‘’కులం బహుజన ప్రజాస్వామిక విప్లవ దశ’’ అనే ఈ పుస్తకంలో సామాజిక మార్పును చారిత్రకంగా, భౌతికవాద దృష్టితో పరిశీలిస్తూ, అందులో భాగంగా కుల సమస్యను సీరియస్ గా  తీసుకొని విశ్లేషించి రాసిన వ్యాసాలున్నాయి. అందువల్ల ఇది అందరూ చదవాల్సిన ముఖ్యమైన పుస్తకం.

       అయితే ఒక పుస్తకం ముఖ్యమైన మంచి పుస్తకం అని అంటున్నానంటే అందులోని విషయాలన్నింటి పట్ల పూర్తి ఏకీభావం ఉన్నట్టు కాదు. ముఖ్యంగా ఇందులో రచయిత పట్టా వెంకటేశ్వర్లు గారు చేసిన కొన్ని నిర్ధారణల పట్ల నాతో సహా కొందరు మార్క్సిస్టు లకు విభేదం ఉండవచ్చు. అవి విప్లవ కమ్యూనిస్టులకు సంబంధించినవి అయినందువల్ల మాత్రమే కాక ఇతరేతరమైనవి కూడా ఉన్నాయి. ఏదేమైనా, కుల నిర్మూలన అనే లక్ష్యం పట్ల రచయిత సీరియస్ నెస్ ను ఈ పుస్తకాన్ని చదివిన ప్రతి పాఠకుడు గుర్తిస్తాడు. కుల నిర్మూలనకు రచయిత ప్రతిపాదించిన కార్యాచరణ ప్రణాళిక సాంస్కృతిక, భావజాలరంగంలోని  వర్గపోరాట ఆచరణకు సంబంధించినది కావడం వల్ల ఇది తప్పనిసరిగా చదివి  చర్చించదగిన పుస్తకం.       

      వృత్తిని మార్చుకునే వీలు లేని కుల వ్యవస్థను ఛేదించాలనడం, మనుధర్మం ప్రోత్సహించిన స్వకుల వివాహాలను వ్యతిరేకించి కులాంతర వివాహాలను చేసుకోవాలనడం, మొత్తంగా కుల వ్యవస్థ కొనసాగడంలో వారసత్వ వృత్తి మొదటి లింకుగా ఉండగా, స్వకుల వివాహ పద్ధతి ఆఖరి లింకుగా ఉన్నదనే విషయాలన్నీ సత్యమైనవే. ఆ రెండు లింకులను తప్పనిసరిగా ధ్వంసం చేయాల్సిందే. అందుకే కుల నిర్మూలనకై  సామాజిక మార్పుకోరే శక్తులన్నీ కలిసి ఒక ఐక్య సంఘటనగా ఏర్పడి కుల వ్యతిరేక ఉద్యమాలు నిర్మించాలనే విషయంలో ఎవరికైనా రెండో అభిప్రాయం లేనేలేదు.

     కులం కేవలం సామాజిక సమస్యగా మాత్రమే లేదు. అది సామాజిక ఆర్థిక రాజకీయ సమస్యగా మన ముందున్నది. అందుకు రచయిత అన్నట్టుగా, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వర్గపోరాటాలు వేగవంతంగా జరగాలి. అలా చూస్తే, ఒకనాడు కులమే వర్గంగా ఉన్న స్థితి నుంచి ఈనాడు కులం, వర్గం వేర్వేరుగానూ, కలగలిసీ ఉన్న సంక్లిష్ట స్థితి దాకా సాగిన/సాగుతున్న క్రమాన్ని శాస్త్రీయంగా పరిశీలించడంలో, గతితార్కికంగా విశ్లేషించి అర్థం చేసుకోవడంలో, మార్పు క్రమాలన్నింటినీ  సకాలంలో గుర్తించి వేగవంతం చేయడంలో కొన్ని లోపాలు దొర్లిన విషయం నిజమేనని ఎవరైనా అంగీకరించాల్సిందే.

     అయితే లోపాలున్నాయని గుర్తించిన మరుక్షణం నుంచి నేర్చుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగాలి. అలా గత మూడున్నర దశాబ్దాలుగా విప్లవ కమ్యూనిస్టులు  నేర్చుకుంటూనే వస్తున్నారు. ఎప్పటికప్పుడు  తమ సైద్ధాంతిక అవగాహనను  విస్తరించుకుంటూ వర్గ పోరాటాలను నిర్మిస్తున్నారు. వర్గపోరాటాలంటే తాము చేస్తున్నవి  మాత్రమే కావన్న పరిణత అవగాహనను  కూడా విప్లవ కమ్యూనిస్టులు సంతరించుకుంటున్నారు. అందుకే ‘’సమస్యల పరిష్కారంలో ఒక భాగంగా మేమున్నామని’’ స్పష్టంగా వారు ప్రకటించిన విషయం కూడా అందరికీ విదితమే.

     ఇక- దళిత విప్లవ శిబిరాల మధ్యనున్న ఎడం  కేవలం విప్లవ కమ్యూనిస్టుల వైఫల్యం వల్లనో, లేదా దళితవాదుల వైఫల్యం వల్లనో  ఏర్పడ్డది కాదు. మొత్తంగానే, కుల నిర్మూలనకు సంబంధించి దళితవాదుల ఆచరణను గాని. (విప్లవ) కమ్యూనిస్టుల  ఆచరణను గాని చారిత్రకంగా, భౌతికవాద దృష్టితో శాస్త్రీయంగా అర్థం చేసుకోకపోవడం వల్ల ఏర్పడిన అఖాతం అది. అట్లని శాస్త్రీయ పరిశీలనా దృష్టి ఉన్నంత మాత్రాన్నే ఆ అఖాతం పూడిపోయి ఐక్యత దానంతటదే ఏర్పడేది కాదు. ఆ రెండు శిబిరాల మధ్య ఘర్షణ అయినా, ఐక్యత అయినా ఆచరణాత్మకమైనది, అదే సమయంలో భావజాలపర(సైద్ధాంతిక) మైనది. ఎన్ని విభేదాలున్నప్పటికీ, నిర్దిష్ట లక్ష్యం పట్ల ఏకాభిప్రాయం ఉన్న మేరకు ఐక్య/ సమన్వయ పూర్వక కార్యాచరణ ద్వారా, నిరంతర ప్రజాస్వామిక చర్చల ద్వారానే ఐక్యత పెంపొందుతుంది. అందుకు భరోసా ఈ రచయిత అంబేద్కరిజాన్ని, మార్క్సిజాన్ని పోటీ(ప్రత్యర్థి) సిద్ధాంతాలుగా  చూడకుండా చారిత్రక భౌతికవాదాన్ని (శాస్త్రీయ మార్క్సిస్టు సంవిధానాన్ని) అప్లై చేసి కులాన్ని చూడాలి అనడం, పైగా రాజ్యాధికారం, వర్గ పోరాటాల పట్ల సీరియస్ పట్టింపుతో రచయిత  ఓపెన్ మైండెడ్ గా ఈ పుస్తకంలో చర్చించడమే.

     అయితే రాజ్యాధికారం అంటే ఏమిటి? దాని పట్ల స్పష్టత ఏ మేరకు ఉందనేది సందేహాస్పదమే. ఎందుకంటే, మార్క్స్, అంబేద్కర్ లు ఇద్దరూ రాజ్యాధికారం గురించి మాట్లాడారు. కాని మార్క్స్ చెప్పిన రాజ్యాధికారానికి, అంబేద్కర్  చెప్పిన రాజ్యాధికారానికి చాలా తేడా ఉంది. కేవలం ప్రభుత్వ అధికారమే రాజ్యాధికారం కాదు. అంబేద్కర్ కంటే భిన్నంగా మార్క్స్  రాజ్యం గురించి ఆలోచించాడు. నిరంతర వర్గ పోరాటాల క్రమంలో అత్యంత తార్కిక స్థాయి(logical end) కి వెళ్లి రాజ్యం రద్దు గురించి  కూడా మార్క్స్ ఊహించి, (ఉన్నత కమ్యూనిస్టు) సమ సమాజాన్ని ప్రతిపాదించాడు. కాని అంబేద్కర్ పెట్టుబడికి  ఉండే తనదైన  తర్కం గురించి ఆలోచించాడా? ముఖ్యంగా పెట్టుబడి ద్రవ్య పెట్టుబడి గా మారినప్పుడు రాజ్యం ఏ రూపం తీసుకుంటుంది? ఆ రాజ్యానికి సమాజంలోని కులం, పితృస్వామ్యం  వంటి ఇతర ఆధిపత్య వ్యవస్థలకు మధ్య ఎటువంటి సంబంధాలు ఏర్పడతాయి? అన్న ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి అవుతాయి. ఈ ప్రశ్నలకు ఆచరణ క్రమంలో జవాబులను  వెతుకుతూ పొందిన/పొందుతున్న అవగాహన వెలుగులో చూసినప్పుడు ఈ పుస్తక రచయిత ప్రతిపాదిస్తున్న పరిష్కారాలు సరైనవి అవునా? కావా?  అని పాఠకులెవరైనా తేల్చుకోవచ్చు.

   ఇప్పటికైతే నా వరకు నేను ఒకటి, రెండు విషయాలను ఎత్తిచూపి ముగిస్తాను. ఇందులో రచయిత చెప్పినట్టుగా- మార్పు కోరే ప్రగతిశీల శక్తులన్నీ ఒక  ఐక్య సంఘటనగా ఏర్పడి కుల నిర్మూలనకై ఐక్య ఉద్యమాలు నిర్వహించాలి. అయితే ఐక్యత అనేది కేవలం అభిలాష కాదు. అదొక ఆచరణాత్మక క్రమం. అది వెంటనే సాధ్యమయ్యేది కూడా కాదు. కాబట్టి ఎవరికివారుగా తమ నిర్మాణాల తరపున కుల నిర్మూలనకు సంబంధించిన  సాంస్కృతిక కార్యాచరణను  ప్రకటించి తమ అవగాహన మేరకు పోరాటాలు నిర్వహించడం, ఐక్యతా  ప్రయత్నంలో ఐక్యత కుదిరినంతమేరకు ఐక్య ఉద్యమాలు నిర్వహించడం, పరస్పరం ప్రజాస్వామికంగా చర్చించుకోవడం నిరంతరంగా జరుగుతూనే ఉండాలి. ఆ క్రమంలో ఎప్పటికప్పుడు తమ తమ అవగాహనలను అప్ డేట్ చేసుకుంటూ తదనుగుణంగా పోరాటాలు నిర్వహిస్తూ లక్ష్యానికి చేరువగా సాగిపోవాలి. ఇదంతా ఎవరైనా విభేదించలేని పార్శ్వం.

    మరో పార్శ్వం  నుంచి చూద్దాం. గతం కంటే భిన్నంగా, ఈనాడు విప్లవ కమ్యూనిస్టులు  అంబేద్కర్ ను సైద్ధాంతికంగా ఎలా చూస్తున్నప్పటికీ, ఆయనలోని సామాజిక విప్లవ పార్శ్వాన్ని స్వీకరిస్తున్నారు. కులం పట్ల పాత అవగాహనను మార్చుకొని కుల నిర్మూలనకై తమ కార్యాచరణను కొనసాగిస్తున్నారు. అంబేద్కర్ అన్నట్టుగా- బ్రాహ్మణిజం, పెట్టుబడిదారీవిధానం రెండూ  ప్రజలకు శత్రువులే అని అంగీకరించి, వారు తమ సమరశీల వర్గ పోరాటాలను నిర్వహిస్తున్నారు. నిర్దిష్ట కుల సమస్యను గుర్తించి, అర్థం చేసుకొని పరిష్కరించడంలో అంబేద్కర్ చేసిన ప్రతిపాదనలు, పోరాట కృషీ చాలా విలువైనవనే  గ్రహింపుతో  వారు  పోరాడుతున్నారు.

    అయితే రచయిత ఇక్కడ బ్రాహ్మనిజం, పెట్టుబడిదారీ విధానం రెండూ  ప్రజలకు శత్రువులే అన్న దాన్ని అంగీకరిస్తూనే, ప్రస్తుత దశలో బ్రాహ్మణిజాన్ని మాత్రమే ఎదుర్కోవాలి తప్ప పెట్టుబడిని కాదని అంటాడు. రచయిత దృష్టిలో కమ్యూనిస్టులు అసమానతలకు వ్యతిరేకంగా చేసిన ఆర్థిక పోరాటాలు పాక్షిక వర్గ పోరాటాలైనప్పుడు, మరి పెట్టుబడిని మినహాయించి కేవలం బ్రాహ్మణిజం పైననే  చేసే కుల నిర్మూలనా  పోరాటాలు పాక్షిక వర్గపోరాటాలు  కావా?  అన్న ప్రశ్న పాఠకులకు ఎదురవుతుంది.

    అంతేకాదు, బ్రిటిష్ వలసవాద కాలంలో భారత దేశంలో వర్ణ బానిస వ్యవస్థ పునాదులపై  పెరిగిన కుల వ్యవస్థ (ఉపరితలం) పైనే  పెట్టుబడిదారీ సంబంధాలు కేవలం బయటనుండి రుద్దబడ్డాయని, యూరప్ లో వలె   ఇక్కడి భూస్వామ్యం పై, రాజరికం పై పెట్టుబడి తిరుగుబాటు చేయనందువల్లనే ఇక్కడ కుల  ఆధారిత ఫ్యూడల్ సంబంధాలు యధాతధంగా ఉన్నాయన్న రచయిత, 1947 అధికార మార్పిడి తర్వాత రెండు దశాబ్దాలకే ఫ్యూడల్  సంబంధాలు బలహీన పడిపోయి, మన దేశం పెట్టుబడిదారీ వ్యవస్థ గా మారిందనే  అభిప్రాయాన్ని (కొన్ని గణాంకాలను పేర్కొంటూ) వెలిబుచ్చుతున్నాడు. ఈ దేశాన్ని విప్లవ కమ్యూనిస్టులు అర్థ  భూస్వామ్య, అర్థ వలస దేశంగా నిర్వచించడాన్ని రచయిత విభేదిస్తున్నాడు. మరి ఇక్కడ బూర్జువా  ప్రజాస్వామిక విప్లవాలు జరగకుండానే ఫ్యూడల్  సంబంధాలు బలహీనపడి, పెట్టుబడిదారి వ్యవస్థ ఎలా బలపడింది అన్న సందేహం పాఠకులకు రాకమానదు.

    పైగా బయటి ఇంగ్లాండ్ నుండి వెస్ట్ మినిస్టర్ మోడల్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తెచ్చి మనదేశంలో మొక్కను అంటుకట్టినట్టుగా అంటుగట్టారు. ఇంతకుముందే అనుకున్నట్టుగా భూస్వామ్య పునాదులు ఇంకా బలంగా ఉండి, దేశీయ పెట్టుబడి స్వతంత్రంగా ఎదగకుండా, సామ్రాజ్యవాద పెట్టుబడికి కేవలం దళారీగా ఉన్న మన దేశ  వ్యవస్థలో పాలకులు ఎలాంటి స్వభావంతో ఉంటారు? ఎలాంటి పాత్ర పోషిస్తారు?  బైటి పెట్టుబడితో, దేశీయ పెట్టుబడితోనూ ఎలాంటి సంబంధాలలో ఉంటారు? ఇలాంటి అనేక ప్రశ్నలు కూడా పాఠకుల ముందుకొస్తాయి. 

    ఇలాంటి వాటి ప్రసక్తేమీ లేకుండానే, సదరు పెట్టుబడిని ప్రజాస్వామికీకరించి, దళితుల్ని బూర్జువాలుగా ఎదిగించాలని రచయిత అంటున్నాడు. ఇంకా, ఇక్కడ మనువాద రాజ్యాంగం పైచేయిగా ఉన్నందువల్లనే(వేరే మాటల్లో చెప్పాలంటే బ్రాహ్మనిస్టు అగ్రకులాల పాలకులు ఉన్నందువల్లనే) ప్రజాప్రాతినిధ్య పార్లమెంటరీ రాజ్యాంగం ప్రజలకు పనికి రాకుండా పోతోందని రచయిత అంటున్నాడు. కాని బైటి సామ్రాజ్యవాద పెట్టుబడి ప్రభావం గురించి ఏమీ మాట్లాడడం లేదు. దాని గురించి మాట్లాడనంత మాత్రాన్నే అది లేకుండా పోతుందా? పోదు గదా.

    ఇదంతా చూసినపుడు, లోగడ కమ్యూనిస్టులు ఎలాగైతే కుల వ్యవస్థలోని మార్పు క్రమాలను/చలానాలను పట్టించుకోకుండా వర్గ పోరాటం నడిపారో, ప్రస్తుత దశలో కూడా  మిగతా మార్పు క్రమాలను పట్టించుకోకుండా కుల నిర్మూలనకే పరిమితమై వర్గ పోరాటం నడపాలని రచయిత ప్రతిపాదిస్తున్నాడని అనుకోవాలి. అంటే, కులాన్ని నిర్దిష్ట చారిత్రక క్రమంలో పునరుత్పత్తి అవుతున్న వ్యవస్థగా చూడనందువల్లనే, కుల నిర్మూలనను కూడా ఒక మార్పు క్రమంగా చూడడంలేదు. కనుకనే చారిత్రక భౌతికవాదంతో కులాన్ని చూడాలని చెబుతూనే కులనిర్మూలనకు ఉండే చారిత్రక పరిమితులను, అవకాశాలను పట్టించుకోకుండా చేసిన ప్రతిపాదనగానే ఈ పుస్తకం నిలుస్తుంది.

    ఇన్ని పరస్పర వైరుధ్యాలతో కూడినదైనప్పటికీ, రచయితకున్న ఓపెన్ మైండెడ్ నెస్ వల్ల, కులనిర్మూలన పట్ల ఆయనకున్న సీరియస్ నెస్ వల్ల ఈ పుస్తకం పాఠకులను చదివింపజేసి, సరికొత్త ఆలోచనలకు పురికొల్పడమే గాక సరైన ఆచరణ దిశగా నడిపించడానికి ప్రేరకంగా ఉంటుంది.

Leave a Reply