కవిత అని బ్రహ్మంగారంటారు. ఇంకా
“కవియెంత ఘనుండైనను
అవని మయబ్రహ్మ గెలువగ నగునే మాయన్
కవితయనగ నెటువంటిది
రవరవమను నెనిమిదింట రవ్వకు సిద్ధా”
అంటారు. మయబ్రహ్మ విశ్వకర్మ సృష్టిలో ఒకరు. మయబ్రహ్మ గారు దారుశిల్పి అంటే వడ్రంగం చేసేవారు. ఇక్కడ మయబ్రహ్మ అంటే శబ్దార్థం చెప్పుకోవడం సరికాదు. చెక్కను ఉపయోగకారిగా మలచే శక్తి ఇక్కడ ప్రధానం. అంటే సామాజికోత్పత్తి సాధనాల్ని తయారు చేసేవారు. శ్రామికుడు అట్టివాణ్ణి గెలువగలమా అని బ్రహ్మంగారు ప్రశ్నించారు. కవి అటువంటి శ్రామికునికంటే గొప్పవారు కాదని అంటారు. ఆస్థాన కవుల్ని తిరస్కరించడం ఇక్కడ చెప్పదలచుకున్న విషయం . ఏది ఏమైనా బ్రహ్మంగారిది మార్మిక భాష, దీనిపై శోధన జరిపి నిగ్గుదేల్చాల్సిన అవసరం వుంది.
అల్లసానివారి అల్లిక జిగిబిగి అని నానుడి. అలాగే బ్రహ్మంగారు “పట్టులేని కవిత భజియింపరాదయా” అంటారు. దివ్య గురుని పదము పట్టేదే కవిత అంటారు. తీవ్రంగా ఆలోచింపజేసి పరిష్కారానికి గురువువైపు మావుణ్ణి నెట్టగలిగేదే కవిత అని బ్రహ్మంగారంటారు. కవితా లక్ష్యాన్ని కూడా ఇక్కడ కనబరచారు.
బ్రహ్మంగారి కంటే ముందున్న కవులు రాజాస్థానాలలో వుండి వారిని కీర్తిస్తూ కావ్యాలు రాసి వారిచ్చే మడిమాన్యాలు, అగ్రహారాలు గొప్ప సౌఖ్యాల్ని అనుభవిస్తూ ప్రజల్ని విస్మరించారు. ఆస్థానేతర కవులు దాదాపు ప్రజల పక్షాన్నే వున్నారు. ప్రజల్ని జ్ఞానమార్గంలో నడిపించాలని బ్రహ్మంగారు ఆశించారు. అందుకు కవి రాసేదంతా అంటే చెప్పదలచుకున్నదంతా నిజాయితీగా సత్యానికి కట్టుబడి వుండేదై వుండాలని స్పష్టంచేశారు.
“కవి నిబద్దతకును కన్నులు సాక్షియా
వాణ్నిబద్దతకును పరులు సాక్షి
ధర్మబద్దతకును దైవము సాక్షి
తమని బద్ది సాక్షి ధరణి సిదా!”
తాను చూసి తెలుసుకునిందే రాయాలని దానికి కన్నులు సాక్షిగా వుండాలన్నారు. తాను మాట్లాడేటప్పుడు విన్న ప్రజలు సాక్షిగా వుండాలన్నారు. చూసినదానిని మాట్లాడినదాని భౌతిక ప్రపంచం సాక్షి. మరి ధర్మబద్దతకు దైవమే సాక్షి. ఈ భూమే అన్నిటికి సాక్షి, వట్టి ఉ బుసుపోక మాటలు వద్దని నిక్కచ్చిగా బ్రహ్మంగారంటారు. పొగడ్తలు కవిత్వం కాదని ఈయన భావన.
ప్రబంధ యుగంలోని కవులు తమ కవితారీతిని, సుకవి కుకవి స్తుతినిందల్ని వంశావళిని చెబుతూ కావ్యాలు రాశారు. అసలు కవిత్వమెందుకు రాయాలో చెప్పిన వారు బహుకొద్దిమంది. కవిత్రయాన్ని మినహాయిస్తే నిర్దిష్టంగా తమ కవితా లక్ష్యాన్ని చెప్పగలిగింది. సంస్కరణ కవులే. సామాజిక లక్ష్యాన్ని కలిగిన వారే కవితా లక్ష్యాల్ని చెప్పగలరు. అందుకు “కవిమయమగు జగతి పక్షిగతి తిరుగగవలెన్” అని అట్టివాడే సత్యాల్ని ఆవిష్కరిస్తారని బ్రహ్మంగారి అభిప్రాయం. ఆస్థానాలకు పరిమితమైతే నిజాలు తెలివని ఆయన భావన. తమ సందేశం ప్రజలకు చేరాలనుకున్న కవులంతా ప్రజల భాషలోనే ప్రజలకు అర్థమయ్యే ఛందస్సులోనే రచనలు సాగించారు. అన్నమయ్య గేయాలు రాస్తే వేమన వీరబ్రహ్మలు సులభమైన అన్వయ కాఠిన్యంలేని ఆటవెలదుల్ని, గోవిందవాక్యాల వంటివాటిని ఎంచుకున్నారు. ఇటువంటి కవితలు చెలిమవంటిదని బ్రహ్మంగారు చమత్కరిస్తారు. చెలిమ చెలి శబ్దం అని పండితుల అభిప్రాయం. చెలిమ తోడుకున్న కొద్దీ కొత్తనీరు వస్తూనే వుంటుంది. కవితలో కొత్త భావనలు వస్తూనే వుంటాయి.
కవి సూత్రము రెండు గతుల్లో వుంటుందట. ఒకటి ద్రవియించెడు కవిత, మరొకటి ధన్యత చెందే కవిత అని రెండు విధాలుగా కవిత వుంటుందంటారు. బ్రహ్మంగారు ద్రవియించెడు కవిత అంటే కాలంతోపాటు కరిగిపోయేదని ధన్యత చెందిన కవిత అంటే ప్రజలకు ఉపయోగపడే కవిత అని వింగడిస్తారు. ధన్యత చెందిన కవుల చాటుననే తానున్నానని ఓ పద్యంలో అంటారు. దీన్ని బట్టి చూస్తే బ్రహ్మంగారు కేవలం ఆధ్యాత్మిక విద్యలోనే కాకుండా కవితాలక్ష్యాన్ని కూడా బాగా అధ్యయనం చేసిన వారైవుండాలి.
బ్రహ్మంగారు కవితల్లోనే కాదు కవుల్లో కూడా రెండు రకాల కవులున్నారంటారు. వారు జ్ఞానకవులని, నేర్పుకవులని రెండు విధాలుగా వున్నారని ఓ పద్యంలో అంటారు. నేర్పుకవులు బ్రతుకు నేర్చిన వారని, జ్ఞానకవులు భక్తి మార్గాన్ని చూపించి మోక్షానికి దారి చూపే వారని బ్రహ్మంగారి భావన. కవితల్ని కవుల్ని కవితా ప్రయోజనాన్ని వివరించిన తరువాత బ్రహ్మంగారు కుకవుల్ని తీక్షణంగా హెచ్చరిస్తారు. కుకవిత్వం రాయకూడదని ఆయన సూచన. అందుకే ఓపద్యంలో
“దబ్బర కవులకు నరకపు
దిబ్బను యమధర్మరాజు దెబ్బలు నిజమౌ
యబ్బరపు కవులు వారే
మబ్బున బడినారు గనకు మాయర సిద్ధా!”
అని వారి విశ్వాసాల ఆధారంగా యముని దెబ్బలు తప్పవంటారు. ఇటువంటి కవులు నేటికీ కొనసాగుతున్నారు. ప్రజాశ్రేయస్సుకంటే తమ శ్రేయస్సే ప్రధాన మనుకునే కవులందరికీ ఈ పద్యం ఓ హెచ్చరిక వంటిది. మరో పద్యంలో దబ్బర కవులవలె న్యాయాన్ని, అన్యాయాన్ని వేరు చేయకుండా కొందరు కవులు కవిత్వం రాస్తుంటారు. ఇటువంటివారు ఇంటికి కన్నమేసిన దొంగ అక్కడే శవమై పడినట్లు తమ గుట్టు తామే రట్టు చేసుకుంటారని మరొకపద్యంలో వివరిస్తారు. రచనలోనూ, రచయితలోనూ నీతి, ధర్మబద్ధత వుండాలంటారు.
కవితా లక్ష్యము, ప్రయోజనాన్ని వివరించిన తరువాత రచనా విధానాల్ని కూడా సిద్ధగురుబోధలో వివరించారు. ఆనాటికి ఛందస్సులోనే కవిత్వం రాసేవారు కదా! ఛందస్సులో రాసేకవిత విషము, అమృత వాక్కువంటిదట. అది కాళగళుడు, అమృతగళుడు ఈ రెండూ అయిన వాడు శివుడని అన్ని దోషాల్ని హరించేవాడు హరుడని, కవితలో అమృత వాక్కులే కవితలో వుండాలంటారు. ఇంకా కవితలో వాడేగణాలు ఎలా వుండాలంటే
“కవితకెల్ల అమృత గణములు పడవలె
విసపు వాక్కు కవిత వ్యసనమగును
వ్యసనమైన కవిత రసికులు మెత్తురా?
పసయు లేని రుచుల పగిది సిద్దా!”
తమకు నచ్చని రాజులపై విషపుగణాలు వేసి కవితలల్లితే ఆ రాజులు చనిపోయేవారని ప్రతీతి! అటువంటి ప్రయోగాలు వద్దంటారు బ్రహ్మంగారు. ఆనాటికీ ఛందస్సులో పద్యం రాసినా అందులో కవిత్వం వుండేది కాదేమో! ఛందంలో రాస్తారు కాబట్టి కవులుగా చలామణి అయివుంటారు. ఈ పరిస్థితి ఇప్పుడు ఇంకా తీవ్రమైంది. ఈ స్థితిని దృష్టిలో వుంచుకుని
“ఛందము చదివిన కవులుకు
నిందలు లేవంతెకాని నిపుణత కలదే?
కొందరె ఈవుల నిత్తురు
కొందరు ఈవియ్యకుండు కుమతులు సిద్ధా!”
అని మతిలేనివారు రాసేది ఛందంలో వున్నా అది కవిత్వం | కాదని, అందులో నైపుణ్యంలేని వారు రాస్తున్నారని ఆందోళన చెందినట్లున్నారు. చివరగా బ్రహ్మంగారు.
“కవులకు ఈవులనిచ్చుట
నవతా ధర్మమ్మునిచ్చు నన్నెన్నరహో
రవకవులకు రసకవులకు
సవసవగా నిచ్చి పంపుజాణను సిద్దా!”
అని దానమివ్వాలంటే నవతా ధర్మాన్నివ్వాలిగాని ధనకనకాదులు కాదని ఆలంకారిక కవులకు ఏదో ఒకటిచ్చి పం పేజాణనని చెప్పుకున్నారు.
కవితా లక్షణాన్ని లక్ష్యాన్ని ప్రయోజనాన్ని విధానాన్ని చక్కగా వివరించి ప్రజలకు దగ్గరైనారు. అయితే కేవలం కాలజ్ఞానం చెప్పిన సంస్కర్తగా సాంఘిక ధర్మాల్ని చెప్పిన సంస్కర్తగానే బ్రహ్మంగారిని చూడడం పాక్షికమే.