కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందన్న పాలకుల ప్రగల్భాలు నిజం కాదని తేలిపోయింది. ఏ రంగంలో చూసిన ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పటికే మన పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్, భూటాన్‌లు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. మనదేశ ఆర్థిక వ్యవస్థ కూడ పతనం దిశగా వేగంగా దిగజారుతున్న పరిస్థితుల్లో భవిష్యత్తు పట్ల ప్రజల్లో భయాలు పెరిగిపోతున్నాయి. ఎనిమిది సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వం దేశంలోని కార్పొరేట్ రంగానికి ఏకపక్షంగా అంకితమై సేవలందిస్తున్నది. ”బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ ప్రభుత్వమైన పెట్టుబడిదారుల పనులను చక్కబెట్టే కార్యనిర్వాహక కమిటి” అని మార్క్స్ 1850 థకంలోనే తెలపాడు. అధికార బదిలీ జరిగి ఏడున్నర దశాబ్దాలు గడిచింది. ఈ కాలంలో పెట్టుబడిదారుల కోసం ఇంత నిస్సిగ్గుగా, నిరంకుశంగా పనిచేసిన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ మనం చూడలేదంటే అతిశయోక్తి ఏమి కాదు.
ఈ దుస్థితికి కారణం 1947లో అధికార బదిలీ జరిగిన వెంటనే విదేశీ పెట్టుబడి ఆధిపత్యం నుండి బయటపడి, దేశంలో భూసంస్కరణలు అమలు చేసి గ్రామీణ ప్రజలను భూస్వాముల కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి దేశీయ మార్కెటును పెంచి పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు చేపట్టవలసి ఉండే, కానీ ఈ రెండూ చర్యలు మన పాలకులు చేపట్టనందున దిగుమతులపై ఆధారపడడంతో వాణిజ్యలోటు గుదిబండగా మారింది. సామ్రాజ్యవాదానికి స్థానిక బడా దళారీ బూర్జువా వర్గానికి మధ్య ఉండవలసిన వైరం సయోధ్యగా మారింది. అదే సమయంలో భూస్వామ్య వర్గంతో పోరాడవల్సిన దేశీయ బడా బూర్జువావర్గం దానితో మిలాఖత్ కావడంతో జాతీయ విప్లవం ముందుకు అడుగు వేయలేకపోయింది. జాగిర్ ద్దారీ విధానం రద్దు చేసినప్పటికీ భూకేంద్రీకరణ తగ్గలేదు. పై 15 శాతంగా ఉన్న భూస్వాములు మారలేదు. ఫలితంగా బూర్జువా, భూస్వామ్య వర్గాలకు, ప్రజలకు మధ్యనున్న వైరుధ్యం, సామ్రాజ్యవాదానికి ప్రజలకు మధ్యనున్న వైరుధ్యం నేటికి కొనసాగుతూనే ఉన్నది. ఈ దుస్థితే రాజ్య నిర్వాహణలోని ప్రజాస్వామ్య సారాన్ని రద్దు చేసింది.
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు పెట్టుబడిదారులు బ్యాంకులకు బాకీ పడిన మొండి బాకీలు పది లక్షల కోట్ల రూపాయలు రద్దు చేసింది. ఇది చాలదన్నట్లు కార్పొరేట్లకు పదిశాతం పన్ను తగ్గించి దేశానికి రూ లక్షా 84 వేల కోట్ల నష్టం కలిగించింది. ఇవాళ కార్పొరేట్ల కంటే మధ్యతరగతి ఉద్యోగులు పన్ను ఎక్కువగా చెల్లిస్తున్నారు. దీంతో తృప్తి చెందని మోడీ ప్రభుత్వం అత్యంత విలువైన దేశంలోని భౌతిక సంపదలను కారు చౌకగా అమ్మడం ద్వారా దేశాన్ని లూటీ చేసేందుకు కార్పొరేట్లకు తోడ్పడుతున్నది. 2015-2022 మధ్యకాలంలో ఆరున్నర లక్షల విలువ గల ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను ఆశ్రితులకు కట్టబెట్టింది. ఆరు లక్షల కోట్ల విలువైన ప్రజా ఆస్తులను ఆశ్రితులకు లీజు(అద్దె)కిచ్చే ప్రయత్నం ప్రారంభించింది ఇది లీజు ముసుగులో జరుగుతున్న అమ్మకం తప్ప మరోకటి కాదు. ఆగష్టు 29 నాటికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ ఆల్‌టైమ్ గరిష్టానికి 80.13కి చేరింది. ఒకవైపు నిరుద్యోగం, పేదరికం, చాలిచాలని వేతనాలు ప్రజల కుటుంబ బడ్జెట్‌ను ధ్వంసం చేస్తున్నాయి, మరోవైపు ద్రవ్యోల్బణం గత ఎనిమిది సంతవ్సరాల గరిష్టానికి 7 శాతం పెరిగి ఆకాశాన్నంటే ధరల లాంటి సమస్యలతో సతమతమవుతున్నారు.
మోడీ ప్రభుత్వం సంపద పన్ను రద్దు చేసింది. కార్పొరేట్ పన్ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది. ఇంకా ట్యాక్స్ హాలిడేలు, ఉద్దీపన ప్యాకేజీలు ఇచ్చారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేసినప్పుడు రుణ సంస్కృతి విచ్ఛిన్నమవుతుందన్న వారే భారీ ఎత్తున కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చినప్పుడు ఆర్థిక పురోగతికి దారి తీస్తుందని చెప్పడం విచిత్రంగా ఉంది. కోట్ల మంది ప్రజలు, వేలమంది ఉద్యోగులు దశాబ్దాలపాటు స్వేదం చిందించి నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అడ్డికి పావుసేరు కాడికి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికే అధికారంలోకి వచ్చామన్నట్లు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న సంస్థలను కూడా తమ అనుంగు అనుచరులైన ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నది. గత ఎనిమిదేండ్లలో వందకు పైగా ప్రభుత్వ సంస్థలను అమ్మేసినా కేంద్రంలోని మోడీ సర్కారు ఆకలి చావలేదు. పిఎస్యులతో పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, చివరకు మారుమూల గ్రామాల్లో పేదలకు సేవలందించే గ్రామీణ బ్యాంకులను కూడా వదలకుండా ప్రైవేటుపరం చేయాలని ప్రణాళికలు చేస్తున్నది. వీటన్నింటితోపాటు పోస్టు డబ్బాను కూడా కార్పొరేట్ శక్తుల కబందహస్తాల్లో పెట్టడానికి రంగం సిద్ధం చేసింది.
గత ఐదేండ్లలో లాభాల్లో ఉన్న 64 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల(సిపిఎస్ఇ)లను మోడీ సర్కార్ మూసివేసింది. వ్యవసాయ రంగానికి తోడ్పాటునందిస్తున్న 8 ఎరువుల రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడుల ఉపసంహరణ కోసము ప్రభుత్వం గుర్తించింది. దీంతో రైతులపై తీవ్రమైన భారం పడుతుంది. రైతులకు చౌక ధరలతో సకాలంలో ఎరువులు అందుబాటులోకి రావడం కష్టం అవుతుంది. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్సిఎఫ్ఎల్), నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఎన్ఎఫ్ఎల్), బ్రహ్మపుత్ర వ్యాలీ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (బివిఎఫ్‌సిఎల్), ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెని (ఎఫ్ఎసిటి), ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌సిఐఎల్), ఎఫ్‌సిఐ ఆరావళి జిప్సమ్ అండ్ మినరల్ (ఎఫ్ఎజిఎంఐఎల్), మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎంఎఫ్ఎల్), హిందుస్థాన్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ (హెచ్ఎఫ్సిఎల్) వంటి ఎనిమిది ఎరువుల సంస్థల్లో వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం గుర్తించింది.
కొద్దిరోజుల క్రితం నీతి ఆయోగ్ సిఇఒ పరమేశ్వరన్ అయ్యర్ ఆధ్వర్యంలో జరిగిన కోర్ గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ సమావేశంలో వాటా విక్రయానికి సంబంధించిన ప్రతిపాదనపై చర్చ జరిగింది. చాలామంది సభ్యులు సూత్రప్రాయంగా ఈ ప్రణాళికతో ఏకీభవించినప్పటికీ, తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎరువులు, ఉక్కు, పర్యాటకం వంటి వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం, మూసివేయడం వంటి చర్యలతో ప్రభుత్వం ఈ రంగాల నుంచి నిష్క్రమించాలని భావిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధ్వర్యంలోని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిపార్ట్మెంట్ 2021లో జరిపిన ప్రభుత్వ రంగ సంస్థల సర్వే వివరాల ప్రకారం 255 కంపెనీల్లో 177 నికర లాభాన్ని, 77 సంస్థలు నష్టాన్ని నమోదు చేశాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాభనష్టం లేదని తెలిపింది.
కార్పొరేటీకరణకు ఊతం ఇచ్చిన ప్రపంచీకరణ విధానాలు :
1991లో అట్టహాసంగా ప్రకటించిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు పెట్టుబడిదారీ విధానంలోని అన్ని సమస్యలకు సర్వరోగ నివారిణిగా ప్రచారం చేసుకున్నారు. కానీ మూడు దశాబ్దాలు గడిచేసరికి ఆ విధానాల డొల్లతనం ఆర్థిక సంక్షోభ రూపంలో బయటపడుతోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాల వేగం పెంచడం వల్ల నిరుద్యోగం, పేదరికం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి క్షీణించి, మార్కెట్లు దివాళ తీయడంతో, పరిశ్రమలు ఉత్పత్తులు తగ్గించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నంత వేగంగా ప్రజల ఆదాయాలు పెరుగక పోవడంతో వారి కొనుగోలు శక్తి గణనీయంగా క్షీణించింది. దీంతో ద్రవ్యోల్బణం అదుపు తప్పడంతో ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఫలితంగా ఆర్థిక మాంధ్యంలోకి జారుకోక తప్పలేదు.
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల ఉపాధిరహిత వృద్ధి, ఆర్థిక అసమానతలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. సంపద క్రమంగా ప్రజలు చేతుల్లోనుంచి పిడికెడు మంది కుబేరుల చేతుల్లోకి వెళ్తోంది. ప్రత్యేకించి పెట్రోల్, డిజిల్, గ్యాస్‌బండ ధరలు దారుణంగా పెరుగడం ప్రజలు అనుభవిస్తున్న దుర్భర పరిస్థితి మరింత తీవ్రం చేస్తోంది. మోడీ ప్రభుత్వ హయాంలో తారాస్థాయికి చేరిన ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ప్రజల వద్ద ఏమి మిగల్చడం లేదు. ఇవాళ 100 మంది చేతుల్లో దేశ సంపదలో 25 శాతం కేంద్రీకృతమయ్యింది. ప్రజల గురించి, దేశం గురించి మాట్లాడే వాళ్లు దేశ ద్రోహులయ్యారు. ప్రజల శ్రమను, దేశ వనరులను కొల్లగొట్టేవారు దేశ భక్తులుగా చలామణి అవుతున్నారు.
భూములు, గనులు, అడవులు, టెలికాం స్పెక్ట్రమ్‌లు అన్నింటిని కార్పొరేట్లకు అప్పగించేస్తున్నారు. అందుకు కావల్సిన చట్టాలు రూపొందించి అమలు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని అటుకెక్కించారు, పార్లమెంటును ఏకపక్షంగా నిర్వహిస్తున్నారు. ప్రజాధనంతో నిర్మించిన లక్షల కోట్ల విలువ చేసే ప్రజా ఆస్తులను గుండుగుత్తగా అమ్మేస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కార్మిక హక్కులను కాలరాసి కార్పొరేట్ల దయా దాక్షిణ్యాలు వదిలివేసే విధంగా 4 స్మృతులను రూపొందించింది. ఆదివాసులను అడవి నుంచి గెంటి వేయడానికి సైన్యాన్ని ఉపయోగిస్తున్నది. ప్రజల స్వేచ్ఛ, హక్కులను ఉక్కుపాదంతో అణచివేస్తూ ఫాసిస్టు పాలన సాగిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మోడీషాలు అమ్ముతున్నారు, అంబానీ, ఆదానీలు కొంటున్నారు.
నిజానికి భారతదేశం పేదదేశం కాదు నిరుపేదలు ఉన్నదేశం. 40 శాతం ప్రజలకు దేశ సంపదలో 6 శాతం మాత్రమే దక్కుతుంది. స్థూల జాతీయ ఉత్పత్తిలో ప్రజలకు భాగస్వామ్యం లేక అంటే ఉపాధి అవకాశాలు లేక, ఆదాయాలు లేక పేదరికం లోకిపోతున్నారు. మిలియనీర్లు మాత్రం బిలియనీర్ల అవుతున్నారు. 1990 వరకు మన దేశంలో బిలియనీర్లు లేరు. ఇవాళ దేశంలో 166 మంది బిలియనీర్లు ఉన్నారు. 1 శాతం సంపన్నుల సంపద 70 శాతం ప్రజల సంపదకు 4 రెట్లు ఉంది. ఇదే పెట్టుబడి మాయాజాలం. అంబానీ, అదానీలు దేశంలోని గనులు, చమురు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, విద్యుత్తు ప్లాంట్లు, టెలికమ్ వగైరా అన్నింటిపై వారిదే ఆధిపత్యం కొనసాగుతున్నది.
సామ్రాజ్యవాద ఆర్థిక విధానాలను అనుసరించే పాలనలో రైతులను, చిన్నపాటి ఉత్పత్తిదారులను పీల్చి పిప్పి చేయటం ద్వారా, అలాగే సంఘటిత కార్మికుల సమిష్టి శక్తిని తగ్గించటం ద్వారా, శ్రామిక ప్రజల తలసరి సగటు వాస్తవిక ఆదాయం పడిపోతున్నది. జిడిపి పెరుగుదల ఎంత ఉన్నా పేదరికపు నిష్పత్తి పెరుగుదలతో ఇది బయట పడుతుంది. 1980 చివరిదాకా తలసరి ఆహారధాన్యాల వినిమయంలో ఉన్న పెరుగుదల, ఆ తరువాత ఎదుగుబొదుగు లేక స్తంభించింది. నేషనల్ శాంపిల్ సర్వే అధ్యయనం ప్రకారం, 1993-94లో రోజుకి 2200 క్యాలరీల కంటే తక్కువ శక్తి గల ఆహారాన్ని పొందుతున్న గ్రామీణ ప్రజలు 58శాతం ఉంటే, 2011-12 నాటికి అది 68 శాతానికి పెరిగింది. ఇక దేశంలోని పట్టణ ప్రాంత ప్రజలకు తలసరి రోజుకి అవసరమయ్యే 2100 క్యాలరీల కంటే తక్కువ ఆహారాన్ని పొందుతున్నవారు… 1993-94, 2011-12 మధ్య 57 శాతం నుంచి 65 శాతానికి పెరిగారు. ఆ తరువాత చేసిన నేషనల్ శాంపిల్ సర్వే కూడా ఇటువంటి నిరాశాజనక ఫలితాలనే తేల్చింది.
అయితే వాస్తవాలు వెలుగులోకి రాకుండా 2017-18 శాంపిల్ సర్వే అధ్యయన ఫలితాలను మోడీ ప్రభుత్వం తొక్కి పెట్టింది. పాత పద్ధతిలో నేషనల్ శాంపిల్ సర్వేను చేయకూడదని కూడా నిర్ణయించింది. ఇవాళ దేశంలో నిరుద్యోగం 45 సంవత్సరాల గరిష్టానికి పెరిగింది. దేశ రుణం 2022 మార్చి నాటికి రూ.139 లక్షల కోట్లు కాగా 2023 మార్చి నాటికి 156 లక్షల కోట్లకు చేరనుంది. ప్రతి పౌరుని మీద రూ.1,40,000 ఉంది. ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరుగడంతో వాణిజ్యలోటు 30 బిలియన్ డాలర్లు (రూ.2,40,000 కోట్లు) గా నమోదైందని ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఇక్రా) తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి మునుపెన్నడూ లేని విధంగా కరంట్ అక్కౌంట్ డిఫిసిట్(క్వాడ్) 120 బిలియన్ డాలర్లకు అంటే 96 లక్షల కోట్లకు తాకవచ్చని ‘ఇక్రా’ తెలిపింది.
హిందూత్వ ఫాసిస్టు నినాదం వెనుక ఉన్న రహస్యం :
ఆర్ఎస్ఎస్, బిజెపి ఇస్తున్న హిందూత్వ నినాదం ఏ వర్గానికి సేవ చేస్తుందో రోజులు గడిచే కొద్ది రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువత క్రమంగా అర్థం చేసుకుంటున్నారు. బిజెపి ప్రభుత్వం మోడీ నేతృత్వంలో హిందూత్వ చాటున ప్రజా ఆస్తులను టోకున అమ్మేస్తోంది. ఇంకోవైపు కార్మిక వర్గంపై, రైతాంగంపై పెద్ద పెట్టున విరుచుకుపడుతోంది. బిజెపి ప్రభుత్వం ఇంతగా బరితెగించడానికి ధైర్యం ఎలా వచ్చింది. హిందూత్వ పేరుతో దేశం యావత్తు రెండుగా చీలిపోతున్న పరిస్థితిలో ఉన్నాం. ప్రతిపక్ష పార్టీలకు ప్రజాస్వామ్య, లౌకిక విలువల పట్ల నిబద్ధత కొరబడటం, ప్రపంచీకరణ ఆర్థిక విధానాల పట్ల వ్యతిరేకత లేకపోవడం, మధ్యతరగతి ప్రజలు భ్రమల్లో ఉండడం, మీడియా తప్పుడు ప్రచారం చేయడం, మైనారిటీలను అంతర్గత శత్రువులుగా చూపడం, గతంలో పాలించిన కాంగ్రెసును ఈ నాటి సమస్యలకు కారణంగా చూపెడుతూ తాను మాత్రమే అన్నీ సమస్యలను పరిష్కరించగలననే పోజు మోడీ పెడుతున్నాడు. ప్రజలు హిందూత్వ మత్తులో పడిపోయి ద్రవ్యపెట్టుబడి, కార్పొరేట్ శక్తుల కూటమి దోపిడీని తీవ్రంగా పరిగణించడం లేదు. హిందూత్వ ఫాసిస్టు పాలకుల అసలు ఎజెండా లక్షమే ప్రజల దృష్టిని అసలు సమస్యల నుండి పక్కదారి పట్టించి కార్పొరేట్ల ప్రయోజనాలు నెరవేర్చడంగా ఉంది.
‘హిందూత్వ’ నీడలో కార్పొరేట్లు పెరగడం యాదృచ్ఛికమేమీ కాదు. హిందూత్వ వాదుల ఆర్థిక సిద్ధాంతం పూర్తిగా, ఏమాత్రం దాపరికం లేని రీతిలో కార్పొరేట్లను నిస్సిగ్గుగా సమర్థిస్తుంది. ఈ విషయాన్ని వేరే ఎవరో కాదు, మోడీనే స్వయంగా ప్రకటించారు. ‘పెట్టుబడిదారులు సంపద సృష్టికర్తలు’ అని మోడీ ప్రకటించారు! భూమి, శ్రమ, పెట్టుబడి, నిర్వహణ అనే నాలుగు అంశాల మీద ఆధారపడి సంపద ఉత్పత్తి అవుతుందని బూర్జువా అర్థశాస్త్రం చెప్తుంది. నిజానికి మానవ శ్రమ ప్రకృతి వనరులను ఉపయోగించి మనం వాడుకునే వస్తువుల్ని ఉత్పత్తి చేస్తుంది అన్నది వాస్తవమైన అర్థశాస్త్ర సూత్రం. ప్రకృతి వనరులను వస్తువులుగా మార్చేందుకు మానవులు ఉపయోగించే సాధనాలను కొద్దిమంది వ్యక్తులు చేజిక్కించుకుని వాటి యజమానులుగా మారారు. వాళ్లే పెట్టుబడిదారులు, సంపద ఉత్పత్తిలో ఏ పాత్ర పోషించకపోయినా, ఉత్పత్తి సాధనాలకు తామే యజమానులు గనుక ఆ పేరుతో ఉత్పత్తి అయిన సంపదలో వాటాను చేజిక్కించుకుంటున్నారు. అలా చేజిక్కించుకున్న దానిని ఉపయోగించి మరింత పెద్ద స్థాయి యజమానులయ్యారు. మోడీ పాలనలో ‘దోచుకో దాచుకో’ అన్నది ఒక విధానంగా మారింది.
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ‘హిందూత్వ’ సిద్ధాంతం ప్రతిపాదిస్తున్న పరిష్కారం ఏమిటి? అంటే కార్పొరేట్ల చేతుల్లో మరింత సంపద చేర్చడమే. ఆ సిద్ధాంతానికి అంతకు మించి ఇంకేమీ తోచదు కూడా. అయితే ఈ విధంగా మరింత హెచ్చుగా దోచి పెట్టాలంటే ప్రజల దృష్టిని మరింత తీవ్రంగా వేరే విషయాల వైపు మళ్లించాలి. ప్రజలను మరింతగా దిగ్భ్రమకు, ఆశ్చర్యానికి గురిచేయాలి. అందుకే ‘ఒకే దేశం – ఒకే భాష’ ‘ఒకే సంస్కృతి’ అన్న పిలుపు. అందుకు మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రణాళిక సంఘం రద్దు చేసి ‘నీతి ఆయోగ్’ ఏర్పాటు, ‘వస్తు సేవల పన్ను’, కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తినిచ్చే 370 అధికరణ రద్దు’, ‘జాతీయ పౌరసత్వ రిజిస్టరు’ వంటివి ఉదాహరణంగా చెప్పవచ్చు. ఇంకా..ఇంకా.. ఇవన్నీ ప్రజల జీవితాలను, దేశ సమైక్యతను కకావికలం చేసేస్తున్నాయి. ‘హిందూత్వ సిద్ధాంతం కేవలం దళిత వ్యతిరేకమో, గిరిజన వ్యతిరేకమో, మహిళా వ్యతిరేకమో, మైనారిటీ వ్యతిరేకమో మాత్రమే కాదు. ఇది మౌలికంగానే శ్రమజీవులందరికీ వ్యతిరేకం!
ముగింపు :
సంక్షోభ కాలంలో ప్రజల మీద ఫాసిస్టు పాలకుల నిర్బంధం పెరగడమే కాదు, ప్రజలు ఉవ్వెత్తున తిరగబడి చరిత్ర తిరగరాసే అవకాశం కూడ పెరుగుతుంది. ఆకలి నుంచి ఉక్రోశం, అణచివేత నుంచి ప్రతిఘటన పెరుగుతుంది. మార్పులు తీవ్రమైన వేగంతో సంభవిస్తాయి. అభ్యుదయ శక్తులు సంక్షోభ కారణాలను, స్వరూపాన్ని సక్రమంగా అవగతం చేసుకుని స్ఫూర్తితో జోక్యం చేసుకోవల్సిన సమయం ఇది. అన్ని విధాలుగా విఫలమైన పెట్టుబడిదారీ వ్యవస్థ స్థానంలో మెరుగైన ప్రత్యామ్నాయ వ్యవస్థను, దోపిడీ లేని సమసమాజాన్ని నిర్మించుకునే దిశగా ప్రజాతంత్ర ఉద్యమం ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. దుష్ట మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్లు ఈ ‘హిందూత్వ’ అంతం ప్రజా ప్రతిఘటనలో ఉంది. అంతిమంగా పై చేయి సాధించేది అదే.
2022 నాటికి దేశ జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి రంగం వాటాను 25 శాతానికి పెంచే విధంగా మేక్ ఇన్ ఇండియా పథకాన్ని 2014లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి వాటా 25 శాతానికి చేరే సంగతి అటుంచి మోడీ ఏలుబడిలోకి వచ్చేనాటికి ఉన్న 16.3 శాతం కాస్తా 2020-21 నాటికి 14.3 శాతానికి దిగజారింది. మేకిన్ ఇండియా పథకాన్ని ఉపాధి పెంపుదల, విదేశాలకు వస్తు ఎగుమతులు, మన దిగుమతులు తగ్గించే లక్ష్యంతో ప్రకటించారు. మన దిగుమతుల బిల్లు తగ్గిన దాఖలాలుగానీ, ఎగుమతులు పెరిగిన అనవాలు గానీ కనిపించటం లేదు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న వాగ్దానం నెరవేర్చకపోగా రైతాంగానికి ఎసరు పెట్టి వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు దుర్మార్గమైన మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి అబాసుపాలైన విషయం తెలిసిందే. మద్దతు ధరకు చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చిన మోడీ కాలయాపన చేస్తూ మీన మేషాలు లెక్కిస్తున్నాడు.
సంక్షోభం నుంచి బయట పడాలంటే ఉత్పత్తి సామర్థ్యం పెరగాలి. ఉత్పత్తి సామర్థ్యం పెరుగకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడవు. ఉత్పత్తి పెరగాలంటే సరకులకు గిరాకీ పెరగాలి. గిరాకీ పెరగాలంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. అదే ఇప్పుడు లోపించింది, అన్ని వైపులా మోపుతున్న భారాల నుంచి ప్రజలకు ఊరట కలిగించడానికి బదులు కేంద్ర ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతూ వారి నడ్డి విరుస్తున్నది. పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలి. పంటలకు కనీస మద్దతు ధర అందించి రైతుల ఆదాయం పెరిగేలా చూడాలి. బ్యాకింగ్, బీమా లాంటి కీలక రంగాలను ప్రైవేటీకరించకూడదు. ప్రభుత్వ రంగ పెట్టుబడులను పెంచాలి. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. ప్రజలందరికీ ఉచిత వైద్యం, ఉచిత విద్య అందించడం ద్వారా వారు వాటికి చేస్తున్న ఖర్చును ఇతర అవసరాలకు మళ్లించేలా చేయాలి. కార్పొరేట్ల లాభం కోసం కాకుండా ప్రజలు కేంద్రంగా ఆర్థిక విధానాలు కొనసాగించాలి. అందుకు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాల నుండి తక్షణమే వైదొలగాలి. ఆ పనికి బిజెపి ప్రభుత్వం పూనుకోదు. విధానాలు మార్చుకునేలా ప్రజలే పోరాడి ప్రభుత్వం మెడలు వంచాలి.