‘కాషాయ ఫాసిజం, హిందుత్వ తీవ్ర జాతీయవాదం, నయా ఉదారవాద వనరుల దోపిడి’ అనే ఈ పుస్తకం అశోక్ కుంబం గారు రాసిన ఇంగ్లీష్ వ్యాసానికి కా. సి యస్ ఆర్ ప్రసాద్ చేసిన అనువాదం.
భారతీయ ఫాసిజం అనేది మన నేలమీది ఆధునిక పెట్టుబడిదారీ సామాజిక దుష్పరిణామమే. అంటే, ఇక్కడి ఫాసిజానికి రాజకీయ ఆర్థిక వ్యవస్థ, దాని చుట్టూ ఉండే భిన్న సామాజిక సంస్కృతుల సంక్లిష్ట, సమాహారమైన నాగరికత అనే రెండు వైపుల నుంచి బలం సమకూరిందని అర్థం చేసుకోవాలి. అందువల్ల భారత ఫాసిజాన్ని స్థూలంగా చూసినప్పుడు గతకాలపు విదేశీ ఫాసిజంతో కొన్ని పోలికలు ఉన్నప్పటికీ, సూక్ష్మంగా పరిశీలించినప్పుడు అది తనదైన ప్రత్యేకతలతో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అనేక రకాల సాయుధ, సాయుదేతర ప్రజా పోరాటాలు జరిగినప్పటికీ భారత నాగరికతా క్రమమే అసలైన అర్థంలో ఇంకా ఆధునికతా పట్టాలే ఎక్కలేదు. అయితే ఈనాటి ఆధునిక యుగంలో జాతి, దేశభక్తి అనే భావనలను ఇక్కడి ప్రజలు ఇంకా అనాధునిక అర్థంలో స్వీకరిస్తున్నారనే వాస్తవమే ఎంతో సంక్లిష్టమైనది, వైరుధ్యపూరితమైనది.
పూలే, అంబేద్కర్, పెరియార్ మొదలైన వైతాళికుల ఆధునికతా ఉద్యమాలు మొదలుకొని పాత కమ్యూనిస్టు ఉద్యమాలు, నేటి విప్లవ కమ్యూనిస్టు ఉద్యమాల దాకా ఎన్నో ప్రజా పోరాటాలు జరిగినా/జరుగుతున్నా భారత సామాజిక ఆధునికపూర్వ పునాది మాత్రం ఆమూలాగ్రం విచ్ఛిన్నం కాలేదు. సనాతన సంస్కృతీ, యధాతధవాద, పునరుద్ధరణవాద శక్తుల చేతుల్లో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ, పితృస్వామిక వ్యవస్థల నిరంతర పునరుత్పత్తి క్రమాల వల్ల లౌకికవాద, ఆధునిక ప్రజాశక్తుల పోరాటాలన్నీ చారిత్రకంగా సఫలం కాలేకపోతున్నాయి.
రాజకీయ ఆర్థిక వ్యవస్థ, రాజ్యాంగం యంత్రం అనుమతించిన మేరకైనా ఆధునిక భావాలు, ఆధునిక చైతన్యం పరిమిత స్థాయిలో విస్తరించడం వల్ల విద్యావకాశాలు, స్వేచ్చాకాంక్ష, అలాగే దోపిడీ, అభద్రతా ఏకకాలంలో సమాజంలో అంతకంతకు విస్తరిస్తున్నాయి. ఇటువంటి ఈ పరిస్థితులలో కులవ్యవస్థా బంధిత మధ్యస్థ వర్గాలు, పీడిత ప్రజా శ్రేణులు తీవ్ర ఉద్రిక్తతకు, గందరగోళానికి గురవుతున్నారు.ఈ దుస్థితి నుండి బయటపడడానికి, కింది కులాలపై తమ ఆధిపత్యం నిలుపుకోవడం కోసం మధ్యతరగతి ప్రజలు పునరుద్ధరణవాదం వైపు మళ్ళుతుండగా, మెజారిటీ పీడిత ప్రజలేమో తమ విముక్తికై వివిధ పోరాటాలకు ఉపక్రమిస్తున్నారు. కాని తమకుండే ఆధునికపూర్వ సాంస్కృతిక మూలాల వల్ల ఆయా పోరాటాలు నిజంగా విముక్తిని సాధిస్తాయా లేదా అని లోతుగా, చైతన్యపూర్వకంగా ఆలోచించగలిగే, విశ్లేషించగలిగే స్థితిలో వారు లేరు. ఎక్కువమట్టుకు వారు వ్యవస్థా చట్రానికి లోబడి జరిగే అనేక ఆధిపత్య వ్యతిరేక పోరాటాలలోనే పాల్గొంటున్నారు. అయితే ఆయా పోరాటాలకు నాయకత్వం వహించే శక్తుల వర్గ స్వభావాన్ని, నిజాయితీని పరిశీలిస్తే, అవి ప్రజల (వర్గ) ప్రయోజనాలను నెరవేర్చే పోరాటాలు కావని, ప్రజల పోరాట శక్తులను మొద్దుబార్చి, వారిని దారి మళ్ళించేవే అని మనకు అర్థమవుతుంది.
వీటికి తోడు, హిందూ(త్వ) జాతీయవాద శక్తులు కూడా వారికి అనుకూలమైన రీతిలో ప్రజల మానసికతను నిరంతరం ప్రభావిత పరుస్తూ, సమకాలీనంగా తీర్చిదిద్దుతూ సాపేక్షికంగా సామాజిక ఆధిపత్యం సాధించడం వల్ల 2014లో మొదటిసారిగా రాజకీయ అధికారంలోకి రాగలిగాయి. ప్రజల మానసిక ప్రపంచంపై కులాధారిత భూస్వామిక భావజాలం పట్టు ఇంకా బలంగానే ఉండడంవల్ల అభద్రతా స్థితిలో ఉన్న తమను బైట పడేయడానికి ఒక ‘ఉక్కు మనిషి’ కావాలన్న భావాన్ని అంతకుముందు కాలంలోనే హిందూ జాతీయవాదులు బాగా ప్రచారం చేశారు. అందులో భాగంగానే నరేంద్రమోడీని కులం మార్చి ముందుకు తీసుకువచ్చి ఒక ‘సూపర్ మాన్’ ను చేశారు. ఆ తర్వాత గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఎన్నికై ఆయన హిందూత్వ రాజకీయ ప్రయోగాన్ని అమలు చేశాడు. దాని అమానుష పాశవిక రూపంగానే వేలాది మంది ముస్లింల నరమేధం గుజరాత్ లో జరిగింది. అప్పటికీ ఐదారు దశాబ్దాల ముందు నుంచే ముస్లిం వ్యతిరేక సాంస్కృతిక ప్రచారాన్ని నిత్యం లైవ్ లో ఉంచుతూ, తమ దీర్ఘకాలిక హిందూత్వ రాజకీయ ప్రాజెక్టును అమలుపరుస్తూ వస్తున్నారు. ఇది కూడా తోడై గుజరాత్ లో అంతటి సామూహిక జన హననానికి పాల్పడ్డారు.
ఆ దుష్ట ప్రయోగంలో విజయం పొందిన తర్వాత నరేంద్ర మోడీని భారత కేంద్ర రాజకీయాల్లోకి తీసుకువచ్చి ప్రధానమంత్రిని చేయడం జరిగింది. ఇక అది మొదలు తమ హిందూత్వ రాజకీయ ప్రాజెక్టును పకడ్బందీగా అమలు పరుస్తూ న్యాయ, విద్యా, మీడియా లాంటి తదితర సామాజిక వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేశారు. అందులో భాగంగానే మన దేశంలోని కొందరు సుప్రసిద్ధ హేతువాదులను, లౌకికవాదులను, పౌరహక్కుల కార్యకర్తలను తమ హిట్ లిస్టులో చేర్చి వాళ్లలో చాలా మందిని హత్య చేశారు. వేలాది మందిని అమానుషమైన ఊపా చట్టం కింద నిర్బంధించి హింసి స్తున్నారు. ఒక్క ముస్లింలనే కాదు క్రైస్తవులు, దళితులు, కమ్యూనిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలను కూడా శత్రువులుగా ప్రకటించి వారు దాడులు చేస్తున్నారు.
ఒకప్పుడు సామాజికపరంగా, రాజకీయపరంగా పెద్దగా గుర్తింపు లేనిస్థితి నుండి (2014 నాటికి) ఒక ప్రధాన రాజకీయ శక్తిగా రూపొందడానికి కాషాయ ఫాసిజానికి పాతిక సంవత్సరాలు పట్టింది. అంటే, హిందూత్వ రాజకీయ శక్తులు తమ ప్రాజెక్టును విజయవంతం చేసుకోవడానికి సుదీర్ఘకాలం పాటు సాంస్కృతిక జాతీయవాద కాషాయ భావాలను సమ కాలానికి అనుగుణంగా పునరుత్పత్తి చేసి ప్రజల మానసికతపై పైచేయి సాధించారు. అందులో భాగంగానే హిందూమత అస్తిత్వాన్ని, గుర్తింపును భారత జాతీయతతో సమానమైన అస్తిత్వంగా, గుర్తింపుగా మార్చివేశారు. ఇందుకు అశోక్ కుంబం అన్నట్టుగా కుల వ్యవస్థనే కాదు, పితృస్వామ్యాన్ని కూడా ఉపయోగించుకు న్నారు. పై రెండు వ్యవస్థల్లోనూ అణచివేతే ఉమ్మడిగా ఉండడం వల్లనే వాళ్ళకి అవి చాలా దోహదపడ్డాయి.
కరడుగట్టిన హిందూత్వ ప్రాజెక్టును, నయా ఉదారవాద పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనాతో సంపూర్ణంగా జోడించడమే మునుపటి కాంగ్రెస్ తదితర పార్టీల కంటే మోడీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ ప్రత్యేకతగా చూడాలి.. పైగా నానాటికీ అభివృద్ధి అవుతున్న సాంకేతికతను కూడా మోడీ పరిపూర్ణంగా ఉపయోగించుకొని తన ప్రజాకర్షక పథకాలను చాలా పకడ్బందీగా ప్రచారం చేసుకున్నాడు. ఇవన్నీ 2019లో కూడా మోడీని తిరుగులేని నాయకుడిగా నిలబెట్టి తిరిగి అధికారంలోకి తెచ్చాయి.
అయితే రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మరింత దూకుడుగా ప్రవర్తించింది. మోడీ ప్రభుత్వం ఏడు దశాబ్దాల పైగా నలుగుతున్న కాశ్మీర్ వివాదాన్ని తన సైనిక, రాజకీయ మూక బలంతో ‘పరిష్కరించా’లనుకున్నది. అందుకే రాజ్యాంగంలోని 370, 35(A) నిబంధనలను ఏకంగా రద్దు చేసి కాశ్మీర్ కున్న స్వయంప్రతిపత్తిని, ప్రత్యేక హోదాను హరించివేసింది. పైగా ఇంటర్ నెట్ తో సహా మిగిలిన అన్ని సమాచార, ప్రసార సాధనాలను రద్దు చేసి కాశ్మీర్ ను ఒక ఒక పెద్ద నిర్బంధ శిబిరంగా మార్చింది.
అలాగే కొత్త పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ జనాభా పట్టిక(NPR), జాతీయ పౌరుల పట్టిక(NRC)లను ముందుకు తీసుకవచ్చింది. ముస్లింలను ‘చొరబాటుదారులు’గా, దేశ ఆంతరంగిక భద్రతకు తీవ్ర ప్రమాదకారులుగా చిత్రీకరించి దాడి చేయడం, సరైన పౌరసత్వ ఆధారాలను చూపలేని వారి వోటు హక్కును రద్దు చేసి నిర్బంధించడం వీటి ముఖ్య లక్ష్యాలు.
వీటికి తోడు ముస్లింల, దళితుల (గొడ్డు మాంసం తినే) ఆహారపు అలవాట్ల పై దాడులు చేసి భీతిల్లజేయడం కూడా వారి మరో దుష్ట పథకం. ఇలా రాజకీయ రంగంలోనే కాదు అన్ని జీవన రంగాలలో జోక్యం చేసుకొని సమస్త సమాజం పై తమ ఆధిపత్యాన్ని నెలకొల్పడం సంఘ్ పరివార్ శక్తుల ధ్యేయం.
ఇలా సమాజంలో బలమైన పునాదుల్ని నిర్మించుకున్న సంఘ్ పరివార్ ఇప్పుడు హిందూజాతి రాజ్యాన్ని స్థాపించే ప్రయత్నంలో ఉన్నది. అశోక్ కుంబం అన్నట్టుగా, హిందూత్వ ఇప్పుడు కేవలం ఒక్క బిజెపి ప్రభుత్వం మాత్రమే కాదు. అది సమాజంలో చాలా లోతుగా చొచ్చుకుపోయిన ఒక కాషాయ స్రవంతి. అయితే హిందూత్వను , నయా ఉదారవాద అభివృద్ధిని రెండింటిని సరుకులుగా మార్చి భారత సమాజంలో విజయవంతంగా అమ్మివేసిన ఘనత మాత్రం బిజెపి ప్రభుత్వానికే దక్కుతుంది. జాతీయ సంస్కృతి, నయా ఉదార అభివృద్ధిల సరికొత్త ఈ ఉమ్మడి ప్యాకేజిని కొనడానికి మధ్యతరగతి వినియోగదారుల వర్గాన్నిఅది తయారు చేసి సిద్ధంగా ఉంచింది. ఈ కోణంలోంచి చూస్తే, భారత పాలనా చరిత్రలో ఒక శక్తివంతమైన ‘సూపర్ దళారీ’గా నరేంద్ర మోడీ ఆవిర్భవించాడని చెప్పాలి.
నిజంగానే ఈ వ్యాస రచయిత అశోక్ కుంబం అన్నట్టుగా, ఇటువంటి కాషాయ ఫాసిజాన్ని ఎదుర్కోవాలంటే, ప్రజలు ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వాన్ని మాత్రమే ఓడిస్తే చాలదు. ఎందుకంటే, ఈనాటి ఫాసిజం కాషాయ జెండా పరిధుల్ని దాటి విశాల ప్రజాశ్రేణుల మానసికతలోకి వ్యాపించింది. దాన్ని రోగాన్ని నయం చేసే ఔషధంగా భావిస్తున్న ప్రజాశ్రేణులకు అది ఒక విషపూరిత కషాయం అని చెప్పాల్సిన అత్యవసర తరుణమిదే.