(మార్క్సిస్టు సిద్ధాంత రచనల్లో ఏంగెల్స్ రాసిన కుటుంబం, సొంత ఆస్తి, రాజ్యాంగయంత్ర ఆవిర్భావం చాలా ముఖ్యమైనది. చాలా తొలి రోజుల్లోనే ఈ పుస్తకం తెలుగులోకి వచ్చింది. అనేక ప్రచురణలుగా వెలుబడింది. వి. వెంకటరావు వసంతమేఘం కోసం దీన్ని సరళంగా పరిచయం చేస్తున్నారు. ఈ సీరియల్ ఈ సంచికతో ఆరంభవుతున్నది. వీలైతే ఇలా కొన్ని మార్క్సిస్టు సిద్ధాంత గ్రంథాలను పరిచయం చేయాలని అనుకుంటున్నాం- వసంతమేఘం టీ)
● ఈనాడు అమలులో వున్నకుటుంబ వ్యవస్థ గతంలో ఎలా ఉండేది? ఎప్పుడూ ఇలాగే ఉండేదా?మన సాంప్రదాయ వాదులు వాదిస్తున్నట్లు ఇది భారతదేశానికి మాత్రమే సొంతమా? బయట ప్రపంచంలో ఇతర దేశాల్లో కుటుంబ వ్యవస్థ ఎలా ఉండేది? ఎలాంటి మార్పులకు లోనయ్యి ఈ దశకు చేరుకుంది. ఇలాంటి విషయాలన్నీ గత చరిత్ర కారుల పరిశోధనలు ఆధారం చేసుకొని, అందులో వున్న అశాస్త్రీయ భావాలు, పక్కన పెట్ట, శాస్త్రీయమైన విషయాలతో మన ముందుకు తెచ్చిన గొప్ప వ్యాసం ఈ పుస్తకం.
● ఇది ఫ్రెడరిక్ ఎంగెల్స్ రచన. కానీ, మార్క్స్ బ్రతికి ఉండగానే, ఇద్దరూ కలసే నోట్సు తయారు చేసుకున్నారు. మార్క్స్ 1883 మార్చి లో చనిపోయారు. తరువాత మరో సంవత్సర కాలానికి ఎంగెల్స్ ఈ పుస్తకాన్ని పూర్తి చేశాడు. “మార్క్స్ మరణశాసనం ప్రకారం ఈ పుస్తకం రాశాను”. అంటాడు. ఈ పుస్తకంపై ఎంగెల్స్ పేరే ఉన్నప్పటికీ ఇద్దరం కలసే రాసాం అంటున్నాడు ఎంగెల్స్.
● చరిత్ర కారులు చరిత్రను పరిశీలన చేసేటప్పుడు ఎవరి దృక్పథంతో వాళ్ళు చేస్తారు. అయితే శాస్త్రీయమైన పరిశీలన మార్క్సు దగ్గర నుండే మొదలయ్యింది. అయినా గతకాలపు, లేదా సమకాలీనుల చరిత్ర కారుల పరిశోధనలలో కూడా అనేక మంచి విషయాలు ఉంటాయి. వాటిని కూడా పరిగణలోకి తీసుకొని మనముందుకు వచ్చిన పుస్తకమే ఇది. భౌతిక వాద దృక్పథం నుండి పరిశీలించే పద్ధతిని అప్పటికి నలభై ఏళ్ల క్రితమే మార్క్స్ కనుగొన్నాడు. దానినే మోర్గాన్ తన సొంత పద్ధతిలో మళ్ళీ కనుగొన్నాడు.”ఇవి 1884 లో మొదటి ముద్రణకు రాసిన ముందు మాటలోని మాటలు. మళ్ళీ 1891 లో నాలుగో ముద్రణ పొందింది. అందులోని ముందు మాటలో “ఈ పుస్తకం ఇంత వరకు పెద్ద సంఖ్యలో ముద్రించబడినా, దాదాపు ఆరు నెలల నుంచి ప్రతులు దొరకడం లేదు.” ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువాదమయ్యింది. అత్యంత ప్రజాదరణ పొందింది. ఇప్పుడు నేను పరిచయం రాస్తున్న పుస్తకం పేరు “కార్ల్ మార్క్స్ ఎంగెల్స్ సంకలిత రచనలు భాగం 3″ఈ పుస్తకంలో “కుటుంబమూ, స్వంత ఆస్తి, రాజ్యాంగ ఆవిర్భావం”అనే ఈ వ్యాసం ఒక భాగం. 1982 లో ప్రగతి ప్రచురణాలయం లో ముద్రించినది. ఇది విడి పుస్తకంగా కూడా తెలుగులో వుంది.
“చరిత్ర” అనగానే అది ఏ ఒక్క వ్యక్తి పరిశోధనో కాదు.అనేక మంది వ్యక్తులు ఎన్నో ఏళ్ళు శ్రమించి, తయారు చేసిన గతాన్ని, మరింత తర్కంతో, విషయసేకరణతో ఒక క్రమ పద్ధతిలో, సరైన గతాన్ని మన ముందు ఉంచడమే శాస్త్రీయ దృష్టిగల చరిత్ర కారులు చేసే పని. మార్క్సు, ఎంగెల్స్ కూడా అంతే. వాళ్ళు మాత్రమే రాసినా, అందులో గతకాలపు చరిత్ర కారుల ప్రస్తావనా, వాళ్ళ పరిశోధనలూ కూడా ఉంటుంటాయి. ఇందులో చాలామంది చరిత్ర కారుల ప్రస్తావన ఉన్నప్పటికీ, ప్రధానంగా “లూయీ హెన్రీ మోర్గాన్” రచనలు ప్రామాణికంగా తీసుకున్నారు. మార్క్సూ, మొర్గానూ సమకాలికులు. “చరిత్రను భౌతిక వాద దృక్పథం నుండి పరిశీలించే పద్ధతిని నలభై ఏళ్ళ క్రితమే మార్క్సు కనుగొన్నాడు. దానినే మోర్గాన్ సొంత పద్ధతిలో కనుగొన్నాడు.”అంటాడు ఎంగెల్సు. ఏ విషయాన్నయినా పరిశీలన చేసేటప్పుడు ఎవరి పద్ధతి వారికి వుంటుంది. మోర్గాన్ కూడా అంతకు ముందు మరి కొంతమంది రచనలు పరిశీలించాడు. మోర్గాన్ 1877 లో “ప్రాచీన సమాజం” అనే పుస్తకం రాశాడు. కానీ, అంతకు ముందే 1871లో “బంధుత్వాల వ్యవస్థలు”అనే పుస్తకం కూడా రాశాడు. వీటికన్నా ముందు 1865లో మాక్ లెన్నాన్. 1861లో బాహోఫెన్ కూడా రాశారు. ఈ పుస్తకంలో అనేక సందర్భాలలో వాటి ప్రస్తావన కూడా వస్తూ వుంటుంది.
మొత్తం మానవజాతి ఆవిర్భవించిన నాటినుండి ఈనాటి వరకూ గడచిన కాలాన్ని మూడు దశలుగా విభజించారు. 1. ఆటవిక కాలం 2. అనాగరిక కాలం 3. నాగరిక కాలం. ఇందులో ఒక్కో కాలాన్ని మళ్ళీ మూడు కాలాలుగా విభజించారు. ఉదాహరణకు అటవిక కాలంలో మూడు దశలు. 1. మొదటి కాలం [నిమ్న దశ] 2. రెండవకాలం [మధ్యదశ] 3. మూడవ కాలం [ వున్నత దశ]. అలాగే మిగతా కాలాల్లో కూడా మూడేసి దశలు. ఈ పుస్తకం చదివేటప్పుడు ముఖ్యంగా ఆయా దశల కాలాల్ని గుర్తు పెట్టుకోవాలి. అటవిక కాలంలోని వున్నత(మూడవ)దశ కాలం గడచిన తర్వాతే, అనాగరిక కాలపు మొదటి దశ వస్తుంది. (ఈ కాలాలు కొంచెం గందరగోళంగా ఉంటాయి.
“మానవజాతి చరిత్ర పూర్వ దశను నిశ్చితమైన ఒక క్రమ పద్ధతిలో తేవడానికి ప్రయత్నించిన వారిలో ప్రప్రథముడు మోర్గాన్. ఏవన్నా ప్రధానమైన కొత్త సంగతులు తెలియవచ్చి, ఆయన అవలంభించిన వర్గీకరణ పద్దతిలో మార్పులు తీసుకురావలిసిన అగత్యం కలిగితే తప్ప, అదే అమలులో ఉంటుందని చెప్పవచ్చు. “అనే మాటలతో ఈ పుస్తకం ప్రారంభమయింది.(ఇంతకంటే తార్కికమైన మైన కొత్త సంగతులు తెలిస్తే తప్ప, లేకపోతే, ఇవే విషయాలు పరిగణలోకి తీసుకోవచ్చు )
అటవిక కాలం, అనాగరిక కాలం, నాగరిక కాలం వీటిల్లో రెండు కాలాల్ని గురించీ, చివరి నాగరిక కాలం మొదటి దశను మాత్రమే ప్రస్తావించాడు. (ఆ తరువాత అంటే, నాగరిక కాలం గురించి అక్కరలేదు. అదంతా లిఖిత పూర్వకంగా వున్నది.) మొదట క్లుప్తంగా రెండు దశల గురించి చూద్దాం.
1.అటవిక కాలంలో మొదటి కాలం[ నిమ్న దశ]: ఈ దశలో మానవుడు అరణ్యాలలోనే నివసిస్తున్నాడు. కనీసం పాక్షికంగా నైనా చెట్లమీదనే ఉండేవాడు. అలా కాకపోయి ఉంటే పెద్ద జంతువుల మధ్య నివసించడం అసంభవం. ఆ దశలో పళ్ళూ, కాయలూ, దుంపలూ తిని బ్రతికాడు. భాష ఇంకా లేదు. సైగల ద్వారానే భావాలు తెలుసు కోవడం. ఆ దశలో అదే ప్రధాన విజయం. అది వేల సంవత్సరాలు పట్టి ఉండవచ్చు.
మధ్య దశ: నిప్పు ఉపయోగాన్ని తెలుసుకోవడం. తిండికి చేపలూ, నత్తలూ, పీతలూ మొదలయిన జల చరాల్ని ఉపయోగించడంతో ఈ దశ ఆరంభమవుతుంది. నిప్పుని ఉపయోగించకపోతే చేపలు పూర్తి బలాన్ని ఇవ్వలేవు. [ ప్రమాదవశాత్తు అరణ్యాలు తగలబడి పోయినపుడు, అందులో జంతువులు కాలిపోవడం, వాటి మాంసం తినడం, పచ్చి మాంసం కన్నా, కాల్చిన మాంసం రుచికరంగా వుండడం, గాడాంధకారంలో వెలుగునివ్వడం లాంటి ప్రయోజనాలు వున్నాయని, నిప్పు అవసరం అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాడు] అటవిక కాలంలోనే అతడు నదుల వెంటా, సముద్ర తీరాల వెంటా విస్తరించాడు. ఒరిపిడి నుండి నిప్పుని పుట్టించ గలిగాడు. పిండి పదార్ధం అధికంగాగల దుంప పదార్ధాలను నేలపొయ్యిలో ఉడకబెట్టడం నేర్చుకున్నాడు. వారు మొదట కనిపెట్టిన ఆయుధాలు గదా, ఈటె. వీటి సహయంతో జంతువులను వేటాడేవాడు. అపుడపుడు అవి దొరికేవి. ఆహరం కొరత వలననే “మనుష్య భక్షణ”వచ్చింది. ఆస్ట్రేలియా లోని ఆదిమ వాసులు ‘ పోలీషియనులు’ నేడు కూడా అటవిక దశలోనే వున్నారు. [ ఈ పుస్తకంలో కొన్ని సందర్భాలలో ‘నేటికీ‘ అనే పదం వస్తూ వుంటుంది. నేటికి అంటే ఈ పుస్తకం రాసిన 1884 నాటికి]
వున్నత దశ: విల్లు కనిపెట్టడంతో ఈ దశ ఆరంభమయ్యింది. దీని వలన వేట సులభం అయింది. విల్లును కనిపెట్టిన దగ్గర నుండే గ్రామాలలో స్థిరపడడం ఆరంభం అయినట్లు జీవనాధార వస్తువుల మీద మరింత ఆధిపత్యం లభించినట్లు అనిపిస్తోంది[ కుండలు చేయడం నేర్చుకోవడంతో మానవులు అటవిక కాలం నుండి అనాగరికకాలం లోకి మారడం ప్రారంభ మవుతుందని మోర్గాన్ అభిప్రాయం] ఈ దశలో అతడు కర్రతో పాత్రలూ, వంట పాత్రలూ తయారు చేసినట్లు, చెట్ల బెరడు నుండి నార తీసి చేతితో (బట్టలు) తయారుచేసుకున్నట్లు తెలుస్తోంది.[ మగ్గం లేదు] నారపట్టతో, చువ్వలతో[ఇనప చువ్వలు కాదు] బుట్టలు అల్లినట్లు, రాతిపనిముట్లకు పదును పెట్టినట్టు కనబడు తున్నది. కొన్ని ప్రాంతాలలో దూలాలూ, వాసాల తో ఇళ్ళు కట్టడం కూడా నేర్చుకున్నాడు.
2.అనాగరిక కాలం: మొదటి కాలం[నిమ్న దశ]: కుండలు వాడకం లోకి రావడంతో ఈ దశ ఆరంభమవుతుంది. బుట్టలూ, కర్ర గిన్నెలూ పొయ్యి మీద పెడితే కాలిపోకుండా వాటికి మట్టి పూత పెట్టె అలవాటు వచ్చి వుంటుంది. ఇంత వరకూ జరిగిన పరిణామ క్రమం అన్ని ప్రదేశాలకూ వర్తిస్తుందని అనుకోవచ్చు. పశువుల్ని మచ్చిక చేసి పెంచడం, మొక్కా, మొటిమా పెంచడం అనాగరిక కాలపు ప్రత్యేక లక్షణాలు.
రెండవ కాలం[మధ్య దశ]: ఆహారం కోసం నీటి పారుదల ద్వారా మొక్కల్ని పెంచి, వ్యవసాయం చేయడంతో, పచ్చి ఇటుకల్నీ, రాళ్ళనీ వుపయోగించి ఇళ్ళు కట్టుకోవడంతో ఈ దశ ఆరంభమవుతుంది. మనం పశ్చిమార్ధ గోళం నుంచి మొదలుపెట్టుకుందాం. ఎందుకంటే, యూరోపియనుల ఆక్రమణ కాలం దాకా, అక్కడి ప్రజలు ఆ అభివృద్ధి దశను దాటి ఎక్కడా ముందుకు సాగలేదు. కొన్ని ప్రాంతాలలో అప్పటికే మొక్కజొన్నా, గుమ్మడీ, పుచ్చా ఇతర తోటలు సాగుచేస్తున్నారు. వారి ఆహారంలో అధికభాగం అవే. కానీ, వాయువ్యప్రాంతలోని తెగలు, ప్రత్యేకించి కొలంబియా నదీ ప్రాంతాల వారు ఇంకా అటవిక కాలపు పై దశ లోనే వున్నారు. కుండలు చేయడం గానీ, మొక్కలు పెంచడం గానీ వారికి తెలియదు. రెండో వైపున అమెరికా ఆక్రమణ నాటికి న్యూ మెక్సికో లోని “వుయేబ్లో ఇండియన్లూ, మెక్సికన్లూ, పెరూ నివాసులూ, మధ్య అమెరికా వాసులూ అనాగరిక కాలపు మధ్య దశలో వున్నారు. ఈ వుయేబ్లో తెగల బృందాలకు వుమ్మడి చరిత్రా, సంస్కృతీ ఉండేవి. ‘వుయేబ్లో’ అంటే, స్పానిష్ భాషలో ఒక ప్రజా సమూహం, సంఘం, గ్రామం అనే అర్ధాలు వున్నాయి. వారు చుట్టూ గోడల చేత పరిరక్షించిన అయిదారు అంతస్తుల పెద్ద సామూహిక గ్రుహాల్లో నివసించేవారు.[అంటే, అంతస్తులు అంటే, ప్రత్యేకంగా కట్టుకోవడం కాకుండా కొండ లాంటి దాన్ని పెద్ద రంధ్రాలుగా చేసి, నివాసయోగ్యంగా చేసుకున్నారు అని మనం ఊహించవచ్చు. అపార్ట్ మెంట్ సంస్కృతి ఆనాడే ఉన్నదన్న మాట] అటువంటి ఇళ్లలో కొన్ని వేల మంది వుండేవారు. ఎక్కడి నుండో నీరు పారించేవారు. మొక్క జొన్నా ఇతర పంటలు వేస్తుండేవారు. ఇంకా ఇనుము తెలియదు. కొన్ని ఇతర లోహాలు తెలుసు. అందుకనే ఇంకా రాతి పనిముట్లు వదలలేదు.
ప్రపంచంలోని మానవజాతి అంతా అనేక ప్రాంతాలలో నివసిస్తున్నది కదా! అన్ని ప్రాంతాలు ఒకే లాగ అభివృద్ధి చెందాయని అనుకోలేము. కొన్ని ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందితే, కొన్ని ప్రాంతాలు నెమ్మదిగా అభివృద్ధి చెందాయి. మొత్తంగా చూస్తే అన్ని ప్రాంతాల ప్రజలూ నాగరిక ప్రపంచం లో వచ్చేసారు. పశువుల మేత కోసమే మొదట కాయ ధాన్యాలు పండించారు. అటు తర్వాతనే అవి మనిషి ఆహారంలో భాగమయ్యాయి. పాలూ, మాంసమూ బిడ్డల పెరుగుదలకు బాగా తోడ్పడ్డాయి. ఏది ఎలా వున్నా ‘మనుష్య భక్షణ’ అప్పటినుండే క్రమంగా అంతరించిపోయింది.
వున్నత దశ: ముడి ఇనుమును కరిగించి పోత పొయ్యడం నేర్చుకొన్న దశ నుండి ఈ దశ ఆరంభమవుతుంది. అక్షరాలను సంకేతాలుగా పెట్టుకొని, వాటిని సాహిత్య రచనకు ఉపయోగించడంతో నాగరిక కాలం ప్రారంభమవుతుంది. మానవ సమాజ పరిణామక్రమంలో ఇంతవరకూ నడచిన దశలన్నిటిలో కన్నా ఈ దశలో ఉత్పత్తి హెచ్చు. (సమాజానికి ఒక్కో ఉత్పత్తి పరికరం పరిచయం అవుతున్నకొద్దీ ఉత్పత్తి పెరుగుతూ వుంటుంది. అన్నిటి కన్నా ముఖ్యంగా ఇనపకర్రు వేసిన నాగలి, పశువులులాగేది మనకీ దశలోనే కనిపిస్తుంది). దీని సహాయంతో ఎక్కువగా వ్యవసాయం చేయడానికి వీలు కలిగింది. ఆ విధంగా గతం కన్నా ఎక్కువగా ఆహారపదార్థాలు లభించేవి. దానికి తోడు అడవులను నరికి బాగు చేసి సాగు భూమిని తయారు చెయ్యడం అవసరమయ్యింది. వీటన్నిటికీ ఇనుము చాలా అవసరం. జనాభా పెరిగింది. చిన్న చిన్న ప్రదేశాలలో జన సమర్ధం ఎక్కువ అయింది.
హోమరు గీతాలలో, ముఖ్యంగా “ఇలియడ్”లో అనాగరిక కాలపు వున్నత దశ వికాసం మనకు గోచరిస్తుంది.[చరిత్ర పరిశోధకులు పూర్వకాలపు సాహిత్యమూ, మౌఖికంగా వున్న పాటలూ, మ్యూజియంలలో వున్నపరికరాలూ, తవ్వకాల్లో దొరికిన వస్తువులు ఇలాంటి వాటి వల్ల చరిత్రలో ఏం జరిగింది అనేది నిర్ణయిస్తారు. ఆనాటికి ఇనప పనిముట్లు బాగా వృద్ధి చెందాయి. కొలిమి తిత్తులూ, చేతి మరలూ, కుమ్మరి సారె ఉపయోగించారు. నూనె తియ్యడం, సారాయి కాచడం తెలుసుకున్నారు. లోహ పరిశ్రమ ఒక కళగా అభివృద్ధి చెందింది. బండీ, యుద్ధ రథాలూ, ఓడలూ వచ్చాయి. బురుజులూ, గోపురాలతో దుర్గ నగరాలు నిర్మించారు.
“మానవ జాతి ఆటవిక దశ నుండి అనాగరిక దశ గుండా నాగరిక దశ తొలి ఘట్టాలకు ఎలా చేరుకుందో మోర్గాన్ ను అనుసరించే నేను[ఎంగెల్సు] ఇక్కడ రాశాను. కానీ, ఈ పుస్తకం పూర్తయ్యేనాటికి నేను వివరించిన దానితో పోలిస్తే, ఇది పేలవంగా వుంటుంది. ప్రస్తుతానికి మోర్గాన్ చేసిన విభజనని ఈవిధంగా క్లుప్తీకరించుకోవచ్చు.” ఆటవిక కాలం: ప్రకృతిలో దొరికిన వాటిని యధాతధ స్థితిలోనే అనుభవించడం. అనాగరిక కాలం: పశువుల్ని మచ్చిక చేసుకోవడం, వ్యవసాయం నేర్చుకోవడం. నాగరిక కాలం: ప్రకృతి ప్రసాదించిన వాటిమీదా, పరిశ్రమలూ, కళలూ ఇంకా అధికంగా పనిచేసే పరిజ్ఙానం సంపాదించడం.