1 . అక్టోబర్ 8   

ఇదో నూతన ప్రతిఘటనా సంకేతం 
అమెరికోన్ని మూడు చెరువుల 
నీళ్ళు తాగించిన వియత్నాం వారసత్వం

చిట్టెలుకలన్నీ కూడబలుక్కుని
పిల్లిని కాదు పులిపై ఒక్కసారిగా
విరుచుకుపడి బెంబేలెత్తించిన 
ప్రతిఘటనా పోరాటం

అగ్ర రాజ్యాల అండతో 
తమకో దేశమంటూ లేకుండా చేసి
వేలాదిమందిని ఊచకోత కోసి
నిత్యమూ భయంతో తెల్లారే 
తమ బతుకు నుండి
పెట్టిన రాకెట్ల పొలికేక

వాడు గొప్పగా చెప్పుకునే 
ఇనుప తెరను చీల్చి 
నగరం నడిబొడ్డుపై నడయాడిన 
నెలవంకల నెత్తుటి పాదాలు

వాడు ప్రపంచానికి చూపే 
అబద్దపు సాక్ష్యాలను 
మోసే మీడియాకు 
వాళ్ళొట్టి ఉగ్రవాదులే

కానీ తమ నెత్తుటి బాకీ 
తీర్చుకునే వాళ్ళు 
బలహీనులకు ఓ భరోసా కదా? 

(ఇజ్రాయిల్ పై హమాస్ ప్రతిఘటనకు స్పందనగా)


 2 . ఏ కబురూ లేదు 

ఆశగా ఎదురు చూస్తూనే వున్నా
ఆకాశం వైపు 
ఏ మెరుపు నుండైనా 
ఒక కాగితపు ముక్క జారిపడదా అని

గాలి వీచే దిశగా 
చెవులు రిక్కించి వింటున్నా 
గుస గుసగా కబురు వినపడుతుందేమో అని

వాన కాలం కొత్త నీటితో
వడి వడిగా పారే ఏటిపాయలో
కాగితప్పడవలో కబురంపుతారేమో అని

నేనిక్కడ క్షేమం 
మీరక్కడ క్షేమమని తలుస్తూ అన్న
ఒక మాట కదా 
మరో వెయ్యేళ్ళయినా వేచి 
వుంచే భరోసానిస్తుంది......

Leave a Reply