గత కొంత కాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను కారు చౌకగా అస్మదీయులైన బడా బాబులకు కిళ్లీలుగా చుట్టి నోటికి అందించడం ఈ ప్రభుత్వ విధానం. మోడీ 2014లో అధికారంలోకి రాగానే కాన్పెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్టీస్ (సిఐఐ) ప్రభుత్వం ముందుంచిన చార్టర్ ఆఫ్ డిమాండ్స్‌లో బ్యాంకింగ్ రంగం ప్రైవేటీకరణ ప్రధానాంశంగా ఉంది. ఇప్పటికే లక్షల కోట్ల కార్పొరేట్ల రుణ బకాయిలను మాఫి చేసిన మోడీ ప్రభుత్వం, వాటి దాహర్తిని తీర్చడం కోసం ఇప్పుడు ఏకంగా ప్రభుత్వరంగ బ్యాంకులనే అప్పగించేందుకు సిద్దమైంది. ఇందుకు సంబంధించి బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం (1949)కి సవరణలు ప్రతిపాదిస్తూ ఒక బిల్లును తయారుచేసింది. అలాగే బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం బ్యాంకింగ్ కంపెనీల (అక్విజిషన్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ అండర్ టేకింగ్స్) చట్టం-1970 మరియు బ్యాంకింగ్ కంపెనీల (అక్విజిషన్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ అండర్ టేకింగ్స్) చట్టం-1980కి సవరణలు చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
బ్యాంకుల ప్రైవేటీకరణను అమలు చేయటానికి ఆకర్షణీయంగా మెరుగులద్ది రూపొందించిన పథకాలే 'ఆత్మ నిర్భర భారత్', 'నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్'. దేశ ఆర్థిక మంత్రి 2021-22 సంవత్సర బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆత్మ నిర్భర భారత్ పథకంలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరిస్తామని ప్రకటించారు. దానికి అవసరమైన చట్టపరమైన మార్పులను వచ్చే పార్లమెంటు సమావేశంలో చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించటమే ప్రస్తుత చర్చకు కారణమైంది. బ్యాంకుల ప్రైవేటీకరణ సన్నాహకంగానే బ్యాంకుల విలీనం చేపట్టి 24 ప్రభుత్వరంగ బ్యాంకులను 12 బ్యాంకులకు కుదించింది. ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంకుల్లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను చేపట్టింది.
భారత్‌లో బ్యాంకింగ్ వ్యవస్థ చరిత్ర :
‘బ్యాంక్ ఆఫ్ బెంగాల్’ను 1809లో స్థాపించడం ద్వారా వ్యాపార బ్యాంకింగ్ వ్యవస్థ ప్రారంభమైంది. ఆ తర్వాత 1840లో ‘బ్యాంక్ ఆఫ్ బాంబే’, 1843లో ‘బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర’ ప్రారంభించబడ్డాయి. ఈ మూడు బ్యాంకులు కలగలసి తదనంతరం 27 జనవరి 1921లో ‘ఇంపీరియల్ బ్యాంక్’గా ఏర్పడ్డాయి. ఆపై ఇంపీరియల్ బ్యాంక్ జాతీయం చేయబడి, తన పేరును 1955లో ”స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’గా మార్చుకుంది. బ్యాంకింగ్ వ్యవస్థ నియంత్రణకు, కేంద్ర కరెన్సీ కోసం 1935లో ”రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా”ను ఏర్పరచారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని గృహ సంబంధ పొదుపు మొత్తాలను రాబట్టుకోవటానికి వాణిజ్య బ్యాంకులు ఉండాల్సిన అవసరాన్ని, ఈ పొదుపు నిధుల మొత్తాన్ని తమ పెట్టుబడుల అవసరాలకు వినియోగించుకోవచ్చునని భారత పాలకవర్గాలు గుర్తించాయి. గ్రామీణ లేదా పట్టణ ప్రాంతాలకు తమ కార్యకలాపాలను విస్తరించటానికి ఆనాడు ప్రైవేటు బ్యాంకులకు ఆసక్తిగానీ, సామర్థ్యం కానీ లేకపోయాయి.
1960లో అమలులోకి వచ్చిన పైరుపచ్చ విప్లవ వ్యూహంతో వ్యవసాయ రంగంలో రసాయన ఎరువులు ఇతర ఉత్పాదకాలకు మార్కెట్లను సమకూర్చటం కోసం రుణ విస్తరణ చేయవలసి వచ్చింది. ఈ విధంగా భారత ప్రభుత్వం 1969లో 14 బ్యాంకులను, 1980లో మరో ఆరు బ్యాంకులను జాతీయం చేసింది. 1969లో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.5000 కోట్ల డిపాజిట్లను, 8000 శాఖలను కలిగి ఉండగా 2021 చివరి నాటికి రూ.157 లక్షల కోట్ల డిపాజిట్లతో 1.18 లక్షల శాఖలకు పెరిగాయి. ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడి ఉన్న చిన్న పరిశ్రమలకు, రైతులకు చౌకగా బ్యాంకురుణం అందజేయబడుతుందని చెప్పారు. అయితే ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడటమనే దాంట్లో ఈనాటికీ మార్పు లేదు. ఈ కాలంలోనే 13 కార్పొరేట్ సంస్థల రుణ ఎగవేత కారణంగా ప్రభుత్వ బ్యాంకులు రూ. 2.85 లక్షల కోట్లు నష్టపోయాయి.
బ్యాంకుల జాతీయీకరణ ఫలితంగా మధ్యతరగతి వర్గాలు ప్రభుత్వం వద్ద తమ సొమ్ము భద్రంగా ఉంటుందనే ఆశతో తాము కష్టించి సంపాదించిన డబ్బునంతా జాతీయ బ్యాంకులలో నిల్వచేస్తే భారత బడా బూర్జువా వర్గం ఈ పొదుపు మొత్తాలన్నింటిపై అదుపు సాధించగలిగింది. ఈ పొదుపు మొత్తాలన్నీ పారిశ్రామిక, వాణిజ్య రంగాలలోనే కాక జూదతరహా వ్యాపారాలలో బడా బూర్జువా వర్గం పెట్టుబడిగా వినియోగిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు తాము కేటాయించుకునే మొత్తం రుణాలలో 18 శాతాన్ని ప్రాధాన్యతా రంగాలకు ఇవ్వాలనే ప్రభుత్వాదేశాలు వచ్చేంతవరకు, ప్రభుత్వరంగ బ్యాంకులు వ్యవసాయ రంగంవైపే చూడలేదు. జాతీయీకరణ తర్వాత, బ్యాంకింగ్ రంగం అసాధారణంగా విస్తరించటం, తదనుగుణంగా చట్టబద్ధంగానూ, అక్రమంగా బ్యాంకులో నిల్వలను బడా పెట్టుబడిదారులు కైంకర్యం చేయటం కూడా అసాధారణంగా పెరిగిపోయింది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల డైరెక్టర్ల బోర్డులలో బడా బూర్జువా వర్గ ప్రతినిధులే ఉంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నిర్ణాయక బోర్డులోనూ వారు తగిన స్థానం కలిగి ఉంటారు. స్వతంత్ర డైరెక్టర్లుగా చెప్పబడేవారంతా బడా బూర్జువా వర్గపు ప్రతినిధులే. ప్రభుత్వరంగ బ్యాంకుల కార్యకలాపాల నిర్వహణను పర్యవేక్షించే ఉన్నతస్థాయి అధికారులకు కావలసిన లబ్ధి చేకూర్చి బడా బూర్జువావర్గం వారిని లోబరచుకుంటుంది. ఈ విధంగా ప్రజాధనం తరలిపోవటానికి ఒక మార్గం ఏర్పడుతుంది. బడా బూర్జువావర్గం ఏదో ఒక కారణంతో తాము తీసుకున్న రుణాలను చెల్లించటానికి నిరాకరిస్తే, వారందరికీ ఇచ్చిన అప్పును నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఏ)గా పరిగణించి, తదనంతర కాలంలో ఆ అప్పును రద్దు చేయటమో లేదా బ్యాంకులకు పునఃపెట్టుబడి కల్పించే పేరుతో ప్రభుత్వమే వారికి బడ్జెట్ వనరులనుండే నిధులను సమకూరుస్తోంది. 2014-21 మధ్య మోడీ ప్రభుత్వం రూ. 6,32,000 కోట్ల కార్పొరేట్ల రుణాలను మాఫీ చేసింది. వజ్ర వ్యాపారి మహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ. 8 వేల కోట్లు ఎగ్గొట్టాడు. బ్యాంకు డిపాజిట్లలో 80 శాతం దాకా చిన్న మొత్తాలను పొదుపు చేసుకునే డిపాజిటర్లే ఉన్నారు. ఇప్పటికే బీమా రంగాన్ని ప్రైవేటీకరించే బిల్లును తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులపై పడింది.
బ్యాంకులపై ప్రపంచీకరణ ప్రభావం :
1991 నుండి ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఆదేశాల మేరకు నయా ఉదారవాద ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టారు. ఇందులో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రధాన విధానపరమైన మార్పులు కూడా ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ క్రెడిట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంక్, హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఆర్థిక సంస్థల అభివృద్ధిలో తమ పాత్రను మరిచి బ్యాంకులను ప్రోత్సహించేలా బలవంతంగా మార్చారు. అభివృద్ధి క్రమానికి ఆర్థిక సాయం అందించే సంస్థలుగా వాటి పాత్రను విస్మరించారు. ఈనాడు అవన్నీ కూడా ప్రైవేటు రంగ బ్యాంకులుగా ఉన్నాయి. విదేశీ పెట్టుబడిదారులు వాటిలో ప్రధాన వాటాదారులుగా ఉన్నారు. స్వదేశీ ఉద్యమం ద్వారా ఏర్పడిన పాత తరం ప్రైవేటు బ్యాంకుల కన్నా ఇవి భిన్నంగా ఉన్నాయి. ఈ కొత్త తరం బ్యాంకులు ఎగువ మధ్య తరగతి వర్గం, సంపన్నుల అవసారలను తీరుస్తున్నాయి.
రుణ ఎగవేతదారులుగా చెప్పబడుతున్న వారి పేర్లను బ్యాంకు ఉద్యోగుల సంఘాలు విడుదల చేసేవరకు ప్రభుత్వం బైటికి వెల్లడించలేదు. ప్రభుత్వం అప్పు ఎగవేసిన వీరిపై ఎలాంటి చర్యా తీసుకోలేదు. బ్యాంకింగ్ రంగ సంస్కరణలో భాగంగా ప్రభుత్వం 1991 తరువాత అనేక కమిటీలను నియమించింది. నరసింహ కమిటీ, లీలాభర్ కమిటీ, నాయక్ కమిటీ, రంగరాజన్ కమిటీ లాంటి అనేక కమిటీలు బ్యాంకింగ్ రంగ ప్రైవేటీకరణే ధ్యేయంగా అనేక సిఫార్సులు చేశాయి. వీటిలో బ్యాంక్ మెర్జర్స్ (విలీనాలు) ప్రధానమైనవి. దేశంలో ఉన్న 28 ప్రభుత్వరంగ బ్యాంకులను కలిపి 6 లేక 7 పెద్ద బ్యాంకులుగా చేయాలని నరసింహం కమిటీ 1993లోనే సిఫారసు చేసింది. పెద్ద బ్యాంకులుగా చేసి, మూలధన వాటాలను అమ్మటం ద్వారా ప్రభుత్వ వాటాను తగ్గించుకొని ప్రైవేటీకరణ చేయటమే దాని సారాంశం. నూతన ఆర్థిక విధానాల తనదనంతరం గ్రామీణ ప్రాంతాలలో నిర్వహణకు అనుమతించిన ప్రైవేటు బ్యాంకుల కార్యకలాపాలు అత్యంత తక్కువగా ఉన్నాయి.
సరళీకరణ ఆర్థిక విధానాలను మూడు థశాబ్ధాల పాటు అమలు చేసిన తరువాత ఇప్పటికీ… 70 శాతం బ్యాంకింగ్ వ్యాపారం ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా జరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వరంగ బ్యాంకులను అదానీలకు, అంబానీలకు హస్తగతం చేయటమే ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. గత డిసెంబర్‌లో దేశంలో అతి పెద్ద బ్యాంకు, ప్రపంచ స్థాయి బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ వ్యవసాయ రుణాల మంజూరు, పంపిణీ కోసం ‘అదాని కాపిటల్’తో ఒప్పందం చేసుకోవటమే దీనికి ఉదాహరణ. 36 రాష్ట్రాలలో 28,431 శాఖలలో అత్యధిక గ్రామీణ శాఖలున్న ఎస్.బి.ఐకి అదాని కంపెనీతో జత కట్టి వ్యవసాయ రుణాలు ఇవ్వాలనే ఒప్పందం ఎంత హాస్యాస్పదం!
ప్రభుత్వ ఉదాసీనత వల్ల దళారీ బడా బూర్జువావర్గం ప్రభుత్వ రంగ బ్యాంకులను కొల్లగొడుతోంది, ఖజానాను దోచుకుంటోంది. ఈ కారణంగానే భారత బడా బూర్జువా వర్గం దళారీ స్వభావంతో పాటు నిరంకుశాధికార పెట్టుబడిదారీ వర్గ స్వభావం కలిగి ఉందని విధితమవుతోంది. బ్యాంకింగ్ రంగంలోని సమస్యలన్నింటికీ ప్రైవేటీకరణే మార్గాంతరమని ప్రబోధిస్తున్నారు. ఇంతకుముందే ప్రస్తావించిన విధంగా అనేక ప్రైవేటు బ్యాంకుల వద్ద ఎన్‌పిఎలు పోగుబడి ఆ బ్యాంకులు విఫలమయ్యాయి. కొన్ని సంవత్సరాల క్రితం గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు వైఫల్యం దీనిని స్పష్టంగా ఎత్తి చూపుతోంది. 2008 తర్వాత అత్యధిక ప్రైవేటు బ్యాంకులు ఎన్‌పిఎలలో కూరుకుపోయాయి. దీనికి తాజా ఉదాహరణ యాక్సిస్ బ్యాంక్, తాజా త్రైమాసికంలో అది 2,188 కోట్ల నష్టాన్ని చవి చూసినట్లుగా పేర్కొంది. పురాతనమైన, అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు ఐసిఐసిఐ కుంభకోణపు ఆరోపణలు ఎదుర్కొంటూ, ఆ బ్యాంకు సిఇఓనే ఆ పదవి నుండి తొలగించవలసి వచ్చింది.
బ్యాంకుల ప్రైవేటీకరణకు థశాబ్ధాలుగా ప్రయత్నం :
బ్యాంకు ఉద్యోగులు, ప్రజాతంత్ర శక్తుల పోరాటాల ఫలితంగా 20 ఏళ్లకు పైగా ప్రభుత్వం ముందుకెళ్లలేదు. మోడీ ప్రభుత్వం అనేక వాదనలకు ముందుకు తెచ్చి ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాలను చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వం అనుబంధ బ్యాంకులను ఎస్‌బిఐలో విలీనం చేసింది. ఈ మధ్యకాలంలో దేవా బ్యాంకు, విజయా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో కలిపింది. మిగిలిన బ్యాంకులను కూడా విలీనం చేస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. ప్రపంచ స్థాయి పోటీ కోసం ప్రపంచ స్థాయి పెద్ద బ్యాంకులు ఉండాలని, పెద్ద బ్యాంకులు నిర్వహణ ఖర్చులను తగ్గించుకొని లాభదాయకంగా మారుతాయని ప్రభుత్వ వాదన. కానీ అనుభవం దీనికి విరుద్ధంగా, సమాజానికి ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకంగా ఉంది. ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టేది మరో దారని సామెత. అలాగే ప్రపంచమంతా చిన్న బ్యాంకుల మార్గమే మంచిదని చెపుతుంటే మన దేశం విలీనాల వైపు అడుగులేస్తున్నది. ఇటీవల ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్‌పిఎల తాజా సమస్య బాగా వెలుగులోకి వస్తోంది.
ప్రైవేటీకరణ అంటేనే తీపి మాటలతో ప్రజలను బురిడి కొట్టించి భారతీయ బ్యాంకులను విదేశీ గుత్త ద్రవ్య పెట్టుబడికి అప్పగించటమేనని అందరికి తెలుసు. గత థశాబ్ద కాలంగా దేశీయ బ్యాంకులను విదేశీ ద్రవ్య పెట్టుబడికి కట్టబెట్టేందుకనుగుణంగా వరుసగా అనేక పాలనా సంబంధమైన, చట్టపరమైన చర్యలను చేపడుతూ, బాటవేస్తూ వస్తున్నారు. దివాళా చట్టం, ఎఫ్‌ఆర్‌డిఐ చట్టం, జాతీయ కంపెనీ చట్ట న్యాయస్థానం వంటి వాటితో చేపట్టిన చర్యలు దీనికి తార్కాణం. భారతదేశంలో బ్యాంకులను, ఇతర ద్రవ్య సంస్థలను విదేశీ ద్రవ్య పెట్టుబడి తన స్వాధీనంలోకి తెచ్చుకోవటానికి ఈ సంస్కరణలుగా చెప్పబడేవి మరింత సులభతరం చేస్తున్నాయి. మరోవైపు ఈ చర్యలు ఎన్‌పిఎ భారాలకు కారణమైన భారత బడా బూర్జువా వర్గానికి ఉపకరిస్తోన్నాయి. ఫలితంగా ఐబిసి క్రిందకు 75 శాతం బ్యాంకులు బలవంతంగా వెళ్ళవలసి వస్తుంది.
ప్రైవేట్ బ్యాంకులుగా ప్రారంభమైన గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, సెంచూరియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి ఇప్పుడు కనిపించడం లేదు. ఇతర బ్యాంకులు వాటిని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. జాతీయకరణ తర్వాత కూడా 30కి పైగా ప్రైవేటు రంగ బ్యాంకులను ప్రభుత్వ రంగ బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల నిర్వహణా తీరు సరిగా లేకపోవడమే అందుకు కారణం. ఈ క్రమంలో రైతాంగం, చిన్నవ్యాపారులు, చిన్న పరిశ్రమదారులు ఎన్‌పిఎల పేరుతో వేధింపులకు గురవుతున్నారు. రద్దు చేయబడుతున్న బాకీల భారం, బ్యాంకులకు తిరిగి అందించే పెట్టుబడి భారమంతా, ఇప్పటికే పూట గడవడం కష్టంగా బతుకుతున్న ప్రజల మోపులపై మోపబడుతోంది. వినాశకరమైన పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టిల దెబ్బలకే ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదు, కోలుకుంటుందనే ఆశాలేదు. బ్యాంకులకు తిరిగి పెట్టుబడినందించటం పరిస్థితిని మరింతగా దిగజారుస్తుంది.
మోడీ ప్రభుత్వ తప్పుడు ప్రచారం :
బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల సామర్థ్యం మరింత మెరుగవుతుందని ఇప్పుడు మన ఆర్థిక మంత్రి చెబుతున్నారు. ఇది ఎండమావి కూడా కాదు. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్, దీవాన్ హౌసింగ్ పైనాన్స్ కార్పొరేషన్, ఎస్ బ్యాంక్ వంటి పెద్ద బ్యాంకింగ్‌యేతర ఫైనాన్షియల్ కంపెనీలు కుప్పకూలడం మనం ఇటీవలే చూశాం. ఎస్ బ్యాంకను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదుకోవాల్సి వచ్చింది. ఐడిబిఐ బ్యాంక్‌ను ఎల్‌ఐసి కాపాడాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ఏవి సమర్థతతో పనిచేస్తున్నాయి? దురదృష్టవశాత్తూ మన ఆర్థిక మంత్రిగారు దాన్ని గుర్తించటం లేదు. ఎందుకంటే ఆమె పార్టీ, ప్రధాని కూడా ఇప్పటికే వ్యాపారంలో ఉండాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదనే ఆలోచనకు అంకితమై పోయారు. ప్రపంచ బ్యాంక్ ఆలోచన కూడా ఇదే, పాలక పార్టీకి సిద్ధాంతాలను బోధించే సంఘ పరివార్‌ది కూడా ఇదే ఆలోచన. పెద్ద చేప చిన్న చేపను మింగుతుందంటూ ఎం.ఎస్ గోవాల్కర్ తన పుస్తకం ”ఎ బంచ్ ఆఫ్ థాట్స్’లో పేర్కొన్నారు. ఇది సహజం. అందుకు మనం పెద్ద చేపను నిందించరాదు.
ప్రైవేటీకరణ నయా సంపన్నులకు సాయపడుతుంది. వారివే ఇప్పుడు కార్పొరేట్ సంస్థలన్నీ. ఈనాడు ప్రభుత్వం పరిమిత పోటీ ఉండే పరిస్థితులను సృష్టిస్తోంది. అదానీ, అంబానీ, టాటాలు, అగర్వాల్ ఇంకా కొద్దిమందే ఉన్నారు. తాజాగా అసమానతలపై వెలువడిన ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం, దేశంలోని 10 శాతం సంపన్నుల వద్దే 45 శాతం పోగుబడింది. దిగువనున్న 50 శాతం ప్రజల వద్ద కేవలం 6 శాతం సంపద కలిగి ఉన్నారు. ప్రైవేటీకరణ వల్ల సామాన్యుడు స్థానికంగా ఆర్థిక వ్యవస్థను శాసించే వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల్లోకి తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రైవేటీకరణకు ముందు ఇదే పరిస్థితి నెలకొని ఉండేది. బ్యాంకింగ్‌యేతర ఆర్థిక కంపెనీలు, ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు (పైన్ టెక్స్) అధిక వడ్డీ రేట్లు, సర్వీసు చార్జీలంటూ పేదలను, మధ్య తరగతి వర్గాలను పిండేస్తాయి.
ముగింపు :
ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే చదువుకునేందుకు విద్యార్థులకు విద్యా రుణాలు లభించవు. యువతకు స్వయం ఉపాధి కోసం రుణాలు దొరకవు. తక్కువ వడ్డీ రేటుతో రుణాలు తీసుకుని సాగు చేసుకుందామనుకునే చిన్న, మధ్య తరహా రైతులు, చివరకు సంపన్నులైన రైతులకు కూడా వ్యవసాయ రుణాలు దొరకవు. చిన్న, మధ్యతరహా, సూక్ష్మ పరిశ్రమలకు వారి వ్యాపార కార్యకలాపాలకు రుణం లభించదు. దేశంలోని పెద్ద సంఖ్యలో గల వ్యాపారస్తులు కేవలం వడ్డీ వ్యాపారస్తులపైనే ఆధారపడాల్సిన పరిస్థితులేర్పడతాయి. మహిళలకు తమ స్వయం సహాయ గ్రూపులకు రుణాలు దొరకవు. పేద, మధ్యతరగతి వర్గాలకు చవకగా ఇంటి రుణాలు లభ్యం కావు. ఇవన్నీ కూడా పెను విపత్తును దారి తీస్తాయి. సామాన్యుడికి ఇదంతా అర్థమవుతుందా? కుటుంబాల్లో, టీ దుకాణాల్లో, వీధుల్లో, బ్యాంకుల చుట్టుపక్కలా మొత్తంగా కింది స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు దీనిపై మనందరం చర్చ ప్రారంభించాల్సిన అవసరం ఉంది.
మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, చట్టాలను ఓడించటంలో రైతాంగ ఉద్యమం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. బ్యాంకుల ప్రైవేటీకరణను ఉద్దేశించిన బిల్లుకు వ్యతిరేకంగా తొమ్మిది ఉద్యోగ సంఘాలతో కూడిన సంయుక్త వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు ఎంప్లాయిస్ (యుఎఫ్‌బిఇ) ఇచ్చిన రెండు రోజులు (డిసెంబర్ 16-17) సమ్మెలో 19 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గోనడంతో ప్రభుత్వరంగ బ్యాంకుల కార్యక్రమాలు పూర్తిగా స్తంభించి పోయాయి. సంయుక్త కిసాన్ మోర్చా బ్యాంకుల రక్షణకు మద్ధతు ప్రకటించింది. కేంద్ర కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపాయి. ప్రభుత్వం దిగిరాకపోతే మార్చిలో నిరవధిక ఆందోళనకు వెళ్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవల మీద ఆధారపడిన ప్రజానీకం, కార్మికవర్గం, రైతాతంగం, బ్యాంక్ ఉద్యోగులు అందరూ కలసి రైతు ఉద్యమ స్ఫూర్తితో ఐక్యంగా ఉద్యమించి ప్రభుత్వరంగ బ్యాంకులను, ప్రభుత్వరంగ సంస్థలను రక్షించుకోవాలి. దేశ ఆర్థిక స్వావలంబనను కాపాడుకోవాలి.
ప్రభుత్వ రంగ బ్యాంకులను అదానీలకు, అంబానీలకు హస్తగతం చేయటమే ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రభుత్వం చట్టాలన్నీ ఎవరికోసం చేస్తున్నదంటే ఓటేసి గెలిపించిన ప్రజల సంక్షేమానికి కాదు, తన అనుయాయులైన కార్పొరేట్లకు దేశ సంపదను, సంపద సృష్టించే సాధనాలను హస్తగతం చేయటం కోసమే. విస్తృతమైన జనాభాకి సేవలందిస్తున్న బ్యాంకులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తే నష్టపోయేది సామాన్యులే. లాభాలొచ్చే వ్యాపారమే ప్రైవేటు బ్యాంకుల లక్ష్యం. ప్రైవేటు బ్యాంకులో ఖాతా తెరవాలంటే కనీసం రూ. 10 వేల నుండి రూ. 20 వేలు డిపాజిట్ చేయాలి. దేశ జనాభాలో ఎంతమంది అంత పెద్ద మొత్తాలతో ఖాతా పొందగలుగుతారు? ప్రైవేటు బ్యాంకులు వడ్డించే చార్జీల మోత సామాన్యుల తాహతుకు మించినది. బ్యాంకుల ప్రైవేటీకరణ జరిగితే అత్యధిక శాతం జనాభా బ్యాంకింగ్ సేవలకు దూరమవుతారు. 1969 కంటే ముందు పరిస్థితి మళ్ళీ నెలకొంటుంది.