కామ్రేడ్ కనకాచారి స్మృతిలో
దేశాన్ని అమ్మేస్తున్నవారే దేశభక్తిని ప్రచారం చేస్తున్నారు. దేశభక్తిలో తమను మించిన వాళ్లు లేరని దబాయిస్తున్నారు. మిగతా అందరినీ దేశద్రోహులని చెరసాలలో పెడుతున్నారు. ఇప్పుడు దేశభక్తి అంటే ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడం. మోదీ తనకు ప్రియమైన ఆదానీని ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానంలో నిలబెట్టడం. దీని కోసం ఉన్న చట్టాలన్నిటినీ ఉల్లంఘించడం. ఇష్టం వచ్చినట్లు మార్చేయడం. నిరంకుశ చట్టాలు తీసుకరావడం. ఇదీ ఇవాళ దేశభక్తి విశ్వరూపం.
దేశభక్తి రహదారిలో భారత ఆర్థిక వ్యవస్థ కార్పొరేటీకరణ అంతిమ లక్ష్యంతో శరవేగంగా పరుగులు తీస్తోంది. ప్రజల రక్త మాంసాలతో ఉత్పత్తి అయిన సంపదలను, అపారమైన సహజ వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టే క్రమంలో విపరీతంగా అసమానతలు పెరిగిపోయాయి. కొత్త అసమానతలు విజృంభించాయి. ప్రజల సంపదతో దళారీ పెట్టుబడిదారులకు మౌలిక వసతులు కల్పించిన మిశ్రమ ఆర్థిక విధానం 1982 నాటి అప్పుల విధానంతో బలపడి, పివి నరసింహారావు నూతన ఆర్థిక విధానాలతో తెగబడి, ఇవాళ నరేంద్రమోదీ హయాంలో సంపూర్ణ కార్పొరేటీకరణగా మారుతున్నది. ఈ పని చేయడానికి బీజేపీకి గత ప్రభుత్వాలకంటే అదనంగా సమాజంలోని హిందుత్వ భావజాల సమర్థన దొరికింది.
అయితే ఈ కార్పొరేటీకరణను అంగీకరించమని దేశ వ్యాప్తంగా అనేక పోరాటాలు జరుగుతున్నాయి. మూడు సాగు చట్టాల ద్వారా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించాలనే కుట్రను వ్యతిరేకిస్తూ రైతులు ఏడాదిపాటు పోరాడారు. కనీసం రెండు దశాబ్దాలుగా దేశ వ్యాప్తంగా సహజ వనరులను కార్పొరేట్ శక్తులపరం చేయడానికి వీల్లేదని ఆదివాసులు పోరాడుతున్నారు. ఈ పోరాటాలతోపాటు వాటిని దెబ్బతీయడానికి ఆదివాసీ ప్రాంతాల్లో సైనికీకరణ పెరిగిపోతున్నది. కార్పొరేటీకణ, సైనికీకరణ కవల పిల్లలు. పాలకుల రాజకీయార్థిక విధానాల స్వభావంలోనే వీటికి మూలాలు ఉన్నాయి.
అధికార మార్పిడీ నుంచి ఈ 75 ఏళ్లుగా పాలకులు అనుసరిస్తున్న భూస్వామ్య, సామ్రాజ్యవాద అనుకూల విధానాల పరాకాష్టే కార్పొరేటీకరణ, సైనికీకరణ. ఈ రెండూ లేకుండా హిందుత్వ ఫాసిజం లేదు. ప్రపంచ పెట్టుబడిదారీ విధానంలో వచ్చిన మార్పులను, భారత పార్లమెంటరీ రాజకీయాల్లో వచ్చిన మార్పులను కలిపి కార్పొరేటీకరణను చూడవలసి ఉన్నది. పాలకులు అభివృద్ధి పేరుతో పెట్టుబడిదారుల ఖజానాలు నింపుతూ ప్రజలను మరింత నిరుపేదలను చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా దోపిడీని తీవ్రం చేశారు. దీన్నంతా కార్పొరేట్ శక్తుల అభివృద్ధి మిరిమిట్లలో కనిపించకుండా చేశారు.
ఈ రాజకీయార్థిక దగాను దాచేయడానికి దేశ ప్రధాని ‘ఆజాది కా అమృతోత్సవ్’ పేరుతో ఉత్సవాలకు పిలుపునిచ్చాడు. దీనిలో భాగంగా ప్రజలందరూ ఇళ్లపై జాతీయ జెండాలు ఎగరవేయాలని పిలుపునిచ్చాడు. ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు అప్పగించే పనిలో బిజీగా ఉంటుంది. ప్రజలు మాత్రం త్రివర్ణ పతాకాలు ఎగరేసి తమను చుట్టుముట్టిన కార్పొరేట్ బానిసత్వాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఇదే జాతీయ స్పూర్తి అని, దేశభక్తి అని చెప్పగల స్థితికి మన ఆర్థిక సంక్షోభం చేరుకున్నది. వేగంగా విస్తరిస్తున్న ద్రవ్య పెట్టుబడి అవసరాలకు అనుగుణంగా పాలకులు ఎప్పటికప్పుడు తమ విధానాలను మార్చుకుంటూ పోతున్నారు. వీటిని లోతైన సిద్ధాంత దృక్పథంతో పరిశీలించాలి. పాలక విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో మొదటి నుంచీ ఉన్న ప్రజా ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయాలి. వలస వ్యతిరేక కాలం నుంచి అనేక అవాంతరాల మధ్యనే బలపడుతున్న ప్రజా రాజకీయాల ఆచరణను స్వీకరించాలి. ఆ రోజు భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ఉద్దంసింగ్, అష్పఖుల్లాఖాన్ లాంటి వాళ్లు తమ నెత్తురు చిందించింది దేశ ప్రజలు ఈ కార్పొరేట్ బానిసత్వంలో బతకడానికి కాదు. దేశంలోని సకల సంపద ప్రజల పరం కావాలి. సమానత్వం సిద్ధించాలి. రాజకీయ అధికారం కార్పొరేట్ల కోసం కాకుండా కష్టంచేసి సంపద సృష్టించే ప్రజల కోసం కావాలి. అదే నిజమైన స్వాతంత్య్రం. దీని కోసం బలమైన కార్పొరేట్ వ్యతిరేక పోరాటాలు చేపట్టాలి. ఆ పని స్పష్టమైన రాజకీయార్థిక దృక్పథంతో సాగాలి. అమరుడు కా. కనకాచారి ఉపాధ్యాయుడిగా, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ కార్యకర్తగా, నాయకుడిగా ప్రజా రాజకీయాలకు తన జీవితాన్నంతా ధారపోశాడు. 24.8.2005న ప్రభుత్వ హంతక ముఠా చేతిలో బలైపోయాడు. ఆయన స్ఫూర్తిలో ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. అందరికీ ఇదే ఆహ్వానం
విప్లవకారులమైన మేము విప్లవం ద్వారానే ఈ దేశ ప్రజలకు దాస్య విముక్తి కలుగుతుందనుకుంటున్నాం. విప్లవం అంటే మా ఉద్దేశంలో ఒక్క పర ప్రభుత్వంతో పోరాడటం మాత్రమే కాదు. మా విప్లవానికి ఆదర్శం న్యాయ సమ్మతమైన, ఒక కొత్త సమాజాన్ని స్థాపించడం. పెట్టుబడిదారీ విధానాన్ని నాశనంచేసి, వర్గరహితమైన సమాజ వికాసానికి దోహదం చేయడం, విదేశీయుల దోపిడీ నుండి, దేశీయుల దోపిడీ నుండి ప్రజల్ని కాపాడి, వారికి స్వయం నిర్ణయాధికారాన్ని ఇవ్వడం మా విప్లవానికి ఆదర్శం! దోపిడి దారుల్ని అధికారం నుంచి తొలగించి, శాసనాధికారాన్ని రైతులకూ, కూలీలకూ ఇవ్వడం మా ఆదర్శం! రైతుకూలీ ప్రజారాజ్యాన్ని మేము కోరుతున్నాము!
-చంద్రశేఖర్ ఆజాద్
సెప్టెంబర్ 4, ఆదివారం ఉదయం 10 గంటలకు బాలోత్సవ్ భవన్, ఎంబి హాల్ పక్కన, విజయవాడ మొదటి సెషన్ అధ్యక్షత : శ్రీనివాసరావు, పిడిఎం అధ్యక్షుడు
కార్పొరేటీకరణ - పాలక రాజకీయార్థిక విధానాల చరిత్ర - ఇఫ్టు ప్రసాద్
కార్పొరేటీకరణ
అర్ధ భూస్వామ్య అర్ధ వలస దోపిడీ – ఎన్ వేణుగోపాల్
1.30 గంటలకు భోజన విరామం
రెండో సెషన్
అధ్యక్షత : వెంకటేశ్, పిడిఎం కార్యదర్శి
కార్పొరేటీకరణ-అంతర్జాతీయ రాజకీయార్థిక పరిణామాలు – అశోక్
కార్పొరేటీకరణ -ప్రత్యామ్నాయ రాజకీయాలు: సిలింగేర్ ఉదాహరణ-పాణి
కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక ఉద్యమాలకు అవకాశాలు : పోరాట రూపాలు – ఎన్ రవి