కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి అమరుడైన 21 డిసెంబర్ రోజే 53 సంవత్సరాల తర్వాత కామ్రేడ్ ఎల్.ఎస్.ఎన్ మూర్తి అమరుడు కావడం యాదృచ్ఛికమే కావచ్చు. కాకపోతే ముప్పై ఏళ్ళు నిండకుండానే శ్రీకాకుళ విప్లవంలో ఎన్‌కౌంటర్ అయిన సుబ్బారావు పాణిగ్రాహి పూజారిగా పనిచేస్తూ కమ్యూనిస్టు భావాలతో ప్రభావితుడు అయ్యాడు. గుడికి వచ్చే వారికి, గ్రామ ప్రజలకు ఆ భావాలు ప్రచారం చేసేవాడు. ఇక ఎల్.ఎస్.ఎన్ పూర్వీకులది కాంగ్రెస్‌లోనే ‘అతివాదం’గా భావించబడిన రాజకీయ చరిత్ర. గుంటూరులో అన్న లక్కవరం రాధాకృష్ణమూర్తి యింట్లో ఉండి చదువుకున్న రోజుల్లో ఆయన ఇంగ్లిషు లెక్చరర్ అయిన అన్న నుంచి, ఆ ఇంట్లో ఉండి స్ఫూర్తిశ్రీ పేరుతో భారతి వంటి పత్రికల్లో కథలు రాసిన భాస్కరరావు గారితో సాహిత్యాభిరుచిని పెంచుకున్నాడు.

1970లో పూనేలో డిఫెన్స్ ఎకౌంట్స్‌లో ఉద్యోగం చేసేనాటికే తెలుగు నేల మీద కమ్యూనిస్టు పార్టీ చీలిక, శ్రీశ్రీ ఖడ్గసృష్టి, కె.వి.ఆర్, సి. విజయలక్ష్మిల కవిత్వం నేపథ్యంగా చైనాలో 1966లో మహత్తర చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవ అసంకల్పిత ప్రభావం గిన్స్ బర్గ్ వంటి బీటిల్స్ కవుల ఉద్యమ ఉత్తేజంతో తర్వాతి యువతరాన్ని కదిలించిన  దిగంబర కవులు నక్సల్బరీ శ్రీకాకుళ విప్లవ పోరాటంతో విరసం ఆవిర్భావానికి భూమిక నిర్వహించారు.

1972లో ఎల్.ఎస్.ఎన్ పూర్తికాలపు విప్లవ కార్యకర్తగా మారేనాటికి కార్మికరంగాన్నంతా తీవ్రంగా ప్రభావితం చేసిన విశాఖపట్నంలో జరిగిన శ్రీశ్రీ అరవయ్యేళ్ళ సభల్లోని సైద్ధాంతిక ఘర్షణ,  భూమయ్య, కిష్టాగౌడ్‌లనే రైతాంగ విప్లవకారులకు సెషన్స్ కోర్టు విధించిన ఉరిశిక్ష. ఒక విధంగా తెలుగు నేల మీద సాహిత్యం, కళలు కార్మికులతో మమేకం కావడానికి ఈ రెండు సందర్భాలు కెటాలిస్టు పాత్ర నిర్వహించాయి.

హైదరాబాదులో కేంద్ర ప్రభుత్వ రంగాలైన రైల్వేలు, పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్, టెలిఫోన్ డిపార్ట్‌మెంటులే కాకుండా ఎల్‌ఐసి, ఇసిఐఎల్, ఐడిపిఎల్ వంటి పబ్లిక్ సెక్టార్‌లోని  కార్మిక సంఘాలన్నీ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పడినవి. ఎ జి ఆఫీసులో కె. కె. మీనన్, నాగభూషణం గార్లు రంజని అనే సాహిత్య సంస్థను, పత్రికను నిర్వహించేవారు. దీని ద్వారా ఈ కార్మిక సంఘాలన్నీ సాహిత్య, సాంస్కృతిక కళారంగాలలో నక్సల్బరీ, శ్రీకాకుళ రాజకీయాలతో కనెక్ట్ అయినవి. ‘ఇప్పుడు వీస్తున్న గాలి’ ని శ్వాసించగలిగి, విప్లవాగ్ని రగిలించిన అమరులు శ్రీనివాస్, బి.ఎస్.ఎ సత్యనారాయణ, పురుషోత్తం రాజు. అటువంటి అవకాశం తనకు సుదీర్ఘకాలం సాధ్యమైన ఎల్.ఎస్.ఎన్ మూర్తి ప్రత్యేకించి పాణిగ్రాహి సాంస్కృతిక రంగంలో రగిలించిన నిప్పురవ్వను ఒక పొలిటికల్ కమిస్సార్‌గా జననాట్యమండలి జ్వాలగా విస్తరించడంలో కళాకారులకు, సాంస్కృతిక కార్యకర్తలకు కె. ఎస్., ఐ.విలతో పాటు మార్గదర్శి అయ్యాడు.

ఆయన, ఆయనవంటి రాజకీయ కమిస్సార్‌ల పూనికతోనే 1972 తర్వాత హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్ రంగాలలో జననాట్యమండలి సాంస్కృతిక కార్యక్రమాలతో మే డే నిర్వహణ సాధ్యమైనది. మేడేలకు పోరాడేవానిదే మేడే జెండా అనే స్ఫూర్తిని కలిగించి 1972 నాటికే ఎల్.ఎస్.ఎన్ ద్వారానే చెరబండరాజును పరిచయం  చేసుకుని ఎచ్.ఎం.టి నుంచి ప్రభంజన్ (లక్ష్మినారాయణ), మరొక పబ్లిక్ సెక్టార్‌లో పని చేస్తున్న కోటేశ్వరరావు విరసంలోకి వచ్చారు. కోటేశ్వరరావు ఎక్కువ కాలం జీవించలేదు.

ప్రభంజన్ ద్వారానే ‘రేపటి విప్లవం’ పుస్తక ప్రచురణతో ‘రేపటి విప్లవాన్ని’ అవగాహన చేసుకోవడానికి  ఇవ్వాళ్టి సాహిత్య, సాంస్కృతిక రంగాలకు సెలవు ప్రకటించాలన్న మార్క్సిస్టేతర భావజాలానికి జవాబుగా సిద్ధాంత ఘర్షణ ప్రారంభమైంది.

72-74 మధ్య కాలంలో ఎల్.ఎస్.ఎన్ నారాయణగూడలోని, విరసంకు ఖమ్మం మహాసభల్లో నాటకరంగాన్ని పర్యవేక్షించే బాధ్యుడుగా నిర్ణయింపబడిన సి.ఎస్. రావు (ఊరుమ్మడి బతుకులు, కథ, నాటక, సినిమా రచయిత) ఇంట్లో జరిగే యూనిట్ సమావేశాలకు కూడ ఒకటి, రెండు సార్లు వచ్చాడు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ఎం. ఎ. విద్యార్థి గోపు లింగారెడ్డి కన్వీనర్‌గా వున్న విరసం యూనిట్‌ను కూడా 72 నుంచి ఎమర్జెన్సీ దాకా ఎల్.ఎస్.ఎన్ గైడ్ చేశాడు. 1971, 73, 74 విరసం సభ్యుల అరెస్ట్‌లకు వ్యతిరేకంగా హైదరాబాదు నగరంలో కార్మికరంగం నుంచి వచ్చిన సంఘీభావమంతా పైన పేర్కొన్న అమరులతో పాటు ఎల్.ఎస్.ఎన్ నాయకత్వం వల్ల సన్నిహితమైంది. ఎందుకంటే విరసం సిటీ యూనిట్ జననాట్యమండలి కమిస్సార్‌గానూ, ‘పిలుపు’ పత్రిక బాధ్యులైన ఎం.టి. ఖాన్, రంగనాథం విరసం సభ్యులైనందువల్ల కూడా చెర, ఖాన్, రంగనాథంల ద్వారా ఆయన విరసంకు కూడ రాజకీయ కమిస్సార్‌గా కూడా పని చేసినవాడయ్యాడు. ఇది మరణానంతర ప్రశంస కాదు. ఇప్పటికీ అవసరమైన గుర్తింపు.

వారాసిగూడా వైపు బౌద్ధనగర్ మీదుగా పోతుంటే ‘క్రాంతి’ ఆఫీసు, ఎల్.ఎస్.ఎన్ గుర్తు రాకుండా ఉండరు. ఎల్.ఎస్.ఎన్, కిరణ్ (ఇపుడు ముంబయిలో ఆర్థర్ రోడ్ జైలులో వున్న రాణి సత్యనారాయణ) లేకుండా విజయవాడ వన్ టౌన్‌లో పార్థసారథి ప్రెస్, టూ టౌన్‌లో బాబూరావు, పద్మల నాగేంద్ర ప్రెస్‌లను ఏడు, ఎనిమిది దశాబ్దాలను ఊహించగలమా.  

 బహుశా నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటస్ఫూర్తితో 2022 దాకా బతికి వుండి 2018 దాకా సుదీర్ఘకాలం పని చేసిన విప్లవకారులు దేశంలోనే తక్కువమంది మిగిలి వుంటారు. జననాట్యమండలి చరిత్ర 50 ఏళ్ల నాటికైనా రచించాలని విప్లవోద్యమం తలపెట్టినపుడు అమరుడు డప్పు రమేష్, దానితో అనుబంధం వున్నవాళ్ల అనుభవాలు రాయించినప్పుడు 2018లో దాదాపు కంటి చూపు కరువవుతున్న కాలంలో ఆయన తన జ్ఞాపకాల నుంచి జననాట్యమండలి అనుభవాలు రాసిచ్చాడు. జననాట్యమండలి చరిత్రలో అవి సముద్రం మీద కాలం చేసిన సంతకం వలె నిలిచే వుంటాయి.

అటువంటి అనుభవం ఇంక 1980లో పీపుల్స్ వార్ ఏర్పడినాక ‘క్రాంతి’ పత్రిక పార్టీ ఆర్గన్‌గానే వెలువడినపుడు సంపాదకత్వ బాధ్యతలో ఆయన 1983లో ఢిల్లీలో అఖిల భారత సాంస్కృతిక సమితి (ఎఐఎల్‌ఆర్‌సి) ఆవిర్భావానికి అమరుడు ఐవితో పాటు నిర్వహణ బాధ్యతను చేపట్టాడు.

అమరుడు జి. లింగమూర్తి (కృష్ణ) తర్వాత కొద్దికాలం విరసంకు రాజకీయ కమిస్సార్‌గా వ్యవహరించి కావలిలో విరసం సభ్యులకు సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో అవసరమైన గైడెన్స్ ఇచ్చాడు. బహుశా ఆయన ఏభై ఏళ్ల విప్లవోద్యమ బహుముఖ పాత్రల్లో కేవలం దండకారణ్యంలో ఉన్న కాలం మాత్రమే ఆయన ప్రజా సంఘాలతో ప్రత్యక్ష సంబంధాల్లోలేని కాలం. ఎల్.ఎస్.ఎన్ ప్రమేయం లేకుండా తెలుగు నేల మీద విరసం వంటి ప్రజా సంఘాలు అంత దృఢంగా పని చేయవని భావించాడేమో శత్రువు, భీమా కోరేగావ్ ఎల్గార్ పరిషత్ కుట్ర కేసులో ఒక అప్రూవర్ ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన పేరు చెప్పించాడు. అరుణ్ ఫెరేరా పాల్గొన్న ఒక రహస్య సమావేశంలో తానున్నానని చెప్పిన ఒక మాజీ నక్సలైటు ఆ సమావేశానికి వివి లేఖ తీసుకొని మూర్తి (శరత్) అనే వ్యక్తి వచ్చాడు అని చెప్పినట్లుగా నమోదు అయింది.

1983 కరీంనగర్ రైతుకూలీ సంఘం సభలే కాదు, 1984 అనంతపురం ఆర్.వై.ఎల్ రాష్ట్ర మహాసభలు కూడ తీవ్ర నిర్బంధంమధ్య నిర్వహించాడు. అది పంజాబ్ యువ మిలిటెన్సీని ఎన్‌కౌంటర్ల రక్తపాతంలో ఇందిరా ప్రభుత్వం ముంచుతున్న కాలం. ఇటు రాష్ట్రంలో ఆర్.ఎస్.యు, ఆర్.వై.ఎల్ ‘గ్రామాలకు తరలండి’ క్యాంపెయిన్‌లో సంక్షుభిత దేశ చిత్రపటాన్ని విశ్లేషించి వివరించిన రిపోర్ట్‌లు సభలో ఆర్.ఎస్.యు తరఫున  అదే అంశం పై ప్రసంగించిన ఎన్.వేణుగోపాల్‌తో కలిసి భవిష్యత్ చరిత్ర కోసం ఎన్నో గోనెబస్తాలకెత్తాడు. కానీ 1985 ఆట మాట పాట బందయిన గడ్డుకాలంలో ఇందులో ఎంత కాలగర్భంలో కలిసి పోయిందో అప్పటి వారి జ్ఞాపకాల్లోనైనా మిగిలిందో తెలియదు.

1973లో విరసం సాహిత్య పాఠశాల జరిగినప్పుడు ‘సరియైన భావాలు ఎక్కడ నుంచి వస్తాయి’ అనే మావో సుప్రసిద్ధ రచన అచ్చు వేయడానికి, అమరుడు మువ్వా రవీంద్రనాథ్ అనువాదం చేసిన ‘చారు మజుందార్ రచనలు’ అచ్చు వేయడానికి  డాక్టర్ రామనాథం గారు, కొందరు కామ్రేడ్స్ సహకారంతో ‘శ్రామిక వర్గ ప్రచురణలు’ ప్రారంభించారు. శ్రామిక వర్గ బుక్‌స్టాల్ కూడా వరంగల్‌లో తెరిచారు. బహుశా విప్లవోద్యమ మార్గదర్శకత్వంలోనే కావచ్చునని ఇపుడనిపిస్తున్నది.

ఎందుకంటే 1980-81 లలో కె.ఎస్, ఐవిలు  చైనాకు వెళ్ళి మావో రచనలు మరో ఐదు సంపుటాలు కాదగిన రచనలు ఉన్నాయని తెలుసుకొని అవి అన్ని భారతీయ భాషల్లో అనువాదం చేసి ప్రచురించడానికి అనుమతి తీసుకొని వచ్చిన తర్వాత శ్రామికవర్గ ప్రచురణలు ద్వారా తెలుగులో ఐదో సంపుటి నుంచి తొమ్మిదో సంపుటి వరకు వెలువడడానికి అనువాదకునిగానూ, సమన్వయకర్త గానూ వ్యవహరించింది ఎల్.ఎస్.ఎన్‌యే. అవి వ్యాన్‌గార్డ్  లేదా న్యూవిస్టాస్ ప్రచురణలుగా ఇంగ్లిషు, హిందీ, బెంగాలీలో కూడా ప్రచురించబడినవి. కొద్ది కాలానికే పోలీసు నిర్బంధం వల్ల వరంగల్‌లో శ్రామికవర్గ బుక్‌స్టాల్ మూతపడింది. కలకత్తాలో న్యూవిస్టాస్ వంటి బుక్‌షాప్‌లు చాలా కాలం వరకు మావో తొమ్మిది సంపుటాలు, ఇతర విప్లవ సాహిత్యం అమ్మాయి.

‘శ్రామిక వర్గ ప్రచురణలు’ మావో రచనలకు విప్లవోద్యమంలో బౌద్ధిక రంగంలోని ప్రాపగాండా టీం సమిష్టి కృషిలో రక్తాక్షరాలతో లిఖించదగినది ఎల్.ఎస్.ఎన్ పాత్ర. అయితే ఎల్.ఎస్.ఎన్ విప్లవం నుంచి అలవరుచుకున్న నిస్వార్థ (ప్రొలిటేరియట్) సంస్కృతి గురించి మనం చెప్పుకోవాలి.

ఎల్.ఎస్.ఎన్ కంటి చూపుతో సహా ఆయన మూలుగులన్నింటినీ పీల్చేసింది ఆయన రాజమండ్రి జైలులో ఎడారిలా ఉన్న బి బ్లాక్ లోని  ఒంటరితనం. అతనికి ఎప్పుడూ మనుషులు కావాలి. చుట్టూ పిల్లలు, మనుషుల మధ్యన మసలుకోవడం అతనికి ఇష్టం. సన్నిహితులు కూడా అవివాహితుడు అనుకునేంతగా ఆయన స్త్రీ సాహచర్య జీవితం క్షణభంగురంలా ముగిసింది. ఆ గాయం నుంచి ఆయన, ఎప్పుడూ జీవితంలో పసిపిల్లల నుంచి కనీసం మనసెరిగిన మనుషుల నుంచి పలకరింపు, స్పర్శ కోరుకున్నాడు. చలసాని ప్రసాద్, పుస్తకాలు కూడ తీసుకొని రెండు నెలలకొకసారి వెళ్తూ ఆ లోటు పూడ్చే ప్రయత్నం చేశాడు. శ్రామిక వర్గ ప్రచురణలు అమ్మకాలు చూసిన బాధ్యుడు.

ఆ గడ్డు కాలంలో సిగిరెట్లకు కూడ లేకుండా ఎంత ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నాడో అని ‘మావో రచనలు’ అమ్మకాల మీద వచ్చిన నాలుగున్నర వేలు పంపితే అవి నాకెందుకన్నాడు. అది సంస్థ డబ్బు అని నిరాకరించాడు. ఆయన రంప చోడవరం కేసు చూసిన పౌర హక్కుల సంఘం న్యాయవాదులు అవసరాలు చూసారు. కాకినాడలో న్యాయవాదిగా ఉన్న భూషణం పుస్తకాలు ఇచ్చాడు. అపుడప్పుడు సిఎస్ఆర్ కూడ వెళ్లి ఆయన అవసరాలు చూసేవాడు. కానీ జైలు జీవితం ఒంటరితనం దుర్భరమైనది.

అక్కడ ఆయన విప్లవ చైతన్యమే ఆయనను నిలిపింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడుగా ఆయన బాధ్యతల వల్ల ఢిల్లీలో కోబాడ్ గాంధీతో సమన్వయంలో ఉండేవాడు కనుక కోబాడ్ అరెస్టు తర్వాత ఇంక ఢిల్లీలో తన గదిలో ఉండలేనని అర్థమై, అనారోగ్యంతో, జ్వరంతో ‘క్రాంతి ప్రచురణలు’ కాలంలోనే కాకుండా, తొలినుంచి పరిచయమున్న బెజవాడకు వెళ్ళి రైలు దిగి ఎక్కడికీ వెళ్లలేని స్థితిలో స్టేషన్ దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్ళి నిద్రిస్తున్నపుడు ఆయనను ఫాలో అవుతున్న ఇంటిలిజెన్స్ పోలీసులు అరెస్టు చేసి రాజమండ్రి ఏజెన్సీ ఏరియాలోని కుట్ర కేసులో ముద్దాయిగా కోర్టులో హాజరు పరిచారు. జైల్లో ఉండగానే ఆ కేసులో బెయిల్ వచ్చి విడుదలయ్యే అవకాశం వస్తే, ఆ ప్రాంతం నుంచే జమానతులు కావాలని, తెచ్చిన వారిని ఎవరికి బెయిల్ యిస్తున్నారో తెలుసా అని జడ్జిగారే మందలించారు. అట్లా ఎపిసిఎల్‌సి అధ్యక్షుడు, న్యాయవాది చిట్టిబాబు, ఇతర న్యాయవాదుల కృషి కూడా చాలా కాలం దాకా నెరవేరలేదు.

జైల్లో వుండగానే నెల్లూరులో నేదురుమల్లి జనార్ధన రెడ్డి హత్యా ప్రయత్నం కేసులో ముద్దాయిగా చేశారు. విడుదలకు అవకాశాలు మెరుగయిన కాలంలో ఈ అవాంతరం వచ్చింది. అక్కడ అబ్బాయి రెడ్డి, బ్రహ్మంగార్ల కృషి వల్ల త్వరలోనే బెయిల్ వచ్చి విడుదల కావడానికి ఐదేళ్లు పట్టింది.

ఒకవైపు కేసుల్లో, కోర్టుల్లో ఆయననింత భయంకరమైన టెర్రరిస్టుగా చూపుతున్న పోలీసు యంత్రాంగం ఇంటిలిజెన్స్ వాళ్ళు ఆయనను అరెస్టు చేశాక ఆయనతో ఏమన్నారో తెలుసా – “నువ్వు కేంద్ర కమిటీ సభ్యునివైనా ఎప్పుడూ క్రాంతి, మావో సంపుటాలు వంటి సంపాదకత్వ, ప్రచురణ బాధ్యతల్లోనే ఉన్నావని, ఆయుధం పట్టలేదని మాకు తెలుసు కనుక అమాటే ఒప్పుకుంటే చాలు వదిలేస్తాం.”

జైల్లో ములాఖత్ పెట్టిన ఒక కామ్రేడ్‌తో “అదేమిటి కోబడ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ లెటర్స్ శీర్షికకు తాను ఎప్పుడూ ఆయుధం పట్టలేదని రాశాడు. కేంద్రకమిటీ సభ్యుణ్ణయినప్పుడు మావోయిస్టు పార్టీ చర్యలతో పాటు ఆచరణ కంతా నేనే భాధ్యుణ్ణవుతాను కదా” అన్నాడు ఎల్.ఎస్.ఎన్.  అదీ ఆయన సమష్టిలో భాగమైన విప్లవ చైతన్యం. ఈ మాత్రమైనా మనకు తెలిసింది. రహస్య విప్లవోద్యమానికి ఎంతో తెలిసుండాలి. కె ఎస్ పంపించే పార్టీ పనుల మీద వరంగల్‌కు వచ్చినపుడు కుమార్‌పెల్లిలో వివి ఇంటికి వచ్చేవాడు. విడుదలయ్యాక వివి ఇంట్లో చిన్నపిల్లలు లేరు కనుక బల్లా రవీందర్ ఇంట్లో వుండేవాడు. ‘స్వేచ్ఛలో’ జననాట్యమండలి కాలం నుండి పరిచయమున్న పద్మ (ఆజాద్ సహచరి), అనురాధ, రవి ఎంతో కామ్రేడ్లీగా చూసుకున్నా ఆయన పిల్లలు వుండే ఇల్లు వెతుక్కునేవాడు. ఆ కాలానికి ఆయన మేనల్లుడు కృష్ణమూర్తి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్‌లో  చూపించినా ఇంక చూపు రాదని తేలింది. మొబైల్ ఫోన్‌లో ప్యాడ్‌లో భూతద్దంలో చూసినట్లు అక్షరాలు చదువుకోడానికి మళ్ళీ వాళ్ళ పిల్లల సహకారం, తనకెంతో ఆత్మీయుడైన రాజా సహకారం తీసుకున్నాడు.

బహుశా దండకారణ్యానికి వెళ్ళే ముందు ఆయన అజ్ఞాత జీవితం ఎక్కువగా మద్రాసులో గడిచి ఉంటుంది. నేనట్లా భావించాను. ఆయనకు సాహిత్యం, కళలు గురించి అభిరుచులు, ఇష్టాలు, మార్క్సిస్టు దృక్పథంతో విశ్లేషించి పంచుకోవడానికి కాంతిగారు, కాకరాల ఆయన విరామ కాలంలో ఒక చలివేందిరగా వున్నారు.

గూగీ సాహిత్యాన్ని కాకరాలగారి పిల్లలకు కూడా పరిచయం చేసింది ఆయనే. ముఖ్యంగా డిడానీ కిమాతే వంటి ప్రజారంగస్థల నాటకాన్ని అన్వయించి అల్లూరి సీతారామరాజు, ద్వారబంధాల చంద్రయ్య నాయకత్వంలో జరిగిన సాయుధ విప్లవంపై నాటకం రాయమనేవాడు. ఎందుకంటే కాకరాలగారు డాక్టర్ రాజారావుగారి స్మృతిలో క్రెమ్లిన్ గంటలు నాటకం  ప్రదర్శించి ఉన్నాడు. కాకరాలగారు ఆయన ప్రోత్సాహంతోనే డిడానీ కిమాతే నాటకాన్ని  అనువదించాడు కూడా. ఒకరిద్దరయినా ఆ రచనను మెరుగుపరచడానికి చదివే వుంటారు. అది వెలుగు చూడాలని ఎల్.ఎస్.ఎన్. కోరిక. ఆయన ప్రోత్సాహం వల్లనే వివి జైల్లో గూగి రెండు రచనలు (డెవిల్ ఆన్ ద క్రాస్, ప్రిజన్ డైరీ) అనువదించాడు. గూగీని ఆయనకు పరిచయం చేసింది ఎల్.ఎస్.ఎన్. 

సృజన అంతా ‘అల్లం వాసన’ వస్తున్నదని కొందరు పాఠకులు అనుకున్న రోజుల్లో రావిశాస్త్రి రచనలంత, వంగపండు పాటలంత హాయిగా అల్లం సోదరుల, ‘కొలిమంటుకున్నది’ వంటి నవల గానీ ‘జగిత్యాల పల్లె కదిలిందిరా జంబాయిరే’ వంటి పాటను, చెప్పేదేముంది, ఎర్రజెండెర్రజెండెన్నియలో వంటి పాటను ఎంతో ఆనందంతో ఆస్వాదిస్తున్నానని చెప్పినవాడు ఎల్.ఎస్.ఎన్.  కొమురం భీంవంటి చారిత్రక నవల గూగీమటిగరీ వంటి నవల చదవకముందే, బహుశా ముందుగానే వెలువడిన నవల అనేవాడు.

ఇక ప్రజాసంఘాల కార్యకర్తలకు తను భారం కాకూడదు (కేవలం వాళ్ళ దగ్గర ఉండడం వల్ల) అని నిర్ణయించుకున్నాక సి.ఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో ఉండడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన మనుషుల మధ్య డార్మిటరిలో ఉండడానికి ఇష్టపడ్డాడు. కానీ భావసారూప్యం వల్ల ఎక్కువ కాలం ఎ.బి.కె ప్రసాద్ తోనే గడిపేవాడు. ఎ.బి.కె ఆయనను ‘ క్రాంతి ‘ అనే పిలిచే వాడు. ఆయనకు సంపాదకుడుగా, పత్రికా రచయితగా ఎల్.ఎస్.ఎన్ క్రాంతి సంపాదకుడిగానే కనెక్ట్ అయ్యాడు.

ఇక కాకరాల, కాంతి  సి.ఆర్ ఫౌండేషన్‌లో చేరాక ఆయనకు మళ్ళీ మద్రాసు జీవితం లభించినట్లయింది. కానీ కాంతి గారు కరోనాకాలంలో గుండె పోటుతో మరణించడం, కాకరాలగారి అనారోగ్యం కూడ ఎల్.ఎస్.ఎన్‌ను మరీ ఒంటరిని చేశాయి. విప్లవోద్యమంలో వున్నవాళ్ళు ఆయనకు ఎంతో అండగా వున్నా, తిరిగి తాను విప్లవానికి ఏమీ చేయలేకపోతున్నాననే ఆవేదన, వారి విలువైన సమయాన్ని తనకోసం కేటాయించాల్సి వస్తున్నదనే భావానికి పురికొల్పింది.

ఆయన విడుదలైన కాలంలో హైదరాబాదులో వున్న ఆయన రక్తబంధువులను కలిసేవాడు. గుంటూరుకు వెళ్లి కూడ పాత బంధుత్వాలు రుక్మిణి, సి.ఎస్.ఆర్‌ల చిరకాల అనుబంధాన్ని పునరుద్ధరించుకున్నాడు. ఆయన భావాలను గౌరవించే మేనల్లుడు కృష్ణమూర్తితో పాటు రవి, అనూరాధలు, వారణాసి సుబ్రహ్మణ్యం ఆసుపత్రిలో ఆయనను కంటికి రెప్పలా చూసుకున్నారు. చికిత్సతో సహకరించే మానసిక స్థితి ఏర్పడుతున్న సమయంలోనే ఆయన  శిధిలమైన అవయవాలు ఆయనకు సహకరించలేదు.

జ్ఞానం, చైతన్యం పొందిన కాలమంతా అంటే నక్సల్బరి కాలం నుంచి 2022 దాకా ఏభై రెండేళ్ల కాలం విప్లవానికే అంకితం చేసిన నిస్వార్థ జీవి నూతన మానవుడు ఎల్.ఎస్.ఎన్. ‘శరచ్చంద్రిక’ లో శ్రీశ్రీ రచించిన చంద్రునివంటివాడు శరత్ పేరుతో విప్లవంలో పని చేసిన ఎల్.ఎస్.ఎన్.

ఆ అమరునికి వినమ్ర జోహార్లు.

04 జులై 2023

(జులై 18 న హైదరాబాదులో ఆవిష్కరణ కానున్న *కా. ఎల్.ఎస్.ఎన్. స్మృతి శరచ్చంద్రిక* పుస్తకంలోని వ్యాసం )

One thought on “కామ్రేడ్ ఎల్‌ఎస్‌ఎన్ స్నేహం శరచ్చంద్రిక

 1. మా సత్యం
  ఫెలో ట్రావెలర్ రాసిన వ్యాసంలో
  కామ్రేడ్ ఎల్‌ఎస్‌ఎన్ మూర్తి గారి గురించి ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాను.
  డైరెక్టర్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ లో పనిచేస్తున్న రోజుల్లో ట్రేడ్ యూనియన్ కార్యక్రమాల్లో
  పోస్ట్& టెలిగ్రాఫ్ నుండి BSA సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గారు, పురుషోత్తమ రాజు గారు ట్రేడ్ యూనియన్ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళం.
  ఒక సందర్భంలో కామ్రేడ్ ఎల్‌ఎస్‌ఎన్ మూర్తి గారి గురించి వారి నుంచి తెలుసుకోవడం జరిగింది.
  శరత్ పేరుతో విప్లవంలో పని చేసిన కామ్రేడ్ LSN మూర్తి గారికి విప్లవ జోహార్లు

Leave a Reply