”వట్టిమాటలు కట్టిపెట్టవోయ్ గట్టిమేలు తలపెట్టవోయ్” అన్నారు మహాకవి గురజాడ. కానీ, దీనికి విరుద్ధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలో గత ఎనిమిదేళ్లుగా వ్యవహారిస్తోంది. మోడీ అసత్యాలు, అర్థ సత్యాలతో ప్రజలను మాయ చేస్తున్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో సుపరిపాలన అందించానని, ప్రజానుకూల నిర్ణయాలు తీసుకున్నానని, బయో-ఎకానమీ 8 రెట్లు వృద్ధి చెందినట్లు మోడీ స్వయంగా ప్రకటించాడు. మరోవైపు పర్యావరణ నిబంధనలు ‘అభివృద్ధికి ఆటంకం’ అని మోడీ చెబుతున్నారు. కార్పొరేట్లకు అనుకూలమైన పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ఇది డొంక తిరుగుడుగా మద్దతు పలుకడమే అవుతుంది. నిజానికి బయో-ఎకానమీ అంటే పర్యావరణానికి హానిచేసే శిలాజ ఇంధనాల వాడకం నుండి స్థిరమైన జీవ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు పరివర్తనకు రూపొందించడం. మోడీ 2014లో అధికారం చేపట్టిన వెంటనే ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశాడు. మేక్ ఇన్ ఇండియా పథకాన్ని ప్రకటించాడు. అటవి చట్టాలను, భూసేకరణ చట్టాలను కార్పొరేట్ అనుకూలంగా మర్చాడు. 2016 నవంబర్ 8న రూ 500, రూ 1000 నోట్లు చెల్లవని ప్రకటించాడు. 2017 జూలై 1 నుంచి వస్తు సేవల పన్ను అమలులోకి తెచ్చాడు. ఇవి రెండూ ఆర్థికవృద్ధిని కుంగదీశాయి.
బిజెపి ప్రభుత్వం రెండవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మోడీ ప్రభుత్వం 2019 డిశంబర్‌లో పౌరసత్వ సవరణ చట్టం తెచ్చాడు. 2020 సెప్టెంబర్‌లో రైతు వ్యతిరేక మూడు సాగు చట్టాలు తెచ్చాడు. 2019-2020లలో కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్స్ తెచ్చాడు. తమను వ్యతిరేకించినా, విమర్శించినా దేశద్రోహం, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద విలేకర్లను, రచయితలను, సామాజిక మేధావులను అక్రమంగా నిర్బంధించాడు. రాజ్యాంగ ఫెడరల్ స్వభావాన్ని అటుకెక్కించి రాష్ట్రాల హక్కులను హరించి అధికార కేంద్రీకరణకు పూనుకున్నాడు. పై అంశాలను గమనిస్తే ఏలినవారివి అసత్యాలేనని అర్థమవుతుంది. సారాంశంలో మోడీ పాలన చట్టవ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక ఫాసిస్టు పాలన అని సులభంగానే అర్థమవుతుంది. మోడీ పాలన వైఫల్యాలను పలు అంతర్జాతీయ నివేదికలు కూడ బద్దలు కొట్టి మరి చెప్పాయి.
కార్పొరేట్ల సేవలో మోడీ ప్రభుత్వం :
మన దేశంలో కాంగ్రెసు, బిజెపి రెండూ భూస్వామ్య, దళారీ పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాద దేశాల పెట్టుబడులకు వ్యతిరేకం కావు. అయినప్పటికీ ఈ పార్టీల మధ్య తేడా ఉంది. 1947 ఆగష్టులో వలస పాలకుల నుండి అధికార బదిలీ జరిగిన వెంటనే అప్పటి కాంగ్రెస్ పార్టీ పాలకులు వారికున్న భావజాలాన్ని బట్టి, దేశాన్ని తిరిగి పట్టాలెక్కించడానికి మిశ్రమ ఆర్థిక విధానాలను, తదనుగుణ పాలనా నీతిని ప్రవేశ పెట్టారు. ఉదారవాద బూర్జువా పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని, పాలనా పర్యవేక్షణకై కొన్ని స్వతంత్ర ప్రతిపత్తిగల వ్యవస్థలను ఏర్పాటు చేశారు. నెహ్రూ పాలన కాలంలో మిశ్రమ ఆర్థిక విధానాల అమలులో భాగంగానే ప్రజా ఆస్తులను సృష్టించింది. ఈ మిశ్రమ ఆర్థిక విధానం నుండే మనకు భారీ ఉక్కు కర్మాగారాలు, భారీ యంత్ర నిర్మాణ పరిశ్రమలు సమకూరాయి.లక్షలాది మందికి అవి ఉపాధి కల్పించాయి, దేశానికి అవిచేసిన మేలు వెలగట్ట లేనిది. ప్రభుత్వ రంగ సంస్థల భుజాలపై ఎక్కి ప్రైవేటు రంగం పుష్ఠి చెందింది. 1990 దశకంలో మనదేశ దళారీ బడా బూర్జువా వర్గం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడితో అనుసంధానం అయింది.
ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలకున్న ఆస్తులు, ఇతర వనరులను కారు చౌకగా ప్రైవేట్ రంగానికి, అదీ ఆశ్రిత బృందాలకు తెగనమ్మేందుకు పూనుకుంది. మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా దేశీయ, విదేశీ కార్పొరేట్ రంగానికి ఏకపక్షంగా అంకితమై సేవలందిస్తున్నది. ప్రభుత్వం అంటేనే ‘పాలక వర్గాల ఆర్థిక కార్యకలాపాలను చక్కబెట్టే కార్యనిర్వాహక కమిటీలు’ అని మార్క్స్ పేర్కొన్నాడు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏదో ఓ మేరకు ప్రజలకు జవాబుదారీగా ఉండవలసి ఉంటుంది. కానీ మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా కార్పొరేట్లే నిజమైన ఉత్పత్తిదారులని బుకాయిస్తున్నది. 2022 మే 30 నాటికి మోడీ ప్రభుత్వానికి ఎనిమిదేళ్ళు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకొని మే 30 నుంచి జూన్ 15 వరకు ‘సేవ, సుపరిపాలన, సంక్షేమం, అనే మూడు నినాధాలతో ఘనంగా ఉత్సవాలని నిర్వహించింది. ఈ మూడు విధానాలు పాలక పార్టీ ఎంపిక చేసుకోవడం ఆశ్చర్యం కలిగించక మానదు.
మోడీ ప్రభుత్వం అమలు చేసిన పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి మన దేశ ఆర్థిక వ్యవస్థను కుల్లబొడిచాయి. మరోవైపు బొగ్గుగనుల నుంచి అంతరిక్ష పరిశోధనల దాకా, రక్షణ రంగ ఉత్పత్తుల నుంచి ఉక్కు దాకా పెట్టుబడులను నియంత్రించే అనేక నిబంధనలను కార్పొరేట్లకు అనుకూలంగా మార్చింది. విదేశీ పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరిచింది. ఫలితంగా ఉత్పత్తి, సేవా రంగాలు అన్నీ బహుళ జాతి సంస్థలు స్వాధీనం చేసుకోవడానికి దారి సుగమం అయింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డిఐ)లకు సంబంధించిన మార్పులు ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు ప్రైవేట్ రంగంలో కలిసి ప్రయాణం చేస్తున్నాయి. మన దేశంలో శత కోటీశ్వర్లు (కుబేరులు)గా ఎదుగుతున్న కార్పొరేట్ వర్గాల ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం ఆర్థిక విధానాలను రూపొందించి అమలు చేస్తున్నది. ఈ కారణంగానే అనేక అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు, కార్పొరేట్ ఎజెన్సీలు ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. కార్పొరేట్ పన్ను 35 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రావల్సిన 6.5 లక్షల కోట్ల ఆదాయం నష్టపోయింది. కార్పొరెట్లు తీసుకుని బ్యాంకులకు చెల్లించని పాడు బాకీలను 11.5 లక్షల కోట్లు రద్దు చేసింది.
‘మేక్-ఇన్-ఇండియా’ ఓ ఫార్స్ :
మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అట్టహాసంగా 2014 సెప్టెంబర్ 25న ‘మేక్-ఇన్-ఇండియా’ నినాదాన్నిచ్చారు. 2022 నాటికి భారత్‌ను ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, అందుకు అవసరమయ్యే విదేశీ పెట్టుబడిని సమీకరిస్తామని ప్రకటించారు. భారత పారిశ్రామిక వృద్ధి జిడిపిలో ఇప్పుడున్న 17 శాతాన్ని 2022 నాటికి 25 శాతానికి తీసుకొస్తామని ప్రకటించారు. దీని ద్వారా యేటా 2 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. బిజెపి శ్రేణులు, కార్పొరేట్ మీడియా మోడీ పాలనలో భారత్‌కు బంగారు భవిష్యత్తు ఉన్నదని, త్వరలో చైనాను అధిగమించి, ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగబోతున్నామని చెవులు చిల్లులు పడేలాగా ప్రచారాన్ని సాగించారు. అయితే 8 ఏళ్లు పూర్తి అయినా ఈ పథకం అమలు అయ్యే సూచనలు మచ్చుకైనా ఎక్కడా కనిపించడం లేదు.
నిజానికి మేక్-ఇన్-ఇండియా పథకం విదేశీ కార్పొరేట్ల లాభాల కోసమని గుర్తించాలి. ఈ పథకం మన దేశ ఆర్థిక, పారిశ్రామిక విధానాన్ని ప్రభావితం చేసే తప్పుడు నిర్ణయం. మనదేశ స్వావలంబనకు ప్రతికూలంగా మారే నిర్ణయం. విదేశీ పాలనకు వ్యతిరేకంగా, విదేశీ వస్తువులను బహిష్కరించిన దేశంగా విదేశీ వస్త్రాలను వీధుల్లో కుప్పలుగా పోసి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని నిరసించిన చరిత్ర మనది. అలాంటి నేపథ్యంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం అంటే మనదేశ వనరులను, శ్రామిక శక్తిని, మన మార్కెట్‌ను పరాయి పెట్టుబడికి దారాదత్తం చేసే నిర్ణయం తప్ప మనదేశ ప్రయోజనానికి ఏమాత్రం ఉపయోగపడని నిర్ణయం అని అనుభవంలో అర్థమవుతున్నది.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ :
ప్రభుత్వ పెట్టుబడులు పెంచి ఇతోధికంగా ఉపాధి అవకాశాలు పెంచవలసిన సందర్భంలో లాభకరమైన పరిశ్రమలు, ఇతర ప్రభుత్వ రంగ సేవా సంస్థల నుండి పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయించారు. టెలికాం రంగం, కోల్ ఇండియా, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, బ్యాంకులు, బీమా సంస్థలు, థర్మల్ విద్యుత్తు ప్లాంట్స్ విమాన, నౌకాశ్రయాలు, ఇనుము ఉక్కు పరిశ్రమలు, గనులు, ఇంధన సంస్థలు, వివిధ పబ్లిక్ సెక్టార్ల రంగాలను, మొత్తంగా 250 ఉత్పత్తి విభాగాలను ప్రైవేటీకరించాలని నిర్ణయించారు. పబ్లిక్ సెక్టార్ రంగాలను విక్రయించడం ద్వారా వచ్చే డబ్బుతో ఉపాధి అవకాశాలు పెరుగవు. ప్రజల కొనుగోలు శక్తి పెరుగదు. వాటిని పెట్టుబడులుగా మార్చాలి. కాని ప్రభుత్వం కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడంలో ఏర్పడిన బడ్జెట్ లోటును పూడ్చుకుంటుంది. కాకులను గొట్టి గద్దలకు వేయడమంటే ఇదేనేమో. మరొక అంశం గతంలో ప్రైవేటీకరించిన ప్రభుత్వ సంస్థలలో రిజర్వేషన్ సదుపాయాన్ని తొలగించారు. ప్రైవేటీకరించబడిన యూనిట్లలో కాంట్రాక్ట్ విధానం అమలవుతుండడంతో కార్మికులు అభద్రతకు గురవుతున్నారు.
గత ఏడు దశాబ్దాలుగా ప్రజాధనంతో, శ్రమతో, ఆలోచనలతో నిర్మాణమైన ప్రజాఆస్తులను అమ్మివేయడం అనైతికం, అంతేకాదు ప్రజాద్రోహం. 2014 ఎన్నికల ప్రణాళికలో సబ్-కా-సాత్, సబ్-కా-వికాస్ అని పేర్కొన్నారు. మోడీ ఎన్నికల సభల్లో ప్రసంగిస్తూ ”సత్పరిపాలన, పారదర్శకత, జవాబుదారీతనం, రాజ్యాంగ నిబద్దత”, ”సజీవమూ, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యము” కలిగిన నిర్మాణము అన్న అంశాలను నొక్కి చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత బిజెపి తన నైజాన్ని బయట పెట్టుకున్నది. అధికారమిస్తే ప్రజాఆస్తులను విక్రయిస్తామని ఎక్కడా పేర్కొనలేదు. 1950ల నాటి నెహ్రూ మిశ్రమ ఆర్థిక విధానాల వల్ల, ప్రణాళికాబద్ద అభివృద్ధి వ్యూహం వల్ల ప్రభుత్వరంగ సంస్థలు రూపొందినవి. ఈ ప్రభుత్వ రంగం ప్రజలకు సరసమైన ధరలకు సేవలు అందించింది. ప్రజలకు ఉపాధి కల్పించింది. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చి పెట్టింది. అటువంటి జాతి ప్రయోజనాల కొరకు సృష్టించిన ఆస్తులను, మౌలిక సదుపాయాలను, ప్రణాళికాబద్ధ విధానాన్నీ నిర్మూలించాలనే లక్ష్యంతో సంఘ్ పరివార్ వీటిని మూసివేయదలచింది.
ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చిన ఆదాయం :
సంవత్సరం రూ (కోట్లలో)
2014-15 19,95,902
2015-16 18,54,667
2016-17 19,54,616
2017-18 21,55,948
2018-19 25.43,370
2019-20 24,61,712
2020-21 24,25,130
మొత్తం 1,53,91,345
ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం(రూ.కోట్లలో) :
సంవత్సరం రూ (కోట్లలో)
2014-15 24,349
2015-16 23,997
2016-17 46,247
2017-18 1,00,057
2018-19 84,972
2019-20 50,299
2020-21 32,845
2021-22 75,000
మొత్తం 4,37,706
ప్రైవేటైజేషన్ మరో రూపమే ద్రవ్యీకరణ :
మోడీ ప్రభుత్వ పాలనలో దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ప్రపంచీకరణ ఆర్థిక సంస్కరణలు వేగం పుంజుకున్నాయి. ”ద్రవ్యీకరణ (నగదీకరణ) ద్వారా సృజన” అనే విధాన ప్రాతిపదిక మీద మౌలిక సదుపాయాలకు సంబంధించిన, రాబడికి అవకాశమున్న ఆస్తులను ఆశ్రితులకు అద్దెకివ్వడం గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 23 ఆగస్టు 2021న గర్వంగా ప్రకటించింది. ఈ ప్రక్రియలో మొదటి విడత 2021-2025 వరకు కొనసాగుతుందని, ఆస్తులను 30 నుండి 50 సంవత్సరాల కాలానికి అద్దెకివ్వడం ద్వారా 6 లక్షల కోట్ల రూపాయలు ఆర్జించడం ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించింది. ఇది సాధారణ ప్రైవేటీకరణ, కార్పొరేట్లకు పన్ను రాయితీలు లాంటి వాటిని మించిపోయింది.
దేశ ఆర్థిక స్వావలంబనకు ఆధారంగా నిలిచిన ప్రభుత్వ రంగాన్ని దెబ్బతీయడానికి బిజెపి ప్రభుత్వం పూనుకుంది. పర్యావసానంగా భారత ఆర్థిక రంగాన్ని పరాధీన స్థాయికి దిగజార్చే ప్రమాదకర పరిస్థితి ఏర్పడనుంది. జాతీయ సంపదను, ఆర్థిక వ్యవస్థను లూటీ చేయడం, ధ్వంసం చేయడం సమాజంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనుంది. దీన్ని నిస్సందేహంగా వ్యవస్థీకృత లూటీ, చట్టబద్ధమైన దోపిడీ అని చెప్పవచ్చు. క్రోని పెట్టుబడిదారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి మోడీ దళారీ ప్రభుత్వం పకడ్బందిగా రూపొందించిన సరికొత్త ప్రపంచీకరణ ఆర్థిక విధానాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు 2014 లోనే మొదలయ్యాయి.
ప్రజా ఆస్తులను అమ్మడం, ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణకు బిజెపి ప్రభుత్వం పెట్టిన ముద్దుపేరు ‘ద్రవ్యీకరణ’, అంటే ప్రభుత్వ (ప్రజా) ఆస్తులను అమ్మకం లేదా లీజుకివ్వడం ద్వారా ద్రవ్యం (డబ్బు)గా మార్చడం. సకల దేశ సంపదను గుత్తపెట్టుబడులకు అప్పగించడానికి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా పనిచేస్తోంది. ”నిరర్థక ఆస్తులుగా పడి ఉన్న ప్రభుత్వ రంగ ఆస్తులు ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించడంలో ఉపకరించవు. ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర ఉన్న అదనపు భూములే ఈ నిరర్థక ఆస్తులు, ఈ భూమిని నేరుగా అమ్మడం ద్వారా, రాయితీలకు ఇవ్వడం ద్వారా ద్రవ్యీకరించవచ్చు” అని ఆర్థిక మంత్రి నిస్సిగ్గుగా ప్రకటించారు. అంటే ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర ఉన్న వేలాది, లక్షలాది ఎకరాల భూమిని అమ్మి, ఆ పరిశ్రమలను, సంస్థలను మూసివేసి ప్రభుత్వం సొమ్ము చేసుకోదలచుకున్నదన్నమాట. ఈ సొమ్ము చేసుకునే విధానం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ, నీతి ఆయోగ్‌ల నేతృత్వంలో శరవేగంగా సాగిపోతున్నది. ఆస్తుల నగదీకరణకు ముఖ్యమైనవిగా గుర్తించిన రంగాలలో రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, విద్యుచ్ఛక్తి ఉత్పత్తి-పంపిణీకి సంబంధించిన నెట్‌వర్క్, పైపులైన్లు, గిడ్డంగులు మొదలైనవి ఉన్నాయి.
పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగం, అంతరాలు :
ఎనిమిదేళ్ల బిజెపి హయాంలో మతతత్వ, కార్పొరేట్ బంధం పటిష్టపడి పాలనలో నియంతృత్వం పెరిగింది. ఫాసిస్టు ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో హిందు రాష్ట్ర ఎజెండాను మరింత దూకుడుగా ముందుకు తీసుకుపోతున్నది. రాజ్యాంగాన్ని డొల్లబరుస్తున్నది. సామ్రాజ్యవాద పెట్టుబడి అనుకూల విధానాలను అమలు చేస్తున్నది. మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో 100 లక్షల కోట్లు అప్పు చేసింది. ఇది జిడిపిలో 70 శాతానికి చేరింది. జిడిపి పెరుగుదలలో తీవ్ర అసమానతలు ఉన్నాయి. జిడిపిలో పెరిగిన ప్రతి రూపాయిలో 70 పైసలు 10 శాతం సంపన్నులకు చేరుతుంది. 23 పైసలు 40 శాతంగా ఉన్న మధ్య తరగతికి చేరుతుంది. 50 శాతం ప్రజలకు దక్కేది కేవలం 6 పైసలు మాత్రమే. ఫలితంగా పేద ప్రజల కొనుగోలు శక్తి చాల దయనీయ స్థితిలో ఉంది.
మనదేశంలో 50 శాతం ప్రజలకు పౌష్టికాహారం అందడం లేదు. 50 శాతానికి జీవనాధారంగా ఉన్న వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుంది. 25 శాతానికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ చిన్నమధ్యతరహా (ఎంఎస్‌ఎంఎస్) పరిశ్రమలు మూత పడుతున్నాయి. విద్యా, వైద్యం సాధారణ ప్రజలకు అందకుండా పోయింది. దేశంలో అవినీతి పెచ్చరిల్లిపోతున్నది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోతున్నాయి, వాణిజ్య లోటు పెరిగిపోతున్నది. మరోవైపు ద్రవ్యోల్భణం 17 సంవత్సరాల గరిష్టానికి చేరింది. నిరుద్యోగం 45 సంవత్సరాల కనిష్టానికి చేరింది. డాలరుతో ఈ రూపాయి మారక విలువ ఆల్‌టైమ్ కనిష్టానికి చేరింది. కుబేరుల సంఖ్య, వారి సంపద మాత్రం అనూహ్యంగా పెరిగిపోతున్నది. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ స్వీస్ బ్యాంకు ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం 2020-21లో భారతీయుల అక్రమ సంపద 50 శాతం పెరిగింది. అయితే భారతీయుల అక్రమ సంపద విదేశాల్లో ఎంత ఉందో వివరాలు లేవని అమాయకంగా ఆమె తెలిపింది.
ముగింపు :
ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి సంపాదించిన సొమ్మును ఏ ప్రజా ప్రయోజనం కోసం వెచ్చిస్తున్నారనే ప్రశ్నకు సమాధానం లేదు. అసమర్థంగా, నష్టాలతో నడుస్తున్నాయనే పేరుతో ఈ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు రంగానికి అప్పగించగానే వాటి సామర్థ్యం ఎలా పెరుగుతుందో, అవి ఎలా లాభాల బాట పడతాయో కూడ జవాబు లేని ప్రశ్నే. నష్టాలతో నడిచే సంస్థలను కొనడానికి ప్రైవేట్ రంగం ఎందుకు ముందుకొస్తుందన్నది మరొక ప్రశ్న. ప్రభుత్వ రంగ సంస్థలు స్వేత ఎణుగలవంటివని, కార్మికులకు భద్రత ఉంటే శ్రద్ధగా పనిచేయరని ఒకవైపు ఆరోపిస్తూనే ప్రభుత్వం అంటే వ్యాపారం చేసే సంస్థకాదని బుకాయిస్తున్నారు.
ఎనిమిదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ అత్యంత దూకుడుగా ప్రజావ్యతిరేక ఆర్థిక విధానాలను ఫాసిస్టు దమనకాండతో జోడించి అమలు చేస్తోంది. ఈ విధానాలు, ఈ దేశ శ్రామిక రాసులనే గాక అత్యధిక శాతం ప్రజలను నిరంతర సంక్షోభంలోనికి నెట్టివేస్తున్నాయి. ఇటువంటి విధానాలు అమలు చేస్తూ, దేశ వనరులన్నిటినీ గుప్పెడు ఆశ్రిత బూటకపు పెట్టుబడిదారీ ముఠాల పాదాక్రాంతం చేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగం పట్ల చిన్నచూపు కలిగించిన చారిత్రక, సామాజిక, సాంస్కృతిక పరిణామాలను ఎత్తిచూపి సరిచేయవలసి ఉంది. విశాల ప్రజారాశులను ఏకం చేసి, ప్రభుత్వ రంగాన్ని ప్రజా రంగంగా పునర్నిర్మించవలసి ఉంది. ప్రభుత్వ రంగ పరిరక్షణ అనేది కేవలం ఒక నినాదమో, ఒకానొక సంస్కరణ కార్యక్రమమో కాదని, సామాజిక న్యాయం కోసం, శ్రేయస్సు కోసం రూపొందవలసిన ఒక ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయార్థిక వ్యవస్థ నిర్మాణ ప్రక్రియలో అనివార్యమైన, అవిభాజ్యమైన భాగమనే చైతన్యాన్ని బుద్ధిజీవులు ప్రచారం చేయవలసి ఉంది.
మోడీ ప్రభుత్వం అద్దు అదుపూ లేకుండా ప్రజల కుత్తుకులపై కత్తిపెట్టి అమలు చేస్తున్న ఈ విధానాలను అడ్డుకునే, నిలువరించే, తిప్పికొట్టే విస్తృత ఐక్య ప్రజా ప్రతిఘటనా ఉద్యమాలు కరువయ్యాయి. అటువంటి ఉద్యమ నిర్మాణ కృషి అత్యంత పేలవంగా ఉంది. ఈ ఉద్యమ బలహీన స్థితి పాలకులు దూకుడుకు మరింత ఊతాన్నిస్తోంది. ఈ స్థితిలో పీడిత వర్గం దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్ధపడాలి. దోపిడీని అంతం చేయడానికి, ప్రజలందరు సమానంగా, గౌరవంగా బతికే ప్రజాతంత్ర వ్యవస్థను నిర్మించుకోవడానికి బలమైన సంఘటిత పోరాటాలు తప్ప మరో మార్గం లేదని కార్మికులు, కర్షకులు గుర్తించాలి.
చాలా నచ్చింది