భారతదేశంలో విప్లవోద్యమం పీడిత తాడిత కులాలకు, వర్గాలకు చెందిన ఎందరినో ప్రజానాయకులుగా, విప్లవ నాయకులుగా తీర్చి దిద్దింది. తరతరాల కుల, వర్గ పీడనలను తుదముట్టించాలని, భారతదేశాన్ని ఒక సుందర సామ్యవాద దేశంగా మార్చాలనే స్వప్నాలను లక్షలాది యువకులు, విద్యార్థులు కనేలా చేసింది నక్సల్బరీ తిరుగుబాటు. ఆ స్వప్నాన్ని కంటూ దాన్ని సాకారం చేసేటందుకు విప్లవ బాట పట్టిన అసంఖ్యాక యువకుల్లో కా. కటకం సుదర్శన్ ఒకరు. అలాంటి వారిలోని అగ్రగణ్యుల్లో ఆయన ఒకరు.
నక్సలైట్ ఉద్యమ మలి దశలోని తొలి రోజులలోనే 19 ఏళ్ల ప్రాయంలో విప్లవోద్యమంలోకి వచ్చిన కా. సుదర్శన్ యాభై ఏళ్ల పాటు విప్లవోద్యమానికే తన జీవితాన్ని అంకితం చేశాడు. కార్మిక వర్గ కుటుంబంలో, వెనుకబడిన కులంలో పుట్టిన కా. సుదర్శన్ చాలా తక్కువ కాలంలోనే మంచి ఆర్గనైజర్‌గా ఎదగడమే కాకుండా తనను తాను బౌద్ధికంగా సాన పెట్టుకుంటూ ఒక కార్మిక వర్గ మేధావిగా, భారత విప్లవోద్యమానికి నాయకత్వం వహించగలిగే నాయకుడిగా ఎదిగాడు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పీడిత కులాల, వర్గాల నుండి నాయకులుగా ఎదిగిన వారు వందలాదిగా ఉన్నారు. వీరిలో కూడా అతి విలక్షణమైన నాయకుడు కా. సుదర్శన్ అని నాకు ఎందుకు అనిపిస్తుందంటే ఆయన సైద్ధాంతికంగా కూడా చాలా ఎత్తుకు ఎదిగిన వాళ్ళలో ఒకరు. ప్రజలలో నీళ్ళలో చేపలా కలిసిపోయి అద్భుతమైన ఆర్గనైజర్లుగా ఎదిగిన అటువంటి ‘ఆర్గానిక్’ నాయకులు ఎందరో ఉన్నారు. కానీ కా. సుదర్శన్ ఒక ఆర్గనైజర్ గానే కాకుండా ఒక సిద్ధాంత కర్తగా ఎదిగాడు.
ఆదిలాబాద్‌లో పార్టీ నాయకుడిగా అడవి లోని ఆదివాసీ ఉద్యమానికీ, రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహించిన క్రమంలో ఈనాడు విప్లవోద్యమానికి కేంద్రంగా ఉన్న దండకారణ్య ఉద్యమానికి బలమైన పునాదులు వేసిన నాయకులలో ఆయన ఒకరు. భారత దేశంలోని విప్లవ పార్టీలన్నీ ఎంత గొప్ప ప్రజా పోరాటాలు నిర్వహించినా ప్రజాయుద్ధాన్ని ముందుకు తీసుకుపోయే దశకు చేరుకునే సరికి తడబడినాయి. కానీ ప్రజా యుద్ధాన్ని, గెరిల్లా యుద్ధ తంత్రాన్ని, వాటితో పాటు జమిలిగా ప్రజా పోరాటాలను ముందుకు తీసుకెళ్లడానికి పార్టీ నాయకత్వం చేసిన సమిష్టి కృషిలో, అందుకు అవసరమైన సైద్ధాంతిక నేపథ్యాన్ని అభివృద్ధి చేసే కృషిలో కా. సుదర్శన్ గొప్ప పాత్ర నిర్వహించాడు. జనతన సర్కార్ నిర్మాణానికి, ఐక్య సంఘటనల నిర్మాణానికి అవసరమైన సైద్ధాంతిక కృషిని కూడా దీని నుండి వేరు చేసి చూడలేము. గత కొద్ది ఏళ్లుగా ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనల నిర్మాణానికి ఆయన కృషి చేస్తున్నట్టు పార్టీ అధికార ప్రతినిధిగా ఆయన చేసిన ఎన్నో ప్రకటనల నుండి గ్రహించవచ్చు.
కా. సుదర్శన్ అకాల మరణం విప్లవోద్యమానికి తీరని లోటు. ఆ కార్మిక వర్గ మేధావికి, మేటి విప్లవ నాయకునికి అరుణారుణ వందనాలు.
(జులై 18న అమరుల బంధుమిత్రుల సంఘం వార్షిక సభలో విడుదల కానున్న దండకారణ్యమే అతని చిరునామా పుస్తకం నుంచి )
✊✊
మా సత్యం
రవి నర్ల రాసిన వ్యాసంలోని వాక్యాలతో ఏకీభవిస్తూ
“భారత దేశంలోని విప్లవ పార్టీలన్నీ ఎంత గొప్ప ప్రజా పోరాటాలు నిర్వహించినా ప్రజాయుద్ధాన్ని ముందుకు తీసుకుపోయే దశకు చేరుకునే సరికి తడబడినాయి. కానీ ప్రజా యుద్ధాన్ని, గెరిల్లా యుద్ధ తంత్రాన్ని, వాటితో పాటు జమిలిగా ప్రజా పోరాటాలను ముందుకు తీసుకెళ్లడానికి పార్టీ నాయకత్వం చేసిన సమిష్టి కృషిలో, అందుకు అవసరమైన సైద్ధాంతిక నేపథ్యాన్ని అభివృద్ధి చేసే కృషిలో కా. సుదర్శన్ గొప్ప పాత్ర నిర్వహించాడు”. కామ్రేడ్ సుదర్శన్ అనారోగ్యంతో మరణించడం భారతదేశ విప్లవోద్యమానికే కాదు ప్రపంచ విప్లవోద్యమానికి తీరని నష్టం.
రెడ్ సెల్యూట్ కామ్రేడ్ సుదర్శన్
వృధా కాదు వృధా కాదు
మీ మరణం వృధా కాదు